కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు

చార్లెస్ బాబేజ్
వికీపీడియా సౌజన్యంతో

‘పుస్తకం హస్తభూషణం’ అని పెద్దలన్నారు కాని ఆ గౌరవం పుస్తకానికన్నా ఎక్కువగా దక్కింది చేతి గడియారానికేనని అందరూ ఒప్పుకుంటారనుకుంటాను. “గడియారపు చేతులు ఇచ్చే ఆజ్ఞలకు లొంగి / జీవన పందెంలో పరుగులెత్తే మనుషులు / ఋషులు కారు” అని మందలించాడో ఆధునిక కవి. ఋషుల సంగతేమోకాని కొన్ని శతాబ్దాలగా గడియారం మానవుల జీవితాన్ని శాసించింది. వల్లభరాయడో శ్రీనాథుడో పదిహేనో శతాబ్దంలో రాసిన క్రీడాభిరామం లో ఓరుగల్లు వీధుల్లో తిరుగుతూ నగర విశేషాలని వర్ణిస్తున్న మిత్రులలో ఒకడు గడియారం గంటకొట్టడం తోటే మధ్యాహ్న భోజనానికి వెళ్ళాలంటాడు:

“ఉడువీథిన్ శిఖరావలంబియగు నంధ్రోర్వీశు మోసాలపై
గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్ ఘంటా ఘణత్కారముల్
సడలెన్ భానుడు పశ్చిమంబునకు వైశ్యా! పూటకూటింటికిన్
కడువుం బోదమె లెక్క యిచ్చి? కడు నాకొన్నార మిప్పట్టునన్.”

అది నీటి గడియారమయుండాలి. వ్యాపారం కోసం నౌకాయానం చేసి మన దేశం వచ్చిన యూరోపియన్లు మన రాజుల్ని సందర్శించినప్పుడు బహుమతులుగా బైబిలూ, స్ప్రింగు గడియారమూ ఇస్తే మన వాళ్ళు అలంకరణలుగా ఉంచుకున్నారు కానీ, అవి ఎలా తయారుచేశారన్న జిజ్ఞాసే చూపెట్టలేదు. ప్రభువుల పోషణ లేకా, పండితుల ధ్యాస పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచం మీదకి మళ్ళడంవలనా, చేతిపని నిపుణులు నిరక్షరాస్యులవడం వలనా – ఇలా అనేక కారణాలవల్ల, ఒకప్పుడు విజ్ఞానశాస్త్రాలకి పుట్టినిల్లయిన మన దేశంలో పదహారో శతాబ్దం నాటికి స్తబ్ధత పెరిగి చీకటి చిమ్ముకుంది. యూరప్‌లో శాస్త్రజ్ఞానంతో మనుగడని సుఖమయం చేసుకోవచ్చనే ధ్యాస పెరగసాగింది.

పుస్తకాలు, గడియారాలు, నౌకాయానాలు, నేత మగ్గాలు – వీటన్నిటి సాంకేతిక జ్ఞానాన్ని కలిపి రూపొందించిన గణన యంత్రాలు – ఆధునిక కంప్యూటర్లకి పూర్వగాములు. ఆ యంత్రాలనీ, జీవితాంతమూ వాటి నిర్మాణంలో గడిపిన పదునెనిమిదో శతాబ్దపు “ముక్కోపి మేధావి” ఛార్లెస్ బాబేజ్‌నీ (Charles Babbage) పరిచయం చెయ్యడానికే ఈవ్యాసం. ముందర ఆ యంత్రాలతో బాబేజ్ సాధించాలనుకున్న సమస్యల నేపథ్యాన్ని తెలుసుకుందాం.