మూడు కవితలు

mother 1

పసుపు వెలవెలబోయేది, తన
ముఖఛాయ ముందు-
ఎంత వెలుతురూ, ఆనందం

తనలో! నీలో, ఒక విస్ఫోటనం
అప్పుడు! భూమిది
కానీ పరిమళమొకటి; నీలో-

మొదటిసారిగా, భగవంతుడిని
కలిసి, తాకినప్పటి
బంతిపూల వనమూ, అదే!


చిరిగిన కాగితమయ్యేది వెన్నెల
నీ ముందు! ఏడింటికి
ఉద్యోగానుంచొచ్చి, నిన్నిక

దగ్గరగా హత్తుకుని, తల నిమిరి
‘కన్నా’ అన్నప్పుడు!
వాన గాలి నీకు సోకినప్పుడు!

Mother 2

అమ్మ, ఉద్యోగానికి వెళ్ళేది-
అన్నం, పప్పు
ఇవి మాత్రమే చేసేది–

మధ్యాహ్నం స్కూల్ నుంచి
వస్తే, నాకు
ఆ వంటగదిలో, ఒక

నీడ కనపడేది; చిరిగిన ఒక
పర్సులాగా
ఉండేది ఆ నీడ, నల్లగా!


అమ్మ, ఉద్యోగానికి వెళ్ళడం
లేదిప్పుడు-
అయినా, అదే పప్పూ

అన్నం. కానీ, కర్రీ పాయింట్లో;
అదే నల్లని
ఆ ప్రేమరాహిత్యపు నీడ

ఇప్పటికీ ఇంట్లో తన చుట్టూ

చిరిగిన పర్సులో దాచుకున్న
అతని
ప్రియమైన ముఖంలాగా!

Orange Moon

నిన్ను కావలించుకున్న ఆ చేతుల
కాంతి తొలిగి పోయాక,
ఆ స్థానాన స్థిరపడి, నెమ్మదిగా

జిగటగా నీలోకి వ్యాపించే చీకటి. ఇక
లేచి, కిటికీలు తెరుస్తావు-
కుండలోంచి, గ్లాసు మంచినీళ్ళు

ముంచుకుంటావు. బల్లపై, సర్దినవే
మళ్ళీ మళ్ళీ సర్దుతావు-
తెరిచిన పుస్తకం మూసీ, మూసిన

పుస్తకం తెరిచీ, అస్థిమితమవుతావు-
పెన్నుతో ఏవో మరి
పిచ్చి గీతలు గీసి, ఆ కాగితాన్ని

చించి, ఉండ చేసి, విసురుగా గదిలో
మూలకు విసిరికొడతావు-
ఆనక, కూలబడి, ఎప్పటికో లేచి

తలుపులు తెరిచి బాల్కనీలోకి వస్తే


వేసవి రాత్రి గగనాన, నారింజ రంగై
పొటమరించే, నువ్వు
ముద్దగా చేసి విసిరేసిన, కమిలిన

కోతల, నలిగిన ఆ కాగితపు ఉండ!