నేటి భారతీయ భాషాశాస్త్రవేత్తల్లో, మౌలిక భాషా పరిశోధకుల్లో, ఆధునిక నిఘంటు నిర్మాతల్లో అగ్రగణ్యులయి ప్రపంచప్రఖ్యాతి పొందిన ఒకే ఒక్కరు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. గిడుగు గురజాడల వారసులుగా వ్యావహారిక భాషోద్యమ లక్ష్యాన్ని, సర్వోన్నత విద్యాస్థాయివరకు విస్తరింపజేసి కృతకృత్యులయి తెలుగు భాష సమగ్రాభివృద్ధికి బహు విధాలుగా కృషి చేసిన – ఇప్పటికీ ఎంతో కృషి చేస్తున్న – భద్రిరాజు వారు సి. పి. బ్రౌన్ అకాడమి “తెలుగు భారతి” తొలి పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం.
కృష్ణమూర్తిగారు 1928 జూన్ 19వ తేదీన ఒంగోలులో జన్మించారు. తల్లి భారతమ్మ గారు, తండ్రి సుబ్రహ్మణ్యం గారు, భార్య శ్యామల గారు. భద్రిరాజు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, తెలుగులో బి.ఏ.(ఆనర్స్) తో పట్టభద్రులై అక్కడే అధ్యాపకులుగా నియుక్తులయ్యారు. ఆ తరువాత అమెరికా వెళ్ళి యూనివర్సిటి ఆఫ్ పెన్సిల్వేనియాలో భాషాశాస్త్రంలో స్నాతకోత్తర స్థాయి పట్టా పొంది (1955), తెలుగు క్రియా ప్రాతిపదికల మీద పరిశోధన చేసి పిహెచ్.డి. డిగ్రీ అందుకున్నారు (1957). తిరిగి వచ్చిన తరువాత శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రీడర్‌గా పని చేసిన మీదట, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర స్థాపకాచార్యులుగా ప్రవేశించారు (1962). ఆనాడే వారు దానికి గట్టి పునాది వేసి ఉన్నత భాషా శాస్త్ర అధ్యయన కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఫేకల్టి ఆఫ్ ఆర్ట్స్ డీన్‌గా (1973-76), యూనివెర్సిటీ సిండికేట్ సభ్యులుగా (1971-75), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసర్చ్ దక్షిణప్రాంతీయ కేంద్ర గౌరవ సంచాలకులుగా (1978-1982) వారు వివిధ పదవులను సమర్థంగా నిర్వహించారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలరుగా ఏడేళ్ళు పని చేసి (1986-93) దాని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డారు. అటు మీదట అదే విశ్వవిద్యాలయంలో ఆరేళ్ళ పాటు గౌరవాచార్యులుగా ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో గౌరవాచార్యులుగా ఇప్పటికీ వారికి సంబంధం ఉంది.
అనేక విదేశీయ విద్యాలయాలు, అమెరికా, జపాన్, జర్మనీ, రష్యా వంటి దేశాల్లోని సంస్థలూ, భద్రిరాజు వారిని ఆచార్య పదవితో ఆహ్వానించాయి. వాటిలో స్టాన్‌ఫర్డ్‌లోని సెంటర్ ఫర్ ఆడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ద బిహేవియరల్ సైన్సెస్, ప్రిన్స్టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ, జర్మనీలోని (లీప్‌జిగ్) మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇవల్యూషనరీ ఆంత్రొపాలజీ ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి. వీటికి తోడు కృష్ణమూర్తిగారి విశిష్టతను సూచించే విధంగా అనేక పదవీ గౌరవాలు వారికి దక్కాయి. లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియాకు, ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్‌కు అధ్యక్ష పదవులు, లింగ్విస్టిక్ సొసైటీ అఫ్ అమెరికా వరిష్ఠ గౌరవ సభ్యత్వం, డిల్లీలోని సాహిత్య అకాడమి కార్యనిర్వాహక వర్గ సభ్యత్వం, తరువాత సదస్యత (ఫెల్లోషిప్) మాత్రమే కాక యునైటెడ్ కిండంలోని రాయల్ సొసైటీ అఫ్ ఎడింబర్ వరిష్ఠ విశిష్ట సభ్యత్వం కూడా ఈ సందర్భంలో చెప్పుకోదగ్గది. 2004లో మొత్తం భారతీయుల్లో ఈ గౌరవాన్ని పొందినవారు భద్రిరాజు కృష్ణమూర్తిగారొక్కరే.
కొత్త డిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రిసర్చ్‌లో తెలుగు అకాడమి (హైదరాబాదు), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారన్ లాంగ్వేజస్ (హైదరాబాదు) వంటి సంస్థల పాలక మండళ్ళలో, అమెరికన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియన్ స్టడీస్ (కొత్త డిల్లీ) తాలూకు ఇండియన్ అడ్వైజరీ కమిటీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (హైదరాబాదు) భారత ప్రభుత్వపు ప్రణాళికా సంఘంలోని వర్కింగ్ గ్రూప్ అఫ్ లాంగ్వేజస్ లోను వీరు సభ్యులు. తెలుగు ధ్వనుల ఉచ్చారణ గురించి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్‌లో వీరు చేసిన కృషి విశిష్టమయినది. దేశవిదేశాల్లోని అనేక ఉన్నత విద్వత్ సంస్థల నుండి ఇంత గుర్తింపూ ఇన్ని గౌరవాలూ పొందిన వారు కోట్ల మందికి ఒక్కరుండటం అరుదు! అంతటి మాన్యత నందిన కృష్ణమూర్తిగారి మహత్తర కృషి వారు రచించిన వివిధ గ్రంథాల్లో పరిశోధనా వ్యాసాల్లో ప్రస్ఫుటమవుతుంది.
ఇప్పటి వరకు భద్రిరాజు వారు తెలుగులోను, ఇంగ్లిషులోను ప్రచురించినవి 25 గ్రంథాలూ, నూటికి పైగా పరిశోధన వ్యాసాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఇంగ్లిష్ పుస్తకాలు:
- Telugu Verbal Bases: A Comparative and Descriptive Study
(Berkeley: University of California Press, 1961) - Konda or Kubi: A Dravidian Language (Hyderabad: Government of Andhra Pradesh, 1969)
- A Grammar of Modern Telugu (with J. P. L. Gwynn) (Delhi: Oxford, 1985)
- Language, Education and Society (New Delhi: Sage 1996)
- Comparative Dravidian Linguistics: Current Perspectives (UK: Oxford 2001)
- The Dravidian Languages (UK Cambridge University Press, 2003)
- Gold Nuggets: An Anthology of Selected Post-independence of Telugu Short Stories in English (Translations) (ed with C. Vijayasree)
కృష్ణమూర్తిగారు తెలుగులో ప్రచురించిన గ్రంథాల్లో ఆరింటికి సంపాదకత్వం వహించారు:
- మాండలిక వృత్తిపదకోశం (తొలి సంపుటం) – వ్యవసాయ పదాలు (1962)
- మాండలిక వృత్తిపదకోశం (రెండో సంపుటం) – చేనేత పదాలు (1971)
- తిక్కన పదప్రయోగకోశం – మూడు సంపుటాలు (1971, 1974, 1977) (మరో ఇద్దరు సంపాదకులతో కలిసి)
- తెలుగు భాషా చరిత్ర (1974 – తరువాత ఏడెనిమిది సార్లు పునర్ముద్రణ అయింది)
వీరు స్వయంగా రచించినవి:
- జనవాచకం – ఐదు పుస్తకాలు (ఈశ్వరరెడ్డిగారితో కలిసి) (1980)
- తేలిక తెలుగు వాచకం – రెండు భాగాలు (1993)
- చిన్ననాటి పద్యాలు (1998)
- భాషా-సమాజం-సంస్కృతి (1999) ఈ గ్రంథంలోని వ్యాసాలన్నీ సామాజిక భాషా శాస్త్ర సంబంధమయినవి.
భద్రిరాజు కృష్ణమూర్తిగారు దాదాపు ఆరు దశాబ్దాల నుంచి నిర్విరామంగా చేస్తూ వచ్చిన అసదృశమయిన కృషిలో వారి ఘనతను నిరూపించే విశిష్టతలు అనేకం దీపిస్తాయి. భారతదేశం మొత్తం మీద తొలిసారిగా విదేశాల్లో భాషాశాస్త్రాధ్యనం చేసి పరిశోధన కావించారు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. భాషాశాస్త్ర సిద్ధాంతాల అనువర్తనం గాని, వివిధ కోణాల్లో భాషాధ్యయనం గాని, భారతీయ భాషల్లో మరో భాషలోనూ జరగనంత కృషి తెలుగు జరగడానికి ప్రధాన కారకులు వీరే. దక్షిణాసియా భాషల్లో ఆధునిక భాషా శాస్త్ర పద్ధతిలో వృత్తిపదకోశాల నిర్మాణం తొలిసారిగా తెలుగులోనే జరగడానికి కారకులు వీరు. తెలుగులోని ఆధునిక భాషా మండలాలను వర్గమాండలికాల స్వరూపాన్ని తొలిసారి శాస్త్రీయంగా నిరూపించిన వారూ, ప్రమాణ భాషా లక్షణాలనూ ప్రయోజనాలనూ నిర్దిష్టంగా నిర్వచించి స్పష్టపరిచిన వారు కృష్ణమూర్తిగారు. అన్ని స్థాయిల పాఠ్య పుస్తకాల్లోను వాడుక భాషను ప్రవేశపెట్టడానికి జరిగిన ప్రయత్నంలో సఫలత సాధించి సత్ఫలితాలు చూపించారు. విదేశీయులకు, వివిధ భాషీయులకు ఇంగ్లీష్ ద్వారా తెలుగు బోధించడానికి సాధన సామగ్రిని తయారు చేశారు. తెలుగు-ఇంగ్లీష్ నిఘంటు నిర్మాణానికి పూనుకున్నారు. తెలుగు అకాడమి చేపట్టిన సామాజిక భాషా పరిశీలన పథకానికి స్వరూప స్వభావాలను, విధివిధానాలు నిర్ణయించారు. ఆధునికమైన తెలుగు భాషకు ఇంగ్లీషులో (గ్విన్ గారితో కలిసి) వ్యాకరణ గ్రంథం రచించారు. భాషాయోజనావశ్యకతను, భాషాభివృద్ధి వ్యూహాలను విపులంగా చర్చించారు. తెలుగులోనూ ఇతర భారతీయ భాషల్లోను ప్రతికా భాషలో కనిపించే నూతన పద కల్పన విధానాలను పరిశీలించడానికి వీరు దేశంలో ప్రప్రథమంగా ఒక జాతీయ సదస్సు నిర్వహించి దాని ఫలితాలను పుస్తకరూపంలో ప్రచురించారు. దీని ప్రేరణవల్ల పత్రికాభాష ఒక ప్రత్యేక పరిశోధన రంగంగా దేశంలో విస్తరించింది. చదువురాని వయోజనులకు తెలుగు నేర్పడానికి తగిన పుస్తకాలను శాస్త్రీయంగా తయారు చేశారు.
భాషాపరంగా బహుముఖమైన కృషి ఒక్క చేతిమీద జరిపి పట్టువదలని విక్రమార్కులు అనిపించుకున్నారు. తెలుగు వ్యాకరణం, మాండలిక భాషలు, నిఘంటు నిర్మాణం, అక్షరాస్యతా వ్యాపనం, ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనం వంటి విషయాల్లో కృష్ణమూర్తిగారిది మార్గదర్శకమైన కృషి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమకాలీన ప్రముఖ భాషావేత్తల మన్ననలందుకున్న భద్రిరాజువారు “కృష్ణమూర్తిర్ భారతస్య సుమహత్ గర్వకారణం” అన్ని ప్రశంసకు అన్ని విధాలా అర్హులు. భాషాశాస్త్ర రంగంలో మహత్తరమైన కృషి చేసినందుకు భద్రిరాజు కృష్ణమూర్తిగారిని అభినందిస్తూ సి.పి. బ్రౌన్ అకాడమి, “తెలుగు భారతి” పురస్కారాన్ని ఆనందంతో అందజేస్తున్నది.