ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక

[ఇది వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా ఈమాట ప్రత్యేక సంచిక. ఈ నెలలో ప్రతి సోమవారమూ వ్యవహారిక-గ్రాంధిక భాషా వాదాల చరిత్రను తెలిపే కొన్ని ముఖ్యమైన పాతవ్యాసాలను, వాటికి అనుబంధంగా “వాడుక భాష, రచనా భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష” అన్న అంశాలపై వినూత్న దృక్పథాన్ని ప్రతిపాదించే పరిశోధనాత్మకమైన వ్యాసాలను ప్రచురించబోతున్నాము. జూన్ 19 న ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి ఎనభయ్యవ జన్మదిన సందర్భంగా ఈ ప్రత్యేక సంచికను పూర్తిగా విడుదల చేయాలని మా సంకల్పం. — సంపాదకులు]

వంద సంవత్సరాల క్రితం …

సరిగ్గా వంద సంవత్సరాల క్రితం, 1908 లో ఆస్ట్రియా బాస్నియాను తమ దేశంలో భాగంగా కలిపేసుకుంటున్నట్టు ప్రకటించడంతో చెలరేగిన సంక్షోభం తరువాతి దశాబ్దంలో (1914-1918) మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. సరిగ్గా 1908లోనే, విశాఖపట్నంలో ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారు, ఉత్తరకోస్తాజిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా ఉన్న జె. ఏ. యేట్సు అనే ఇంగ్లీషుదొర తో కలిసి, స్థాపించిన Telugu Teaching Reform Society, ఆ తరువాతి దశాబ్దంలో (1911-19) తెలుగు భాషా పండితుల మధ్య ఒక మహా సంగ్రామమే చెలరేగడానికి కారణభూతమయ్యింది.

ఈ మహా సంగ్రామంలో అరవం మాతృభాషగా గల పి.టి. శ్రీనివాస అయ్యంగారు, ఆంగ్లేయుడైన జె. ఏ. యేట్సు దొర గారు, హుణ విద్యాభ్యాస మొనర్చి ఆంగ్ల భాషాభిమానులైన గిడుగు, గురజాడలు ఒకవైపు; సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులైన జయంతి రామయ్య పంతులు, వావిలకొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి , కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి పండితలోకమంతా మరోవైపు. మద్రాసు విశ్వవిద్యాలయం సెనేటులో సభ్యత్వం ఉన్న గిడుగు, గురజాడల కారణంగా స్కూలుఫైనల్‌ లో వ్యాసరచన కావ్యభాషలో గాని ఆధునికభాషలో గాని రాయవచ్చునని స్కూలుఫైనల్‌ బోర్డు జీవో విడుదల చేయడంతో తెలుగు భాషకు మహాపకారం జరుగుతున్నదని పండితుల్లో అలజడి బయలుదేరింది. తెలుగు దేశం అంతటా సభలుపెట్టి స్కూలు పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు. జయంతి రామయ్య పంతులుగారి అధ్యక్షతన కాకినాడలో ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు ‘ స్థాపించారు. తమ ఆశయాలను ప్రచారం చెయ్యడానికి ‘ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక ‘ అనే పత్రికను కూడా ఆరంభించారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 1911 నవంబరు 24న కందుకూరి వీరేశలింగంగారి అధ్యక్షతన పెద్ద ఎత్తున ‘గ్రామ్యాదేశ నిరసన సభ ‘ జరిగింది. ఆ సభలో జయంతి రామయ్య పంతులుగారు చేసిన ప్రసంగం, కందుకూరి వీరేశలింగం పంతులు గారు చేసిన ప్రసంగం, ఈ సభలో చేసిన తీర్మానాలను దొరతనము వారికి తెలియజేయుటకు మద్రాసు గవర్నర్ గారికి ఆనాడు సమర్పించిన వినతి పత్రాన్ని ఈ ప్రత్యేక సంచిక మొదటి విడతగా మీకు అందజేస్తున్నాము. ఈ వ్యాసాలు ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక: సంపుటి -1 సంచిక- 2 నుండితీసుకున్నాము. ఆ సంచికను PDF రూపంలో చదవవచ్చు.