రాయని పద్యం

దూరమవుతున్న కొద్దీ
ఇల్లు గుర్తు కొస్తున్నట్టు
రాయని పద్యమేదో

పోయినసారిదే కడసారిదైనట్టు
రాయలేక పోతున్నదేదో

నా రెండవకూతురంటుంది
నేను మాత్రం
మీకు పద్యం కాలేకపోయానని
పుట్టినప్పుడు లేకున్న సంతోషంగాని
లేదా బాధ గాని
పెళ్ళీడప్పుడు ఆందోళన గాని
లేదా పెళ్ళయినాక ఆదుర్దా గాని
ఏదీ కూడా

అవును తల్లీ
వేధించి వేధించి
రూపు దిద్దుకున్న వాటికంటే
ఎంత బాధించినా
బయటకు రాలేకపోయిన
మంచి పద్యాలెన్నో ?
నువ్వు కాదనుకొన్నా సరే

నన్ను నేనుగా తెలుసుకునే
నీమీద పద్యం కూడా ఒకటి!

(రెండవ కూతురికి)