పేరులేదు

గులాబీ పూలు కాదుకదా కనీసం గరిక పూలు
కూడా నా మనసులో విచ్చుకోవటం లేదు
తుళ్ళుతూ పారే సెలయేర్లేవీ నా గుండెలో జాలువారటం లేదు
వాటి పాటల తాలూకు స్వరాలేవీ నా మనసుకెక్కటంలేదు
సంధ్యతో కబుర్లు చెబుతున్న ఆకాశం నా కళ్ళకానటం లేదు
పడీ పడని ఈ చిరు జల్లుల వర్షం నా మెదళ్ళో ఏ ఙ్ఞాపకాలనీ గెలకటం లేదు
చక్కనైన ఊహలతో, అందవైన పదాలతో, బతుకులో సన్న జీరలాటి
భావుకతని ఆకాశంలా అల్లుకున్నాను, బతుకునిండా పరచుకున్నాను
ఏవిటివాళ ఆ ఆకాశం పెళుసుతేలి పఠపఠమని పగిలిపోతుంది
పదాలతో నింపుకున్న ఆ అందవంతా ఇగిరిపోతుంది
వాస్తవం కత్తిలా నా మనసులో పొడుస్తుంది
ఏవి చెయ్యను గుట్టలు గుట్టలు గా పడున్న ఈ పదాల్ని
అందవైన ఈ పదాల్ని, సున్నితవైన ఈ పదాల్ని
అందంకోసవే సృష్టించబడిన తళతళలాడే తళుకుళ్ళాంటి ఈ పదాల్ని
ఏంచేయను ఈ చక్కచక్కని ఊహల్ని, సున్నితవైన ఈ ఊహల్ని
గుండెనిండా శూన్యం నింపుకొని ఎంత ఎత్తుగా ఎగురుతాయోకదా
మంచి పసందైన సురని నరనరాన నింపి
వాస్తవాన్ని ఎంత చక్కగా చంపుతాయో కదా
ఈ పదాలు, ఈ ఊహలే కదా బతుకుని
ఈ మత్తుమందు లాంటి భావుకతతో నింపింది
నా కవితకి ఈ జిలుగు కలల ఆల్కెమిని నేర్పించింది
శవాల గుట్టలముందు కూర్చొనికూడా
ఉషాదేవిని అలింగనం చెయ్యటం ఎలాగో చూపించింది
అయ్యో దేవుడా ఇప్పుడెలాగ? ఈ రక్తపు సుడిగుండంలో
పాటలుపాడే సెలఏర్లని నేనిప్పుడేలా సృష్టించను?
కళ్ళముందు జిగేల్మని మెరుస్తున్న ఈ జీవన వాస్తవికతని
నేనే చలువ కళ్ళద్దాలతో స్వాంతన పరచను?
ఏ మెట్ట వేదాంతంతో, ఏ కర్మ సిద్దాంతంతో నా రంగుల కుంచెని తడపను?
ఎముకలు తప్ప గుండెలెండిపోయి బిడ్డని పోగొట్టున్న తల్లికి
నాట్యం చేసే ఏ వాన చినుకుని చూపించను?
ఏ ప్రియురాలి విరహ బాధని గూర్చి వెచ్చవెచ్చగా కథలు చెప్పను?
తొడలమద్య పుండైపోయినా అన్నం కోసం పైట జార్చే చెల్లికి
అప్పులు తప్ప కుప్పలు మిగలని రైతుకీ ఏ వెన్నెల గురించి చెప్పను?
ఏ పువ్వులూ, ఏ ఆకులు, ఏ సెలయేళ్ళు, ఏ అకాశాలని చూపించను?
ఏ వసంతం గురించి, ఏ అర్థంలేని ఆశలని నూరిపోయను?
అందవైన, అసంగతమైన, ఈ మత్తుమందుని
ఈ భావుకత తెరని ప్రపంచం చుట్టూ ఎలా చుట్టను?
దేవుడా, పగలు పొద్దస్తం నా మనసులో ఈ అబద్దాల కోటలెలా కట్టను?