విశ్వమహిళానవల 24: ఆలివ్ ష్రైనర్

దక్షిణాఫ్రికాను తలుచుకుంటే మనకు గుర్తుకొచ్చే పేర్లు నెల్సన్ మండేలా. క్రికెట్ అభిమానులకు లాన్స్ గిబ్స్, గేరీ క్రిస్బన్‍లు, అన్నిరకాల విదేశీయులకు వజ్రాల గనులు. భారతీయులకైతే వీటన్నిటికీ అదనంగా జాతిపిత గాంధీ అనుభవాలు.

అయితే సాహిత్యం దృష్ట్యా చూసినపుడు, దక్షిణాఫ్రికా రచయితల గురించి తెలిసింది తక్కువే. ఇక మహిళా రచయితల గురించి చెప్పనే అక్కర్లేదు. ఎక్కువమందికి తెలిసిన ఏకైక రచయిత్రి, నోబెల్ బహుమతి అందుకున్న నడీన్ గోర్డిమర్ (Nadine Gordimer) మాత్రమే. ఈ నేపథ్యంలో దక్షణాఫ్రికా రచయిత్రుల్లో తొలి దశ ఫెమినిజానికి ప్రతినిధిగా పరిగణింపబడే 19వ శతాబ్దపు రచయిత్రి ఆలివ్ ష్రైనర్ గురించి తెలుసుకోవడం అవసరం. ఆసక్తికరం. అయితే దానికంటే ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఈ రచయిత్రి మన గాంధీజీని కలుసుకుందని, ఆయన అభిప్రాయాలను గౌరవించిందనీ చదివినపుడు కలిగే ఉత్సాహం వేరు.

నడీన్ గోర్డిమర్ కంటే చాలా ముందే దక్షిణాఫ్రికాలో తెల్ల, నల్ల జాతుల గురించి వ్యాసాలను, అక్కడి స్త్రీల జీవితాల గురించి ఒక నవలనూ రచించిన 19వ శతాబ్ది రచయిత్రి ఆలివ్ ఎమిలీ ఆర్బర్టీనా ష్రైనర్ (Olive Emily Albertina Schreiner) ఎక్కువమంది పరిశోధకులకు కూడా అపరిచితురాలే. 1855లో జన్మించి, 1920లో మరణించిన ఆలివ్ జీవితకాలంలో ఒకటే నవలను ప్రచురించింది. ఆమె మరణానంతరం, భర్త, ఆమె రెండో నవలను ప్రచురించాడు. ఇవి కాక, ఆమె రాజకీయ వ్యాసాలు, సామాజిక విషయాలపై రచనలు అనేకం చేసిందని తెలుస్తోంది కానీ అందులో కొన్ని ప్రచురింపబడలేదు; కొన్ని లభించడంలేదు. అయితే ఆమె తన స్నేహితులకు రాసిన లేఖలు లభించడం గొప్ప వరమనే చెప్పాలి. ఆ లేఖల్లో గాంధీ ప్రస్తావన విరివిగా ఉండడం ఆశ్చర్యం. అది తెలుసుకునే ముందు స్థూలంగా ఆమె జీవితం.

జీవితం

పన్నెండుమంది సంతానంలో 9వ బిడ్డగా మార్చి 24, 1855లో పుట్టిన ఆలివ్‌కు అంత పొడుగాటి పేరుండడానికి కారణం, తనకు ముందు పుట్టి మరణించిన ముగ్గురు మగపిల్లల పేర్లను తల్లిదండ్రులు ఆమె పేరులో ఇరికించడం! ఆలివర్, ఆల్బర్ట్, ఎమిల్ అన్న తమ కొడుకులు అకాలమరణం పాలవడంతో తల్లిదండ్రులు ఆమెకు ఆలివ్ ఎమిలీ ఆర్బర్టీనా ష్రైనర్ అనే పేరు స్థిరపరిచారు. బాల్యంలో పేదరికం ఆ కుటుంబాన్ని పీడించింది. తండ్రి నెమ్మదైనవాడు, మంచివాడు అయినా సంపాదించడం చేతకానివాడు. తల్లి ఆడపిల్లల్ని చదివించాలని పట్టుబట్టకపోతే ఆలివ్ తెలివితేటలకు పదును లభించేది కాదు. తండ్రి మిషనరీ స్కూల్లో పనిచేసినా, అక్కడి నియమాలకు కట్టుబడకపోవడం వల్ల ఉద్వాసనకు గురై, స్వంత వ్యాపారం పెట్టి అక్కడ కూడ విఫలమై, దారిద్ర్యంలోనే కుటుంబాన్ని ఉంచేశాడు. దీనికితోడు ఆలివ్‌కు తొమ్మిదేళ్ళ వయసులో 18 నెలల చెల్లి ఎమిలీ మరణించడం చాలా పెద్ద విఘాతంగా అనిపించింది. చెల్లెలి మృతదేహాన్ని కావలించుకుని కొన్ని గంటలు ఉండిపోయిన ఆలివ్, ఆ విషాదం నుంచి జీవితాంతం కోలుకోలేకపోయానని తన రెండో నవల ముందుమాటలో చెప్పుకుంది. ఈ మరణం ఆమెను దేవుణ్ణి, మతాన్ని ప్రశ్నించేలా చేసింది. తల్లిదండ్రులు, సోదరులు అందరూ దైవభక్తి మెండుగా ఉన్నవాళ్ళే. ఆలివ్ మాత్రం దైవశక్తిని ప్రశ్నించడం మొదలుపెట్టింది. అన్నగారు హెడ్‌మాస్టర్‌గా ఉన్న స్కూల్లో మొదట చదువుకుంది. ఆ రోజుల్లో తల్లిదండ్రులతో క్రైస్తవం గురించి వాదించేది. కరడుగట్టిన క్రైస్తవులైన ఆమె కుటుంబసభ్యులు ఆమె వాదనలతో విసిగిపోయేవారు. చిన్నప్పటి నుంచి కొంత విప్లవకారిణిగానే ఇంటా బయటా పేరు తెచ్చుకుంది.

ఆలివ్ తన జీవితంలో మొదటి పాతికేళ్ళూ దక్షిణాఫ్రికాలోనే గడిపినా తర్వాత ఇంగ్లండు వెళ్ళి చదువు కొనసాగించింది. తన అన్నలు వజ్రాల వ్యాపారంలోకి దిగి నష్టపోతూండగా, ఆమె మాత్రం గవర్నెస్‌గా చాలా చోట్ల పనిచేసింది. అయితే ఇక్కడ కూడ ప్రతి ఇంట్లోనూ ఆమె క్రైస్తవ మతంపై తన అభిప్రాయాలు ప్రకటించడంతో ఎక్కడా ఎక్కువ కాలం నిలవలేదు. గవర్నెస్‌గా ఆమె పనితనంపై అభ్యంతరాలు లేకపోయినా, మతం పట్ల ఆమె వైఖరి ఉద్యోగాలు కోల్పోయేలా చేసింది. ఇంగ్లండులో తొలి విడతలో గడిపిన ఏడేళ్ళలో ఆమెకు హేవ్‌లాక్ ఎలిస్‌తో (ప్రముఖ మనోవిజ్ఞానవేత్త) పరిచయమై, శాస్త్రీయదృష్టి అలవడింది. తిరిగి తన దేశానికి వెళ్ళినా, అక్కడ ఇమడలేక, మళ్ళీ ఇంగ్లండుకే వచ్చింది. తన అనుభవంలో ఎదురైన స్త్రీల ఇక్కట్లు, మహిళల వోటు హక్కుకోసం జరుగుతున్న పోరాటాలు ఆమెను కలవరపరిచాయి. స్త్రీలకు మాత్రమే వర్తించే లైంగిక నైతికత గురించి, స్త్రీల రాజకీయహక్కుల గురించి ఆలోచించడం, బహిరంగంగా మాట్లాడడం, రాయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తన అభిప్రాయాలను పంచుకునే సైమన్ థార్న్‌వెల్ ష్రైనర్‌ని వివాహం చేసుకుంది. వారికి జన్మించిన పాప కేవలం ఒక్క రోజు బతికి మరణించడం ఆమెను తీవ్రమైన దుఃఖంలోకి నెట్టింది. చివరి రోజుల్లో తిరిగి స్వదేశానికి వచ్చి నిద్రలోనే మరణించింది. ఆమె మరణానంతరం భర్త, ఆమె సగం రాసి వదిలేసిన రెండో నవలను ఆమె నోట్సుల ఆధారంగా పూర్తిచేసి ప్రచురించాడు. ఈ నవలే తనకిష్టమైనదని ఆమె చెప్పుకున్నా, పూర్తయిన రచన నిజంగా ఆమె ఉద్దేశించిందేనా, లేక భర్తో, సంపాదకుడో మరోరకంగా పూర్తి చేశారా అన్న అనుమానం విమర్శకులకు ఉండిపోయింది. హర్బర్ట్ స్పెన్సర్ (Herbert Spencer), హేవ్‌లాక్ ఎలిస్ (Havelock Ellis) వంటి వారి రచనలతో ప్రభావితం కావడంతో పాటు ఇంగ్లండులో ఉన్నపుడు ఆమె ఎందరో ప్రముఖ రచయితలను, మేధావులను కలుసుకునేది. భర్త లేనపుడు ఆమె ఇంటికి పురుషులు తరచు రావడం చూసి ఒక దశలో ఆమె ఇంటి యజమాని ఆమెను వేశ్యగా భావించి పోలీసులకు ఫిర్యాదు కూడ చేశాడట! రచయిత్రులు పుంఖానుపుంఖాలుగా రచిస్తున్న 19వ శతాబ్ది చివరలోనూ ఇంగ్లండులో మహిళలకు పురుషులతో మేధో సమావేశాలు జరపడం సాధ్యమయ్యేది కాదేమో! బహుశా ఈ విక్టోరియన్ మొరాలిటీని తట్టుకోలేకనే ఆమె 1889లో తిరిగి కేప్‌టౌన్‌కి వచ్చేసి తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి రాయడం మొదలుపెట్టింది. ఈ వ్యాసాలన్నీ అనంతరం (Thoughts on South Africa) ప్రచురితమయ్యాయి.

సమాజంలోని జాతివైషమ్యాలు, జెండర్ వివక్ష మాత్రమే కాక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య ఘర్షణలు ఆమెను చాలా కలవరపెట్టేవి. తనని తాను ఒక కార్యకర్తగా భావించుకుని, దక్షిణాఫ్రికా అధికారులతో సామరస్యం గురించి, ఇంగ్లండుతో గొడవలు పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి చర్చించేది. తిరుగుబాటు తప్పని ఆమె భావించలేదు. కానీ అది అహింసాయుతంగా జరగాలని అనేది. (ఈ విషయంలోనే ఆమె గాంధీ ప్రభావానికి లోనైందని చెప్పడానికి కొన్ని ఆధారాలున్నాయి. వాటి గురించి తర్వాత.) కానీ ఆమె వాదనలు ఇంగ్లండుతో పోరాడుతున్నవారికి నచ్చకపోవడంతో ఈసారి ఇంగ్లిష్ వారినుద్దేశించి సౌత్ ఆఫ్రికా సమస్య (The South Africa Question) అనే శీర్షికతో ఒక పుస్తకం రాసింది. ఇలా ఆలివ్ ఒక సృజనాత్మక రచయిత్రిగానే కాక, తనని తాను మేధావిగా, ఆలోచనాపరురాలిగా ప్రకటించుకునేది. సామాజిక, రాజకీయ సమస్యల గురించి తీవ్రంగా ఆలోచించేది. ఇవన్నీ చేస్తున్నపుడు ఆమె బ్రిటిష్ సైనికుల అధీనంలో ఉన్న హానోవర్ అనే చిన్న ఊళ్ళో ఉండడం విశేషం. ఆస్త్‌మా వ్యాధితో బాధపడిన ఆలివ్, చికిత్సకోసం 1913లో మళ్ళీ ఇంగ్లండుకు వెళ్ళింది. కానీ ఆరోగ్యం బాగుపడకపోవడంతో చివరికి స్వస్థలానికి వచ్చి మరణించింది.

గాంధీ పరిచయం

గాంధీ 1893 నుంచి 1915 వరకూ దక్షిణాఫ్రికాలో ఉన్న విషయం తెలిసిందే. అదే కాలంలో ఇంగ్లండ్‌కూ స్థానికులైన దక్షిణాఫ్రికావారికీ మధ్య యుద్ధం జరిగింది. దక్షిణాఫ్రికాలో వజ్రాలు లభిస్తాయన్న ఆశతో విదేశీయులు అక్కడికి రావడం ఎప్పుడో మొదలైంది. ఆ క్రమంలో అప్పటికే సెటిల్మెంట్లు ఏర్పరచుకున్న బ్రిటిష్‌వారు బోర్ రిపబ్లిక్స్‌లో (Boer Republics) వజ్రాల గనులున్నాయని అక్కడికి రావడం, స్థానికులు వారిని వెళ్ళగొట్టడంతో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధాన్నే 2వ బోర్ యుద్ధం (1899-1902) అంటారు. (మొదటిది ఆస్ట్రేలియా, బ్రిటన్‌ల మధ్య జరిగింది.) ఇవన్నీ ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే, గాంధీ ఈ యుద్ధంలో బ్రిటిష్‌వారి తరఫున యుద్ధంలో పాల్గొని, పతకాలు కూడ పొందాడు. ఆలివ్, తను శ్వేతజాతీయురాలైనప్పటికీ ఈ యుద్ధాన్ని వ్యతిరేకించింది. బోర్‌ల పట్లే ఆమె సానుభూతి. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్‌వాల్‌లో ప్రతి భారతీయుడూ ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు సర్టిఫికెట్ మోసుకు తిరగాలని నిబంధన విధించినపుడు, ఆ రిజిస్ట్రేషన్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ సత్యాగ్రహం మొదలుపెట్టాడు (1907). ఆ సర్టిఫికెట్లను దహించమని పిలుపునిస్తూ గాంధీ పాదయాత్ర మొదలుపెట్టడంతో అరెస్టయ్యాడు. అక్కడినుంచీ దక్షిణాఫ్రికాపై గాంధీ పోరాటం మొదలైంది. భారతీయులపై ఆంక్షలు పెరిగేకొద్దీ గాంధీ బ్రిటిష్‌వారిని ఎదిరించడం మొదలైంది. అప్పుడు గాంధీ అవలంబించిన అహింసాయుతమైన సత్యాగ్రహం ఆలివ్‌ని ఆకర్షించింది. చివరికి, 1909లో బ్రిటిష్ ప్రభుత్వం, వివాదాస్పదమైన రిజిస్ట్రేషన్ చట్టాన్ని రద్దుచేసింది. గాంధీ జరుపుతున్న అహింసాయుతమైన సత్యాగ్రహాన్ని ఉద్దేశిస్తూ తన దేశంలో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారిని ఉద్దేశించి తన స్నేహితురాలికి ఆలివ్ లేఖ రాసింది: It is passive resistance, the wrong we endure in a cause, that wins in the long run – as I believe our Indians are going to win in the Transvaal after the long cruel oppression and injustice of their treatment.

అంతిమంగా అహింసాయుతంగా చేసే ప్రతిఘటనే గెలుస్తుందని, అలా చేస్తున్న భారతీయులు గెలుస్తారనే నమ్మకం తనకుందనీ ఆమె అనడం, గాంధీ పద్ధతుల పట్ల ఆమెకున్న నమ్మకాన్ని తెలుపుతుంది. బహుశా ఆ తర్వాతే ఆమె గాంధీని కలిసివుండవచ్చు. ఎందుకంటే ఈ లేఖలో భారతీయుల పోరాటం అని చెప్పిందే కానీ, గాంధీ పేరు పేర్కొనలేదు. గాంధీతో ఆమె పరిచయం 1911-12 మధ్య జరిగివుంటుందని కొన్ని లేఖల వల్ల తెలుస్తోంది. 1912 మే 21న గాంధీ ఆమె స్నేహితురాలు ఆలిస్ గ్రీన్‌కు రాసిన లేఖను బట్టి, మరోజంటతో కలిసి గాంధీ, కస్తూర్బాలను ఆలివ్ కలుసుకుందని, వాళ్ళిద్దరూ ఇంగ్లండుకు వెళ్తున్నపుడు రైల్వే స్టేషన్‌లో ఆలివ్ వారిని దింపిందని – ఇలాంటి విషయాలు తెలుస్తున్నాయి. మరో లేఖలో ‘I should have liked a long talk with Gandhi, but I fear they’ll only stop a few minutes. I shall however try to go down’ అంటుంది. అప్పటినుంచి గాంధీతో ఆమె తరచు చర్చిస్తూండేదని లేఖలవల్ల తెలుస్తుంది. తన స్నేహితురాలు ఆలిస్ గ్రీన్‌కు కూడా ‘నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు జొహాన్స్‌బర్గ్‌లో టాల్‌స్టాయ్ పార్కులో గాంధీని కలుసుకున్న తర్వాతే రా’ అని కూడ రాసింది. మరో లేఖలో గాంధీ ఆరోగ్యం గురించి వాకబు చేసింది. ఆఫ్రికాలోని తొలి ఫెమినిస్టు రచయిత్రి గాంధీని కలవడడం, అతనివల్ల ప్రభావితురాలు కావడం ఆసక్తికరమైన విషయం. అహింసాయుతమైన పోరాటమే శాశ్వత ఫలితాలనిస్తుందన్న గాంధీ విశ్వాసాన్ని నమ్మిన తొలి మహిళ ఈవిడేనేమో!

ది స్టోరీ ఆఫ్ ఏన్ ఆఫ్రికన్ ఫార్మ్

జాతివివక్ష, లింగవివక్ష లేని సమాజాన్ని తాను చూడగలనని నమ్మిన ఆలివ్ తన నవలను మగపేరుతోనే రాసింది. ఈ నవలను దక్షిణాఫ్రికా సామాజిక చరిత్రలో కీలకమైన రచనగా విమర్శకులు పరిగణిస్తారు.

1883లో రాల్ఫ్ ఐరన్ పేరుతో ఈ నవల ప్రచురింపబడింది. ఈ నవల కథాస్థలి దక్షిణాఫ్రికాలోని కారూ (Karoo) అనే గ్రామం. నవలలో మూడు పాత్రలు ముఖ్యమైనవి. లిండల్, ఎమ్ అనే అమ్మాయిలు, వాల్డో అనే అబ్బాయి – వారి మధ్య బాల్యం నుంచి ఉన్న స్నేహం, సమాంతరంగా నడిచిన వారి జీవితాలు – ఇదే కథ. ఎమ్‌కి తల్లి వుంటుంది. తండ్రి మరణిస్తాడు. లిండల్ అనాథ. ఎమ్ కుటుంబమే ఈమెను పెంచుతుంది. ఈ నవలలో కథ 19వ శతాబ్ది మధ్య నుంచి చివరివరకూ జరిగిన సంఘటనల సమాహారం. వివాహపూర్వ లైంగిక సంబంధాలు, వివాహంతో ప్రమేయం లేని ప్రసవాలు, స్త్రీల వాక్‌స్వాతంత్ర్యం మొదలైన విషయాల చర్చ వల్ల ఇది తొలి తరం స్త్రీవాద రచనగా పేరు తెచ్చుకుంది. అవన్నీ లిండల్ కథలో వస్తాయి. క్రైస్తవమతం గురించిన చర్చలు, దానిపై అవిశ్వాసప్రకటనలు వాల్డో కథలో వస్తాయి. ఎమ్ కథ వీళ్ళిద్దరి జీవితాలతో ప్రమేయం కలిగివుంటుంది కానీ ఆమెకు ప్రత్యేకమైన అభిప్రాయాలు దేనిగురించీ ఉండవు. తనకేం కావాలో తనకే తెలీని అమాయకత్వం ఆమెది. అందుకే తొలినుంచి గ్రెగరీ రోజ్‌ని ప్రేమిస్తున్నా, అతనికి కూడ ఆమెపై అభిమానం ఉన్నా దాన్ని బయటపెట్టదు.

ఈ సుదీర్ఘమైన నవలలో కథను స్థూలంగా చెప్పడం కష్టం. మూడు పాత్రల జీవితాల సారాంశం తెలుసుకోవడం ద్వారా నవలను అర్థం చేసుకోగలుగుతాం. నవలలో ఎమ్ పాత్రకంటే తక్కిన ఇద్దరివీ ముఖ్యం. లిండల్, వాల్డో ఇద్దరిలోనూ, వారి ఆలోచనాధోరణుల్లోనూ మనకు రచయిత్రి ఆలివ్ ఆత్మకథాత్మక చిత్రణ కనిపిస్తుంది. ఆలివ్ లాగే వాల్డో కూడ కరడుగట్టిన క్రైస్తవ కుటుంబానికి చెంది క్రమంగా దాదాపు నాస్తికుడిగా మారతాడు. ఆలివ్ లాగే లిండల్, ప్రేమపట్ల స్వేచ్ఛాధోరణిని వ్యక్తం చేస్తుంది. ఒక స్త్రీ పిల్లల్ని కనడానికి పెళ్ళి చేసుకుతీరాలన్న నియమం లేదని వాదిస్తుంది. స్త్రీలు సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపట్ల ఆసక్తి చూపడం సహజమని భావిస్తుంది. అన్ని రంగాల్లోనూ వారి అభిప్రాయాలను సమాజం గౌరవించాలని భావిస్తుంది. లిండల్ ఆ ఊరికి వచ్చిన ఒక ఆగంతకుణ్ణి ప్రేమించి, అతనితో సంబధం పెట్టుకుంటుంది. కొంతకాలం తర్వాత అతను ఆ ఊరు వదిలి వెళ్తాడు. ఈలోగా ఊళ్ళోని కొందరు పురుషులు లిండల్‌ని వివాహం చేసుకుంటామని అంటారు. ఎమ్‌కి ఇష్టమైన గ్రెగరీ అనే మంచివాడు, అమాయకుడు, పొలంలో పనిచేసే వ్యక్తి లిండల్‌ని పెళ్ళి చేసుకుంటానని అంటే ఒప్పుకుంటుంది. అయితే తను మరో వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతున్నట్టు తన ఆగంతక ప్రియుడికి కబురు చేస్తుంది. అతను వచ్చి, తనను ప్రేమిస్తూ, గ్రెగరీని వివాహం చేసుకోవడమేమిటని అడుగుతాడు. ‘గ్రెగరీతో నేను నేనుగా ఉండిపోగలను. నా జీవితంలో అతని ప్రమేయం ఏమీ ఉండదు కనక అతనితో సంసారం సులభం. నీకు నిజంగా నేను స్వేచ్ఛగా ఉన్నా కలిసి బతకడానికి అభ్యంతరం లేకపోతే నీతో వచ్చేస్తాను. కానీ నాకుగానీ, నీకుగానీ నచ్చకపోతే విడిపోదాం’ అని బండగా చెబుతుంది. అంతేకానీ అతన్ని పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోదు. అతను ఆమె షరతులకు ఒప్పుకుని ఆమెను తీసుకువెళ్తాడు. తనను అర్ధంతరంగా విడిచి వెళ్ళిపోయిన లిండల్‌ని మరచిపోలేక, గ్రెగరీ ఆమెను వెతుక్కుంటూ కొన్ని నెలలు తిరుగుతాడు. చివరకు లండన్‌లో లిండల్‌ని పోలిన ఒకమ్మాయి హోటల్ రూమ్‌లో ఉందని తెలిసి వెళ్తాడు. లిండల్ కూడ ఇక ఎక్కువకాలం బతకదని డాక్టర్ చెప్పినట్టు హోటల్ యజమాని చెప్పడంతో, గ్రెగరీ అక్కడే ఉండిపోతాడు. అయితే తనను లిండల్ గుర్తుపడితే ఉండనివ్వదని, అతను జుట్టు తీసేసి, ఆడనర్సు వేషం ధరించి ఆమెకు సేవ చేస్తాడు. కానీ కొంతకాలానికే ఆమె మరణిస్తుంది. తిరిగి తమ వూరికి వెళ్ళి ఎమ్‌కి లిండల్ మరణించిందన్న వార్త చెప్తాడు. అప్పటికే తన వూరు చేరుకున్న వాల్డో తొలిసారిగా తను కోరుకున్నది లిండల్ సాహచర్యాన్ని అని అర్థం చేసుకుంటాడు: I knew you were not here, but it seemed as though I should be nearer you; and it is you I want. అయితే సరిగ్గా అప్పుడే గ్రెగరీ చెప్పిన సమాచారాన్ని ఎమ్ అతనికి చేరవేస్తుంది – లిండల్ చనిపోయిందని. నవలాంతానికి గ్రెగరీ, ఎమ్‌ని వివాహం చేసుకుంటాడు. వాల్డో మాత్రం లిండల్‌ని తలచుకుంటూ, సమాధి స్థితిలో ఉన్నట్టుగా అయిపోతాడు. చివరికి ఒకరోజు అతని కళ్ళు మూతపడతాయి. అతను నిద్రిస్తున్నాడనుకుని ఎమ్ వెళ్ళిపోతుంది. కానీ అతను ఆ నిద్రలోనే చనిపోతాడు.

నవల మొదటి భాగంలో ఈ ముగ్గురి బాల్యం, ఆలోచనాక్రమాలు వర్ణింపబడతాయి. రెండో భాగం ఎక్కువగా వాల్డోలో తలెత్తే మతపరమైన సందేహాలు ఆక్రమించుకుంటాయి. మూడో భాగంలో ఆ ముగ్గురికీ వయసు వచ్చిన తర్వాత కలిగే అనుభవాలు, వారి జీవితాల తుది అంకం వర్ణింపబడతాయి. రెండో భాగంలో తన తండ్రి బోనపార్టే అనే వ్యక్తి దుర్మార్గం వల్ల పొలం, సంపద కోల్పోయి గుండె ఆగి చనిపోవడంతో దేవుడనేవాడున్నాడా అనే సందేహం వాల్డోలో మొదలవుతుంది. ఈ ప్రపంచంలో పాపం ఉన్నంతగా పుణ్యం లేదన్న గ్రహింపుతో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయి అతను నాస్తికుడవుతాడు. అలా వాల్డో జీవితం ద్వారా మతపరమైన చర్చలు, లిండల్ అనుభవాలు, మాటల ద్వారా స్త్రీ స్వాతంత్ర్యానికి సంబంధించిన అంశాలు రచయిత్రి మన దృష్టికి తీసుకువస్తుంది.

ఈ నవలలో స్త్రీ పాత్రలు ఎక్కువగా తెల్లజాతికి చెందినవే. అంటే దక్షిణాఫ్రికాలో స్థిరపడిన బ్రిటిష్ కుటుంబాలలోనివే. అయినా వారికి విక్టోరియన్ బ్రిటిష్ సమాజంలోని ఆంక్షలన్నీ వర్తిస్తాయి. అక్షరాస్యత మాత్రమే ఇచ్చే చదువు, తర్వాత పెళ్ళి, పిల్లలు, కుటుంబగౌరవం కాపాడ్డం, కుటుంబం బాధ్యతలన్నీ నిర్వహించడం, బయటకు రాకపోవడం, పురుషులతో సమానత్వాన్ని ఆశించకపోవడం, కట్టుబాట్లను, తమకిచ్చిన పాత్రలను గౌరవించడం – ఈ స్త్రీల లోకంలో సామాన్యమైన విషయాలు. నవలలో ఏ రెండు పాత్రలు ఒక జాతికి చెందినవి కావు. లిండల్, ఎమ్‌లకు సన్నిహితురాలైన టాంట్ సానీ (దక్షిణాఫ్రికాకు చెందిన ఒక తెగ భాషలో పిన్ని లేదా అత్తలను టాంట్ అని అంటారు) డచ్ దేశానికి చెంది, ఆఫ్రికన్ భాషాసంస్కృతులను జీర్ణించుకున్న మహిళ. ఎమ్ బ్రిటిష్ యువతి. వాల్డో జర్మన్. కథానాయిక లిండల్ జాతి ప్రస్తావనే రాదు. కానీ ‘ఆమె అద్దంలో తన తెల్లని ముఖాన్ని చూసుకుని’ అన్న వాక్యం వల్ల ఆమె శ్వేతజాతీయురాలై ఉండొచ్చని విమర్శకుల అభిప్రాయం. కానీ ఆ సన్నివేశంలో ఆమె దుఃఖంలో, అనారోగ్యంతో ఉంది కనక, పేలవంగా మారిన ముఖం అనే అర్థం చేసుకోవాలని మరికొందరి వాదన. ఇంతకూ రచయిత్రి తక్కినవారి జాతుల్ని గుర్తుపట్టేలా రాసి, లిండల్‌ది ఎందుకు స్పష్టం చెయ్యలేదో అర్థం కాదు. లిండల్ తన ఆలోచనల్లో కూడా, స్త్రీల స్థితిగతుల గురించి సాధారణంగా వాదిస్తుందే తప్ప, ప్రత్యేకంగా నల్లజాతి స్త్రీలగురించి మాట్లాడదు. కనక ఆమె జాతిని మనం ఊహించాల్సిందే.

ఇక టాంట్ సానీ ఒక పొలానికి యజమానురాలు. ఆమెకున్న స్వేచ్ఛలో పదోవంతు కూడా, ఆ ఆఫ్రికన్లను పరిపాలించే బ్రిటిష్ జాతికి చెందిన ఇతర స్త్రీలకు ఉండదు. స్థానీయుల సంస్కృతికి, వలసపాలకుల సంస్కృతికి మధ్య స్త్రీల విషయంలో ఉన్న వ్యత్యాసాన్ని రచయిత్రి నేర్పుగా చిత్రిస్తుంది. ఎమ్‌కు, లిండల్‌కు మధ్య, కాలాతీతవ్యక్తులు నవలలో కల్యాణికీ, ఇందిరకూ మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. ఎమ్ తన జీవితంతో రాజీ పడ్డమే కాదు; అందులోనే ఆనందం పొందుతుంది. లిండల్ ప్రేమలేని వివాహం వ్యర్థం కనక, తను ఉంటున్న సమాజంలో ప్రేమికుల వివాహాలు ఆమోదం పొందవు కనక, అడుగడుగునా అన్ని విషయాల్లోనూ తిరుగుబాటు ప్రకటిస్తుంది. తను ప్రేమించే అందమైన బ్రిటిష్ యువకుడిని పెళ్ళి చేసుకోనని, సహజీవనం మాత్రమే చేస్తాననీ చెబుతుంది. తను ఏ మాత్రం ప్రేమించని గ్రెగరీని పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేస్తుంది. పెళ్ళి చేసుకోకుండ సంతానాన్ని కనడం ఘోరమైన నేరంగా పరిగణించే సమాజాన్ని ధిక్కరిస్తూ, సహజీవనం చేస్తున్న వ్యక్తి నుంచి సంతానం పొందుతుంది. ఈ తిరుగుబాటు ధోరణి ఆమెకు స్కూల్లో ఉన్నప్పుడే కలుగుతుంది. అక్కడ చదువుకంటే ఎక్కువ కుట్లు అల్లికలు నేర్పడం ఆమెకు ఏవగింపు కలిగించిన విషయం. ఆడపిల్లల్ని చిన్నప్పటినుంచే గృహిణిగా తయారుచేసే ఈ చదువులు తనకు అక్కర్లేదంటుంది: They begin to shape us to our cursed end… when we are tiny things in shoes and socks… [The curse] finishes its work when we are grown women, who no more look out wistfully at a more healthy life.

ఈ నవలలో ముఖ్యపాత్రలైన లిండల్, వాల్డో తామిద్దరూ స్నేహితులు మాత్రమేనన్న భ్రమలో ఉంటారు. వారిద్దరికీ పరస్పరం ప్రేమ కలిగిన విషయం వారే చాలా కాలం వరకు గ్రహించరు. ఒక దశలో లిండల్, అతనితో మాట్లాడే మాటల్లో ఆమె ప్రేమ స్వరూపం మనకు అర్ధమవుతుంది: When I am with you I never know that I am a woman and you are a man; I only know we are both things that think. Other men … are mere bodies to me; but you are a spirit.

అంటే తామిద్దరి అనుబంధం శరీరానికి అతీతమైందని ఆమె భావిస్తుంది. అతనితో జీవితం పంచుకోవాలని అనుకోదు. శరీరవాంఛ స్త్రీలకు ఉండడం తప్పేమీ కాదని వాదిస్తూ, తనకు ‘ఆ విధంగా’ నచ్చిన నీలికళ్ళ సుందరుడితో లేచిపోతుంది. అతని వల్ల గర్భం దాల్చినా వివాహం చేసుకోదు. కొంతకాలానికి వాళ్ళిద్దరూ విడిపోతారు. విడిపోయిన తర్వాత ప్రసవవేదన భరిస్తూ ఒక హోటల్‌లో ఉన్నపుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చిన గ్రెగరీకి ఆమె తారసపడుతుంది. ఎవరో ఇద్దరు స్త్రీలు తమ హోటల్‌లో ఉన్న బాలింతరాలి పరిస్థితి బాగాలేదని మాట్లాడుకుంటూంటే విని, గ్రెగరీ ఆమెను చూడ్డానికి వెళతాడు. అక్కడ ఆమెను గుర్తించినా, ఇంతకుముందే చెప్పినట్టు, ఆడవేషంతో సేవ చేస్తాడు. కొన్ని రోజులకు కోలుకున్నాక, లిండల్ గ్రెగరీని గుర్తించి, ఎమ్‌ని వివాహం చేసుకోమని చెబుతుంది. వాల్డోని ఎమ్‌ని చూడాలని ఉందంటే, ఆమెను తిరిగి తమ ఊరికి తీసుకువస్తూండగా మార్గమధ్యంలోనే ఆమె మరణిస్తుంది.

అక్కడ వాల్డో లిండల్‌ని తను ప్రేమించాడని అర్థం కాగానే, సుదీర్ఘమైన లేఖ రాయడం మొదలుపెడతాడు. ఆ లేఖ పూర్తయ్యేలోగా గ్రెగరీ నుంచి కబురు వస్తుంది – లిండల్ చనిపోయిందని. అప్పటి నుంచీ వాల్డొ పూర్తిగా అంతర్ముఖుడవుతాడు.

ఈ నవలలో స్త్రీపురుష సంబంధాల్లో ఏవీ సుఖాంతం కావు. ఎమ్, గ్రెగరీల వివాహం ఎమ్‌కి ఆనందదాయకమే కానీ గ్రెగరీ ఆమెను ప్రేమించాడో లేదో అనుమానమే. వాల్డో, లిండల్ ఈ ఇద్దరూ వ్యక్తిగతం గురించి కంటే సమాజం గురించి, సిద్ధాంతాల గురించి ఎక్కువ వ్యాకులపడుతూ, ఒకర్నొకరు చాలా ఆలస్యంగా గుర్తించుకుంటారు. తను ఎవరితో లేచిపోయి అతనివల్ల గర్భవతి అయిందో అతన్ని కూడ వదిలివేసిన లిండల్, ప్రేమ విషయంలో స్వేచ్ఛనైతే ఆచరించింది కానీ ఏ దశలోనూ పెద్దగా ఆనందంగా ఉన్నట్టు కనిపించదు. వాల్డో మాత్రం, తనకు సహజమైన తాత్వికతతో లిండల్, తనూ ఈ విశాలవిశ్వంలో కలిసేవుంటామని భావిస్తూ తృప్తిపడతాడు. రచయిత్రి మాటల్లో: He searches desperately for some philosophy, some tenet of some religion that will assure him that he and Lyndall will one day be reunited. He can find none – none but the cold, unsatisfying realisation that both he and Lyndall will one day be absorbed into the great universal whole from which they sprang. With this he must be content.

స్త్రీపురుషులకు సంబంధించిన మరికొన్ని అంశాలు ఈ నవలలో ఆసక్తిని కలిగించేవి ఉన్నాయి. స్త్రీలు, పరిస్థితుల వల్ల మగవేషం వేసుకోవడం 19వ శతాబ్ది విశ్వసాహిత్యంలో కొత్తకాదు. బెంగాలీ, తెలుగు సాహిత్యాల్లో కూడ ఇది కనిపిస్తుంది. కందుకూరివారి రాజశేఖరచరిత్రంలో రుక్మిణి ‘సుబ్బారాయుడు’గా కనిపించడం తెలిసిందే. కానీ ఈ నవలలో మగవాడు స్త్రీ వేషం వేసుకుని, స్త్రీలా సేవలు చేయడం – రచయిత్రి ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక వినూత్నకల్పనే. బహుశా ఆమె కావాలనే ఇలాంటి సందర్భాన్ని సృష్టించిందని అనుకోవచ్చు. అలాగే టాంట్ సానీ, వయసులో తనకంటే చిన్నవాడైన మేనల్లుడిని వివాహం చేసుకుని, అతనితో సంతానం కంటుంది. ఈ రెండు రకాల చిత్రణలూ 19వ శతాబ్ది నవలల్లో అరుదైనవే. ఇలాంటి విభిన్నమైన కథాంశాలు, ప్రవృత్తుల వల్లే ఈ నవలను విలక్షణమైన రచనగా ఆనాటి పాఠకులు గుర్తించారు. ఈనాటి విమర్శకులూ అంగీకరిస్తున్నారు.

లిండల్ సంభాషణలు ఈ నవలలో ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పొచ్చు. మగవాళ్ళ ప్రేమ ఉవ్వెత్తున ఎగిసి క్షణంలో చల్లబడిపోయే నిప్పులాంటిదని ఆమె వర్ణించిన తీరు: A man’s love is a fire of olive-wood. It leaps higher every moment; it roars, it blazes, it shoots out red flames; it threatens to wrap you round and devour you—you who stand by like an icicle in the glow of its fierce warmth. You are self-reproached at your own chilliness and want of reciprocity. The next day, when you go to warm your hands a little, you find a few ashes! ‘Tis a long love and cool against a short love and hot; men, at all events, have nothing to complain of.

ముఖ్యంగా మహిళలు, ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఈ పుస్తకాన్ని దాచుకుని చదువుకుని మురిసిపోయేవారట!

సుదీర్ఘమైన ఈ నవలలో (644 పేజీలు, రెండు సంపుటాలు) చదివించే గుణం ఉన్నా, సాగతీత కూడ కనిపిస్తుంది. ముఖ్యంగా వాల్డో అనుభవాల చిత్రణలో రచయిత్రి ప్రమేయం ఎక్కువే. కానీ సంభాషణల కల్పనలో ఈమెది అందె వేసిన చేయి. పదునైన భాష, సంవాద శైలి నవలకు వన్నె తెచ్చిన గుణాలు.

2004లో ఈ నవల ఆధారంగా చలనచిత్రం వచ్చింది. ప్రధాన ఆంగ్ల నవలా స్రవంతిలో దక్షిణాఫ్రికా రచనలకు చెప్పుకోదగ్గ గుర్తింపు లేదు. ఆ లోటును కొంతవరకూ భర్తీ చేసింది ఆలివ్ ష్రైనర్. కొందరు విమర్శకులు జాతి వివక్ష గురించి స్పష్టంగా రాయనందుకు ఈ నవలను తప్పుపట్టిన మాట నిజమే. నిజ జీవితంలో దక్షిణాఫ్రికా ప్రజల తరఫున నిలబడిన రచయిత్రి, నవలలో ఆ విషయం ఎందుకు రాయలేదన్న ప్రశ్న వస్తుంది. ఆమె అసంపూర్ణ నవల ఫ్రమ్ మాన్ టు మాన్లో కూడ ప్రధానాంశం స్త్రీలకు సంబంధించిందే. 19వ శతాబ్ది దక్షిణాఫ్రికాలో అక్కాచెల్లెళ్ళు రెబెకా, బెర్టీల జీవితాలను చిత్రించే ఈ నవలలో రెబెకా వివాహం చేసుకుని పిల్లల్ని కని, గౌరవప్రదంగా జీవిస్తుంది. చెల్లెలు బెర్టీ వ్యభిచారిగ జీవిస్తుంది. ఈ ఇద్దరి జీవితాల చిత్రణలో ఆమె లేవనెత్తిన ప్రశ్న ‘స్త్రీ జీవితమంతా ఆమె శరీరానికే కుదించబడినపుడు, వైవాహిక జీవితానికీ, వేశ్యాజీవితానికి తేడా ఏమిటి?’ అన్నది. ఇలా 20వ శతాబ్ది ప్రారంభంలోనే స్త్రీవాదులు తర్వాత ఎప్పుడో చర్చించిన ఎన్నో కీలకమైన ప్రశ్నలను సంధించిన రచయిత్రి ఆలివ్.

ఆమెను పూర్తిగా అర్థం చేసుకోవాలంటె ఆమె వ్యాసాలను కూడ పరిశీలించాలి. ఒక విమర్శకుడు అన్నట్టు ‘her most influential writing on women’s lives, Woman and Labour (1911). Gathering evidence from the animal world and women’s history, Schreiner argued that the roles played by men and women were “neither universal nor innate. In the future, she maintained, both sexes would shed outer pretenses and emerge as equal “comrades and co-workers.” ఇలా రాసినందుకు ఆమెను సోషలిస్టు రచయితగా కూడ కొందరు గుర్తించారు.

మొత్తం మీద ఆలివ్ ష్రైనర్ జీవితం, రచనలు కూడ విలక్షణమైనవే. గాంధీని కలిసిన, అతనితో మాట్లాడిన ఏకైన విదేశీ నవలా రచయిత్రి కావడం, భారతీయ పాఠకుల దృష్టిలో ‘పూవుకు తావి అబ్బినట్టే’.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...