హిందోళ రాగం – అనుబంధం

[ఈమాటలో లోగడ డా. లక్ష్మన్న రాసిన వ్యాసానికిది ఆడియో అనుబంధం. హిందోళం/మాల్కౌఁస్ రాగలక్షణాలను గురించీ, వివిధ లలిత గీతాల్లో ఈ రాగపు విన్యాసాలను గురించీ ఆ వ్యాసంలో వివరణలున్నాయి. ఔత్సాహికులు ఈ రాగపు సంగీతాన్ని విని ఆనందించటానికీ, రాగాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్యటానికీ ఈ అనుబంధం పనికొస్తుంది. — రచయిత]

మామూలుగా మనమంతా విని ఆనందించే హిందోళంలో స గ1 మ1 ధ1 ని1 అనే స్వరాలే ఉంటాయి. (ఎవరైనా రిషభం పలికిస్తే శంకరశాస్త్రులు ‘శారదా’ అని గద్దించే ప్రమాదం ఉంటుంది!) హిందూస్తానీ శాస్త్రీయ సంప్రదాయంలో ఈ రాగాన్ని కచేరీల్లో అర్ధరాత్రి దాటాక వినిపించాలి. మాల్కౌఁస్ అనేది మాళవకౌశిక అనే పేరుకు వికృతి అంటారు. కౌశికధ్వని (కౌశీధనీ) అనే రాగం ఒకటి స గ2 మ1 ధ2 ని2 స అనే స్వరాలతో ఉంది కనక ఇది నిజమే అయిఉంటుంది. కర్ణాటకపద్ధతిలో ఈ రాగంలో సామజవరగమనా, నీరజాక్షి మొదలైన ప్రసిద్ధ రచనలున్నాయి. మనసులోని మర్మము తెలుసుకో అనే త్యాగరాజ కీర్తనను మాత్రం కొందరు విద్వాంసులు శుద్ధధైవతానికి బదులుగా చతుశ్రుతి ధైవతంతో (ధ2) పాడతారు. ఈమని శంకరశాస్త్రిగారు ఈ పద్ధతిలో వీణమీద వాయించగా నేను విన్నాను. దీనికి ఆధారమేమిటో తెలియదు.

కింద ఉదహరించిన కొన్ని సినీగీతాల్లో (*గుర్తు) పంచమం (కొండొకచో రిషభంకూడా) వినిపిస్తుంది. ఘంటసాల కంపోజ్ చేసిన పాటలన్నిటిలోనూ ఇది గమనించవచ్చు. నిజానికి జయంతశ్రీ అనే మరొక రాగంలో (మరుగేలరా కీర్తన) అవరోహణలో పంచమం వేస్తారు. (స గ1 మ1 ధ1 ని1 స – స ని1 ధ2 ప మ1 గ1 స). (దీన్ని హిందూస్తానీలో పంచమ్ మాల్కౌఁస్ అంటారు). అలా కాకుండా తమకిష్టమైన చోటల్లా పంచమం వాడి ‘కలుషితం’ చేసే హక్కు ఉపశాస్త్రీయ సంగీత రచయితలకు ఉంటుంది.

హిందోళం కర్ణాటక గాత్రసంగీతం:

  1. హరి రసమవిహారీ (బాలమురళీకృష్ణ అన్నమాచార్య కీర్తన)
  2. సామజవరగమనా (జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం)
  3. హిందోళం తిల్లానా (జాన్ హిగిన్స్)

కర్ణాటక వాద్యసంగీతం:

  1. సామజవరగమనా (టి.ఎన్. రాజరత్నంపిళ్ళై నాదస్వరం)
  2. సామజవరగమనా (యు. శ్రీనివాస్ మేండొలిన్)
  3. భజరే గోపాలం (ఎన్. రమణి వేణువు)

మాల్కౌఁస్ హిందూస్తానీ గాత్రసంగీతం:

  1. మందిర్ దేఖ్ డరే (బడేగులాం అలీఖాన్)
  2. ఆజ్ మోరే ఘర్ (అమీర్‌ఖాన్)
  3. మేరో మన్ (గంగూబాయి హానగల్)
  4. పగ్ ఘుంఘరూ (డి.వి.పలూస్కర్)

హిందూస్తానీ వాద్యసంగీతం:

  1. బిస్మిల్లాఖాన్ (షెహనాయి)
  2. రవిశంకర్ (సితార్)
  3. హరిప్రసాద్ చౌరాసియా (వేణువు)
  4. శివకుమార్‌శర్మ (సంతూర్)

తెలుగు సినీగీతాలు:

(* : పంచమం లేదా రిషభం)

  1. సందేహించకుమమ్మా (లవకుశ) *
  2. కలనైనా నీ తలపే (శాంతినివాసం)
  3. నారాయణా హరి (చెంచులక్ష్మి)
  4. పగలే వెన్నెల (పూజాఫలం)
  5. నేనే రాధనోయీ (అంతా మన మంచికే)
  6. పిలువకురా (సువర్ణ సుందరి)
  7. మోహనరూపా గోపాలా (కృష్ణ ప్రేమ)
  8. వీణ వేణువైన (ఇంటింటి రామాయణం) (అన్యస్వరాలు)
  9. చూడుమదే చెలియా (విప్రనారాయణ)
  10. సామజవర గమనా (శంకరాభరణం)
  11. రాజశేఖరా (అనార్కలి) *
  12. అందమె ఆనందం (బ్రతుకుతెరువు) *
  13. శ్రీకర కరుణాలవాల (బొబ్బిలియుద్ధం) *
  14. రామకథను వినరయ్యా (లవకుశ) *
  15. మనసే అందాల బృందావనం (మంచి కుటుంబం)
  16. సాగర సంగమమే (సీతాకోక చిలుక)
  17. ఓం నమశ్శివాయ (సాగర సంగమం)
  18. అంతా రామమయం (శ్రీ రామదాసు)
  19. చిలిపి నవ్వుల నిను చూడగానే (ఆత్మీయులు) (అన్యస్వరాలు)
  20. కొండలలో నెలకొన్న (అన్నమాచార్య)

హిందీ సినీగీతాలు:

  1. మన్‌ తడపత్‌ (బైజు బావరా)
  2. ఆధాహై చంద్రమా (నవ్‌రంగ్‌)
  3. నిర్బల్‌సే లడాయీ (తూఫాన్ ఔర్ దియా)
  4. అఁఖియన్ సంగ్ అఁఖియాఁ (బడా ఆద్మీ)
  5. దీప్ జలాయే (కలాకార్)
  6. పంఖ్ హోతేతో (సెహరా)
  7. తూ ఛుపీహై కహాఁ (నవ్‌రంగ్) (అన్యస్వరాలు)
  8. బల్‌మా మానేనా (ఒపేరాహౌజ్)

కీబోర్డు

కీబోర్డుమీద అంతగా భయపడకుండా ఈ రాగాన్ని వాయించాలంటే బొమ్మలో చూపిన నల్లమెట్లను మాత్రమే వరసగా వాయిస్తే సరిపోతుంది. దీనికి ఆధారశ్రుతి ఆరున్నర (ఏ షార్ప్) అని గమనించాలి. ఈ పద్ధతిలో ‘పగలే వెన్నెలా’ మొదలైన పాటలను తెల్లమెట్ల జోలికి పోకుండానే పలికించవచ్చు.

ఈ రాగం గురించి వ్యక్తిగతంగా చెప్పాలంటే నాకు అయిదారేళ్ళ వయసు ఉన్నప్పుడు నేను మొదటగా గుర్తించిన రాగం మాల్కౌఁస్. అప్పుడు నేను విన్నది ఒక పాత మరాఠీ పాట; 78ఆర్‌పీఎం రికార్డు. దీనానాథ్ మంగేశ్కర్ (1900-1942) ఆడవేషం కట్టి పాడిన ‘రణదుందుభి’ అనే మరాఠీ నాటకగీతం దివ్యస్వాతంత్ర్యరవి.

ఆ పాట ఆనాడు నామీద ఎంత ప్రగాఢమైన ముద్ర వేసిందో నేను వర్ణించలేను. హిందూస్తానీ పద్ధతిలో వీరరసప్రధానమైన ఈ రాగపు స్ఫూర్తి అంతకన్నా ఎక్కువగా నేను మరెక్కడా ఈనాటికీ వినలేదంటే అతిశయోక్తిగా అనిపించవచ్చు. చిత్రమేమిటంటే ఈ పాట చరణంలో గాయకుడు బుద్ధిపూర్వకంగా ఎన్నో స్వరాలను చేర్చినప్పటికీ అది అద్భుతంగానే అనిపిస్తుంది. ఇన్ని దశాబ్దాలుగా గాత్రంలో బడేగులాం, అమీర్‌ఖాన్, సితార్‌మీద విలాయత్‌ఖాన్ మొదలైన మహామహుల మాల్‌కౌఁస్ విన్నాక కూడా నా అభిప్రాయం మారలేదు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...