మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు

త పన్నెండేళ్ళుగా తెలుగు సినిమా గురించి, ఆ రంగంలో పని చేసిన వారి గురించి విరివిగా పుస్తకాలు వెలువడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నా అభిమాన సంగీత దర్శకుల్లో ఒకరైన రమేశ్ నాయుడి గురించి ఒక పుస్తకమో, కనీసం ఒక పొడుగాటి వ్యాసమో రాస్తారని యెదురు చూస్తున్న నాకు నిరాశే మిగిలింది. నాకు తెలిసినంతలో ఆయన పైన వచ్చిన ఒకే ఒక్క నిడివైన వ్యాసం వి.ఎ.కె. రంగారావుగారు విజయచిత్ర పత్రికలో రాసిన నివాళి (సెప్టెంబర్-అక్టోబర్ 1988 ప్రాంతం). ఆ వ్యాసం నాకు ప్రస్తుతం అందుబాటులో లేదు కానీ, నాకు తెలిసిన వివరాలు, ముఖ్యంగా ఆయన తొలిరోజుల్లో చేసిన చిత్రాల గురించి, ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చదివిన వారెవరైనా మరిన్ని వివరాలు – 1961, 71 మధ్య కాలం నాటివి – తెలియ పరుస్తారేమోననే ఆశ కూడా నన్ను ఈ వ్యాసం రాయడానికి పురికొల్పింది.

1933లో కృష్ణాజిల్లా కొండపల్లిలో జన్మించిన రమేశ్ నాయుడు వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలిసింది నిజానికి చాలా తక్కువ. బాల్యంలో తెలుగు కంటే హిందీ సినీ సంగీతం ఆయన్ని యెక్కువగా ప్రభావితం చేసింది. సాలూరి పాడిన ‘తుమ్మెదా ఒకసారి మోమెత్తి చూడమని’, ‘చల్లగాలిలో యమునా తటిపై’ లాంటి లలిత గీతాలు చాలా ప్రభావితం చేశాయని, సంగీతంలో ఆసక్తి కలగడానికి కారణం రాజేశ్వరరావు పాటలేనని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. హిందీ సినిమాల్లో గాయకుడు కావాలన్న బలమైన కోరికతో చిన్న వయసులోనే ఇంటినుంచి పారిపోయి బొంబాయి చేరాడాయన. అక్కడ ఒక సంగీత వాయిద్యాలమ్మే షాపులో పనిచేస్తున్నప్పుడు హిందీ, మరాఠీ సినీ సంగీత ధోరణులని పరిశీలిస్తూ అక్కడ పనిచేసేవారితో కొన్ని పరిచయాలు యేర్పరుచుకొన్నారు. 16 ఏళ్ళ వయస్సులోనే బంద్వల్ పహీజా అనే మరాఠీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినట్లు వికీపీడియాలో రాసారు కానీ నాకైతే ఇంతవరకూ దానికి సంబంధించిన ఆధారాలేమీ లభించలేదు.

రమేశ్ నాయుడు పేరు లోకానికి మొదటిసారిగా తెలిసింది 1954లో హామ్లెట్ చిత్రంతో. ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు అయిన కిశోర్ సాహూ షేక్స్‌పియర్ నాటకాన్ని చిత్రంగా తీయ తలపెట్టినప్పుడు కొత్త సంగీత దర్శకుణ్ణి వెతుక్కుంటూ పెట్టిన పోటీలో రమేశ్ నాయుడు స్వరపరచిన బాణీని మెచ్చి ఆయన్ను నియమించుకోవడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఆ చిత్రం గొప్పగా ఆడకపోయినా రమేశ్ నాయుడు చేసిన సంగీతం చాలా మందిని ఆకర్షించింది. దానిలోని అయిదారు పాటల్లో ఆశా పాడిన ‘చాహే సతాయె చాహే రులాయే’ అన్నది ముఖ్యంగా చెప్పుకోదగ్గది. అప్పటికి గాయనిగా పెద్ద పేరు లేని, ‘లత చెల్లెలిగా’ మాత్రమే తెలిసిన ఆశా చేత ‘హామ్లెట్’‌లో హీరోయిన్‌పై చిత్రీకరింపబడిన నాలుగు పాటల్లో మూడింటిని పాడించడం ఒక గొప్ప వార్త. మూడు దశాబ్దాలు మించిన తర్వాత కూడా వారిద్దరి మధ్య మంచి స్నేహముండేదని, ఆయనంటే ఆశా చాలా గౌరవం చూపించేదని ఒకసారి రంగారావు నాతో అన్నారు. (ఈ చిత్రం ఇప్పుడు వి.సి.డి. గా లభ్యమవుతుంది. ఈ సినిమాలోని ఆజావో మేరే ప్యారే పాట యూట్యూబ్‌లో ఉంది.)

‘హామ్లెట్’ పాటలతో పొందిన గుర్తింపుతో రమేశ్ నాయుడికి అవకాశాలు వచ్చినా – ముఖ్యంగా అమీయ్ చక్రవర్తి తలపెట్టిన ‘సీమా’ – ఆరోగ్య కారణాలవల్ల వదులుకోవలసి వచ్చింది. ఇది ఆయనకు, అనేక సంగీతాభిమానులకు తగిలిన పెద్ద దెబ్బ. శానిటోరియంలో చికిత్స పూర్తయిన తరువాత మద్రాసుకు వచ్చి ప్రముఖ నటి, నిర్మాత అయిన సి. కృష్ణవేణి దృష్టిలో పడ్డారు. ఆవిడ నిర్మించిన ‘దాంపత్యం’ (1957) తెలుగులో ఆయనకు తొలి చిత్రం. అదే కాలంలో స్వయంప్రభ (1957, ఇది ముందుగా విడుదలయ్యింది.) అన్న చిత్రానికి పనిచేయడం జరిగింది. ఈ రెండింటిలో ఆయన చేసిన వరసలు, కొత్త రకమైన వాద్యగోష్టులు మన్ననలు పొందడమే కాకుండా – నడివీధిలో జీవితం (బాలసరస్వతి), తానేమి తలంచేనో (బాలసరస్వతి, ఎ.ఎం. రాజా), ‘స్వయంప్రభ’లోని ఆనంద మధుర మావేళ (పి.బి. శ్రీనివాస్, సుశీల) – వెంటనే కొత్త అవకాశాలను కూడా తెచ్చిపెట్టాయి.

అందరి నోళ్ళలో పడి ఆయన పేరు తెలుగుదేశంలో తెలియ పరిచిన పాట, ఇప్పటికీ బాగా ప్రాచుర్యంలో వున్నది: ‘మనోరమ’ (1959) లోని చందమామ రావే అన్న పాట. ఇది తాను సంగీతం చేసిన చిత్రాల్లో తనకు బాగా నచ్చిన పాటల్లో ఒకటిగా ఆయన చెప్పుకునేవారు. ‘మనోరమ‘ లోనే ఒక ప్రముఖ గాయకుడు, ఏ కారణాల చేతనయితేనేమి, పాడటానికి అంగీకరించక పోవడంతో తెలుగు రాని తలత్ మహమూద్ చేత ఏకంగా నాలుగు పాటలు అతి మధురంగా పాడించటం ఆయనకే చెల్లింది.

అదే సంవత్సరంలో వచ్చిన ‘కూతురి కాపురం’లో (1959) రమేశ్ నాయుడు మరొక కొత్త కంఠాన్ని (ఉమ – ‘వన్నెల చిన్నెల కన్నెనురా’) పరిచయం చేసారు. తెలుగు సినీ సంగీతంలో ఒక కొత్త బాణీ మొదలయ్యిందని అందరూ అనుకుంటుండగా, డబ్బింగ్ సినిమాల వ్యాపారం మీద దృష్టి పెట్టి కలకత్తాకి మకాం మార్చటం ఆయన సంగీతాభిమానులను రెండవసారి నిరాశకు గురి చేసింది. 1961లో వచ్చిన ‘శాంత’ ఆయన బెంగాలీ, ఒరియా చిత్ర వ్యాపారాల్లోకి వెళ్ళడానికి ముందు వచ్చిన తుది తెలుగు చిత్రం. ఈ ‘రెండవ దశ’ లో రమేశ్ నాయుడు చేసిన చిత్రాల్లో ఇంకా చెప్పుకోవలసినవి ‘పియామిలన్’ (1958, తమిళంలో ‘మర్మవీరన్’), ‘జైసింగ్’ (1959, తెలుగులో ‘జయసింహ’, 1955) అన్న రెండు హిందీ డబ్బింగ్ సినిమాలు.

క్యా కహుఁరే కాన్హా – పియా మిలన్ మన్ బీనా మధుర్ బోలే – జైసింగ్

డబ్బింగ్ సినిమాల లోని పాటలకు భిన్నంగా, మాతృకలలోని పాటలను యధాతధంగా అనుకరించకుండా రెండింటిలో చాలావరకు తనవైన సొంత బాణీలు వినిపించారు. ‘పియా మిలన్’ లోని ‘క్యా కహుఁరే కాన్హా’, ‘జై సింగ్’లోని ‘తరస్ గయేరే నైనా’ (తెలుగులో ‘నడిరేయి గడిచేనే’ అన్న జావళి) కర్ణాటక రాగాల్లో వున్నా ఆయన వాటిని లలితంగా మలిచిన తీరు హిందీ శ్రోతలకు కూడా బాగా నచ్చిందని అప్పట్లో (1958/59) బొంబాయిలో వున్న రంగారావు అన్నారు.

రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సీతారాం (పెళ్ళిసందడి, బొబ్బిలి యుద్ధం మొదలైన చిత్రాల నిర్మాత) 1959లో తానే దర్శకత్వం కూడా వహిస్తూ తీయ తలపెట్టిన ‘సత్యం శివం సుందరం’ అనే ‘రాగరసరంజితమైన సాంఘిక చిత్రానికి’ రమేశ్ నాయుణ్ణి నియమించుకున్నారు. కొత్తవారితో అరకు లోయలో తీద్దామనుకున్న ఈ సినిమా ఆగిపోయింది. పాటలు కూడా రికార్డుల పైకెక్క లేదు. మరి కలకత్తాలో గడిపిన పదేళ్ళలో ఆయన ఎలాంటి చిత్రాలకు పనిచేశారో తెలియదు. ‘సతీసావిత్రి’ (1957), ‘దక్షయజ్ఞం’ (1962) చిత్రాలు బెంగాలీలోకి ‘సతీ సాబిత్రి సత్యబాన్’ (1969), ‘దక్కొయెగ్గో’ (1970) లుగా మలచి వాటికి సంగీతం కూడా సమకూర్చారని, అలాగే కొన్ని ఒరియా సినిమాలకు కూడా పనిచేశారని మాత్రం తెలుస్తుంది. కలకత్తాలో చేసిన సినిమా వ్యాపారంలో లాభాలు గడించినా భాగస్వాములు ఆ డబ్బుతో పరారి కాగా, తాను ఇన్‌కంటాక్స్ గోలల్లో చిక్కుకుపోయాయని చెప్పేవారని రంగారావు (’మోహిని’ – ఆంధ్రప్రభ విశేష ప్రచురణ, రెండవ భాగం, 1999) రాశారు.

మాయదారి సిన్నోడు – అమ్మ మాటసద్దుమణగనీయవోయి – అమ్మ మాట

1971 లో నిర్మాత జి.వి.ఎస్. రాజుగారు రమేశ్ నాయుణ్ణి మరల తిరిగి తెలుగు సినిమా రంగానికి (అమ్మమాట, 1972) తీసుకు వచ్చినప్పటినుండి చివరి వరకూ (03 సెప్టెంబర్ 1988) మద్రాసులోనే వుండిపోయి సుమారు ఒక ఏభయి తెలుగు చిత్రాలకి పని చేశారు. ఈ పదిహేనేళ్ళ కాలంలో అందించిన సంగీతం గురించి యెంత చెప్పినా తక్కువే. “ఈనాడు ‘రిథమ్’ విని ఎక్కువమంది ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు కానీ ఆ పాటలు విన్న కొద్దిసేపట్లోనే ఆ పాటలోని సాహిత్యాన్నీ, బాణీని మర్చిపోతున్నారు. ‘మాధుర్యం’ ప్రధానంగా వున్న పాటలే చిరకాలం నిలుస్తాయి” అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు మెలొడీ ప్రాముఖ్యతని చాలా తరచుగా వొత్తి చెప్పేవాడాయన. అలాగే, ముందుగా బాణీ కట్టి దానికి తగ్గట్లుగా సాహిత్యం రాయించుకోవడం ఆయన యిష్టపడలేదు. సినీ సంగీతం పైన ఆయనకున్న స్థిరమైన అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఇదే సంచికలో అందిస్తున్న ప్రత్యేక జనరంజని కార్యక్రమం (ఆకాశవాణి – వివిధభారతి, 1981) ఆడియో వినండి.

అభినవతారవో – శివరంజని(1978)జోరుమీదున్నావు – శివరంజని (1978)పొన్న పూల ఉయ్యాల – చందన (1974)

1972 నుండి 1988 మధ్యల్లో ఆయన చేసిన యెన్నో గొప్ప పాటల్లో మచ్చుకు కొన్ని ఉదాహరణలు: ఓలమ్మో ఓరి నాయనో (జీవితం, 1973), శ్రీరామనామాలు శతకోటి (మీనా, 1973), పొన్న పూల ఉయ్యాల (చందన, 1974), అయ్యింది రాధమ్మ పెళ్ళి (రాధమ్మ పెళ్ళి, 1974, ఆయనే స్వంతంగా పాడిన పాట), తల్లి గోదారికి ఆటు పోటుంటే (చిల్లరకొట్టు చిట్టెమ్మ, 1977, ఇది కూడా ఆయన స్వయంగా పాడినదే). ఇంకా కల్యాణి, దేవదాసు, తూర్పు పడమర, శివరంజని, ఆనందభైరవి, మేఘసందేశం, సువర్ణ సుందరి, సంగీత సామ్రాట్… ఇలా రాసుకొంటూ పోవచ్చు. ఈ కాలంలో వచ్చిన చాలా పాటలను ఆన్‌లైన్‌లో వినవచ్చు.

శాస్త్రీయ సంగీత కచేరీలలో నెమ్మదిగా పాడే ఆనందభైరవి రాగంలో వేగంగా వరస కట్టడం (పిలచిన మురళికి – ఆనందభైరవి, 1983), అలాగే కొంత విషాదాన్ని సూచించే శివరంజని రాగంలో జనరంజకంగా ‘శివరంజని నవరాగిణి’ (తూర్పు పడమర, 1976), ‘అభినవ తారవో (శివరంజని, 1978) అన్న పాటల్ని స్వర పరచడం, సాధారణ ప్రేక్షకుల చేత, విద్వాంసుల చేత మన్ననలందుకోవడం ఆయన ప్రతిభకు తార్కాణం. అలాగే 20 సంవత్సరాల ‘అజ్ఞాతవాసం’ తరువాత రావు బాలసరస్వతిగారితో ‘సంఘం చెక్కిన శిల్పాలు’లో (1980) మళ్ళీ పాడించిన ఘనత కూడా ఆయనదే. దానికి కొంచెం ముందుగా సి. నారాయణరెడ్డి తెలుగు లోకి అనువదించిన మీరా భజన్లను నాలిగింటిని ఆవిడచేత పాడించి ఇ.పి. రికార్డుగా విడుదల చేశారు. అదే సమయంలో ఆరుద్ర రాసిన పాటలు కొన్నింటిని (ఏనాటికి రాడు ఏలాటి ప్రియుడే, ఘల్ ఘల్ ఘల్ అని గజ్జెలు మ్రోగ రావయ్యా కృష్ణయ్యా, ఈ చల్లని రేయి) బాలసరస్వతి గారితో రేడియోలో పాడించారు కూడా.

ఈ చల్లని రేయి (నాన్ ఫిల్మ్) – బాలసరస్వతి

నిజానికి ‘ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు’ 1952 ప్రాంతంలో సి. కృష్ణవేణి తలపెట్టిన ఒక కొత్త సినిమా కోసం, ఘంటసాల స్వరసహకారంతో రాయబడింది. ఆ సినిమా మొదలు కాలేదు కానీ మంచి సాహిత్యం కావడంతో చాలా మంది (ఘంటసాల, లీల (?), బి. గోపాలం…) స్వయంగా స్వరపరచుకొని పాడుకొన్నారు. (1980 ప్రాంతాల్లో పాడిన పాట రికార్డింగు అంత బాగాలేని కారణంగా 1997-98 ప్రాంతంలో మరోసారి రికార్డయిన పాటని ఇస్తున్నాను. బాణీ రమేశ్ నాయుడి గారిదే.)

సుమారు 50 చిత్రాలకు చేసిన సంగీతమంతా ఒక ఎత్తయితే, హరికీర్తనాచార్య అన్నమాచార్య అన్న చిత్రానికి (1987) చేసిన సంగీతం మరొక ఎత్తు (ఈ చిత్ర నిర్మాణం కారణాంతరాల వల్ల ఆగిపోయింది, కానీ మూడు గంటల నిడివైన అపురూపమైన సంగీతం టేపులపైన విడుదలయ్యింది.). అందులో ఆశా భోఁస్లే (నాకెంతో ఇష్టమైన ‘సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదిని నెలవాయే’, మరొక నాలుగు పాటలు), బాలమురళికృష్ణ, సుశీల, జేసుదాస్, బాలసుబ్రహ్మణ్యం, వక్కలంక సరళారాణి ప్రభృతులు పాడిన పాటలు తప్పక వినితీరవలసినవి.

ఈ రోజు మంచిరోజు – దేవదాసు (1974)కల చెదిరింది – దేవదాసు (1974)

ఆయన కంపోజ్ చేసిన పాటల్లో ఆయనకు నచ్చిన మరి రెండు పాటలు: ఈరోజు మంచిరోజు, కల చెదిరింది (దేవదాసు).

“సినిమా ప్రయోజనం కోసం మంచిని యెవరి దగ్గరినుండైనా తీసుకోవచ్చని నమ్మే వ్యక్తి రమేశ్ నాయుడు” అనే రంగారావుగారు తరచుగా చెప్పే విషయాలు రెండు; ఆనందభైరవి సినిమాలో ‘కొలువైతివా రంగశాయి’, ‘బ్రహ్మాంజలి’ పాటలకు వెంపటి చినసత్యంగారి ప్రదర్శనల్లో పాడే వరసలని వాడుకున్నప్పుడు రంగారావుగారిని పిలచి ఆ రెండు పాటలకు సంగీతకర్తలెవరో (బాలాంత్రపు రజనీకాంతరావు, కొచ్చర్లకోట సూర్యప్రకాశరావు) కనుక్కొని రికార్డులపైన వారి పేర్లు పేర్కొనపడేట్లు చేయడం. రెండవది ‘సువర్ణసుందరి’ (1983) చిత్రానికి సంగీతం చేస్తున్నప్పుడు నృత్యం గురించి బాగా తెలిసిన రంగారావుగారిని పిలచి, ఆయన మొహమాట పడుతుంటే గట్టిగానే అడిగి, ఆయన అభిప్రాయాల్ని తెలుసుకోవడం, అవసరమైతే పాట వరసను మార్చివేయడం లేక పూర్తిగా తిరిగి రాయించుకోవడం.

రమేశ్ నాయుడుగారి ఆఖరి సినిమా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వయంకృషి’ (1987). ఆయన 1988 సెప్టెంబరు 3వ తేదీ మరణించారు.

కొసమెరుపు: ఆయన తెలుగులో నిర్మించిన ఒకే ఒక్క చిత్రం ‘మాకూ స్వతంత్రం కావాలి’ (1986) లో పాటలుండవు! దానికి నేపథ్య సంగీతం కూడా వేరే సంగీత దర్శకుడు, ఎం.బి. శ్రీనివాస్ చేశారు. జాతీయ స్థాయిలో ఒక అవార్డు అందుకున్న ఈ చిత్రం తరువాత పలు భారతీయ భాషల్లోకి అనువదింపబడింది.

(ఇక్కడ రాసిన చాలా విషయాలు రమేశ్ నాయుడు మరో అభిమాని అయిన వి.ఎ.కె. రంగారావు గారి ద్వారా పలు సంభాషణల్లో, ముఖ్యంగా 1986-88 మధ్య కాలంలో, తెలుసుకున్నవి. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం నా బాధ్యత. చెప్పిన విషయాల్లో ఏమయినా లోపాలుంటే అందుకు పూర్తి బాధ్యత నాదే! అలాగే పియా మిలన్, జైసింగ్ చిత్రాలలోని పాటల్ని అందించిన మిత్రుడు గంటి శ్రీనివాస్‌కి కృతజ్ఞతలు.)