రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం

ఈమాట పత్రిక 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు చేసిన ఒక అరుదైన రేడియో ప్రసంగం విందాం.

అనంతకృష్ణశర్మగారు సాహిత్య రంగంలోనే కాదు సంగీత రంగంలో కూడా గొప్ప పండితులన్న విషయం అందరికీ తెలిసినదే. మద్రాసు మ్యూజిక్ అకాడెమీ నుండి 1974లో సంగీతకళానిధి అన్న బిరుదు కూడా అందుకున్నారు. ఆయన సంగీత విషయాలపై కేవలం పరిశోధనా వ్యాసాలు రాయడమే కాదు, స్వయంగా పాడేవారు, వయొలిన్ కూడా వాయించేవారు. ఆయన స్వయంగా పాడిన పాటల గురించి నేను గతంలో ప్రస్తావించాను.

ఈ సంచికలో వినిపిస్తున్న ప్రసంగం మార్చ్, 1960లో అపూర్వ రాగములు అన్న శీర్షిక క్రింద సైంధవి రాగంపై ఆకాశవాణిలో చేసినది. ఈ శీర్షికలో ఆయన–మంగళకైశికి, సైంధవి, ద్విజావంతి రాగాలపై మాట్లాడారు. తక్కిన రెండు ప్రసంగాలు రాబోయే సంచికల్లో! నాకు కర్నాటక శాస్త్రీయ సంగీతంలో పెద్ద ప్రవేశం లేదు కానీ బాలాంత్రపు రజనీకాంతరావుగారితో వున్న మంచి పరిచయం కారణంగా ఈ రాగం పేరు విన్నాను. రజనిగారు ‘ఇందుకుగా కోపించనేల! నాకు ముందుగల కోపమెల్ల ముగిసెనుపోరా!’ అన్న అన్నమయ్య కీర్తన (ఓలేటి, శ్రీరంగం గోపాలరత్నం చాలా గొప్పగా పాడారు) ఈ రాగంలోనే కంపోజ్ చేశానని చెప్తూ, అనంతకృష్ణశర్మగారు ఈ రాగం పైన రేడియోలో ఉపన్యసించిన విషయం కూడా చెప్పారు. అలా అనంతకృష్ణశర్మగారి గొంతు ఆకాశవాణి వారివద్ద ఉన్నదన్న విషయం నాకు తెలిసింది.

ఓలేటి, శ్రీరంగం గార్లు పాడిన అన్నమయ్య పదం కూడా ఈ రేడియో ప్రసంగంతో పాటుగా వినండి.