(అదొక హంతకుల కూటమి. కానీ, కేవలం న్యాయం మీదనే శ్రద్ధ నిలిపే ఏ న్యాయాలయమూ వారిని నేరస్థులుగా నిర్ణయించలేదు.)
వైద్యబృందాల సమావేశాలకి చుట్టూ ఎప్పుడూ ఒక రహస్యపు తెర ఉంటుంది. ఆ గోప్యత, వాళ్ళకి ఎంత తెలుసో, లేదా ఎంత తెలియదో, సామాన్యులు తెలుసుకోకుండా ఉండడానికేనేమో అనిపిస్తుంది. వాళ్ళ మందూ మాకులకు, కత్తులూ కటార్లకు, చికిత్స జరుగుతోందన్న భ్రమతో తనని తాను జంతువులా సమర్పించుకునే సామాన్యుడికి, కారణం ఆ రెండింటిలో ఏదని తెలిసినా గుండెలో రాయి పడుతుంది.
ఈ తరంలో, అటువంటి నిగూఢవైద్యబృందాలలో, ‘ఎక్స్-క్లబ్’గా తమని తాము పిలుచుకునే న్యూయార్క్ సిటీలోని ప్రముఖ వైద్యుల బృందం ఒకటి. ఈస్ట్ రివర్‌కి ఎదురుగా, వాల్టన్ హోటల్లో ఈ చిన్న చికిత్సకుల బృందం మూడు నెలలకొకసారి, ఆ వృత్తిలోని పాత్రికేయులకి కూడా తెలియనంత రహస్యంగా, తెల్లవారేదాకా సమావేశం అయ్యేది. ఇరవై సంవత్సరాల కాలంపాటు ఈ రహస్యసమావేశాలలో ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు — అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడికి గాని, ఎక్స్-క్లబ్ సభ్యుల సహోద్యోగులకు గాని, వారి భార్యలకి గాని, వారి మీద ఆధారపడిన వాళ్ళకి గాని, మిత్రులకు గాని. అందులో దాచవలసినంత రహస్యాలు ఏమీ లేకపోయినా, ఎవరిమీదో బాంబులు విసరబోయేవాడు వాడి గమ్యం చేరేంత వరకూ నోరుమూసుకున్నట్టు, డాక్టర్లు అంత గోప్యతను పాటిస్తారు, ఏ అవసరమూ లేకపోయినా.
అలాంటప్పుడు, ఇన్నేళ్ళుగా దాచిన సమావేశాల రహస్యం గురించి నాకెలా తెలిసింది? దానికి సమాధానం- యుద్ధం. ఈ యుద్ధం, యుద్ధానికి కారణమైన రహస్యాన్ని తప్ప తక్కిన రహస్యాలన్నిటికీ తెర దించింది. ఆత్మవిమర్శ చేసుకోవడంలో నిమగ్నమైన ఈ ప్రపంచం, ఆ ఒక్క రహస్యాన్నీ పక్కన పెట్టేసింది. ఎక్స్-క్లబ్ సభ్యులు పదిహేనుమందిలో తొమ్మండుగురు యుద్ధరంగంలోని ఆసుపత్రులలో పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. వయసు పైనబడి బలహీనంగా ఉన్న తక్కినవారికి ఉన్నచోటే పని మరింత పెరిగింది. సాధారణ పౌరుల దురదృష్టంపై కొంత కుతూహలం శాస్త్రవిజ్ఞానానికి ఎప్పుడూ ఉంటుంది, యుద్ధంలో మరణించేవారికన్నా.
“మా బృందం అలా విడిపోయింది. ఇక మళ్ళీ కలిసే అవకాశం ఇంచుమించుగా లేదు. అందుకని, ఈ రహస్యాన్ని కాపాడవలసిన అవసరం నాకు కనిపించలేదు.” డా. అలెక్స్ హ్యూమ్, ఒక సాయంత్రం డిన్నరు చేస్తున్నప్పుడు అన్నాడు. “నీది చిన్నపిల్లవాడి తత్వం. భావుకత్వం ఎక్కువ. నేను చెప్పబోయే కథ నీకు విముఖత కలిగించవచ్చు. నిస్సందేహంగా దీన్ని అంతటినీ ఒక దుర్మార్గమైన కథగా మలిచి, ఈ ఎక్స్-క్లబ్ ఆశయాల వెనుక ఉన్న తాత్త్విక, మానవీయ భావనలని తప్పుగా అర్థం చేసుకోనూవచ్చు. అందుకని, ఫిక్షన్ కథలో లాగా పాత్రలను మార్చను. మా ఔన్నత్యం కోసం నిజాన్ని దాచను.”
అన్ని విషయాలనీ స్పృశిస్తూ సర్వజ్ఞాని లాగా అతను ఇచ్చిన విపులమైన ఉపోద్ఘాతాన్ని విడిచిపెడతాను. అంతశ్చేతన ఎంత విశృంఖలంగా ఉంటుందో వివరించే డా. హ్యూమ్ రచనలు మీరు చదివే ఉంటారు. చదివి ఉంటే, ఈ బట్టతల మేధావి గురించి మీకు మంచి అవగాహనే ఉండే ఉంటుంది. తెలియకపోతే, నా మాట విశ్వసించండి: అతనొక గొప్ప మేధావి. అతనంత నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో, అసమర్థ ప్రపంచపు పక్కటెముకలను విరిచేవాడు ఇంకొకడు లేడు. గొప్ప మనస్తత్త్వశాస్త్రవేత్తకి ఉండవలసిన లక్షణాలన్నీ అతని దగ్గర ఉన్నాయి. మనిషి నెపోలియన్‌లా పొట్టి. ముఖం గుండ్రంగా ఉంటుంది. బండ కళ్ళద్దాల గబ్బిలం. పెదాలు మాత్రం అపనమ్మకంతో కలిసిన నవ్వు నవ్వుతూ వుంటాయి. మనిషి మనసు ఎంత నీచమైనదో, ఏవగించదగినదో తెలిసిన తర్వాత, ముఖంలో అటువంటి తీరు కనిపించడం సహజం.
నాటకీయంగా ఎక్స్-క్లబ్ చిట్ట చివరి సమావేశం, మార్చి నెలలో, బాగా వర్షం కురుస్తున్న రాత్రి జరిగింది. అంత ప్రతికూల వాతావరణంలో కూడా పదిహేనుగురూ హాజరయ్యారు. ఎందుకంటే ఆ సమావేశానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ- ఆ రోజు పదిహేనవ వ్యక్తిగా ఒక కొత్త సభ్యుడిని తమలో చేర్చుకోబోతున్నారు. ముక్కుపచ్చలారని కొత్త సభ్యుడిని ఆహ్వానించే బాధ్యత డా. హ్యూమ్‌కి అప్పగించేరు. అతని స్వాగత పరిచయంతో డా. శామ్యూల్ వార్నర్ ఎక్స్-క్లబ్ పవిత్ర రంగస్థలిమీద అడుగు పెట్టాడు.
వైద్యవృత్తిలోని మేధావుల్లో – గుర్తింపు పొందిన వాళ్ళలో – డా. వార్నర్ వంటి పిన్న వయస్కుడు చాలా అరుదు. ఈ ఎక్స్-క్లబ్‌లో సభ్యత్వానికి మించిన పరిపూర్ణమైన గుర్తింపు, శస్త్రచికిత్సలో మాంత్రికుడనదగ్గ అతని నైపుణ్యానికి వేరే ఎక్కడా లభించలేదు. అతన్ని పదిహేనవ సభ్యుడిగా ఆహ్వానించిన తక్కిన పద్నాలుగు మంది వైద్యులూ తమ తమ రంగాలలో మార్గదర్శకులు. వైద్యరంగంలో మకుటంలేని మహరాజులు. అంతమాత్రం చేత వాళ్ళ పేర్లు అందరికీ తెలుసునని కాదు. వైద్యవృత్తిలో లభించే ప్రఖ్యాతి మహా అయితే ఎంత! యుద్ధం వారి గోప్యతను చెడగొట్టలేదు. కీర్తికోసం పాకులాడేవారికే అది సహాయం చేస్తుంది.
కొత్త సభ్యుడు అందంగా ఉన్నాడు. కొంచెం బిగుసుకుని కూర్చున్నాడు. నిశ్చలంగా ఉన్న కళ్ళలో కష్టపడి పనిచేసే తత్వం కనిపిస్తోంది. విశాలమైన అతని పెదవులు క్షణకాలం నవ్వులు వెదజల్లి అంత త్వరగానూ మూసుకుపోయాయి. ఏకాగ్రతకి ఏమాత్రం భంగం కలిగించకుండా శస్త్రవైద్యులు తరచు అలాగే తమ స్పందనలని తీర్చిదిద్దుకుంటారు. ప్రసిద్ధులైన తక్కిన వైద్యులతో పలకరింపులు, అభివందనలూ పూర్తయాయి. అందులో సగం మంది వైద్యవృత్తిలో అతనికి ఆరాధ్యదైవాలు. ఇచ్చిన బ్రాందీని సున్నితంగా తిరస్కరించాడు. బలిష్ఠమైన అతని శరీరం కుర్చీలో నిటారుగా, సమావేశంలో కూర్చున్నట్టు కాకుండా, పరుగుపందానికి సిద్ధంగా ఉన్న క్రీడాకారుడి తీరులో ఉంది.
తొమ్మిది కొట్టగానే, హస్తవాసిలో నిపుణుడయిన డా. విలియమ్ టిక్ పానీయాలకి ముగింపు పలకమని చెప్పి, 53వ ఎక్స్-క్లబ్ సమావేశం ప్రారంభం అయిందని ప్రకటించాడు. నిలువెత్తు మేజా వెనుక నిలబడి, అందంగా అలంకరించిన గదిని, సభికుల్నీ ఒకసారి పరికించి చూశాడు.
డా. టిక్ తన డెబ్భై అయిదేళ్ళ జీవితాన్ని, ఒక ప్రక్క వైద్య కళని సాధన చెయ్యడానికి, మరొక ప్రక్క దాన్ని రూపుమాపడానికీ సరిసమానంగా కేటాయించాడు. కనీసం, ముక్కోపియైన అతని స్వభావం గురించి అతని దగ్గర చదువుకున్న వేలమంది విద్యార్థుల అభిప్రాయం అది. ఆయన పద్ధతి ‘అవమానం ద్వారా బోధన’! ఇప్పటికీ చాలామంది పేరుమోసిన డాక్టర్లు, చదువుకునే రోజుల్లో ముణుకులనొప్పితో బాధపడుతూ, చికాకుతో నిండిన అతని కళ్ళు గుర్తుకు వస్తే బెదురుతారు; అతని వైద్య శిక్షణా విధానానికి, తమపట్ల వెలిబుచ్చిన అభిప్రాయాలకు భయంతో వణుకుతారు.
ఒక తరం తర్వాత మరొక తరం విద్యార్థుల్ని సంబోధిస్తూ ఇలా అనేవాడు: “వైద్యవృత్తి ఒక ఉదాత్తమైన కల. అంతే కాదు, అది యుగాలుగా మనిషి చేస్తున్న పొరపాట్లకీ మూఢత్వానికీ కూడా నిదర్శనం. మనిషి శరీరమర్మాలు తెలుసుకుందికి చేసిన ప్రయత్నాలు విఫలమైనంతగా రోదసి గురించి తెలుసుకుందికి చేసిన ప్రయత్నాలు విఫలం కాలేదు. మిమ్మల్ని మీరు శాస్త్రజ్ఞులుగా సంభావించుకునే ముందు, నేను చెబుతున్న ఈ మాటల్ని మీరు సదా గుర్తుంచుకోవాలి. ఈ రోజు మీరు నా దగ్గరనుండి నేర్చుకున్నదంతా రేపటికి ఆదిమవాసుల వైద్యంగా చూడబడుతుంది. మనం ఇప్పటి వరకూ ఎంత కృషి చేసి, ఎంత ప్రగతి సాధించినా, వైద్యకళ చేపలు పట్టుకోడానికి, దయ్యాల కథలు రాయడానికీ మధ్య నైపుణ్యంతోటే ఉంటుంది.”
“వైద్యాన్ని వృత్తిగా సాధన చెయ్యడంలో, రెండు ఇబ్బందులు ఉన్నాయి.” అని టిక్ తన నలభై సంవత్సరాల బోధనలోనూ నొక్కి మరీ చెప్పేవాడు. “మొదటిది, తరతరాలుగా రోగులు లేనివి ఉన్నట్టుగా నటించే రోగాలూ, నొప్పులూ. రెండవది, వైద్యపరంగా గానీ మరొక విధంగా గానీ, రోగం గురించి ఏ ముందస్తు అభిప్రాయమూ లేకుండా రోగాన్ని పరిశీలించడంలోనూ, రోగినుండి సమాచారం రాబట్టడంలోనూ, అతి తెలివికి పోకుండా దాన్ని విశ్లేషించడంలోనూ, అన్నిటికన్నా ముఖ్యంగా దాన్ని అహంకారానికి పోకుండా, వివేకంతో ఆ సమాచారాన్ని ఉపయోగించడంలోనూ మానవ మేధకి సహజంగా ఉన్న పరిమితులు.”
తరగతి గదిలోలాగా పూర్తి నిశ్శబ్దం నెలకొనే దాకా, ప్రస్తుతం టేబులు వెనకనుండి ఎదురుగా ఉన్న ‘అసమర్థ వైద్యుల’ గుంపువంక తేరిపార చూశాడు టిక్. చివరగా ఎంతో ఒత్తిడితో బిర్రబిగుసుకుని కూర్చున్న అందమైన వార్నర్ ముఖంలోకి చూశాడు.
“ఈ రోజు మనముందర ఒక కొత్త వైద్య మేధావి ఉన్నాడు. నాకు ఇంకా అతని మునపటి ఆకారమే గుర్తుంది. హైపర్ థైరోయిడ్, కిడ్నీ డిస్‌ఫంక్షన్ ఉన్నట్టు గుర్తు. ఎక్కడా తెలివితేటలు మాత్రం ఉన్నట్టు గుర్తు లేదు. శామ్, నీకు తెలియడం కోసం ఈ సంస్థ ఆశయాలని, దాని ఉనికి వెనుకనున్న అర్థాన్నీ వివరించడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు.
వెంటనే డా. హ్యూమ్ అందుకున్నాడు. “నేనవన్నీ వివరించాను. కూలంకషంగా.”
“డా. హ్యూమ్ ఇచ్చిన వివరణ, అతను రాసిన పుస్తకాలలాగే ఉంటే అర్థంకాకున్నా నీకు అయోమయం తప్పకుండా ఉంటుంది.” అన్నాడు టిక్ హ్యూమ్ వైపు చూడను కూడా చూడకుండా.
“నాకు బాగానే అర్థం అయింది” అన్నాడు వార్నర్.
“నాన్‌సెన్స్! మానసికశాస్త్రం పట్ల నీకు ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానం ఉందని నాకు తెలుసు. ఆ విషయం గురించి చాలాసార్లు హెచ్చరించాను కూడా. మనోవిజ్ఞానం వైద్యానికి అపవాదం. ఏదో ఒకరోజు అది వైద్యాన్ని కాలరాస్తుంది. ఎవరికెరుక? అప్పటి వరకూ, శత్రువుని మనం దూరంగా ఉంచడం మంచిది.”
ఈ మాటకి డా. హ్యూమ్ చోద్యంగా నవ్వడం మీరు ఊహించే ఉంటారు.
“ఇక డా. హ్యూమ్ మీకు ఏమి చెప్పదలుచుకున్నాడో దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు డా. టిక్.
“సమయం వృధా చేద్దామనుకుంటే అలాగే కానీండి” అన్నాడు కొత్త సభ్యుడు జంకుతూ, మెడని చేతిరుమాలుతో తుడుచుకుంటూ.
భారీగా ఉండే ప్రముఖ ప్రసూతివైద్య నిపుణుడు డా. ఫ్రాంక్ రాసన్ తనలోతాను ముసిముసినవ్వులు నవ్వుతూ, “ఇవాళ డా. టిక్ మంచి రసపట్టులో ఉన్నాడు” అన్నాడు.
“ముసలితనానికి శాడిజం తోడైంది!” వ్యాఖ్యానించాడు డా. హ్యూమ్.
“డా. వార్నర్!” అతని ఒకప్పటి ఉపాధ్యాయుడు తిరిగి ప్రారంభించాడు,”ఎక్స్-క్లబ్ సభ్యులు ఇక్కడ సమావేశం అవడంలో ఒక ముఖ్యమైన, ఆసక్తికరమైన లక్ష్యం ఒకటి ఉంది. క్రిందటి సమావేశం నుండి ఈ సమావేశం వరకూ గల మూడు నెలల మధ్యకాలంలో వాళ్ళు ఏవైనా హత్యలు చేసి ఉంటే, వాటి గురించి ఒప్పుకోవడం. హత్యలనడంలో నా అభిప్రాయం వైద్యపరమైన హత్యలనే. తెలివితక్కువ వల్ల కాక ఆవేశంలో చేసిన హత్యల గురించి చెప్పినా ఆసక్తికరంగా ఉంటుందనుకో. అది వేరే సంగతి. డా. వార్నర్, మీరు మీ భార్యని చంపినా, లేదా మీ మామనో, బాబయ్యనో ఈ మధ్యనే లేపేసి, మనసులోని ఆ బాధని ఇక్కడ వెళ్ళగ్రక్కదలుచుకుంటే, మేమందరం సాదరంగా వింటాం. మీరిక్కడ ఏది చెప్పబోయినా అది పోలీసులకి గాని, అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌కి గాని తెలియదు.”
కొత్త సభ్యుడి ముఖంలో చెలరేగుతున్న ఉద్రిక్తతని గమనిస్తూ డా. టిక్ కళ్ళు క్షణకాలం ఆగాయి. “మీరు మీ బంధువులని ఎవరినీ హత్యచెయ్యలేదనే నేను విశ్వసిస్తున్నాను” అని, ఒక నిట్టూర్పు విడిచి, ” అంతేకాదు, వృత్తిలో జరిగే పొరపాట్లవల్ల తప్ప మీరెన్నడూ అటువంటి పని చెయ్యరనీ నమ్ముతున్నాను.
“విజ్ఞులైన డా. హ్యూమ్, మనోవిజ్ఞానపు దృష్టికోణంలో ఈ సంస్థ గురించి, ఇటువంటి ఒప్పుకోలు మనసుకి మంచి చేస్తుందనీ చెప్పే ఉంటారు. అటువంటి మాటలకి అర్థం లేదు. మనం ఇక్కడ సమావేశమవుతున్నది మనసు లోని బరువు దించుకుందికి కాదు. దానిని మెరుగుపరుచుకుందికి. మన ముఖ్యోద్దేశం శాస్త్రీయమైనది. చేసిన పొరపాట్లు సామాన్యప్రజానీకం ముందు ఒప్పుకోగలిగిన సాహసము చెయ్యలేం కాబట్టి, ఏమీ తెలియని జనసామాన్యం మనల్ని విమర్శించలేనంత తెలివైన వాళ్ళం, చదువుకున్న వాళ్ళమూ కాబట్టి, మనం ప్రదర్శించే మానవాతీతమైన పరిపక్వతకి అటువంటి మానవ సహజమైన బలహీనతలు చెడుపుచేస్తాయి కాబట్టి, ఈ సంస్థని స్థాపించాము. సభ్యులు కేవలం తమ పొరపాట్లని మాత్రమే గర్వంగా చెప్పుకునే వైద్యనిపుణులసంస్థ ప్రపంచం మొత్తం మీద ఇదొక్కటే.
“ఇప్పుడు నిజమైన, తప్పుపట్టలేనంత సున్నితమైన వృత్తిపరమైన హత్య అంటే ఏమిటో విశదీకరిస్తాను: వైద్యుడిమీద పూర్తి నమ్మకంతో రోగి తన ప్రాణాన్ని అతని చేతుల్లో ఉంచినపుడు, ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యడం. వైద్యుడి చేతిలో రోగి చనిపోయినంత మాత్రం చేత దాన్ని హత్య అనలేము. వైద్యుడు రోగ నిర్ధారణ తప్పుగా చెయ్యడం వల్లనో, తేటతెల్లంగా ఒకమందుకి బదులు మరొక మందు ఇవ్వడం, తప్పుడు శస్త్రచికిత్స చెయ్యడం వల్లనో రోగి మరణం సంభవించి, ఈ వైద్యుడి ప్రమేయమే లేకుండి ఉంటే, అతను హాయిగా మామూలు జీవితం గడపగలిగిన సందర్భాలలో మాత్రమే అది వృత్తిపరమైన హత్యగా పరిగణించబడుతుంది.”
“హ్యూమ్ ఇవన్నీ నాకు వివరించారు” అని కొత్త సభ్యుడు అసహనంగా గొణిగి, తర్వాత కొద్దిగా గొంతు స్థాయి పెంచి,”ఇది నా మొట్టమొదటి సమావేశం కనుక, ఇలా ప్రసంగం వినడం కంటే, గౌరవనీయ సభ్యుల అనుభవాలు వారి నోటితోటే వినడం ద్వారా ఎక్కువ నేర్చుకోగలుగుతానని భావిస్తున్నాను. అంతేకాదు, నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఒకటి ఉంది” అన్నాడు.
“హత్య గురించా?” ఆసక్తిగా అడిగాడు టిక్.
“అవును.”
తలపండిన ఆ ప్రొఫెసరు తల తాటిస్తూ, “మరీ మంచిది. మేము కూడా వినడానికి కుతూహలంగా ఉన్నాము. కానీ, అంతకంటే ముందు వినవలసిన హత్యలు చాలానే ఉన్నాయి ఈ రోజు కార్యక్రమంలో” అన్నాడు.
కొత్తసభ్యుడు ఒక్కసారిగా మౌనం వహించి, ఎప్పట్లాగే నిటారుగా, బిగుసుకు కూర్చున్నాడు తన కుర్చీలో. అలా కూర్చున్న అతని వాలకంలో సభాభయాన్ని మించినది ఏదో ఉందని హ్యూమ్‌తో సహా, చాలామంది వెంటనే గుర్తించారు. శామ్ వార్నర్ ఈ మొదటి సమావేశానికి హాజరవడం వెనుక ఖచ్చితంగా అతని మనసుని రగులుస్తున్న ఏదో నిగూఢమైన విషయం ఉందని అందరూ నిర్ధారణకి వచ్చారు.
న్యూరాలజిస్టుగా పేరుగడించిన డా. ఫిలిప్ కర్టిఫ్ వార్నర్ భుజంమీద ఆప్యాయంగా చెయ్యి వేసి అన్నాడు:”మీరు చెప్పబోయే దాని గురించి అంతగా మథనపడవలసిన పని లేదు. ఇక్కడందరూ నిపుణులైన వైద్యులే. మీరు చెప్పబోయేది ఏదైనా, అంతకంటే పెద్ద ఘోరాలు చేసినవాళ్ళే.”
“సభ్యులు నిశ్శబ్దం పాటించాలి” అని గట్టిగా కోరాడు టిక్. “అపరాధ భావనతో ఉన్న వైద్యులకి చికిత్సచేసే శరణాలయం కాదిది. చేసిన పొరపాట్లను తిరిగి చెయ్యకుండా సరిదిద్దుకుందికి పనికొచ్చే శిక్షణా శిబిరం. మనందరం దీనిని ఒక క్రమ పద్ధతిలో, శాస్త్రీయంగా నిర్వహిద్దాం. వైద్యరంగంలో అన్ని విషయాలూ కూలంకషంగా తెలిసినవాడిగా పేరుపడ్ద మన యువ మిత్రుడు డా. వార్నర్ తన రోగుల్లో ఒకరిని ఎలా చంపాడో వినడానికి తక్కిన సభ్యులతో పాటు నేను కూడా కుతూహలంగా ఉన్నాను. కానీ మన కుతూహలాన్ని కాసేపు తొక్కిపెట్టక తప్పదు. గత సమావేశానికి మీలో ఐదుగురు హాజరు కాలేదు గనుక, మీ ప్రయోజనం కోసం డా. జేమ్స్ స్వీనీని తన పొరపాటుని మరొకసారి నివేదించవలసిందిగా కోరుకుంటున్నాను.” డా. టిక్ ప్రసంగం ముగించాడు.
సమకాలీనుల్లో, రోగ నిర్ధారణ విషయంలో డా. టిక్ తర్వాత తూర్పుతీరంలో అతనంతటివాడు మరొకడు లేడని పేరుగణించిన డా. స్వీనీ లేచి, విచారమైన ముఖంతో ముందటి సమావేశానికి హాజరు కాని సభ్యులవంక తల తిప్పాడు.
“ఒకసారి చెప్పాను. సరే, మళ్ళీ మరోసారి చెప్తాను. నా దగ్గరకు వచ్చిన ఒక రోగిని ఫ్లోరాస్కపీ చేయించుకుని రమ్మని ఎక్స్-రే రూమ్‌కి పంపించాను. నా సహాయకుడు అతనికి బేరియమ్ పాలు తాగడానికి ఇచ్చి, ఫ్లోరాస్కోప్ క్రింద ఉంచాడు. అరగంట పోయిన తర్వాత ఎంతవరకూ వచ్చిందో చూడటానికి వెళ్ళాను. ఫ్లోరాస్కోప్ తెరమీద రోగి పరిస్థితి చూసి నా సహాయకుడు డా. క్రోచ్‌తో అటువంటి వింత ఎన్నడూ చూడలేదని చెప్పాను. క్రోచ్ మాట వినే స్థితిలో కూడా లేడు. ఇంతకీ, నేను చూసిన వింత ఏమిటంటే పేషెంట్ పొట్ట, కంఠనాళం క్రిందిభాగం బాగా ఉబ్బిపోయి, ఎక్కడా చలనం లేకుండా రాతితో చేసినట్టు అగుపించాయి. నేను దాని వంక చూస్తున్నకొద్దీ ఆ విషయం మరింత స్పష్టంగానూ, నిశితంగానూ కనిపించసాగింది. విచారకరమైన విషయం ఏమిటంటే, ఇందులో మేం చెయ్యగలిగినది ఏదీ లేదు. డా. క్రోచ్ వాలకంచూస్తే ఏ నిముషంలోనైనా మూర్ఛపోయేట్టు ఉన్నాడు. కొద్ది సేపట్లోనే రోగి అవసానదశకు చేరుకుని, నేలమీదకి ఒరిగిపోయాడు.”
ముందరి సమావేశానికి రానివాళ్ళంతా ముక్తకంఠంతో, ఓహ్! అని తమ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. డా. కర్టిఫ్, “దానికి కారణం ఏమిటిట?” అని అడిగాడు.
“చెప్పడానికి ఏమీ లేదు. అతను బేరియం పాలు త్రాగడానికి ఇచ్చిన గ్లాసు అడుగున చూస్తే గడ్డకట్టి ఉంది. బేరియం పాలకు బదులు అతనికి పొరపాటున ప్లాస్టర్ ఆఫ్ పారిస్ త్రాగడానికి ఇవ్వడం జరిగింది. నా అనుమానం దాని ఒత్తిడి వల్ల అతనికి గుండెపోటు వచ్చి ఉంటుంది,” అన్నాడు స్వీనీ.
కొత్తసభ్యుడు ఆశ్చర్యంతో, “ఎంతపని జరిగింది! అసలు ఆ గ్లాసులోకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎలా వచ్చింది?” అని అడిగాడు.
“ఔషధం తయారు చెయ్యడంలో జరిగిన పొరపాటు వల్ల” అన్నాడు స్వీనీ నిర్లిప్తంగా.
“రోగి మీ దగ్గరికి రావడానికి ముందు, అతనికి ఉన్న బాధ ఏమిటి?” అని అడిగాడు డా. కర్టిఫ్.
“శవపరీక్షలో ముఖ్యంగా అతని పొట్ట, అన్నవాహిక గట్టిపడిపోయాయని తేలింది,”అన్నాడు స్వీనీ. “కానీ, కనిపించిన లక్షణాలను బట్టి అతనికి పైలోరిక్ స్పాజమ్ ఉండి ఉండాలి. దాని వల్ల త్రేణుపులు వస్తూ అతను నా దగ్గరికి వచ్చాడు.”
“అంటే, ఇది అక్షరాలా విద్వత్సంబంధమైన హత్య” అన్నాడు టిక్. “కాకపోతే, ఇక్కడ పిగ్మేలియన్ వ్యతిరేకదిశలో పని చేసింది.” నూతన సభ్యుడి వైపు ప్రశ్నిస్తున్నట్టు చూశాడు డా. టిక్.
“పిగ్మేలియన్ ఎఫెక్ట్ అన్నది ఒక మానసిక స్థితి. ఇందులో ఒక వ్యక్తి సమర్థత మీద అంచనాలు పెరుగుతున్న కొద్దీ అతని పనితనం కూడా పెరుగుతుంది అన్నది దాని వెనుక ఉన్న భావన.” వార్నర్ నుంచి జవాబు వచ్చింది.
వరిష్ఠ ఆచార్యుడు క్షణకాలం ఆగి, తన దృష్టి వార్నర్ మీద మరొకసారి నిలిపి, “కార్యక్రమం కొనసాగించడానికి ముందు మన క్లబ్ పూర్తి పేరు మీకు చెప్పవలసిన సమయం వచ్చిందని భావిస్తున్నాను: పూర్తి పేరు ‘ఎక్స్ మార్క్‌స్ ద స్పాట్ క్లబ్’. కానీ ‘ఎక్స్ క్లబ్’గా కుదించి, అలా అంటే కొంచెం నాజూకుగా ఉంటుందని ఆ పేరే ఇష్టపడుతున్నాం.”
“ఆహా” అన్నాడు కొత్త సభ్యుడు. అతని ముఖం జేవురించినట్టు కనిపిస్తోంది.
తన ముందున్న కార్యక్రమ వివరాల్లోకి చూస్తూ, “ఈ రాత్రికి మనం వినబోయే మొదటి కేసు డా. వెండెల్ డేవిస్‌ది” అని ప్రకటించాడు డా. టిక్.
ఉదరసంబంధ వ్యాధుల నిపుణుడు డేవిస్ లేచి నిలబడగానే అంతా నిశ్శబ్దం అయిపోయారు. డా. డేవిస్ తన వైద్యాన్ని ఎంత గంభీరంగా తీసుకుంటాడో, కనబడే తీరునీ అంతే గంభీరంగా తీసుకుంటాడు. మనిషి పొడగరి. బలిష్టమైన శరీరం. తల నెరిసినా, జుత్తు నీటుగా, దగ్గరగా కత్తిరించుకున్నాడు. పెద్ద గులాబిరంగు తెరలా ఉండే అతని ముఖంలో, ఏ భావాలూ తొంగిచూడవు. తన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా, తను ఎంత బాధపడుతున్నా, ఏ రోగీ అందులో ఏ విధమైన కలవరాన్నీ చూసి ఉండడు.
“గత వేసవిలో, ఒక కార్మికుడి ఇంటినుండి నాకు పిలుపు వచ్చింది” అంటూ ప్రారంభించేడు. “సెనేటర్ బెల్, తన నియోజకవర్గంలోని పేదసాదలకి వనభోజనం ఏర్పాటు చేశాడు. అందులో, హోరొవిడ్జ్ అన్న వ్యక్తి ముగ్గురు పిల్లలు కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలయ్యారు. ఆ వనభోజనంలో వాళ్ళు బాగా ఎక్కువగా తిన్నారు. పిల్లలు అనారోగ్యం పాలవడానికి సెనేటర్ బాధ్యత వహిస్తూ, నన్ను హోరొవిడ్జ్ ఇంటికి వెళ్ళమని కోరడంతో, నా కర్తవ్యంగా భావించి వెంటనే వెళ్ళాను. ఇద్దరు పిల్లలు ఎక్కువగా వాంతులు చేసుకుంటూ, బాగా నీరసించిపోయారు. వాళ్ళ వయసు తొమ్మిదీ, పదకొండూ. పిల్లల తల్లి వాళ్ళు వనభోజనంలో ఏ ఏ పదార్ధాలు తిన్నారో పూర్తి వివరాలు ఇచ్చింది. అవి వినగానే నాకు మతిపోయింది. వెంటనే ఇద్దరికీ తగినంతగా ఆముదం తాగడానికి ఇచ్చాను.
“మూడవ బిడ్డకి ఏడేళ్ళ వయసు. పై ఇద్దరంత అనారోగ్యంగా కనిపించలేదు. పాలిపోయి ఉన్నాడు. కొద్దిగా జ్వరం మాత్రం ఉంది. వొంట్లో వికారంగా ఉంది గాని వాంతులు మాత్రం అవడం లేదు. కనుక వాళ్ళంత ఎక్కువగా విషాహారానికి గురవలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకైనా మంచిదని, ముందు జాగ్రత్తకోసం ఆ కుర్రాడికి కూడా తగు మోతాదులో ఆముదం త్రాగడానికి ఇచ్చాను.
“సగం రాత్రివేళ కుర్రాడి తండ్రి నుండి నాకు పిలుపు వచ్చింది. తన ఏడేళ్ళ కుర్రాడి పరిస్థితి చూస్తే భయం వేస్తోందని, తక్కిన ఇద్దరూ కొంత మెరుగ్గా ఉన్నారనీ చెప్పాడు. దానికి నేను భయపడవలసిన అవసరం లేదని, కుర్రాడిలో విషాహారపు ప్రభావం ఆలస్యంగా మొదలైందని, తెల్లారే సరికి అతను కూడా మిగతా ఇద్దరు పిల్లల్లాగే మెరుగౌతాడనీ చెప్పి ఊరడించేను.
“ఫోను పెట్టేసిన తర్వాత, కుర్రాడి పరిస్థితి ఊహించి ముందు చూపుతో అతనికి ఆముదం పట్టమని నిర్దేశించినందుకు నన్ను నేను అభినందించుకున్నాను. మర్నాడు మధ్యాహ్నం వేళకి హోవిడ్జర్ ఇంటికి వెళ్ళే సరికి, మొదటి ఇద్దరు పిల్లలూ పూర్తిగా కోలుకుని హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ, ఆ ఏడేళ్ళ కుర్రాడు మరీ అనారోగ్యంగా కనిపించాడు. వాళ్ళు ఉదయం నుండి నాకోసం ప్రయత్నిస్తున్నారట. కుర్రాడికి 105 డిగ్రీల జ్వరం ఉంది. మనిషి బాగా వాడిపోయాడు. కళ్ళు లోతుకు పోయాయి, కనుపాపల చుట్టూ వలయాలు ఏర్పడ్డాయి. ముక్కుపుటాలు పొంగి, పెదాలు నీలంగా మారి, చెమటలు పట్టి శరీరం చల్లనవడం మొదలుపెట్టింది.”
డా. డేవిస్ ఒక్క క్షణం ఆగాడు. శ్వాసకోసవ్యాధుల నిపుణుడు డా. మిల్టన్ మారిస్ వెంటనే అందుకుని,”మరికొన్ని గంటల్లోనే చనిపోయాడు కదూ?” అని ముగించాడు.
డా. డేవిస్ ఔనన్నట్టు తల పంకించాడు. డా. మారిస్ తిరిగి అందుకుని, “ఏం జరిగిందన్నది స్పష్టం. మొదటిసారి మీరు చూసినప్పటికే ఆ కుర్రాడు తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతున్నాడు. మీరు తాగమని చెప్పిన ఆముదంతో అపెండిక్స్ చిట్లిపోయింది. మీరు రెండోసారి పరీక్షించే వేళకి పెరిటోనైటిస్ మొదలైంది” అన్నాడు.
“అవును” అని అంగీకరించాడు డా. మారిస్ నెమ్మదిగా. “జరిగింది సరిగ్గా అదే!”
“ఆముదంతో హత్య” అంటూ టిక్ కొరకొరగా నవ్వి, “పేదలపట్ల నిర్లక్ష్యం కూడా తోడయ్యింది” అన్నాడు.
“ఎంత మాత్రం కాదు” అని డా. డేవిస్ తన నిరసన ప్రకటించాడు. “ముగ్గురు పిల్లలూ వనభోజనంలో అతిగా భోజనం చేశారు. ఒకే రకమైన వ్యాధిలక్షణాలు కనబరచారు.”
“‘ఒకే రకమైనవి’ కాదు.” డా. హ్యూమ్.
“ఓహో, మూడో బిడ్డ సంగతి మనోవిశ్లేషణ చేసి గ్రహించి ఉండేవారన్నమాట!” నవ్వాడు డా. డేవిస్.
“కాదు, రోగి కడుపు నొప్పి, వొంట్లో వికారంగా ఉందని చెప్పినందుకు, ఏ నకిలీ వైద్యుడిలాగైనా, కనీసం అతని పొట్ట తణిఖీచేసి ఉండేవాడిని ముందు. దానితో, పొట్ట వాచి మెత్తగా ఉండడాన్ని స్వయంగా గ్రహించేవాడిని” అన్నాడు.
“ఆ మాట నిజం. ఏ వైద్య విద్యార్థి అయినా రోగాన్ని ఇట్టే పసిగట్టి ఉండేవాడు” అంటూ డా. కర్టిఫ్ అంగీకరించాడు. “కానీ, వైద్య విద్యార్థులు ప్రదర్శించేపాటి వినయాన్ని కూడా ప్రదర్శించలేనంతగా మనం ఎదిగిపోయాం.”
“డా. డేవిస్ చేసిన హత్య మనందరికీ కనువిప్పు. ఒక గుణపాఠం” అని డా. టిక్ ప్రకటించాడు. “కానీ, అది మరీ పేలవంగా ఉంది. ఇప్పుడు మాటాడటం డా. కెన్నెత్ ఉడ్ వంతు” అని వేదిక అతనికి ఇచ్చాడు.
స్కాట్లండ్ దేశస్థుడు, చదువుకునే రోజుల్లో ఒలింపిక్ క్రీడాకారుడిగా పేరుపడ్డ, శస్త్రవైద్యుడు డా. ఉడ్ లేచి నిలుచున్నాడు. పొడవైన అతని చేతులు, విశాలమైన భుజాలు, మగతనం ఉట్టిపడే మృదువైన కంఠస్వరం అతనిలో ఇప్పటికీ పోటీతత్వం తగ్గలేదని ఋజువు చేస్తున్నాయి.
“ఈ హత్యని ఏ పేరుతో పిలవాలో నాకు తెలియడం లేదు” అంటూ తన సహచరులని చూసి చిరునవ్వుతో ప్రారంభించాడు డా. ఉడ్.
“ఏ పేరూ లేకపోతే, కత్తి వాదరతో హత్య అన్నది సామాన్యంగా వాడే పదం” అన్నాడు టిక్.
“దానికి అంగీకరించను” అంటూ డా. మారిస్ తన నిరసన తెలిపాడు. “కెన్ నిపుణుడైన శస్త్రవైద్యుడు. పొరపాటున కూడా ఒకరి కాలు కొయ్యడు.”
“నా ఉద్దేశ్యంలో దీన్ని కేవలం తెలివితక్కువతనం వల్ల చేసిన హత్యగా చెప్పుకోవచ్చేమో” అన్నాడు డా. వుడ్ తాపీగా.
టిక్ గలగల నవ్వుతూ “షాట్‌పుట్ వేయడం మీద చూపించిన దానికంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ రోగనిర్ణయం మీద చూపించి ఉంటే ఇలా వందలకొద్దీ రోగులు చచ్చి ఉండేవారు కాదు” అన్నాడు.
“క్షమించాలి. గత మూడు సంవత్సరాల్లో నే చేసిన మొదటి హత్య ఇదే!” అన్నాడు డా. ఉడ్ వినయంగా.”శలవు రోజులతో కలుపుకుని నేను రోజుకి కనీసం నాలుగైదు శస్త్రచికిత్సలు చేస్తుంటాను.”
“డా. హ్యూమ్ అందుకున్నాడు. “డా. కెన్నెత్, ప్రతి శస్త్ర వైద్యుడికీ మూడేళ్ళకి ఒకటైనా హత్య చేసే హక్కు ఉంది. చంపడానికి ఉండే అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే, ఇది చాలా అభినందించ తగిన విషయం!”
“అసలు విషయానికి రావొచ్చు.” డా. టిక్.
కొత్త సభ్యుడు, ఆసుపత్రిలో తన సహచరుడూ అయిన శామ్యూల్ వంక చూసి, “శామ్, మీకు తెలుసు కదా ఈ గాల్ బ్లాడర్స్‌తో వచ్చిన తంటా” అన్నాడు డా. ఉడ్.
డా. వార్నర్ పరధ్యానంగా తల ఊపాడు.
డా. ఉడ్ కొనసాగిస్తూ, “నా దగ్గరికి ఆమెను అర్ధరాత్రి తీసుకుని వచ్చారు. బాధతో లుంగలు చుట్టుకుపోతోందామె. పరీక్షించాను. పొత్తికడుపుకి కుడిప్రక్క ఎగువ భాగాన నొప్పి ఉన్నట్టు తెలుస్తోంది. అది వెనక వీపువైపుకి, కుడి భుజానికీ వ్యాపిస్తోంది. గాల్ బ్లాడర్ వ్యాధి ప్రత్యేక లక్షణం అది. వెంటనే నిద్రమాత్రలు ఇచ్చాను. వాటి ప్రభావం కనిపించలేదు. మీకందరికీ తెలిసిందే. గాల్ బ్లాడర్ మీద నిద్రమాత్రలు పనిచెయ్యవు. అది కూడా నేను అనుమానించిన గాల్ బ్లాడర్ దోషాన్ని బలపరుస్తోంది.”
“ఆ విషయం అందరికీ విశదమే” అన్నాడు కొత్త సభ్యుడు నీరసంగా.
డా. ఉడ్ చిరునవ్వు నవ్వుతూ, “క్షమించాలి. నేను అన్ని విషయాలూ ఒక్కటొక్కటిగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఆ తర్వాత ఆమెకు నొప్పి తగ్గడానికి నైట్రోగ్లిసరిన్ ఇచ్చాను. ఆమెకు అప్పుడు 101 డిగ్రీల జ్వరం ఉంది. ఉదయం అయేసరికి, ఆమెకి నొప్పి ఎంత ఎక్కువైందంటే, నేను గాల్ బ్లాడర్ ఖచ్చితంగా పగిలి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చాను. వెంటనే ఆమెకి శస్త్రచికిత్స చేశాను. ఆమె గాల్ బ్లాడర్‌లో ఏ లోపమూ కనిపించలేదు. గంట తర్వాత ఆమె చనిపోయింది.”
“శవ పరీక్ష ఏమని చెబుతోంది?” అని అడిగాడు డా. స్వీనీ కుతూహలంతో.
“ఆ విషయం తర్వాత. మీరంతా ఏమి జరిగి ఉంటుందో ముందు కనిపెట్టాలి కదా? అవునా? ఇప్పుడు చెప్పండి. ఆమెకున్న అసలు సమస్య ఏమిటి?”
ఒక్క క్షణం ఆగి “ఆమె సమస్య గురించి ముందుగా ఏమైనా వివరాలు సేకరించారా?” అని అడిగాడు కర్టిఫ్.
“లేదు.” జవాబిచ్చాడు ఉడ్.
“ఆహా! అయితే, మరొకసారి గుడ్దివాడి చేతిలో రాయి తంతు అన్నమాట!” గుర్రుమన్నాడు టిక్.
జేవురించిన ముఖంతో డా. ఉడ్ “అది అత్యవసర పరిస్థితి. అలాంటివి నేను వందల కేసులు చూశాను. స్పష్టంగా గాల్ బ్లాడర్ లోపమని అని నాకు అనిపించింది” అన్నాడు.
“ఈ కేసు విషయంలో వాస్తవం ఏమిటంటే డా. ఉడ్ ఒక రోగిని ఆమె సమస్య ఏమిటో తప్పుగా నిర్ధారించడం వల్ల హత్య చేశాడు. మనముందు ఉన్న స్పష్టమైన సమస్య, గాల్ బ్లాడర్ కాకుండా, మన ప్రముఖ శస్త్రవైద్యుడు ఉదహరించినట్టు ఇటువంటి నొప్పికి ఇంకేది కారణమై ఉండొచ్చు?”
“గుండె” అన్నాడు మారిస్ వెంటనే.
“మీరు దారికి వస్తున్నారు” అన్నాడు ఉడ్ స్పందిస్తూ.
“రోగం గురించి పూర్వ చరిత్ర తెలియనపుడు, ఇటువంటి తీవ్రమైన నొప్పికి శస్త్ర చికిత్స చేయబోయే ముందు నేనయితే ఖచ్చితంగా గుండెని పరీక్షించి ఉండేవాడిని,” అన్నాడు డా. టిక్.
“అలా చేసి ఉంటే, మీరు సరియైన నిర్ణయం తీసుకున్నట్టే,” అన్నాడు డా. ఉడ్, ప్రశాంతంగా. “కుడి ధమని దిగువ శాఖలో లోపం ఉన్నట్టు శవపరీక్షలో తేలింది.”
“ఆ విషయం మీకు కార్డియోగ్రామ్ తీసినా ఇట్టే తెలిసేది” అన్నాడు టిక్. “అది కూడా అక్కరలేదు. మీరు ఒక్క ప్రశ్న అడిగినా సరిపోయేది. కనీసం, రోగి సమీపంలో ఉన్న ఎవరిని అడిగినా, రోగికి అంతకుముందు ఎప్పుడు నొప్పి వచ్చినా అది అలసట వల్ల తప్ప గాల్ బ్లాడర్ వల్ల కాదని తెలిసి ఉండేది. తెలివైనవాడి తెలివితక్కువతనం వల్ల జరిగిన హత్య!” అన్నాడు టిక్ కోపంతో.
“ఇదే మొదటిది, ఇదే చివరిదీ” అన్నాడు డా. ఉడ్ ప్రశాంతంగా. “నా ఆసుపత్రిలో ఇటువంటి గుండె సంబంధమైన వ్యాధిని పొరపాటుగా గాల్ బ్లాడర్ సమస్యగా గుర్తించడం ఇక మీదట జరగదు.”
“అలా అయితే మంచిది. మంచిది.” అన్నాడు టిక్. “మిత్రులారా, ఇప్పటి వరకూ మనం విన్న నేరాలు చర్చించడానికి కూడా పనికిరానంత అల్పమైనవి. వాటి వల్ల సైన్సూ- తెలివితక్కువదనం చెట్టపట్టాలేసుకుని నడుస్తాయని తప్ప మనం కొత్తగా తెలుసుకున్నది సున్నా. ఆ విషయం కొత్తగా తెలుసుకోవలసిన పనిలేదు. ఈ రోజు మన ముందు ఒక కొత్త సభ్యుడు ఉన్నాడు. కత్తిని అతి నేర్పుగా వాడే శస్త్రవైద్యుడిగా పేరు గణించాడు. అతను గంట సేపటి నుండీ నిజంగా నేరం చేసినవాడిలా అసహనంగా కదులుతూ, అపరాధభావంతో చెమటలు కక్కుతూ, మనందరికీ తన నేరాన్ని తెలియజెయ్యడానికి ఉత్సుకతతో ఇక్కడ కూర్చుని ఉన్నాడు. సభ్యులారా, యువ అపరాధి డా. శామ్ వార్నర్‌కి వేదిక అందిస్తున్నాను.”
డా. వార్నర్ తన పధ్నాలుగుమంది సహచరులవంకా చూడగానే అతనిలో ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. కళ్ళలో మెరుపు తొణికిసలాడింది. అప్పటివరకూ అతని ముఖంలో తొంగిచూసిన శ్రమ, దానివల్ల కలిగిన అలసటా పూర్తిగా మాయమయ్యాయి. వయసు ముదిరినవాళ్ళు అతనివంక నిర్లిప్తంగానూ, రకరకాల స్థాయిల్లో చిరాకుగానూ చూశారు. అతని వాలకం తప్ప ఏ ఇతర ఆధారాలూ లేకుండా, ఈ వైద్యుడి బుర్ర నిండా అంగీకారయోగ్యం కాని సిద్ధాంతాలు, పునాదిలేని వైద్య ఆవిష్కరణలూ ఉన్నాయని ఊహించుకున్నారు. ఒకప్పుడు వాళ్ళు కూడా అటువంటి సిద్ద్ధాంతాలు, ఆవిష్కరణలూ కలిగి ఉన్నవాళ్ళే. కనుక అతను చెప్పబోయేది విని ఆనందించడానికి తమ కుర్చీల్లో తీరుబాటుగా వెనక్కి వాలి కూచున్నారు. సాయంసంధ్యలో ఉన్న ఏ వైద్యుడికైనా కొత్తగా వృత్తిలోకి ప్రవేశించిన వాడిని ‘నువ్వొక తెలివితక్కువ దద్దమ్మవి’ అని నెత్తిమీద మొత్తడం కంటే ఆనందకరమైన విషయం ఏముంటుంది? చుట్టూ కూర్చున్న సహచరులను చూసి టిక్ ముసిముసినవ్వు నవ్వాడు. వాళ్ళ ముఖాల్లో, బెత్తం పట్టుకుని, చెయ్యి వెనక్కి దాచుకు నిలబడ్డ ఉపాధ్యాయుల తీరు కనిపిస్తోంది.
డా. వార్నర్ తన మెడను తడిరుమాలుతో తుడుచుకుని, వైద్యవృత్తిలో ఉన్నత శిఖరాలందుకున్న వాళ్ళవంక సాభిప్రాయంగా చూశాడు. “ఈ కేసు గురించి మీకు కొంత వివరంగా చెప్పాలి” అంటూ ప్రారంభించాడు. “కారణం, వృత్తిలో మనం తరచు ఎదుర్కొనే ఆసక్తికరమైన సమస్య ఇందులో ఉంది.”
గర్భశాస్త్ర నిపుణుడు డా. రాసన్ లోపల గుర్రుమన్నాడు గాని పైకి ఏమీ అనలేదు.
“రోగి యువకుడు. ఇంకా చెప్పాలంటే కుర్రాడే.” వార్నర్ ఉత్సుకతతో చెప్పడం ప్రారంభించాడు. “పదిహేడేళ్ళ ప్రాయం. ప్రతిభావంతుడు. కవిత్వం రాస్తాడు. ఆ కారణంగానే నాకు అతనితో పరిచయం ఏర్పడింది. ఒక పత్రికలో అతను రాసిన కవిత చదివి, అది నాకు బాగా నచ్చి, అతనికి ఉత్తరం రాశాను కూడా.”
“ప్రాసకవిత్వమా?” అని డా. ఉడ్ అడిగి, టిక్ వంక చూసి కన్ను గీటాడు.
“అవును” అన్నాడు వార్నర్. “అతని అన్ని వ్రాతప్రతులు చదివాను. ఒక రకంగా అవి విప్లవాత్మకమైన కవితలు. అతని కవిత్వం అంతా అన్యాయాన్ని – అన్ని రకాలైన అన్యాయాలనీ – ఎదిరిస్తూ ఎలుగెత్తిన గొంతు. చేదుగానూ, వేడిగానూ ఉంటుంది.”
“ఒక్క మాట” అంటూ డా. రాసన్ అడ్దు తగిలి, “కొత్త సభ్యుడికి ఈ సంస్థ లక్ష్యాలపట్ల తప్పుడు అభిప్రాయం ఉన్నట్టు కనిపిస్తోంది. మనది సాహిత్య సంస్థ కాదు, వార్నర్!” అన్నాడు.
“ముందుకి కొనసాగించే ముందు మరొక్క చిన్నమాట,” అన్నాడు డా. హ్యూమ్, “మీరు గొప్పలకి పోదలుచుకుంటే, శస్త్రవైద్యుల వార్షిక మహాసభలో ఆ పనికి పూనుకోవచ్చు” అన్నాడు.
“గౌరవనీయ సభ్యులారా, నేను స్వోత్కర్షకి పోదలుచుకోలేదని మీకు హామీ ఇస్తున్నాను. నేను హత్యోదంతానికే కట్టుబడి ఉంటానని కూడా హామీ ఇస్తున్నాను. అందులోనూ, అటువంటి హత్య మీరు కనీ వినీ ఉండరు!” బదులిచ్చాడు వార్నర్.
“ఇంకేం, మరీ మంచిది. వ్యాఖ్యల్ని తేలికగా తీసుకుని చెప్పదలుచుకున్నది మధ్యలో ఆపకుండా కొనసాగించండి” అన్నాడు డా. కర్టిఫ్.
“సరి సరి. నాకిప్పటికీ గుర్తే. డా. మారిస్ మొదటిసారి తన నేరాన్ని ఒప్పుకున్నప్పుడు ఒక క్వార్టర్ తాగించవలసి వచ్చింది అతని ఏడుపు ఆపించడానికి!” అంటూ డా. ఉడ్ గలగలా నవ్వాడు.
“మీకు ఆ భయం అక్కరలేదు. నేను అటువంటి పరిస్థితి తీసుకు రాను” అని హామీ ఇచ్చాడు డా. వార్నర్. “అసలు విషయానికి వస్తే, నాకు కబురుపెట్టడానికి రెండు వారాలు ముందునుండీ రోగి అస్వస్థతతో బాధ పడుతున్నాడు.”
“అతను మీకు స్నేహితుడన్నట్టున్నారు?” సందేహం వెలిబుచ్చాడు డా. డేవిస్.
“స్నేహితుడినే! కానీ, అతనికి డాక్టర్లంటే నమ్మకం లేదు” అని జవాబిచ్చాడు వార్నర్.
“ఓ, నమ్మకం లేదూ? తెలివైన వాడే!” అని గలగలమంటూ, చమత్కారంగా నవ్వాడు టిక్.
“నిజంగా తెలివైన వాడే, సందేహం లేదు. కానీ, అతనిని కలిసి, పరీక్షించి, పరిస్థితి గమనించిన తర్వాత బాగా కలవరపడ్డాను. వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్పించాను.”
“అంటే, బాగా డబ్బున్న కవి అన్నమాట!” అన్నాడు డా. స్వీనీ.
“కాదు. ఖర్చులు నేనే భరించాను. నేను ఎంత సమయం అతని దగ్గర గడపగలనో అంత సమయమూ అతని దగ్గర గడిపాను. పొట్టకి ఎడమ భాగాన విపరీతమైన నొప్పితో అతని అనారోగ్యం ప్రారంభం అయింది. అతను నాకు కబురు పెడదామనుకునేంతలో మూడో రోజుకి నొప్పి తగ్గిపోయింది. ఆరోగ్యం దానంతట అదే కుదుటపడిందని రోగి అనుకున్నాడు. కానీ రెండు రోజుల్లో రోగం తిరగబెట్టింది. ఈసారి జ్వరం కూడా వచ్చింది. దానితోపాటే విరోచనాలు మొదలయ్యాయి. అతను నాకు కబురుపెట్టేసరికి (మలంలో) చీమూ, రక్తమూ ఉన్నాయి. అమీబా గాని, రోగకారకాలయిన బాక్టీరియాగాని లేవు.
“రోగ నిర్ణయ పరీక్షలు జరిపించి, నివేదికలు చూసిన తర్వాత అతనికి పెద్దపేగులో వ్రణాలున్నట్టు, అల్సరేటివ్ కొలైటిస్ అని నిర్ధారించాను. నొప్పి ఎడమ భాగానికే పరిమితమవడం వల్ల అపెండిసైటిస్ అయే అవకాశం లేదు. రోగికి సల్ఫాగానిడిన్, లివర్ ఎక్స్‌ట్రాక్ట్ నిర్దేశించి, వాటితోపాటు ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని-ముఖ్యంగా పాలు- తీసుకోమని సలహా ఇచ్చాను. ఇలా చికిత్స ఇస్తూ, నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ రోగి పరిస్థితి దిగజారిపోయింది. పొత్తికడుపు వాచి, ఎడమ ఉదరదండిక స్నాయువు గట్టిబడి, రెండు వారాలకి రోగి చనిపోయాడు.”
“శవపరీక్షలో మీ రోగ నిర్ధారణ తప్పని తేలిందా?” అడిగాడు డా. ఉడ్.
“నేను శవపరీక్ష జరిపించలేదు” అన్నాడు వార్నర్. “కుర్రవాడి తల్లిదండ్రులకు నా మీద పూర్తి విశ్వాసం ఉంది, ఆ కుర్రాడికి ఉన్నట్టుగానే. ముగ్గురూ, నేను ఏం చేసినా అతని ప్రాణాన్ని రక్షించడానికే చేస్తున్నానని నమ్మారు” అన్నాడు.
“అలాంటప్పుడు మీ రోగ నిర్ధారణ తప్పని మీకు ఎలా తెలిసింది?” అని ప్రశ్నించాడు డా. హ్యూమ్.
“ఏముందీ, రోగి కోలుకోడానికి బదులు మరణించడమే. అతను చనిపోగానే, నా రోగనిర్ణయం తప్పని గ్రహించాను” అన్నాడు వార్నర్ అసహనంగా.
“సబబైన నిర్ణయం” అని సమర్థించాడు డా. స్వీనీ. “అర్థం లేని మందుల వాడకం నేరం చెయ్యలేదనడానికి ఋజువు కాదు.”
“బాగుంది. విశిష్ఠ సభ్యులారా, ప్రతిభావంతుడైన మన కొత్త సభ్యుడు, తన ఆప్తమిత్రుడు, ప్రముఖ కవీ అయిన వ్యక్తిని పొట్టనబెట్టుకున్నాడు. అతని మీద ఇపుడు నేరారోపణ చెయ్యడం మన కర్తవ్యం” అన్నాడు టిక్, బల్ల వెనక నుండి.
కానీ ఎవ్వరూ పెదవి మెదపలేదు. కంటికి ఎదురుగా కనిపించని వాటి గురించి, బయటకి వెల్లడిచెయ్యని సంక్లిష్ట సమస్యల గురించి, ఇదీ అని చెప్పలేని ప్రత్యేక అవగాహనశక్తి ఏదో డాక్టర్లకి ఉంటుంది. తక్కిన పధ్నాలుగుమంది డాక్టర్లూ వార్నర్ వంక చూస్తూ ఇక్కడ ఏదో నిగూఢమైన రహస్యం ఉందని అనుమానించారు. మాటాడటానికి అవకాశం వచ్చే వరకూ అతను చూపించిన ఉద్రిక్తత, ఇచ్చిన తర్వాత అతనిలో కలిగిన ఉత్సాహం, మాటలలో లీలగా కనిపిస్తున్న హాస్యధోరణి, మరణించిన కవి కథలో చెప్పని విషయం ఏదో దాగుందని వాళ్ళకి నమ్మకం కలిగింది. కనుక సమస్యని ప్రశాంతంగా ఎదుర్కోడానికి ప్రయత్నించారు.
“రోగి మరణించి ఎన్నాళ్ళయింది?” అని ప్రారంభించాడు డా. రాసన్.
“క్రిందటి బుధవారం” సమాధాన మిచ్చాడు వార్నర్. “ఏం, ఎందుకు?” అని తిరిగి ప్రశ్నించాడు.
దానిని పట్టించుకోకుండా, “ఏ ఆసుపత్రిలో?” అని అడిగాడు డేవిస్.
“సెయింట్ మైకల్.” సమాధానం చెప్పాడు వార్నర్.
“అతని తల్లిదండ్రులకి మీ మీద నమ్మకం ఉండేదని, ఇప్పటికీ ఉందనీ అన్నారు కదూ? అలాంటప్పుడు చిత్రంగా మీరు దేని గురించో ఎక్కువ ఆందోళనపడుతున్నట్టు కనిపిస్తోంది. పోలీసులు మీ మీద ఏదైనా దర్యాప్తు ప్రారంభించారా?” అని అడిగాడు డా. కర్టిఫ్.
“లేదు” బదులిచ్చాడు వార్నర్. “నేను చేసినది దోషరహితమైన హత్య. అటువంటి హత్య పోలీసులు ఇప్పటి వరకు వినికూడా ఉండరు. మృతుడు కూడా నా పట్ల పూర్తి కృతజ్ఞతాభావం కనబరిచాడు” అని చెప్పి గదిలోని అందరి వంకా చూసి చిరునవ్వుతో చూసి, “చివరికి మీరు కూడా నా రోగనిర్ణయం తప్పని ఋజువు చెయ్యలేరు” అన్నాడు.
ఆ మాటలోని తెంపరితనం కొందరికి గొప్ప కోపం తెప్పించింది.
“మీ రోగనిర్ణయం తప్పని ఋజువు చెయ్యడం పెద్ద కష్టమైన పని కాదు” అంటూ ప్రారంభించాడు డా. మారిస్.
“ఇక్కడ ఏదో మెలిక ఉంది” అన్నాడు ఉడ్ నెమ్మదిగా, చూపులతో వార్నర్‌ని నిశితంగా పరిశీలిస్తూ.
వెంటనే వార్నర్ అందుకుని, “ఉన్న మెలిక అంతా ఈ కేసులోని సంక్లిష్టతే. ఇప్పటి వరకూ మీరందరూ, ఈ రాత్రి నేను విన్న చిన్నపాటి, ప్రవర్తనా లోపాలనదగ్గ నేరాలు వినడానికే అలవాటుపడ్డారు.”
క్షణకాలం నిశ్శబ్దం రాజ్యం చేసింది.
డా. డేవిస్ ప్రసన్నమైన గొంతుతో అడిగాడు, “మీరు రోగికి విరోచనాలు ప్రారంభం అవడానికి ముందు కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చిందని అన్నారు. అవునా?” అని అడిగాడు.
“అవును” అన్నాడు వార్నర్.
“అటువంటప్పుడు…” అని ప్రశాంతంగా ఆలోచిస్తూనే కొనసాగించాడు డేవిస్. “లక్షణాలలో తాత్కాలికంగా కలిగిన ఉపశమనం, కొద్ది రోజుల్లోనే మళ్ళీ తిరగబెట్టడమూ చూస్తుంటే అవి పైకి అల్సర్లు లాగానే కనిపిస్తున్నాయి. ఒక్క విషయం ఇనహాయిస్తే” అన్నాడు.
“నేను అంగీకరించలేను” అన్నాడు డా. స్వీనీ, నెమ్మదిగా. “డా. వార్నర్ చేసిన రోగ నిర్ధారణ పెద్ద పొరపాటు. దానంత తెలివితక్కువది మరొకటి లేదు. అతను చెప్పిన లక్షణాలకీ అల్సరేటివ్ కొలైటిస్‌కీ ఏమీ సంబంధం లేదు.”
వార్నర్ ముఖం కోపంతో జేవురించింది. అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి. “మీ దూషణలని కాస్త సైన్సుతో సమర్థించి చెప్పగలరా?” అని అడిగాడు.
“తేలికగా చెప్పొచ్చు” అన్నాడు స్వీనీ ప్రశాంతంగానే. “మీరు ఉదహరించిన ఆలస్యంగా ప్రారంభమైన విరోచనాలు, జ్వరమూ నూటికి తొంభై తొమ్మిది శాతం సందర్భాలలో అల్సరేటివ్ కొలైటిస్‌ని త్రోసిపుచ్చుతున్నాయి. మీ రేమంటారు, డా. టిక్?” అని అడిగాడు టిక్ వంక చూస్తూ.
“అల్సర్లు కొట్టి పారెయ్యవచ్చు” అని సమాధానం చెప్పాడు టిక్, కళ్ళతో వార్నర్‌ని పరీక్షిస్తూనే.
“చివరిదశలో రోగికి పొట్ట ఉబ్బిందని మీరు చెప్పారు” అన్నాడు డా. డేవిస్. నెమ్మదిగా.
“ఆ మాట నిజం” అన్నాడు వార్నర్.
“ఈ కేసు పూర్వాపరాలన్నీ మీరు ఏదీ విడిచిపెట్టకుండా చెప్పేరనుకుంటే, ఒక వాస్తవం నాకు స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ కొనసాగించాడు డేవిస్. “పొట్ట ప్రాంతంలో కనిపించిన వాపు పెరిటోనైటిస్‌ని సూచిస్తోంది. శవపరీక్ష జరిపి ఉంటే చిన్నప్రేవులు ఒకదానిలో మరొకటి టెలిస్కోపులా దూరి గోడకట్టి ఉంటుందని ఋజువై ఉండేదని భావిస్తున్నాను.”
“నేను అలా అనుకోవడం లేదు,” అన్నాడు ప్రముఖ కేన్సర్ పరిశోధకుడు డా. విలియం జిన్నర్. అతను పొట్టిగా, పక్షిలా ఉంటాడు. అతను మాటాడితే అతి కష్టం మీద వినిపిస్తుంది. ఒక్కసారి గది అంతా నిశ్శబ్దం అయిపోయింది. అతని అభిప్రాయం వినడానికి అంతా సిద్ధంగా ఉన్నారు.
“డా. డేవిస్ విశదీకరించినట్టు చిన్నప్రేవుల్లో ఒకచోట ఎక్కడో రంధ్రం పడటంవల్ల ఒకదానిలో మరొకటి చొచ్చుకుపోయే అవకాశం లేదు. రోగి వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు. చిన్నప్రేవుల్లో కణితి లాంటిది ఉంటే తప్ప, ఆ వయసులో అలా జరిగే అవకాశాలు తక్కువ. చిన్నప్రేవుల్లో కణితి ఉంటే అతను ఇంతకాలం బ్రతికి ఉండేవాడు కాదు” అని అన్నాడు.
“అద్భుతం” అంటూ అభినందించాడు టిక్.
“నేను మొదట్లో ఆ అవకాశాన్ని అనుమానించినా, డా. జిన్నర్ చెప్పిన కారణంగానే దాన్ని తిరస్కరించాను” అన్నాడు డా. వార్నర్.
“పేగులు మెలికబడే అవకాశం సంగతి ఏమిటి?” అని సందేహంగా అడిగాడు డా. ఊడ్. “దాని వల్ల కూడా పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి.”
డా. రాసన్ వెంటనే “లేదు. చిన్నప్రేగులు మెలిక పడటం అంటే వ్రణం ఏర్పడి ఉండాలి. వ్రణం ఏర్పడితే మూడు రోజుల్లో రోగి మరణిస్తాడు. కానీ, వార్నర్ రెండు వారాలపాటు రోగికి సేవచేసినట్టు, దానికి ముందు రెండు వారాలబట్టి అనారోగ్యంగా ఉన్నట్టు చెప్పడాన్ని బట్టి కణితి, పేగులు మడతబడటం, ప్రేగులు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోవడం- ఈ మూడింటినీ పక్కనబెట్టొచ్చు” అన్నాడు.
డా. మారిస్ “మరొక విషయం- ఆంత్రం (అపెండిక్స్) ఎడమప్రక్కన ఉండటం కూడా కారణం కావొచ్చునేమో” అన్నాడు.
డా. ఉడ్ వెంటనే “ఆ అవకాశం కూడా లేదు. ఆంత్రం ఎడమవైపున ఉండి ఉంటే వార్నర్ చెప్పినట్టు నొప్పి అంత ఎక్కువగా రాదు” అంటు ఆ ప్రతిపాదనని త్రోసిపుచ్చాడు.
“ఇప్పటివరకు అందరూ అంగీకారానికి వచ్చిన విషయం – అల్సర్ మినహా వేరే కారణం వల్ల చిన్నప్రేవులకి కన్నం పడివుండే అవకాశం ఉందన్నది. ఆ ఆధారాన్ని కొనసాగిస్తూ మనం రోగనిర్ణయాన్ని కొనసాగిద్దాం” అని స్వీనీ ప్రతిపాదించాడు.
“రోగం తీసుకున్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అల్సరేటివ్ కొలైటిస్ అయే అవకాశం ఎంతమాత్రం లేదు. అలా రంధ్రం పడటానికి వేరే కారణం ఏదైనా ఉందేమో మనం అన్వేషించాలి” అన్నాడు డా. మారిస్.
టిక్ మాటాడుతూ, “దానికి అనుబంధంగా అసలు అలా రంధ్రం పడటానికి కారణం ఏమిటి అన్నది కూడా ఆలోచించాలి” అన్నాడు.
డా. వార్నర్ మరొకసారి తన ముఖాన్ని రుమాలుతో తుడుచుకున్నాడు. “నాకు వేరే వస్తువు వల్ల కన్నం పడివుండే అవకాశం ఉందన్న ఆలోచనే తట్టలేదు” అన్నాడు విచారంగా.
“మీకు ఆ ఆలోచన వచ్చి ఉండాల్సింది” అన్నాడు డా. కర్టిఫ్.
టిక్ కలుగజేసుకుంటూ “ఆగండి. ఆగండి. వాదనలు ప్రక్కతోవ పట్టనియ్యవద్దు. రంధ్రం పడటానికి కారణం ఏమై ఉంటుంది?”
“అతనికి పదిహేడేళ్ళు. కనుక పిన్నులు మింగే వయసు కాదు” అన్నాడు కర్టిఫ్.
“అతనికి పిన్నులంటే చపలత్వం ఉంటే తప్ప” అని చమత్కరించి, “వార్నర్, అతనికి జీవించాలన్న కోరిక ఉందా?” అంటూ వార్నర్‌ని అడిగాడు డా. హ్యూమ్.
“అతనికి జీవించాలని బలమైన కోరిక ఉంది, నాకు తెలిసినవాళ్ళందరికన్నా కూడా ఎక్కువగా!” బదులిచ్చాడు వార్నర్ అతన్ని తలుచుకుని బాధపడుతూ.
“కనుక మనం’ఆత్మహత్యా ప్రయత్నం’ అన్న అనుమానాన్ని ప్రక్కన పెట్టవచ్చు. మనం చిన్నప్రేవుల్లో పడిన రంధ్రం గురించి చర్చించాలి గాని, అంతశ్చేతనకు పడిన రంధ్రం గురించి కాదు” అన్నాడు కర్టిఫ్.
డా. ఉడ్ అందుకుని, “అది చికెన్ ఎముక కూడా అయే అవకాశం లేదు. ఎందుకంటే అది గొంతులోనే చిక్కుకుంటుంది. పొట్టదాకా వెళ్ళే అవకాశం లేదు” అన్నాడు.
“చూశారా, వార్నర్! సుమారుగా అసలు కారణం దాపుల్లోకి వచ్చేము. వాపు నెమ్మదిగా వ్యాపిస్తోందంటే, అంటురోగం కూడా క్రమంగా వ్యాపిస్తోందని. వ్యాధి తీసుకున్న సమయాన్ని బట్టి అది పుండు కాకుండా వేరే కారణం అయివుండాలి. అనుమానించిన రంధ్రాన్ని బట్టి అది దేన్నయినా తినడం వల్ల వచ్చి ఉండాలి. పిన్నులు, చికెన్ ఎముకలూ అవడానికి అవకాశం లేదు. చివరకి ఊహించడానికి మిగిలింది ఒకే ఒక్కటి” అన్నాడు టిక్.
అతని మాట నోట్లో ఉంటుండగానే, “చేప ఎముక”అంటూ గట్టిగా అరిచాడు డా. స్వీనీ.
“అదే అయి ఉండాలి” అన్నాడు టిక్.
రోగ నిర్ధారణ చేస్తూ వాళ్ళు చేసిన వాదన ప్రతివాదనలని వార్నర్ ఎంతో ఉద్విగ్నతతో విన్నాడు.
చివరగా టిక్ ఇలా తీర్పు వెలువరించాడు: “నా ఉద్దేశ్యంలో డా. వార్నర్ చేప ఎముక కారణంగా ఏర్పడ్డ పుండుగా గుర్తించి, శస్త్ర చికిత్స చేసి తియ్యడానికి బదులు అల్సరేటివ్ కొలైటిస్‌గా ఊహించి చికిత్స చేసి రోగిని చంపాడని ఏకగ్రీవంగా తీర్మానానికి వచ్చినట్టుగా భావిస్తున్నాను” అన్నాడు.
వార్నర్ అతిత్వరగా గదిలో మూలనున్న అరదాకా నడిచి, తన టోపీని, వేలాడదీసిన కోటునీ అందుకున్నాడు.
“ఎక్కడికి బయలుదేరారు?” అంటూ ఆతృతగా అడిగాడు డా. ఉడ్ అతన్ని గమనిస్తూ. “మన సమావేశం ఇంకా ఇప్పుడే మొదలైంది.”
వార్నర్ చిరునవ్వు నవ్వుతూ కోటు వేసుకుని, టోపీ పెట్టుకున్నాడు.
“నా దగ్గర అట్టే సమయం లేదు. మీ రోగనిర్ధారణకి మీ కందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడేదో చిన్న కిటుకు ఉందని మీరు అనుమానించినదానిలో నిజం ఉంది. అదేమిటంటే, నా రోగి ఇంకా బ్రతికే ఉన్నాడు. రెండు వారాలుగా అతనికి నేను అల్సరేటివ్ కోలైటిస్ అనుకుని చికిత్స చేస్తున్నాను. ఈ మధ్యాహ్నం నేను చేసిన రోగ నిర్ధారణ తప్పని గుర్తించాను. అంతే కాదు, అసలు కారణం ఏమిటో నేను వెంటనే కనుక్కోలేకపోతే ఇరవై నాలుగు గంటల్లో అతను మరణించనున్నాడని కూడా తెలుసు.”
అప్పుడే వార్నర్ ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. కళ్ళలో ఆనందం మెరుస్తోంది.
“పెద్దలు మీకందరికీ, మీ సలహాకి, రోగ నిర్ధారణకీ మరొక్కసారి నా ధన్యవాదాలు. నా రోగి ప్రాణాన్ని కాపాడటానికి అది ఎంతగానో సహకరిస్తుంది” అన్నాడు.
అరగంట గడిచిన తర్వాత, ఎక్స్-క్లబ్‌కు చెందిన సభ్యులందరూ సెయింట్ మైకల్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్‌లో వరుసగా నిలబడి ఉన్నారు. అంతకుముందు, వాల్టన్ హోటల్ గదిలో మెడికల్ హాలోవీన్ ఆడిన వాళ్ళకి భిన్నంగా కనిపిస్తున్నారు. రోగాన్ని ముఖాముఖీగా ఎదుర్కొంటున్నప్పుడు డాక్టర్లలో అనుకోకుండా కొన్ని మార్పులు వస్తాయి. సంక్షోభసమయంలోనే వాళ్ళు ముసలీ ముతకా అయినా, బాగా అలసి సొలసిపోయినా, లేని శక్తిని తెచ్చుకుంటారు. వాళ్ళ సందేహాలనీ సంకోచాలనీ అన్నీటినీ విడిచిపెట్టి, ధైర్యంగా విజేతలుగా మాత్రమే ఆపరేషన్ థియేటర్ లోకి అడుగుపెడతారు. జీవన్మరణ సమస్యని ఎదుర్కొన్న తర్వాత ఆ అలసిపోయిన, జేవురించిన ఆ కళ్ళలో గొప్పదనమే కాదు, సౌందర్యం కూడా కనిపిస్తుంది.
ఆపరేషను బల్లమీద అచేతన స్థితిలో ఒక నల్లజాతి కుర్రవాడు పడుక్కుని ఉన్నాడు. డా. వార్నర్ తగిన దుస్తులు ధరించి శస్త్రచికిత్సకి ఉపక్రమిస్తున్నాడు.
తక్కిన పధ్నాలుగుమంది సభ్యులూ డా. వార్నర్ చేస్తున్న శస్త్రచికిత్సని గమనిస్తున్నారు. అతని వేగానికి డా. ఉడ్ మెచ్చుకోలుగా తల ఊపాడు. రాసన్ ఏదో చెప్పడానికి గొంతు సవరించుకున్నాడు గాని, అతి నేర్పుగా, త్వరితంగా కదులుతున్న శస్త్రచికిత్సకుడి చేతులు వారించడంతో మౌనంగా ఉండిపోయాడు. ఎవ్వరూ మాటాడలేదు. నిముషాలు దొర్లిపోయాయి. నర్సు ప్రశాంతంగా చికిత్సకుడికి పరికరాలు అందిస్తోంది. చేతులనిండా రక్తం చిమ్మింది.
పద్నాలుగురు వైద్యులూ స్పృహలో లేని, చేప ఎముకను మింగిన, ఆ కుర్రవాడి ముఖాన్ని ఆశతో చిదిమి చూశారు. బహుశా, ఏ మహరాజు గాని, పోపు గాని, వైద్యవృత్తిలో ఉన్నతశిఖరాలందుకున్న అంతమంది మేధావులు తన చుట్టూ ఊపిరి బిగబట్టి నిలబడి చూస్తుండగా అనారోగ్యంతో పడుకొని ఉండడు!
చెమటలు కక్కుతున్న శస్త్రవైద్యుడు ఒక్కసారిగా తన చిమిటాతో దేనినో ఎత్తి చూపించాడు.
“దీనిని కడిగి తీసుకు వచ్చి, ఈ మాన్యులందరికీ చూపించు” అన్నాడు నర్సుతో.
పుళ్ళు పడిన రంధ్రం నుండి చీము పోడానికి మార్గాన్ని ఏర్పాటు చెయ్యడంలో వార్నర్ నిమగ్నమై ఉన్నాడు. తెరిచిన పొట్టలోకి అంటురోగాలు వ్యాపించకుండా సల్ఫానిలమైడ్ పొడిని చల్లాడు.
టిక్ ముందుకి వచ్చి, నర్సు చేతిలోంచి ఆ వస్తువును తీసుకున్నాడు. “ఇది చేప ఎముక!” అని ప్రకటించాడు.
అదొక వర్ణించనలవిగాని అపురూపమైన నిధిలా ఎక్స్-క్లబ్ సభ్యులందరూ దాని చుట్టూ చేరారు. టిక్ గలగలా నవ్వుతూ, “ఈ చిన్ని వస్తువు తొలగింపు, ఈ లోకంలోని పేరాశల్ని, దుర్మార్గాలనీ ఖండిస్తూ రోగి కవిత్వం రాయడానికి సహకరిస్తుంది” అని ప్రకటించాడు.
ఆ సంగతి, మూడు వారాల తర్వాత ఆ నల్ల కుర్రవాడు పూర్తిగా కోలుకోవడమూ హ్యూమ్ నాకు చెప్పిన కథ సారాంశం. మా డిన్నరు ఎప్పుడో పూర్తయింది. యుద్ధం వల్ల పలచబడిన న్యూయార్క్ నగర వీధుల్లోకి మేము అడుగు పెట్టేసరికి ఎప్పుడో అర్ధరాత్రి దాటింది. వార్తాస్థావరాల దగ్గర పతాక శీర్షికల అక్షరాల ప్రమాణాలలో మాత్రమే తేడా కనిపిస్తోంది. ఎవరు ఎంత ఎక్కువ మారణం చేస్తే అంత ఎక్కువ ప్రమాణంలో ఆ అక్షరాలు ఉన్నాయి. అంతే!
అటు చూస్తున్నప్పుడు యుద్ధకారణంగా నాలుగుప్రక్కలా మృత్యువు వెదజల్లిన విధ్వంసం కళ్ళముందు కనిపిస్తుంది. అంతలోనే, నాకు మరొక చిత్రం కూడా కళ్ళముందు కనిపించింది–భవిష్యత్తులో, మెరుగైన ప్రపంచాన్ని ఆశిస్తున్న చిత్రం అది: ఆసుపత్రి గదిలో, చేప ఎముకని తిన్న నల్లజాతి కుర్రవాడి ప్రాణాన్ని రక్షించడానికి మృత్యువుతో పోరాడుతున్న పదిహేనుమంది విఖ్యాత, వైద్యశిఖామణుల చిత్రం.
(మూలం: Miracle of the fifteen murderers, 1946.)