(న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి వెలువరించే “తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక కవితల పోటీలో ప్రత్యేకబహుమతి పొందిన కవిత)
ఆ నేలమీద కాలు మోపగానే పాదాల్లో కొత్త ఉత్తేజం
వీధుల్నిండా పురిటిగడ్డ పరిమళం
ఆరేళ్ళ తర్వాత డాలర్ దేహాన్నొదిలి అమ్మ ఒడిలోకి
కంప్యూటర్ కంచె లోంచి కన్నతల్లి నీడలోకి
బస్టాండు నుంచీ ఇంటిదాకా ఎన్నెన్ని పలకరింపుల హారతులో
నన్ను చూడగానే అమ్మ నా ముద్దుల కూతురయ్యింది
నేను నాన్ననయ్యాను గారాలు పొయ్యాను
బురద కాళ్ళతో పేద చేతుల్తో పరుగెత్తుకొచ్చిన నాన్న
నన్ను లేగదూడలా చూశాడు ఒళ్ళంతా నిమిరాడు
వోణీలు మానేసిన చెల్లి చీరతో దర్శన మిచ్చింది
పదహారణాల తెలుగుతనాన్ని నా ముందు కుప్పపోసింది
తులసి కోట చుట్టూ తిరగడం ఆపేసి
చకచకా వచ్చి ఎర్రనీళ్ళతో దిష్టితీసింది బామ్మ
పప్పు – గోంగూర, పెరుగన్నం – ఆవకాయలతో
నాలుక మీది చికెన్ కంపును కడిగేసింది అమ్మ
బజారు కెళ్ళగానే డిగ్రీ దాకా కలిసి తిరిగిన నేస్తాలు
కుశల ప్రశ్నల దడికట్టేసి ఉక్కిరిబిక్కిరి చేశారు
వెన్నెల రాత్రిలో ఏటి ఒడ్డున భేటీ ఏర్పాటు చేశారు
అప్పుడెప్పుడో అక్కడి ఇసుకలో గుచ్చిన
కబడ్డీ కూతల గవ్వల్ని ఏరుకున్నాను
ఈత నేర్చుకునే కొత్తలో కాళ్ళూ చేతుల్తో చేసిన
“తపతప” ల సంగీతాన్ని నాలోకి పిండుకున్నాను
బడి ఎగ్గొట్టి నిర్మించుకున్న
పిచ్చుక గూళ్ళ ఆనవాళ్ళ కోసం అన్వేషించాను
నాలోని కంప్యూటర్ కమాండ్లన్నిటినీ
పడమటింట్లోని పత్తిమండె పీల్చేసింది
స్వఛ్ఛమైన బతుకు చిత్రాన్ని నా కళ్ళకు వేలాడ దీసింది
ఇ-మెయిళ్ళ కంపూ, కాకుంటే డాలర్ల డాబూ తప్ప
ఇన్నాళ్ళూ మనసులోంచి ఎప్పుడైనా మట్టివాసన కొట్టిందా?
ఇక ఈ పరిమళాన్ని ఒదులుకోను!
అమ్మ చిటికెన వేలు అసలే వదలను!!