నాకు నచ్చిన పద్యం: కడలివెన్న కమనీయోదయము

సీ. మిత్రుని జాడలేమికిఁ బొక్కుచుఁ దలెత్తి నెమకుచుండిన తూర్పునెలఁత మొగమొ
     యొంటనివాని రేకంటుఁదాకి జయింప సుడిమొగ్గరమువన్ని నడచు నిగమొ
     హేలకై శచిబిడ్డఁడెగురవైచుడుఁ బూర్వగిరిపైఁ బడిన బంతి విరుల చెండొ
     సమయమాంత్రికుడు ధ్వాంతమునాప మంత్రవిభూతికై తెచ్చిన బూదిపండొ

     యనుచవనిలోకముననున్న జనములెన్న
     సురలకోగిరమిడు విడుపరుల మిన్న
     కమలవనములపాలిటి గౌరుగున్న
     పొడుపుఁ గుబ్బలి పైఁదోఁచెఁ గడలి వెన్న.

మ. ఇలపైఁ బ్రాణులు సద్దడంగుటయు హాయిన్ స్వాంతరంగంబు ని
     ర్మలమైయొప్పుడు లోకతాపసుడెదన్ బ్రహ్మానుసంధానమున్
     జలుపన్ గ్రొందెలి నారచీర మెయి నిండన్ దాల్చెనో యంచు ద్ర
     ష్టలు భావింపనెసంగె నెల్లెడలఁ జ్యోత్స్నల్ పుచ్చపూచాడ్పునన్.

కవికి దక్కే భోగం కీర్తికాంత దయాధీనమని అనుకుంటాను నేను. మహాకవి రాజశేఖరుడు చెప్పినట్లుగా ఒక కవి యొక్క కవిత ఎన్ని గొప్పలక్షణాల ప్రోవైనా విధిప్రాబల్యం వల్ల సిగ్గరి అయిన అమ్మాయిలా ఆ కవి యింటి గడప దాటిపోదు. మరొక కవి యొక్క కవిత కొద్దిగా గెంతులు వేసి, మిత్రుల ఇళ్ళవరకూ, ఇరుగుపొరుగు ఇళ్ళవరకూ మాత్రం వెళ్ళగలిగి అక్కడ తిరుగాడగలుగుతుంది. లలాటంపై అదృష్టరేఖ ఉన్న ఏ కవి కవితో మాత్రమే, విశ్వకుతూహలినిలా ప్రపంచమంతా చక్కర్లు కొడుతుంది.

దురదృష్టవశాత్తూ మంచి కవిత్వం ఎప్పుడూ చదువరులపైకి ‘రసానందాన్ని గ్రోలగలిగే దమ్మున్నవాడివైతే ముందు నన్ను కనిపెట్ట’మంటూ ప్రహేళికను విసురుతూనే ఉంటుంది. తెలుగులో అయితే మరీను. దురదృష్టవశాత్తూ, ‘గుంపులో గోవింద’ అనే నానుడి అనువర్తించకూడని కావ్యజగత్తులోనే దాని ప్రభావం ఎక్కువ. కావ్యం తీయనిదో కాదో అన్న వైపుకు ఆ కావ్యాన్ని చూసిన వెంటనే మన మనసు పోదు కదా. అది పద్యకావ్యమా, వచనకావ్యమా; చదివి అర్థం చేసుకోడానికి తేలికదా కష్టమైనదా అనే కదా మొదటగా అభిప్రాయాలు ఏర్పడేది. దీని వల్లన కలిగే ఫలితాలలో ఒకటి, ఎవరికీ తెలియని కవితనో కావ్యాన్నో వెలికితీయడమే గొప్పసేవగా అగుపించడం. నా దృష్టిలో అది చాలా ప్రాథమికమైన పని. కవితలన్నీ ప్రతీవాడికీ తెలిసి ఉండాలని; కవితానుభవప్రసారానికి, వాగర్థవైదుష్యానికీ మాత్రమే ఉన్నతస్థాయి దక్కాలనీ నా ఊహ. మంచి కవిత్వం ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా ఎలా ఒడిసిపట్టుకుందామా అనే ఒక వీరావేశం ప్రతీ కవితాభిమాని కళ్ళకూ ఉండాలి.

ఈ తీరని కోరికల సంగతులకేంగాని, ప్రస్తుతపద్యాల దగ్గరకు వద్దాం. తెలుగు సాహిత్యం చంద్రోదయవర్ణనల ఆటపట్టు కదా. పై రెండు పద్యాలలో మొదటి పద్యంలోని వస్తువదే. రెండవపద్యంలో వెన్నెల వర్ణించబడి ఉంది. ఎక్కువమంది కవులు వర్ణించిన వస్తువుపై మళ్ళీ ఒక కవితనల్లాలంటే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురాక తప్పదు. ఉదయాస్తమయ వర్ణనలయితే, ఇక కొత్తగా ఊహించడానికి ఏమీ లేదు అనేంతలా వర్ణనలు తెలుగులో ఉన్నాయి. ఎన్ని ఉన్నా, ప్రతి చిన్ని కవినీ తమవైపుకు లాగుకొనే ప్రకృతిసమ్మోహనశక్తులవి. ఈ కవి కూడా వాటిని వర్ణించకుండా ఉండలేకపోయాడు.

పై పద్యాలు తారకాపచయము అనే ప్రబంధంలోనివి. రచయిత ఇవటూరి సూర్యప్రకాశకవి. ఆంధ్రదేశంలోని తణుకు తాలూకా కొత్తపల్లి వాసి. పైన చెప్పినట్లుగా, కీర్తికి పెద్దగా నోచుకోని మహాకవి ఈయన. ఈ రచనకు కవి స్వంతంగా వ్రాసుకొన్న ముందుమాటొకటి తప్ప నాకు ఈ కవి గురించి పెద్దగా వివరాలేమీ లభించలేదు. పన్నెండాశ్వాసాల ఈ గొప్ప ప్రబంధాన్ని వ్రాయడానికి ఈ కవికి మూడేళ్ళు పట్టింది. రచన సంపూర్ణమైనా, అచ్చొత్తించుకునేందుకు నానా అవస్థలు పడ్డాడు. చివరకు దాతలెవరూ చిక్కక, ఎక్కువకాలం కావ్యాన్ని మూలన పడేయడానికి మనసొప్పక స్వంతంగానే ముద్రించుకున్నాడు. ముందుమాటలో, ఇంత కష్టించి వ్రాసిన గొప్పకావ్యానికి కేవలం రెండు రూపాయలు మాత్రమే మూల్యం ఏర్పర్చబడిందని, ప్రతిఫలం లేకుండా వేయినూటపదార్లిచ్చినా తీసుకోనని, కనుక పాఠకులు తన్ను నిరుత్సాహపరచకుండా తనను ఆదరించాలనీ విన్నవించుకున్న గంభీరత ఈ కవిది.

నాకు లభించిన తారకాపచయ ప్రతి 1910లో ముద్రితమైనది. ఈ ప్రబంధం చదవడం ఒక గొప్ప అనుభూతి. కుమారసంభవ తారకాసురసంహార ఇతివృత్తాలను, తీసుకొని శివాంకింతంగా వ్రాయబడిన మనోహరకావ్యమీ రచన. సంస్కృతంలోని సొబగు, తెలుగులోని తీయందనాల రహస్యాలను ఆపోశన పట్టిన కవి ఈయన. కొత్తకొత్త ఊహలు చేయడంలోనూ ఆరితేరినవాడు. తన మార్గం సంప్రదాయ పద్యకవిత్వం అయినా, ఆ మార్గం లోని ఉన్నతత్వాన్ని మాత్రమే పుణికిపుచ్చుకొన్న కవిప్రతిభ ఈ ప్రబంధమంతటా కనిపిస్తుంది. ఈ కావ్యంలోని తెలుగు పదాలైతే, ఎవరో గుప్పిళ్ళతో మల్లెలను తీసుకొని మన ముఖంపైకి విసురుతున్నట్లుగా ప్రోవుకడతాయి.

రాత్రి ఉదయించిన నెలరాజును చూసి ‘ఇలా ఉంది, ఇలా ఉంది’ అంటూ ఊహలూ ఉత్ప్రేక్షలూ చేయడం ఉన్నదే. పై సీసపద్యం అదే కోవలోకి వస్తుంది. అయితే ఊహలలోని విలక్షణత నన్ను కట్టిపడేసింది. అందమైన స్త్రీని చంద్రముఖి అని, ఇందుముఖి అనీ అనడం పరిపాటే. కానీ ఇక్కడ కవి ఉదయించిన చంద్రుడినే ఒక స్త్రీముఖమన్నాడు. ఎవరా స్త్రీ అంటే తూర్పు దిక్కట. ఆమెకు సూర్యుడి జాడ తెలియడం లేదట. ఆ బాధలో తలయెత్తి, వెతుకుతోందట (నెమకడం అంటే అన్వేషించడం). అటువంటి తూర్పుదిక్కు ముఖంలా ఉందట ఆ చంద్రబింబం.

తనను తునాతునకలు చేస్తాడని మంచుకు (ఇగమంటే మంచు) సూర్యుడిపై (రేకంటు. రాత్రికి శత్రువని) కోపమట. ఆ కోపంతో ఆయనపైకి యుద్ధానికి వెళ్ళిందట. ఆ యుద్ధంలో చక్రవ్యూహాన్ని దేన్నో ప్రయోగించిందట (సుడిమొగ్గరము). చంద్రుడు ఆ హిమచక్రవ్యూహంలా ఉన్నాడట! అంతేనా, శచీదేవి పిల్లడు ఆడుకుంటున్న పూలబంతిలా ఉందట ఆ చంద్రబింబం. అంతే కాదు, సమయమనే మాంత్రికుడు చీకటిని ఆపడం కోసమని తెచ్చిన విబూదిపండులా ఉందట!

ఈ ఊహలకు తెలుగు రంగు, కాంతిమత్వమూ సమానధర్మాలు. ఎంత చక్కని ఊహలివి! ఈ రకంగా ‘ఇదా, ఇదా’ అనుకుంటూ చూస్తున్న భూలోకవాసులంతా అనుకుంటూండగా, దేవతలకు అన్నం పెట్టేటువంటి అమృతమయుడు, ధాతుమయుడు అయిన చంద్రుడు ఉదయాద్రిపై తోచాడట. ఇక్కడ మరొక్క రెండు గొప్ప ఊహలు చేశాడు కవి. చంద్రుడు ఎటువంటివాడంటే, కమలవనాల పాలిటి ఏనుగుగున్నట! కడలిలో పుట్టిన వెన్నట! చంద్రుడు పద్మాలకు ముకుళింపచేస్తాడని, కనుక వాటికి శత్రువు వంటి వాడనీ కవిసమయం. చంద్రుడు సముద్రపుత్రుడన్నది పురాణగాథ.

రెండవ పద్యం వెన్నెలను వర్ణించే పద్యం. వెన్నెలలు తెల్లగా స్వచ్ఛంగా ముప్పిరిగొంటాయన్నది తెలిసిందే కదా. దానిని సూటిగా అలాగే చెబితే అది కవిత్వం అవ్వబోదు. మరి కవిత్వమంటే ఎలా ఉంటుంది? చూడండి – ఒక తపస్వి ఉన్నాడు. ఎవరా తాపసి అంటే లోకమనే తాపసి. తపస్వి అంటే ప్రాణులందరి హితాన్నీ అభిలషించే మనసున్నవాడు కాదా. అది అతనికి లౌకికమైన కోరిక. తపస్వికి పారమార్థికమైన కోరిక పరమాత్మలో ఐక్యం కావడం. రోజంతా ప్రాణిజాలమంతా కూటికోసం యుద్ధం చేసి, ఇంటికి తిరిగివచ్చి సద్దుమణిగాయి. దీనిని చూసి హాయిని పొందాడు ప్రపంచమనే తాపసి. అతని లౌకికమైన కోరిక తీరింది. మనసులో జంజాటము సమసిపోయింది. నిర్మలమై, ఏకాగ్రత కుదిరింది. ఇక బ్రహ్మతో అనుసంధానం చేసుకుందామని అనుకున్నాడు. తపస్సుకు బయలుదేరుతూ తెల్లని ఒక కొత్త నారచీరను కట్టుకొన్నాడు. ఆ ప్రపంచమన్న తాపసి తన శరీరంపై కట్టుకున్న నారచీరే వెన్నెలట!

ఇలా ద్రష్టలు (చూసేవారని ఒక అర్థం. మంత్రద్రష్టలైన ఋషులని మరొక అర్థం) అందరూ భావిస్తూ ఉండగా పుచ్చపూలలాంటి వెన్నెల అంతటా అలముకొన్నదట!

ఏం భాష ఇది! ఏం తీపులివి! తెలుగా, వర్థిల్లు.