విశ్వమహిళా నవల: 7. మదామ్ దె స్టాఎల్

ఎక్కువమంది రచయిత్రుల నవలల్లో సృజనాత్మకత ఉంటుంది. నాటకీయత ఉంటుంది. జీవితాలు చాలావరకు మామూలుగా గడిచిపోతాయి. కానీ తన జీవితమే తన నవలలకు మించిన నాటకీయతను మూటగట్టుకున్న అరుదైన రచయిత్రి, నెపోలియన్‌ను సైతం భయపెట్టిన సంచలన రచయిత్రి, ఫ్రెంచి నవలాకారిణి ఆన్ లుయీ జెర్మేన్ దె స్టాఎల్ (Anne Louise Germaine de Staël). మదామ్ దె స్టాఎల్ అన్న పేరుతో ప్రసిద్ధికెక్కిన ఈ రచయిత్రి స్విట్జర్లండ్ లోని జెనీవాలో 1766 ఏప్రిల్ 22న జన్మించి, 1817లో పారిస్‌లో మరణించింది. 18వ శతాబ్ది యూరప్ మహిళల్లో ఒక సంచలనాన్ని సృష్టించిన వ్యక్తిగా నిలిచిపోయింది. పుట్టినిల్లు స్విట్జర్లండ్; మెట్టినిల్లు స్వీడన్. కర్మస్థలి ఫ్రాన్స్. జీవితంలో ఎదురైన అనేక ఆటుపోట్ల వల్ల ఫ్రాన్స్ నుంచి బహిష్కృతురాలై జర్మనీ, ఇటలీ, ఇంగ్లండ్, రష్యాలలో కొన్నేళ్ళు గడిపి, వెళ్ళిన ప్రతి చోటా గాఢముద్ర వేసిన అరుదైన మహిళ మదామ్ దె స్టాఎల్. ఒక మేధావిగా, రాజనీతిజ్ఞురాలిగా, రచయిత్రిగా పేరు పొందిన మదామ్ దె స్టాఎల్ వ్యక్తిత్వం, జీవితం ఆమె నవలలకు ఏ మాత్రం తీసిపోనంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉంటాయి. ‘Character is Destiny’ అన్న హెరాక్లిటస్ సూత్రానికి అసలు సిసలు ఉదాహరణ ఎవరైనా ఉంటే అది మదామ్ దె స్టాఎల్ మాత్రమే.

స్త్రీల సౌందర్యానికి చాలా ప్రాధాన్యమిచ్చే సమాజంలో, యుగంలో జన్మించిన జెర్మేన్ అందగత్తె కాదు. యుక్తవయస్సులో కూడా హుందాతనం, ఆకర్షణ తప్ప చెప్పుకోదగ్గ సౌందర్యం ఆమెకు లేదు. ఇక ముప్ఫయ్యేళ్ళు దాటేసరికి బాగా లావైపోయి, తన ఆకృతికి తగని దుస్తులతో ఎబ్బెట్టుగా కూడ ఉండేది. కానీ ఆమెకు పరిచయమైన పురుషుల్లో ముప్పాతికమంది ఆమెను ప్రేమించినవారే. కోంత్ దె నార్బోన్ (Comte de Narbonn), ఆన్రి-బెన్జమీన్ కాన్‌స్తాఁ దె రెబెక్ (Henri-Benjamin Constant de Rebecque), ఒక దశలో షార్ల్ మరీస్ దె తలిరాఁ (Charles Maurice de Talleyrand) ఆమెను ప్రేమించిన ప్రముఖుల్లో కొందరు. ఆఖరి రోజుల్లో తనకంటే 27 ఏళ్ళు చిన్నవాడైన ఆల్బేర్ దె రోకాను (Albert de Rocca) వివాహం కూడ చేసుకుంది దె స్టాఎల్.

ఇంతమంది ప్రేమతో పాటు ఎందరి గౌరవాన్నో ఆమె మూటకట్టుకుంది. కానీ ఆమెను అమితంగా ద్వేషించిన వ్యక్తి ఒకడున్నాడు. అతను సామాన్యుడు కాడు; ఫ్రెంచి తిరుగుబాటుకు, తత్ఫలితంగా ఏర్పడిన రిపబ్లిక్ పాలనకు సాక్షిగా నిలిచి, అన్నిరంగాల్లోనూ ఛిన్నాభిన్నమైన దేశాన్ని తిరిగి పునరుజ్జీవింపజేసి, ప్రపంచ చరిత్రలోనే ‘నియంత’ అనే పదానికి కొత్త అర్థాన్నిచ్చిన సంచలనాత్మక నాయకుడు నెపోలియన్ బోనపార్త్ (Napoleon Bonaparte). ‘ఈవిడను దేశం నుంచి తరిమేస్తే తప్ప నాకు మనశ్శాంతి లేదు’ అని నెపోలియన్ ఒక దశలో అనుకున్నాడంటే ఆమె వ్యక్తిత్వం ఎంత ప్రభావవంతమైందో అర్థమవుతుంది. అతను తప్ప తక్కిన ప్రముఖ పురుషులందరూ ఆమెను ప్రేమించినవారే; గౌరవించిన వారే.

‘ఈమె మాకు ప్రియమైన వ్యక్తి. ఈమె మీద ఈగవాలినా సహించం’ అని యావత్తు రష్యన్ల తరఫున ప్రకటించాడు అలెగ్జాండర్ పుష్కిన్; ‘ఈమె ఈ శతాబ్ది రచయిత్రి’ అన్నాడు ఆంగ్ల కవి బైరన్; తర్వాతి కాలంలో తోల్‌స్తోయ్, నార్వే రచయిత హెన్రిక్ ఇబ్సెన్, అమెరికన్ రచయిత హెన్రీ జేమ్స్ ఆమె అభిమానులుగా తమని తాము ప్రకటించుకున్నారు.

‘నాకానందం కలిగించేవి మూడు: ప్రణయం, పారిస్, అధికారం’ అని ప్రకటించింది దె స్టాఎల్ ఒక సందర్భంలో. ఈ మూడింటిని పొందే ప్రయత్నంలో ఆమె సాధించిన విజయాలు, ఎదుర్కొన్న అవాంతరాలు, పడిన వేదన ఆమె జీవితాన్ని నిర్వచించాయి. ఇవే ఆమె నవలల్లోనూ ప్రతిఫలించాయి.

ప్రణయం

దె స్టాఎల్ ప్రణయ జీవితానికి బీజం ఫ్రాయిడియన్ పరిభాషలో చెప్పాలంటే, ఎలెక్ట్రా కాంప్లెక్స్. 16వ లూయీకి ఆర్థికాధికారిగా అత్యున్నత పదవిలో, రాజుగారి సంపూర్ణ విశ్వాసాన్ని చూరగొని దేశంలోని ప్రభావవంతుల్లో తొలి వరసలో నిలిచే జాక్ నెకర్ (Jacques Necker) ఆమె తండ్రి. జెర్మేన్ తండ్రిని విపరీతంగా ఆరాధించేది. తన తండ్రి వంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునేది. చివరకు తనకంటే 17 ఏళ్ళు పెద్దవాడైన స్వీడన్ దేశీయుడు, ఫ్రాన్స్‌కు స్వీడన్ రాయబారి అయిన దె స్టాఎల్‌తో తన ఇష్టంతో ప్రమేయం లేకుండా వివాహం జరిగింది. 16వ లూయీ ఆంతరంగికుడైన ఆమె తండ్రి నెకర్, కూతురి వివాహం రాజకీయంగా తనకు లబ్ధి కలిగించేలా మలుచుకుని, అల్లుడికి పూర్తిస్థాయి రాయబారి పదవిని ఇప్పించేలా, దానికి బదులుగా ఫ్రాన్స్ లోని భూభాగం కొంత స్వీడన్‌కు ఒప్పగించేలా అంగీకారం కుదుర్చుకున్నాడు. స్వీడన్‌తో స్నేహం తమకూ అవసరమే కనక 16వ లూయీ భార్య, సుప్రసిద్ధ రాణి మరీ ఆఁట్వానెట్ (Marie Antoinette) దీనికి వత్తాసు పలికింది. అలా జెర్మేన్ ప్రమేయం లేకుండా రాచరికపుటెత్తులలో భాగంగా ఆమెకు వివాహమైంది. భర్తతో కలిసి వున్నది తక్కువే. వారికి ఒక బిడ్డ పుట్టి చనిపోవడం కూడా వారి మధ్య దూరానికి కారణమైంది. తర్వాత తన ప్రియుళ్ళ ద్వారా ఇద్దరు మగపిల్లల్ని, ఒక ఆడపిల్లని కనడం జరిగినా భర్త ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె కూడా విడిపోవాలనుకోలేదు. ఆయన మరణించేవరకూ కలిసే ఉన్నారు. కానీ ఆమె రాజకీయ జీవితంలో, సృజనాత్మక జీవితంలో భర్త సహాయం, ప్రేరణ ఏ మాత్రం లేవు. కానీ తనకు ఏ మాత్రం నచ్చని తన భర్తతో జీవితాన్ని గురించి ఆమె ఎంత గొప్పగా చెప్పిందో: ‘ఇతను నాకు ఎప్పటికీ బాధ కలిగించలేడు. ఎందుకంటే నాకు ఎప్పటికీ ఆనందం కలిగించలేడు కనక.’

జెర్మేన్‌ను ఆకర్షించగలిగిన పురుషుడు కేవలం అందగాడైతే సరిపోదు. తెలివైనవాడు, రాజకీయాలపట్ల అభిరుచి ఉన్నవాడు, ఫ్రాన్స్‌పై తనకున్నంత అభిమానం ఉన్నవాడు, రాజకీయ సిద్ధాంతాల్లో స్పష్టత, నిబద్ధత ఉన్నవాడు అయివుండాలి. ఆమె సన్నిహితంగా మెలిగిన పురుషుల్లో చివరివాడైన రోకా తప్ప తక్కిన స్నేహితులు, ప్రేమికులు అందరూ చారిత్రాత్మక వ్యక్తులే. ఎంతమంది అభిమానులున్నా, తను అందగత్తెను కాననే బాధ మాత్రం జర్మేన్‌కు ఉండేదిట. ఒక సందర్భంలో ఆమె ‘నాకు భగవంతుడు అందమైన ఆకృతిని ఇస్తానంటే నా తెలివితేటల్ని వదులుకుంటాను’ అని కూడ అన్నది. ఆ భగవంతుడు అలాంటి తెలివితక్కువ పని చేయనందువల్ల మనకు ఒక అద్భుతమైన మహిళ దక్కింది.

ఆమెను ప్రేమించినవాళ్ళందరూ ఆమె తెలివితేటలకి, సంభాషణా చాతుర్యానికి, వాదనాపటిమకే ప్రేమించారు. విలియమ్ పిట్ (అనంతర బ్రిటన్ ప్రధాని) ఆమెను ప్రేమించిన తొలి పురుషుడు. కానీ అతన్ని చేసుకుంటే తన తండ్రిని, ఫ్రాన్స్‌నీ వదిలివెళ్ళాల్సివస్తుందని జెర్మేన్ ఒప్పుకోలేదు. 18వ శతాబ్ది ఫ్రెంచి రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన షార్ల్ తలిరాఁ ఆమెకు సన్నిహితంగా వచ్చిన మరో ప్రముఖుడు. అతని స్నేహితుడైన నార్బోన్ మదామ్ దె స్టాఎల్ ప్రేమను చాలాకాలం పొందిన ప్రముఖుడు. ఆమెకు అతని ద్వారా కొడుకు, కూతురు జన్మించారు. 16వ లూయీ పాలనలోను, అనంతరం వచ్చిన ఫ్రెంచి విప్లవం లోను, నెపోలియన్ పాలనాకాలం లోనూ నార్బోన్ చురుకైన రాజకీయ పాత్ర నిర్వహించడం వెనక ప్రేరణ, సహకారం జెర్మేన్‌వే. అతని ప్రసంగాలు కొన్నింటిని ఆమె రాసేది కూడా. తను ముగ్గురు మగవాళ్ళను జీవితాంతం ప్రేమించినట్టు ఆమె చెప్పుకుంది: తన తండ్రి, తలిరాఁ, నార్బోన్. అనంతరకాలంలో ఆమెకు సన్నిహితంగా వచ్చిన ప్రముఖుడు, రాజనీతిజ్ఞుడు, రచయిత, ఆ యుగంలో ఆలోచనాపరులపై అత్యధిక ప్రభావం చూపిన వ్యాసకర్త బెన్జమిన్ కాన్‌స్తాఁ. వీళ్ళిద్దరి ప్రణయం చాలా ఆటుపోట్లనే ఎదుర్కొంది. తనకు మదామ్ దె స్టాఎల్ మీద ఉన్న ప్రేమను ప్రకటించుకునేందుకు కవిత్వం, నవల కూడ రాశాడు కాన్‌స్తాఁ. తన రచనలతో పోర్చుగల్‌, గ్రీస్, బెల్జియమ్, బ్రెజిల్ దేశాలలో విప్లవాలకు స్ఫూర్తినిచ్చిన ఈ మేధావి, మదామ్ దె స్టాఎల్‌ను తన చోదకశక్తిగా చెప్పుకోవడం ఆమె మేధ ఎంతలా అప్పటి పురుష మేధావులను ఆకర్షించిందో తెలుపుతుంది.

ఆమె చిట్టచివరి సుదీర్ఘ ప్రణయం తనకంటే బాగా చిన్నవాడైన రోకాతో. అనేక కారణాల వల్ల అతన్ని వివాహం చేసుకోలేక చాలాకాలం తమ కొడుకుని కూడ బయటి ప్రపంచానికి తెలీకుండా ఎవరిదగ్గరో ఉంచేసింది. చివరి దశలో అతన్ని వివాహం చేసుకుని, కొడుకును బహిరంగంగా ఆమోదించింది. ఆమె ప్రణయ జీవితం కేవలం ప్రణయ జీవితమైతే చెప్పుకోవాల్సిన పనిలేదు. తన రాజకీయాలతో అనుసంధానం చేసి, అప్పటి రాజకీయనాయకులకు ప్రేరణను కలిగిస్తూ, వారి ద్వారా చాణక్యుడి తరహాలో రహస్య చర్యలు చేపడుతూ (ఫ్రెంచి విప్లవకాలంలో 16వ లూయీ, మరీ ఆఁట్వానెట్‌లను తిరుగుబాటుదార్ల నుంచి రక్షించడం వంటివి) సామాజిక, రాజకీయ జీవితంలో తన కార్యక్రమాల నిర్వహణకు ఆ ప్రణయసంబంధాలను ఉపయోగించుకుంది. ఆమెను ప్రేమించిన వారందరిలోనూ ఒక సామాన్యలక్షణం – ఆమెతో ప్రణయానికి స్వస్తి చెప్పినా స్నేహాన్ని వీడకపోవడం; చివరి రోజులవరకూ ఆమెకు మద్దతుగా నిలవడం. అలా మనుషుల్ని తన పరిధిలోకి తీసుకురావడమే కాదు; శాశ్వతంగా నిలుపుకోగల ఆకర్షణ ఆమె ప్రత్యేకత.

అయితే ఆమెను ప్రేమించిన పురుషులు ఆమె కోరేంత ప్రేమ తాము ఇవ్వలేమని భావించేవారు. ఆమె ప్రణయజీవితంలో వైఫల్యాలకు ఆమెలోని ‘బైపోలార్ డిసార్డరే’ కారణమని (అప్పటికి అలాంటి మానసిక వ్యాధి ఉందని తెలీనప్పటికీ) ఇప్పటి విమర్శకుల అభిప్రాయం. హద్దులెరగని ఉత్సాహం, అతి సన్నిహితులతో కూడ అకస్మాత్తుగా వైరం ఏర్పడ్డం, నిరంతరం ఒక ఉన్మాదతీవ్రతతో పనిచేయడం ఆమె బైపోలార్ అన్న అనుమానం కలిగించాయి. ఆమె తన ఇంట్లో ‘కొలువు తీరి’ ఇచ్చిన రాజకీయ ఉపన్యాసాలకు పురప్రముఖుల నుంచి గొప్ప స్పందన లభించేది. ఈ ‘కొలువు తీరడం’ ఒక్క ఫ్రాన్స్ లోనే కాదు. ఇటలీ, జర్మనీ, ఇంగ్లండ్, రష్యా దేశాల్లో కూడ చేసేది. అందుకే గొప్ప రాజకీయవేత్తలు, రచయితలు, కవులు, రాజవంశీకులు ఆమెతో సత్సంబంధాలు పెట్టుకునేవారు. ఎన్నో రాజకీయ వ్యూహాలకు ఆమె ‘సభ’ల్లోనే అంకురార్పణ జరిగేది. ఒకరకంగా ఫ్రాన్స్ లోనే కాక, యూరప్ లోనే ఆమె ఒక రాజకీయ అనుసంధానకర్తగా స్థిరపడింది. ఆమె సమకాలికుల నానుడి: ‘ఇప్పుడు యూరప్‌ను శాసిస్తున్నవి మూడు శక్తులు: రష్యా, బ్రిటన్, మదామ్ దె స్టాఎల్.’

పారిస్ జీవితం – నెపోలియన్‌తో కలహం

ఫ్రెంచి రాజకీయాల్లో కీలకపాత్ర నిర్వహించి, తొలుత 16వ లూయీ విజయాలకు బాధ్యుడై, అనంతర కాలంలో తన అవివేకపు ఆర్థిక సలహాల ద్వారా క్రమంగా ఆ దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేసి, ప్రజాగ్రహానికి గురై పదవీచ్యుతుడైన తండ్రి నెకర్ వల్ల బాల్యం నుంచే జెర్మేన్ రాజకీయ జీవిగా మారింది. తండ్రి నెకర్ ఆర్థిక వ్యవహారాల్లో చేసిన మార్పులు సత్ఫలితాలనివ్వనందువల్ల మొదటిసారి 16వ లూయీ అతనికి సకుటుంబంగా దేశబహిష్కరణ విధించాడు. అందరూ కట్టగట్టుకుని అల్లుడి దేశమైన స్వీడన్‌కు వెళ్ళారు. కానీ నెకర్‌కున్న పరపతి వల్ల ఆయనకు మద్దతుగా చెలరేగిన అల్లర్లకు భయపడి, తిరిగి అతన్ని తీసుకువచ్చాడు లూయీ. ఇంత మంచి అవకాశాన్ని మళ్ళీ తన అహంకారపూరితమైన, అవివేకపు చర్యలతో వదులుకుని, పన్నులు విపరీతంగా పెంచి అందరి ఆగ్రహానికీ గురయ్యాడు నెకర్. ఇక శాశ్వతంగా తన పదవిని కోల్పోయాడు. ఆ సమయంలో దేశఖజానాకు తన తండ్రి అప్పుగా ఇచ్చిన రెండు మిలియన్ల లివర్లను తిరిగి తన అంత్యకాలం వరకూ పొందలేకపోయింది జెర్మేన్.

అలా స్వీడన్‌లో ఉన్నప్పుడు మొదలైంది ఆమె రాజకీయ జీవితం. అటు మితవాదులైన తలిరాఁ, నార్బోన్ వంటివారితోనూ, ఇటు రాచరిక వ్యవస్థను సమర్థించేవారితోనూ స్నేహం చేసింది. చర్చలు జరిపింది. ఫ్రెంచి విప్లవానికి ప్రేరణనిచ్చిన జ్యాఁ జాక్ రుసోను (Jean-Jacques Rousseau) సమర్థిస్తూ వ్యాసాలు కూడ రాసింది. ఫ్రెంచి తిరుగుబాటు వల్ల 1791లో ఏర్పడిన రాజ్యాంగం ప్రకారం తన ప్రియుడు నార్బోన్‌కు మంత్రి పదవిని ఇప్పించడంలో కూడ కృతకృత్యురాలైంది. ఆ తర్వాత రాజకుటుంబానికి భద్రత కరువై, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడినపుడు, వారి రక్షణకోసం చాలా వ్యూహాలు పన్నింది. చివరకి ఆమె ప్రాణాలకే ముప్పు వచ్చి, అటు రాజరికాన్ని వ్యతిరేకించేవారితోనూ, ఇటు రాచరిక కుటుంబం మిత్రులతోను ఉన్న స్నేహం వల్ల తప్పించుకుని స్విట్జర్లండ్ చేరుకుంది. ఫ్రాన్స్‌లో రాజ్యాంగబద్ధ రాచరికం (constitutional monarchy) ఉండాలని (ఇంగ్లండులోలా) ఆమె ఆశించింది. కానీ ఫ్రెంచి విప్లవం వల్ల ఏర్పడిన రిపబ్లిక్‌కు, రాచరిక వ్యవస్థకూ చుక్కెదురు కావడంతో ఆమె కోరిక ఫలించలేదు. చివరికి ఆమె కూడ రాచరిక కుటుంబసభ్యురాలిగా మాత్రమే పరిగణింపబడి తిరుగుబాటుదార్ల ఆగ్రహానికి గురైంది.

మదామ్ దె స్టాఎల్ రాచరిక పాలనలో మార్పు రావాలని, నియంతృత్వం పనికిరాదనీ తరచూ చెప్పడమే కాక, పుస్తకాలు, వ్యాసాలు కూడ ప్రచురించింది. కానీ తనలోని ద్వైదీభావం వల్ల, రాజభవనంలోని స్నేహితులను వదులుకోవడం ఇష్టం లేనందువల్ల రాచరికాన్ని సమూలంగా తిరస్కరించలేకపోయింది. 1793 నుంచి చాలా క్రియాశీలంగా ఫ్రెంచి రాజకీయాల్లో పాల్గొన్నా, ఆమె తటస్థంగా ఉండిపోవడం వల్ల అటు తిరుగుబాటుదార్లకు, ఇటు రాచరిక కుటుంబాలకూ ఆమె ‘పడని’ మనిషైంది.

రిపబ్లిక్ క్రమంగా విచ్ఛిన్నమై, ఫ్రెంచి రాజ్యానికి తిరిగి వైభవం తీసుకురావడంలో అత్యంత కీలకమైన పాత్ర వహించి, తనని తాను ఫస్ట్ కౌన్సిల్‌గా ప్రకటించుకున్న నెపోలియన్ అధికారం లోకి వచ్చిన తర్వాత కూడ ఆమె తన రాజకీయ భ్రమలను వదులుకోలేకపోయింది. ఫ్రాన్స్ సుఖసంతోషాలకు తనని తాను బాధ్యురాలిగా భావించుకున్న మదామ్ దె స్టాఎల్ నెపోలియన్‌కు కూడ రాజ్యాంగం విషయంలో సలహాలివ్వడానికి పూనుకుంది. అహంకారం, అధికారకాంక్ష మూర్తీభవించిన అతనికి స్విట్జర్లండ్‌పై దాడి చెయ్యవద్దని సలహా ఇచ్చి, అతని ఆగ్రహానికి గురైంది. 1797లో వీళ్ళిద్దరి మధ్య మొదలైన వైరం ఆమెను జీవితాంతం వెంటాడింది. పారిస్ అంటే ప్రాణం పెట్టే ఆమెను ఆ నగరానికి దూరంగా ఉంచడంలో నెపోలియన్ పూర్తిగా సఫలమయ్యాడు. అంతకుముందు ఆమెతో ఉన్న మేధావులందరూ నెపోలియన్‌కు వంత పాడ్డానికి ఎక్కువ సమయం పట్టలేదు. కానీ దేశానికి పునర్వైభవం తీసుకువచ్చి, యుద్ధవ్యూహాల్లో అసమానంగా నిలిచిన నెపోలియన్ ‘నియంత’లా మారాడని గ్రహించిన మదామ్ దె స్టాఎల్ అతన్ని క్షమించలేకపోయింది. ఎక్కడ అవకాశం వచ్చినా విమర్శించేది. కనక ఆమెను తన శత్రువుగా నెపోలియన్ పరిగణించడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. చివరికి గొప్ప మేధావి అయిన బెన్జమిన్ కాఁస్తాఁ చేసిన ప్రసంగాలు కూడ మదామ్ దె స్టాఎల్ అతనికి రాసిచ్చి వుంటుందన్నంతగా నెపోలియన్ ఆమెను అనుమానించాడు. ఇద్దరినీ దేశం నుంచి బహిష్కరించాడు. ‘ఆడవాళ్ళు కుట్లు, అల్లికలు చేసుకోవాలి. ఇలా రాజకీయ వ్యాసాలు రాయడమేమిటి?’ ‘ఆడదంటే ఇంట్లో కూర్చోవాలి. ఇలా మగాళ్ళ ముందు ఉపన్యాసాలివ్వడమేమిటి?’ లాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆగక జెర్మేన్‌ని ‘ఆ వేశ్య’ (that whore) అని కూడ తూలనాడాడు.

ఇంట గెలవకపోయినా రచ్చగెలిచి వచ్చింది మదామ్ దె స్టాఎల్. నెపోలియన్ పుణ్యమాని ఫ్రాన్స్‌కు దూరమైనపుడు ఏ దేశం వెళ్ళినా తన రాజకీయ అభిప్రాయాలతో, రచనలతో, ప్రసంగాలతో ఆకట్టుకుంది. జర్మనీలో గయ్‌థ, షిల్లర్ వంటివారు; ఇంగ్లండులో బైరన్, కాలరిడ్జ్, బ్లేక్ వంటివారు; రష్యాలో తోల్‌స్తోయ్, పుష్కిన్ వంటివారు ఆమె తెలివితేటలకు, మాటలు ముగ్ధులయ్యారు. అయితే పారిస్‌పై మదామ్‌కున్న ప్రేమ ఎలాంటిదంటే కేవలం దానికోసం నెపోలియన్‌తో సంధి చేసుకోడానికి కూడ ప్రయత్నించింది. నెపోలియన్‌కు మిత్రుల ద్వారా రాయబారాలు పంపింది. ఉత్తరాలు రాసింది. తనకు నెపోలియన్‌పై ద్వేషం లేదని బతిమిలాడుకుంది. అయినా నెపోలియన్ కరగలేదు ఎందుకంటే తన పుస్తకాల్లోని కొన్ని పేరాలు తీసేయమన్న షరతును ఆమె అంగీకరించనందువల్ల. ఫ్రాన్స్ తన దేశం కనక, దాని ప్రభువు కనక నెపోలియన్‌కు విధేయంగా ఉంటాను కానీ రచయిత్రిగా నా రాతల విషయంలో రాజీ పడనంది. కేవలం తన రచనల వల్లే నెపోలియన్ ఆమెను క్షమించలేకపోయాడు. ఆమె రచనల గురించి ఎప్పటికప్పుడు వాకబు చేయడం, వాటిని చదివించుకుని వినడం, తనకు వ్యతిరేకమైన అంశాలు వచ్చిన వెంటనే ‘చింపి పడేయమని’ ఆదేశించడం అతనికి నిత్యకృత్యమైంది. కానీ ‘ప్రభువు’కు ఆగ్రహం కలిగించిన ఆమె రచనలన్నీ ప్రజల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. ఆమెపై నెపోలియన్ ఆగ్రహానికి ఈ ప్రజాదరణే ముఖ్యకారణం. నెపోలియన్‌ను ఆమె రాతల్లో అన్నిటికంటే కలవరపెట్టిన విషయాలు, ఇష్టంలేని సంసారాలు చేసేకంటే స్త్రీలు విడాకులు పొందడం మేలని చెప్పడం; ప్రొటెస్టెంట్ మతం, కేథలిక్ మతం కంటే ఉదాత్తమైందని భావించడం; తనని ఉద్దేశించి ధ్వన్యాత్మకంగా ‘కరడుగట్టిన నియంత’ అని వ్యాఖ్యానించడం, వంటివి. అందుకే ఆమె రచనల్ని బహిష్కరించాలని నెపోలియన్ ప్రయత్నించాడు. కన్సిడరేషన్స్ అన్న తన రచనలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలే ఆమెను ప్రజల్లో మేధావిగా నిలబెట్టాయి; నెపోలియన్‌లో ఆగ్రహజ్వాలలు రేకెత్తించాయి.

మదామ్ దె స్టాఎల్ ఆలోచనల్లోని ప్రత్యేకత ఏమిటి? అంటే ఆమె రాజరిక వ్యవస్థలో భాగస్వామిగా పుట్టింది. ఫ్రెంచి తిరుగుబాటులోని అనేక నినాదాలతో ఏకీభవించింది. కానీ అటు రాచరిక వ్యవస్థలోను, ఇటు విప్లవంలోనూ ఉన్న పరిమితులను వాళ్ళ ముఖం మీదే చెప్పేసేది. 1789 ఫ్రెంచి విప్లవం గురించి ఆమె వ్యాఖ్యానిస్తూ ‘విప్లవం వచ్చిన నాటి నుంచీ ఆడవాళ్ళ స్థాయి మరింత దిగజారింది. స్త్రీలు బుద్ధిజీవులైతే ప్రణయానికి పనికిరారు మన సమాజంలో. ఈ విప్లవం స్త్రీలను రెండో శ్రేణి పౌరులుగానే ఉంచేసింది’ అని అన్నది. ఆడవాళ్ళకు ఆవిడ ఒక సలహా కూడ ఇచ్చింది: ‘మీ తెలివితేటలను మగవాళ్ళ ముందు ఎక్కువగా బయటపెట్టకండి. వాళ్ళు భరించలేరు. వాళ్ళతో పోటీ పడడానికి కూడ ప్రయత్నించకండి.’ నిజానికి ఆమె తన తెలివితేటల్ని ఎప్పుడూ దాచుకుంది లేదు. కానీ తను ప్రేమించిన పురుషులకు పెద్ద పదవులు రావడానికి సాయపడిందే తప్ప తను ఏ పదవినీ ఆశించలేదు.

తులనాత్మక సాహిత్యం అనే భావన ఇంకా యూరప్‌లో రూపు దిద్దుకోకముందే యూరోపియన్ భాషాసాహిత్యాలను తులనాత్మకంగా విశ్లేషిస్తూ దె ల లిటెరచూర్ అనే గ్రంథం రాసింది దె స్టాఎల్. తన ప్రవాస జీవితంలో భాగంగా అనేక దేశాలు సందర్శించడం వల్ల అక్కడి సాహిత్యంతో ఏర్పడిన పరిచయాన్ని ఒక గొప్ప గ్రంథంగా మలిచింది. ఇందులో ‘ఉత్తమసాహిత్యం చదివినవాళ్ళు గొప్ప పాలకులు, గొప్ప వ్యక్తులు అవుతారని, స్వేచ్ఛ అంటే భిన్నదృక్పథాలు గలవాళ్ళను సమానంగా గౌరవించడ’మని ఆమె చేసిన వ్యాఖ్యలు తననుద్దేశించినవేనని నెపోలియన్ ఉడుక్కున్నాడు. ఎందుకంటే అతనికి తన జాత్యహంకారమే తప్ప, అన్యజాతులు, దృక్పథాలను గౌరవించడమనే మాటే లేదు కనక. అందుకే ఆమె నవల డెల్ఫీన్‍ ని, సాహిత్యంపై ఆమె రాసిన గ్రంథాన్ని ప్రచురించకుండా ఆపేయాలని చాలా ప్రయత్నించాడు. ఆమెను అంతకంటే ఎక్కువగా అతను శిక్షించలేకపోవడానికి కారణం, స్వయంగా అతని దగ్గర పనిచేసేవాళ్ళలోనే ఆమె అభిమానులు, మిత్రులు ఉండడం.

నెపోలియన్‌తో తన వైరాన్ని గురించి ఒక స్నేహితురాలికి ఇలా రాసింది: I shall defy his fury. మరో లేఖలో: He fears me. That is what makes my joy and pride but at the same time terrifies me. రచయితలందరికీ ఆదర్శప్రాయమైన మాట ఒక చోట అంది: What matters in the nature of character is not whether one holds this or that opinion. What matters is how proudly one upholds it.

నెపోలియన్ విషయంలో ఆమె ద్వైదీభావం బ్రిటిష్ సేనల చేతిలో అతను ఓడిపోయాక బయటపడింది. ఆ సమయంలో ఆమె ఇంగ్లండ్ లోనే ఉంది. నెపోలియన్ గెలవాలి, కాని యుద్ధంలో మరణించాలి–ఇదీ ఆమె కోరిక. తన దేశం ఓడిపోకూడదు ఎన్నటికీ. కానీ దేశ విజయానికి కారకుడైన నెపోలియన్ మాత్రం మరణించాలి!

వీరిద్దరి ‘అనుబంధం’లో కొసమెరుపు: నెపోలియన్ ఎల్బా ద్వీపంలో ఉన్నపుడు అతన్ని హత్యకు కుట్ర జరుగుతున్నట్టు దె స్టాఎల్‌కు కబురందింది. వెంటనే ఆమె అతని సోదరుడికి ఈ విషయం చెప్పి నెపోలియన్‌కు అది అందేలా చర్యలు తీసుకుంది. నెపోలియన్ మదామ్ దె స్టాఎల్‌కు ‘కృతజ్ఞుడిని’ అని సందేశం పంపాడు! కానీ తిరిగి వచ్చాక చేసిన పాలనలో ఇద్దరి మధ్యా ఏ రాజీ కుదరలేదు. మొత్తం మీద, బ్రటిష్ సేనలతో నెపోలియన్ తుది యుద్ధం (వాటర్‌లూ) తర్వాతే ఆమెకు తిరిగి తన ప్రియమైన పారిస్‌కు వెళ్ళే అవకాశం వచ్చింది. దాదాపు పదేళ్ళపాటు నెపోలియన్ పుణ్యమాని తన ప్రియమైన ఫ్రాన్స్‌కు దూరంగా జీవించాల్సి వచ్చింది. నెపోలియన్ పదవీచ్యుతుడై, మళ్ళీ రాచరికం ఏర్పడి, 18వ లూయీ అధికారపీఠం ఎక్కినప్పుడు కూడ ఊరుకోలేదు దె స్టాఎల్. తన మితవాద రాజకీయ సిద్ధాంతాలను అతనికి నేర్పడం మొదలుపెట్టింది. ‘రాచరికపాలన సరే. కానీ ఫ్రెంచి విప్లవాన్ని గౌరవించాలి; రాజ్యాంగాన్ని ఏర్పరచి, దానికి అనుగుణంగా పరిపాలించాలి’ అని అతనికి హితబోధ చేసింది. చివరి రోజుల్లో ఆమె రాసిన రచన ఫ్రెంచ్ తిరుగుబాటు: ముఖ్యఘటనల పరిశీలన (Considérations sur les principaux événements de la révolution française).

ఫ్రెంచి విప్లవంలోని ఎన్నో ఆలోచనలను సమర్థించడమే కాక, తర్వాతి తరాలకు కూడ పనికివచ్చే ప్రగతిశీలకమైన భావాలతో ఆమె చేసిన ఈ రచన, ఆమె మరణానంతరం ప్రసిద్ధి పొందింది. నెపోలియన్ వంటి నియంతలు ఈ సమాజానికి అవసరం లేదని, ఉదారవాదులు అవసరమనీ ఆమె ఈ పుస్తకంలో చేసిన వాదనలు, అనంతరకాలంలో ఫ్రెంచి మేధావులకు ఆకరగ్రంథమైంది. మొట్టమొదటి విప్లవచరిత్ర విశ్లేషణగా (Revolutionary Historiography) మేధావులు దీన్ని అభివర్ణించారు. 1817లో మరణశయ్య మీద ఆమె ‘నేను నా జీవితమంతా నా తండ్రిని, ఈ దేశాన్ని, స్వాతంత్ర్యాన్ని ప్రేమించాను!’ అని ప్రకటించింది. ఆమె మరణానంతరం ఆమె రాసిన రాజకీయ సైద్ధాంతిక గ్రంథాలు మరికొన్ని ప్రచురింపబడి మరింత సంచలనం సృష్టించాయి.

(మదామ్ దె స్టాఎల్ రాసిన నవల గురించి వచ్చే సంచికలో)


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...