ఒకప్పుడు బ్రహ్మదేవుడు విశ్వసృష్టిలో పూర్తిగా మునిగిపోయాడు. సంసారం సంగతి పట్టించుకోవడం మానేసాడు. సరస్వతీదేవికి ఏమీతోచక విసుగెత్తిపోతున్నది. తనకి కొడుకొకడుంటే బాగుంటుందనిపించింది. భూమ్మీదకొచ్చింది. ఆవిడకి కృష్ణాగోదావరీనదుల మధ్యదేశం బాగానచ్చింది. గోదావరి దక్షిణతీరానికొచ్చి అక్కడ ఘోరతపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ఆమె తపస్సుకి మెచ్చినీకోరిక త్వరలోతీరుతుందని వరమిచ్చాడు. సరస్వతీదేవికి కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టీపుట్టంగానే ” యదే తద్ వాంగ్మయం…” అంటూ ఛందస్సులో ఆశువుగా శ్లోకం చెప్పి తల్లి పాదాలకి నమస్కరించాడు. సరస్వతి బిడ్డని ఎత్తుకొని, ” నాయనా! నీవు కావ్య పురుషుడివి. నీవు నీ ఆశు కవితతో మాటలమూటనైన నన్నే యెంతో సంతోషపెట్టావు. అబ్బాయీ! నీవు పుణ్యభూమి ఆంధ్రభూమిలో పుట్టావు,” అని అంటూ సరస్వతి తన ముద్దుబిడ్డని ముద్దాడి దీవించి, మహాభారతకథని అతిరమ్యమైన ఆంధ్రభాషలో చెప్పించమని కుమారుణ్ణి ఆదేశించింది.
కావ్యపురుషుడు తల్లి ఆజ్ఞ శిరసావహించి, అప్పుడు యజ్ఞం చేస్తున్న నన్నయభట్టుగారిని ఆవహించి ఆయనచేత ఆశువుగా దేవతాస్థుతి పలికించాడు.
హరిహరాజగజాననార్క షడాస్యమాతృ సరస్వతీ
గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతిసేసి దు
ర్భరతపోవిభవాధికున్, గురు పద్యవిద్యకు నాద్యు, నం
బురుహగర్భనిభుం, ప్రచేతసుపుత్రు భక్తి తలంచుచున్.
నన్నయభట్టు గారు యాగం పూర్తిచేసి మహాభారతకథ తెలుగులో చెప్పడానికి సంసిద్ధుడయ్యి ఇంకా ఇలా అన్నాడు:
సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తి లో
నారసి మేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప, నా
నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారతసంహితారచనబంధురుడయ్యె జగద్ధితంబుగన్.
నన్నయభట్టు గారు ఈ యాగం గోదావరి దక్షిణాన తణుకులో చేశాడని ప్రతీతి. “నన్నయ భట్టుగారు యజనం బొనరించిన చోట జమ్మిచెట్టున్నది తణ్కు తూర్పున” అని ఒక స్థలపురాణకథ కూడా ఉన్నది.
సరస్వతీదేవితన చిన్న పాపడిని ఆ జమ్మిచెట్టుకింద ఒక రాతిపై కూర్చోబెట్టి, తాను ఆకాశగంగని పిలిచి, అభ్యంగనస్నానం చెయ్యడానికి వెళ్ళింది. కావ్యపురుషుడి అంశ బలంగా ఉన్న నన్నయగారు మహాభారతకథ సహాధ్యాయి నారాయణభట్టు సహాయంతో రాజరాజుకి చెప్పాడు.
ఇలా ఉండగా, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి దగ్గిర చదువుకొని ” అస్మాదృశుండ లఘుస్వాదురసావతార ధిషణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయమూర్తి,” అయిన నేను ఆ వేంకటశాస్త్రి గారి ప్రియ శిష్యుండయినానని గర్వంగా చెప్పుకుంటూ కృష్ణాతీరంలో తెలుగు పాఠంచెప్పుకునే సత్యనారాయణ అనే ఒక పండితుడు, స్నేహితుడు ఆంజనేయులితో కలిసి దేశాటనం మొదలుపెట్టాడు. ఏమీతోచక, ఆ పర్యటనలో ఒకసారి తణుకు కొచ్చి యధాలాపంగా తిరుగుతూ, ఈ జమ్మిచెట్టుకింద రాతిపై కూర్చున్న బాలుడు, కావ్యపురుషుణ్ణి చూసాడు. దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. ఆ చిన్నిబిడ్డని ఎత్తుకున్న వెంటనే కావ్యపురుషుడి అంశ ఆయనలో ప్రవేసించింది. అంతే! ఆ అంశ ఆయనచేత ధారావాహికంగా తెలుగులో అత్యంతమధుర కవిత్వం చెప్పించింది.
నన్నయ్యయు తిక్కన్నయు
నన్నావేశించిరి పరిణాహమనస్సం
ఛన్నత వారలు పోయిన
తెన్నున మెరుగులను తీర్చి దిద్దుచు పోదున్, అని చెప్పి,
నాది వ్యవహార భాష మంథరముశైలి
తత్త్వము రసధ్వనులకు ప్రాధాన్యమిత్తు
రసము పుట్టింపగ వ్యవహారము నెరుంగ
చనును లోకమ్మువీడి రసమ్ములేదు,
అని సాధికారంగా రామాయణ కథ మనోహరమైన తెలుగు నుడికారంలో చెప్పడం మొదలుపెట్టాడు.
సరస్వతీదేవి ఆకాశగంగలో స్నానం చేసి తడిజు ట్టు అర్చుకొని ముడిపెట్టుకుంటూ చెట్టుకింద చూసింది. రాతిమీద కూచోపెట్టిన కొడుకుకనపడలేదు. కాటుక కళ్ళ కన్నీరు తుడుచుకుంటూ కొడుకుని వెతుక్కుంటూ పశ్చిమఆంధ్ర వైపు పోసాగింది. అప్పుడే ఏకశిలానగరంలో వానలులేక దుక్కి పడక అవస్థ పడుతున్న పోతనగారు కనిపించారు. ఆయన కన్నీరు కారుస్తున్న సరస్వతిని చూసి, “కాటుక కంటినీరు చనుకట్టు పయిన్ పడ ఏల ఏడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ హాటక గర్భు రాణి !”అని ఓదార్చగానే, సరస్వతీదేవి పోతనగారిని దీవించి, భాగవతకథ చిక్కని చక్కని తెలుగులో చెప్పమని ఆదేసించింది. తదుపరి, దివ్యదృష్టితో కావ్యపురుషుడి వైనం కనుక్కొని ఉత్తరకృష్ణాతీరానికి వచ్చింది.
ఇదే సమయంలో బ్రహ్మలోకంలో వేదవిజ్ఞాన వివాదం జరుగుతున్నది. ఆ వివాదానికి తగవరిగా సరస్వతి వెంటనే బ్రహ్మలోకానికి రావాలని బ్రహ్మ పురమాయించాడు. సరస్వతి కావ్యపురుషుడికి ఈ విషయం చెప్పగానే, తానూ బ్రహ్మలోకంకి వస్తానని పట్టుపట్టాడు. అప్పుడు సరస్వతి, “తండ్రి ఆనతి లేనిదే నువ్వు రాకూడదు” అని నచ్చజెప్పి, తాను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. కావ్యపురుషుడికి కోపంవచ్చింది. స్నేహితుడైన గౌరీతనయుడు కుమారస్వామితో మాట్లాడటంకూడా మానేశాడు. వెంటనే కుమారస్వామి కావ్యపురుషుడిని ప్రసన్నుని గా చెయ్యమని తన తల్లి గౌరిని ప్రార్థించాడు. పార్వతీదేవి ఆలోచించి, సాహిత్య విద్యావధువుని సృష్టించి, ఆమెతో, “ఈ కావ్యపురుషుడు నీకు భర్త అగును. ఎలాగయినాసరే అతనిని నువ్వు వశపరచుకోవాలి” అని చెప్పింది. ఆ నాటినుండి సాహిత్యవిద్య కావ్యపురుషుడి వెంబడే పోసాగింది.
కోపం తగ్గని కావ్యపురుషుడు ఉత్తరకృష్ణాతీరం నుంచి పశ్చిమఆంధ్రదేశ ప్రాంతానికి వచ్చాడు. సాహిత్యవిద్య అతని వెంబడే వచ్చింది. ఇద్దరూ తెలంగాణమనే ప్రాంతంలో పాలకుర్తి అనే ఊరికొచ్చారు. అక్కడ వీరశైవుడు సోమనాథుడనే కవిని సాహిత్యవిద్య ఆవహించి చక్కని తెలుగులో బసవపురాణం ద్విపదల్లో పాడించింది:
కాలకూటము కుత్తుకకు రాకమున్న
క్రాలుపురంబులు కాలకమున్న
గౌరి వివాహంబు గాకటమున్న…
…ఇట నీవు నా స్వామి నేను నీ బంట…
అని సోమనాథుడు బసవ తత్త్వం చెప్పాడు. కావ్యపురుషుడు ఈ ఛందస్సుని మెచ్చాడు. తెలంగాణ్య వాక్యవిన్యాసం, ఆ రీతి ఆతనికి బాగా నచ్చాయి. కోపం కూడా కాస్త తగ్గింది.
తరువాత, కావ్యపురుషుడు కావేరి పెన్నా నదుల మధ్య నున్న ఆంధ్ర దేశానికి వచ్చాడు. సాహిత్యవిద్య అతనిని అనుసరించి వచ్చింది. అక్కడ కడప అనే గ్రామానికొచ్చారు. అక్కడ సాహిత్యవిద్య వైష్ణవుడు నారాయణచార్యులవారిని ఆవహించింది. వెంటనే ఆయన ఆశువుగా శివతాండవం ఆలాపించడం మొదలుపెట్టాడు.
ఏమానందము భూమీ తలమున!
శివతాండవమట! శివలాస్యంబట!
అలలై, బంగరు కలలై, పగడపు బులుగుల వలె …అంటూ!
ఈ ఉపమలు, ఈ అలంకారాలు, ఈ శబ్దాల కూర్పు, ఈ దేశ పద్ధతి కావ్యపురుషుడికి ఎంతో నచ్చాయి. సాహిత్యవిద్య కి ప్రసన్నుడవుతున్నాడు.
ఇంకొంచెం దక్షిణానికెళ్ళితే, సాహిత్యవిద్య వచనం అత్యంతసుందరంగా వినిపించేట్టు చేసింది. అక్కడి బట్టల కట్టు లాగానే కథలు సొబగు కూడాను.
“బక్కత్త మా గడపట్లో కూచ్చొని సంగటి తింటా తింటా వుండిదల్లా, ” సినబ్బా! లోటాతో అన్ని నీళ్ళు తేరా! అనడిగింది, ” నన్నుఒకాడది ఇంతమొగోణ్ణి – మొగోడనికూడా తలవకుండా నీళ్ళు తెమ్మనేదేంది, లేచి తెచ్చుకోలేదా అంజెప్పి నా పెళ్ళనికి బారడు పొడుగొచ్చింది కోపం” అని చెప్పించింది నామిని నాయుడు చేత, కూచ్చుంటే కత, లేస్తే కత అంటూ!
ఈ వచనం కావ్యపురుషుడికి నోట్లోపెట్టుకోగానే కరిగిపోయే పీచుమిఠాయిలా ఉంది. సాహిత్యవిద్యకి మరికొంచెం చేరువయ్యాడు. కావ్యపురుషుడు అక్కడనుంచి గోదావరికి ఉత్తరాపథంగా పోసాగాడు. పోయిపోయి విశాఖ దగ్గిరకి రాగానే, సాహిత్యవిద్య శ్రీనివాసుణ్ణి పూర్తిగా ఆవహించించింది. ఆయన పదాల్ని కదను తొక్కించాడిలా:
మరో ప్రపంచం,
మరో ప్రపంచం
మరోప్రపంచం పిలిచింది!
పదండిముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం పోదం పైపైకి! —
ఇంత చక్కని సంస్కృత ఛందం తెలుగు లోకి తెప్పించి మెప్పించిన సాహితీవిద్య పై కావ్యపురుషుడికి అనురాగం మరికాస్త పెరిగింది. ఉత్తరాంధ్ర వారి చేష్టవేషవాక్యవిన్యాస క్రమాలు కావ్యపురుషుడికి కి చాలా బాగా నచ్చాయి. సాహిత్యవిద్య వెంటనే విశ్వనాథ శాస్త్రిని ఆవహించి విశాఖవచనం చెప్పించింది.
…నరకం ఎలా వుంటుంది?
చీకటిగా చీకటిగా ….
పైన భగ్గున మండే సూర్యుడు.
బైట ఫెళ్ళున కాసే ఎండ.
పులి కోరలా, పాము పడగలా.
నరకం ఎలాఉంటుంది? పులితో పాముతో చీకటిగా …
వచనానికీ కవితకీ మధ్య ఒక పల్చనిఉల్లిపిరికాగితపుతెర మాత్రవే నని సాహిత్యవిద్య రాచకొండ ద్వారా మరోసారి రుజువు చేసింది. ఇంకొంచెం ఉత్తరానికెడితే పూసపాటిని ఆవహించిన సాహిత్య విద్య, “గరువుమీద పాకలో దాచుకొన్న తాటిబురికెలను అంబటి తట్టలో పేర్చుకొని పొయ్యేళ అయిపోయిందని” జడుపడ్డ సీతాలు చేత చెప్పించింది.
ఇలా సమాసరహితంగా అలతి అలతి పదాలతో రసోత్పాదన చెయ్యడం ఈ విశాలాంధ్ర దేశ సాహిత్యం లోనే సాధ్యం. కావ్యపురుషుడుకి ఇక్కడే సాహిత్యవిద్యతో గాంధర్వవివాహం జరిగింది. ఇద్దరూ కలిసి హిమాలయాలమీద ఉన్న సరస్వతి, పార్వతుల దగ్గిరకి వెళ్ళారు, ఆశీస్సులకోసం. అంతే! ఇంతవరకూ తిరిగిరాలేదు.
తరవాత కొన్నాళ్ళపాటు ఆంధ్రదేశంలో వివిధ సాహిత్యరీతులు సహనంతో సమానగౌరవంతో కలసిమెలసి మెలగాయి. పోనుపోను ప్రతివ్యక్తికీ అలవడ్డ వాగ్విన్యాసాలు వేఱు వేఱు అయి, అంతులేని సాహితీ పద్ధతులు మొలకెత్తాయి. అది కొంత కలవరం లేవదీసింది. మాపద్ధతి మెరుగంటే, కాదు కాదు మాపద్ధతి మెరుగని, వివాదాలూ ఘర్షణలూ మొదలయ్యాయి. సాహిత్యంలో దుమారాలు లేచాయి. దానితో ముఠా రాజకీయాలు ప్రబలిపోయినాయి. సాహిత్యం అడుగంటి పోయింది.
రుచి, గతి, మార్గం, పద్ధతి, రచన, శైలి ఇవన్నీ రీతికి పర్యాయపదాలే. ఇవన్నీ దేశకాలజనితాలన్న విషయం మరుగున పడిపోయింది. ” దేశరుచ్యా వచోన్యాసో రీతి రిత్యభిధీయతే, ” అన్న లాక్షణిక వాక్యం మరుగునపెట్టి, కీచులాటసాహిత్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం ఆనవాయితీగా తయారయ్యింది. ఈ పద్ధతి ఉదాత్తమని, మరో శైలి అసంగతమనీ కుహనాసాహితీకారులు ప్రోత్సహించడంతో, తెలుగు సాహిత్యంలో ముసలం పుట్టింది.
“కావ్య రీతులలో ఒకదానితో మరొకటి పోల్చి చూస్తే సూక్ష్మమైన భేదాలు ఉంటాయి. ఈ సూక్ష్మమైన వాక్యవిన్యాస భేదాలు ఇన్ని అని విడమర్చి చెప్పటం శక్యం కాదు. చెఱుకురసం, బెల్లం, పాలు, ఇవన్నీ మధురమైన పదార్థాలే. దేని రుచి దానిదే. దేని తీపి దానిదే. ఈ మాధుర్యంలో భేదం మాటల్లో చెప్పడం సరస్వతికికూడా శక్యం కాదు” అని “దండించి” పదేపదే చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అయ్యింది.
మరోసారి కావ్యపురుషుడు, సాహిత్యవిద్య మన ప్రాంతాలకి వచ్చేవరకూ ఈ కీచులాట మనకి తప్పదు కాబోలు!
(రాజశేఖరుడు రాసిన కావ్య మీమాంసలో మూడవ అధ్యాయం కావ్యపురుషోత్పత్తి కథ. నా తెలుగు రూపక కథ ఆ సంస్కృత కథకి స్వేచ్ఛానుకరణం. అనువాదం కాదు. ప్రతిబింబం అసలే కాదు. పోతే, వృత్తి, ప్రవృత్తి, రీతి అనే ఆలంకారిక విషయాలగురించి వివరంగా తెలుసుకోవాలంటే, దండి రాసిన కావ్యాదర్శము, విద్యానాథుని ప్రతాపరుద్రీయం, ముమ్మటుడి కావ్యప్రకాశము, ఆనందవర్థనుడి ధ్వన్యా లోకం, రాజశేఖరుడి కావ్యమీమాంసా సంప్రదించండి.)