(శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఆగష్ట్ 10న డెట్రాయిట్‌లో ఒక సభలో చేసిన ప్రసంగ వ్యాసమిది. శ్రీకాంతశర్మ గారు సంస్కృతాంధ్రాల్లో బాగా పరిచయం కలవారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించిన శ్రీ శర్మగారు “ఆకాశవాణి”లో చాలకాలం పనిచేసారు. తరవాత “ఆంధ్రప్రభ” వార పత్రికకు నాలుగేళ్ళు ప్రధాన సంపాదకుడిగా పనిచేసారు. సాహిత్యంలోని చాలా ప్రక్రియల్లో వారికి పరిచయం ఉన్నా, “వచన పద్యం” అంటే మోజు ఎక్కువ! ఈ ప్రసంగం గంటన్నరకి పైగా సాగటం వల్ల, “ఈమాట” పాఠకులకోసం, కొన్ని భాగాలుగా అందిస్తున్నాం. సం.)
ఈ మధ్యే అమెరికా వచ్చి, న్యూజర్సీ నుంచి ప్రారంభమయి, టెక్సస్ నుంచి కొలంబియా సౌత్ కారలీనా వరకు వెళ్ళి అక్కడనుండి మొన్ననే డెట్రాయిట్ వచ్చాము. ఇక్కడకు వచ్చిన వెంటనే, “మిత్రులం నలుగురం కలుస్తాము, ఏదైనా informal గా మాట్లాడితే బాగుంటుంద”ని సలహా ఇచ్చారు. 1995 నుంచి మాకు విష్ణుభొట్ల రామన్నలక్ష్మన్న కవలలు, అప్పాజోస్యుల సత్యనారాయణ గార్లతోటీ, వారి ఫౌండేషన్ తోటీ పరిచయం. మేము కలుసుకొని మాట్లాడుకొన్నప్పుడు కూడా, సంభాషణల్లో నాలుగు విషయాల గురించి చర్చించడం, ఏమైనా ఎక్కువగా తెలుసున్న విషయాల గురించి మరింతగా ఎక్కువగా మాట్లాడడం జరుగుతూ వచ్చింది! ఇక్కడకు వచ్చిన తరవాత, ఇష్టాగోష్టిగా, “దేని గురించి మాట్లాడ మంటారు?” అనడిగితే, మన లక్ష్మన్న గారు ఒక సలహా చెప్పారు. “సాహిత్యానికి సంబంధించి కొన్ని అపోహలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా ఉంటూ ఉంటాయి కూడా! తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు, ఇటువంటి అపోహలు కొన్నిటిని తీసుకుని ఆ అపోహలు, వాటిని తొలగించుకోటానికి ఉన్నఅవకాశాలు వాటి గురించి మాట్లాడండి!” అన్నారు.
ప్రాధమికమైన విషయం ఏమిటంటే, అసలు ఊహ అంటూ ఒకటి ఉంటే, అపోహకి ఆస్కారం ఉంది. సాహిత్యంలో creative writing గురించి మాత్రమే నేను మనవి చెయ్యదలచుకొన్నాను.. కధ, నవల, కావ్యం, పాట, నాటకం, లేక సంగీత రూపకం వీటన్నింటిలోనూ ఏ రకమైన హృదయ ధర్మాన్ని రచయిత ప్రకటిస్తున్నాడు? ఏ హృదయ ధర్మంతో పాఠకులు ప్రేక్షకులు, ఎట్లా దాన్ని స్వీకరిస్తున్నారు? వీటిల్లో ఉండే తేడాలను బట్టి, ఒక తరహా రచనని ఇష్టపడడం లేక ఇష్ట పడక పోడం జరుగుతుంది. ఒక తరహా రచనని అభిమానిస్తూ, ఇంకో తరహా రచన మీద అయిష్టాన్ని, తీవ్రంగానూ లేదా సకృత్తుగానూ ఏర్పాటు చేసుకోటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది.
నేను ఈ రోజు మాట్లాడే నాలుగు మాటలు కూడా ఒక చిన్న సంఘటన చెప్పడం ద్వారా ప్రారంభిస్తున్నాను.
ఒక రాజు గారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి ఏ ఏ సందర్భాలలో డబ్బు తినెయ్యటానికి అవకాశం ఉంటుందో, ఆ యా సందర్భాలు కని పెట్టి డబ్బు తినేస్తున్నాడు. ఈ రాజుగారి దగ్గర ఒక విదూషకుడు ఉన్నాడు. విదూషకుడికి ఒక స్వేచ్ఛ ఉంది. ఎవరి దగ్గర ఎంత మాటన్నా అతనికి చెల్లి పోతుంది! రెండవ సౌకర్యం ఏమిటంటే, రాజుకి పరమ ఆప్తుడు కావటం వల్ల, ఎవరూ విదూషకుడ్ని ఏమీ అనరు. ఈ దృష్య్టా విదూషకుడు, మంత్రి కనిపించినపుడల్లా, మాటలతో ఒక పోటు పొడవడం అనేది ఒక అలవాటయింది. భరించాడు, భరించాడు ఆ మంత్రి.ఒక రోజు రాజు ఎదురుగా విదూషకుడు, మంత్రిని ఏదో ఒక మాటన్నాడు. వెంటనే మంత్రి ఇంక భరించలేక, రాజుతో “అయ్యా! తమ విదూషకుడు హద్దు మీరుతున్నాడండి!” అన్నాడు. రాజు కూడా మంత్రి నిజాయితీని ఇతరుల ద్వారా ఇంతకు ముందు విని ఉన్నాడు. అప్పుడు రాజు నవ్వుతూ ” హద్దు మీరే వాడు ఒకడుంటే గాని హద్దు విలువ అర్ధం కాదు!” అన్నాడు. ఈ మాటలు “బిల్హణీయం” అన్న నాటకంలో గురజాడ అప్పారావు గారు చెప్పిన విషయాలు. (దురదృష్టవశాత్తూ, గురజాడవారు ఈ నాటకం పూర్తి చెయ్య లేదు!)
ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు మనవి చేసానంటే, సామాన్యంగా హద్దుల్ని మనం చాలా గౌరవిస్తాం! ఐతే ఈ “హద్దు” ల్ని మీరేవారు అప్పుడప్పుడు, అక్కడక్కడ కొందరుంటారు. ముఖ్యంగా సాంస్కృతికమైన విషయాల్లో! ఇలా ఎందుకు జరుగుతుందంటే, “నిన్నటి లాగా నేను ఈ రోజు మాట్లాడ కూడదు! నా పక్కనున్న రచయితలాగా నేను రాయకూడదు. అలాంటప్పుడు నాకు ఒక సొంత గొంతుక ఉండాలి. అప్పుడు పదిమంది మధ్యలోనూ కలసి పోకుండా, నాకు నేనుగా మాట్లాడిన వాడినౌతాను. నా వ్యక్తిత్వం అంటూ ఒకటి నేను ఏర్పరుచుకో గలుగుతాను!” అన్న ఆలోచనలవల్ల. “హద్దు మీరటం” (ఈ మాట కటువుగా, అదోలా అనిపించినా) అనేది ఒక పరిణామానికి, ఒక ముందడుగుకి సంకేతం అవుతుంది.
శ్రీశ్రీ కూడా ఒక తమాషా అయిన వచన పద్యం రాసారు మహాప్రస్థానంలో హద్దు మీరటం గురించి “వడ్డించిన విస్తరి మీ జీవితం, ఒక్కొక్కసారి మాకు విస్తరే దొరకదు” అని. చాలా సుఖవంతంగా, స్థిరపడిన విలువల్ని అంగీకరిస్తూ, వాటిని సమర్ధిస్తూ, నలిగిన బాటలో వెళ్ళిపోవటం అనేది శ్రమలేనిది, సుఖమైనది, అలవాటైనది, అందరూ తేలిగ్గా అంగీకరించేటువంటిది. అందువల్ల మనకి, సాంస్కృతికమైన అంశానికి వారసత్వం వహిస్తున్నాము అనుకొని, తృప్తి పడటానికి అవకాశం ఉంది.
సాహిత్యంలోకాని, ఇతర కళలలో గాని ఈ మార్పు అనేది ఎందుకు వస్తుంది? ఇందుకు సంబంధించి “కవిత్వం, ఆధునికత, సాహిత్యం” అన్న మూడు విషయాల్లో, కొన్ని అపోహల గురించి ఈ వాళ ముచ్చటిస్తాను. కొన్ని అపోహలంటే శ్రీశ్రీ “పుకారులు పలురకాలు”; పలురకాల “ప” కార “ఉ” కారాలన్నట్టు అపోహలు పలు రకాలు. అపోహలు రకరకాలైన స్థితుల్లో ఉంటాయి. కొన్ని కొంతకాలం అపోహలుగా చలామణి అయ్యి, ఆ తరవాత సదూహలుగా మారే అవకాశం ఉంది. లేదా సదూహగా చలామణి అయినది అపోహగా పరిగణించ వలసిన పరిస్థితి వస్తుంది.
ప్రధానంగా సాహిత్య విషయంలో, ముఖ్యంగా ప్రాచీననవ్య సాహిత్యంలో ఆలోచిస్తే, ఈ అపోహలు ఎలా ఉండచ్చు అనేదానికి ఉదాహరణగా ఇప్పుడు నేను చెప్పబోయే రెండు పద్యాల గురించి ఆలోచించండి!
యాతాయాత సుశీత వాతలహరీ హల్లీసక ప్రక్రియా
నీతాభోగ పరాగభోగమున వన్నెల్ దేరి ఆకాశమెం
తో తారుణ్యము నొందగా భువి నశాంతుల్ రేపి చూపెన్ ఫలా
సీ తీక్ష్ణ ప్రసవోగ్ర కారణము క్షుద్ శీత్కార దావాగ్నియై!
ఒక వసంత ఋతువు వచ్చిన సందర్భాన్ని వర్ణిస్తున్న పద్యం ఇది. ఆకాశం అంతా ఒక కొత్త వెలుతురుతో నిండిపోయినపుడు, భూమిమీద ఎర్రటి పూలు పూచిన మోదుగు చెట్లతో నిండిపోయిన ఒక వనం అంతా కూడా, భూమిలో ఉండే వేసవి అశాంతిని ప్రకటిస్తున్నట్టుగా ఉంది అనే వర్ణన ఇది.
ఇక రెండవ పద్యం
బాలపు చెక్కుటద్దముల పజ్జల కోమల మందహాస రే
ఖా లవ మంకురింపదు వికాసము చాలదు నెమ్మనమ్మునన్
వాలికమించు కన్గొనల వాకిట అల్లన సంచరింపనున్
జాలక చాల కుంటువడె చారు నిరీక్షణ ఖంజరీటముల్!
అప్పుడే వయస్సు వికసిస్తున్న ఒక ముగ్ధ ఆమె మానసిక పరిస్థితిని, అప్పుడే మనస్సులో వికసిస్తున్న సిగ్గుని వర్ణించిన పద్యం ఇది.
ఈ రెండు పద్యాలు, ఇద్దరు ప్రసిద్ధులైన కవులు కొన్ని వందల సంవత్సరాల తేడాలో రాసారు. “ఇందులో ఏది ఆధునిక పద్యం, ఏది ప్రాచీన పద్యం?” అని నేను మిత్రులని అడిగినప్పుడు “యాతాయాత…” అన్న పద్యం మంచి కమ్మెచ్చును లాగినట్టు వచ్చింది కనుక ఇది ప్రాచీన పద్యం, “బాలపు చెక్కుటద్దముల…” అన్న పద్యం భావ కవిత్వ యుగంలో ఏ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారో, వేదుల సత్యనారాయణ గారో రాసి ఉంటారు అని చెప్పేవారు. కాని వాస్తవేమిటంటే, “బాలపు చెక్కుటద్దముల…” అన్న పద్యం శ్రీనాధుడు రాసాడు, “యాతాయాత…” అన్న పద్యం దాశరధి కృష్ణమాచార్యులు గారు రాసారు. అంటే శైలిని బట్టిగాని, పద్యంలో పెట్టిన భావాన్ని బట్టిగాని, ఇది ప్రాచీనము ఇది ఆధునికము అన్నది మనం గుర్తు పట్టలేము.
(ఇంకా ఉంది)