అమ్మ

“నాకు విడాకులిస్తే, నా దారి నేను చూసుకుంటాను.”

పేపర్‌ చూస్తున్న రఘు ఉలిక్కిపడ్డాడు. ఎప్పట్లాగే అతనికి సరోజ మొహం చూడగానే జాలి, వాత్సల్యం కలిగాయి.

“ఇప్పుడు విడాకుల ప్రసక్తెందుకు?”

“నేను ఈ ఇంటినుంచీ, బాధ్యతల నించీ, బంధాలనుంచీ తప్పించుకోవాలనుకుంటున్నాను”

ఆమె అమాయకత్వానికి నవ్వుకున్నాడు.

“దానికి విడాకులెందుకు, నువ్వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చుగా?”

“అవును. కాని విడాకులిస్తే, మీ భవిష్యత్తుకడ్డేమి ఉండదుగా?”

ఎంత ఎమోషనల్‌ క్రైసిస్‌లో కూడా నిజాయితీగా ఆలోచించే భార్యని చూసి గర్వపడ్డాడు. ఆమె విరక్తినీ, మానసిక స్థితినీ అర్థం చేసుకున్నాడు.

“చూడు. ఈ విషయాలన్నీ తర్వాత ఆలోచిద్దాం. నువ్వు కాసేపు పడుకో” అని పాపనెత్తుకుని బయటకెళ్ళిపోయాడు.

కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నా సరోజ మనసంతా అశాంతిగా ఉంది. రఘు ఎంత మంచివాడు! తనని ఎంతగా అర్థం చేసుకున్నాడు. కానీ, తనకే గత ఏడాదిగా జీవితం అర్థరహితంగా, బాధ్యతలూ, ప్రేమలూ తెంచుకోవాల్సిన బంధాలుగా అన్పిస్తున్నాయి. ఎందుకిలా జరిగింది?  తనెంత దురదృష్టవంతురాలు! గతం కళ్ళముందు కదలాడింది.


సరిగ్గా ఏడాది క్రితం

“హల్లో”

“సరోజ! నేనమ్మా నాన్నని.”

“చెప్పండి నాన్నా. ఏమిటీ టైంలో?” కంగారు సరోజ గొంతులో.

“మీ అమ్మకి చాలా సీరియస్‌గా ఉందమ్మా. మీరు ముగ్గురూ వెంటనే బయల్దేరి హైదరాబాద్‌ వచ్చేయండి.”

“ఇప్పుడా! పాపకి బాగా జ్వరం గా ఉంది నాన్నా!”

“సరే, పాపకి తగ్గాకే రండి. భయం లేదు.” తండ్రి కూతురిని సమాధానపర్చటానికి ప్రయత్నించినా సరోజ కీడు శంకించింది. మళ్ళీ ధైర్యం చెప్పి ఆయనే ఫోన్‌ పెట్టేసారు.

నాలుగు రోజుల్లో పాపకి జ్వరం సర్దుకుని వాళ్ళు హైదరాబాద్‌ చేరుకునే సరికే పరిస్థితి చేయిదాటి పోయింది. తనతో మాట కూడా మాట్లాడకుండా,కన్నెత్తైనా చూడకుండానే కోమాలోకి జారుకున్న తల్లిని చూసి తల్లడిల్లి పోయింది సరోజ. ఒక్కగానొక్క కూతురిని ఆఖరిసారి చూడకుండానే చనిపోయిందామె. కని పెంచిన తల్లి ఆమె మరణం సరోజని బాగా కృంగదీసింది.

అమ్మ! ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పగలదనిపించే అమ్మ!! అంతులేని ప్రశ్నల నడుమ తననొంటరిగా వదిలి వెళ్ళిపోయింది.

తల్లిని కాబోతున్నానన్న శుభవార్త చెవిని వేయగానే, తల్లికున్న బాధ్యతలూ,ఉండవలసిన ధైర్యం, అన్నీవివరించిన అమ్మ!!!

మనసులో మాట చెప్పకుండానే గ్రహించగలిగే అమ్మ!!!! ఎలాంటి పరిస్థితుల్లోనూ బేలగా కంటతడి పెట్టకుండా కొండలా అండాగా ఉండే అమ్మ ఇక లేదనుకుంటే తన ప్రాణాలే పోతున్నంత బాధగా ఉందామెకి. అమ్మని కనీసం కొన్ని సంవత్సరాలు తనతోటే ఉంచుకొని, ఆవిడకి వార్ధక్యంలో చేయాల్సిన సేవలన్నితనే చేయాలని, చాలా కోరికగా ఉండేది సరోజకి.

తల్లి మరణంతో చీకటిలాంటి డిప్రెషన్లో మునిగి పోతున్న సరోజని చూసి రఘు, ఆమె తండ్రి చాలా ఆందోళన పడ్డారు. రఘు ఆమెని మామూలు మనిషిని చేయటానికి చాలా ప్రయత్నం చేసాడు. కానీ సరోజ ప్రశ్నల వలయంలో చిక్కుకొని తల్లడిల్లి పోతోంది.

ఏమిటీ జీవితానికి అర్థం? అన్ని బంధాల కంటే అపురూపమైన తల్లీబిడ్డల బంధం కూడా అర్థం లేనిదేనా? తానిక మళ్ళీ ఈ జన్మలో అమ్మని చూడలేదు. అమ్మ మాట వినలేదు. అదే అన్నిటి కంటే పెద్ద నిజం. తను తల్లిని, తల్లి తననీ ప్రేమించినంత మాత్రాన ఒరిగేదేం లేదు. ఎంత బలమైన ప్రేమైనా మృత్యువు ముందు ఓడిపోవలసిందే. అలాంటప్పుడు ఎందుకీ ప్రేమల్నీ,బంధాలనీ మెడకు తగిలించుకోవటం? ఈ అశాంతి కంతా ఇవే కారణం. జీవితానికి అర్థం లేదు. గమ్యం అసలే లేదు. తను తన కూతుర్ని ప్రేమించడం కూడా అర్థ రహితం. దాని వల్ల తను మరణయాతన ఇంకా ఎక్కువగా అనుభవించటం తప్ప ఏమీ ఫలితం ఉండదు. ఈ బంధాల్ని, ఈ ఇంటిని అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, మనశ్శాంతిని వెతుక్కుంటూ. ఏ ఆశ్రమంలోనో చేరి రోజులు గడిపేస్తుంది. అందుకే రఘుని అడిగింది, తననీ బాధ్యతల్నించి తప్పించమని. నిజమే, రఘుని తన వైరాగ్యంతో బాధ పెట్టటం సబబు కాదు. అతను ఇంకో అమ్మాయిని పెళ్ళాడి సుఖపడొచ్చు.

కానీ, చీకటిని చీలుస్తూ చిన్న వెలుగు కిరణం వచ్చినట్టు, ఆమె డిప్రెషన్‌ లోంచి ఒక సందేహం తలెత్తింది. అన్ని ప్రేమలూ, బంధాలు వదిలేయదల్చుకున్న తనకి ఇంకా రఘు సుఖం గురించిన ఆలోచన ఎందుకు? అతనెలా బ్రతికితే తనకేం? అంటే తన వైరాగ్యం నిజమైనది కాదా? ఏమో!


నాలుగు రోజుల తర్వాత

“చూడు సరూ! నేనొక మాట చెప్పనా?”

“వూఁ…”

“నువ్వు ముందు ఒంటరిగా ఒకటి రెండు నెలలుండు ఎక్కడైనా సరే. మీ నాన్నదగ్గరైనా ఉండు, లేదా దేశమంతా తిరిగి రా. నీ డిప్రెషన్‌, అశాంతి అంతా నాకర్థం అయింది. కానీ, ఎప్పటికైనా యు హావ్‌ టు గెట్‌ ఆన్‌ విత్‌ యువర్‌ లైఫ్‌. చీకటిలాగే డిప్రెషన్‌ లోంచి ఓ పట్టాన బయటకి రావాలనిపించదు. కానీ మనం ప్రయత్నించాలి. అందుకే కొంతకాలం ఒంటరిగా ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు చేయి. ఖర్చుక్కావాల్సిన డబ్బు నేనిస్తాను. ఎలాంటి బాధ్యతలు లేకుండా కొంతకాలం గడిపితే నీ మనసు సర్దుకోవచ్చు. చూద్దాం. ఆ తర్వాత నీ నిర్ణయం ఎలాంటిదైనా నేనడ్డు చెప్పను. సరేనా, ఆలోచించు.” మౌనంగా ఉండి పోయింది సరోజ.

హైదరాబాద్‌లో తండ్రి దగ్గరికొచ్చింది సరోజ. తల్లిలేని ఇంట్లో ఆమె జ్ఞాపకాలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరయినట్టనిపించింది. మేనత్తని తోడు తీసుకుని తిరుపతి మొదలు అన్ని పుణ్యక్షేత్రాలూ చూసింది. బంధువుల ఇంటికి మద్రాసు చేరింది. పదిహేను రోజులైంది. ఒంటరిగా ఉంటే తగ్గుతుందనుకున్నఅశాంతి ఎక్కువైనట్టుంది. ఆలోచిస్తుంది సరోజ.

ఇన్ని రోజులుగా పాప గురించి కాని, రఘు గురించి గాని ఆలోచనలేమీ రావటం లేదు. కానీ, వెలితిగా ఉంది. ఎందుకు? ఇప్పుడు, ఇంటి పక్క వాళ్ళ పాపని చూసినప్పుడల్లా పాప గుర్తొస్తుంది. ఏం చేస్తుందో! అమ్మేదని వెతుక్కుంటుందో! “అమ్మా!” అన్న పిలుపు విని ఉలిక్కి పడిందామె.

కొంచెం దూరంలో పరిగెత్తుతూ కింద పడ్డ పాపాయి తల్లిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తల్లి బిడ్డని పొదవి పట్టుకొని లాలిస్తుంది. ఆ దృశ్యాన్నిచూచి, దీర్ఘ నిద్ర లోంచి లేచినట్టయింది సరోజకి.

ఏమిటిది? తనకేమయింది? తన చిన్నారి పాపనెలా వదిలి ఉండగలుగుతుంది? ఇంత ఎదిగి, స్వతంత్రంగా బ్రతకగలిగిన తనే, తల్లిలేని లోటు తట్టుకోలేకపోతుందే, తన మీదే ఆధారపడ్డ చిన్నారి పాపేమౌతుంది? ఇంతేనా తన చదువు, తెలివి, జ్ఞానం? ఇదా అమ్మ నేర్పింది? తనని ఎంతో స్వతంత్రురాలిగా,బాధ్యతా యుతమైన స్త్రీగా తీర్చి దిద్దాననుకుని సంతోషపడ్డ అమ్మ, తను లేక పోవటం చేత జీవితాన్నించే పారిపోయేంత పిరికిగా, బాధ్యతారహితంగా అయిందని తెలిస్తే తన నిర్ణయాన్నిఆమోదిస్తుందా? నెవ్వర్‌! తనను చూసి సిగ్గు పడుతుంది!

తన ఆలోచనల్లోని మెలిక అర్థం కాగానే మనసంతా ఒకలాంటి ప్రశాంతత ఆవరించింది.

ఇదే జీవితం ఈ బాధ్యతలు, వాటిని నిర్వర్తించటంలో కలిగే సెన్స్‌ ఆఫ్‌ అచీవ్‌మెంట్‌   ఇవే జీవితానికి నిర్వచనం!

రఘుకి ఫోన్‌ చేయటానికి లేచి చకచకా అడుగులు వేయసాగింది సరోజ.


శారద

రచయిత శారద గురించి: ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు రాస్తూ వుంటారు. నీలాంబరి అనే పేరుతో వీరి కథల సంపుటి ప్రచురించారు. ...