నీటి అద్దాలు

రోడ్డు వారగా పగిలిన నీటి అద్దాలపై
కాలు మోపి ఆకాశంలోకి,
అలా తెలి మబ్బుల మీదకి
జారిపోయిన ఆ బాల్యం లేదిప్పుడు

రెండుచక్రాల విమానమెక్కి
రెక్కలు విప్పి, బార్లు గాలికొదిలేసి
విసురుగా నీటి అద్దాల్ని ఛేదిస్తూ
నేలమీదే ఎగిరిన ఆ కుర్రతనమూ లేదు

జవరాలి ధ్యాసలో పడి
జగత్తునే మరిచిపోయి,
ఆమె వెనకే నడుస్తూ
బాటేదో, ఊటేదో కానక,
చెమ్మగిల్లిన పాదాలతో ఆమెని
కోవెలదాకా సాగనంపిన
ఆ యవ్వనమూ లేదు

కాళ్ళదగ్గరి కూరలసంచీ
పడిపోకుండా బ్రేకులేస్తూ,
పల్లం రాగానే పెట్రోలు ఆదాకోసం
ఇంజనాపుచేస్తూ,

వడుపుగా నీటిగుంటల్ని తప్పించుకుంటూ,
బండితో ఇల్లు జేరిన ఆ పెద్దరికమూ లేదు

నీటిపై రాలిన దేవకాంచనాలని
వంగలేక వంగలేక వంగి ఏరుకొని,
ఇంటికెళ్ళి ఈశ్వరుడికర్పించిన
వృద్ధాప్యపు వైనమూ లేదు

ఉన్నదల్లా
భూమ్యాకాశాల మధ్య ఊగిసలాడుతూ
వింతపల్లకి నెక్కి వీధులేగుతున్న అతనూ
విరుల దండను కప్పి, వినువీధినూరేగిస్తూ
వీడ్కోలు చెబుతున్న ఆ నీటి అద్దాలూ


శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...