నాకు నచ్చిన పద్యం: కావ్యహోమం

సీ.
చినుకు బూసలు కన్నుగొనలు కప్పుచు బొంగ
దడవి గద్గదిక శిష్యుడు పఠించు
నరవంచు మొగముదామర మంచు మూయగా
గృత గభీరత నాలకించు గురుడు
కతలు కల్పనములు కరగింప నచ్చెరు
వడి మెచ్చి విను పశుపక్షి వితతి
రసపిపాసను నాల్కకొసలు చాచుకొని వే
చుకొని యుండును జితా ప్రకట వహ్ని
తే.
చట్టు చదివిన యాకు నాచార్యు డంది
యాహుతి యొనర్చు నగ్నికుండాంతరమున
నదియె శామిత్ర వహ్ని! అల్లతడె శమిత!
యవుర పశువగునేమొ కావ్యప్రతిష్ఠ!
తే.
చిమచిమారావ పావక శిఖలలోన
గబ్బ మొక్కొక్క యాకుగా గాలుచుండ
గవికి వేయిదళాల తమ్మివిరి బోని
హృదయ మొక్కొక రేకుగా బ్రిదులు చుండె

అనగనగా ఓ మహారాజు. అతడేలే ఊరు పేరు ప్రతిష్ఠాన పట్టణం. అతని పేరు సాతవాహనుడు, అతనే హాలుడు. శాలివాహనుడు అనేది ఇంకో పేరు. అతడు శక కర్త, అంటే ఒక కొత్త శకం అతని పేరుతో ప్రారంభమయింది. అది శాలివాహన శకం. క్రీ.శ. ఒకటి రెండు శతాబ్దాలకు చెందిన తెలుగు రాజతను. అతనికి ప్రాకృత భాషపై అంతులేని అభిమానం. ఎన్నెన్నో ప్రాకృత గాథలను అతడు సేకరించాడు, సంకలించాడు. స్వయంగా రచించాడు కూడా. అతనికి ప్రాకృత భాషపై ఉన్నంత అభిమానమూ అభినివేశమూ సంస్కృత భాషపై లేవు. కానీ అతని భార్యకు సంస్కృత భాషపై అభిమానం. అందులో ఆమె గొప్ప పండితురాలు. తన పాండిత్యాన్ని రాజు ముందర ప్రదర్శిస్తూ ఉండేది. అది రాజుగారి మనసును గిచ్చుతూ ఉండేది. ఆ లోటును ఎలాగైనా పూరించుకోవాలని నిశ్చయించి, తన సభలోని ఇద్దరు ఉద్దండ పండితులని రప్పించి, సంస్కృత భాషలో పాండిత్యం సంపాదించేందుకు ఎంత కాలం పడుతుందని అడుగుతాడు. ఆ ఇద్దరు పండితులలో ఒకని పేరు గుణాఢ్యుడు. గొప్ప పండిత కవి. అయితే, ముక్కుసూటి మనిషి. కాస్త ఆవేశపరుడు కూడాను. సంస్కృత భాష నేర్వాలంటే వ్యాకరణం పట్టుబడాలని, పాణినీయంపై పట్టు సాధించాలంటే కనీసం పన్నెండు సంవత్సరాలు పడుతుందని చెప్తాడు. మహారాజుకి తాను ఆరు సంవత్సరాలలో బోధించగలనని అంటాడు, రెండవ పండితుడు శర్వవర్మ. ఇతను రాజు పరిస్థితి గమనిస్తాడు. తన గొప్పతనం చాటుకోవాలని అనుకొంటాడు. రాజుగారికి తాను ఆరు నెలలలో సంస్కృత భాష బోధించగలనని సవాలు చేస్తాడు. గుణాఢ్యుడు అది అసంభవమని, అదే కానీ జరిగితే తనకు తెలిసిన సంస్కృత, ప్రాకృత, దేశ భాషలు మూడింటినీ విడిచిపెట్టేస్తానని శపథం చేస్తాడు. ఒకవేళ తాను రాజుని ఆరు నెలలలో సంస్కృత భాషలో పండితుని చేయలేకపోతే గుణాఢ్యుని చెప్పులు తలపై పెట్టుకొని అతనికి ఊడిగం చేస్తానని శపథం చేస్తాడు శర్వవర్మ. శపథమైతే చేశాడు కానీ ఆరు నెలలలో సంస్కృత భాషను నేర్పడం మానవ సాధ్యం కాదని శర్వవర్మకు తెలుసు. తాను ఉపాసించే సుబ్రహ్మణ్యస్వామి గూర్చి తపస్సు చేసి, అతని మెప్పు పొంది, కాలాపము లేదా కాతంత్రము అనే పేరుతో సంస్కృత భాషకు ఒక కొత్త వ్యాకరణం రచిస్తాడు. దాని సహాయంతో, స్వామి కృపతో, హాలునికి ఆరు మాసాలలో సంస్కృతం నేర్పిస్తాడు. అన్న మాటకు కట్టుబడి గుణాఢ్యుడు తనకు వచ్చిన భాషలన్నింటినీ త్యజించి మౌనిగా మారి, కొంత శిష్యబృందంతో అరణ్యాలకు వెళ్ళిపోతాడు.

అడవిలో తిరిగే పిశాచాల సాహచర్యంతో పైశాచీ భాష నేర్చుకుంటాడు గుణాఢ్యుడు. నేర్చుకోవడమేమిటి, ఆ భాషలో కవిత్వం అల్లగల పాండిత్యం సంపాదిస్తాడు! దీని కోసమే ఎదురుచూస్తున్న కాణభూతి అనే ఒక పిశాచం వచ్చి మహత్తరమైన కథలను వినిపిస్తాడు. వాటిని పైశాచీ భాషలో ఏడేళ్ళు శ్రమపడి ఏడు లక్షల శ్లోకాలతో ఏడు బృహత్ గ్రంథాలుగా రచిస్తాడు గుణాఢ్యుడు. అయితే, ఆ అడవిలో అతనికి రాసేందుకు సాధనాలు ఎక్కడివి? చెట్ల బెరడులను పత్రాలుగా చేసి, వాటిపై తన రక్తమే సిరాగా ఉపయోగించి రాస్తాడు. అంతటి బృహత్ గ్రంథం అడవి కాచిన వెన్నెల కాకూడదని, దాన్ని లోకంలో ప్రచారం చేసే శక్తి హాల మహారాజుకే ఉందన్న శిష్యుల మాటలకి సమ్మతించి, ఆ గ్రంథాన్ని శిష్యులకిచ్చి హాలుని వద్దకు పంపిస్తాడు. హాలుడు పూర్తిగా సంస్కృత భాషాభిజాత్యంలో మునిగిపోయి ఉంటాడు. పిశాచ భాషలో, రక్తంతో రాసిన గ్రంథమని విని, దాన్ని అసహ్యించుకొని శిష్యులని పంపేస్తాడు. వారు తిరిగి వచ్చి చెప్పిన విషయాన్ని విన్న గుణాఢ్యుడు మనసు విరిగి, తన శిష్యులచేత అగ్నిని పేర్పించి, తన గ్రంథంలో ఒక్కొక్క శ్లోకాన్నీ చదువుతూ ఒకో పత్రాన్ని అగ్నికి ఆహుతి ఇచ్ఛేస్తాడు.

ఈ సన్నివేశాన్ని తన ఆంధ్రపురాణంలో కావ్యహోమంగా అభివర్ణిస్తారు శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. సాతవాహనులనుండి నాయకరాజుల వరకూ రాజ్యమేలిన ఎందరో తెలుగు రాజుల కథలను, తొమ్మిది పర్వాలుగా ఆయన రచించిన కావ్యం ఆంధ్రపురాణం. భావకవితాసమీరాలు వీస్తున్న కాలంలో ఆంధ్రపౌరుషము, తెలుగు జాతిదేశభాషాభిమానాలూ కవిత్వంలో ఉప్పొంగి, ప్రజలను ఉర్రూత లూగించిన విషయం ప్రసిద్ధమే. విశేషం ఏమిటంటే, మధునాపంతులవారి ఆంధ్రపురాణంలో ఉన్నది వట్టి పొంగు కాదు. కథా కలితార్థయుక్తితో వెలిగే కావ్యకళ. నన్నయ అక్షరరమ్యతకు అనుశ్రుతిగా వినిపించే ఒక కమ్మని నాదం. పై పద్యాలు మధునాపంతులవారి శైలికి మచ్చుతునకలు మాత్రమే.

కన్నీటి చినుకు పూసలు కనుకొసలనుండి పొంగుతుండగా, తడబాటుతో బొంగురుపోయిన గొంతుకతో శిష్యుడు శ్లోకాలను చదువుతున్నాడు. సగం వంచిన ముఖాన్ని మంచుపొర కప్పివేయగా, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో, గురువైన గుణాఢ్యుడు వింటున్నాడు. వింటున్నది గురువు ఒక్కడే కాదు. ఆ కోనలో ప్రతి జంతువు, ప్రతి పక్షి, ఆసక్తితో ఆశ్చర్యంతో, మనసును కరిగించే ఆ కథలనూ కల్పనలనూ వింటున్నాయి. ఎంతటి రసవంతమైనవో ఆ కథలు! ఆ రసాస్వాదన కోసం వేయి నాల్కలు సాచి వేచికొని చూస్తోంది చితిలా మండుతున్న అగ్ని. శిష్యుడు (చట్టు) చదివి అందించిన ఆకును గురువు అగ్నికుండంలో ఆహుతి చేస్తున్నాడు. అది బలిని కోరే యాగాగ్ని (శామిత్ర వహ్ని) కాబోలు. ఆ గుణాఢ్యుడు, బలి యిస్తున్న శమిత కాబోలు. అయ్యో! బలి అవుతున్న పశువు కావ్యప్రతిష్ఠ యేమో! చిమచిమలాడే ఆ అగ్నిశిఖలలో కావ్యం ఒకొక్క ఆకూ కాలుతూ ఉంటే, కవి హృదయమనే వేయిరేకుల పద్మంలో (వేయిదళాల తమ్మివిరి), ఒకొక్క రేకూ ప్రిదిలిపోతోంది, రాలిపోతోంది!

సాధారణంగా ఒకే విషయాన్ని గురించి అనేక విధాలుగా వర్ణించడానికి కవులు సీసపద్యం ఎన్నుకొంటారు. సంభాషణలలో పోటాపోటీగా సాగే సీస పాదాలతో పద్యాన్ని రచించడం కూడా ప్రసిద్ధమే. ఇంకా ఇతర సందర్భాలలో కూడా సీసపద్యాన్ని కవులు ఉపయోగించినా, సీసపద్యపు నడకలోని ప్రత్యేకత అన్ని చోట్లా కనిపించదు. ఇక్కడ, ఒక దృశ్యాన్ని చిత్రించడానికి సీసపద్యం వినియోగించడం, కవికున్న పద్య నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ దృశ్యాన్ని ఒక వృత్తంలో కూడా చిత్రించ వచ్చును. కానీ వృత్త పద్యాలలో సహజంగా ఒక ధార, వేగం ఉంటుంది. ఇక్కడ సన్నివేశంలో అది పనికిరాదు. ఈ సన్నివేశమంతటా ఒక విషాదచ్ఛాయ పరచుకొని ఉంది. గుణాఢ్యుడు చేస్తున్న హోమం, అతడు చేయలేక చేయలేక చేస్తున్న పని. ఒక దీర్ఘ నిశ్వాసం ఆ పద్యంలో ధ్వనించాలి. అందుకు దీర్ఘమైన సీసాన్ని అందుకున్నారు. అయితే, దీర్ఘ సమాసాలు లేకుండా చిన్న చిన్న పదాలతో పాదాలను అల్లారు. హోమాగ్ని నాల్కకొసలు చాచుకొని వేచుకొని ఉండడం, దాని రసపిపాసనే కాకుండా, ఒకొక్క ఆకునూ ఆహుతి చేయడంలో జరుగుతూ ఉన్న విలంబాన్ని కూడా సూచిస్తోంది. సీసంలో నాలుగు పాదాలు పూర్తి అయ్యేదాకా శిష్యుడు ఆకును గుణాఢ్యునికి అందించడం జరగలేదు. అది కూడా జాప్యానికి సూచనే. నాలుగు పాదాలలో నలుగురి పరిస్థితిని వర్ణించడం కారణంగా పాదాలు వేటికవి విరిగి, సీసానికి సహజమైన తూగు అమరి, చదివేటప్పుడు పద్యానికి గాంభీర్యం సంతరిస్తోంది. అక్షరాల పోహళింపులో నన్నయ్య సాధించిన రమ్యత మధునాపంతులవారి పద్యాలలో కూడా కొంత కనిపిస్తుంది. ఉదాహరణకు, చినుకు బూసలుకన్నుగొనలు అనే మాటలలో ఉన్న ప్రాసయతి, అరవంచుమంచు మూయగా, అచ్చెరువడిమెచ్చి విను, రసపిపాసనునాల్కకొసలు మొదలైన చోట్ల ఉన్న అనుప్రాస, శబ్దాలంకారంలా స్ఫుటంగా వినిపించకుండా, పద్యంలో అంతర్భాగమై, చదివేటప్పుడు చెవికి ఇంపుగా ధ్వనిస్తుంది.

మధునాపంతులవారి కవిత్వంలో చెప్పుకోదగిన మరొక విశేషం ఆయన గుచ్చెత్తే ఉపమానాలు. అవి ఉదాత్తంగా ఉంటాయి. గుణాఢ్యుడు మొదటినుండీ హాలునిలా ప్రాకృత భాషాభిమాని. శర్వవర్మ సంస్కృత భాషాభిమాని. సభలో అప్పుడప్పుడు వారి మధ్య వాగ్వివాదాలు చిచ్చులా చెలరేగేవి. అప్పుడు రాణి వారిరువురినీ పాలపాపల వలె తేర్చు తా నుభయభారతియై అంటారు శాస్త్రిగారు. అంటే చంటిపాపలిద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే తల్లి సముదాయించినట్లుగా వారిద్దరి తగువునూ తీరుస్తుందన్న మాట! ఇక్కడ కవి ఉపయోగించిన ఉభయభారతి పదానికి గొప్ప సార్థకత ఉంది. సంస్కృత ప్రాకృత భాషలు రెండింటికీ (ఉభయ) తల్లి అయిన సరస్వతిలా (భారతి) అని ఒక అర్థం. అదిగాక – మండనమిశ్రుడు, ఆదిశంకరుల మధ్య జరిగిన వాగ్వివాదానికి తీర్పరిగా వ్యవహరించిన పండితురాలి పేరు కూడా ఉభయభారతి. ఆమె సాక్షాత్తు సరస్వతీ అవతారమని నమ్మకం. ఉభయభారతి పదం ఆ కథని స్ఫురింపజేస్తోంది. దీని ద్వారా అటు రాణికీ, ఇటు శర్వవర్మ గుణాఢ్యులకూ గొప్ప గౌరవం చేకూర్చారు. ఇలాంటి ఉదాత్త భాసమానమైన ఉపమానాలు ఎన్నో మనకి మధునాపంతులవారి కవిత్వంలో కనిపిస్తాయి. ఆయన కలంనుండి ఇంకా అనేకమైన పద్యకృతులు, నవలలు వెలువడ్డాయి. ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన ఎందరో తెలుగు రచయితల వివరాలను పొందుపరిచి ఆయన రచించిన మరొక విశిష్ట గ్రంథం ఆంధ్రరచయితలు.

గుణాఢ్యుని కథ సోమదేవుడు రచించిన కథాసరిత్సాగరం అనే సంస్కృత కావ్యంలో విపులంగా మనకి కనిపిస్తుంది. హాలునికి అసలు సంస్కృత భాష నేర్చుకోడానికి ప్రేరణ అయిన ఒక తమాషా కథ కూడా అందులో ఉంటుంది. ఇది చాటుకథగా ప్రసిద్ధమే! ఒకనాడు హాలుడు తన భార్యతో జలకాలాడుతూ ఆమెపై నీళ్ళ చిమ్ముతూ ఉంటాడు. అప్పుడామె సంస్కృతంలో “మోదకైస్తాడయ, మోదకైస్తాడయ” అంటుంది. మన రాజుగారికి సంస్కృతం అంతంత మాత్రంగానే వచ్చును. మోదకైః తాడయ అంటే, మోదకాలతో కొట్టు అని అర్థం చేసుకొని, మోదకాలను (ఉండ్రాళ్ళు) తెప్పిస్తాడు. విషయం అర్థమైన రాణి పడీపడీ నవ్వుతుంది. ఆమె అన్నది, మా ఉదకైః తాడయ అని. అంటే నీటితో (ఉదకైః) కొట్టకండి (మా తాడయ). ఈ సంఘటనతో రాజుకు వెంటనే సంస్కృతం నేర్చుకోవాలన్న పట్టుదల వస్తుంది. ఆ తర్వాత కథ పైన చెప్పుకొన్నదే.

కథాసరిత్సాగరం పేరుకు తగ్గట్టు అనేకానేక కథల నదుల సంగమమైన ఒక మహాసాగరం! మనకు బాగా పరిచయమైన పంచతంత్ర, భేతాళ కథలకు మూలం కథాసరిత్సాగరమే. కథాసరిత్సాగరానికి మూలం గుణాఢ్యుడు పైశాచీ భాషలో రచించిన బృహత్ గ్రంథమే, అదీ ఆశ్చర్యం! ఆ గ్రంథం అగ్నికి ఆహుతి అయిపోయింది కదా, మరి సోమదేవునికి ఎలా తెలిసింది? అది తెలియాలంటే కావ్యహోమం దగ్గర మనం ఆపేసిన గుణాఢ్యుని కథ పూర్తిగా తెలుసుకోవాలి. కావ్యహోమం జరుగుతూ ఉంటే, అడవిలోని జంతువులన్నీ అతని చుట్టూ చేరి ఆ కథలు వింటున్న సంగతి హాలునికి తెలుస్తుంది. అప్పుడా గ్రంథం గొప్పదనం రాజు గుర్తించి, పరుగు పరుగున అడవికి వస్తాడు. అప్పటికి ఆహుతి అయిపోయినది పోగా, ఒక లక్ష శ్లోకాల ఆఖరి గ్రంథం మాత్రం మిగిలి ఉంటుంది. దాని పేరు బృహత్కథ. ఆ బృహత్కథను హాలుడు కళ్ళకద్దుకొని స్వీకరిస్తాడు. అలా మిగిలిన బృహత్కథకు ఒకానొక సంస్కృత అనువాదమే కథాసరిత్సాగరం! ఇది కాకుండా మరొక రెండు మూడు అనువాదాలు (అందులో ఒకటి తమిళం) కూడా ఉన్నాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే, పైశాచీ భాషలోని మూల బృహత్కథ మాత్రం దొరకలేదు, కాలగర్భంలో కలిసిపోయింది.

కథ పుట్టుక, కవి, కథ చెప్పేవారు, కథను వినేవారు – అందరూ ఆ కథలోనే భాగం కావడం భారతీయ పురాణేతిహాసాలలో సర్వత్రా కనిపించే గొప్ప కథాశిల్పం. కథాసరిత్సాగరం కూడా దాన్ని అనుసరించింది. అయితే, ఈ బృహత్కథ పుట్టుక కాస్త విచిత్రం. ఒకరోజు శివపార్వతులు ఏకాంతంలో సంభాషించుకొనే వేళ, తనకి అపూర్వమైన అద్భుతమైన కథలు చెప్పమని పార్వతి శివుని కోరుతుంది. అపూర్వమైనవీ, ఎవరూ ఎన్నడూ వినని, విద్యాధరుల కథలు పార్వతికి చెప్తాడు శివుడు. వాటిని శివసేవకుడైన పుష్పదంతుడు అదృశ్యరూపంలో అక్కడ చేరి వింటాడు. విన్నవాడు ఊరుకోక తన భార్యకు వెళ్ళి చెపుతాడా కథలు. ఆమె తిరిగి పార్వతికి ఆ కథలనే గొప్పగా చెపుతుంది. దానితో, అపూర్వమైన కథలని చెప్పి, అందరికీ తెలిసిన కథలనే తనకి శివుడు చెప్పాడని అనుకొని వెళ్ళి శివుని నిలదీస్తుంది. మహేశ్వరుడు జరిగిన విషయాన్ని తెలుసుకొని పార్వతికి వివరిస్తాడు. అప్పుడు పార్వతి కోపంతో పుష్పదంతుని మనిషిగా పుట్టమని శాపమిస్తుంది. అతన్ని క్షమించమని అక్కడున్న మరొక ప్రమథుడయిన మాల్యవంతుడు వేడుకుంటాడు. మధ్యలో అతనెందుకు తలదూర్చడం! పార్వతి అతన్ని కూడా మనిషి జన్మనెత్తమని శపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మొరపెట్టుకుంటే శాపవిమోచనం అనుగ్రహిస్తుంది. కుబేరుని శాపంతో సుప్రతీకుడు అనే యక్షుడు కాణభూతి అనే పేరుతో అప్పటికే పిశాచరూపుడై ఉంటాడు. తాను విన్న కథ పుష్పదంతుడు కాణభూతికి చెపితే పుష్పదంతునికి శాప విమోచనం అవుతుంది. కాణభూతి మాల్యవంతునికి చెప్పినప్పుడు కాణభూతికి శాపవిమోచనం అవుతుంది. ఆ కథ లోకంలో ప్రకటించినప్పుడు మాల్యవంతునికి శాపవిమోచనం అవుతుంది. పుష్పదంతుడు వరరుచిగా, మాల్యవంతుడు గుణాఢ్యునిగా జన్మిస్తారు. వరరుచి ద్వారా కాణభూతి విన్న కథ, అడవిలో గుణాఢ్యునికి చెప్పి అతను శాప విముక్తుడవుతాడు. అగ్నికి ఆహుతి కాగా మిగిలిన బృహత్కథ హాలునికి యిచ్చిన తర్వాత గుణాఢ్యునికి శాపవిమోచనం జరుగుతుంది!

దేవ రహస్యమయిన కథ విన్నందువల్ల శాపం పొందడం, శాపవిమోచనంగా ఆ కథే లోకమంతటికీ తెలిసేలా చేయడం అనే అంశం తిరిగి మనకు కళాపూర్ణోదయంలో దర్శనమిస్తుంది! ఇన్ని విశేషాలతో పాటుగా గుణాఢ్యుని కథలో మరొక అంశం కూడా విశేషంగా చెప్పుకోవలసింది ఉంది. మౌఖిక సాహిత్యం లిఖిత రూపాన్ని పొందే క్రమం ఈ కథలో కనిపిస్తుంది. కాణభూతి వరకూ బృహత్కథ మౌఖిక పరంపరలో వచ్చింది. కాణభూతి కూడా గుణాఢ్యునికి ఆ కథ మౌఖికంగానే చెప్తాడు. దాన్ని గుణాఢ్యుడు లిఖిత రూపంలోకి అనువదిస్తాడు. అలా చేసేందుకు అతనికి భూర్జ పత్రాలు, సిరా కావలసి వచ్చాయి. తన రక్తాన్ని సిరాగా మార్చి రాస్తాడు. ఆలా రాసిన గ్రంథాన్ని లోకంలో వ్యాపింపజేయడానికి కృతిభర్త అయిన ఒక రాజు అవసరం అయ్యాడు. ఆ గ్రంథాన్ని హాలుడు తిరస్కరించడంలో సంస్కృత భాషాభిమానమే కాక, లిఖిత రూపంపై ఉన్న అనాదరణ కూడా దాగి ఉన్నదేమో! లేఖన సంప్రదాయం మొదట సంస్కృతేతరమైన పాళీ, ప్రాకృత భాషలలోనే మొదలయిందని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. లిఖిత రూపంలోకి మారిన ఆ బృహత్ గ్రంథం అగ్నికి ఆహుతి అయిపోయి, మిగిలిన ఒక్క భాగం మాత్రమే తర్వాత కాలానికి అందింది. అంటే, ఎప్పుడైతే మౌఖిక రూపం లిఖిత రూపంలోకి వచ్చిందో, దాని ఉనికీ వ్యాప్తీ లేఖన మాధ్యమం అయిన పత్రాల ఉనికిపై పూర్తిగా ఆధారపడింది అన్నమాట. మిగిలిన ఆ ఒక్క భాగం కూడా వ్యాప్తికై ఆ రాజుపైనే ఆధారపడింది. కథలో యీ సంగతులు, అప్పుడే ప్రారంభమైన లిఖిత సంప్రదాయంలోని పరిమితులను సూచిస్తున్నాయి. లిఖిత రూపం ఖిలమైపోవడం అనే అంశం మనకు తెలుగు భారత, భాగవతాలకు సంబంధించిన కొన్ని కథలలో కూడా కనిపిస్తుంది. మౌఖిక లిఖిత సంప్రదాయాల మధ్య రాపిడిని ఈ కథలు ప్రతిబింబిస్తాయని ఊహించవచ్చు.

ఏది ఏమైనా, ఏడేళ్ళపాటు అవిశ్రాంతంగా కష్టపడి నిర్మించిన కావ్యాన్ని, ఒక కవి, తాను స్వయంగా అగ్నికి ఆహుతిగా సమర్పించడం, ఊహించడానికే గుండె ఝల్లుమనిస్తుంది. కవికి తన రచన పట్ల పూర్తి వైరాగ్యం, అంటే మమకార రాహిత్యం, ఉంటే తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు. పూటపూటకూ ఒక కొత్త రచనను సామాజిక మాధ్యమాలలో ప్రచురిస్తూ, వాటికి మెచ్చుకోళ్ళను ఆశిస్తూ, విమర్శను అణుమాత్రమైనా సహించలేని నేటికాలపు రచయితలకు ఏమాత్రం మింగుడుపడని విషయం ఇది!!