కుటుంబంతో అమెరికా వచ్చి రెణ్ణెల్లయినా, సుందరానికి అన్నీ ఇంకా కొత్త కొత్తగానే వున్నాయి.
“ఈ వీకెండు మీ ప్లానేమిటీ?” అనడిగాడు స్నేహితుడు మురళి ఒకరోజు ఫోను చేసి.
“ఏముందండీ? ఇల్లు కాస్త శుభ్రం చేసుకోవడం, ఓ పుస్తకం చదవడం, పిల్లలతో టైం గడపడం! అంతే!” అని సుందరం చెప్పాడు నవ్వుతూ.
“వచ్చే ఆదివారం ‘మదర్స్ డే’. ఇంకో రెండు ఫామిలీలతో కలిసి ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకుంటున్నాం. మీరు కూడా కలుస్తారా మాతో?” అనడిగాడు మురళి.
” ‘మదర్స్ డే’? అంటే ఏమిటీ? ఏం చేస్తారు ఆ రోజున?” అని సుందరం ఆశ్చర్యంగా అడిగాడు.
“యేడాదిలో ఒక రోజు ‘మదర్స్ డే’ అనీ, ఒక రోజు ‘ఫాదర్స్ డే’ అనీ, ఒక రోజు ‘వేలెంటైన్స్ డే’ అనీ వున్నాయి అమెరికాలో. ‘మదర్స్ డే’ నాడు ‘మదర్స్’ అంటే, ‘తల్లులు’ చాలా స్పెషల్ అన్న మాట. వారిని గౌరవిస్తారు ఆ రోజున. అది ఇక్కడి సంస్కృతి” అంటూ మురళి కాస్త వివరంగా చెప్పాడు.
“ఈ ‘మదర్స్ డే’ అనేది ఎంత కాలం నించి వుంది అమెరికాలో? చాలా కాలం నించీ వుందా?” అని కుతూహలంగా సుందరం అడిగాడు.
“తెలీదండీ. నేను వొచ్చి ఐదేళ్ళు దాటింది. నేను వొచ్చినప్పటి నించీ వుంది ఈ సంస్కృతి ఇక్కడ.” అని వివరించాడు మురళి.
” ‘మదర్స్ డే’ని తెలుగులో ‘తల్లుల రోజు’ అనో, ‘తల్లుల దినం’ అనో అనొచ్చు కదా? అబ్బే, అబ్బే, చాలా ఎబ్బెట్టుగా వుంది. కాబట్టి, ‘మదర్స్ డే’ని ‘మదర్స్ డే’గా సంభాషించడమే బాగుంది. పైపెచ్చు ఇది ఎలాగూ తెలుగు సంస్కృతికి చెందిన విషయమే కాదు. పొద్దున్న లేస్తే ఎన్నో సంస్కృత పదాలతోనూ, ఎన్నో ఇంగ్లీషు పదాలతోనూ, కొండొకచో కొన్ని హిందీ పదాలతోనూ కలగలిసి వుంది అందరూ వాడే తెలుగు బాష. ఏ ‘రచ్చబండ’లో చూసినా తెలుగు సంస్కృతీ, సాహిత్యాల గురించి ఇంగ్లీషులో వ్యాఖ్యానాలే. ఈ పరిస్థితుల్లో, ‘మదర్స్ డే’ అనే ఇంగ్లీషు పదాల ప్రయాగం పెద్ద అభ్యంతరకరమైన విషయమేమీ కాదు” అని తన అభిప్రాయం చెప్పాడు సుందరం.
దానికి బదులుగా నవ్వాడు మురళి.
“అయినా యేడాదంతా తల్లుల్ని గౌరవించరా ఏమిటీ?” అని నవ్వుతూ సుందరం అడిగాడు.
“యేడాదంతా గౌరవించరని కాదు. అది ఎలాగూ వుంటుంది. దేశంలో అందరూ ఒక రోజు ఎన్నుకుని, ఆ రోజు ‘మదర్స్ డే’ అని ప్రకటించుకున్నారు. తల్లికి దూరంగా వుండే పిల్లలు ఆ రోజు వీలు చూసుకుని తల్లిని కలవడమో, తల్లితో మాట్టాడ్డమో చేస్తారు తప్పకుండా. ఇంతకీ మీరు కలుస్తారా మాతో?” అనడిగాడు మురళి.
ఈ ‘మదర్స్ డే’ అనేది సుందరానికి అంత నెగిటివ్ విషయంగా అనిపించ లేదు. యేడాదిలో ఒక్క రోజయినా కాస్త తల్లులకి కేటాయిస్తారన్న మాట ఎవరి హడావుళ్ళలో వాళ్ళుంటూ. సరే, ఇదీ చూద్దాం అనుకున్నాడు.
“సరేనండీ! మేమూ కలుస్తాము. వరలక్ష్మిని కూడా అడగాలి. అయితే తనకీ ఏమీ అభ్యంతరం వుంటుందని అనుకోను” అని చెప్పాడు సుందరం.
“అయితే రేపు సాయంకాలం మా ఇంటికి వస్తారా? మిగిలిన రెండు ఫామిలీల్నీ కూడా పిలుస్తాను. కాఫీ తాగుతూ ఈ విషయాలన్నీ మాట్టాడుకోవచ్చు ఓ గంట సేపు” అన్నాడు మురళి.
“ఎందుకూ? మీరందరూ మా ఇంటికే రండి. వేడి వేడిగా వుల్లిపాయ పకోడీలు కూడా చేస్తాము. అవి తింటూ, కాఫీ తాగుతూ మాట్టాడుకోవచ్చు” అన్నాడు ఆశ పెడుతూ.
మురళి వెంటనే ఒప్పేసుకున్నాడు.
ఆ విషయాలు మననం చేసుకుంటూ, సింకులో వున్న గిన్నెల్ని తోమసాగాడు సుందరం. అంతకు ముందు రోజు సాయంత్రం ఆఫీసు నించి ఇంటి కొచ్చే సరికి, అనుకోని అతిథులు వొచ్చారు. డిన్నర్ చేసి, వీడియోలో సినిమా చూసి, ఆ అతిథులు వెళ్ళే సరికి రాత్రి పన్నెండు. వంటిల్లు శుభ్రం చెయ్య కుండానే నిద్రలకి పడ్డారు. రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా, పొద్దున్న ఆరింటికే లేచి పోతాడు సుందరం. పిల్లలూ, వరలక్ష్మీ ఇంకా పడుకునే వున్నారు. దంత ధావనం కానిచ్చి, వంటిల్లు శుభ్రం చేసే పనిలో పడ్డాడు.
ఆ లోపల వరలక్ష్మి కూడా లేచొచ్చింది. ఇద్దరూ కలిసి పనులు చేసుకోసాగారు.
” ‘మదర్స్ డే’ అని ఒకటుందని నీకు తెలుశా?” అనడిగాడు వరలక్ష్మిని.
“అర్థం తెలుస్తోంది గానీ, ఏమిటీ అసలు విషయం?” అని తిరిగి ప్రశ్నించింది.
తనకి తెలిసిన విజ్ఞానాన్ని వరలక్ష్మికి అందించాడు. రాత్రి చుట్టాల హడావుడిలో చెప్పని విషయాలన్నీ చెప్పుకొచ్చాడు.
“బానే వుంది వినడానికి! అయితే రేపు నన్ను కూర్చో బెట్టి, అభిషేకం చేస్తారన్న మాట, నువ్వూ, పిల్లలూ!” అంది నవ్వుతూ.
“రేపు నీకు అభిషేకం చేస్తే, ‘ఫాదర్స్ డే’ వచ్చినపుడు నాక్కూడా చెయ్యాలమ్మా!” అన్నాడు సుందరం తనూ నవ్వుతూ.
ఆ లోపల పిల్లలు లేచి రావడం, వాళ్ళ పనులు చూడ్డం, మిగిలిన పనులు చూసుకోవడం అయ్యేసరికి సాయంత్రం అయింది. పకోడీకి పిండి కలిపాడు సుందరం.
“ఫిల్టర్ కాఫీ చెయ్యడం నీ పని” అని చెప్పాడు వరలక్ష్మికి.
“సరే గానీ, పకోడీ పిండిలో కాస్త వుప్పు తక్కువైంది” అంది వరలక్ష్మి పచ్చి పిండి రుచి చూసి.
“మరి మా పనేంటి నాన్నా?” అని పిల్లలిద్దరూ ముచ్చటగా అడిగారు.
వాళ్ళిద్దరూ కొట్టుకోకుండా, అంత సయోధ్యగా వున్నారంటే గొప్పే. ఎటొచ్చీ వచ్చే స్నేహితులకి పిల్లలున్నారు. వాళ్ళతో కలిసి ఆడుకోవచ్చన్న సంతోషంతో కొట్టుకోవడం వాయిదా వేసి, తల్లితండ్రులకు సాయ పడాలని నిశ్చయించుకున్నారు పిల్లలిద్దరూ.
“మీరిద్దరూ హాలు శుభ్రం చేసి, కుర్చీలవీ సర్దండి. ఆ తరవాత మన ఫ్రెండ్సంతా వచ్చే వరకూ ఏవైనా పుస్తకాలు చదువుతూ వుండండి” అని వాళ్ళకి పనులప్పగించారు తల్లితండ్రులు.
పిల్లలిద్దరూ ఉత్సాహంగా ఆ పనిలో పడ్డారు.
కొంత సేపటికి మూడు కుటుంబాల స్నేహితులూ వచ్చారు. రావడమే పకోడీల మీద దాడి చేశారు.
“అబ్బ! చాలా బాగున్నాయి పకోడీలు. ఎలా చేశారండీ?” అని ఒకావిడ అడిగింది వరలక్ష్మిని.
“అబ్బే! అవి నేను చేసినవి కావు. సుందరం చేశాడు. అతన్నడగండి” అంది వరలక్ష్మి నవ్వుతూ.
సుందరం నవ్వుతూ, తను పకోడీలు చేసిన విధానం చెప్పాడు.
“అబ్బ! మీరే నయం! మా ఆయనయితే వంటిట్లోకి కూడా రారు. ఆయనకి బొత్తిగా వంట రాదు. అన్నీ నేనే చేసి పెట్టాలి. ఎటొచ్చీ వంక పెట్ట కుండా తింటారు” అంటూ తన భర్త గురించి గారాబంగా చెప్పుకుంది.
సుందరం, వరలక్ష్మీ ఏమీ అనకుండా, నవ్వి వూరుకున్నారు. అప్పుడు మొదలయింది అసలు చర్చ.
“రేపు నాలుగు ఫామిలీలూ కలిసి ఒక చోట కలుద్దాం. అందరం తలో యేభై డాలర్లూ వేసుకుందాం. అది పెట్టి అందరికీ ఫుడ్ బయటి నించీ ఆర్డరు చేద్దాం. ఆ డబ్బు తోనే గిఫ్టులు కొని పిల్లల చేత మదర్స్ కిప్పిద్దాం. ఏమంటారూ?” అని ఒకాయనడిగాడు.
“గిఫ్టులా? ఆ, అర్థం అయింది. చిన్నప్పుడు మా వూళ్ళో తిరునాళ్ళు జరిగేవి. అక్కడ బహుమతులు ఇచ్చుకోవడం కోసం బోలెడు సరుకులు అమ్మేవారు. ఓ చుట్టాలాయన, తిరునాల నాడు అమ్ముదామని బోలెడు సరుకులు కొని పెట్టుకున్నాడు ఓ సారి. ఏదో కారణం చేత, ఆ తిరునాల ఆగిపోయింది. దాంతో సరుకులన్నీ అమ్ముడు కాక, లబో దిబో మన్నాడు. అలాగే ఈ ‘మదర్స్ డే’ గట్రా బాగా సరుకులు అమ్మడానికే పెట్టారన్న మాట ఈ బిజినెస్ ప్రపంచంలో.” అన్నాడు సుందరం.
“ఈ సరుకుల సంగతి నాకు తెలియదు గానీ, ‘మదర్స్ డే’కి ఇక్కడ చాలా షాపుల్లో సేల్ పెడతారు. అంటే, చాలా వస్తువులు డిస్కౌంటులో చవగ్గా అమ్ముతారు. అలా సేల్లో సామానులు అమ్మడం ఇక్కడ మామూలే” అని మురళి చెప్పాడు.
ఇంతలో రెండో ఆయనకి యేభై డాలర్లు ఖర్చు పెట్టాలన్న విషయం గుర్తొచ్చింది.
“ఎందుకండీ యేభై డాలర్లు వేస్టు? అందరం కలిసి వంట చేసుకుంటే పోదూ?” అన్నాడు ఆ రెండో ఆయన.
“ఏమిటీ? ‘మదర్స్ డే’ నాడు కూడా మేం వంట చెయ్యాలా? అలా కుదరదు” అంటూ అభ్యంతరం చెప్పింది ఒకావిడ.
“మీరొక్కరే చెయ్యక్కర్లేదు కదండీ? నలుగురాడవాళ్ళూ కలిసి చేసుకోవచ్చు. పని సులువుగా వుంటుంది” అని ‘గొప్ప’ వుపాయం చెప్పాడు రెండో ఆయన.
“ఏమో బాబూ! ‘మదర్స్ డే’ నాడు కూడా పాట్ లక్ పెట్టుకున్నట్టుంది. ‘మదర్స్ డే’కి ఇదేం మర్యాదా? నాకు నచ్చదు బాబూ!” అంది ఇంకొకావిడ.
“పాట్ లక్ అంటే ఏమిటీ?” అని ఆశక్తిగా అడిగింది వరలక్ష్మి.
“అబ్బే! ఏమీ లేదండీ! ప్రతీ కుటుంబం వాళ్ళూ, ఒక ఫుడ్ ఐటం వాళ్ళింట్లో చేసుకుని తీసుకొస్తారు. అందరూ ఒకరింట్లో కలిసి, తాము వండిన పదార్థాలతో విందు చేసుకుంటారు. దాన్నే పాట్ లక్ అంటారు. అలా అయితే, ఒక్క కుటుంబం వాళ్ళే మొత్తం వంట చెయ్యాల్సిన పని తప్పుతుంది. వేరే కుటుంబం వాళ్ళు తెచ్చే పాట్ లోని ఫుడ్డు మన లక్ మీద ఆధారపడి వుంటుందన్న మాట!” అని సరదాగా విశదీకరించింది వేరే ఆవిడ.
ఇంకాస్సేపు చర్చ కొనసాగింది.
ఒకావిడ తన ఆలోచన ఇలా చెప్పింది.
“మా నలుగురు ఆడ వాళ్ళలో ఒకరు తప్ప అందరం హౌస్ వైఫ్లమే. ఎక్కువగా ఇంట్లోనే గడుపుతాం. కాబట్టి, రేపు మగాళ్ళంతా పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పట్టున వుంటే, మేం ఆడవాళ్ళందరం బయటి కెళ్తాం. మేం బయటే ఎక్కడో లంచ్ చేసి, ఏదో సినిమా చూసి, కాస్సేపు షాపింగు చేసుకుని వస్తాము. అప్పుడు మాకు రిలాక్స్డ్గా వుంటుంది.”
వరలక్ష్మి తప్ప మిగిలిన ఆడవాళ్ళిద్దరూ ఆ ఆలోచనకి సమ్మతంగా తలలూపారు.
“అయితే రేపు ‘లేడీస్ డే ఔట్” అన్న మాట. మీకందరకీ ఇష్ట మయితే, మా మగ వాళ్ళకేం అభ్యంతరం లేదు” అని ఒకాయన మగ వాళ్ళందరి తరఫునా చెప్పేశాడు.
“ఆగండాగండి! అందరి తరఫునా మీరే చెప్పేస్తే ఎలా?” అంటూ అడ్డుకున్నాడు సుందరం.
“మీ ఆలోచనేమిటో చెప్పండీ” అంటూ మురళి ప్రోత్సాహించాడు సుందరాన్ని.
” ‘మదర్స్ డే’ సెలబ్రేషను అనంటూ, ఆ రోజున మీరు పిల్లలకి దూరంగా, ‘మదర్స్’ లా కాకుండా గడపడం ఏమిటీ? ఇందులో అసలు అర్థమే లేదు” అన్నాడు సుందరం.
“ఒక రోజు పిల్లల్ని వదిలి పెట్టి, బైటికి వెళ్తే, మదర్స్ కాకుండా పోతామా?” అంది ఒకావిడ నిష్టూరంగా.
వరలక్ష్మి కలగ జేసుకుంది.
“సుందరం వుద్దేశం అది కాదండీ. ‘మదర్స్ డే’ నాడు మనం కూడా మదర్స్ లా ప్రవర్తించాలి కదా? అంటే మన పిల్లలతో గడపాలి కదా? బయటకి వెళ్తే, అది ‘లేడీస్ డే ఔట్’ అవుతుంది గానీ, ‘మదర్స్ డే’ అవదు కదా? కాబట్టి, రేపు మనం మన కుటుంబాలతోనే గడపాలి” అని వివరించింది.
“అంతే కాదు. రేప్పొద్దున్న మనందరం పిల్లల్లాగా, మన తల్లులతో ఓ గంట సేపు ఫోన్లో మాట్టాడుకోవాలి అభిమానంగా. అప్పుడు ‘మదర్స్ డే’ అన్న దానికి కాస్తన్నా అర్థం వుంటుంది” మరింత విపులంగా చెప్పాడు సుందరం.
“మేం మా మదర్స్ తో తరుచూ మాట్టాడుతూనే వుంటాం లెండి. రేపు కూడా ఫోను చేసి విషెస్ చెబుతాం. అయినా ఒక్క రోజు మదర్స్ బయటికి వెళితే తప్పేంటీ? యేడాదంతా కుటుంబాన్నంటి పెట్టుకునే వుంటాం కదా? ఒక్క రోజు స్వేచ్ఛగా వుంటే తప్పేంటీ?” అంది ఇంకొకావిడ ఘాటుగా.
“మీరందరూ ఒక రోజు ఇంటి పనులూ, పిల్లల పనులూ భర్తల కప్ప జెప్పి, బయటికి వెళ్తాం అంటే తప్పేమీ లేదు. అసలు అది యేడాదిలో ఒక్క రోజే కాకుండా, అప్పుడప్పుడు మీ ఆడ వాళ్ళంతా స్నేహితుల్లాగా కాస్త బయట తిరిగి రావచ్చు. కొంచెం తేడాగా అయినా వుంటుంది. అయితే అది మదర్స్ డే రోజున చెయ్యడమే కాస్త అర్థం లేని విషయంగా వుంటుంది” అన్నాడు సుందరం.
“పోనీ వాళ్ళు చెప్పినట్టే చెయ్యనివ్వండీ. రెణ్ణెల్లు పోయాక, ‘ఫాదర్స్ డే’ వస్తుంది కదా? ఆ రోజు మనం మగ వాళ్ళందరం కలిసి బయటి కెళదాం” అన్నాడు ఒకాయన సంబరంగా.
“అలా అన్నారు బాగుంది. ‘ఫాదర్స్ డే’ నాడు మీ సెలబ్రేషన్కి మేం అడ్డు రాము” అంటూ ఆఖరావిడ భరోశా ఇచ్చింది.
“అవునూ, ఇందాక ఇండియాలో వున్న మన తల్లులికి ఫోను చెయ్యాలన్నారు కదా? తల్లుల కేనా, లేక తల్లుల తల్లులికి కూడానా?” అని హాస్యంగా అడిగాడొకాయన.
“బాగా అడిగారు. కిందటేడాది, ‘మదర్స్ డే’ నాడు, మా అమ్మకి విషెస్ చెప్పాక, వేరే వూళ్ళో వున్న మా అమ్మమ్మకి కూడా ఫోను చేశాను. ‘హేపీ మదర్స్ డే’ అని చెప్పాను. ఇక, చూసుకోండీ! మా అమ్మమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ‘మదర్స్ డే నా, నీ మొహమా? ఆ వూరెళ్ళి పిచ్చి మాటలన్నీ నేర్చుకుంటున్నా వన్న మాట. మన పద్ధతులన్నీ పోయాయన్న మాట. బాగానే వుంది సంబడం’ అనంటూ బాగా ఝాడించేసింది. అప్పట్నించీ, మా అమ్మమ్మకి మాత్రం మదర్స్ డే విషెస్ చెప్పను బాబూ!” అని అన్నాడు ఇంకో ఆయన.
అందరూ గట్టిగా నవ్వారు.
“అవును నిజమే! మదర్స్ డే నాడు మా అమ్మతో విషెస్ చెబుతూ మాట్టాడితే, మా నాన్నకి ఒళ్ళు మంట. ‘అడ్డమైన దేశాలూ డబ్బు కోసం పోయిందే కాక, అడ్డమైన సంస్కృతి అంతా నేర్చుకుంటున్నాడు వెధవ’ అని తిట్టాడు. అప్పట్నించీ ‘నాన్న ఇంట్లో వున్నాడా’ అని ముందర అడిగి, లేనప్పుడే, మా అమ్మకి మదర్స్ డే విషెస్ చెబుతాను నేను” అన్నాడు మూడో ఆయన భయం భయంగా.
ఆయన భయానికి అంతా మళ్ళీ నవ్వారు.
ఇక వరలక్ష్మి వూరుకోలేక పోయింది.
“అంటే ‘మదర్స్ డే’, ‘ఫాదర్స్ డే’ అనేవి పేరుకే అన్న మాట. అవి నిజానికి ‘లేడీస్ డే ఔట్’, ‘మెన్ డే ఔట్’ అన్న మాట. ‘మదర్స్ డే’ నాడు మదర్స్ లా వుండక్కర్లేదు. ‘ఫాదర్స్ డే’ నాడు ఫాదర్స్ లా వుండక్కర్లేదు. ఇదేమీ బాగో లేదు అస్సలు” అంది నిక్కచ్చిగా.
“పోదురూ! మీకు చాదస్తం ఎక్కువ. అలాంటివి పట్టించు కోకూడదు” అంది మొదటావిడ హాస్యంగా.
“అన్నట్టు మర్చి పోయాం. ఈ సారి మాకు గిఫ్టులు మీరివ్వద్దు. ఆ డబ్బు మాకిచ్చేస్తే, మేం షాపింగు చేసేటపుడు మాకు నచ్చినవి మేము కొనుక్కుంటాం” అంది ఇంకొకావిడ తన ఆలోచన చెబుతూ.
“నా ఆఖరి ఆలోచన చెప్పనా?” అడిగాడు సుందరం.
“చెప్పండీ ధారాళంగా!” అంటూ అందరూ ప్రోత్సాహించారు.
” ‘మదర్స్ డే’ నాడు మదర్స్ని గౌరవించడం అంటే ఇలా కాదు. అసలు ఆ గౌరవించడం అనేది యేడాదంతా వుండాలి. ఒక రోజు ప్రత్యేకంగా వుండ నవసరం లేదు. పోనీ, సరదాగా ఓ రోజు అలా పెట్టుకున్నాం అనుకుందాం. ఆ రోజు మదర్స్ని కొంచెం స్పెషల్గా ట్రీట్ చెయ్యాలి. మగ వాళ్ళందరం ఇవాళ సాయంత్రం కలిసి, రేపటి కోసం అన్ని రకాల వంటలూ చేస్తాం. రేప్పొద్దున్నే పిల్లలు వాళ్ళకి వచ్చినట్టుగా చేసి, తల్లులికి బ్రేక్ ఫాస్టు పెడతారు. మిగిలిన రోజంతా మనందరం పిల్లలతో కలిసి ఏదన్నా పార్కు కెళదాం, మగ వాళ్ళు చేసిన వంటలు తీసుకుని. సాయంకాలం వరకూ పార్కులో ఆడుకుని, తిళ్ళు తిని, ఇళ్ళకి చేరుకోవచ్చు ఆ తరవాత. పొద్దున్నే అందరం మన తల్లులికి ఫోనులు చేసి, వాళ్ళతో కొంత టైం గడుపుదాం. వచ్చే వారం ఆడవాళ్ళంతా ‘లేడీస్ డే ఔట్’ అని పెట్టు కుంటే, పెట్టుకోండీ” అని వివరించాడు.
“అబ్బా, నాకు వంట రాదండీ!” అన్నాడు ఒకాయన.
“వీకెండు కూడా రెస్టు లేకుండా పనులు చెయ్యాలా?” అని గునిశాడు ఇంకొకాయన.
“ఆడవాళ్ళం సరదాగా బయటి కెళ్తామంటే, మీకెందుకు కడుపు మంటా?” అంటూ ఒకావిడ యుద్ధానికొచ్చింది.
సుందరం తల పట్టుక్కూర్చున్నాడు.
“పోనీ లెద్దురూ! మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండీ! ఎందుకూ అనవసరంగా గొడవ? ఎటొచ్చీ రేపలా బయట తిరగడం నాకిష్టం లేదు. మీరు వెళ్ళండి” అని వరలక్ష్మి సర్ది చెప్పింది.
అప్పటికి గొడవ సర్దు మణిగింది. మరి కొంత సేపు ఏదో పిచ్చాపాటీ మాట్టాడుకుని, అంతా వెళ్ళి పోయారు.
వెళ్ళే ముందర, “ఇంకోసారి ఆలోచించుకోండీ” అని వరలక్ష్మిని హెచ్చరించి వెళ్ళారు.
‘మదర్స్ డే’ సెలబ్రేషన్లో సుందరం, వరలక్ష్మీ పాల్గో లేదు. మిగిలిన మూడు కుటుంబాలూ ఒక చోట కలిశాయనీ, పిల్లల్నందర్నీ ఓ గదిలో పడేసి, వాళ్ళకి వీడియా గేములూ, ‘వీ’లూ ఇచ్చారనీ, మగ వాళ్ళు పీజా తెప్పించుకుని, బీర్ తాగుతూ, వీడియా చూస్తూ, మధ్య మధ్యలో పిల్లల్ని గమనిస్తూ వుంటే, ఆడ వాళ్ళంతా బయటి కెళ్ళి, రెస్టారెంటులో భోజనం చేసి, ఓ సినిమా చూసి, షాపింగులో ముత్యాలు కొనుక్కుని, ఇల్లు చేరుకున్నారనీ సుందరానికీ, వరలక్ష్మికీ తెలిసింది.
అయితే, వరలక్ష్మికీ, సుందరానికీ మాత్రం ఆ రోజు మిగిలిన రోజుల్లాగానే గడిచి పోయింది ఆనందంగా.