కథ ఇదనీ, నిజమిదనీ…

నేపుల్స్ లో ఎండ మండిపోతున్నదా రోజు మధ్యాహ్నం. నిసి షామల్ లౌడర్ మిల్ పార్కులో గజీబొలో కూర్చుని షెర్లాక్ హోమ్స్ నవల “హౌండ్ ఆఫ్ బాస్కర్ విల్ల్స్” చదువుకుంటున్నది. ఆమె చిన్న చేతుల్లేని తెల్ల చొక్కా, చిన్న తెల్ల నిక్కరు వేసుకుని కొయ్య బెంచి మీద కాళ్ళు జాపుకుని కూర్చుని ఉంది. ఆమె పక్కనే బల్లమిద ఒక తెల్ల ముతక గుడ్డ సంచీ ఉంది. అందులో ఓ రెండు పుస్తకాలూ, పెన్నులూ, పెన్సిళ్ళూ, మంచినీళ్ళ సీసా, ఒక చిన్నతువ్వాలూ ఉన్నాయి. గజీబోకి దగ్గర్లో సైకిల్ స్టేండులో ఆమె సైకిల్ పెట్టి ఉంది. ఎర్ర రంగులో ఉంటంచేత నిసి దాన్ని ముద్దుగా ‘రెడ్ డ్రేగన్’ అని పిల్చుకుంటుంది. ఆకలి వేసినప్పుడు అక్కడే పార్కులో ఉన్న చిన్న స్టాల్‌లో ఒక హాట్ డాగ్, ఒక లెమనేడ్ తీసుకుని సాయంత్రం దాకా చదువుకుని అప్పుడు సైకిలెక్కి ఇంటికి వెళ్ళడం– అదీ అప్పటికి ఆమె ప్లాన్.

Chapter 1: Mr. Sherlock Holmes

Mr. Sherlock Holmes, who was usually very late in the mornings, save upon those not infrequent occasions when he was up all night, was seated at the breakfast table. I stood upon the hearth rug and picked up the stick which our visitor had left behind him the night before. It was a fine, thick piece of wood , bulbous headed, […] It was just such a stick as the old fashioned family practitioner used to carry – dignified, solid and reassuring.

“Well, Watson, what do you make of it?”

Holmes was sitting with his back to me, and I had given him no sign of my occupation.

“How did you know what I was doing? I believe you have eyes at the back of your head.”

“I have, at least, a well-polished, silver plated coffee-pot in front of me,” said he. “But tell me, Watson,what do you make of our visitor’s stick?”

హోమ్స్-వాట్సన్‌ల సంభాషణలు నిసీకి ఎన్నిసార్లు చదివినా నవ్వు వస్తుంది . వాట్సన్ ఎప్పటికప్పుడే “హోమ్స్, ఎలా కనిపెట్టావ్ ఈ విషయం?” అంటాడు. హోమ్స్ “ఇట్స్ ఎలిమెంటరీ మై డియర్ వాట్సన్!” అంటాడు. హోమ్స్‌కి సాధారణంగా అనిపించిన విషయాలు వాట్సన్‌కి అంత సులువు కావు. నిసి గట్టిగా నవ్వుతూ నవల చదువుతుండగా పుస్తకం మీద ఒక నీడ పడింది. ఆమె మాత్రం తల ఎత్త లేదు. నీడను బట్టి అది ఒక మగవాడి నీడ అని ఆమెకు తెలిసింది. పైగా, కమ్మని సిగారు వాసన.

ఆమె పట్టించుకోకుండా తలెత్తకుండా చదువుకుంటున్నది. హోమ్స్ ఒక పాత కాగితాన్ని పరిశీలిస్తున్నాడు. వాట్సన్ హోమ్స్ భుజమ్మీదుగా జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

నిసి అనుకున్నట్లుగానే ” ఏం చదువుతున్నారు?” అని ప్రశ్న వినిపించింది.
నిసి తలెత్తి చూసింది. లావుపాటి మనిషి. బొజ్జ బాగానే ఉంది. పొడగరి. బట్టతల, చిన్న కళ్ళు, బుర్ర ముక్కు. ‘ఆకారం భీకరంగా ఉంది కానీ సిగార్ సుగంధం బాగుంది’ అనుకుంది.
“ఏదో చిన్న మిస్టరీ అండీ.”
“ఒక్కరే వచ్చారా బీచ్ కి?”
“అవును.” గబుక్కున అబద్ధం చెప్పటం రాదు నిసికి.
“మీ ఆయన?”
“రాలేదు”
“ఊళ్ళో ఉన్నారా”
“నిక్షేపంగా”
“నేను బోస్టన్ నుండి వచ్చాను. ఈ ఊళ్ళో నా రియల్ ఎస్టేట్‌నీ మేనేజర్లనీ తనిఖీ చేయడానికి వచ్చాను. నాకు గల్ఫ్ షోర్ లో నాలుగు కాండోమీనియం లున్నాయి. కొంచెంసేపు అలా బీచ్‌లో నడుద్దామా? ఆ తర్వాత కావాలంటే మూరింగ్స్ లో నా కాండో చూపిస్తాను.”

నిసి సీరియస్‌గా కన్నార్పకుండా అతని వంక చూస్తూ, “ఒద్దండి. ఇప్పటిదాకా నడిచాను. ఇంకాసేపట్లో ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి. మా ప్లేన్ రెడీ అవగానే ఎయిర్‌పోర్టు వాళ్ళు పిలుస్తారు. మేము బహామాస్ వెళ్తున్నాం. మా ఆయన్ను అడుగుతాను మా ప్లేన్‌లో ఇంకొకళ్ళకు చోటుందేమో, మీరూ వస్తారా? ” అంది. నేపుల్స్ లో చాలా మందికి సొంత యాట్లు, సొంత ప్లేన్లు ఉండే స్తోమతు ఉంది కాబట్టి, అతనికి నిసి మాటలు నమ్మటం కష్టం కాలేదు. అతని సిగారు కొంచెం వణికింది. ముఖం కందగడ్డ చేసుకుని వెళ్ళిపోయాడు.

‘ఊరికే కోతలు. ఇంట్లో పెళ్ళాం ఉండగా తనతో ఎలా వస్తాడు? తనని అతని కాండోకీ తీసుకు పోడు. అసలు బీచ్‌లోనే అతనినీ, తననీ కలిపి రెండు ఫొటోలు ప్రైవేట్ డిటెక్టివ్ ఎవడన్నా లాగితే, మర్నాడే సగం ఆస్తి మీద దావా పడుతుంది. అతని భార్య – ఈయన ఎప్పుడు పోతాడా?- అని ఉవ్విళ్ళూరుతూ ఉండి ఉంటుంది! ఈ బట్టతల బొజ్జాయన తన కెందుకూ?’ అనుకుంది నిసి మనసులో నవ్వుకుంటూ.

నిసి లేచి, పుస్తకం సంచిలో పడేసి, పార్కులో మనుషులు కుర్చీల్లోనూ, బెంచీల మీద, చెట్ల కింద కూర్చుని ఉన్నచోటికి నడిచింది. ఆమె ఎడమ వైపుగా, తుప్పల మీదుగా చూస్తే లేత వెండి రంగులో ఏమీ కదలిక లేని పాదరసపు ముద్దలాగా ఉన్న సముద్రం కనిపిస్తున్నది. కుడివైపునొక చిన్న సరస్సు. దూరంగా సముద్రంపైన తిరిగే సీగల్స్ చప్పుళ్ళు. పార్కులో పరుగులెత్తే పిల్లల కేకలు. అప్పుడప్పుడూ కింద గడ్డిలో కాలి కడ్డం పడుతూ తిండికోసం వెదుక్కుంటున్న పెద్ద బాతులు.

చెట్లనీడలో, ఒక బెంచి పక్కగా నడుస్తుంటే, కూర్చుని ఒక కొయ్య బొమ్మ చెక్కుతున్న తెల్లాయన, అతని మగ స్నేహితులిద్దరు కనిపించారు. బల్ల మీద చెక్కే సామగ్రి కల ఒక పెద్ద నల్ల ప్లాస్టిక్ పెట్టి. రకరకాల సుత్తులు, ఆకురాళ్ళూ, చాకులూ, సేండ్ పేపర్లూ ఏమేమిటో ఉన్నయ్. ఒక స్నేహితుడు అప్పుడప్పుడూ సర్జన్ కి నర్సు అందించినట్టు ఆయన అడిగిన సామాను – ఉలి, చిత్రిక అందిస్తున్నాడు. ఇంకో స్నేహితుడు తనే వేరే చిన్న బొమ్మ – ఒక సారా సీసా మీద ద్రాక్ష గుత్తిని – చెక్కుతున్నాడు.

ఈ చెక్కే ప్రయత్నాలు నిసిని ఆకర్షించాయి. “నేను కొంచెం సేపు కూర్చుని చూడొచ్చా” అని అడిగింది.

ఆ పెద్దాయన వయసు ఎనభయ్యిల్లో ఉండొచ్చు. పని ఆపకుండానే తల ఊపి, ఎదురు బెంచీ మీద తన ఎదురూగా చోటు చూపిస్తూ “కూర్చోండి, కూర్చోండి.” అన్నాడు.

ఆయన రెండడుగుల ఎత్తు ఉన్న ఒక బొమ్మను చెక్కుతున్నాడు. బొమ్మలో ఉన్న మగవాడు కొద్దిగా వంగి నడుస్తున్నాడు. చిన్న గోచీ కట్టుకుని ఉన్నాడు. కుడి చేతిలో కర్ర. ఎడమ చేతిలో వేళ్ళాడే చేపల గుత్తి. కర్రబొమ్మలో వ్యక్తి దాదాపు ఆ బొమ్మను చెక్కుతున్న పెద్దాయన లాగే ఉన్నాడు. పెద్దాయనకి చొక్కా లేదు. నెత్తిమీద చిన్న టోపీ. పెద్ద ముఖం. ముడతలు పడ్డ నుదురు. బిగించిన దవడలు. మెళ్ళో వేళ్ళాడే చిన్న సిలువ, దృఢకాయం.

నిసి చూస్తూ కూర్చుంది. ఆయన నిసిని మెల్లిగా మాటల్లోకి దించి ఆమె గురించి అడిగాడు. నిసికి ఇటాలియన్ కుటుంబాలతో బాగా పరిచయం ఉంది. ఆ వయసు వారు సహజంగా ఆడవారిని ‘మీరేం పని చేస్తారు?’ అని అడగరు. ‘మీ ఆయనేం చేస్తాడు? మీ పిల్లలెంతమంది? ఎక్కడ ఉన్నారు?’ ఇవే ప్రశ్నలు. నిసి ఉషారుగా సమాధానాలు చెప్పింది. ఆమె కొంచెం సేపట్లో తన కుటుంబంలో ఎంతో మంది గురించి చెప్పి, ఆ ముగ్గురినీ నవ్వించింది.

పెద్ద శిల్పి తన కుటుంబం సిసిలీ నుండి వచ్చినట్లు చెప్పి, వాళ్ళు, వాళ్ళ బంధువుల కుటుంబాలు ఎన్నో న్యూజెర్సీ లో స్ఠిరపడినట్లు చెప్పాడు. వారు ఇల్లు కట్టే పనుల్లో పెద్ద బిల్డర్స్‌కు సబ్‌కాంట్రాక్టర్లుగా పనిచేస్తారట. వారి ఇంట్లో కొత్త తరాల్లో అసలు సిసిలీనే చూడని చిన్నవాళ్ళు ఉన్నట్టు చెపుతూ, పక్కనే బోర్లా పడుకుని ఉన్న ఒక యువకుడిని చూపించాడు. హెర్క్యులీస్ ఇరవయ్యొకటో శతాబ్దిలోకి వచ్చి ఆ బీచ్‌లో బోర్లా పడుకున్నాడేమోనన్నంత అందంగా ఉంది ఆ ఇటాలియన్ కుర్రాడి మొహం. అతను వాళ్ళ తాత వంక చూసి, మధురంగా నవ్వి, కన్ను కొట్టాడు. ఒక సారి సింహంలా లేచి, జూలు విదిలించి, ఒళ్ళంతా సన్‌టేన్ లోషన్ పూసుకుని, మళ్ళీ కింద పరిచివున్న తుండు మీద ఒళ్ళంతా బారజాపి పడుకున్నాడు.

తాతగారు పెద్ద సింహం చిన్న సింహప్పిల్లను చూసినట్లు ఆప్యాయంగా మనవడిని చూసుకుని, నిసి వంక చూసి, “చాలా మంది ఆడవాళ్ళ కొంప ముంచుతాడు వీడు, నాకు తెలుసు.” అన్నాడు.

“నిస్సందేహంగా” అంది నిసి.

పెద్దాయన కొంచెం ఆశ్చర్య పోయాడు. నిసికి తెలుసు, ఇండియన్ ఆడవాళ్ళందరూ అంత చొరవగా మాట్లాడరు.

చేతిలోని మగ బొమ్మ నిసి ముందుకు జరుపుతూ “చూస్తారా. ఒకప్పుడు ఇతనూ అందగాడే” అన్నాడు.

నిసి చనువుగా నవ్వుతూ, “ఇప్పుడు మాత్రం ఏం తక్కువ?” అంది.

శిల్పి కళ్ళు తళుక్కు మన్నాయి. పక్కన కొంచెం దూరంలో కుర్చీల్లో కూర్చుని, అప్పుడప్పుడూ వీళ్ళ మాటలు వింటూ, వాళ్ళలో వాళ్ళు తమ సంసారాల విషయాలు మాట్లాడుకుంటున్న ఇటాలియన్ వనితలు వీరి సంభాషణకు ముసిముసిగా నవ్వారు. ఆయనతో ఇటాలియన్లో ఏదో అన్నారు. నిసికి ఆ భాష రాదు. ఆమెకు ఏం అర్థం కాలేదు. కూర్చున్న ఆడవాళ్ళలో ఒకామె ఆయన మీదకు కొన్ని గడ్డిపోచలు విసిరింది.

ఇటాలియన్ శిల్పి “ఆ సుందరి నా భార్య. ఆడవాళ్ళకేం తెలుసు మొగుడి గొప్ప? ఎప్పుడన్నా నేచేసిన ఇటిక రాయి పని, కట్టిన రాతి గోడల శిల్పం చూస్తే తెలుస్తుంది. రోజూ లజానియాలూ, మీట్ బాల్సూ వండుకుని, వైను తాగుతూ , రోజస్తమానమూ స్ఫిగెట్టీ – గార్లిక్ బ్రెడ్డూ తింటూ, ఏటా పిల్లలని కన్నట్లు కాదు” అన్నాడు కొంచెం ఆమెతోనూ కొంచెం వాళ్ళతోనూ అన్నట్లుగా.

నిసి ఆ మనుషుల అందానికి, వాళ్ళ మాటల అందానికి, కలుపుగోరుతనానికి ముచ్చట పడుతూ వింటున్నది. ఒకసారి అతని భార్య వంక చూసింది. వారిద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. ఆమె వయసు ఏభయ్యిల్లో ఉంటుంది. అందమయిందే. కాని ఆ వయసొచ్చేసరికి చాలా మంది ఇటాలియన్లు లాగానే వళ్ళు చేసింది. ఎడమ చేతిలో సిగరెట్టు. చెయ్యి ఒకటే వణుకు. కుడి చేతిని ఎడమ చేతి కింద మోపు చేసింది. అదృష్టవశాత్తు గాలివాటు వేరే వైపుకు ఉండటంతో ఆ పొగ బెంచీ మీద కూర్చున్న వీరి మీదకు రావటం లేదు.

నిసి తన చేతిలో కొయ్య బొమ్మ అటూ ఇటూ తిప్పి చూసి మళ్ళీ ఆయన వైపు పెట్టింది.

“ఎన్నాళ్ళుగా బొమ్మలు చెక్కుతున్నారు?”

“బొమ్మలు చెక్కడం చాలా ఏళ్ళుగా హాబీగా ప్రాక్టీసు చేస్తున్నా. ప్రతి సంవత్సరం మా కుటుంబం ఈ నెల్లో నేపుల్స్ వచ్చి ఒక రెండు వారాలుంటాం. ఆ టైమ్‌లో నా స్నేహితులు కొందరు వారి కుటుంబాలతో వస్తారు. వారూ వారి చెక్కడపు పని తీసుకు వస్తారు. ఒకరి కొకరు ప్రోత్సాహం. ఇదిగో ఆ ఆల్బం చూడండి” అంటూ ఒక ఆల్బం అందించాడు.

నిసి చూస్తూ మధ్య మధ్య ‘ఇది బాగుంది. ఇది బాగుంది’ అంటూనే కొన్నిటికి ఏం మాట్లాడకుండా దాటవేస్తున్నది.

ఆయన గమనించాడు. “మీరు ఆర్టిస్టా?”

“ఆర్టిస్టు అంటే, అవునూ కాదూ. అప్పుడప్పుడూ క్లాసులు తీసుకుంటాను. పెయింటింగు క్లాసులు. ఇలా శిల్పాలు చెక్కటం, విగ్రహాలు పోత పోయటం రాదు.”

“ఏం బొమ్మలు వేస్తారు?”

“ఒకటని లేదు. కుదురు లేదు. ఊరికే ఒక్కొక్క ఆర్టిస్టు వేసిన బొమ్మలు ఏవో కాపీ కొడుతుంటా.”

“ఎందుకనీ?”

“ఇప్పుడు మొదలు పెట్టి ఒక తీరుగా నేర్చుకునే వ్యవధి లేదు. కొన్ని సంవత్సరాలు నేర్చుకుంటే కదా ఏ కళైనా వచ్చేది. నాకు వ్యవధి లేదు” అంది.

“అదేంటి? ఇంత చిన్నగా కనిపిస్తున్నారు. నేను చెక్కటంలా?”

“అది అంతే !”అంది. మాట మార్చడానికి, “ఈ బొమ్మలో కాలు వంపు సరి చెయ్యటానికి వీలవుతుందా? లేక ఇక మార్చలేరా?” అంది.

పెద్ద శిల్పి ముఖం చిట్లించాడు. “అదేనా? ఇంకేమన్నా మార్చాలా?”

నిసి తనని మనసులోనే ‘నా నోరు ఊరుకోదుగదా’ అని మందలించుకుని, తల మళ్ళించి ఆతని భార్య దిక్కుగా చూసింది. ఆమె మళ్ళీ ఇంకో సిగరెట్టు వెలిగించింది. ఆమె ముఖంలో, వాలకంలో ఏదో పరిచయమున్నట్లుగా..

ముసలాయన ప్రశ్న రెట్టించాడు.

“ఈ బొమ్మలో తప్పులేవిటీ?”

నిసి ఇక తప్పదని, “బొమ్మల్లో తప్పులేముంటాయి? శిల్పికి సర్వ స్వతంత్రం ఉంది ఇష్టం వచ్చినట్లు చెక్కుకోటానికి. కాని ఈ బొమ్మ మగవాడి దేహాన్ని సరిగ్గా పోలి ఉన్నదా అంటే చాలా చోట్ల లేదు. తలలో చెవులు దవడ ఎముకకు సరైన చోట అతకలేదు. ముఖం కొద్దిగా పక్కకు తిప్పి ఉన్నప్పుడు ఈ వైపు కంటికి, చెవికి మధ్య దూరం సరికాదు. తల, ఛాతీ, పొట్ట పరిమాణాలు తూకంగా లేవు. పక్కటెముకలు బాగా చెక్కారు. చేతుల కొలతలు బాగున్నాయి. కాళ్ళ పొడుగు తక్కిన దేహం పొడుగుతో సరియైన ప్రమాణంలో లేదు. నడుము మగవాడికి ఇలా ఉండదు. నడుము, తొడల కొలతలు ఆడవాళ్ళ శరీరం కొలతల్లా ఉన్నాయి. ముందు అమ్మాయి శిల్పం మొదలుపెట్టి తర్వాత మనసు మార్చుకుని మీ బొమ్మ లాగా చెక్కుదామనుకున్నారేమో? అందుకని కొంత ఆడతనం ఉంది బొమ్మలో. పిర్రలు మగవాళ్ళకు ఇలా గుండ్రంగా ఉండవు. వాటి మీద పైన ఉండే రెండు చొట్టలు ఇక్కడ, ఇక్కడ ఉండాలి” అని చేత్తో చూపించింది.

ఆడవాళ్ళూ వింటున్నారు, ఆ పక్కన మగ స్నేహితులూ వింటున్నారు. హెర్క్యులీస్ తల తిప్పి ఆమె వంక ఆశ్చర్యంగా చూసి తర్వాత గమ్మత్తుగా నవ్వాడు. శిల్పి వాళ్ళావిడ సాభిప్రాయంగా తలూపింది, నిజమే అన్నట్లు.

ముసలాయన అప్పుడు నవ్వి “నాకు తెలిసింది, మీరు డాక్టరు. అవునా?” అన్నాడు.

“అవును.”

“నే మిమ్మల్ని చూడగానే అనుకున్నా. ఎందుకు చెప్పలేదూ?”

“మీరు నా పని గురించి అడగలేదు కదా?”

“ఎక్కడ డాక్టరు? ఎలాటి డాక్టరు?”

“ఇప్పుడెక్కడా కాదు. ప్రాక్టీసు మానేశాను.”

“ఎందుకనీ?”

“పాతికేళ్ళు కేన్సర్ స్పెషలిస్టుగా చేశాను. సాలొచ్చి మానేశాను అనుకోండి.”

నిసి తను డాక్టరు అన్న విషయం చాలా వరకూ చెప్పదు. ఆమె పని చేసిన స్పెషాలిటీ అలాంటిది మరి.

ఆమె అనుకున్నట్లే, భయపడినట్లే ఆయన తన తమ్ముడికొకడికి ప్రోస్టేట్ కేన్సర్ వచ్చిన సంగతీ, అతనికి వైద్యం చెసిన డాక్టరు పేరూ చెప్ఫాడు. ఆ డాక్టరు మీకు తెలుసా అన్నాడు. తెలుసంది. అక్కడినించి అతని వైద్యమూ, బాధలూ, వాళ్ళ స్నేహితుడెవరో గురించి, అతని వైద్యమూ, ఇంకా తనకు తెలిసిన వాళ్ళ జబ్బులూ, ఇలా అన్నీ చెప్పాడు.

శిల్పం ఆగిపోయింది. బీచ్‌లో మెడికల్ క్లినిక్ మొదలయ్యింది.

నిసి ఊకొడ్తూ అక్కడా ఇక్కడా, అప్పుడప్పుడూ అతని భార్య వంకా, ఇంకా కొంచెం మెడ సాచి దూరపు సముద్రం వంకా చూస్తున్నది. సముద్రం ఇంకా దూరంగా జరిగినట్లు అనిపించింది నిసికి. అన్యమనస్కంగా ఇంకా తన చేతిలోనే ఉన్న కొయ్యబొమ్మను తల మెడ తడుముతూంది.

ఇంతలో ఆడవాళ్ళంతా ఒక్క సారి లేచారు. బెంచీ దగ్గరకు వచ్చి, “కాసేపు ఈ పని ఆపండి. లంచ్ తిందాం.” అని కొన్ని బుట్టలు తీసి బల్ల మీద పెట్టారు. శిల్పి భార్య సామాన్ల పెట్టి మూసి ఎడమ చెత్తో ఎత్తిపెట్టబోయింది. ఎత్తలేక పోయింది .

“ఇంత చిన్న పెట్టి ఎత్తలేదండీ ఈ మరియా సుకుమారి” అని నవ్వాడాయన.

ఆమె నిసికి దగ్గరగా వచ్చి, ఒక సేండ్విచ్ ఇచ్చింది. “నేనే చేశాను. బాగుంటుంది తినండి” అంది నవ్వుతూ.

నిసికి ఆమె ముఖం చాల దగ్గరగా వచ్చింది. సిగరెట్ వాసన తగిలింది. “తీసుకోండి” అంటూ ఆమె నవ్వింది. ఆ నవ్వులో ఎడమ కన్ను మూత, ఆ మెడ వంపులో ఒక పూర్ణత, ఆ చెయ్యి – ఆ ఎడమ చెయ్యికి బలమే లేదే.

నిసికి ఒక్క సారి చిరపరిచితుడయిన శత్రువు ముఖంలో ముఖం పెట్టినట్లయ్యింది. షెర్లాక్ హోమ్స్‌కి గాని హంతకుడు అనుకోని ప్రదేశంలో, ఆకస్మికంగా వచ్చి ఎదురు నిలిస్తే…
అమె ఒక్క సారి లేచి నుంచుంది. అరిచేతుల్లో చెమటలు. పెదాలు కొరుక్కుంది. అటూ ఇటూ చూసింది. మళ్ళీ కూర్చుంది.

“మరియా! మీరు అలా కూర్చోండి. నేను ఈ కోక్ తీసుకుంటాను. నా పక్కనే కూర్చోండి . మీరు చాన్నాళ్ళుగా సిగరెట్లు తాగుతున్నారా? మీకు ఎడమ చెయ్యి బాగా పట్టు ఇస్తున్నట్లు లేదు. ఎడమ భుజం ఎన్నాళ్ళ నుంచీ నొప్పి?” అంటూనే మరియా మెడ వంక పరిశీలనగా చూసింది. చెయ్యి వెయ్యక్కర్లేదు. తనకు బాగా తెలుసు. ఆ ఎడమ పక్కన కాలర్ బోన్ పైగా ఉన్న స్కెలెనీ లింఫ్ నోడ్. మరియా “మీకెలా తెలుసు, నే నెవ్వరికీ నా నెప్పి సంగతి ఇంతవరకూ చెప్పందే?” అంది.

ఫేమిలీ అంతా చుట్టూ చేరారు.

“మీకు వీపులో కూడా పైన వెన్నెముక పక్కనే నెప్పి వస్తుంది. అవునా?”

ఆమె కళ్ళు పెద్దవిచెయ్యబొయ్యింది. కానీ, కుడి కన్నుఒక్కటే పెద్దదయింది. ఎడమ కన్నురెప్ప సగం వాలి ఉంది.

“మీకెలా తెలుసు?” ఆమె ముఖాన చెమటలు పోశాయి.

నిసి చూస్తూనే ఉంది . చెమటలు కుడిపక్కనే. మరియా ఎడమ వైపు ముఖం పొడిగా ఉంది.

నిసికి చాలా దిగులు వేసింది. ‘దైవమా! ఏమిటి ఈ పరిస్థితి. నన్ను ఇందుకే సృష్టించావా? ప్రేమగా పలకరించారు. వారి పక్కన కూర్చోపెట్టుకున్నారు. నా చేతిలో తినమని వారు వండి తెచ్చుకున్న తిండి పెడుతున్నారు. నేను ఇప్పుడు వారికి విషం లాంటి వార్త ఇవ్వబోతున్నా. తను చెప్పాలా, మౌనంగా తన దోవన ఇంటికి పోవాలా? కనీసం వారు తృప్తిగా తినేవరకైనా తను వేచి ఉండాలా? తను చెప్పబొయే దానికి మంచి సమయమంటూ ఉందా?’

“మరియా! మీరు నిదానించాలి. నేను చెప్పేది ఆదుర్దా కలిగించే విషయమే. ఐనా మీరు నిదానంగా వినాలి . మీరు ఆలస్యం చెయ్యకుండా మీ డాక్టరును చూడాలి. చాలా విచిత్రమైన సంఘటన ఇది, మీరూ నేనూ ఇక్కడ కలవటం. నేను మీమీద చెయ్యి వెయ్యకుండా, ఒక్క పరీక్ష చెయ్యకుండా ఈ మాట చెప్పకూడదు. ఇప్పుడు నేను డాక్టరు వృత్తిలో లేకుండా ఈ విషయం అసలు చెప్పకూడదు. కాని మీరు వీలైనంత తొందరలో మీ ఇంటికి తిరిగి వెళ్ళి డాక్టరును సంప్రదించాలి. ”

“డాక్టర్! మీరు మా ఆయనతో మాట్లాడుతుండగా మీ మాటలు ఇంతకు ముందు నేను కొద్దికొద్దిగా విన్నాను. నేను ఉత్త హౌస్‌వైఫ్ నే ఐనా ధైర్యం కల దాన్నే. మీరు చాలా పెద్ద హాస్పిటల్లో చాలా ఏళ్ళు పని చేసినట్లున్నారు. కొంతవరకైనా చెప్పండి.”

“మీకు పేంకోస్ట్ ట్యూమర్ ఉన్నదని నా అనుమానం. అది ఒక రకమైన లంగ్ కేన్సర్. మీరు వెంటనే డాక్టరుతో ఎప్పాయింట్‌మెంట్ తీసుకోండి. మీరు వెంటనే పరీక్షలూ, నా అనుమానం సరైతే, వెంటనే వైద్యమూ చేయించుకోవాలి. రెండు మూడు రోజుల్లో నే చెప్పిన విషయం నిజమా కాదా పరీక్షల్లో తేలిపోతుంది. ”

ఆ తర్వాత కొద్ది నిమిషాలు నిసి తల తిరిగేలా ఇటాలియన్ భాషలో అందరూ ఒక్కసారే ఆమె కన్నిపక్కలా పెద్ద పెద్దగా గోలగా మాట్లాడుకునారు. పక్కనున్న ఆడవాళ్ళు వచ్చి మరియాను కౌగిలించుకున్నారు. హెర్క్యులీస్ లేచి వచ్చి తాతను భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు. కొంచెం సేపట్లో వారు తేరుకుని నిసి దగ్గరకు వచ్చి , ఆమె మరియాను ఇంకా పరీక్ష చేస్తుందేమో కావాలంటే ఇంటికి తీసుకు వస్తాం అని చెప్పారు. నిసి షామల్ తను అలా చెయ్యకూడదనీ , అంతకు ముందు ఆ పెద్దాయన తమ్ముడు న్యూజెర్సీలో వైద్యం చేయించుకున్న డాక్టర్ను పిలిస్తే అక్కడినించి ఏం చెయ్యాలో ఆ డాక్టరు చక్కగా చెపుతాడనీ, ఆ డాక్టరును కావాలంటే తనకు ఫోన్ చెయ్యమనీ చెప్పింది. వాళ్ళు ఆమె ఫోన్ నంబర్ అడిగారు. నిసి సంచీలోంచి ఆమె కవిత్వం రాసుకోటానికి తెచ్చుకున్న పుస్తకంలో ఒక కాగితం మీద ‘నిసి షామల్, నేపుల్స్, ఫ్లారిడా’ అని రాసి, కాగితం చించి వారికి ఇచ్చి, ‘ఈ సమాచారం చాలు ఆ డాక్టరు అవసరమైతే ఆయనే ఫోన్ చేస్తాడు, అలా ఐతే తనకు అన్ని విషయాలూ సక్రమంగా జరిగాయో లేవో స్పష్టంగా తెలుస్తుంది’ అని చెప్పి, పెద్దాయనకు వీడ్కోలు చెప్పి, మరియాతో విడిగా “నన్నుమీరు క్షమించాలి. నేను వెళ్ళనా” అని ఆమె ముఖంలోకి ప్రాధేయ పూర్వకంగా చూసి వెళ్ళి పోయింది. నిసికి వెనక నుండి ఇటాలియన్లో మళ్ళీ అందరూ ఒక్కసారే గోలగోలగా మాట్లాడ్డం వినిపించింది.

తన సైకిల్ మీద ఇంటికి వెళ్ళాక కొంచెం సేపు మౌనంగా పడుకున్న నిసికి చటుక్కున గుర్తొచ్చింది. రెజిస్ట్రీ రిసార్ట్‌లో ఆ సాయంత్రం టౌన్ హాల్ ఎరేంజ్ చేసిన ఒక ఉపన్యాసం ఉంది. వాచ్‌ చూసుకుంటే, ఓ మై గాడ్! ఎంతో టైమ్ లేదు.

నిసి గబగబా స్నానం చేసి చేతికందిన బట్టలు వేసుకుని కారు తీసుకుని సీ గేట్ డ్రైవ్‌లో హోటెల్ వైపు వెళ్ళేసరికి మైలు దూరం నుండే కార్లు వరసలు తీరి ఉన్నాయి.

నిసి తనను తనే తిట్టుకుంది. కేబ్ తీసుకోవాల్సింది. వాలే పార్కింగ్ ఉంటుంది. ఐనా ముందు అక్కడి దాకా చేరాలిగదా!

ఎలాగైతేనేం ఒక ముప్పయ్ – నలభై నిమిషాల తర్వాత హోటెల్ పోర్టికోలో, కారు వాలే ని పార్క్ చెయ్యమంటూ వదిలేసి లోనికి చకచక నడిచి, ఎస్కలేటర్ మీదుగా పైకి వెళ్ళింది. ఎక్కడ చూసినా సెక్యూరిటీ. లెక్చర్ హాల్ తలుపులు తీశారు. చాలామంది అప్పటికే లోపల కూర్చుని ఉన్నారు. లౌంజ్‌లో అక్కడక్కడ ముస్లిం, అరబ్ ముఖాలు కనిపిస్తున్నాయి. నేపుల్స్ లో కొంతమంది చాలా ధనవంతులైన ముస్లిములున్నారని ఆమె విని ఉంది. చెదురు మదురుగా బైట ఇంకా మనుషులున్నారు. రెజిస్ట్రేషన్ బల్ల దగ్గరకు వెళ్ళి ఐడెంటిఫికేషన్ చూపించి తన నేమ్ టేగ్ తీసుకుంది. ఈ పనులు ఆమె చేస్తుండగా లౌంజ్‌లో మిగిలిన కొందరు లోపలికి వెళ్ళి కూర్చుంటున్నారు.

వేగంగా కొట్టుకునే గుండెను కుదుట పరుచుకుని ఎలాగో, అషర్స్ సహాయంతో తన సీట్లొ వెళ్ళి కూర్చుంది. నిసి మనసు ఇంకా బీచ్‌ని వదిలి రాలేదు. ఆ సభలో వక్తను పరిచయం చేసే వాక్యాలు ఆమె సరిగా విననే లేదు. ‘ఆ ఇటాలియన్ కుటుంబం ఏం చేస్తున్నదో, తనను శపించుకుంటున్నారేమో, ఎంత బాధ పడుతున్నారో’ అనుకుంది నిసి.

ఈ కలవరంలో ఉండగానే కరతాళ ధ్వనులు మారు మోగుతుండగా మెరుపు తీగలాగా స్టేజ్ మీదకు వచ్చి మైక్ దగ్గిర నిల్చింది – బేనజీర్ భుట్టో!

నిసి ఆమె అందానికి ముగ్ధురాలై పోయింది. బేనజీర్ సన్నని పొడుగు మనిషి . చక్కని గులాబీ వర్ణపు ముసల్మాన్ సుందరి. తలమీద తెల్లని మేలి ముసుగు- పొడుగు కోటు లాంటి చొక్కా. ఆమె దుస్తులు కొంచెం ముస్లిం వస్త్రధారణ అనిపించేట్లూ ఉన్నాయి. కొంచెం పాశ్చాత్యవనిత వస్త్రధారణ లాగానూ అనిపించేట్లూ ఉన్నాయి. ఆమె గొంతు తియ్యగా ఉంది. హార్వర్డ్ లో చదివినా ఆమె ఆంగ్ల ఉచ్చారణ ఇండియా, పాకిస్తాన్ వనితల ఇంగ్లీషు ఉచ్చారణను స్ఫురణకు తెస్తున్నది. బహుశా ఆమె దుబాయిలో ఉంటున్నందువల్ల ఆ ప్రభావం కూడా ఆమె అప్పటి ఇంగ్లీషు ఉచ్చారణ మీద ఉందేమో.

బేనజీర్ ఒక గంట సేపు ఇస్లాం మతం – అమెరికా డెమోక్రసీలు ఒక దానితో ఒకటి ఎలా సమన్వయ పరచవచ్చో ఉపన్యసించింది. ఆ ఉపన్యాసంలో ఆమెకు ఇస్లామ్ మీద ఉన్న గాఢమైన నమ్మకం స్పష్టం అయింది. అమెరికా విశ్వవిద్యాలయం చదువు తన పెరుగుదలలో ఎంత ప్రభావం చూపించిందో, ఆ చదువు తను పాకిస్తాన్ ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు ఎంత ఉపయోగపడిందో చెప్పింది.

హాల్లో ఎన్నో రంగుల అమెరికన్లున్నారు. ఆమె అందానికీ, తెలివికీ ముచ్చట పడుతూ ప్రశాంతంగా ఆమె మాటలు వింటున్నారు శ్రోతలు.

ప్రజాస్వామ్యం మీద, ఆడవారి భద్రత, చదువుల మీద, పాకిస్తాన్లో శాంతికరమైన ప్రజా పరిపాలన ఏర్పడటం మీద ఆమెకు గల ఉత్సాహం వివరించి చెప్పింది. ఆ విషయాలు చెపుతూనే తన బాల్యం, పాకిస్తాన్ రాజకీయాలు, తన తండ్రి ఉరితీత, అన్నదమ్ముల చావులు, తనమీద హత్యా ప్రయత్నాలు, ప్రభుత్వపు డబ్బు దొంగిలించినట్లుగా తన మీదా, భర్త మీదా అభియోగాలు, తన పదవీ చ్యుతి, తను పిల్లలతో వేరే దేశాల సంరక్షణలో తలదాచుకోటం – అన్నీ చెప్పింది.

ఒక రాజకీయ కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా, ఆమె చెప్పే విషాద చరిత్రని శ్రోతలు ఆసక్తితోనూ, సానుభూతితోనూ నిశ్శబ్దంగా విన్నారు.

బేనజీర్ -తన మీద పాకిస్తాన్ తిరిగి రమ్మని తన అభిమాన వర్గాల వారినుండి ప్రబలమైన ఒత్తిడి ఉన్నట్లూ, కాని తన కుటుంబ చరిత్ర చూస్తే తను పాకిస్తాన్ తిరిగి వెళ్ళటం ప్రాణహానికి దారి తీస్తుందనీ, తన పిల్లలు తల్లీ తండ్రీ లేని వారౌతారనీ దానికి వెరచి తను వేరే దేశాల ఆశ్రయంలో ఉండక తప్పటం లేదనీ స్పష్టంగా చెప్పింది. ఐనా అనుకూల పరస్థితులు ఏర్పడితే స్వదేశంలోనే జీవించాలని ఉన్నట్లూ, అమెరికా చదువు, అమెరికన్ ప్రజల ప్రభావం తన మీద ఎప్పటికీ ఉంటుందనీ, మతమేదైనా డెమోక్రసీ ప్రతి దేశానికీ మేలు అంటూ తన ఉపన్యాసం ఆశాజనకంగా ముగించింది.

ఉపన్యాసం అంతా విని, నిసి ఆమెను చూస్తూ, ఆమె అందానికి , సమరసమైన మాటలకు ఉప్పొంగుతూ, పేరుకు తగ్గ వనిత అనుకుంది. హోటెల్లో జనం రద్దీ తగ్గాక తన కారు తెప్పించుకుని, ఇంటికి చేరింది నిసి.


ఆ రోజు రాత్రి, ఆ 2003 వ సంసత్సరంలో, నిసి షామల్ తన డైరీలో ముగ్గురు స్త్ర్రీలు ఎవరు ఎంత కాలం బ్రతుకుతారో, వారిని గూర్చి తనకు తెలిసిన సమాచారం సహాయంతో అంచనాలు వేసి, ఒక్కొక్కరికీ జ్యోతిషం రాసింది. ఆ ముగ్గురు స్త్ర్రీలు సమ వయస్కులే. కాల చక్రం దొర్లింది. ఇప్పుడు 2008 సంవత్సరం నడుస్తున్నది. ఆ నాటి ముగ్గురు వనితల్లో, కనీసం ఇద్దరి భవిష్యత్తు నిసి సరిగ్గా చెప్పగలిగిందని, ఇప్పటికి ఆ డైరీకి తెలుసు.