ఈమాట మే 2008 సంచిక విడుదల! ఈ సంచికలో అనేక విశేషాలున్నాయి.
ఈమాట సంపాదక వర్గంలో కొత్త సభ్యులు
మాచవరం మాధవ్ అజ్ఞాతంగా కవి, విమర్శకుడు. SCIT రోజులనించీ తెలుగు చర్చావేదికలలో పాల్గొంటున్నారు. రచ్చబండ మోడరేటరు గా చిరపరిచితులు. లోగడ సమీక్షకుడిగా ఈమాటకి ఎంతో సహకరించారు. జియోకెమిస్టుగా ఉద్యోగం, కుటుంబంతో నివాసం సిన్సినాటి, ఒహాయో లో. శంకగిరి నారాయణ స్వామి నాశీగా, కొత్తపాళీగా, బ్లాగరుగా, కథా రచయితగా, నాట్య కళాకారుడిగా ఈమాట పాఠక లోకానికి పరిచితులు. ఉద్యోగ రీత్యా మెకానికల్ ఇంజనీరు, నివాసం బ్లూంఫీల్డ్ హిల్స్, మిషిగన్‌లో.
వీరిద్దరూ ఈమాటసంపాదకవర్గంలో చేరడంతో ఈమాట మరింత పటిష్టం అవుతుందని వేరే చెప్పనవసరంలేదు. ఈమాట వీరిద్దరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది.
ప్రత్యేక ఆకర్షణలు
Courtesy:The Hindu
- ఏప్రిల్ 20, 2008 న సీ.పీ. బ్రౌన్ అకాడెమి వారు ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికి మొట్టమొదటి “తెలుగు భారతి” పురస్కారం బహూకరించిన సందర్భంగా కృష్ణమూర్తిగారి గురించి ఒక ప్రశంసా వ్యాసం,
- మే 02, 2008 న ప్రముఖ సినీ దర్శకుడు సత్యజిత్ రాయ్ 87 వ జయంతి. ఆయనకు నివాళిగా రాయ్ తీసిన సినిమా “చారులత“ని పరిచయం చేసే వ్యాసం,
- కంప్యూటింగ్ పూర్వాపరాలు వ్యాస పరంపరలో మూడో వ్యాసం బాబేజ్ యంత్రాలు,
- తెలుగు కళా సమితి వెలువరించే “తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక కవితల పోటీలో బహుమతి పొందిన కవితలు.
ఇంకా మరెన్నో కథలు, కవితలు, వ్యాసాలు, ఇతర శీర్షికలు..
ఈమాట కొత్త లోగో, మొదటిపేజీకి కొత్త రూపు
ఈ సంచికనించీ ఈమాటకొక కొత్త లోగో, మొదటి పేజీ(ముఖ పత్రం) కొక కొత్తరూపం ప్రవేశపెడుతున్నాం. ఇప్పుడు మొదటిపేజీలో పైన మూడు ట్యాబులు ఉన్నాయి. మధ్య ట్యాబులో ఇటీవలి అభిప్రాయాలు చదవవచ్చు. చివరి ట్యాబులో ఈమాట పాత సంచికలనించి ఒక యాదృఛ్చిక రచన చూడవచ్చు. అదే ట్యాబులో కింద ఉన్న “మరో యాదృచ్ఛిక రచన” లింకుని నొక్కితే వెంటనే మరొక యాదృచ్ఛిక రచన ప్రత్యక్షమవుతుంది. ఈ యాదృచ్ఛిక రచనలకొక ఆర్.యెస్.యెస్. ఫీడ్ (RSS Feed) ని కూడా ఇస్తున్నాము. ఈమాట బొత్తాం, యాదృచ్ఛిక రచనల ఆర్.యెస్.యెస్. ఫీడ్‌లను తమ బ్లాగుల్లో ప్రదర్శించదల్చుకున్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చు.
రచయితలకి, అభిప్రాయాలు రాసేవారికి సూచనలు
ఈమాటకి రచనలు పంపగోరే వారు “రచయితలకు సూచనల పేజీ” ని చూడమని మా మనవి. రచయితలు తమ రచనలని పత్రిక విడుదల తేదీకి కనీసం పది రోజుల ముందుగా పంపాలి. రచయితలు తమ రచన(ల)తో పాటు తమ వివరాలు, ఫోటో కూడా పంపవచ్చు.
పాఠకులు తమ అభిప్రాయాలు RTS, లేదా తెలుగులిపిలోనే రాయమని మా మనవి. తమ అభిప్రాయాలని “రచన బావుంది/బావులేదు” లాంటి ఒకటి రెండు మాటలతో కాకుండా నిర్మాణాత్మకంగా రాయమని కోరుతున్నాము.
ఈ సంచిక తయారుచేయడంలో సాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఎప్పటిలాగే ఈ సంచిక కూడా మీ ఆదరణ పొందుతుందని ఆశిస్తాము.
— సంపాదకులు.