అలవాటు తప్పిన రోడ్డూ, ఉదయపు ఎనిమిదిగంటల రద్దీ. హైవేలోకి మెర్జ్ అయ్యేసరికే తలప్రాణం తోక కొచ్చినట్టనిపించింది. గుండె వేగం హెచ్చింది.
దానికి తోడు రాత్రి సరిగా నిదర పట్టలేదు. పాప పక్కగదిలో ఏడుస్తున్నట్టే ఉంది… అమ్మ జోకొడుతున్నట్టూ… మధుని తను మాటిమాటికీ లేపుతూనే ఉంది. ఉండబట్టలేక ఒక రాత్రివేళ లేచి వెళ్ళి చూసింది కూడా. గదంతా ఖాళీగా బావురుమంటూ కనిపించింది.
ఎంత బ్రతిమలాడింది అమ్మని ఇంకొక్క అర్నెల్లు ఉండమని? మూణ్ణెళ్ళు కూడా కాలేదు ఇక ఉండనంటే ఉండనంది. అప్పటికీ అన్ని అస్త్రాలూ ప్రయోగించి చూసింది.
“అక్క చిన్నాని కన్నప్పుడు అన్ని రోజులు చూసుకోలేదా వాళ్ళని?”
“మా ఫ్రండ్ సమత వాళ్ళ అమ్మయితే ఒక ఏడాదంతా ఉంది.”
“ఇంకో రెణ్ణెల్లాగితే చుట్టుపక్కల చూడదగ్గ చోట్లన్నీ తిరిగి రావచ్చు.”
“తోచకపోతే ఇండియన్ టీవీ ఛానెల్స్ తీసుకుందాం.”
“నీకసలు నామీద ప్రేమ ఉంటేగా?”
“పిట్స్‌బర్గ్ వెంకటేశ్వరస్వామిని చూడకుండా పోతావా?”
“కూతుర్నిట్లా వదిలేసి పోటానికి మనసెట్లా ఒప్పుతోంది నీకు?”
“మా అమ్మ గదే ఉండవే!”
ఒక్క కళ్ళనీళ్ళతో శోకాలు తప్పించి అన్నీ అయ్యాయి. అమ్మ దేనికీ చెక్కు చెదరలేదు. ఒకటే మాట మీదుంది. “ఇక్కడ నాకు పిచ్చెత్తిపోతూంది. అయినా నీకేనా కాపురం? నా కాపురం నాకూ ఉందమ్మాయ్! మీ నాన్నను వదిలి ఇన్నిరోజులు ఉన్నానా ఎప్పుడయినా? నీకంతగా కష్టమయితే పాపను నాతో తీసుకు వెళతానన్నాగదా?”
మధు ఇష్టపడలేదు. డే కేర్ సెంటర్ల వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు ఫ్రండ్స్‌కి ఫోన్లు చేసీ, ఇంటర్నెట్‌లో వెదికీ. తనే అతన్ని ఒప్పించింది. పిల్లల్ని సరిగ్గా పట్టించుకోని డే కేర్ సెంటర్లూ, ఎప్పుడూ అంటించుకొచ్చే ఏవో ఇన్ఫెక్షన్లూ, డాక్టర్ల చుట్టూ తిరుగుళ్ళూ, ఎందుకేడుస్తున్నారో తెలియని బాధలూ, పిల్లల పెంపకంలో ఓనమాలు తెలియని భయాలూ, నిదర చాలని మొహాలతో ఆఫీసులో కునికిపాట్లూ అన్నీ వివరించి చెప్పేసరికి ఒప్పుకోక తప్పలేదు ఏ రోజూ రాత్రి ఏడింటికి కానీ ఇల్లు చేరని మధుకి.
ఇంకో ఏడెనిమిది గంటల్లో ఇండియాలో అడుగు పెడతారు. నాన్నగారు బాంబే వస్తారు గనక భయం లేదు. ఎందుకో అకస్మాత్తుగా సంతోషం వేసిందామెకు. పెదాలమీదికి చిన్న నవ్వొకటి ఉబికింది. సురక్షితమైన చేతుల్లో తన బిడ్డ ఉన్న సుఖభావన. ఒక పెద్ద బరువు దిగినట్టు మనసంతా తేలికయింది.
పార్కింగ్ లాట్‌లో కారు పార్క్ చేశాక తలుపు తీసుకు దిగుతున్నప్పుడు వెనక సీట్లో పాప పాలసీసా కంటపడింది. మనసు మళ్ళీ వికలమయింది. అట్లాగే వాడిన మొహంతో ఆఫీసులో అడుగు పెట్టింది. తన క్యూబికిల్ వైపు వెళుతుంటే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లారా ఎదురయింది.
“వెల్‌కం బ్యాక్ లేఖా! అదేమిటి మొహం వేలాడేసుకున్నావ్, మళ్ళీ ఆఫీసుకు రావలసి వచ్చిందనా లేక సాయంత్రం దాకా పాపను వదిలి ఉండాలనా?”
“అదేమీ లేదు. కొంచెం అలసిపోయానంతే!” నవ్వు తెచ్చుకుంటూ అంది.
“అయితే ఏం చేస్తుంది పాప? మంచి డే కేర్ సెంటర్ దొరికిందా?”
“పాప బ్రహ్మాండంగా ఉంది. మా అమ్మే చూసుకుంటూంది దాన్ని!”
“అవునా, ఆమె రిటైరయిపోయిందా ఏమిటి?”
నవ్వొచ్చింది అమ్మ రిటైరవడమంటే! “లేదు, మా అమ్మ ఎక్కడా పని చేయటం లేదు!”
“అదృష్టవంతురాలు!”
“మీ పిల్లలేం చేస్తున్నారు?” కొత్త ప్రశ్న. ఎప్పుడూ వాళ్ళ గురించి అడగలేదామెను.
“మావాడికి టెన్నిస్ టోర్నమెంట్లు జరుగుతున్నయ్, బాగా ఆడుతున్నాడు. అమ్మాయి మ్యూజిక్ నేర్చుకుంటానంటూంది, చూడాలి!”
“సరే తర్వాత కలుద్దాం,” చెప్పేసి తన క్యూబికిల్ చేరుకుంది. సొంత ఇంట్లో అడుగు పెట్టినట్టనిపించింది. బేబీ టియర్స్ మొక్క వాడిపోలేదు. బహుశా లీసా పోస్తూండి ఉండాలి నీళ్ళు దానికి. ఓ నాప్‌కిన్ తీసుకుని మోనిటర్ మీదా బల్ల పైనా పేరుకున్న దుమ్మంతా దులిపింది. కంప్యూటర్ స్విచాన్ చేసి లాగిన్ చేశాక తమ గ్రూప్‌లో అందరికీ ఈమెయిల్ పంపింది తనకు డెలివరీ అయ్యాక వాళ్ళంతా కలిసి పంపిన బొకేకి కృతజ్ఞతలు తెలుపుతూ. రెండు నెలలుగా పేరుకుపోయిన ఈమెయిల్సన్నీ ఒక్కటొక్కటే తెరిచి చూస్తుంటే ఒక్కరొక్కరే వచ్చి చేరారు, సిండీ, ఎలెక్స్, బెత్, లీసాలు, “వెల్‌కం బ్యాక్ లేఖా!” అంటూ.
“అయితే వెకేషన్ బాగా ఎన్జాయ్ చేశావా?” ఎలెక్స్ నవ్వుతూ అడిగాడు.
“వెకేషనా?” చిరుకోపమూ, నవ్వూ కలిసిన గొంతుతో, “నువ్వుకూడా ప్రెగ్నెంట్ అయితే ఎంచక్కా వెకేషన్ ఎన్జాయ్ చేయొచ్చు చూసుకో మరి!” అంటూ నవ్వింది సిండీ.
“అమ్మో మళ్ళీనా?” ఎలెక్స్ మహా తుంటరి. అందరూ నవ్వారు.
“ఇంతకీ మీ అమ్మాయి ఫొటోలు చూపించవే?” లీసా అడిగింది. పర్స్‌లోంచి నాలుగు ఫొటోలు తీసి అందించింది.
“ఎంత అందంగా ఉంది! అసలు నీలా లేనే లేదు!” ఎలెక్స్ మళ్ళీ.
“అబ్బ, ఆ జుట్టు చూడు ఎంత బావుందో?” సిండీ అరిచింది.
“ఆ కనుబొమ్మలూ, కనురెప్పల చివరి వెంట్రుకలూ చూడు! నీ అందమైన పెద్ద కళ్ళే వచ్చినట్టున్నాయి,” లీసా అంది. ఫొటోలు ఒకరి చేతుల్లోంచి ఇంకొకరి చేతుల్లోకి మారుతూండగా అడిగింది బెత్, “ఎవరీమె?”
“ఓ, అది మా అమ్మ!”
“మీ అమ్మా? ఇండియానించి ఇంత దూరం వచ్చిందా పాపను చూడడం కోసం?” సిండీ ఆశ్చర్యపోతూ అడిగింది.
“చూడటం కోసంగాదు. నన్నూ పాపనూ చూసుకోవటం కోసం!” నవ్వుతూ కొంచెం గర్వంగా చెప్పింది.
“నిజంగా?” బెత్ నమ్మనట్టు అడిగింది.
“అబ్బ, నాకూ అట్లాంటి అమ్మ ఉంటే ఎంత బాగుణ్ణు!” లీసా అంది.
“అయితే మీ అమ్మ ఎప్పటిదాకా ఉంటుందిక్కడ?” బెత్ అడిగింది.
“నిన్ననే వెళ్ళిపోయింది.”
“అయితే పిల్లల పెంపకంలో ట్రెయినింగ్ ఇచ్చి వెళ్ళిందన్న మాట,” లీసా అంది.
లేఖ నోరు తెరిచేలోగానే ఎలెక్స్ అడిగాడు, “అయితే నీ ఫస్ట్ నైట్ ఎట్లా ఉంది?”
“ఏమిటీ?” బిత్తరపోయింది లేఖ.
“అదే, ఒంటరిగా పాపను చూసుకున్న మొదటి రాత్రి!”
“నాకు తెలుసు మీ ఇండియన్ భర్తలు! మీ ఆయన ఏమన్నా సాయం చేస్తున్నాడా?” బెత్ అడిగింది.
“చేస్తాడప్పుడప్పుడు. కానీ మా పాప ఇప్పుడిక్కడ లేదు,” ఎందుకో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది.
“ఏమిటీ?” నలుగురూ ఒకేసారి అరిచారు.