కలగంటున్నానా
కలగంటున్నట్లు కలగంటున్నానా
నిద్ర పట్టక గింజుకుంటున్నానా
నిద్ర పట్టక గింజుకుంటున్నట్లు
కలగంటున్నానా
సంతలో గడ్డిబండి చక్రం పక్కన
దిగాలుగా కూర్చుని ఎవరో బక్క రైతు
నాకేసి చూస్తూ చూస్తూనే
చూపుల వడిసెల వడిగా తిప్పి
నా ప్రాణాల్ని దిగంతాలకు విసిరేశాడు
ఎదో ఒక అమూర్త చిత్రం రంగుల వలయంలో
దారి తప్పి దప్పికతో తిరుగుతోంది కన్ను
బడి నుంచి ఇంటికి బస్సులో వెళ్ళడానికి
డబ్బుల్లేని కుర్రాడొకడు
దూసుకుపోతున్నాననే స్పృహ లేకుండా
ఎటో దూసుకుపోతున్నాడు
హుసేన్ సాగర్ నీళ్ళ మధ్య నిద్రపోని బుద్ధుడు
ఎందుకంత చలేసిందో గాని
తన రాతి దుప్పటిని మరింత దగ్గరికి లాక్కుని
అంతకంతకు దిగువకు ముడుచుకుపోయాడు
ప్రమాదానికి ప్రమోదానికి
తేడా తెలియని అప్పుడెప్పుడో
సబ్బునురగతో వూది వదిలిన
బుడగల మీద నేనూ మరెవరో
ట్వింకిల్ ట్వింకిళ్ళుగా ఆకాశాన్ని వెక్కిరిస్తూ
వేడి వేడి ఇరానీ తేనీటి పొగల్లో
తేలిపోతున్నదొక ప్రాచీన యువ నగరం
ఎన్నెన్నో ప్రశ్నలు అన్నింటికి జవాబుగా
ఔనుకు కాదుకు మధ్య ఖాళీ స్థలంలో
అనాదిగా వూగుతున్న లోలక నిశ్శబ్దం
రెండు దిక్ శిఖరాల మధ్య
గాలిలో నిటారుగా నడిచే
సర్కస్ పిల్ల పాదాల కింద
భయం భయంగా కదుల్తున్న తీగె
నిద్రకు మెలకువకు మధ్య
కొనలు కొనలుగా సాగుతున్న సన్నని రేఖ
చాల పల్చని ఎరుపు నీలం చారలతో
పటం కట్టిన అలల్లేని సముద్రం
నల్లగానే కాదు తెల్లగానూ ఉంటుంది చీకటి
రాకాసి చెయ్యిలా
అంతరిక్షం అంచులు తాకుతూ
విమానం రెక్క
అందీ అందక దాన్ని కవ్విస్తూ ఒక నక్షత్రం
టాంటలస్ నోటి దగ్గర ద్రాక్షపళ్ళ గుత్తి
రెక్క మీద NO STEPS అని రాసివున్న హెచ్చరిక
కిటికీ అద్దం కోసేసి అక్కడ అడుగేయాలని కోరిక
దృశ్యానికి శబ్దానికి మధ్య
స్థలానికి కాలానికి మధ్య
స్పృహకు నిస్పృహకు మధ్య వూగుతూ నేను
తనను తాను కామించి
తనతో రమించి
తనను తానే కంటూ ఆ తెల్లారగట్ట రాత్రి