ఒక్కసారి ఉలిక్కిపడి నిద్ర లేచి అతను చుట్టూ చూశాడు. దూరంగా సోఫాలో ఆమె కూర్చునుంది.
“ఏమయ్యింది? నిద్ర పట్టలేదా?” అడిగాడు.
లేదన్నట్లు తలూపి, ఓ క్షణం తర్వాత తనే అంది, “రాఘవ పోయాడట. సరళ వాట్సాప్ చేసింది.”
రాఘవెవరో అతనికి బాగా తెలుసు.
“అనూకి చెప్పావా?” లేదన్నట్లు తలూపింది.
“నేను హైద్రాబాద్ వెళదామనుకుంటున్నాను. వస్తానంటే అనూతో కలిసి…”
“ఎప్పుడు పోయాడట?” ప్రశ్న వేశాడు.
“నిన్న రాత్రి.” జవాబిచ్చిందామె.
“నేను ఫ్లైట్ దొరుకుతుందో లేదోనని వెతికాను. ఉదయం 8:30కి హైద్రాబాద్ ఫ్లైట్ ఖాళీగానే వుంది. నువ్వు లేచాక చెబుదామని ఆగాను. ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను, అనూతో కలసి. అమెరికాలో ఉంటే ఎలాగూ రాలేని పరిస్థితి. ఎలాగూ ఇండియా వచ్చాం. ఎట్ లీస్ట్…” మాటలు మధ్యలో ఆపేసింది ఆమె.
“మనం రేపుదయమే మైసూరు వెళదామని ప్లాన్ చేశాం…” అతనూ మధ్యలోనే ఆపేశాడు.
“అక్కడెంతో సేపుండం. సాయంత్రం ఫ్లైట్‍కి తిరిగొచ్చేస్తాం.”
అలాగే అన్నట్లు తలూపాడు. టికట్స్ బుక్ చేయడానికని ల్యాప్ టాప్ తీశాడు.
“నేను బుక్ చేస్తానులే. నువ్వెళ్ళి అనూని నిద్రలేపి విషయం చెప్పు. నేను ఇప్పుడే సరళకి ఫోన్ చేసి చెబుతాను. వచ్చేవరకూ బాడీని వుంచమని…” అంటూ సోఫాలోంచి లేచింది.
అతను డోర్ తీసుకొని పక్క గదిలోకి వెళ్ళాడు. ఈ లోగా ఆమె టికట్స్ బుక్ చేయడానికి ఆయత్తమయ్యింది. ఓ పదినిమిషాల తరువాత రుసరుసలాడుతూ వచ్చింది అనూ.
“మామ్! వాడు పోయాడు. పీడా వదిలింది. ఐ యామ్ నాట్ కమింగ్…”
ఆమె మాట్లాడలేదు. అతను వాళ్ళిద్దరికేసీ చూస్తున్నాడు, ఏం చెప్పాలో తెలీక.
“నీకు రావడం ఇష్టం లేకపోతే మానెయ్! పిచ్చి వాగుడు వాగకు.” కోపంగా అంది. అనూ వినే పరిస్థితిలో లేదని ఆమెకు తెలుసు.
“టికట్స్ బుక్ చేశాను. రిటర్న్ ఫ్లైట్ అయిదింటికి వుంది. నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను. నువ్వూ రెడీ కా!” అంటూ ఆమె బాత్రూమ్ వైపుగా వెళ్ళింది.
“అనూకి ఎంతో సర్ది చెప్పాను. ఒక్కసారి ఆఖరి చూపైనా చూసిరమ్మని.” కారులో ఎయిర్‌పోర్టు వెళుతుండగా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అన్నాడతను.
“దానిష్టం. నాకైతే వెళ్ళాలనిపించింది. అదీ ఇండియాలోనే వున్నాం కనుక. వెళ్ళలేకపోయానన్న గిల్ట్‌ని జీవితాతం మొయ్యదల్చుకోలేదు. రాఘవకి నేనంటే పిచ్చి ప్రేమ. టూ మచ్ పొసెసివ్‌నెస్. అదే అతన్నుండి పారిపోయేలా చేసింది. మంచాడే. కానీ మూర్ఖుడు. ఎనేవే హీ ఈజ్ గాన్! అనూకి ఎందుకు అతనంటే చీదరింపో నాకర్థం కాదు. నిజానికి అతనికి అనూ అంటే వెర్రి ప్రేమ…” మనసులో మెదిలే ఆలోచన్లు పైకి అందామె.
“నువ్వు ప్రయాణమవుతావని నేనకోలేదు. ఎలాగూ తెగిపోయిన రిలేషన్ కదా అనుకున్నాను.” కారులోంచి బయటకు చూస్తూ అన్నాడు.
“చెప్పానుగా. లోపలెక్కడో మిగిలున్న చిన్న గిల్ట్. నిజానికి రాఘవే మన పరిచయానికి కారణం కూడా. నాకతనిమీద కోపం లేదు. అలాని అతన్ని తట్టుకోలేను కూడా. ఆ సఫొకేషన్ భరించలేను.” ఒక్కసారి గట్టిగా బయటకి ఊపిరి వదిలిందామె.
“అంటే ఈ పన్నెండేళ్ళలో ఇంకా అతన్ని మర్చిపోలేదా?”
“మర్చిపోయానని అబద్ధం చెప్పలేను. అలాని గుర్తు రాకుండానూ లేడు. గుర్తు రానట్టు పైకి నటిస్తామంతే. రిలేషన్స్ తెంచుకున్నంత సులువుగా ఆలోచన్లూ, అనుభవాలూ ఓ పట్టాన తెగవు. ఐ జస్ట్ మూవ్‍డ్ ఆన్.”
“యూ ఆర్ బ్రూటల్లీ ఆనెస్ట్.” అన్నాడతను.
“రాఘవ నా ఫేవరెట్ రైటర్. కాలేజీలో వున్నప్పుడు అతని రచనలు చదివి పిచ్చెక్కిపోయేది. చెప్పానుగా, నేనే అతని వెంటపడ్డాను. నా అందం చూసి అతను పడిపోయాడు. రియాలిటీ ఈజ్ స్ట్రేంజర్ దేన్ ఫిక్షన్! ప్రేమ వేరు. జీవితం వేరు. అందం, ఆకర్షణ, మొదటి దానికి ఇన్వెస్ట్‌మెంట్! ఆదాయం, దాని ఫ్లిప్ సైడ్! ఫ్రస్ట్రేషన్ బ్రేక్స్ ఎమోషన్స్ -ఎందుకొచ్చిన జీవితమని ఇద్దరికీ అనిపించిన క్షణాలు సవాలక్ష పుట్టుకొస్తాయి పైకి వెళ్ళగక్క లేకపోయినా. ప్యూర్ లవ్ అనేది ఒక మిత్” కళ్ళేగరేస్తూ అందామె.
గట్టిగా నవ్వాడతను. “జస్ట్ మనీ ఒకటేనా అతన్నుండి నువ్వొచ్చెయ్యడానికి?”
“కాదు. నా అందం. అతను ఒక సినిమాకి పనిచేశాడు. పత్రికల్లో పని చేసేకంటే, సినిమా అయితే కాస్త డబ్బులు ముడతాయని. ఒకసారి షూటింగ్‌కి నన్నూ తీసుకెళ్ళాడు. ఆ సినిమా హీరో నాతో చనువుగా మెదలడం అతనిలో మొగాణ్ణి కెలికింది. చిన్నాచితకా అనుమానాలూ… అలాని అతను నన్నెప్పుడూ తిట్టలేదు, కొట్టలేదు. అతన్ని భరించే ఓపిక లేకపోయింది. ఆ తరువాత నీతో పరిచయం… అలా. ఒకటైతే చెప్పగలను. అతనికి అనూ అంటే పిచ్చి, ప్రాణం. మాకు ఏం కావాలంటే అవి తెచ్చిచ్చేవాడు. వన్ వే ఐ పిటీ హిమ్. ఎనీ వే హీ ఈజ్ నో మోర్…”
ఎయిర్‍పోర్టులోకి దారితీసిందా కారు.
సాయంత్రం ఏడింటికి ఆమెను పిక్ చేసుకోడానికి ఎయిర్‌పోర్టుకి వెళ్ళాడతను.
“ఎలా జరిగింది? నీ విజిట్?”
“అన్ని చావు విజిట్స్ లాగానే ఇదీనూ. నన్ను చూసి సరళ బావురుమంది. అతను అనారోగ్యంతో మంచం పట్టాడని, లివర్ ప్రాబ్లమ్స్ అనీ చెప్పింది. చివర్లో అనూని చూడాలని ఏడ్చాడనీ…” మధ్యలో ఆపేసింది.
“నువ్వొచ్చావని ఎవరూ ఆశ్చర్యపోలేదా?”
“నేనుండగా ఒకరిద్దరు రైటర్స్ వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు నాకు తెలిసినా పలకరించలేదు. ఓ ఫ్లవర్ బొకే పెట్టొచ్చేశాను. ఎవరితోనూ మాట్లాడలేదు. చెప్పానుగా, నే వెళ్ళింది నాకోసం. అతనంటే జాలి వుంది. ప్రేమ లేదు. అతన్ని చూశాకా అనూ వచ్చుంటే బావుండేదని నాకూ అనిపించింది. ఎంతైనా కన్న తండ్రికదా? ఇప్పుడు నాకనిపించిన గిల్టే ముందు ముందు అనూకి రావచ్చు అనిపించింది.”
ఆమె గొంతు మారడం అతను గ్రహించాడు.
“నిన్ను అతను రూమ్‌లో పెట్టి తాళం వేసి వెళిపోయేవాడట కదా?” ప్రశ్న కంటే నువ్వెందుకిది నాకు చెప్పలేదన్న ధ్వని ఆమెను గుచ్చింది. అతనికి అనూ చెప్పిందని అర్థమయ్యింది.
“ఆ సినిమా అతను నా వెంట పడ్డాడు. రెండు మూడు సార్లు ఇంటికి రావడం తెలిసి బయట తాళం వేసుకొని వెళ్ళాడు. పైగా అదీ ఒకసారే. ఎదురుతిరిగితే మానేశాడు. అనూకి అతనంటే కోపానికి అదొక కారణం కూడా. నువ్వు రేమండ్ కార్వర్ రాసిన కథ, పాపులర్ మెకానిక్స్ చదివావా? అలాంటిదే మా రిలేషనూ…” వివరించిందామె. ఆ సినిమా అతనితో తనకి శారీరక సంబంధమున్న సంగతి మాత్రం పైకనలేదు.
“చిన్న మనసు గాయపడుంటుంది.”
“నిజానికి మేం వదిలి వెళ్ళిపోయామన్న గాయమే అతన్ని ఈ పన్నెండేళ్ళూ పిప్పి చేసేసింది. చెప్పానుగా అనూని అతను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.”
వెంటనే హ్యాండ్‌బ్యాగ్ లోంచి ఒక కవరు తీసి అతని చేతిలో పెట్టింది. ఏంటిది? అన్నట్లు చూశాడు. సీతాఫలమండిలో వున్న రాఘవ ఇల్లు అనూ పేర రాయించాడట. సరళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చిందని చెప్పింది.
“ఐ డోంట్ థింక్ అనూ విల్ టేక్ దిస్…” అనుమానంగా అన్నాడు. ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు.
ఇంటికొచ్చాక ఆ కవర్ అతను అనూకి ఇచ్చాడు, మీ డ్యాడ్ ఇచ్చాడంటూ.
“హీ ఈజ్ నాట్ మై డ్యాడ్. యూ ఆర్ మై డ్యాడ్!” అంటూ ఆ కవర్ విసిరికొట్టింది.
“తప్పు. అది మీ నాన్న నుండి నీకు వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు దాని విలువ రెండు కోట్లు వుంటుంది, ముందున్న స్థలంతో కలుపుకొని.” సర్ది చెప్పాడు.
వెంటనే వెళ్ళి కవర్ తెరిచి చూసింది అనూ.
మనుషుల్ని ద్వేషించినంత సులభంగా వస్తువుల్నీ, ఆస్తుల్నీ ద్వేషించలేం. ఎంతైనా తన వారసత్వం కదా? అనుకుందామె.