ఎల్ల లోకములు ఒక్కటై…

తెల్ల చర్మం ఉన్న ప్రతి ఒక్కరినీ ముందుగా అడిగే ప్రశ్ననే ఆయననూ అడిగాను. ”మీరు ఏ దేశానికి చెందినవారు?”

ఆయనను అడగకూడని ప్రశ్న అదే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఆయన గురించి నిజంగా తెలుసుకోవాలంటే అడగాల్సిన ప్రశ్న కూడా అదేనని.

ఆయనకు డెబ్బై ఏళ్ళు ఉంటాయి. పెదవులే లేనట్టు నోరు లోపలికి ముడుచుకుపోయి చుట్టూ ముడతలతో, కొంచెం వంపు తిరిగిన నిటారైన జర్మన్ ముక్కుతో – ఆయన వయసును చెప్పేవి ఈ గురుతులు మాత్రమే – సుమారు ఏడు అడుగుల పొడవు ఉంటారు. అంత పొడవు ఉన్నవాళ్ళు తమకంటే పొట్టిగా ఉన్నవారితో వంగి వంగి మాట్లాడటం వల్ల సహజంగానే కొంచం గూని వచ్చి ఉంటుంది. ఎండకు కందిన బట్టతల, వెడల్పాటి నుదురు, సాగిన చెంపల మీద దున్నిన ఎర్రమట్టి నేలలాంటి ముడతలు. నీలి కళ్ళు. విశాలమైన భుజాలు. చదునుగా ఉన్న పొట్ట. ఖాకీ ప్యాంటు, షర్టు వేసుకుని ఉన్నారు. కీళ్ళల్లో స్ప్రింగులున్నట్టు నడక.

ఆయన మందపాటి కళ్ళజోడు వెనక నుండి స్నేహంగా నాకేసి చూస్తూ “నువ్వు ఏ దేశస్థుడివి?” అని అడిగారు.

నేను కొంచెం గాభరాపడి “నేను ఇండియన్‌ని” అన్నాను.

“ఓఁ! నువ్వు ఇండియన్ అని అన్నది ఎవరు?”

ఒక క్షణం జాగ్రత్తగా ఆలోచించాను. “చట్ట ప్రకారం నేను ఇండియన్‌ని.”

“అంటే, ఇండియా అనే ఒక భూప్రాంతం మీద ఏర్పాటయి ఉన్న ఒక ప్రభుత్వం నీకు ఆ గుర్తింపుని ఇస్తుంది. ఇండియాకు చెందిన పౌరుడివి అని అది నిన్ను గుర్తిస్తుంది, అంతేనా?”

నేను ఒక తిరకాసు వ్యక్తి చేతిలో ఇరుక్కున్నానని గ్రహించాను. అయితే ఊటీ చుట్టుపక్కలున్న పల్లె ప్రాంతాలలో అది సహజమే. ఊటీ లోపల, పల్లెలకు వెళ్ళే దారిలో తటస్థపడే తెల్లవాళ్ళు వేరే కోవకు చెందినవాళ్ళు. భుజాన పెద్ద పెద్ద సంచులతో, పెద్ద బూట్లు వేసుకుని కొండెక్కడానికి వెళ్ళేవాళ్ళు, కెమెరాలతో బైనాక్యులర్లతో అడవిలోకి వెళ్ళేవాళ్ళు, చెట్టాపట్టలేసుకొని జంటగా నాలుగు అడుగులకు ఒకసారి ముద్దు పెట్టుకునేవాళ్ళు. అయితే కొడైకెనాల్‌లో కనిపించినంతగా మాదకద్రవ్యాల బానిసలు ఇక్కడ ఉండరు. కొడైకెనాల్‌లో దొరికే ఒక రకమైన పుట్టగొడుగు కోసం జులపాల జుట్టుతో ఉండే విదేశీ యువకులు విరివిగా వస్తూ ఉంటారు. ఊటీలో కనిపించేవాళ్ళలో దాదాపుగా అందరూ ఆరోగ్యవంతులే.

ఊటీ పొలిమేరలకు అవతల విసిరేసినట్టు పడి ఉన్న ఎన్నో గ్రామాలలో గురుకులాలు, ఆశ్రమాలు ఉన్నాయి. క్రైస్తవ దేవాలయాలు, ధ్యాన మందిరాలు కోకొల్లలు. ఇలాంటివాటికి వెళ్ళేవాళ్ళే ఈ పల్లెటూరి రోడ్ల మీద తటస్థపడుతుంటారు. ఈ విదేశీయులకు ప్రత్యేకమైన ఒక గుణం ఉంది. వీళ్ళు ఇతర విదేశీయులను కాకుండా స్థానికులను కలవడానికి, వాళ్ళతో మాట్లాడటానికి చిన్న చిన్న టీ అంగళ్ళలో టీ తాగడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇతర పర్యాటకుల్లా కనిపించిన ప్రతిదాన్నీ ఫోటో తీసుకోవాలన్న ఉబలాటం వీళ్ళకు ఉండదు. పొడవుగా జుట్టు పెంచుకున్నవాళ్ళు, కాషాయం కట్టుకున్నవాళ్ళు, గుండు గీసుకుని రుద్రాక్ష ధరించినవాళ్ళు – ఇలా రకరకాలు. అయితే ముఖంలో ఎప్పుడూ ఒక నవ్వో లేదా అది లేకుండడమో వీళ్ళు వేరే కోవకు చెందినవారు అని ఎత్తి చూపుతూ ఉంటుంది. ఈయన తన ఎండుగడ్డి రంగు జుట్టును వెనకవైపుకు పోనీటెయిల్‌లా కట్టుకుని ఉన్నారు.

కోళికోడు నుండి ఊటీ బస్టాండ్‌లో దిగి ఫెర్న్ హిల్ వెళ్ళడానికి నిల్చుని ఉన్నప్పుడు ఆయన్ని చూశాను. ఈరోజు బస్సులు నడవవు అని చెప్పారక్కడ. ఆటోలు, వ్యాన్లు కూడా లేవు. ఊటీ బంద్. తేయాకు కొనుగోలు ధర బేరసారాలకు సంబంధించిన ధర్నా. నడవక తప్పదు. అలా నడక మొదలుపెట్టినప్పుడు, అప్పుడే మరో కేరళ బస్‌ లోనుండి దిగి, ఆయన చిరుతపులిలా వేగంగా నడుస్తూ నన్ను దాటుకొని వెళ్ళారు. నేను వేగం పెంచి వెళ్ళి ఆయనను పలకరించాను.

‘సరేలే మాట్లాడి చూద్దాం, ఏమవుతుందిలే’ అన్న ఆలోచన కలిగినప్పుడు మొదలైంది ఆయనతో సంభాషణ.

“…నా దేశం నాకు కేవలం పౌరుడిని అన్న గుర్తింపుని మాత్రమే కాదు, భద్రతాభావాన్నీ ఇస్తుంది.”

“ఎవరి నుండి?”

“ఇతర దేశస్థుల నుండి.”

“ఇతర దేశస్థులు అంటే? అక్కడి ప్రభుత్వాలచేత నీలా గుర్తింపు ఇవ్వబడి అక్కడ ఉండే ప్రజలనుండా? వాళ్ళు నిన్ను హతమార్చాలి అనుకుంటున్నారా?”

నేను జవాబు చెప్పలేకపోయాను.

“నీ దేశ ప్రభుత్వం మీదికి యుద్ధానికి దిగేది ఇంకో దేశ ప్రభుత్వం. అది ప్రభుత్వాల మధ్య జరిగే యుద్ధం. నిన్ను ముందుకు నెట్టి యుద్ధాలను జరిపే ప్రభుత్వాలు నీకు భద్రతను ఇస్తున్నాయి అని అనుకుంటున్నావు.”

నాకు వెంటనే వెలిగింది. దాదాపుగా రౌడీలు అందరూ పొరుగు అడ్డాల రౌడీల దగ్గర నుండి ‘ప్రజలను కాపాడటానికే’ ఒక అడ్డాని తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నాం అని చెప్తూ ఉంటారు. నేను ఓటమిని ఒప్పుకోలేకపోయాను.

“దేశం అంటూ ఒకటి ఉంటేనే కదా ప్రజలు కలిసికట్టుగా ఉంటారు?”

“ఏ ప్రజలు? పాకిస్తానీలు, భారతీయులా?”

నేను కోపంగా “లేదు, భారతీయులు” అన్నాను.

“అయితే ఊటీ ఇండియాతో ఎందుకు ఉండాలి? ఈ కొండ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించవచ్చు కదా? ఈ కొండ ప్రాంతం జనులంతా ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఐకమత్యంగా ఉంటారు కదా? అంతెందుకు ఈ మసినగుడి అన్న ఈ ఊరినే ఒక ప్రత్యేక దేశంగా చేసివేయొచ్చు.”

ఆయన సంభాషణను ఎటు తీసుకెళుతున్నారో అర్థం చేసుకుని మౌనం పాటించాను.

“ఊటీ తమిళనాడుతో కలిసి ఐకమత్యంగా ఉండగలదు అంటే, తమిళనాడు ఇండియాతో కలిసి ఉండగలదు అంటే, లోకమంతా ఎందుకు ఏకంగా ఉండకూడదు?” అని అడిగారు.

ఆ ప్రశ్నలో ఉన్న ఊహేదో నాకు చిరునవ్వును తెప్పించింది. ఊటీలోని కొండదారుల్లో బహుశా ఋషులలాగా ఆలోచించాలని అనిపిస్తుందేమో అందరికీ.

“నువ్వు నవ్వుతున్నావు. దీన్ని పిచ్చితనం అని అనుకుంటున్నావు. నేను ప్రపంచంలోని నూటయాభై దేశాలలో వేలాదిమంది ఇలాంటి నవ్వే నవ్వడాన్ని చూశాను. నూరేళ్ళకు ముందు నల్లవాడూ తెల్లవాడూ సమానం అని చెప్పినప్పుడు ఇలాగే నవ్వుకొని ఉంటారు. రెండు వందల ఏళ్ళకు ముందు మనిషిని బానిసగా అమ్మడం, కొనుక్కోవడం పాపం అన్నప్పుడు కూడా ఇలాగే నవ్వుకుని ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమని అన్నప్పుడు కూడా ఇలాగే పకపకమని నవ్వుకుని ఉంటారు.” ఆయన వేగంగానూ గట్టిగానూ మాట్లాడినప్పటికీ మాటల్లో ఎలాంటి కోపమూ లేకుండా మాట్లాడారు.

“ఎన్నో అభ్యుదయ భావాలను వ్యక్తపరుస్తాం. ఎందుకు ఈ విషయం గురించి మనం ఆలోచించడం లేదు? ఆ కోణంలో ఆలోచిద్దాం. ఆ కోణాన్ని చర్చించుకుందాం. చిన్న స్థాయిలోనైనా ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి చూద్దాం. ఏ ఒక్క మంచి ప్రతిపాదనయినా తొలి దశలో పిచ్చితనంగానే అనిపిస్తుంది. కొందరు పిచ్చివాళ్ళు ఆ ప్రయోగాన్ని భుజాన వేసుకుని నడుము బిగించినప్పుడే ఆ ఆలోచన కార్యరూపం ధరిస్తుంది. పౌరహక్కుల గురించి మాట్లాడిన హెన్రీ డేవిడ్ థొరోని పిచ్చివాడిగానే చూశారు. వ్యక్తి స్థాయిలో అతను చేసిన చిన్న చర్యకు ప్రత్యేకమైన అర్థమేమీ లేదు. పన్ను చెల్లించడం అన్న నియమాన్ని తిరస్కరించి ఒక వ్యక్తి అడవికి వెళ్ళి చెరువు ఒడ్డున, చెట్టు కింద గుడిసెలో నివసించడం వల్ల ఏం మార్పొచ్చేస్తుంది? అది ఒక సంకేతాత్మక చర్య… ఒక నాంది.

“ఇదిగో చూడు…” అంటూ తన సంచి లోనుంచి నీలి రంగులో ఉన్న ఒక పెద్ద డైరీ తీసి ఇచ్చారు. అది డైరీ కాదు పాస్‌పోర్ట్ అని చేతికి తీసుకున్న తర్వాతే తెలిసింది. అట్టకున్న ముదురు నీలం రంగు చూసి ముందుగా అమెరికన్ పాస్‌పోర్ట్ అనుకున్నాను. అయితే దాని అట్ట మీద ఎర్ర రంగులో భూగోళ చిత్రం ఉంది. దాని కింద ‘One World, One Nation’ అన్న నినాదం ఉంది. దాని కింద మరింత పెద్ద అక్షరాలతో ‘World Passport For World Citizens’ అని ఉంది.

ప్రపంచం లోని ఏ ఒక్క దేశానికీ చెందకుండా, ప్రపంచాన్నంతా ఒకే దేశంగా భావించే ప్రపంచ పౌరుడి పాస్‌పోర్ట్ అది అన్న వివరణ రెండో పేజీలో ఉంది. పలు భాషలలో ఆ వాక్యాలు ఉన్నాయి. ఆ పాస్‌పోర్ట్ అమెరికాలోని ఎల్స్‌వర్త్‌ నగరంలో, మెయిన్ ప్రాంతంలో ఉన్న ప్రపంచ పౌరుల రిజిస్ట్రీ (International Registry of World Citizens) విక్రయించింది. ఆ పాస్‌పోర్ట్ పొందటానికి ఉన్న నిబంధన ఒకటే. వేరే ఏ దేశం పాస్‌పోర్టూ ఉండకూడదు. ఏ దేశపు సైన్యం లోనూ ఉండకూడదు. ప్రపంచాన్నంతా తన దేశంగా మనస్ఫూర్తిగా అంగీకరించి ప్రమాణం చెయ్యాలి.

ఆ పాస్‌పోర్టులో అతని ఫోటో ఉంది. నలభై ఏళ్ళ నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో. కోల ముఖం, పెద్ద నుదురుతో ఉత్సాహంగా నవ్వుతూ ఉన్నారు. లారెల్ హార్డీ జంటలో లారెల్‌కు కొంచం కండపట్టినట్టు ఉన్నారు. ఆయన పేరు గ్యారీ డేవిస్. ప్రపంచ పౌరుడు. 1921లో అమెరికాలో జన్మించారు. 1948లో తొలి ప్రపంచ పౌరుడిగా తనను ప్రకటించుకున్నారు.

ఇందాక ఆయన చెప్పినప్పుడు ఇదంతా ఒక రకమైన పిచ్చితనం కాబోలు అనుకున్నాను. ఇంతలో ఆయన ఆ పాస్‌పోర్ట్ నాకు చూపించి “ఈ పాస్‌పోర్ట్ ఇప్పుడు 60 దేశాల్లో చెల్లుతుంది. ఈ పాస్‌పోర్టుతో నేను ఏడోసారి ఇండియా వచ్చాను” అని అన్నారు. నేను పాస్‌పోర్ట్ పేజీలను తిరగేసి చూస్తున్నకొద్దీ ఆశ్చర్యంతో నివ్వెరపోయాను. ఆ పాస్‌పోర్ట్‌కు ఒక్కో దశలో కొన్నేసి పేజీలు జత చేయబడి 200 పేజీల కంటే పైనే ఉంటుంది. ఆ పేజీలలో ముద్రలే ముద్రలు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ అక్షరాలతో రాతలు. కొట్టి వేతలు, దిద్దుబాట్లు. పలు భాషలలో పలు చేవ్రాతలతో… ప్రపంచ మ్యాప్‌లో పడి పొర్లాడి ఒళ్ళంతా రంగులను అంటించుకుని వచ్చిన ఉడతలా ఉంది ఆ పాస్‌పోర్ట్.

పేజీలు తిరగేస్తున్నప్పుడు హఠాత్తుగా జవహర్‌లాల్ నెహ్రూ సంతకాన్ని చూశాను. ఆకుపచ్చ సిరాతో ‘ఇండియన్ రిపబ్లిక్ ఈ పాస్‌పోర్ట్‌ని సాధికారమైన గుర్తుపత్రంగా అంగీకరించేందుకు నేను సిఫారసు చేస్తున్నాను. జవహర్‌లాల్ నెహ్రూ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ అని 1954 జూలై 18వ తారీఖున సంతకం చేసి ఉన్నారు. ఒక అధికార ముద్ర. దాని కింద ‘ఇది ఒక ఉన్నతమైన లక్ష్యం. దీన్ని ఇండియన్ ప్రభుత్వం అంగీకరించింది’ అని ఇందిరాగాంధీ సంతకం. ఆయన ఆ పాస్‌పోర్ట్ తీసుకుని ఒక పేజీ తెరిచి “ఇది చూడు” అని అన్నారు. ‘ప్రపంచ పౌరుడిని అయిన నేను ప్రపంచ పౌరుడైన గ్యారీ డేవిస్ ఫ్రాన్స్‌లో ప్రవేశించడానికి అంగీకారం ఇస్తున్నాను’ అని అల్బేర్ కామూ సంతకం చేసి ఉన్నారు.

ఇదంతా తిక్క ముదిరినవాళ్ళు చేసే పని అని మళ్ళీ అనిపించింది. అయితే ఈజిప్ట్ దేశపు నాసిర్, యుగోస్లావియా మార్షల్ టిటోలు కూడా సంతకం చేసి ఉన్నారు. మరెందరో ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా అధికారిక అనుమతికి సిఫారసు చేసి ఉన్నారు. మొట్టమొదటగా దీన్ని అమెరికన్ ప్రభుత్వమే అంగీకరించినట్టుంది. నేను పాస్‌పోర్టును తిరిగి ఇచ్చాను.

“నీకు ఇందులో చేరాలని ఉంటే చేరవచ్చు. నేను నీకు పాస్‌పోర్టు ఇస్తాను” అన్నారు.

“మీరు ఎక్కడికి వెళ్తున్నారు?” అడిగాను.

“ఇక్కడ నారాయణ గురుకులం అని ఒకటి ఉంది. అక్కడ బస చేసి ఉన్నాను.”

“అరే! నేను కూడా అక్కడికే వెళుతున్నాను. నేను నిత్యచైతన్యయతి శిష్యుడ్ని.”

ఆయన నా చేతులను తన బలమైన చేతులతో పట్టుకున్నారు. “ఎంత ఆశ్చర్యం! నేను నిత్యాకు ఆప్తమిత్రుడిని. నిజానికి నేను అతని గురువుకి మిత్రుణ్ణి. నిన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.”

“మీరు నటరాజగురుని ఎరుగుదురా?”

“మేమిద్దరం పాతికేళ్ళు కలిసి పనిచేశాం. నేను ఆయన్ని గురువుగా స్వీకరించాను.”

ఆశ్చర్యంతో ఆయనను చూశాను.

“నాకు హెన్రీ బెర్గ్‌సన్‌తో స్నేహం ఉండేది. ఆయనను చూడటానికి 1945లో నేను సోర్బోన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. అప్పుడు నటరాజగురు ఒక సమావేశం కోసం అక్కడకు వచ్చి ఉన్నారు. ఆయనని, జాన్ స్పియర్స్‌నీ అక్కడే కలుసుకున్నాను. ఆ తర్వాత ఒకే ప్రపంచం అన్న సిద్ధాంతం మీద మేమందరం కలిసి పనిచెయ్యాలని నిర్ణయించాం.”

అలా మాట్లాడుకుంటూనే గురుకులం వైపు నడిచాం. ఎనిమిదిన్నర అయితే గానీ ఊటీలో మెల్లమెల్లగా తెల్లవారదు. బంగాళాదుంపల తోటల వైపుగా చిలకలగుంపు ఒకటి దారికి అడ్డంగా ఎగురుకుంటూ వచ్చి వాలింది. దారి పక్కన మంచుకు తడిసి మెరుస్తున్న పచ్చగడ్డిని పుష్టిగా ఉన్న ఒక ఆవుల మంద మేస్తోంది. ఆ ఆవులను దాటుకుని వస్తున్న పొడవైన నీరెండ వెలుగు నీడలు. ఆవులు తోకల విసురుల మధ్య చిన్న చిన్న ఈగలు గాల్లో నిప్పు కణికల్లా ఎగురుతున్నాయి.

నేను నిత్యచైతన్యయతి గురించి తెలుసుకుని ఆయన్ని పరిచయం చేసుకుని గురుకులానికి వెళ్ళడం మొదలుపెట్టి అప్పటికి సంవత్సరమైనా కాలేదు. గురుకులం గురించి, దానికి చెందిన ఎందరో సభ్యుల గురించి, వలంటీర్ల గురించి నాకు పెద్దగా తెలియదు. అక్కడికి వచ్చిన ప్రతిసారీ నాకోసం ఎన్నో కొత్త ఆశ్చర్యాలు కాచుకుని ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎందరో విద్యావేత్తలు, ప్రముఖ అధ్యాపకులు, తత్వవేత్తలు, యాత్రికులు నిత్యచైతన్యయతి స్నేహితులుగాను, శిష్యులుగానూ అక్కడికి వస్తూ ఉంటారు.

దార్లో నాలుగు గుఱ్ఱాలు ఎదురొచ్చాయి. ఒకటి తెలుపు. మిగిలినవి లేత గోధుమరంగు. పొద్దుటి నీరెండలో అవి బంగారంతోను, వెండితోనూ చేయబడినవిలా మెరుస్తున్నాయి. తమ ఒంటిని విదిలించుకుంటూ, తోకలు విసురుకుంటూ, నిగనిగలాడే మేనితో, గిట్టల చప్పుడుతో నడిచి వచ్చాయి. ఒక గుఱ్ఱం మాకేసి తిరిగి చూసినప్పుడు దాని జూలు భలే ముచ్చటగా ఊగింది. నేను మనసులో ఏమనుకున్నానో ఆయన పైకి అదే అన్నారు. “బంగారము, వెండి…” అని ఆగి వాటిని చూస్తూ వికసించిన మొహంతో “ఎవరికీ సొంతం కాని సిరులు…” అన్నప్పుడు ఆయన మనసులో ఆ భావన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అని నాకు అర్థం అయింది.

మంజనకొరై గ్రామానికి చేరుకుని నారాయణ గురుకులం వెళ్ళే దారి వైపుకు తిరిగాము. ఆ మలుపులో ఒక కొత్త ఇల్లు కడుతూ ఉన్నారు. గ్యారీ డేవిస్ నాతో “1954లో ఇక్కడికి నేను తొలిసారి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేదు. లోయలో అక్కడక్కడా బంగాళాదుంప తోటలు. వాలుగా ఉన్న కొండంతా దట్టమైన పొదలు, యూకలిప్టస్ చెట్లు మాత్రమే ఉండేవి. ఇక్కడినుండి చూస్తే గురుకులం అడవి మధ్యలో ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన రేకు డబ్బాలా ఉండేది” అన్నారు.

నటరాజగురు ఆ నిర్జనారణ్యంలో ఎవరో విరాళంగా ఇచ్చిన స్థలంలో తన చేత్తో కట్టుకున్న రేకుల షెడ్‌లో ఏకాకిగా గడిపిన రోజులు అవి. ఆ రోజుల్లో అతికొద్దిమందికి మాత్రమే ఆయన గురించి తెలుసు. ఆయన అదివరకు కలిసి నిర్వహించిన నారాయణగురు సంస్థలు అన్నిటితోనూ తన బంధాలను తెంచుకొని ప్రపంచానికి దూరంగా ఇక్కడ జీవిస్తూ ఉండేవారు. అప్పటికి నటరాజ గురువు కావడానికి తొలి దశలో ఉండేవారు. 1950ల ప్రారంభంలోనే జాన్ స్పియర్స్ ఇక్కడికి వచ్చేశారు. నిత్యచైతన్యయతి మదరాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి వచ్చేశారు.

“మీరు వచ్చినప్పుడు నిత్యచైతన్య ఉండేవారా?” అని అడిగాను.

“ఊఁ, అయితే నేను మొదటిసారి వచ్చినప్పుడు ఆయనను చూడలేదు. ఆయన వఱ్కలై అనే చోట ఉండేవారు. జాన్ స్పియర్స్ బెంగుళూరులో ఉండేవాడు. అక్కడినుండి వేల్యూస్ అనే మాస పత్రికను నడిపేవారు. ఇక్కడ నటరాజగురు, చిదంబర తీర్ధులు మాత్రమే ఉండేవారు. చిదంబర తీర్థులు అప్పటికి సన్యాసాశ్రమం పుచ్చుకోలేదు. బర్మా నుండి అప్పుడే వచ్చి ఇక్కడ ఏదో ఉద్యోగం చేస్తూ ఉండేవారు.”

గురుకులం చేరుకోగానే గ్యారీ డేవిస్ “నేను ఆ పైన కనపడుతోన్న పాకలో ఉంటాను. నువ్వు నన్ను కలుసుకోవాలి అనుకుంటే మొహమాట పడకుండా అక్కడికి రావచ్చు” అని చెప్పి నీటి తొట్టి పక్కనుండి పైకి వెళ్ళే కాలి బాట పట్టారు. నేను నేరుగా నిత్యచైతన్యగారి గదికి వెళ్ళి నమస్కరించి మాట్లాడుతూ ఉన్నాను.

“గురువుగారూ, నేను గ్యారీ డేవిస్‌ను చూశాను. ఇందాక మేం కలిసే వచ్చాం” అని చెప్పాను.

నిత్యచైతన్యయతి నవ్వుతూ ”వచ్చేశారా? మాట్లాడుకుంటూ వచ్చారా?” అని అడిగారు.

“అవును. ఇప్పటి వరకు ఆయన గురించి నాకు తెలియదు. వినలేదు కూడా.”

“అందుకు కావాల్సినంత ఆసక్తి నీకు లేదని అర్థం. నటరాజ గురువుగారి ఆత్మకథ (The Autobiography of an Absolutist) చదివావా?”

నేను అప్పటికి ఆ పుస్తకం మొదలుపెట్టి రెండో అధ్యాయంలో ఉన్నాను.

“అందులో గ్యారీ డేవిస్ గురించి విస్తారంగా రాశారు. నటరాజ గురువుగారి ‘ఒకే ప్రపంచం’ సిద్ధాంతాన్ని ఆయన, గ్యారీ కలిసి సృష్టించిందే. ఇద్దరూ కలిసి ఈస్ట్-వెస్ట్ యూనివర్సిటీ డ్రాఫ్టును తయారుచేశారు.”

“నేను ఇదివరకు ఆయన గురించి ఏమి తెలుసుకోనందుకు చింతిస్తున్నాను…” అన్నాను.

“దాందేముందిలే ఇప్పుడు తెలుసుకుంటావుగా. స్వయంగా కలుసుకునే అవకాశం కూడా దొరికింది కదా.”

నిత్యచైతన్యయతి అతిథులను చూడటం మొదలుపెట్టగానే నేను వంటగదికి వెళ్ళాను. డాక్టర్ తంపాన్‌సామి వంటలో ముమ్మరంగా మునిగిపోయి ఉండగా కరుణాకరన్ ముల్లంగులు తరుగుతున్నారు.

నేను వెళ్ళగానే “రండి, రండి. ఇదేనా రావడం?” అని మలయాళ యాసలో తంపాన్‌సామి ఆహ్వానం పలికారు. “మీ సాహిత్య సేవ ఎలా సాగుతోంది?” అని అడిగారు.

“దాని దారిలో అది నడుస్తూ ఉంది” అంటూ గ్లాస్ తీసుకుని అల్యూమినియం పాత్రలో ఉన్న వేడివేడి నల్ల తేనీరును వంపుకున్నాను. కరుణాకరన్ పక్కన బెంచి మీద కూర్చున్నాను.

“గ్యారీ డేవిస్‌ను కలిశారా?” అని అడిగారు డాక్టర్.

“మీకెలా తెలుసు?” నేను ఆశ్చర్యపోయాను.

“నాకు అంతా తెలుసు స్వామీ! మూడు కాలాలెఱిగిన జ్ఞానిని నేను.”

నేను పెరడు వైపున్న కిటికీని చూశాను. ఆ కిటికీలోనుండి మేము ఇందాక నడిచి వచ్చిన దారి కనబడుతోంది.

“మీరు మహాత్ములు!” మలయాళంలో బదులిచ్చాను.

“రచయిత సారూ, హెన్రిక్ ఇబ్సెన్ రాసిన ‘ఎనిమీ ఆఫ్ ద పీపుల్’ చదివారా?” మలయాళంలో అడిగారు తంపాన్‌సామి.

“చదివాను” అన్నాను. డాక్టర్ అందుకున్నారు.

“అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావుల వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకమయ్యింది. ఐరోపాలో 17వ శతాబ్దంలో వ్యక్తిగత చింతనకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. అయితే సామాజికస్థాయిలో కాకుండా వ్యక్తిగత చింతనల గురించి ప్రతిపాదనలు చేసేవారిని ఆనాటి మతము, ప్రభుత్వము, యావత్ సమాజమూ భ్రష్టులుగా భావించి బహిష్కరించేవి. అలాంటివారిని శీలహీనులుగాను, ఆందోళనకారులుగాను, ఉగ్రవాదులుగానూ ముద్రవేసేవి. ఇలాంటి వాళ్ళను 18వ శతాబ్దపు ఐరోపాలో చాలా ప్రమాదకరంగా పరిగణించేవాళ్ళు.”

డాక్టర్ కొనసాగించారు. “ఆ రోజుల్లో వేలాది మేధావులు, శాస్త్రవేత్తలు ఇలా సమాజం చేత బహిష్కరించబడి, వేటాడబడి చంపబడ్డారు. అయితే అలా వెలివేయబడ్డవాళ్ళే ఐరోపా నాగరికతను సృష్టించారు. నిజానికి వారందరి ప్రతినిధిగానే డాక్టర్ థామస్ స్టాక్‌మన్ అన్న మనిషిని రచయిత ఇబ్సెన్ సృష్టించారు. ఆ కాలంలో ఐరోపాలో ఎందరో స్టాక్‌మన్‌లు ఉండేవారు. ఆ నాటకం, వెలి వేయబడి పరాయివాళ్ళుగా చూడబడ్డ వాళ్ళ పట్ల సామాన్య ప్రజల అభిప్రాయాలను మార్చడంలో పెద్ద భాగస్వామ్యం వహించింది. తనని తాను సమాజం నుండి బహిష్కరించుకున్నవాడే సమాజానికి ఒక కొత్త బాటను చూపగలడు అన్నదాన్ని ఆ నాటకం నిరూపించింది. ఏ సమాజానికైనా అలాంటివారే తరగని ఆస్తులు…”

ఆకులు తీసి నూనె కాగుతోన్న మూకుడులో వేశారు. అవి సుయ్యిమంటుండగా గరిటతో కలుపుతూ కొంచెం మిరప్పొడి చల్లి నా వైపుకు తిరిగి “నేడు ఐరోపా ప్రపంచానికే విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే జ్ఞానభూమిగా ఉన్నది అంటే అది ఆ పరాయివాళ్ళుగా పరిగణించబడ్డవాళ్ళను గౌరవించడం ఎలానో నేర్చుకోవడమే కారణం. సమాజం పిచ్చివాళ్ళుగా పరిగణించినవాళ్ళు సృష్టించినదే ఈ మానవాళి ఆధునిక నాగరికత. రచయితగారూ, మీరు కార్ల్ సేగన్ రాసిన బ్రోకాస్ బ్రెయిన్ చదివారా?”

“లేదు” అన్నాను.

“భలే సమాధానం!” అన్నారు బయట నుండి అటువైపుగా వెళ్తున్న త్యాగేశ్వరన్ స్వామి. “ఒక పుస్తకాన్ని ఓడించడానికి మహా గొప్ప మార్గం ఈ ఒక్క మాటే. అది పుంఖానుపుంఖాలుగా ఏం చెప్తే ఏంటి! ఈ ఒక్క మాటను వినగానే ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు!”

నేను నవ్వాను.

డాక్టర్ స్వామి ఆయనను చూసి చిరునవ్వు నవ్వి “ఆ పుస్తకంలో ‘నైట్ వర్కర్స్ అండ్ మిస్టరీ మాంగర్స్’ అని ఒక అధ్యాయం ఉంది. విజ్ఞానశాస్త్రపు ఎల్లల గురించిన అద్భుతమైన వ్యాసం అది. మనం ఏమనుకుంటున్నామంటే సైన్స్ చాలా తర్కబద్ధమైనది, అందులో మూఢనమ్మకాలకి తావే లేదు అని. అదంతా పాఠ్య పుస్తక విజ్ఞానం. మనకు తెలిసింది అంతే. మన విద్యార్థులు అంతకంటే ఎక్కువ చదవరు కూడాను. అయితే సైన్సు నిత్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది కదా. లేత చిగురు దశనుండి దాన్ని పిచ్చివాళ్ళే అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు. రకరకాల పిచ్చి ఊహలను పరీక్షిస్తూనే ఉంటారు. అలాంటి కొన్ని ఊహలే సైన్సు సిద్ధాంతాలుగా నిరూపించబడతాయి. మిగిలినవన్నీ చెత్తబుట్టకు వెళతాయి. అలా రాత్రుళ్ళు మేలుకుని దయ్యాల్లా తిరిగే ఆ పిచ్చివాళ్ళే లేకుంటే విజ్ఞానశాస్త్రమే లేదు.”

మూకుడు దించి కింద పెట్టేసి ఒక కుండను పొయ్యి మీద పెట్టారు డాక్టర్ స్వామి. నేను పచ్చి ముల్లంగిని ఉప్పులో అద్దుకుని తిన్నాను. “పచ్చి ముల్లంగిని ఉప్పులో నంజుకోకూడదు. ఒట్టిగానే తినాలి. ఉప్పు తగిలితే దాని స్వభావం మారిపోతుంది. ఏదైతే స్వభావాన్ని మార్చేస్తుందో అది ఆహారానికి శత్రువు… కాకరకాయను చింతపండుతో కలిపి వండి తింటే చేదు ఉండదు. చేదు లేకుంటే కాకరకాయని ఎందుకు తినాలి? కీర దోసకాయ చాలు కదా? సాహిత్యం లేకుంటే జయమోహన్ ఎందుకు? బిఎస్ఎన్ఎల్ క్లర్క్ చాలుగా… కాదా?” అని కొనసాగిస్తూ “విజ్ఞానశాస్త్రానికే ఇలా అయితే తత్వశాస్త్రానికి, కళలకు ఇంకెలా ఉంటుంది? ఆచితూచి అడుగులు వేసేవారికి, లౌకిక స్పృహ ఉన్నవాళ్ళకి విజ్ఞానశాస్త్రం లోతులు చూడటానికి ప్రవేశపత్రం కూడా లేదు.”

“మనదేశంలో అలాటివారికి చోటు ఉంది కదా…”

“ఇండియా ఉచ్ఛస్థానంలో ఉన్నప్పుడు నిద్ర మేలుకొని తిరిగే రాత్రి పక్షులను, మర్మాలను అన్వేషిస్తూ తిరిగేవారిని కొనియాడింది, ఆదరించింది. వాళ్ళకు ఈ సమాజం ఆదరణ, రక్షణ కల్పించాలని నొక్కిచెప్పింది. ఎంతోకాలం ఇటువంటి భావజాలాన్ని గౌరవిస్తూ దాన్ని ఒక సామాజిక ధర్మంగా మార్చుకుంది. ఆ ధర్మాలు మతపరమైన ఆచారాలుగా మారినందువలనే అవి నేటికీ ఎక్కువగా ఆచరించబడుతూ కొనసాగుతున్నాయి. అందుకే నటరాజగురు ఆరేళ్ళు ఈ దేశంలో భిక్షమెత్తుకుని తిరిగారు. నిత్యచైతన్యయతి నాలుగేళ్ళు తిరిగారు. కనీసం నాలుగు లక్షలమంది అలా తిరుగుతూనే ఉన్నారు. వారిని ఈ సమాజం పోషిస్తూనే ఉంది.”

డాక్టర్ మసలుతున్న నీటిలో బంగాళాదుంపలను వేశారు. నా పక్కన వచ్చి కూర్చుని క్యారెట్ ముక్కలు తరగసాగారు. “అయితే ఎక్కడ హిందూ బౌద్ధ జైన సిక్కు వంటి మత విశ్వాసాలు గట్టిగా ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ ఆచారాలు కొనసాగుతూ ఉన్నాయి. మనలో చదువుకున్న వర్గం దీన్ని మూఢనమ్మకం అని అంటుంది. వాళ్ళు ఐరోపా నుండి అల్పమైన సాంకేతిక, యంత్ర విద్యలు మాత్రమే పొందుతున్నారు. ఐరోపా అంటే అంతే అని అనుకుంటున్నారు. ఐరోపా అంతరాత్మ గురించిన జ్ఞానమే వీళ్ళకు లేదు.”

నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. డాక్టర్ కొనసాగించారు. ”చెప్పాలంటే ఈ మనస్తత్వం ఐరోపాలో ఎప్పుడూ ఉండేది. క్రైస్తవ మతాన్ని ప్రపంచమంతా తీసుకెళ్ళిన ప్రచారకులు అలాంటివాళ్ళే. ఓడలనెక్కి కొత్త ప్రపంచాలను కనుగొనాలని బయలుదేరిన కొలంబస్, వాస్కోడగామాలు కూడా అలాంటివాళ్ళే. నేను చిన్నప్పుడు హెర్మాన్ గుండర్ట్ గురించి తలచుకున్నప్పుడల్లా చెప్పలేనంత ఆశ్చర్యానికి లోనయ్యేవాడిని. పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఓడనెక్కి ఏదో ఒక దేశానికి పలు సముద్రాలను దాటి వెళ్ళి అక్కడే జీవితకాలం స్థిరపడి ఆ భాషను నేర్చుకుని ఆ భాషకే వ్యాకరణ గ్రంథాన్ని రాసి, నిఘంటువుని తయారుచేసి ఆదర్శంగా ఉండటం అన్నది ఎంత మహత్తరమైన విషయం. మనలో ఎంతమంది అలాంటివి చెయ్యగలరు అని ఆలోచించి చూస్తే వారి పట్టుదల, తీవ్రతకు కారణమేంటో తెలుస్తుంది.

“ఒకప్పుడు ఇండియాలో అలాంటి ఉద్వేగం ఉండేది. కేవలం రావి ఆకుతో బోధిధర్ముడు జపాన్ దాకా వెళ్ళారు. అయితే ఆ ఆత్మవిశ్వాసం, బలం, ప్రపంచాన్నే అక్కున చేర్చుకోగల ప్రజ్ఞ మనలో లేకుండా పోయింది. మనం మనసుల్లో కుటిలత్వం నింపుకున్న సమాజంగా మారిపోయాం. ఆ మనస్తత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించింది స్వామి వివేకానంద మాత్రమే. తెగించే మనస్తత్వం ఉన్న యువకులు తనకు అవసరం అని వివేకానంద చెప్పింది కూడా అదే. మనం ఇంకా లౌకికమైన బురదలో కాళ్ళు చాపుకుని పూడుకుపోయి ఉన్నాము. మన యువతలో సాహస భావాలు, గొప్ప లక్ష్యాలు కలిగినవాళ్ళను చూడటమే అరుదుగా ఉంది…” డాక్టర్ చేతులు ఆయనతో సంబంధం లేనట్టు అలవోకగా క్యారెట్‌లను తరుగుతోంటే, ఆ ముక్కలు పొందికైన పేర్పుగా మారుతున్నాయి.

గ్యారీ డేవిస్ అలాంటి ఐరోపా మనస్తత్వం కలిగిన మనిషి. సాహసాలు చెయ్యడం, భిన్నంగా ఉండటం, మహత్తరమైన ఆశయాలతో ఉండటం, దృఢంగా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకపోవడం, ప్రపంచం గురించి మాట్లాడగల ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. అవే ఆయన్ను అలా తయారుచేసినవి. ఆయన మీద ఒక మంచి వ్యాసం ఉంది… ఇస్తాను.” డాక్టర్ మాట్లాడ్డం ముగించారు.

నేను లేచాను. ”స్నానం చేసి వస్తాను డాక్టర్ స్వామీ.”

“ఈ రెండు గిన్నెలు గ్యారీ సారుకు తీసుకెళ్ళి ఇవ్వు.”

“ఎందుకు?”

“ఆ పెద్ద గిన్నెలో పిచ్చితనం, చిన్న గిన్నెలో కలలు ముంచి ఇస్తారు… ఉఫ్‌మని ఊదుకుంటూ తాగొచ్చు.”

నేను నవ్వాను. “తీసుకెళ్ళి ఇవ్వండి స్వామీ” అన్నారు డాక్టర్.

నేను ఆ మిట్ట ఎక్కి ఆయన పాక చేరుకున్నాను. పాక బయట గ్యారీ డేవిస్ నీరెండలో పొట్టి నిక్కరు మాత్రం వేసుకుని పొడవైన క్యారెట్‌లా నిల్చుని ఉన్నారు. ఎండలో చలి కాచుకుంటున్నారు. పక్కనే ఆయన ఖాకీ బట్టలు. నేను తీసుకెళ్ళి ఇచ్చిన గిన్నెలను తీసుకుని ధన్యవాదాలు చెప్పారు. ఆ గిన్నెల్లో కొంచెంగా నీళ్ళు ముంచుకుని బట్టలను అందులోనే వేసి చిన్న బ్రష్‌తో రుద్ది విచిత్రమైన పద్ధతిలో ఉతకసాగారు. అతి తక్కువ నీటితో బట్టలను ఉతికే పద్ధతిని ఆయన ఐరోపా ప్రకృతి ప్రేమికుల దగ్గర నుంచి నేర్చుకున్నారట.


గ్యారీ డేవిస్ గురించి చదివాకే ఆ రోజు నేను మళ్ళీ ఆయన్ని వెళ్ళి కలిశాను. ఆయన న్యూయార్క్ బ్రాడ్‌వేలో నటుడిగా ఉండేవాడు అన్నది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన స్పష్టమైన ఉచ్చారణ, నిర్దిష్టమైన ముఖ కవళికల ద్వారా సంభాషించే లక్షణాలు అన్నీ అక్కడ పొందిన శిక్షణతో వచ్చినవేనని నాకు అనిపించింది. ఆయన ఎన్నెన్నో విభిన్నమైన శిక్షణలే పొంది ఉన్నారు. క్రిస్టియన్ ఫాదర్ కావడానికి చదివే చదువులు ముగించాక, ఇంజనీరింగ్ చదువు. ఆ తర్వాత నటుడు. ఆ తర్వాత పైలట్. అతి చిన్న వయసులోనే పైలట్ పరీక్ష నెగ్గి పేరు సంపాదించారు.

ఆయన జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక రకమైన అతిక్రమణ ఉంటూనే ఉండేది. ఎన్నోసార్లు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. రకరకాల చదువులు ప్రయత్నించారు. ఆయనలోని సహజమైన ప్రతిభలు బయపడిన కొద్దీ ఒకదాని వెనక ఒకటి అన్నట్టు ఆయనను మందుకు నెడుతూనే ఉండేవి. రెండో ప్రపంచ యుద్ధంలో పైలట్‌గా వెళ్ళి జర్మనీ ఆధిపత్యంలో ఉన్న రెండు నగరాల మీద బాంబులు వేశారు. ఆయన వెళ్ళిన బి-17 విమానం తోకలో అమర్చిన కెమరా తీసిన ఫోటోలు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు చూపించారు. ప్రమాదకరంగా అతి కొద్ది ఎత్తులో విమానం నడిపి సరైన చోట బాంబు వేసి, తిరిగి వచ్చిన అతని సాహసచర్యలను అభినందించడం కోసం పై అధికారి ఆయన్ని తన గదికి పిలిచి ఆ ఫోటోలను చూపించారు. బల్లమీద పరిచున్న ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను చూడగానే తన గుండెలమీద బరువైన ఒక ఇనప గుండు వేగంగా వచ్చి పడినట్టు అనిపించింది. స్పృహ కోల్పోయి కింద పడబోయి బల్లను పట్టుకుని తమాయించుకుని నిల్చున్నారు. కాలుతున్న ఇళ్ళు. చెల్లాచెదరై పరుగెడుతున్న మనుషులు. ఆకాశానికి ఎగబాకుతున్న అగ్ని జ్వాలలు. నరకాన్ని ఫోటోలు తీసినట్టు తోచింది.

ఆ రాత్రంతా తనలో తానే చెప్పలేని వేదనతో పోరాడారు గ్యారీ. తనలో నిద్రపోతున్న పాత ఫాదర్ తనను పిరికివాడిని చేస్తున్నాడా? మగవాడన్న మాటను తనలో నూరిపోసి పెంచిన పెంపకాన్ని, తనలో మెండుగా ఉన్న సున్నితత్వంతో పోరాడి నెగ్గుకు వచ్చారు. సాహసం చెయ్యకుంటే, గెలుపును అంది పుచ్చుకోకుంటే మగాడిగా ఉండటంలో అర్థమేంటి? నిజంగా ఇందులో సాహసం ఏముంది? దయ్యంలా ఓ పెద్ద యంత్రానికి ఇరుసుసీలగా ఉండటమా వీరత్వం? ఆ యంత్రానికి మనసు లేదు. అది చేసే వినాశనంతో దానికి సంబంధం లేదు. దానికి కారుణ్యం లేని మనసునిచ్చింది ఆయన. విజయానికి ఆయన బాధ్యుడు కారు, పాపానికి మాత్రమే బాధ్యుడు.

సిగరెట్లు కాలుస్తూ, మద్యం తాగుతూ, సైనిక శిబిరాల మధ్య చీకట్లో తిరుగాడుతూ రాత్రులు గడిపేవారు. తెల్లవారాక మామూలు స్థితికి చేరుకున్నాక అంతా న్యాయబద్ధంగానే జరుగుతున్నట్టు, అన్నీ సరిగ్గానే ఉన్నట్టు అనిపించేది. సన్నగా ఎక్కడో చిన్న చాంచల్యం మాత్రం చిట్టెలుకలా లోపల చప్పుడు చేస్తూ మెలిపెట్టేస్తూ ఉండేది. రాత్రి చీకట్లో ఏకాంతంగా పడుకోగానే అప్పటి వరకు ఉన్న పట్టుదల సడిలిపోయేది. తన లోపల తిరిగే ఆలోచనల హింస తాళలేక తన తలను తానే చేతులతో బాదుకునేవారు. మూర్ఖంగా, స్పృహపోయేలా తాగి రాత్రంతా అలా పడి ఉండేవారు.

నెల రోజులు తర్వాత మళ్ళీ బాంబులు వేసే పనికి పంపించారు. ‘లేదు. నావల్ల కాదు’ అని తనలో తనే ఆక్రోశంగా కేకలు పెట్టుకున్నారు. ‘లేదు. కాదు. ఇక సాటి మనుషులను చంపలేను’ అని తన పై అధికారులతో చెప్పడానికి వందలసార్లు రంగస్థల దృశ్యంలా తన మనసులోనే సాధన చేసుకున్నారు. ఒంటరిగా ఆ మాటలను లోలోపలే మననం చేసుకుంటూ భావోద్వేగాలతో జేవురించి ఉన్న ముఖంతో నడిచి వెళ్ళే అతనిని చూసి మిత్రులు కంగారుపడ్డారు. చివరిగా ఒక దశలో ఆయనకు అనిపించింది ‘ఇది పిరికితనం. ఈ పిరికితనం న్యాయబద్ధమైనదేనని నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను’ అని. ఆ వైరాగ్యంతోనే వెళ్ళి తనను తానే గాయపరచుకునే ఒక మనోస్థితిలో విమానమెక్కారు. విమానం పైకి వెళ్ళగానే కింద నుండి విమాన సమాచార వ్యవస్థ అకస్మాత్తుగా పనిచెయ్యడం ఆగిపోయింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇలాగే ఎగురుకుంటూ ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోవాలి. మరొక దేశంలో వాలిపోవాలి. ‘కాదు, గాలిలో అలా కలిసిపోయి, అంతమవ్వాలి!’ వేగం పెంచిన కొద్దీ గాలిలో కలిసిపోవాలి అన్న భావం ఎక్కువయింది. అతి వేగంతో విమానంతో ఆయన ఆకాశంలో పల్టీలు కొట్టారు.

జర్మనీ దేశం మీద తన విమానం ఎగురుతూ ఉన్నప్పుడు కింద నుంచి అతనికేసి గుళ్ళు పేలాయి. తనకు రెండు వైపులా పసుపు జేగురు ఎరుపు రంగులతో పువ్వులలాగా వికసించి కాలి ఆరిపోతున్న షెల్స్‌ని చూస్తూ అక్కడ ఎగురుతున్నప్పుడు, చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించారు. ఆ గుళ్ళల్లో ఒక్కటైనా తన విమానానికి తగలాలి అని ఆశించారు. అయితే అది తనను ఎన్నుకోవాలి. అది నెగ్గి తనను నేల మీదకు కూల్చాలి. ఎంతో ప్రమాదకరంగా ఎగిరారు. అయితే ఆశ్చర్యకరంగా, ఏమీ జరగలేదు. తనను ఒక బాంబయినా వచ్చి తాకలేదు.

అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ, కింద ఉన్న నగరాన్ని, పాము కుబుసం లాంటి వాగు వంకలను, ఆడవారి చేతిసంచి అద్దాల లాంటి కొలనులను, పెరిగిన చెట్ల ఆకుపచ్చ అలలను, గుట్టల సమూహాలనూ చూశారు. చేతికి అనుకూలమైన చోటే ఉంటుంది బాంబులు వేసే లీవర్. అయితే ఆయన ఎంత ప్రయత్నించినా తన చేతిని అక్కడికి తీసుకుని వెళ్ళలేకపోయారు. నాలుగైదుసార్లు ఎంతో బలంగా మనసుపెట్టి చేతిని ఆ లీవర్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. చేయి గడ్డకట్టుకుపోయి, బిగుసుకుని, ఇనుప వస్తువులా కదలకుండా ఉండిపోయింది. ఆపైన ఆ ప్రయత్నం విరమించి కిందకు చూస్తూ ఆ అందాలను ఆస్వాదించసాగారు. ఒక దశలో మనసంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. అది ఒక పసిపిల్లాడి ఆటలా మారింది. కావాలనే వాళ్ళను ఉసిగొల్పే రీతిలో ఎగిరారు. వాళ్ళ కాల్పుల మధ్యకు దూసుకు వెళ్ళినప్పుడు ‘హే’ అని గట్టిగా కేక పెట్టారు. కిందకు దిగి వాళ్ళ ముందు చెయ్యెత్తి విజయసంకేతం చూపించాలి అనుకున్నారు.

చివరికి విమానంలోని ఇంధనం అయిపోతున్నప్పుడు ఒక బాంబయినా వేయకుండానే తిరిగి శిబిరానికి వచ్చారు. అప్పటికే ఆయన గురించి వార్తలు చేరుకుని ఉన్నాయి. ఆయనని వెంటనే తీసుకు వెళ్ళి విచారించారు. గ్యారీ అదే ఉన్మత్త మనోస్థితిలో ఉన్నారు. ఒళ్ళంతా ఒక్కొక్క వెంట్రుకలోనూ అదే ఉత్సాహం నిండిపోయి ఉంది. ‘నాకు ఇప్పుడే తెలిసింది. ఇది ఒక అద్భుతమైన క్రీడ. ఇప్పటికైనా ఆలస్యం అయ్యింది ఏమీ లేదు. వాషింగ్టన్‌కు వెంటనే సమాచారం పంపించండి. మనం యుద్ధాన్ని అలా ఆటలాగా మార్చుకుందాం. అందులో మరణం ఉన్నప్పటికీ బాధ ఉండదు. జీవితం అనే ఆటలో మనం మరింత అద్భుతమైన ఒక ఆటను సృష్టించి దేవుడిని ఓడిద్దాం. రండి’ అని అందరినీ ఆహ్వానించారు. విచారణ అధికారిని వాటేసుకుని ముద్దు పెట్టుకున్నారు. మధ్యలో కాఫీ తీసుకువచ్చిన సహాయకుణ్ణి పట్టుకుని ఉత్సాహంగా నాట్యం చేశారు.

ఫలితంగా అక్కడినుండి నేరుగా పిచ్చాసుపత్రికి, ఆ తరవాత జెయిలుకు వెళ్ళారు. ఆయనను విపరీతమైన పనికి, హింసకూ గురిచేశారు. అంతలో యుద్ధం ముగిసింది. మిలిటరీ నుండి విడుదల కాగానే గ్యారీలో శూన్యత ఏర్పడింది. మిలిటరీలోను, జెయిలులోను జీవితపు పైస్థాయి సవాళ్ళను ఎదుర్కొనే జీవితాన్ని జీవించినాక, ఇలా అర్థం లేని రోజువారి చర్యలతో నేల మీదకు వచ్చి నిల్చున్నట్టు అనిపించింది. ఆ లోటును నింపుకోవడానికి ప్రయాణాలు మొదలుపెట్టారు. భుజానికి ఒక చిన్న సంచి తగిలించుకొని అనుకున్నప్పుడు అనుకున్న చోటికి వెళ్ళిపోయేవారు. పర్యాటక స్థలాలు ఆయన్ని ఆకర్షించలేదు. పర్వతాలంటే చెప్పలేనంత మోహం ఉండేది. అయితే కొన్ని నెలలకే వాటి ఆరోహణం కూడా వెగటు పుట్టించింది. ఆర్థికంగా లోస్థాయిలో ఉన్న నిరాడంబరమైన జన సమూహంతో, నగరాల్లోని మురికివాడల్లో జీవించడం మాత్రమే ఆసక్తికరంగా ఉన్నట్టు అనిపించింది.

ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చి జర్మనీకి వెళ్ళారు. ఆర్థికంగా జర్మనీ వెనుకబాటుతనం, ప్రజలు మోస్తున్న అవమాన భారాన్ని దగ్గరగా చూశారు. అంత ఘోరమైన ఓటమి, ప్రళయ వినాశనం తరవాత, తప్పు చేశామన్న భావనతో కుంగిపోయిన ఆ దేశాన్ని గుర్తించారు. తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నపుడు కూడా, పశ్చాత్తాపంతో చింతించే ప్రజల మనస్సాక్షి ఎంత గొప్పదో అన్న ఆలోచన వచ్చింది ఆయనకు. అంతకన్నా ఎక్కువ వినాశనాన్నే, అమెరికా జపాన్‌కు కలిగించింది. ఐతే, అమెరికన్లకు ఆ సంఘటనల పట్ల పశ్చాత్తాపం మచ్చుకైనా లేదు. ప్రజలు ప్రభుత్వాలు చెప్పినవి నమ్మేటట్టు చేయడమే జరుగుతూ వస్తుంది. అలాగే, ఈ చావుదెబ్బలు ప్రపంచ శాంతికోసం అత్యంత అవసరమైన చర్యలుగా అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఆయా ప్రభుత్వాలు, జాతివాదులు, ప్రజల్ని గొర్రెల మందల్లాగా, తమను నమ్మి, తమ దుశ్చర్యలను సమర్థించేటట్టు చేసుకోగలిగారు. ఒకవేళ యుద్ధంలో జర్మన్‌లే గెలిచుంటే, వారు కూడా తాము చేసిన జాతి హననాలు లోకకళ్యాణం కోసమే అని తమ దేశాన్ని నమ్మించగలిగి ఉండేవాళ్ళు.‌

గ్యారీ యుద్ధ సమయంలో తాను బాంబులు కురిపించిన ప్రాంతాల్ని సందర్శించారు. పచ్చదనం వేళ్ళూనుకుని, శిథిలాలని, లోహాలనీ కప్పివేసింది. ఆ ప్రాంతాన్ని సరికొత్త జీవచైతన్యం నింపివేసింది. అక్కడి ప్రజలు వినాశనపు జ్ఞాపకాలని గతంలోకి నెట్టివేసి, తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. తెలుపెక్కిన బుగ్గలతో యూనిఫామ్ తొడుకున్న పిల్లలు ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ బడులకు వెళ్తున్నారు. రోడ్ల పక్కన ఆడవాళ్ళు కూర్చొని తాజా పండ్లను, కూరగాయలను అమ్ముతున్నారు. ఎటు చూసినా జీవేచ్ఛ, మనుగడ కొనసాగింపుకు సంబంధించిన కృషి తాలూకు ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కడి వినాశనానికి కారణమైన హత్యాయంత్రం ఈరోజు వారి మధ్యే నిలబడి ఉన్నదని వారు పట్టించుకోలేదు. ప్రాణంతో ఉన్న శరీరం నుండి, పుండు పగిలి చీముతో బయటకు నెట్టబడిన ముల్లులా ఆయన ఆ జీవచైతన్యం మధ్య పరాయివాడిలా నిలబడిపోయారు.

‘నేను మీ అందరిని చంపడానికి వచ్చినవాడిని తెలుసా?’ తనలో తాను వెక్కిళ్ళు పెట్టారు. ‘మీరు నా మీద రాళ్ళు రువ్వచ్చు. నన్ను శిలువ ఎక్కించవచ్చు. ఎందుకంటే ఎలాంటి శత్రుత్వమూ లేకుండా, మీరు ఎవరన్నది కూడా తెలియకుండా, మిమ్ముల్ని సామూహికంగా చంపడానికి వచ్చాను నేను’ అని పశ్చాత్తాపపడ్డారు. బంగారు రంగుపూలను పూసిన చెట్లను గొడుగుల్లా పట్టుకున్న ఆ రోడ్డు పక్కనున్న ఒక పార్క్ సిమెంట్ బెంచిమీద కూర్చుని తన పక్కనున్న వ్యక్తితో గ్యారీ “సోదరా, నేను ఈ ప్రదేశాన్ని, ఇక్కడి మనుషులను నాశనం చెయ్యడానికి ప్రయత్నించాను” అని అన్నారు. ఆ వ్యక్తి ఈయన మాటలను సరిగ్గా విన్నారో లేదో తెలియలేదు గానీ, చిరునవ్వు చిందిస్తూ ప్రశాంతంగా, “వందనం. యేసుప్రభువు రక్ష మీకు ఎప్పుడూ తోడై ఉండుగాక” అని అన్నారు.

ఆ నగరంలో ఉన్న అందరినీ ఆపి ‘నేను మిమ్మల్ని చంపడానికి వచ్చిన హంతకుడిని’ అని గట్టిగా అరవాలని అనిపించింది. అయితే ఏ ఒక్కరైనా దాన్ని లెక్కచేస్తారని ఆయనకు అనిపించలేదు. అవును, రెండేళ్ళ క్రితం ప్రపంచంలో సగంమంది మిగిలిన సగంమందిని చంపేయాలన్న కాంక్షతో బయలుదేరారు. ప్రపంచంలో చెప్పుకోదగినంత భాగాన్ని నాశనం చేసేశారు. అందులో పాల్గొన్న వాళ్ళెవ్వరూ హంతకులు కారు. ఎవరికీ ఎవరిమీదా కోపం లేదు. ఎలాంటి శత్రుత్వమూ లేదు. అలా చంపడం వారి బాధ్యత అని మాత్రమే చెప్పబడింది. వాళ్ళు దాన్ని నమ్మారు అంతే. ఇప్పుడు అలా చెప్పినవారు చేతులు కలుపుకున్నారు. ఇక పైన వాళ్ళు చంపనక్కర్లేదు. చంపినవాళ్ళు, చంపబడినవాళ్ళు ఏమీ ఎరుగని అమాయకులే. వాళ్ళ మధ్య ఏవిటి వైరుధ్యం? ఎక్కడుంది కక్ష?

ఆ రాత్రి చలిలో ఆ పార్కులో ఏకాంతంగా కూర్చుని ఏడ్చారు గ్యారీ డేవిస్. అక్కడ ఆయనకు తెలిసింది, ఎందుకు యేసుప్రభువు అలా కుమిలిపోయారో. ‘నా తండ్రీ! నన్నెందుకు ఆదుకోలేదు. నన్నెందుకు చిన్నచూపు చూశావు?’ అని కేక పెట్టిన ఆ యేసుప్రభువు కూడా మానవుడి ప్రతినిధే. దేవుడు ఆదుకోకుండా వదిలేసిన కోటానుకోట్ల మనుషులలో ఒకరు. ‘తండ్రీ వీళ్ళను క్షమించు’ అని ఆ దేవునికి మొరపెట్టుకున్నవాడు దేవుడియొక్క అంశ. ఈ రెండు వాక్యాలతో నిండినదే సమస్త జ్ఞానుల అంతరంగమూ? ఈ రెండు వాక్యాల మధ్యన ఊగిసలాడేదేనా వాళ్ళ మనుగడ?

ఆ వసంత ఋతువులో గ్యారీ ప్యారిస్‌కు వెళ్ళారు. అక్కడ జరుగుతున్న ఒక ప్రపంచ సమ్మేళనంలో తన అమెరికన్ పౌరసత్వాన్ని త్యజించేస్తున్నట్టు ప్రకటించి బహిరంగ స్థలంలో తన పాస్‌పోర్టును తగలబెట్టారు. ‘నా పైచర్మాన్ని ఒలిచి తీసి పడేసి వట్టి మాంసంతో వీధిలో నిలుచున్నాను. అక్కడ నేను కొత్తగా జన్మించాను’ అని ప్రకటించారు. అందుకుగాను ఆయన అరెస్టు చేయబడ్డారు. ఆయన ఇంటర్‌వ్యూ, ఆయన గురించిన వ్యాసాలు పారిస్ అంతా ఆయన గురించే మాట్లాడుకునేలా చేశాయి. ఆంద్రే గిడే, ఆల్బేర్ కామూ వంటి వారితో సహా పారిస్‌ లోని మేధావులందరూ ఆయనను అభినందించారు, కొందరు ఆయన వాదానికి ప్రతికూలంగా స్పందించారు. ఫ్రాన్స్ ఆయనను దేశం నుంచి బహిష్కరించింది.

ప్యారిస్ నుండి జెనీవా వెళ్ళిన గ్యారీ డేవిస్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రేక్షకుడిగా వెళ్ళి కూర్చుని తగిన సమయంలో లేచి ప్రచార కరపత్రాలను అక్కడ చల్లుతూ నినాదాలు చేశారు. “ప్రపంచాన్ని భాగాలు చేసి పంచుకోవడం ఆపండి. దేశం అన్నది దోపిడీదారులు గిరిగీసి ఏర్పరిచిన ఎల్లలు మాత్రమే. మనుషుల్ని కలిసిమెలిసి జీవించేటందుకు అనుమతించండి. ఒకే ప్రపంచం ఒకే మానవజాతి!” అప్పుడు ఆయన్ను రక్షకభటులు అక్కడి నుండి నెట్టివేశారు. అయితే సభలోని సభ్యులలో చాలామంది అది విని కరతాళధ్వనులతో ఆదరించారు.

ఆ తర్వాత గ్యారీ జీవితం ఒక సుదీర్ఘ పోరాటం. మరుసటి సంవత్సరమే ప్రపంచ పౌరుల కోసం అని ప్రపంచ రిజిస్ట్రీ ప్రారంభించి తనదైన పాస్‌పోర్టును తానే సృష్టించుకున్నారు. ఆ పాస్‌పోర్టుకు గుర్తింపును తెచ్చుకోడానికి ప్రపంచ దేశాలన్నిటికీ ప్రయాణం చేశారు. ప్రపంచంలోని 150 దేశాలలో 200 సార్లు జెయిలుకు వెళ్ళారు. 1954లో ఆ పాస్‌పోర్టుతో ఇండియా వచ్చారు. ఇండియన్ పోలీస్ అరెస్టు చేసి, జెయిల్లో పెట్టిన ఆయనను రక్షించడానికి ఆయన స్నేహితుడైన నటరాజగురు ప్రభుత్వానికి, ప్రముఖులకీ లేఖలు రాశారు. ఆర్కే లక్ష్మణ్, ముల్క్ రాజ్ ఆనంద్ కూడా వారికి మద్దతుగా ఏకమయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ ఆయనను అంగీకరించి విడుదల చేశారు.

నటరాజగురు, గ్యారీ డేవిస్ ఊటీలోని రేకుల పాకలో కిరోసిన్ దీపం పెట్టుకుని రాత్రింబవళ్ళు కూర్చుని ఒకే ప్రపంచం అన్న కలను ఆచరణలో పెట్టేందుకు గానూ ప్రణాళికలు తయారుచేశారు. ఇద్దరి అంతరంగమూ ఉరికే ఆలోచనలతో ఉప్పొంగుతూ ఉన్న రోజులవి. ప్రపంచ దేశాలు తమ ఆర్థిక క్షేమాలను వదులుకోకుండా దశలవారీగా ఒకే ప్రపంచంగా కలిసిపోవడానికి ఒక పెద్ద ప్రణాళికను నటరాజగురు తయారు చేశారు. విద్య, సాంస్కృతిక, మతపరమైన రంగాలలో ఎవరి ప్రత్యేకతను వారు అభివృద్ధి దిశలో నడిచేటట్టు కాపాడుకుంటూనే ప్రపంచాన్నంతా ఏకమానవాళి ప్రదేశంగా మార్చే నమూనాను గ్యారీ డేవిస్ తయారు చేశారు.

ఆ ప్రణాళికను మూడు సంవత్సరాల తర్వాత ప్యారిస్ లోని సోర్బోన్ విశ్వవిద్యాలయంవారు ప్రచురించారు. ఆ నమూనా ప్రణాళికతో గ్యారీ ప్రపంచమంతా తిరిగి ఎన్నో లక్షలమందిని తన వ్యవస్థలో సభ్యులుగా చేర్చారు. ‘ఎప్పుడో ఒక రోజు మనం ఒక ప్రపంచంగా మారుతాము, దాన్ని నేడే ప్రారంభించుదాం’ అన్న ఆయన పిలుపుకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభించింది. ప్రపంచ యుద్ధపు గాయాలు ఆరని రోజులవి. యుద్ధం నిండిన వాతావరణంలో మొలకెత్తిన ఒక తరం హిప్పీ యుగం దశగా సాగుతూ ఉన్న తరుణమది. చార్లీ చాప్లిన్, బాబ్ మార్లే కూడా ప్రపంచంతో మంతనాలు జరిపిన రోజులవి.

గ్యారీకి భారతీయ వేదాంతం మీద, గాంధీ మీద విశ్వాసం ఉండేది. అహింసాత్మక పోరాటాల ద్వారా జనుల మనసులను ప్రభావితం చేసి ఒక మహాశక్తిగా మార్చవచ్చు అన్నదానికి నిలువెత్తు సజీవ నిదర్శనం గాంధీ అని గ్యారీ నమ్మారు. భారతీయ వేదాంతం మీద ఎంతో ఆసక్తి ఉండేది. ‘వసుధైక కుటుంబం’ అన్న వాక్యాన్ని మంత్రం లాగా తన మదిలో నిలుపుకున్నారు. ఆయన వేదాంతం ఆ వాక్యం నుండి మొదలైంది. నటరాజగురు బెంగళూరు సోమనహళ్ళిలో జాన్ స్పియర్స్ సహకారంతో ప్రాక్పశ్చిమ సిద్ధాంతాలను సంగమింపచేసే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈస్ట్-వెస్ట్ యూనివర్సిటీలో చేరి వేదాంతంలో మాస్టర్స్ పట్టా అందుకున్నారు.

గ్యారీ నటరాజగురు ఉన్నప్పుడు రెండేళ్ళకొకసారైనా ఇండియాకు వస్తూ ఉండేవారు. తర్వాత ఆయనకు ప్రపంచ యాత్రలు, జెయిలు వాసం ఎక్కువయి ఆయన ఇండియాకు రావడం తగ్గిపోయింది. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ గురుకులానికి వచ్చి ఉన్నారు.


నేను గ్యారీ డేవిస్‌ను కలుసుకోడానికి మధ్యాహ్నం ఆయన కాటేజికి వెళ్ళాను. తలుపు తెరిచి ఉంది, ఆయన పక్కనే ఎక్కడో ఉంటారని అనుకున్నాను. కరుణాకరన్ “సారు బయటకెళ్ళారు” అని అన్నాడు. “తలుపు తెరిచే ఉందే” అని అడిగాను. “సారు తాళమెయ్యరు” అని నవ్వాడు. నేను రోడ్డు మీదికి వచ్చినప్పుడు గ్యారీ డేవిస్ పొద్దున ఆయన ఉతికి ఆరబెట్టిన ఖాకీ దుస్తుల్లో జీప్‌లో కూర్చుని ఉన్నారు. తెల్ల బట్టలు వేసుకుని పొడవైన గడ్డంతో ఉన్న ఒక బ్రహ్మచారి కూడా కూర్చుని ఉన్నాడు.

నేను దగ్గరకు వెళ్ళి ” హలో! ఎక్కడికి వెళ్తున్నారు?” అని పలకరించాను.

“పడమటి కొండకు. అంబాదేవి ఆశ్రమానికి వెళ్ళి అక్కడి నుండి పడమటి లోయను చూడబోతున్నాను.”

“ఓ! అలానా.”

“నువ్వూ వస్తావా?”

“వస్తాను.”

“ఎక్కు మరి.”

నేను జీప్ ఎక్కాను. చెప్పిరావా అని అడుగుతారేమోనని అనుకున్నాను. చెప్పివెళ్ళడం లాంటివి పాటించే మనిషి కాదేమో అనిపించింది.

బురదతో నిండిన రోడ్డు మీద జీపు మమ్మల్ని కుదుపుతూ తీసుకువెళ్ళింది. దారి పక్కన ఉన్న చిన్న చిన్న రేకుల ఇళ్ళను, పెద్దపెద్ద ఆవులు నెమరువేస్తూ దారికి అడ్డంగా పడుకుని ఉన్న సందులను, నీళ్ళు చిమ్మతున్న సాధనాలను అమర్చివున్న బంగాళాదుంపల తోటలనూ వేడుకగా చూస్తూ వచ్చారు. ఒక కుక్క మొరుగుతూ జీప్‌ని వెంబడించినప్పుడు నాకేసి చూస్తూ నవ్వారు. నేను ఆయనతో మాట్లాడాలనుకున్నాను. అయితే జీప్‌లో మాట్లాడలేము అనిపించింది. అంబాదేవి ఆశ్రమానికి వెళ్ళి దిగగానే జటాజూటాలతో కాషాయ దుస్తులు ధరించిన వృద్ధ స్త్రీ, అంబాదేవిగారే స్వయంగా వచ్చి గ్యారీ డేవిస్‌కు స్వాగతం పలికారు. “హరి ఓమ్” అని చెప్పి దేవి నమస్కరించగానే “Om! The absolute is adorable!” అని నమస్కరించారు.

కొన్ని పలకరింపులు అయ్యాక మాకు దారి చూపడానికి రాబోతున్న యువసన్యాసి రాకకోసం ఎదురుచూస్తూ ఆశ్రమం అరుగు మీద కూర్చున్నాము. ముంగిట విరబూసిన పువ్వుల బరువుకు తాళలేక కొమ్మలు వంగిన రకరకాల చెట్లు, తీగెలు చంటిపిల్లలను చంకన ఎత్తుకుని ఉన్న పిల్ల అక్కల్లా ఉన్నాయి.

“నేను మీ గురించే చదువుతున్నాను.”

“ఆసక్తికరంగా ఉందా?” మెరిసే కళ్ళతో అడిగారు.

నేను నవ్వాను. ”అయితే మీ పోరాటం నాకు రకరకాల ప్రశ్నలను కలిగిస్తోంది.”

“చెప్పు” అన్నారు.

“మీరు మీ సిద్ధాంతాలను జనాలకు చెప్పడానికి ఎన్నో దేశాలకి వెళ్తున్నారు. అక్కడ వారి చట్టాలకు వ్యతిరేకంగా ఉండటంతో జెయిలుకు వెళ్ళి ఉంటున్నారు… ఇలా జెయిలుకు వెళ్ళడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు?”

గ్యారీ డేవిస్ చిరునవ్వుతో “శాసనోల్లంఘనం గురించి గాంధీ పుట్టిన దేశానికే చెప్పాలా ఏంటి! ఏ చట్టమైతే మానవుడి ప్రాథమిక మనుగడకి, ఆధ్యాత్మికతకి అడ్డుగా ఉందో దాన్ని అతిక్రమించడానికి మనిషికి హక్కు ఉంది. దాన్ని అతిక్రమించి తీరాల్చిన బాధ్యత కూడా ఉంది.”

“అయితే మీరు ఇతర దేశాలకు కదా వెళ్తున్నారు…”

“నాకంటూ ఒక దేశమే లేదే!”

నా ప్రశ్నను ఎలా సంధించాలో తెలియలేదు. “మీరు దీన్ని పోరాటంలా చేస్తున్నారు. ఆ పోరాటాన్ని ఒంటరిగా నెత్తికెక్కించుకుని చేసేటప్పుడు అది పిచ్చివాడి ఆటలా అయిపోతుంది కదా?”

“నేను సిద్ధాంతాలను విడమరిచి ప్రపంచానికి చెప్తున్నాను. ఒకే ప్రపంచం అన్న నా కలను వెళ్ళిన ప్రతిచోటా వెదజల్లుతున్నాను.”

“దానికి జెయిలుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది?”

“ఈ ప్రపంచం సిద్ధాంతాలతో ఏర్పడినది. 20వ శతాబ్దంలో మాధ్యమాలు పెరిగిన కొద్దీ సిద్ధాంతాలు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. కోట్లాది సిద్ధాంతాలు. అన్ని సిద్ధాంతాల వెనకా తగిన తర్కం ఉంటుంది. కొంత అవసరం కూడా ఉండొచ్చు. అయితే ఈ రోజుల్లో ఎవరూ సిద్ధాంతాలని పరిశీలనాత్మకంగా చూడటం లేదు. ఇన్ని కోట్లాది సిద్ధాంతాలలో ఏ సిద్ధాంతం, ఏ భావజాలం గమనార్హమవుతుంది? ఏది అంగీకరించబడుతుంది? వేలాది వాక్యాలు ఉన్న ఒక పుస్తకంలో ఏ వాక్యం పేజీలు తిరగేస్తున్న పాఠకుడి దృష్టిలో పడుతుంది?” ఆయన నా భుజాల మీద చేతులు వేసి సూటిగా చూస్తూ “ఏ వాక్యం కిందైతే గీత గీయబడుతుందో అది!” అన్నారు.

“మై డియర్ యంగ్ ఫ్రెండ్, ఒక వాక్యాన్ని ఎలా అండర్‌లైన్ చేయడం? రెండే మార్గాలు. ఒకటి, అధికారంతో. ఇవాళ మన మధ్య ఆచరణలో ఉన్న చాలా సిద్ధాంతాలు అధికారం ద్వారా వ్యాప్తి చేయబడి మన బుర్రలోకి ఎక్కించబడినవే. అయితే రేపటి మనుగడకి కావలసిన ఏ సిద్ధాంతానికీ అలాంటి అధికార బలం ఉండదు. దాన్ని ఎలా అండర్‌లైన్ చేయడం?” మళ్ళీ ఆయన నా భుజం తట్టారు. “త్యాగం ద్వారా… అదొక్కటే మార్గం. నా సిద్ధాంతం కోసం నేను జెయిలుకు వెళ్తున్నాను అంటే దాన్ని నేను తిరస్కరించలేనిదిగానే పరిగణిస్తున్నాను. ఒక సిద్ధాంతం కోసం ఒక మనిషి తన ఆస్తిపాస్తులను, తన మనుగడనే కాదు, ప్రాణాన్ని సైతం త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆ సిద్ధాంతానికి చెప్పలేనంత బలం చేకూరుతుంది. అదే గాంధీ మార్గం.”

నేను నిట్టూర్చాను. ఆయన కొనసాగించారు.

”నేను ఒక దేశానికి వెళ్ళేటప్పుడు ఆ దేశం గురించి తెలుసుకునే వెళ్తాను. అప్పటికే ఆ దేశంలో ఇలాంటి ఒక సైద్ధాంతిక పోకడ ఉంది అన్నదాన్ని రుజువు చేసుకునే వెళ్తాను. అక్కడికి వెళ్ళి వాళ్ళ చట్టానికి సవాలు విసురుతాను. న్యాయస్థానంలో నా వాదనని నేనే వినిపిస్తాను. పత్రికలకు, తత్వవేత్తలకు, మేధావులకు, జ్ఞానులకు లేఖలు రాస్తాను. నేను చెరసాలలో ఉంటూ రోజంతా నా సిద్ధాంతాలను చెప్తూనే ఉంటాను. నా భావాలను ఆ సైద్ధాంతిక వాతావరణంలో వ్యక్తపరచడానికి నాకు ఉన్న అతి ఉన్నతమైన మార్గం అదొక్కటే.”

ఆ యువ సన్యాసి రాగానే మేం బయలుదేరాం. ఎమరాల్డ్ ఎస్టేట్‌ను ఆనుకుని సాగిన అడవి దారి ఒక దశలో నిటారుగా పైకి వెళ్ళసాగింది. బ్రహ్మాండమైన పచ్చికరాసులను కప్పుకొని నిశ్శబ్దంలో నిద్రపోతున్నట్టు పర్వతశ్రేణులు పడివున్నాయి. దూరంగా ఆకాశాన్ని తాకుతున్న కొండ చరియలలో చిన్న చిన్న చుక్కల్లా కదులుతున్నాయి నీలగిరి కొండగొర్రెలు. పడమటి ఆకాశం ఇంకా ఎర్రబడలేదు. అయితే వెలుతురు తగ్గింది. వణికించే చలి మొదలైంది. నేను మందమైన స్వెటర్ వేసుకుని ఉన్నాను. ఊటీలో నేను దాన్ని ఎప్పుడూ వేసుకునే ఉంటాను. గ్యారీ ఖాకీ చొక్కా మాత్రమే వేసుకుని ఉన్నారు.

ఆయనే మాటలు అందుకున్నారు. “ఇక్కడికి రాకముందు నాలుగున్నర సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో జెయిల్లో ఉన్నాను.”

నేను ఒక నిమిషం ఆగిపోయాను. ”నాలుగున్నర సంవత్సరాలా?”

“అవును ఏడేళ్ళు శిక్ష. అయితే విడుదల చేసేశారు.”

నేను ఆయనను చూశాను. ఆయన మాట్లాడుతూనే కొండెక్కుతున్నారు.

“ఇప్పటివరకు ఒంటరిచెరలో ఉండింది లేదు. ఈసారి ఏకాంతవాస శిక్ష. ఈ నాలుగున్నర ఏళ్ళలో మొత్తంగా వంద వాక్యాలు కూడా మాట్లాడలేదు. రాయడానికి అనుమతి లేదు. చదవటానికీ లేదు. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. పత్రికలు కూడా లేవు. కేవలం ఏకాంతవాసం మాత్రమే…

“ఏకాంతం ఒక మంచి అభ్యాసం. ఏకాంతంలో మన చుట్టూ ఉన్న గాలిలో మన ఆంతర్యాన్ని పరికిస్తాము. మన మనసులో ఒకే విషయం వందలాది, వేలాది ప్రతిబింబాలుగా కనపడుతుంది. తనను తాను భరించలేనివారికి ఏకాంతం దుర్భరమైన నరకమే. నిజానికి చాలామందికి నరకం అంటే అది ఏకాంతమే. సార్త్ర్ చెప్పింది తప్పు. నరకం అంటే చుట్టూ ఉన్నవాళ్ళే అన్నారు ఆయన. ఆయనకు ఏకాంతవాస శిక్ష విధించి ఉంటే ఆ అభిప్రాయాన్ని మార్చుకుని ఉండేవారు. ఆయన ‘నో ఎగ్జిట్’ నాటకంలో ఒంటరిచెర లేదు. సాంఘిక చెరశాల మాత్రమే ఉంది.”

“ఏం చేసేవారు?”

“ఆలోచనల్లో మునిగిపోయేవాణ్ణి. నేర్చుకున్న వేదాంతం అంతా దానికి ఉపయోగపడింది. ఒంటరిచెరలో ఉన్న చిక్కు ఏంటి అంటే అక్కడ మనకు బాహ్య ప్రపంచం లేదు. నేను ఉన్నది ఎనిమిది అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు వున్న గదిలో. తెల్లటి గోడలు. ఇద్దరి మనుషుల ఎత్తులో రెండు కిటికీలు. తలుపు వేసేశారంటే నాలుగు పక్కలా గోడలే. నేను మాత్రమే అందులో ఉంటాను. నా శరీరాన్ని నేను చూసుకోలేను కాబట్టి నేను భౌతికంగా అక్కడ ఉన్నానన్నది స్ఫురించదు. నా ఆలోచన మాత్రమే ఉన్నట్టు అనిపిస్తుంది…

“అదే సమస్య. కేవలం జాగరూకావస్థ ఉండటం. ఆ ఎఱుకకు ఆకారం లేదు. ఎఱుక ఎప్పుడూ బాహ్య ప్రపంచంలోని వస్తువులలో తనను ప్రతిబింబించుకొని చూసుకుంటూ ఉంటుంది. నాలుగు గోడల మధ్య బంధింపబడ్డ ఎఱుక తన ఉనికిని రకరకాలుగా చూసుకోలేదు. ఎఱుక అన్నది పరిసరాలలో సదా ప్రతిబింబించుకుంటూ ఉండే నిరంతరచైతన్యం. ఆ చర్య ఆగిపోయినప్పుడు మెల్లగా అది కరిగి పోతుంది. ఎఱుక కరిగిపోగానే మౌఢ్యం పెల్లుబుకుతూ బయటికి వస్తుంది. సంవత్సరం రోజులు ఏకాంతంలో ఉన్నవాడు మానసిక రోగి అయిపోతాడు.”

“అవును, హెన్రీ షారియేర్ రాసిన పాపియాన్ నవలలో చదివాను.”

గ్యారీ నవ్వుతూ “విడ్డూరం ఏంటంటే ప్రపంచానికి నాగరికతను నేర్పిన ఫ్రాన్స్ దేశమే ఏకాంతపు చెరశాల అన్న క్రూరశిక్షను కూడా బహూకరించింది… ప్రపంచానికి తాత్వికతను నేర్పించిన మరో దేశమే విషవాయువు గదులను ఆవిష్కరించింది” అన్నారు.

కాసేపు మౌనంగా ఉన్నాం. మౌనాన్ని చెరుపుతూ “మీరు ఆ హింసను ఎలా భరించారు?” అని అడిగాను.

“నా ఎఱుక తనను స్ఫురించుకోవడానికి నాకు ఒక బాహ్యప్రపంచం కావాలి. దాన్నే వేదాంత జ్ఞానం ద్వారా సాధించాను. అయితే బాహ్యప్రపంచం అన్నది కేవలం నా బుద్ధి సృష్టించుకున్నది మాత్రమే. దాన్నీ వేదాంతమే చెప్తుంది. అంటే నా ఎఱుకకి బాహ్యప్రపంచం అన్న ఒక ఊహాత్మక చిత్రం కావాలి. ఒక మాయ. దాన్ని సృష్టించుకున్నాను. నాకిచ్చిన కంచం అంచుతో ఆ గోడలో ప్రపంచపటాన్ని గీసుకున్నాను. నేను ఉంటున్నది ప్రపంచపు మధ్య భాగంగా ఊహించుకున్నాను. ఆ చోటు హిమాలయాల్లోని ఒక ప్రదేశం. అక్కడినుండి తూర్పుముఖంగా నిల్చున్నాను. నా ముందు తూర్పు ఆసియా ఖండం. వెనక యూరప్, ఎడంవైపు ఆర్కిటిక్, కుడివైపు అంటార్కిటిక్.

“ఒక్కో ప్రాంతంలోనూ ఉన్న నగరాలను, పర్వతశ్రేణులను, నదులను, సముద్రాలను గీశాను. అక్కడున్న మనుషుల గురించి నాకు తెలిసిన వాటిని గుర్తు పెట్టుకున్నాను. తర్వాత ఆ ప్రపంచంలో మనుగడ సాగించాను. అనుకోగానే ఆల్ప్స్ పర్వతాల్లో ఉంటాను. నాలుగు అడుగులేస్తే హిమాలయ శిఖరం. అక్కడినుండి పసిఫిక్ సముద్రాన్ని నాలుగడుగులేసి చేరుకోగలను. అట్లాంటిక్‌లో నిల్చుని అరేబియా ఎడారిని చేయి చాచి తాకగలను. విరాట్పురుషుడిలా నేను విశ్వాన్ని ఆక్రమించుకుని భూప్రపంచమంతా వ్యాప్తమయాను.

“ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతాన్ని ఎన్నుకున్నాను. అక్కడి మనుషులతో సహజీవనం చేశాను. వాళ్ళలో ఒకడిని అయ్యాను. తర్వాత ఆ ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేని మరో ప్రాంతాన్ని జత చేశాను. హాన్ చైనావాళ్ళ నోట స్వాహిలి పలికించాను. సియరా లియోన్‌లో కోయంబత్తూరుని కలిపాను. కరెంటు తీగల జాలం లాగా నేను ప్రపంచమంతా పాకాను. నా ద్వారా విభిన్నమైన సంస్కృతులు ఒకదానితో ఒకటి చేతులు కలిపాయి. మనుషుల మనసులు ఒకదాన్ని ఒకటి ఆత్మార్థంగా కనుగొనున్నాయి. నా ద్వారా ప్రాంతాలు కలిశాయి. కొన్నిసార్లు నేనే ఆ ప్రాంతాలకు మధ్య ఒక పెద్ద వంతెనలా పడి ఉన్నాను. నా మీద పర్వతాలు ఎగశాయి. సముద్రాలు అలలు రేపాయి. నా మీదున్న పర్వతాల నుండి సముద్రం వైపుకు మహానదులు ప్రవహించాయి. నా శిఖరాలపై చల్లటి మేఘాలు మెరిశాయి, నా లోతులలో కళ్ళు లేని నల్లటి చేపలు చీకటినే వెలుగుగా భావించుకుని రెక్కలార్చుకుంటూ గాల్లోకి ఎగిరాయి. నా మీద వర్షం కురిసింది. పచ్చిక పులకించి మొలకెత్తింది. నేను నా దేహంలో ఉన్న ఉప్పునంతటినీ ఫలాల తీయదనంగా మార్చాను. పుష్పాలలోని రంగులుగాను, సౌరభాలుగాను, మకరందంగానూ మార్చాను.

“కొన్నిసార్లు ప్రపంచపు వేదననంతా నేను తీసుకుని పడుకున్నాను. నా మీద ఆరని వ్రణాలుగా సొరంగాలు తెఱచుకున్నాయి. పురుగుల వలె యంత్రాలు తొలుచుకుని వెళ్ళాయి. నాలోని ప్రాణద్రవాలు, లోతుల్లోని నవరత్నాలూ పైకి తోడబడ్డాయి. నా పొట్టంతా చెత్తతో నిండిపోయి బరువెక్కింది… నా రక్తనాళాలలో విషపూరితమైన ఆమ్లాలు ప్రవహించాయి. నా పిల్లల రక్తం స్రవించి నా ఒడి ఎరుపెక్కింది.

“ఆ మహత్తరమైన ఎఱుకే నన్ను అక్కడ బతికించింది. నేను ఎల్లలు లేనివాడిని అని, నేను గతించి పోను అని నాకు తెలియజేసింది. నన్ను హింసించేవారిని కూడా భరించగల రక్షణకవచంలా నన్ను భావించుకునేలా చేసింది. నేను భూమిని అయ్యాను. అంతులేని కరుణ, అంతులేని బాధ, అంతులేని అంతరంగజ్వాల కలవాడిగా అయ్యాను.

“ఉన్నట్టుండి ఒకరోజు ఆ దేశపు న్యాయస్థానం నన్ను విడుదల చేసింది. నాకోసం ఆ దేశంలోని ఒక సమాజసేవకుడు న్యాయస్థానానికి వెళ్ళాడు. నా గురించిన వార్తలు మళ్ళీ న్యాయస్థానం నుండి వార్తాపత్రికలను చేరుకున్నాయి. రోజురోజుకీ వస్తున్న వార్తలను అరికట్టడానికి ఆ ప్రభుత్వానికి రెండు మార్గాలే ఉన్నాయి. నన్ను దేశ బహిష్కరణ చేయడం లేదా నా కోరికను అంగీకరించడం. మొదటి మార్గాన్ని ఎంచుకుంది దక్షిణాఫ్రికా. నన్ను ఎక్కడికి పంపించాలి అన్న ప్రశ్నకు నేను ఇండియా అని అన్నాను.”

“ఎందుకు?”

“నేను జెయిల్లో ఉన్న రోజుల్లో నిత్యచైతన్యయతి నాకు లేఖలు రాశారు. నెలకు ఒక లేఖ చొప్పున నాలుగేళ్ళు క్రమం తప్పకుండా లేఖలు రాశారు. ఒక్క లేఖకు కూడా జవాబు రాకపోయినా ఆయన రాస్తూనే ఉన్నారు. ఆ లేఖ యొక్క నకళ్ళను ఎంతోమందికి పంపించారు. నన్ను అంత సులువుగా దాచేయలేరు అని వాళ్ళకు ఆయన చెప్తూనే ఉన్నారు. ఒక లేఖలో ఆయన ఇలా రాశారు: ‘పూడ్చిపెట్టేవాళ్ళకు కుక్కే పెద్ద సమస్య. ఎంత లోతులో పూడ్చినా అది వాసన పసిగట్టి తవ్వుతూ ఉంటుంది.’ నిజానికి నన్ను తవ్వి బయటకు తీసింది నిత్యచైతన్యయతి. ఆయనను చూడాలని కోరుకున్నాను.

“ఈ మట్టిలో కాలు పెట్టగానే నేను కనుగొన్నది మరో పెద్ద కారణాన్ని. నేను స్వేచ్ఛని కనుగొన్నాను. నేను స్వేచ్ఛను కోరుకున్నాను. కట్టుబాట్లు లేకుండా తిరగగల స్వేచ్ఛని. అది ఇవాళ ఈ ఒక దేశంలో మాత్రమే ఉంది.”

నేను ఆశ్చర్యంతో “అవునా? అమెరికాలో? ఫ్రాన్సులో?” అని అడిగాను.

“మై డియర్ యంగ్ ఫ్రెండ్! అక్కడ స్వేచ్ఛ అన్న పదం మాత్రం స్వేచ్ఛగా ఉంటే చాలు అని అనుకుంటారు. అవి ఎల్లవేళలా నిఘా పెట్టి ఉంచే దేశాలు. అక్కడ ఎప్పుడూ ప్రశ్నలే. ప్రతిచోటా పాస్‌పోర్ట్ అవసరం. అక్కడ సాటి మనుషులు కూడా మన మీద ఒక కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో మన నడవడులను గమనిస్తూ ఉంటారు. మన ప్రవర్తనలో కొంచెం తేడా ఉన్నా కూడా ముఖం చిట్లిస్తారు. అక్కడ అతిక్రమణలకు చోటు ఉంది. అయితే ఆ అతిక్రమణలకూ ఒక క్రమపద్ధతిని సృష్టిస్తున్నారు…”

ఆయన గట్టిగా నవ్వారు. “సాధారణ ప్రజలు ప్రతిదాన్ని ఒక క్రమబద్ధమైన పద్ధతిలో, నియమాలకు ఒద్దికగా అమర్చుకోవాలన్న అలవాటునుండి బయట పడలేకపోతున్నారు. క్రమానికి భిన్నంగా పరిణమించే ప్రకృతియొక్క సాటిలేని సృజనాత్మకత నుండి వీళ్ళు ఏదీ నేర్చుకోవడం లేదు…” నా భుజాల మీద చేతులు వేసి ”ఈ దేశంలో అడుగుపెట్టిన తొలి రోజు నా పాస్‌పోర్టును ఒక అధికారి చూశాడు అంతే ఆ తర్వాత ఈరోజు వరకు ఎవరూ ప్రశ్నించలేదు. ఎలాంటి కట్టుబాట్లు లేవు. నాకు తన వాకిలి తెరిచి ఉంచేసింది ఈ దేశం.” అన్నారు.

“అలాగైతే ఇది సురక్షితమైన దేశం కాదు కదా?” అని అడిగాను.

“లేదు. యూరోపియన్ దేశాల కంటే కూడా ఈ దేశం సురక్షితమైనది. ఈ దేశజనాభాతో పోల్చుకుంటే ఇక్కడి నేరాల సంఖ్య ఆశ్చర్యం కొల్పేంత తక్కువ” అని అంటూ తమిళంలో ‘ఏ మార్గమున సజ్జనులు, జనులు నడిచెదరో అమ్మార్గమే దేశంబును’ అని ఒక తమిళ పద్యంలోని పంక్తినందుకున్నారు. “ఇది తిరుక్కుఱళ్” అని నవ్వుతూ “కాదు. ఇది మరో కవయిత్రి రాసింది. అవ్వయార్. కవయిత్రే కదా? అలాగే చెప్పారు.”

“నేను ఇక్కడికి జూన్‌లో వచ్చాను. వఱ్కలై, ఆలువా, తలచ్చేరి, కణ్ణూర్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చాను. మళ్ళీ బయలుదేరి బెంగళూరు సోమనహళ్ళికి వెళ్ళి వినయచైతన్యను కలిసి అక్కడినుండి గోవా వెళ్ళి ఫ్రెడీ స్వామిని కలిశాను. తర్వాత ముంబై. అక్కడినుండి అజంతా ఎల్లోరా. తర్వాత కాశీ. కాశీలో ఉన్న నెలరోజులూ అక్కడి ఘాట్లమీదే నా బస.”

“అవును. నేను కూడా కాశీలో అలా మెట్లమీదనే గడిపాను” అన్నాను నేను.

“అక్కడి నుండి అలహాబాద్ మీదుగా కలకత్తా. అక్కడి నుంచి భువనేశ్వర్ వచ్చి చెన్నై. చెన్నై నుండి తిరువనంతపురం వెళ్ళి తలచ్చేరి వెళ్ళాను. అటునుండి కణ్ణూర్ ఎళిమలైకు వెళ్ళి పదిరోజులు ఉన్నాను.”

నేను ఆశ్చర్యంతో “అయితే కణ్ణూర్ నుండి ఇవాళ పొద్దునే వచ్చారా?” అని అడిగాను.

“అవును.”

“అయితే మీ దగ్గర ఒక సంచి అయినా లేదే?”

“నా దగ్గర ఒక జత బట్టలు ఉన్నాయి అది చాలు.”

కొండ శిఖరానికి చేరుకున్నాం. ఇప్పుడు పడమటి ఆకాశం బాగా ఎరుపెక్కి ఉంది. ఆకాశంలో మేఘాలు పలచగా ఉన్నాయి. ఊటీలో ఇలా ఉండటం చాలా అరుదు. వంపు తిరిగిన నీలంరంగు అద్దం లాంటి పడమటి ఆకాశంలో జారిపడిన మబ్బుతునకలు రాశి పోసినట్టు నెత్తుటి ఎరుపుని పులుముకుని మెరుస్తున్నాయి. వేడి జాడే మరిచిపోయిన సూరీడు గుండ్రంగా ఆకాశపు గోడకు వేలాడుతున్నట్టున్నాడు. ఆగిపోయిన గడియారపు లోలకంలా! గుండ్రటి అంచు చుట్టూతా ఎర్రటి కిరణాల వెలుగు అలలు అలలుగా పేరుకున్నట్టు ఉంది.

చల్లటి గాలి చెవి తమ్మెలను తాకుతోంది. ఎదరనున్న శిఖరం మీద పడుకుని ఉన్న కణుజులు ఒక్కొకటిగా లేచి నిల్చుని చెవులను రిక్కించి మాకేసి చూస్తున్నాయి. వాటి కదలికల మధ్య అవి స్థాణువయిన శిల్పాల్లా కనిపించాయి. రెండు కొండలకు మధ్యనున్న షోలపర్వత సానువుల్లో కిలకిలారావాలతో పక్షుల గుంపులు ఎగురుతున్నాయి. సాయంకాలపు వాతావరణమార్పుతో చెమ్మెక్కిన గాలిలో పచ్చిక చిమ్మిన ఆవిరి వాసనలు.

కొండ శిఖరం మీద ఒకే ఒక చెట్టు ఏకాకిలా నిలిచి ఉంది. సిల్వర్ ఓక్ చెట్టు. అయితే అది తేయాకు తోటల్లో నిల్చున్నట్టు కొమ్మలు లేకుండా కాదు. బాగా అన్ని వైపులా సమృద్ధిగా విచ్చుకున్న కొమ్మలతో గాలిలో తూగుతూ నిల్చునుంది. దాని కింద వెళ్ళి నిలుచున్నాము. ఆ చెట్టు మీద పక్షులే లేవు. అక్కడి పచ్చిక నేలలో ఒక పెద్ద జింకల గుంపు అప్పుడే గడ్డి మేసి వెళ్ళినట్టు ఉంది. జింక పెంటికలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటి మీద బుల్లి రెక్కల పురుగులు మూగి ఎగురుతున్నాయి. వాటికి అవే అమృతతుల్యమైన పౌష్టికాహారం. వాటి పిల్లల పురిటి పరుపు, తూగుటుయ్యాల.

యువ సన్యాసి కొంచెం దూరం వెళ్ళి కూర్చుని పడమటి ఆకాశానికేసి చూస్తూ కొన్ని నిమిషాల తర్వాత కళ్ళు మూసుకున్నాడు. సూర్యుడు మంచుగడ్డ మీద జారినట్టు జారి లోతుల్లో పూడుకుపోయాడు. దిగంతం అంతా ఎర్రటి చారలు. అన్ని అసంఖ్యాకమైన మేఘపు దూది వలలు అక్కడ ఉన్నట్టు అప్పటి వరకు తెలియలేదు. ఉన్నట్టుండి ఎదురుగా ఉన్న కొండమీది కణుజులు పరిగెత్తుకెళ్ళి పొదలకవతల కనుమరుగయ్యాయి. ఒకే ఒక ఎర్ర రాబందు మాత్రం ఆకాశంలో చక్కర్లు కొడుతూ మెల్లగా కిందకు జారుతోంది. గాల్లో ఈక తేలినట్టు కిందకి దిగి మళ్ళీ రెక్కలల్లార్చి పైకి ఎగిరింది.

గ్యారీ డేవిస్ పచ్చిక మీద కూర్చున్నారు. ఆయన బట్టతలమీద చర్మం లేచిపోయిందా అన్నట్టు ఎర్రగా పండిపోయి ఉంది. కళ్ళజోడు వెనక ఎర్ర కాంతి చారలు మెరుస్తున్నాయి. ఆయన కలలో ఉన్నట్టు అనిపించాడు. సూర్యుడి ఒక చిన్న అంచు మాత్రం ఇంకా మిగిలి ఉంది. ఆ ఒంటరి రాబందు దిగంతంలో కనుమరుగయ్యింది. పేరు తెలియని ఏ పక్షో క్లుక్ క్లుక్‌మని చప్పుడు చేస్తోంది, అది ఎక్కడ ఉందన్నది తెలియలేదు.

ఒక గర్జింపు విని తిరిగి చూశాను. గ్యారీ డేవిస్ నుండే వచ్చింది. సాగిపోయిన ఆయన మెడ కండరాలు అదరడం చూశాను. ఆయనకు మూర్ఛరోగం వచ్చిందా అని భయపడ్డాను. నోరు ఒక పక్కకు ఒరిగి ఈడ్చుకుపోయింది. మళ్ళీ గర్జించారు. ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని మోకాళ్ళ మీద తల పెట్టుకున్నారు.

కాసేపటి తర్వాత తల పైకెత్తి పలచటి మంచు కమ్ముకుంటున్న చీకటిలో సూర్యుడు వదిలి వెళ్ళిన వెలుతురును చూశారు. తలను ఊపుతూనే ఉన్నారు. చేతులు బట్టతల మీద దువ్వుకుంటూ శాంతించారు. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నారు. నేను చూస్తున్నాను అన్న స్పృహ అప్పుడే వచ్చినట్టుంది. నాకేసి తిరిగి చూశారు. చిరునవ్వు చిందిస్తూ ”మేన్, దిజ్ ఇజ్ హారిబుల్” అన్నారు.

నేను ఏమీ మాట్లాడకుండా చూస్తున్నాను. మరో కొన్ని నిముషాలు అలానే కూర్చునుండి గ్యారీ లేచినప్పుడు నేనూ లేచాను.

“తొలి కొన్ని నిమిషాలు ప్రపంచపు అంచులను గ్రహించాను. అయితే…” అంటూ తల నిమురుకున్నారు. బొంగురుపోతున్న గొంతుకతో “హఠాత్తుగా ఈ ప్రపంచం ఒక గదిలా అనిపించింది. చాలా చిన్న గది. చేయి చాచితే, కాలు చాచితే ఆ నాలుగు గోడల లోపల అన్ని చోట్లను తాకగలిగేంత చిన్న గది. నాలుగు వైపులా మూత వేయబడ్డ గది. విడిపించుకునేందుకు ఆస్కారమే లేనట్టు ఆ గదిలో మానవత్వం శాశ్వతంగా బంధించబడి ఉంది… జీసస్!”

ఆ మాటలను అందిపుచ్చుకుని దాన్ని నా అనుభవంగా మార్చుకోవడానికి నాకు కొంచెం సమయం పట్టింది. అది అవగాహనకు రాగానే భయంతో నా ఒళ్ళు కుంచించుకుపోయింది. అక్కడ ఇంకొక క్షణం ఆగలేను అనిపించింది. వెంటనే పరుగెత్తి ఏదైనా ఒక సురక్షితమైన చిన్న గదిలోకి వెళ్ళి నన్ను నేను బంధించుకోవాలి అనిపించింది. అప్పుడే బయటున్న అనంతమైన ప్రపంచాన్ని ఆస్వాదించగలం. స్వేచ్ఛను తెలుసుకోగలం.

యువ సన్యాసి ”ఓమ్” అంటూ కళ్ళు తెరిచారు. ఏమీ మాట్లాడకుండా ఆయన కిందకు నడిచారు. తెర కిందకి జారుతున్నట్టు షోలపర్వత సానువులను చీకటి మెల్లగా ఆక్రమించుకుంటోంది. కొండ అంచులలో మాత్రం మసక వెలుగు. కొండ శిఖరాల్లో మాత్రమే మిగిలిపోయున్న చివరి వెలుతురు రేఖలు మెరుస్తున్నాయి. అవికూడా చుట్టేస్తున్న తివాచీలా సన్నగిల్లుతున్నాయి.

కొండదారి చిన్న గీతలా కనబడుతోంది. ఆ దారిలో నెమ్మదిగా దిగుతున్నాము. చిమ్మటల ఈలతో రాత్రి తన చలిని, చీకటిని, చప్పుళ్ళను, మసక బారుతున్న ఆకాశంలో అప్పుడప్పుడే పొడుస్తున్న నక్షత్రాలనూ సంయుక్తం చేసుకుంటోంది. నాతోబాటు బరువెక్కిన ఆలోచనలు నా కాళ్ళకు అడ్డుపడుతూ ఉన్నాయి.

గ్యారీ డేవిస్ ఏదో ఆలోచననుండి విడివడినవాడిలా క్షణం ఆగి వెనక్కి తిరిగి నా వైపుకు చూస్తూ “ఇందులో మనం అనంతమైన ప్రపంచాన్ని గీసుకోవాలి. సరేనా?” అని అన్నారు. నేను ఆయనకేసి మౌనంగా చూశాను. ఆయన ముందుకు దిగి వెళ్ళిపోతున్నారు.

[మూలం: అఱం సంఫుటి నుంచి (మార్చ్ 2011) ఉలగం యావైయుమ్ అన్న కథ.]


జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.