చినభూషయ్య కోలగదిలో ఒంటరిగా కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.
చినభూషయ్యకి గత ఆరునెలలనుంచీ రాత్రుళ్ళు సరిగా నిద్ర పట్టడం లేదు. ఒకవేళ ఏ అర్థరాత్రో కాస్త నిద్ర పట్టినా అది కలతనిద్ర. ఆ కలతనిద్రలో ఏవిటో భూగోళం భూగోళం అని కలవరిస్తున్నాడు. చిన భూషయ్య హయాం కొద్దినెలల్లో పూర్తికావస్తోంది. దానా రాశయ్య మంత్రిపదవి వదిలేసింతర్వాత మళ్ళీ ఐపులేడు. పోతే, డేగా చెన్నయ్య ఈ మధ్య తప్పుకొని తప్పుకొని కనిపించకండా తిరుగుతున్నాడు. ఎప్పుడన్నా కనిపిస్తే, తనని పలకరించడమే మానేశాడు. పోనీ తను పలకరిస్తే ఎందుకో మరీ ముభావంగా ఉంటున్నాడు. ఏమిటయ్యా చెన్నయ్యా అని బతిమలాడుతూ అడిగితే, ఆరోగ్యం బాగాలేదని వంక పెట్టడం మొదలెట్టాడు!
ఈ చెన్నయ్యేకదా, ఐదేళ్ళక్రితం ఉలవగుగ్గిళ్ళకోసం ఆ ఆగ్నేయమూకని నానామాటలూ అని రెచ్చగొట్టి , వాళ్ళ మీద నానాఅబద్ధాలూ చెప్పి వాళ్ళతో కాలుదువ్వి కయ్యం తెచ్చి పెట్టించాడు. వాళ్ళని చెప్పుకింద ధనియాల్లా నలగకొట్టేస్తాం అని చెప్పాడు. వాళ్ళేమో ఇప్పుడు చెప్పుల్లో తేళ్ళయి కూచున్నారు. వాళ్ళ విషయం తాడోపేడో తేలిపోయేదాకానన్నా తనకి అండగా ఉండద్దూ? ఏమిటో, ఎవడినీ నమ్మడానికి వీలులేని పరిస్థితి. ఇకపోతే, గుగ్గిళ్ళ వ్యవహారం అంతకుపూర్వమే నయం. అప్పుడప్పుడు ఆమూక దగ్గిరనుంచి గుగ్గిళ్ళు దిగుమతి చేసుకోవడానికి వీలుండేది ; బెదిరించో, లంచం పారేసో! చినభూషయ్య ప్రాంతంలో గుర్రాలు హాయిగా బలిసి తిరుగుతూవుండేవి. ఇప్పుడో, అది సున్నా! అక్కడనుంచి ఆకాసిని గుగ్గిళ్ళు కూడా రావటల్లేదు, కరువుకాలం దాపురించినట్టు! ఇప్పుడు బజార్లో గుగ్గిళ్ళ ధర ఆకాశాని కంటుతున్నది. ఐదేళ్ళల్లో కుంచం గుగ్గిళ్ళ ధర మూడు రెట్లు పెరిగిపోయింది. ప్రతి ఇంటి గుమ్మం ముందు కట్టేసిన పెద్ద చిన్నఅన్ని సైజుల గుర్రాలూ బక్కచిక్కి పోతున్నాయి. కొన్నింటికయితే, వంటినిండా దుమ్ముకొట్టుకొని కాసిని నీళ్ళిచ్చి కడిగే నాథుడుకూడా లేకండా పడిఉన్నాయి. గుర్రాలని అమ్ముకునే షావుకారులంతా విపరీతంగా నష్టపోతున్నారు. గుర్రాల అమ్మకం బాగా పడిపోయింది. పెద్దగుర్రాల అమ్మకం అయితే చెప్పనక్కరే లేదు. అదిపూర్తిగా సున్నా! పాపం! వాళ్ళయితే దివాలా తీసేస్తున్నారు; వ్యాపారాలు దూరంగా తూర్పు వాళ్ళకి అమ్ముకుంటున్నారు.. అందులో కొందరయితే, ముఖ్యంగా పెద్దపెద్దగుర్రాలని అమ్ముకునేవాళ్ళు తనమీద తిరగబడేట్టు కనిపిస్తున్నారు. డబ్బూపోయింది శనీ పట్టిందన్నట్టు తయారయ్యింది, ఈ గుగ్గిళ్ళ వ్యవహారం! మరి ఈ వ్యహారం ఇల్లా ముదిరితే, నిద్దరెల్లా పడుతుందీ?
పోనీ, తమ్ముడు బుల్లిభూషయ్య మహరాజుగా ఎంపిక అయ్యే అవకాశం ఏకొద్దిపాటయినా ఉంటే, ఈ ఉలవ గుగ్గిళ్ళ వ్యవహారం ఇంకా కొన్నేళ్ళపాటు వెనకనుండి నడిపించవచ్చునేమో! అప్పుడు చెన్నయ్య తప్పకండా రాశయ్యని మళ్ళీ రంగంలోకి దింపుతాడు. తనకి కాస్త మనశ్శాంతి ఉండేది. అయితే, బుల్లిభూషయ్యకి మహరాజయ్యే అవకాశం కాదుకదా, ఆ కాబోయే మహరాజు దగ్గిర చప్రాసీ అయ్యే అవకాశం కూడా కనిపించడల్లేదు. అదీ, ఇప్పటి పరిస్థితి. చినభూషయ్యకి ఈ విషమపరిస్థితిని ఏదోరకంగా మార్చగలమేమో అన్నదురాశ లేకపోలేదు. అందుకు మేకా కన్నయ్యని ఏదో రకంగా మాయచేసయినా సరే మహరాజుగా ఎంపికచేయించగలిగితే, కనీసం బుల్లిభూషయ్యకి ఒక చిన్నమంత్రిపదవైనా రావచ్చు. మనం ఇప్పుడే శ్రమ పడకపోతే, ఏ జిలారి కాంతమ్మో, బరకా ఓబయ్యో మహరాజయ్యారంటే, అంతా కుదేలే! మేకా కన్నయ్యని మహరాజుగా ఎంపికచెయ్యాలంటే, రాశయ్య, చెన్నయ్య, పెద్దయ్యలు వెంటనే చేతులుకలపాలి.
ఈ ఆలోచనలతో చినభూషయ్య బుర్ర పగిలిపోతున్నది. అందుచేతనే నిద్రపట్టక కోలగదిలో రోజూ ఒంటరిగా కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.
ఇలా చినభూషయ్య అవేదనపడుతూ ఉండంగా ఒకనాటి రాత్రి డేగాచెన్నయ్య పంచభుజి భవంతినుంచి నాలుగేసి ఇత్తడి నక్షత్రాల భుజకీర్తులు పెట్టుకున్నసేనాధిపతులనీ, సీయ్యా నగరంనుంచి గూఢచారి నాయక బృందాన్నీ వెంటపెట్టుకొని హుటాహుటీగా కోలగదిలోకి వచ్చాడు. చినభూషయ్యకి భయంవేసింది, ఏదో కొంపమునిగిందని.
చెన్నయ్య చెప్పాడు : “మీకు ఒక గొప్పవిషయం, అతిరహస్యమయిన విషయం చెప్పడానికికొచ్చాం.” ఈ బృందాన్ని తర్జనితో చూపిస్తూ, “మన వాళ్ళు చాలాముఖ్యమైన విషయం పసిగట్టారు. ఆరునెలలనుంచీ మేము అతి రహస్యంగా పనిచేస్తూ కనుక్కున్న విషయం మీకు చెప్పాలి,” అనంగానే చినభూషయ్య “బుల్లి భూషయ్య మహరాజవడానికి ఏదయినా పన్నాగం పన్నారా?” అని అడిగాడు.
“ఆవిషయం వదిలిపెట్టండి. అది ఏమంత ముఖ్యమైనది కాదు. మనకి ఉలవ గుగ్గిళ్ళు అన్నింటికన్నా ముఖ్యమైనవి. అవసరమైనవీనూ! ఈ గూఢచారిబృందం, ఈ భూగోళం మొత్తంలో కొన్నికోట్లకోట్లకోట్లు కుంచాల ఉలవ గుగ్గిళ్ళు దొరికే ప్రాంతం కనుక్కున్నారు. ఇన్నిగుగ్గిళ్ళు తమ ప్రాంతంలో దొరుకుతాయని ఆప్రజలకే పూర్తిగా తెలియదు. వెంటనే ఆలస్యం చెయ్యకండా మనం గనక,” అంటూ ఉండంగానే, చినభూషయ్య మద్యలో ఆపి, “ఆరునెలల నుంచీ మీకు ఈ విషయం తెలిసీ మహరాజునైన నాకు చెప్పకండా ఉంచారా? ఈ విషయం ఆరునెల్లకిందటే చెప్పితే, మనం గుర్రాలవ్యాపారులకి భరోసా ఇచ్చి, తమ్ముణ్ణి నాతరవాత మహరాజయ్యే పథకం మొదలు పెట్టేవాళ్ళం కదా?” అన్నాడు. వెంటనే, చెన్నయ్య ” మీకు బోధపడటల్లేదు. తమ్ముడి గోల కాస్సేపు ఆపండీ. ఇప్పుడు అది ముఖ్యం కాదని చెప్పానుగా! నామాట వినరేం? ” అని కాస్త గదవాయించాడు, ఇన్నేళ్ళల్లో మొట్టమొదటిసారిగా ఇంతమందిముందు!
కాస్త తేరుకొని, “ఇంతకీ ఆకొత్తగుగ్గిళ్ళ ప్రాంతం ఎక్కడ? ఏమిటి దాని కథ?” అని అడిగాడు, చినభూషయ్య సవినయంగా. వెంటనే, ఒక తెల్ల సేనాధిపతి కోటుజేబులోంచి కాయితం తీసి మడతలువిప్పి పక్కనున్న గుండ్రటిబల్ల మీద పెట్టాడు. అంతా ఆ బల్లచుట్టూ కందిరీగల్లా మూగారు. “ఈ భూగోళం మీద ఇరవై ఎనిమిదీ ముఫైఒకటో అక్షాంశం డెభై ఐదు ఎనభైయవ రేఖాంశం మధ్యా ఉన్న ఒక రెండుప్రాంతాల…” చినభూషయ్య అడ్డుపడి, ” ఆపవయ్యా ఆపు! చిన్నప్పుడు బళ్ళో మా జాగ్రఫీ మేష్టారు అక్షాంశాలూ, రేఖాంశాలూ అంటూ వుంటే నాకు ఒళ్ళు మండి పోయేది. మళ్ళీ నువ్వుమొదలెట్టావా ఈ వెధవ జాగ్రఫీ పాఠం?” అంటూ రుసరుసలాడాడు.
వెంటనే, చెన్నయ్య అందుకొని, “ఆప్రాంతంలో ప్రపంచంలోకల్లా ఎత్తైన కొండలున్నాయి. ఆకొండల కింద భూమిలో గుగ్గిళ్ళేగుగ్గిళ్ళు! అదీ అసలు విషయం, ” అన్నాడు.
“మరయితే ఇన్నాళ్ళు ఆగారేం? ఆకొండలని పిండిపిండి చేసిపారేసి మనకి కావలసిన గుగ్గిళ్ళు తెచ్చుకోవచ్చుగా?” అన్నాడు చినభూషయ్య. “అది అంత సులువైన పని కాదు. ఆకొండలకి ఉత్తరాన పసుప్పచ్చోళ్ళు, ఇటు దక్షిణాన చామనచాయోళ్ళూ ఉన్నారు. అటుజనాభా ఇటుజనాభా వెరసి మొత్తం మనజనాభాకి పదిరెట్లు. ఏ మాత్రం వాళ్ళకి తెలిసినా ముప్పే!” అన్నాడు చెన్నయ్య.
“అటువాళ్ళకి ఇటువాళ్ళకీ ఏదో మిషమీద యుద్ధం చేయిస్తే సరి! వాళ్ళిద్దరూ మనదగ్గిరకే వస్తారు,” అన్నాడు చినభూషయ్య. “ఆపని దగ్గిరదగ్గిర పాతికేళ్ళనుంచి మన పాత మహరాజులందరూ పనికట్టుకొని చేస్తూనే ఉన్నారు. కానీ ఈ జనం ఈ మధ్య తెలివిమీరిపోతున్నారు,” అన్నాడు ఓ గూఢచారి నాయకుడు. “అయితే మనం ఇద్దరిమీదా ఏదో నెపంతో బాంబులు వేస్తే సరి! వాళ్ళిద్దరి రోగం ఠక్కున కుదురుతుంది,” అన్నాడు చిన భూషయ్య. “అబ్బో! అది చాలా కష్టం. ఆ ఉత్తరాది వాళ్ళతో మనకి పెద్ద వ్యాపారం. అంతేకాకండా వాళ్ళకి చాలా పెద్ద సైనికబలం కూడా ఉంది,” అని అన్నాడు ఒక నాలుగు నక్షత్రాల సేనాధిపతి.
“అయితే ఆ దక్షిణాది నల్లోళ్ళకి చెప్పండి. మీ వేపు కొండల కింద గుగ్గిళ్ళు మా గుర్రాలకి కావాలి. మీరు మర్యాదగా ఇస్తారా సరే సరి. లేదంటే మేం మీ తోలు ఒలిచేస్తాం, అని చెప్పండి,” అన్నాడు చినభూషయ్య. “అది కూడా కష్టమే. ఈ మధ్యనే వాళ్ళుకూడా గుర్రాల వ్యాపారంలోకి దిగుతున్నారు. అక్కడజనానికి కూడా గుర్రాలమీద మోజు పెరిగింది. వాళ్ళకి అందుబాటులో ఉన్న గుగ్గిళ్ళు మనకి ఇమ్మంటే ఎలా ఇస్తారు?” అన్నాడు, మరో గూఢచారి నాయకుడు.
“ఇవ్వకపోతే యుద్ధమే. అయినా వాళ్ళకి అటూఇటూ ఎవ్వరూ విరోధులు లేరూ? ఉంటే, వాళ్ళతో మనం భేటీ చేస్తే సరి. వాళ్ళే కొండదిగి మన కాళ్ళదగ్గిర కొస్తారు,” అన్నాడు, చినభూషయ్య. “ఉన్నారు ఉన్నారు, వాళ్ళకి పశ్చిమాన ముష్కర జాతి నల్లవాళ్ళున్నారు. వాళ్ళకీ వీళ్ళకీ బద్ధవైరం. కానీ…” అని నీళ్ళు నవిలాడు చెన్నయ్య. ” చెప్పండి. ఆగిపోయారేం? ” అన్నాడు చిన భూషయ్య. ” వాళ్ళకి, అదే ఆ ముష్కరజాతి వాళ్ళకి మనం చాలాకాలంనుంచీ బాంబులు ఇస్తున్నాం. వాళ్ళకి వాటిని సరిగా వాడడం రాదు. అంతకన్నా తెలివైన పని, ఆ చామనఛాయ వాళ్ళకి పెద్దపెద్దవిమానాలు ఇచ్చి, పెద్దపెద్ద బాంబులు చేసుకోడానికి సహాయం చేస్తే, వాళ్ళు మనపార్టీలో చేరచ్చు,” అన్నాడు చెన్నయ్యతో వచ్చిన పెద్దగూఢచారి. “అంతేకాదు. అక్కడనుంచి మనప్రాంతానికి వలసకొచ్చిన చామనఛాయవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదోరకంగా వాళ్ళని మచ్చికచేసుకోని మనవేపుకి తిప్పుకుంటే, వాళ్ళే మనకి సాయం చేసిపెడతారు,” అన్నాడు మరో గూఢచారి నాయకుడు. “వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చెస్తాం?,” అని మరో గూఢచారి అడగంగానే, “ఒప్పుకోకపోతే, అందరినీ మూక ఉమ్మడిగా మీ దేశానికి ఇరవైనాలుగ్గంటల్లో పంపిచేస్తాం అని భయపెడితే, వాళ్ళే తోకముడుచుకొని ఒప్పుకుంటారు. ఆ జనం మనప్రాంతంలో బాగా గడించి, డబ్బూ దస్కం దాచిపెట్టారు. మీ ఆస్తంతా జప్తు చేస్తామని బెదిరిస్తే, నోరుమూసుకొ ని ఒప్పుకుంటారు. పైగా, వాళ్ళు వలసకొచ్చిన వాళ్ళు. మన పౌరసత్వం కూడా తీసుకోకండా మనని దోచేస్తున్నారు, ” అన్నాడు చెన్నయ్య దగ్గిర పనిచేసే ఆసామీ.
చినభూషయ్యకి ఈ పథకాలు ఏవీ సంతృప్తికరంగా కనిపించలేదు. “ఈ నల్లవాళ్ళ దగ్గిర పెద్దబాంబులు మనకన్నాఎక్కువ లేవుగదా! ముందు వాళ్ళకి నయాన చెప్పండి. ఒక రోజో, రెండురోజులో గడువు ఇవ్వండి. మన మాట వినకపోతే, ఆ పడమరదిక్కున ఉన్న ముష్కర జాతి వాళ్ళకి ఇంకాస్త డబ్బిచ్చి ఇంకొన్ని బాంబులిచ్చి వాళ్ళచేతే జరిపించండి వ్యవహారం. అది గనక నెగ్గకపోతే, అప్పుడు మనమే బాంబుల వర్షం కురిపించేద్దాం, వాళ్ళిద్దరి మీదా ఏదో మిషమీద. అదేమీ మనకి చేతకానిపని అయితేకదా! మన గుర్రాలు మనకి చాలా ముఖ్యం. మనకి గుగ్గిళ్ళు చాలా అవసరం. ప్రస్తుతం అత్యవసరం. రేపే మొదలుపెట్టి ఆ చామంచాయోళ్ళమీద యుద్ధంకోసం కావలసిన పనులు ప్రారంభించండి,” అన్నాడు చినభూషయ్య, నాలుగునక్షత్రాల సేనాధిపతులను ఉద్దేశిస్తూ. డేగా చెన్నయ్య ముఖం విప్పారింది. చేటంత అయ్యింది. చినభూషయ్య చెవిలో అతి రహస్యంగా చెప్పాడు, “ఆ పని ప్రారంభం అయ్యిందని.”
“మనం గుగ్గిళ్ళకోసం ఆ పెద్ద కొండలమీదపెద్దపెద్ద బాంబులువేసి, అవన్నీ పిండిపిండి చేసిపారేస్తే ఇప్పు డక్కడున్న గుగ్గిళ్ళన్నీ బూడిదై పాలై పోవచ్చుగా? కొత్తగుగ్గిళ్ళు పంటకొ చ్చే టప్పటికీ ఎంతకాలం పడుతుందో ఏమో. అప్పుడు మనం మళ్ళీ మొదటికొస్తావేమో! ఇప్పుడు, ఆ ఆగ్నేయమూకతో జరిగింది సరిగ్గా అదేగా. అంతకన్నా మరేదన్నా మధ్యే మార్గం… ” అన్నాడు ఒక తలనెరిసిన నల్ల సేనాధిపతి, మొట్టమొదటిసారిగా నోరు విప్పి. “ఎప్పు డో రాబోయే యాతన గురించి ఇప్పుడు మనం ఆలోచించడం దేనికి? ఆనాటికి ఎవడు మహరాజుగా ఎంపికవుతాడో? అది వాడి ప్రాలుద్ధం!” అని అన్నాడు చెన్నయ్య చిరునవ్వు నవ్వుతూ, చినభూషయ్య బుజంతడుతూ!
ఆరునెల్లతరువాత ఈరాత్రి, మొట్టమొదటిసారిగా, చినభూషయ్య కలవరించకండా హాయిగా నిద్ర పోయాడు.