మూడు లాంతర్లు – 9

12

తర్కానికి ప్రాతిపదిక అనుభవం. మనుషులందరం ప్రాధమికంగా నేర్చుకొని, ఉపయోగించుకునే తర్కానికి ప్రాతిపదిక లౌకికమైన జీవితానుభవం. ఈ జీవితానుభవం మనందరికీ అన్ని పార్శ్వాల్లోనూ ఒక్కలాగే ఉండదు. ఇంద్రియాలతో పరిశీలించి, ఆకళింపు చేసుకొనే భౌతిక ప్రపంచం, ప్రకృతి – వీటి అనుభవం మనందరికీ దాదాపు సమానంగానే ఉంది. రాయి గాల్లోకి విసిరితే కింద పడుతుందనీ, ముల్లు గుచ్చుకుంటే నొప్పెడుతుందనీ, మందార పువ్వు ఎర్రగా ఉంటుందనీ ఇలాంటి అనుభవాలు ఇంద్రియాలు సరిగా పనిచేసే మనుషులందరికీ ఒక్కలాగే ఉంటాయి. కాని జంతులోకపు ప్రవర్తనల్ని మనం పరిశీలించి, అవగాహన చేసుకొనే అనుభవం ఇంతకంటే వివిధంగాను, జటిలంగానూ ఉంటుంది. ఏదైనా ఒక జంతువుది, మనిషిది చిన్నపాటి ప్రవర్తన – నడక, పరుగు, కేక ఇలాంటివి – మనలో ఒక్కొక్కర్నీ ఒక్కోలా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు పిల్లులు ఇంటికప్పుల మీద భీకరంగా అరుచుకుంటూ రక్కుకుంటూ పరిగెడుతుంటే దాన్ని చూస్తున్నవాళ్ళు ఒకళ్ళు ఆకలి వలన అని, ఇంకొకరు కామం వలన అనీ, మరొకరు జాగా కోసం జట్టీలనీ అర్ధం చేసుకుంటారు. ఒకే మనిషి ప్రవర్తన ఒకరికి ముచ్చటగా ఉంటే, ఇంకొకరికి వెగటుగా ఉంటుంది. చివరిగా, అంతరంగాన్ని పరిశీలించి, అవగాహన చేసుకొనే అనుభవాల్లో చెప్పనలవి కానంత వైవిధ్యం ఉంది. అంటే, ప్రకృతిని గురించిన తర్క చర్చలో అభిప్రాయ బేధాలకు, సిద్ధాంతాల్లో వైవిధ్యాలకూ ఆస్కారం కొద్దిగా ఉంటే, ఇలాంటి వైవిధ్యం ప్రవర్తనల విషయంలో మరింత ఎక్కువగాను, అంతరంగం విషయంలో మరీ ఊహకు అందనంత ఎక్కువగానూ ఉన్నాది. దీనికి కారణం వ్యక్తిత్వాల్లో – అంటే మనోవైజ్ఞానికులు, దార్శనికులు self అని, సామాన్యంగా mind అనీ వ్యవహరించే దాన్లోని వైవిధ్యం, సంక్లిష్టత. ఈ కారణం వలన మనస్తత్వ శాస్త్రం, తత్వ శాస్త్రం, Cognitive Science వంటివి అంతరంగం ప్రధానంగా నెరపే చర్చల్లోన అభిప్రాయాల్లో కుడా వైవిధ్యానికీ, బేధాలకూ ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇది ఇదివరకు అనుకున్న సిద్ధాంత సూత్రాలను, లక్షణాలనూ – అంటే Norms and Principlesను నిర్మించుకోవడానికి అడ్డం వస్తుంది. కాని ఇది అధిగమించలేని ఇబ్బంది అయితే కాదు. ఎలాగంటే ఆసక్తి, శక్తి ఉన్నవాళ్ళు పట్టుదలగా ఆలోచించి, చదివి, అర్ధం చేసుకొని, చర్చించి చూడగా వాళ్ళకే ఆశ్చర్యకరంగా అనేకుల వివేచన ఒకే రకమైన నిర్ధారణలకు దారితియ్యటం కూడా ఉంది. అంటే, ఇదివరకు చెప్పుకున్నట్లు విశాలమైన మైదానాల్లో పర్వతాల్లాగా ఈ Norms అనేవి అధికులకు అంగీకారయోగ్యంగా గోచరించటమూ, చివరికి వాటిని ‘సత్యాలు’ అని అంగీకరించటమూ ఇలాంటి మానవీయశాస్త్రాల్లోన సంప్రదాయంగా ఉంది. ఇంత సాధించినా సరే ఈ రంగాల్లోన సాధారణీకరణను (Generalization) ప్రతిపాదించదానికి అడ్డంకిగా ఈ సంక్లిష్టతా, వైవిధ్యమూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. దీనితో మానవీయ శాస్త్రజ్ఞులు మౌలికంగా ఎలా సమాధాన పడతారంటే తాము నిర్మించుకున్న సిద్ధాంత భూమిక మొదట తమకు, తమ అనుయాయులకూ వ్యక్తిగతంగా, అంతరాంతరాల్లోన సంతృప్తికరంగా ఉందా, లేదా అని తరచి చూసుకొని. ఇది చివరికి సాపేక్షం – అంటే subjective. ఉదాహరణకు ఫ్రాయిడ్ (Sigmund Freud), యుంగ్ (Carl Jung), వాళ్ళ అనుయాయులూ భిన్న దృక్పధాలతో నిర్మించిన సిద్ధాంత సంచయాలతో చివరికి ఇలాగే Which school is more satisfying to me? అని వివేచన చేసుకుని సమాధానపడే సంప్రదాయం ఉంది. అయితే – ఇదివరకు బిపిన్ (Bipin Indurkhya) సూచించినట్లుగా Diverse opinions are possible, but not every point of view is admissible. ఈ జల్లెడ అంటే Filterను నిర్దేశించేది తర్కం. తర్కానికి ప్రాతిపదిక అనుభవం. సృజన తర్కానికి ప్రాతిపదిక సృజనానుభవం.

తర్కపు నిర్వహణకు మౌలికమైన పనిముట్టు వాదం; దీన్ని వాదన అని తగువు అనే అర్ధంలో కాకుండా Argument అనే అర్ధంలో తీసుకోవాలి. ఈ వాదం కొన్ని నమ్మకాల్ని, నిర్ధారణలను సమర్ధించటం కోసం హేతువులను ఆధారంగా నిర్వహించే చర్చ. (A unit of discourse in which beliefs are supported by reasons.) ప్రతీ వాదానికీ రెండు అంశాలు అవసరం: ప్రమాణం (Premise), నిర్ధారణ (Conclusion). ఏదైనా విషయాన్ని గురించిన నిర్ధారణల సంచయం, అవి నిరూపితమైన పిమ్మట ఒక సిద్ధాంతం (Theory) అవుతుంది. లోక వ్యవహారాన్ని గురించి, లౌకికమైన జీవితాన్ని గురించీ మనం సాధారణంగా అంగీకరించే సిద్ధాంత సముచ్చయాన్నే సబబు అంటే Common sense అని, సహృదయత అంటే Good sense అనీ వ్యవహరిస్తున్నాము. ఇది ఎక్కువగా ప్రకృతికి, ప్రవర్తనకూ సంబంధించిన సిద్ధాంతాల సంచయం. సాధారణ జీవితంలో ఇంచుమించు అన్ని విషయాల్లోనూ ఇలాంటి నిర్ధారణలు మనం అనివార్యంగా చేసుకొనేవే. ఉదాహరణకు రాయి విసిరితే దెబ్బ తగుల్తుంది. చీకట్లో కళ్ళు కనిపించవు. ఇలాటి సిద్ధాంతాలు అందరూ సకృత్తుగా అంగీకరించేవి. ఇవి కాకుండా అన్నం తినాలా, చపాతీలు తినాలా? పొద్దున్న ఎన్నింటికి లేవాలి? తెల్ల కాయితాలు బావుంటాయా, రూళ్ళ కాయితాలు బావుంటాయా? ఇలా ప్రతి చిన్న విషయంలోనూ అప్రయత్నంగానైనా సరే ఋజువుల్ని పరిశీలించి ఏది సబబో నిర్ణయించుకుంటున్నాము. ఇలాంటి వ్యక్తిగతమైన నిర్ణయాల్ని ఎవరికి వాళ్ళం వివేచించి సిద్ధాంతం చేసుకుంటాము. ఇలాగే సృజన అనుభవాన్ని గురించిన నిర్ధారణలను కూడా మౌలికంగా, ప్రధమంగా సృజనశీలి తన స్వంత అనుభవం ప్రాతిపదికగా పరిశీలించి, వివేచన చేసి నిర్మించుకోవలసి ఉంటుంది. ఇంకొకరు ఇదివరకు చెప్పింది యదాతధంగా మన అనుభవానికి పనికిరాదు. చిన్నవి, పెద్దవీ అని తేడా లేకుండా ఆంతరంగికమైన, వ్యక్తిగతమైన అనుభవానికి సంబంధించిన విషయాలన్నిటికీ ఈ పరిమితి, జాగ్రత్త వర్తిస్తాయి. తిండి, దుస్తులు, వృత్తి, వినోదం, స్నేహం, పెళ్ళి వంటి వందలాది జీవితానుభవాల్లో మనం తీసుకునే నిర్ణయాల్లో, ఎవరివి ఎన్ని సలహాలు, సూచనలు, సిఫారసులు తీసుకున్నా చివరికి నిర్ణయమైతే మనది; చాలా వ్యక్తిగతమైనది. ఈ అన్నిటికీ మనదైన ‘లక్షణ సిద్ధాంతాన్ని’ మనమే స్వయంగా నిర్మించుకున్నంటే తప్ప సంతృప్తి లేదు.

ఈ లక్షణ సిద్ధాంతాల్ని ఏ చిన్న విషయంలోనైనా సరే, ఇంకెవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ అవగాహన, అనుభవం ప్రాతిపదికగా ఎంత స్థిరంగా, బలంగా ప్రతిపాదించినప్పటికీ, అది మనదైన అనుభవంతో గీటు రాసుకోకుండా అంగీకరించినా, తిరస్కరించినా కూడా చివరికి అసంతృప్తికరంగా ఉంటాయి. అంటే – They do not satisfy. గుండుగొమ్ములనుమానం అలాగే ఉండిపోతుంది. ఉవాచలు, సిఫారసులూ దీన్ని పూర్తిగా, నిస్సంశయంగా నివృత్తి చెయ్యలేవు. అవి మంట చల్లార్చటానికి మరింత చమురు పోసినట్టు సంశయాన్ని ఎగసనదోస్తాయి. సాధారణంగా సాహితీ చర్చలు ఇందుకే భగ్గున మండి అసంతృప్తికరంగానో, లేకుంటే నొప్పింపక తానొవ్వక మన్ననగా, మర్యాదగానో ముగుస్తాయి. ఎందుకంటే మీ అనుభవం ప్రాతిపదికగా నిర్మించుకున్న అవగాహన నాకు ఎంత ప్రయత్నం చేసినా ఆ అనుభవాన్ని కలిగించలేదు. మరి మీ అనుభవం నాదెలా కాగలుగుతుంది? మీ ఉవాచను నేనూ, నా ఉవాచను మీరూ ఎలా ఒప్పుకుంటాము? ఇది తత్వశాస్త్రం లోన చాల పాత ప్రశ్న. దీన్ని వాళ్ళు సాధారణ అనుభవంలో మనం సునాయాసంగా ఒప్పుకొనే ‘చిన్న చిన్న’ విషయాలకు కూడా వర్తింపచేసుకుంటారు. ఉదాహరణకు, ఎదుట వేరే మనుషులు ఉన్నారనీ, వాళ్ళకొక మనసు (mind) ఉందనీ నాకు ఎలా రూఢి అవుతుంది? ఏ ప్రాతిపదికన, ఏ ప్రమాణాల్ని చూపించి నేనూ, ఇతరులూ ఉన్నామని నిర్ధారించుకుంటాను? ఇలాంటివి తత్వశాస్త్రం లోన ఇంకా నిర్ధారణ కానివి – అంటే unsettled ప్రశ్నలు. ఇదివరకు చెప్పిన వైజ్ఞానికుడు కరూథర్స్ (Peter Carruthers) వంటివాళ్ళ ఆసక్తి Philosophy of Mind అని వ్యవహరించే ఇలాంటి వివేచన. దీన్ని వాళ్ళు నిర్వహించే పద్ధతి ఆదికి ముందే Assertions అంటే నిర్ధారణలు, సిఫారసులతో ప్రారంభించకుండా, ముందు విస్తారంగా చర్చిస్తున్న విషయం స్వరూపాన్ని, స్వభావాన్నీ విశదం చేసే ప్రమాణాలు, ఋజువులు (Facts, Premisses), ఆలోచనలూ అన్నింటినీ ఒక్కొక్కటీ పరిశీలిస్తూ, ఎత్తి చూపించి తాము ప్రతిపాదించే సిద్ధాంతానికి అన్వయం చేస్తూ కడపటి నిర్ధారణలను కొంత సంశయంతోనే అప్పటికి పాఠకుని వివేచనకు విడిచిపుచ్చటం. కొత్తగా ఋజువులు దొరికినప్పుడూ, ఆలోచనలు తట్టినప్పుడూ మళ్ళీ ఇంకొకసారి అవే ప్రశ్నలను పరామర్శించటం, ఇలాగ.

కాల్పనిక సృజన అనుభవం, అంటే appreciationకు సంశయం ఉపకరిస్తుంది. ఈ రంగంలో చిన్నప్పట్నుండీ మనను వేలాదిగా ఉవాచలు, అంటే Assertions చుట్టుముట్టి మన అవగాహనను తీవ్రంగా ప్రభావితం చేసినవి ఉన్నాయి. ఇలాంటి ప్రతిపాదనలను నిశితంగా, సంశయాత్మకంగా పరిశీలించకుండానే ఒప్పుకోవడమో, తిరస్కరించడమో చేస్తే లోన అసంతృప్తి అలాగే ఉండిపోతుంది. నా అనుభవంలో వెనుదిరిగి చూసుకుంటే సాహిత్యం పేరిట నేను చిన్నప్పట్నించీ నేర్చుకుని, జీర్ణం చేసుకున్న అవగాహన చాల వరకు ఇలాంటి పరీక్షించుకోని (unexamined) నిర్ధారణల మీద కట్టుకున్నదేమోనని తోస్తుంది. త్రిపురను చూసి చూసీ, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి మొండితనం చూసీ ఈ అనుమానం మరింత బలపడుతుంది. అనుమానం అంటే ఎవరికీ అవమానం కాదు, అగౌరవం కాదు. అందుకు భిన్నంగా ఎవరైనా చెప్పిందీ, రాసిందీ ఆసక్తి ఉంటే గనక శ్రద్ధగా పరీక్ష చెయ్యటం, అనుభవం చేసుకోవటమే ఆ చెప్పిన, రాసిన మాటలకు, సృజనకూ నిజమైన గౌరవం. ఇలాంటి సంశయమే యధాలాపంగా వాడుకలో ఉన్న ‘శాస్త్రీయ దృక్పధం’ అనే వైఖరికి ప్రాతిపదిక. చిన్న పిల్లలు పెద్దవాళ్ళను చూసి, విద్యార్ధులు గురువుల్ని చూసీ నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఆలోచిస్తున్నారో, మాట్లాడుతున్నారో చూసి ఆ రకంగా పిల్లలూ ఆలోచించటం, మాట్లాడటం, ప్రవర్తించటం నేర్చుకుంటారు. దీన్ని Observational Learning అన్నారు.

మన సంస్కృతిలోన గురువు అంటే, గురుస్థానమంటే, గురువు చెప్పిన మాటలంటే అసంకల్పితంగా, అనాలోచితంగా గౌరవాన్నీ, అంగీకారాన్నీ ప్రకటించే పద్ధతి నరనరాల్లోనూ జీర్ణమైపోయి ఉంది. ప్రశ్నించడం, సంశయాన్ని ప్రకటించి అది నివృత్తి అయ్యేదాకా వివేచన కొనసాగించడం గురువు, సహపాఠి గౌరవానికి భంగం అనే మొహమాటంతో మిన్నకుండటం ప్రాచ్య సంస్కృతుల్లో అలవాటైన మర్యాద. మన సంస్కృతిలో, వ్యక్తిత్వాల్లో ఇలాంటి అలవాట్లని గురించి ఇటీవలి కాలంలో సుధీర్ కాకర్ (Sudhir Kakar) విపులంగా వివరిస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళవుతూ తమ జీవితం, వృత్తి, పెళ్ళి, మతం వంటి విషయాల్లోనూ, ఆసక్తి ఉన్నవాళ్ళకు కళ, సృజన వంటి విషయాల్లోన ఇలాంటి మర్యాద అనాలోచితమైన అనుకరణగా, ఒప్పుకోలుగా పతనమౌతుంది. దీన్ని Monkey See, Monkey Do! అన్నారు. అన్ని సంస్కృతుల్లోనూ పిల్లలు ఇలాగే నేర్చుకుంటారు. కాని సదసత్సంశయం (skepticism) పెద్దల యెడల అపచారంగా పరిగణింపబడని సంస్కృతుల్లో పిల్లలు శిక్షణలోని ఇలాంటి పరిమితుల్ని ప్రశ్నించి, అవసరమైతే ధిక్కరించి తమవైన సిద్ధాంతాల్నీ, స్థిరమైన అభిరుచినీ నిర్మించుకోగలుగుతున్నారు. ఈ వెసులుబాటు లేని సంస్కృతిలోన ఆసక్తి, గడుసుతనం, మాటకారితనం ఉంటే సృజనశీలి ముందుగా ఎలాగోలాగ జబర్దస్తీ చేసుకుని గురువుగా, మహాకవిగా, ఒకానొక గొప్ప మానవీయ సాహితీ మేధావిగా అవతరించగలిగితే, అక్కణ్ణించి అతన్ని కధ, కవిత, పాట, నవల, పద్యం, నాటకం, విమర్శ, భాష, వచనం అని ఇలా ఏ విచక్షణా అక్కర్లేకుండా క్రమంగా అన్ని సారస్వత ప్రక్రియలకూ ధర్మకర్త అయిన పెద్ద మేష్టారుగా ప్రతిష్టించి పూజించే అలవాటు ఉంది. బాలరామానుజన్ గురుత్వ కాంక్షకు సంస్కృతి తోవచూపిస్తుంది, దోహదం చేస్తుంది.