నాకు నచ్చిన పద్యం: జనకోపనిషత్తు

సీ.
లేకలేకేను కల్గితిఁ గాన నా మీఁదనసువుల కంటెను నరితి పూని
బడికిఁబంపిననొజ్జ బాఁదునప్డప్డని యోనమాల్ సైతము తాన చెప్పి
క్రిందవ్రాశిన నాదు వ్రేల్నొచ్చునని యక్కరములు బల్పముమీఁద వ్రాయ నేర్పి
యోపిక తీరికయునుఁ గల్గినపుడెల్ల చదివించి కొంత కోవిదునిఁ జేసి
తే.
మత్పురాకృతపాపకర్మమునఁ బాల్య
ముననె యూర్థ్వగతికిఁజన్న జనకుని పద
ములు స్మరించెదనాయన త​​లఁపు వలన
లోచనాశ్రువులురలి కాలువలు వాఱ.

అన్నము అంటే ఏమిటి అని ప్రశ్న. అద్యతేऽత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యతే అని తైత్తరీయోపనిషత్తు. దేనిని జీవులు తింటున్నాయో, లేదా జీవులచేత ఏది తినబడుతున్నదో అది అన్నము. దీనికి ముఖం ద్వారా మనం తీసుకునే ఆహారం అనేది రూఢి అయిన అర్థం. కానీ మనం తినేది అది ఒక్కటేనా? మన ముఖం కంటే కూడా మన మెదడు తినేది ఎక్కువ. దాని ఆకలి, అరాయింపు శక్తీ పైకి కనిపించవు. సృష్టిలో తనకు ఎదురైన ప్రతీ భావననూ మెదడు తింటుంది. గుర్తుకు వచ్చినపుడు ఆ భావనాహారాన్ని నెమరు వేసుకుంటుంది కూడా. ఆ అన్నంలో మెదడుకు పుష్టిని చేకూర్చే పదార్థాలు కొన్ని మాత్రమే ఉంటే, పెక్కుశాతం దానికి నష్టం కలిగించేవే అన్నది సుస్పష్టం.

మెదడు ఎన్ని సార్లు, ఎన్ని విధాలుగా తిన్నా, నెమరు వేసుకున్నా కూడా తీపును కోల్పోని భావపదార్థం ప్రేమ. అది మానవుడి మనసుకు చేకూర్చే పుష్టిని కొలవడానికి క్యాలరీల మాపకాలు సరిపోవు. ఇచ్చే ఆనందాన్ని వెలకట్టడానికి అంకెల పెద్దరికం సరిపోదు. ఈ ప్రపంచంలో లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ ఒకే వస్తువు ఒకే బలిమితో ఒకే విలువతో ఒకే అనుభూతితో ఏదైనా ఉందీ ఉంటే అది ప్రేమ మాత్రమే. అటువంటి ప్రేమ కొందరికి బాధను ఎందుకు మిగుల్చుతుంది అంటే దానికి నాకు అనిపించే సమాధానం ఒకటే. ప్రేమ సహజంగా ఒక దివ్యాత్మ ఉన్న వస్తువు. ప్రతీ మనిషి మనస్సులోనూ అది సమానంగానే అవతరిస్తుంది. అయితే ఆ మనిషి మనసులో ఉండే పొరలలో అది చిక్కుబడినపుడు తదనుగుణంగానే దాని ఫలితమూ ఉంటుంది. తన మనసులో శుద్ధత్వపు పొరలున్నవా లేదా స్వార్థపు పొరలా అన్నది ప్రతీ మనిషీ తనకు తానుగా వేసుకోవలసిన ప్రశ్న.

ప్రేమను శుద్ధత్వపు పొరలలో చుడుతూ, స్వార్థపు పొరలను ఒలిచి వేస్తూ పోయిన కొద్దీ మనలను ఎంత ఉన్నతికి అది పోతుందో, స్వార్థపు పొరలను చుడుతూ శుద్ధత్వపు పొరలను ఒలిచే కొద్దీ అంత బాధాపాతాళానికీ మనలను తొక్కివేస్తుంది.

ధర్మంతో కూడి ఉన్న ప్రతీ ప్రేమా గొప్పదే. ప్రియురాలిపై లేదా ప్రియునిపై ప్రేమ; పశుపక్ష్యాదులపై ప్రేమ; తల్లిదండ్రులపై ప్రేమ; పిల్లలపై ప్రేమ; వ్యక్తిత్వంపై ప్రేమ; ఏ ప్రేమనూ తక్కువ చేసేందుకు అవకాశమే లేదు. ఈ సంగతులన్నీ ముందువెనుకలు చెప్పకుండా మీతో మనవి చేస్తున్న కారణం, ఈ సారి నేను మీకు పరిచయం చేద్దామనుకుంటున్న పై పద్యం ఒక కొడుకుకు ఉన్న తండ్రి ప్రేమను వర్ణించే కవిత. మాటలకు అందని ప్రేమే మాటలకు అందినపుడు అది కవిత్వమవుతుంది. అటువంటి కవితే పై పద్యం.

మునుపటి నెలలో ఇవటూరి సూర్యప్రకాశకవి కవి వ్రాసిన తారకాపచయము అనే గొప్ప ప్రబంధం నుండి రెండు పద్యాలు మీతో పంచుకున్నాను. ఆ ప్రబంధం లోనిదే ఈ పద్యం కూడా. ఈ పద్యం కథలో భాగమైనది కాదు. కవి స్వంతవిషయము. అందుకనే ఈ పద్యానికి ఒక వాస్తవికమధురిమ ఏర్పడింది. కవిగారి తండ్రిగారు దురదృష్టవశాత్తూ కవి చిన్నతనంలోనే శివపదానికి చేరుకున్నారు. అంతవరకూ తన్ను ఏవిధంగా చూసుకున్నదీ కవి ఈ పద్యంలో నెమరు వేసుకుంటున్నాడు.

సీసపద్యంలోని మొదటి పాదంలో తండ్రికి తానంటే ఎంతప్రేమ ఉండేదో వర్ణించబడింది. కవిగారు వారి తల్లిదండ్రులకు లేకలేక పుట్టాడట. అందువల్ల వారి నాన్నగారికి తన ప్రాణాలకన్నా ఈయనంటేనే మక్కువ ఎక్కువగా ఉండేదట. అసువు అంటే ప్రాణము. అరితి అంటే ప్రేమ. ప్రాణాలకు మించి మనలను ప్రేమించేవారు తల్లిదండ్రులు కాక మరెవరు? ఇక్కడ వాడబడిన పూను అనే క్రియాపదం చక్కనైనది. వహించడం, ధరించడం అనే అర్థాలు దానికి. ఆ ప్రేమను ఆ తండ్రి దింపుకున్నదే లేదు. ఆజీవితాంతమూ ధరించే ఉన్నాడు.

రెండు మూడు పాదాలలో తనపై ప్రేమను ఆయన తండ్రి ఏలాగున చూపించారో చెబుతున్నాడు కవి. ఒజ్జ అంటే ఉపాధ్యాయుడు. ఒకవేళ తనను బడికి పంపితే ఆ అధ్యాపకుడేమైనా ఈయన్ను అప్పుడప్పుడూ దండిస్తాడేమో అని ఓనమాలు కూడా ఆయనే నేర్పించాడట కొడుకుకి. బాదడమంటే తీవ్రంగా కొట్టడమని వాడుక.

అక్షరాలు వ్రాసేటప్పుడు ఒకవేళ క్రింద వ్రాస్తే ఈయన వ్రేలుకు నెప్పి చేస్తుందేమో అనే ఆలోచనతో అలా వ్రాయించక, బలపం తోనే వ్రాయడం నేర్పించారట. బలపమంటే రాతపలకపై వ్రాసేది. అక్షరము ప్రకృతి, అక్కరము వికృతి.

పాపం ఆయనకు ఓపిక, తీరిక ఎప్పుడు దొరికినా, ఈయన్ను చదివించి, కొంత కోవిదుడ్ని చేశారట. కోవిదుడంటే పండితుడని అర్థం తెలిసినదే. కౌః నామ వేదః, తం వేత్తి జానాతీతి కోవిదః అని దాని వ్యుత్పత్తి. కౌ అంటే వేదమని. దాన్ని ఎరిగినవాడు కోవిదుడు. ఇక్కడ ‘కొంత కోవిదుడు’ మంచి ప్రయోగం. ఆ ‘కొంత’లో తాను పూర్ణకోవిదుడు కాడన్న వినయముంది. తన తండ్రి తనను పూర్ణుడైన కోవిదుడిని చేయకుండా అర్థాంతరంగా గతించిపోయాడన్న బాధ కూడా ఉంది.

అటువంటి తండ్రి, తాను చేసిన ఏదో పూర్వపాపపు ఫలితంగా తన బాల్యంలోనే ఊర్ధ్వగతికి వెళ్ళాడట. అంతటి ప్రేమమయమూర్తి అకాలదేహాంతానికి వేరే ఏ కారణమూ తోచలేదు పాపం కవికి. తన కళ్ళలోనుండి బాష్పాలు పొర్లి, కాలువలు కడుతుండగా, అటువంటి తండ్రి పాదాలను స్మరిస్తాను అంటున్నాడు. ‘పదములు’ అనే దానికి ఇక్కడ నానార్థావకాశం ఉంది. పదములు అంటే ఆయన మాటలని, తనకు నేర్పిన పదాలని, చదువనీ అర్థాలు చెప్పుకోవచ్చు. చన్న అంటే చనిన లేదా గతించిన అని అర్థం. బాష్పాలకు ‘లోచనాశ్రువులు’ అని కవి వేసిన సమాసం సొగసైనది. ఉరలడమంటే కారడమని.

కవికి ఈ పద్యం వ్రాసేనాటికి తండ్రిలేడు. ఆయన పాదాలపై భక్తి అచంచలంగా ఉంది. ఆయన మాటలు మెదడు పొరల్లో పదిలపరచబడి ఉన్నాయి. ఆయన నేర్పిన చదువు రసనాగ్రవర్తియై మిగిలి ఉంది. ఆయన చూపిన ప్రేమ శక్తిగా మారి హృదయాన్ని పూర్తిగా ఆక్రమించుకుంది. ప్రత్యక్షదైవమైన తండ్రి విశ్వరూపం ఇదే కదా!

ఈ పద్యం నాన్నపై ఒక కవినుండి వెలివడిన ఉపనిషత్తు.