కొత్తపాళీ బ్లాగులో ఇచ్చిన ఇతివృత్తానికి కథ రాయండి అనే సవాలుకి జావాబుగా వచ్చిన కథ ఇది. ఇదే ఇతివృత్తంపై ఇంకో కథ ఇదే సంచికలో.
శీతాకాలం ముగిసింది, వేసవి ఇంకా మొదలవలేదు. ఎండ చుర్రుమంటున్నా అప్పుడప్పుడూ వీచే చల్లని గాలి తెమ్మెర హాయిగా ఉంది. కాలేజీ ఉన్న రోజుల్లో కాస్త సందడి గానే ఉండే రోడ్డు సెలవుల మూలంగా కాస్త చిన్నబోయినట్టుంది.
మెయిన్‌రోడ్డు వైపు నడుస్తున్నాను. సిటీకి దూరంగా హిమాయత్ సాగర్ రూట్ లో ప్రశాంతమైన వాతావరణంలో ఉందీ కాలేజ్. మెయిన్ రోడ్డు నుండి మలుపు తిరిగి పల్లెకి పోయే తారు రోడ్డు వెంట ఓ రెండు కిలోమీటర్లు లోపలగా ఉంటుంది. ఈ దారివెంటా రోడ్డు కిరువైపులా కనువిందు చేసే పూలతోటలు, పచ్చటి వాతావరణం. సిటీ నుండి రోజూ ఇక్కడికి రావటం చక్కటి ఆహ్లాదకరమైన అనుభూతి నాకు.
మెయిన్ రోడ్డు మీదకు వచ్చాను, ఒంటిగంట దాటింది ఈ టైమ్ లో బస్సుల కోసం ఎదురుచూడడం కంటే ఏదో ఓ ఆటో పట్టుకు వెళ్ళడం బెటర్ అనుకుంటుండగానే ఓ సెవెన్ సీటర్ షేర్ ఆటో నన్ను రాసుకుంటూ పక్కనే ఆగింది. లోపలో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. “మెహదీ పట్నం .” డ్రైవర్ కి చెపుతూ ఆవ్యక్తి పక్కన కూర్చున్నాను. ఇంకెవరైనా వస్తారేమో నని డ్రైవర్ చూస్తున్నాడు. ఇద్దరు ఆడవాళ్ళు హడావిడిగా వస్తూ కనిపించారు. తల్లీ, కూతుళ్ళనుకుంటా! “మెహదీపట్నం” అని చెప్పి నా సీటుకి ఎదురుగా డ్రైవర్ వెనక వైపు ఉన్న సీట్లో కూర్చున్నారు.
శబ్దం చేస్తూ బయల్దేరింది ఆటో. ఇంకెవరైనా కనిపిస్తారేమో నని చూసుకుంటూ నడుపుతున్నాడు డ్రైవర్.
సంతోష్ గాడు వస్తానని చెప్పి హాండిచ్చేసాడు. ఈ సెలవల్లో టూర్ వెళ్దామని మొదట ప్లాన్ జేసింది వాడే. బ్యాచ్ లోని వారంతా వచ్చారు, వీడికేమయ్యిందో నిన్న కూడా ఫోన్ చేసి చెప్పాడు వస్తున్నానని! ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాక అందరూ వెళ్ళి పోయినా ఇప్పటిదాకా వాడికోసం ఎదురుచూస్తూ ఉండి పోయా, వీడేమో రానేలేదు అనవసరంగా టైం వేస్టు.
ఆలోచనల నుండి బయట పడుతూ పక్కనున్నతనికేసి పరిశీలన గా చూసాను. ముప్ఫయ్యైదు ఏళ్ళుండొచ్చేమో, పంచె చొక్కాతో రైతు లాగా కనిపిస్తున్నాడు. ఓ గోనెసంచి లోపలేవో వస్తువులున్నట్టున్నాయి, దాంట్లోంచి పదునుదేలి ఉన్న కొడవలి ఒకటి బయటకి కనిపిస్తూ ఉంది. చుట్ట తీసి వెలిగించే ప్రయత్నం లో ఉన్నాడు. ఎదురుగా తల్లీ కూతుళ్ళు. తల్లి కి ఓ ముపై ఐదు కూతురికి పదమూడూ ఏళ్ళుండొచ్చేమో. ఓ వైరు బుట్ట కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, అమ్మాయి ఒడిలో ఏవో వస్తువులున్న పాలిథీన్ కవర్ ఉంది. నాసిరకం బట్టలే కాని కొత్త వాటిలా ఉన్నాయి, వాటి ఎరుపు ఆకుపచ్చ రంగులు వారి వొంటి నల్లటి రంగుకి కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నాయ్. తల్లో పూలు, చేతులకి గాజులు, ఆ అమ్మాయి మెడలో ఏదో పూసల దండా, తల్లి మెడలో నల్ల పూసలు, కాళ్ళకి కడియాలు. చూడగా అలంకరణలు కాస్త ప్రత్యేకంగానే కనిపిస్తున్నాయి.
మధ్యాహ్నం వేళేమో రోడ్డు పై జనసంచారం ఎక్కువేమీ లేదు. నడిచే వాళ్ళెవరైనా కనిపించ గానే వాళ్ళ పక్కన కాస్త స్లో చేస్తూ మళ్ళీ వేగం పెంచుతూ నడుపుతున్నాడు డ్రైవర్. రాజేంద్ర నగర్ రాగానే బస్ స్టాప్ దగ్గరలో ఆటో ఆపి అక్కడే నిలబడి ఉన్న నలుగురు మనుషులకేసి చూస్తూ మెహదీ పట్నం అని అరచి, వారిలో కదలిక లేకపోయే సరికి తిరిగి ఆటో స్టార్ట్ చేసాడు. ఆటో అగ్రికల్చర్ కాలేజీ రోడ్డు లో వెళుతోంది. హాయిగా ఉంది అక్కడి వాతావరణం.
రైతు నోట్లోంచి చుట్ట తీసి బైటకి ముఖం పెట్టి తుప్పుక్కున ఉమ్మేసాడు. ఆ అమ్మాయి ఆటో కుదుపులని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది.
ఆటో రాజేంద్ర నగర్ దాటుతుండగా రోడ్డు పక్కన చెయ్యూపుతున్న ఓ నడివయసు వ్యక్తి ని చూసి ఆపాడు డ్రైవర్ మెహదీ పట్నం అంటూ. అతను సూట్ వేసుకునున్నాడు చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది. తలూపుతూ ఓసారి ఆటో లోకి తొంగి చూసి నొసలు ముడేసి, ముఖం అదోలా పెడుతూ ఇంకేమైనా వస్తాయేమో నని రోడ్డు కేసి చూసి, వాచీ చూసుకుని ఇక తప్పదనన్నట్లుగా, మధ్యకు జరగ మన్నట్లుగా నా వైపు చూసి “పోనీ” అని చెపుతూ నా పక్కన కూర్చున్నాడు.
ఇక ప్యాసింజర్స్ కోసం చూడనక్కర లేదనుకున్నాడేమో డ్రైవర్ గేరు మార్చి ఆటో వేగం పెంచాడు. పెద్దగా శబ్దంచేస్తూ వేగంగా ముందెళుతున్న ఆటోని ఓవర్ టేక్ చేసి ఎదురుగా వస్తున్న లారీ ని కొద్దిలో తప్పించి, సడన్ బ్రేక్ వేసి, వెంటనే మళ్ళీ వేగం పెంచాడు. కుదుపులకి అందరం ఎగిరెగిరి పడ్డాం.
“డ్రైవింగ్ చేయడం వచ్చా అసలు నీకు? సరిగ్గా నడుపు.” విసుక్కున్నాడు సూటు.
తల్లి పట్టనట్టు గా బయటకు చూస్తోంది. అమ్మాయి చేతిలోని కవరు గట్టిగా బిగించి పట్టుకుని ధ్రిల్లింగ్ గా ఉన్నట్టు దిక్కులు చూస్తూ ఉంది.
సూటు చూసే కోర చూపులని పసిగట్టాడేమో చుట్ట ఆర్పి జేబులో పెట్టుకున్నాడు రైతు.
“ఎక్కడికెళ్ళాలి?” అడిగాను రైతు ని మాటల్లోకి దింపడానికి ప్రయత్నిస్తూ.
“మెహదీపట్నం.” చెప్పాడు.
ఆటో కిస్మత్ పురా దాటింది. రెండేళ్ళ క్రితం కాలేజ్ లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ ఈ వైపున ఎన్నో మార్పులొచ్చాయ్, సిటీ శరవేగం తో విస్తరిస్తోంది. ఏవేవో కొత్త కాలనీలు అపార్ట్ మెంట్లు. రోడ్డు మధ్యలో శంషాబాద్ నుండి మెహదీ పట్నానికి ఎక్స్ ప్రెస్ హైవే ఫ్లైయోవర్ రూపుదిద్దు కుంటోంది.
“మెహదీ పట్నం ల నా బామ్మ్మర్ది ఉన్నడు, గాన్ని తోలుకోని మార్కెటు కు బోవాలె.”
రైతు మాటలకి ఈ లోకం లోకి వచ్చి అలాగా అన్నట్టు చూసి,
“త్వర త్వరగా డెవలప్ ఐపోతుం దీవైపంతా” అంటూ సూట్ వైపు చూసాను.
“ఇదేం ఉంది? చూడండి, ముందు ముందు ఇంకా డెవలప్ అవుతుంది, సాగర్ కింద ఇప్పటికీ ఇంకా చాలా భూములున్నాయి, ఆ ఏరియా అంతా పారిశ్రామీకరణ చేసేస్తే అప్పుడు ఇంకా బావుంటుంది.” అన్నాడు సూటు కళ్ళ లో వెలుగులు కురిపిస్తూ.
అప్పటి దాకా తనకేం పట్టనట్టు బైటకి చూస్తున్న తల్లి సూటు వైపు చూస్తూ, “ ఆ ఏం బాగు, ఎవ్వలికి బాగు సారు! నా చిన్నప్పుడు మా నాయనకి భూముండేడిది. సర్కారోల్లు ఫ్యాక్టరీల కోసం గది గుంజుకున్నరు. దానికి కట్టిచ్చిన పైసలు నాయన చాత కాని యాపారం జేసి పోగొట్టిండు. మా అన్నలిద్దరూ మార్కెట్ ల కూలీలైయ్యిండ్రు. సొంత ఊరు భూమీ పోగొట్టుకోని అందరం తలోక్కదిక్కై పోయినం, గట్ల ఆగమైనోల్లు మస్తుమందున్నరు. పైసలిస్తానం గదా యాపారాలు జేసుకోవాలే అంటరు. అలవాటు లేని యాపారాలు రైతులేం జేస్తరు సారూ! అంతా పోగొటు కోని పట్నంల కూలి పనీ పాచి పనీ జేసుకుంటాన్రు.” అంది.
సూటు బైటకు చూస్తూ తనను కాదన్నట్టుగా మౌనం వహించాడు.
“గిప్పుడు ప్లాట్ల కోసం మస్తుగ పైసలిచ్చి కొంటాండ్లు. అదృష్టం మంచిగున్నోనికి లక్షలు, కోట్లు వస్తాయి ఆటి తోటి మారాజు లెక్క కాలు మీద కాలేసుకోని బతుకొచ్చు.” అన్నాడు రైతు కల్పించుకొని.
“ఏందో నన్నాభూమితల్లి, కన్నతల్లి లెక్క అనిపిస్తది నాకు. ఐనా గీ రోజులల్ల కన్నతల్లి కన్నా లక్షలు కోట్లే కావాలె!” రైతు కి సమాధాన మిచ్చి రెండు నుముషాలు చూసి బదులు రాక పోవటం తో, వెనిక్కి తల తిప్పి,
“అన్నా మా ఇంటాయనకి ఓ రెండెకరాలుంది. నేనూ కూలికి బోయి, బర్రెలు పెట్టుకోని ఎట్లనో నడిపిస్తావున్నా, కష్టపడ్డా గూడా అలవాటైన పని. గిప్పటికైతే మంచిగనే నడుస్తాంది, గీ పిల్ల తొమ్మిది చదువుతాంది పదిదాంక చదివిపిస్తా. గీ దీని పెండ్లి జేసినంటే ఇంగ పుర్సత్ గుంటది.” డ్రైవర్ తో కష్ట సుఖాలు మొదలెట్టింది.
ఏంటో యీమె యెదవ గోల. సంతోష్ గాడు ఎందుకు రాలేదో? ఇంటికెళ్ళ గానే ముందు వాడికి ఫోన్ చేయాలి. ఏదో జరిగుంటుంది లేకపోతే వాడు రాకుండా ఉండడు. టూర్ కి కూడా రావడం మానేయడు కదా! వాడి జోకులూ చమత్కారాలే టీం లో అందరికీ టానిక్. వాడు లేకపోతే టూర్ లో మజా నే ఉండదు.
స్పీడ్ బ్రేకర్స్ పై ఎగిరెగిరి పడి, అవి దాటిన తరువాత బ్రేకేసి, కాస్త స్లో చేసి మళ్ళీ వేగం పెంచాడు డ్రైవర్. పక్కన రైతు నిద్రలోకి జారికుని గుర్రు మొదలెట్టాడు. ఆటో అత్తా పూర్ మీదుగా వెళుతోంది, ఒక్క సంవత్సరం లోనే పూర్తిగా మారిపోయింది ఇక్కడంతా! ఈ ఏరియాకే పెద్ద సెంటర్ ఐపోయింది. ఓ సారి అందరినీ చూసాను ఎవరి లోకంలో వాళ్ళున్నారు.
ఇంతలో ఓ మనిషి రోడ్డు దాటుతూ ఆటో కి అడ్డం వచ్చాడు. పక్కకి ఓ మెలిక తిప్పి సడన్ బ్రేక్ వేసాడు డ్రైవర్.
“వీడెవడో నీ ఆటో కింద పడడానికే ఇక్కడ ఎదురుచూస్తున్నట్టున్నాడు!” జోకాడు సూటు.
“అరె బుడ్డా కండ్లు కనిపించక పోతే ఇంటికాడ కూసో” అంటూ గట్టిగా అరచి “రోడ్ల మీద దిరిగి మా ప్రాణాలు దీస్తరు.” సణుక్కుంటూ కొంచం స్లో గా నడపడంమొదలెట్టాడు.
“ఇలాగైతే ఈ రోజెళ్ళినట్టే త్వరగా పొనీ.” విసుగ్గా చెప్పాడు సూటు.
ఎదురుగా అమ్మాయి కవరు లోంచి ఏదో తీసి తింటూ ఆసక్తి గా బైట కనిపించే హోర్డింగ్ లు చూస్తూ ఉంది.
ఈ రోజు షాపింగ్ కెళ్ళాలి. మాంచి స్పోర్ట్ షూ కొనాలి, అలాగే కొత్త బ్యాగ్ కూడా, ఈసారి తప్పక లెదర్ జాకెట్ తీసుకోవాలి. జుట్టు కాస్త ట్రిమ్ చేయిస్తే ఫొటోల్లో బాగా వస్తుంది, ఐనా ఎలాఉన్నా మనం ఎప్పడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షనే. ఈ సారి ట్రిప్ లో దుమ్ము లేపాలి.
వంద రోజులు గా ఆడుతున్న యాక్షన్, రొమాంటిక్ సినిమా లోని యువ హీరో కట్ అవుట్ ని ఇంట్రెస్ట్ గా చూస్తూఉంది ఆ అమ్మాయి.
వాడేం ఉన్నాడు నాముందు! అనుకుంటూ నా సిక్స్ ప్యాక్ బాడీ వైపు చూసుకున్నాను గర్వంగా.
“గీడ పొద్దుగాల యాక్సిడెంట్ అయ్యుండె. బండిమీద పోతావుంటె ఏదో గుద్ది పొయ్యింది. తల్కాయ పలిగింది, చిన్నోడే. పొయ్యుంటడు. బతికే కేసుగాదు, ఏమయ్యిందో!” ఓ చోట కొద్దిగా స్లో చేసి బయటకి చూస్తూ అన్నాడు డ్రైవర్.
అందరం అప్రయత్నంగా అటు వైపు చూశాం. అక్కడ రోడ్డు పై నల్లగా రక్తం కనిపించింది.
“మరి హాస్పిటల్ లో చేర్పించలేదా?” అడిగాడు సూటు.
“ఎమ్మో తెల్వద్.” తల అడ్డం గా ఊపి “ఎవరన్నా పోలిసులకు పోన్ జేసుంటరు.” చెప్పాడు డ్రైవర్.
“నువ్వేం చేసావ్ ఆగలేదా?” సూటు తిరిగి ప్రశ్నించాడు.
“నేనేం జెయ్యాలే? నాకు ప్యాసింజర్లున్నరు. నడూవుల దించుతె ఊర్కుంటరా? వాళ్ళ పనులు వాళ్ళకుంటయ్.”
“ఛ మనుషుల్లో బొత్తిగా మానవతా విలువలు లేకుండా పోయాయ్! ఓ మనిషి ప్రాణం కంటే తమ స్వంత పనులే ముఖ్యం అనుకుంటున్నారు. ఇది సిగ్గు పడాల్సిన విషయం. తోటి మనిషికి సహాయం చేయని జన్మ ఎందుకు వృధా!” అంటున్న సూటు మాటలకి అడ్డొస్తూ.
“ఎవడి బతుకు వాడు సరిగ్గ జూసుకుంటే సాలులే సారు తోటోనికి జేసినట్టే. సచ్చేటోన్ని దావఖానకు తీస్కపోయినా ఆడ మళ్ళా పోలిసుల కోసం ఎదురు జూడాలె, ఎవ్వలో ఓల్లు పోలిసులకు ఫోన్ జేస్తె, ఆల్లే అంబులెన్స్ ల తీస్కపోతరు. గా దానికి ఈడ రోడ్డు పైన బోయెటోల్లందరు పని మానుకోని గూసోవాల్నా!” డ్రైవర్ కి సపోర్ట్ గా అన్నాడు రైతు.
తల్లి రైతు వైపు కోపం గా చూసి తల తిప్పుకుంది.
“మనుషులు మరీ కఠినంగా మారిపోతున్నారు దేనికీ స్పందించకుండా!” అన్నాను సూటు తో.
“కలికాలం ఏం జేస్తం! మీలెక్క దిమాగున్నోల్లు ఉండబట్టి ఇంక యింతన్నా మంచిగున్నం. సూటుని నన్ను ప్రసన్నంగా చూస్తూ చెప్పింది తల్లి.
ఆటో మూసీ బ్రిడ్జ్ దాటింది. ఎందుకో అక్కడి వాతావరణం లో తేడాగా అనిపిస్తూ ఉంది. రోడ్డు పై జనం హడావిడిగా, కంగారుగా, భయం భయంగా వెళుతునట్టనిపించింది.
ఇంకాస్త ముందుకెళ్ళేసరికి అర్ధమైపోయింది. షాపులు మూసేస్తున్నారు. రోడ్డుపై పోలీసులు కొన్ని వెహికిల్స్ తనిఖీ చేస్తూ, కొందరిని త్వరగా వెళ్ళ మని హెచ్చరిస్తూ ఉన్నారు.
“అరె క్యా హువా భాయ్?” పక్కనే వెళుతున్న మరో ఆటోలోకి కేకేస్తూ అడిగాడు డ్రైవర్ .
“క్యా హోతా హై! కిసినే కిసికో మార్ డాలా!” చెపుతూ మా ఆటో ని దాటి వెళ్ళి పోయాడు.
“యే అల్లా ఫిర్ షురూ హోగయా!” స్వగతంలా అన్నాడు డ్రైవర్.
“మైగాడ్ ! ఈడియట్ కారుని రోజూ చెక్ చేసి ఉంచాలని చెపుతూనే ఉంటాను. బుర్రలేని వెదవ ఉందిలేరా నీకీరోజ.” అతన్ని రోడ్డున వదిలేసిన అతని కారు డ్రైవర్ ని కాబోలు తిట్టుకుంటున్నాడు సూటు.
“ఉదయం ప్రశాంతంగానే ఉంది మరి ఇంతలో ఏమయ్యిందో.” అన్నాను బైటకి చూస్తూ.
“ఈడ ఎప్పుడైనా ఎట్లయినా ఐతది మన జాగ్రత్తల మనం ఉండాలె.” సంచీ దగగ్గరకు లాక్కుంటూ ఇదంతా మామూలేనన్నట్లు నాకేసి చూస్తూ చెప్పాడు రైతు.
ఫోర్ట్ రోడ్డు దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి కాస్త సీరియస్సేనని పించింది. రోడ్డు ప్రక్కన పోలీస్ వెహికిల్స్ నిలిచి ఉన్నాయి, త్వరగా వెళ్ళమని అందరికీ హెచ్చరిస్తూ మైక్ లో ప్రకటన లు జారీ చేస్తూ ఉన్నారు.
“ఎవ్వల పని వాల్లు జేసుకుంట ఎవ్వడి బతుకు వాడు బతకక ఏందో గీ సంపుకునుడు!” అంది తల్లి.
“మామూలుగా అందరూ ప్రశాంతంగా బాగానే ఉంటారు, ఎక్కడో ఏదో జరగ గానే ఎవరు రెచ్చగొడతారో తెలియదు గాని ఇన్‌స్టెంట్ గా మొదలౌతాయ్ గొడవలు. వారం రోజులు కాగానే మళ్ళీ అంతా ఏమీ జరగ నట్టే ప్రశాంతంగా మారిపోతుంది.” చెప్పాను బయట పరిస్థితిని గమనిస్తూ.
“జాతులు, తెగలు, మతాల మధ్య ఘర్షణ అనేది ఎప్పుడైనా ఏకాలంలోనైనా సహజంగా జరుగుతున్నదే. ఈ వర్గ వైషమ్యాలు ముందుముందు ఇంకా ఎక్కువైయ్యేవే కాని తగ్గవు.” తన అమూల్య అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు సూటు.
“ఓ వర్గం గిర్గం కుచ్ నహీ హై సాబ్! యే సబ్ గూండోకా కాం హై ! సబ్ కో మాలూమ్ హై. హమ్ గరీబ్ లోగోంకి ఏం వస్తది సాబ్ గీ లొల్లిల! నాకీ ఏడు మంది పిల్లలు, నేను ఆటో నడిపి పైసల్ తీస్క పోతేనే నా పోరగాల్లు తినేది. నా పెద్ద పోరడు దవాఖానా ల ఉన్నడు. వాడికి గుండెల్ల చిల్లు. నేను కర్ఫ్యూల పని బంద్ జేసుకోని కూసుంటే ఎట్లా నడస్తది సాబ్! కష్టపడి పనిజేసెటోన్ని ఎవడినన్నా అడుగుండ్రి గీ లొల్లిల బాగుపడినోడెవడు లేడు. ఎవడో బద్మాష్ సాలే వాడి లాభం కోసం షురూ జేస్తడు. ఆఖర్ కి అవి మతఘర్షణలు అని పేరు బెడతరు. ఏడ ఎప్పుడు బాంబు పేలతదో ఎవ్వడికీ తెల్వద్ పెట్టినోడు మంచిగనే ఉంటడు. ఈడ ఒకల్ల మీద ఒకల్లకి అనుమానం. ఏడ ఏముంటదో నని ప్రాణం అరిచేతిల పెట్టు కోని బతుకుడైతాంది.” అన్నాడు డ్రైవర్ ఆవేదన తో కాస్త కోపంగా.
“అందరూ కలిసి కట్టు గా ఉంటే ఏ గుండాలు, నాయకులు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రజలే ఈ అల్లరి మూకల్ని ఎదిరించి వారికి తగిన బుద్ది చెప్పాలి.” ఇన్‌స్పైర్ చేస్తున్నట్టుగా చెప్పాడు సూటు.
“అవును కరెక్ట్ గా చెప్పారు. ఏ అరాచకానైనా ప్రజలు సహించి ఊర్కోకూడదు. పోలీసులే రావాలనీ, రక్షించాలనీ ఎదురు చూడకుండా తమ పరిధిలో ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించి భాద్యతగా వివేకంగా స్పందించాలి. ఇలాంటి విషయాల గురించి నేను మా కాలేజ్ లో, కాలనీ లో అందరికీ చెపుతూ చైతన్యపరుస్తూ ఉంటాను.” సూటు తో ఏకీభవిస్తూ తల్లీ కూతుళ్ళ వైపు చూసాను.వారి కళ్ళ లో ప్రశంస కనిపించింది.
“తాను బాగుంటే చాలునన్న స్వార్ధబుద్ది తొలగాలి ముందు, ప్రజలలో”. అంటూ రైతు వైపు నిరసనగా ఓ చూపు చూసాడు సూటు.
“అమ్మా ఇప్పుడు ఈడ బాంబులు పేల్తయా?” ఉత్సాహంగా అడుగుతున్న కూతుర్ని,
“ఎహే పోరి నీ ఒట్టపు నోరు పాడుగాను సప్పుడు జెయ్యకుండ గూసోలేవే!” అని కసిరి, “రేపు మా అన్న బిడ్డ పెండ్లి, పిల్ల గానోల్లు నిజాంబాద్ కాడ నుండి రావాలె. ఎట్లయితదో ఏందో గీ ఆగంల”. అంది.
“కర్ఫ్యూ పెడతరంటావా?” డ్రైవర్ ని అడిగాడు రైతు తన పనులు పూర్తవుతాయో లేదో నన్న సందేహం తో నేమో ఏదో ఆలోచిస్తున్నట్టుగా.
“ఎమ్మో. మరి ఎట్లుంటదో!” సమాధానమిచ్చాడు డ్రైవర్.
హు వీడి బాధంతా తన పని గురించే అసలు మేం మాట్లాడింది వీడికి అర్ధం అయ్యిందా? అనుకున్నాను రైతుని చూస్తూ.
నాలానగర్ దగ్గరికి రాగానే గుంపుగా రోడ్డు దాటుతున్న వారిని చూసి ఆటో స్లో చేసాడు. కేకలు వేస్తూ అరుస్తూ మృగాల్లా కనిపిస్తున్నారు వాళ్ళు. దాంట్లో ఒకడు ఆటోకి అడ్డ గా నిలుచున్నాడు ఆపమన్నట్టుగా, వాడేదో తమాషా చేయబోతున్నాడని గ్రహించినట్టు వాడికి తోడుగా ఇంకో ఇద్దరు చేరారు.
ఆటో పూర్తిగా స్లో చేసి “గీడదాంకనే భాయ్ బొంబాయ్ రోడ్డు కే, ముందుకు పొయ్యేటిది లేదు.” వాళ్ళ ని వారిస్తున్న డ్రైవర్ మాటలకి అడ్డు పడుతూ, మేం గూడా బొంబాయ్ రోడ్డు కే అంటూ ఒకడు డ్రైవర్ పక్కన దూరాడు.
“ఈడ జాగ లేదు” అంటున్న తల్లి మాటలు లెక్క చేయకుండా ఆమెని నెట్టి పక్కనే బైఠాయించాడు మరొక డు. మరో వైపు నుండి చొరబడి అమ్మాయి పక్కనే ఇరుక్కుని కూచున్నాడు మూడో వాడు.
ఆ పిల్ల బిక్కచచ్చి తల్లి వైపు ఒదిగి పోయింది. తల్లి రెండు చేతుల తో బిడ్డ ని దగ్గరికి లాక్కుంటూ “ఏంది మీద మీద పడతాండ్రు! గీడ జాగ లేదంటే ఇనిపిస్త లేదా? దిగుండ్రి.” అంటోంది.
“అరె చల్ పోనీ” తల్లి మాటలు పట్టించు కోకుండా డ్రైవర్ కి ఆర్డర్ వేశాడొకడు.
ఆటో నాలుగడుగులు ముందుకు పోగానే డ్రైవర్ పక్కన ఉన్నవాడు కింద కి జంప్ చేసి వెకిలిగా పిచ్చి పిచ్చి కూతలతో ఆటో లోని తన వాళ్ళకి సెండాఫ్ ఇచ్చాడు.
అల్లర్లు జరిగినప్పుడు దాన్ని అవకాశం గా తీసుకుని లూటీ చేసే రౌడీలని వాళ్ళని చూస్తేనే అర్ధం అవుతూఉంది.
ఈ పోలీసోళ్ళకి అసలు బుర్రే ఉండదు, అంతా అక్కడ ఒక్కచోటే గుమి కూడి ఉన్నారు అనుకుంటూ ఎవరైనా కనిపిస్తారేమోనని రోడ్డు మీదికిచూస్తున్నా.
“ఏం పోరీ ఏం తింటున్నావ్! లడ్డు లెక్క జబర్దస్తుగున్నవ్!” ఆ పిల్ల బుగ్గ పట్టుకుని లాగుతూ అన్నాడు ఒకడు.
“చోడో భాయ్! ఛొటీ హై” అన్నాడు డ్రైవర్ వెనిక్కి చూస్తూ.
“అవ్ ఛోటివే మస్తుగుంటది, ముసలిదాన్నేం జేసుకుంటం.” వెకిలిగా నవ్వుతూన్నాడు ఇంకొకడు.
“ఏయ్ పిల్ల మీద చెయ్యి తియ్యి, లేకపోతే మర్యాదుండదు చెప్తున్నా.” అరుస్తున్నట్టుగా అంది తల్లి.
“ఏందే! మర్యాదా? మేం ఇస్తం తీస్కో” అంటూ ఫట్ మని తల్లి మొఖం మీద కొట్టాడు ఆమె పక్కనున్న వాడు.
పిల్ల ఏడవడం మొదలెట్టింది, తల్లి నా వైపు, సూటు వైపు చూస్తోంది రక్షించ మన్నట్టుగా.
ఈ రౌడీలని తన్ని ఆ పిల్లని రక్షించానంటే రేపటినుండీ కాలేజ్ లో కాలనీ లో మన పేరు మారు మ్రోగిపోతుంది. యెదవలు తాగున్నట్టున్నారు. ఎంత నాల్గు కరాటె దెబ్బలు పడితే తోకముడిచి పారిపోతారు. డ్రైవర్ సహాయానికి వచ్చేటట్టే ఉన్నాడు. రైతు వైపు చూసాను, ఏదో ఆలోచిస్తునట్టుగా ఉన్నాడు. ఈ బక్క వెదవ వేస్టుగాడే! వీడిని నమ్మలేం. సూటు ఎలాగూ ఊరుకోడు. తప్పక ఆ అమ్మాయిని రక్షిస్తాడు. ముందు నేనే వాళ్ళని అపోజ్ చేస్తే తరువాత సంగతి ఎలాగూ సూటు గాడే చూసుకుంటాడు. ఎలాగైనా ఈ న్యూస్ రేప్పొద్దున న్యూస్ పేపర్ లో వస్తే … ఆహా నాపంట పండింది, భలే మంచి చాన్స్. ఈ దెబ్బకి రేపటి నుండీ నా సీనియర్స్ కూడా మనల్ని అన్నా అని పిలవాల్సిందే, కాలేజ్ లో గర్ల్స్ ముందు … ఇక మనకెదురే ఉండదు.
తల్లి వైపు అభయం ఇస్తున్నట్లుగా చూసి రౌడీల మీదికి దూకేందుకు సిద్దమౌతూ సూటు వైపు చూసాను. చమట తో తడిసి పోయున్నాడు. చేతులు వణుకుతున్నాయి.
ఈ గొడవకి ఆటో స్లో చేసాడు డ్రైవర్. “పోనీ బే! మేం చెప్పేదాంక నడపుతనే ఉండు.” గద్దించాడు డ్రైవర్ వెనక కూర్చున్న వాడు.
“నేనిక్కడే దిగాలి ఆపు” అంటూ స్లో చేసిన ఆటో లోంచే దూకేసాడు సూటు.
ఒక్క నిముషం అసలేం జరిగిందో అర్ధం కాలేదు. షాక్ నుండి తేరుకుంటూ, అమ్మనీ సూటుగా ఎంతపని చేసావురా! ఇంకా నయం నిన్ను నమ్ముకొని రౌడీ వెదవలతో గొడవ మొదలెట్టలేదు. వీడే పారిపోయాడంటే .. నేనొక్కణ్ణి వీళ్ళతో .. అనుకుంటూ రౌడీ లవైపు చూసాను. వాళ్ళని చూడాలంటేనే వణుకు గా ఉంది, ఎర్రటి కళ్ళతో వికృతంగా కనిపిస్తున్నారు, డ్రగ్స్ తీసుకున్నట్టున్నారు.
“చల్ బే! స్పీడ్ గ పోనీ” వెనిక్కి తిరిగ డ్రైవర్ బుజాన్ని తడుతూ మళ్ళీ చెప్పాడు వాడు.
ఈ పిల్లేంటీ ఏడుపు! కాసేపు గమ్మునుంటే వాళ్ళు దిగాల్సిన చోటు రాగానే వెళ్ళి పోతారు కదా! అనుకుంటూ వాళ్ళ పైనుండి చూపు మరల్చి బయటకు చూడసాగాను.
ఏంటో ఇంత దూరం అనిపిస్తోంది, త్వరగా మెహదీపట్నం వచ్చేస్తే బాగుణ్ణు. బొంబాయ్ రొడ్డన్నారు, దాటుతోంది, వీళ్ళు దిగేటట్టు లేరు.
“ఏయ్ పోరి, ఇదరావ్! సీట్ సరిపోతలేదు, నా పైన కూసో” పిల్లను రెండు చేతులతో లేపటానికి ట్రై చేస్తూ అన్నాడు ఆమె పక్క వాడు.
లేచి కూతురుతో పాటు మా సీటు వైపు రావటానికి ప్రయత్నిస్తున్న తల్లిని కాళ్ళు అడ్డు పెట్టి చేత్తో సీటు కేసి అదిమి పట్టుకున్నాడు తల్లి పక్కన ఉన్నవాడు.
“అన్నా! దండంబెడతన్నా! దాన్ని ఇడువన్నా” బతిమాలుతూ ఉంది తల్లి.
ఇలాంటివాళ్ళు దేనికైనా తెగించి ఉంటారు. చాలా డేంజర్ వీళ్ళతో పెట్టుకోవడం. లేవగానే ఎవరి మొఖం చూసానో ఈ రోజు! సరిగ్గా ఇరుక్కుపోయా. నాకు టెన్షన్ పెరుగుతోంది.
“ఈ గలలీ లకి తిప్పు” పక్కనే సందు వైపు చూపిస్తూ డ్రైవర్ తో అని తల్లిని బయటకి తోస్తూ, “చల్ తుమ్ భీ జావొ!” అంటూ నా వైపు, రైతు వైపు కత్తి చూపిస్తూ బెదిరించాడు.
ఐపోయింది, ఏది జరగగూడదనుకున్నానో అదే జరగ బోతోంది. వాళ్ళ కర్మ వాళ్ళెలాగైనా పోనీ, నేను బయట పడ్డా.
వాడితో ఇంకో సారి చెప్పించుకోకుండా కిందకు దూకి గుండెల నిండా గాలి పీల్చుకుంటూ పరిగెత్తటం మొదలెట్టాను.
ఓ వంద గజాలు వెళ్ళానో లేదో వెనక నుండి పెద్దగా కేకలూ, పెడబొబ్బలూ వినిపించేసరికి ఓ పాన్ డబ్బా చాటుగా నిలుచుని చూడసాగాను.
ఆటో అక్కడే ఆగిఉంది. రైతు బూతులు తిడుతూ చేతిలో కొడవలి తో వారిద్దరి పై అటాక్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ పిల్లని వదిలి రైతు పైకి వెళ్ళారు.
తల్లీ కూతుర్ని పట్టుకుని ఓపక్కగా నిలుచుని కేకలేస్తూ ఉంది.
గట్టిగా అరుస్తూ కొడవలిని తప్పించుకుంటూ ఇద్దరూ కలిసి రైతుని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు రౌడీలు.
పల్లెటూరి బక్క నాయాలు వాళ్ళ సంగతి తెలియక పెట్టుకుంటున్నాడు వాడిపనైపోయినట్టే! అనుకుంటూ ఉన్నాను.
ఇంతలో వాళ్ళ వెనుకగా గేర్ రాడ్ పట్టుకుని ప్రత్యక్షమయ్యాడు డ్రైవర్.
“బద్మాష్ కుత్తే, సాలే…” గాండ్రిస్తూ రెండు చేతులతో రాడ్ లేపి ధన్ మని ఓరౌడీ తల పై కొట్టాడు.
ఫట్ మని తల పగిలిన శబ్దం నాదాకా వినిపించింది.
అది చూసి రెండవ వాడు వెంటనే పక్క సందులోకి పరిగెత్తాడు.
అక్కడ జనం గుమిగూడడం మొదలెట్టారు.
వెళ్ళి చూద్దామా! అనుకున్నా.
ఎందుకొచ్చిన గోల అనుకుని ఇంటి దారి పట్టాను.