గౙల్ ఛందస్సు

పరిచయము

కవిత్వములో మహమ్మదీయ కవులు ప్రపంచమునకు ఇచ్చిన గొప్ప కానుక గౙల్ ప్రక్రియ అని నిస్సందేహముగా చెప్ప వీలగును. అరేబియాలో ఎప్పుడో ఏడవ శతాబ్దములో ఆవిర్భవించి పిదప మహమ్మదీయమతముతోబాటు ఈ గౙల్ ప్రక్రియ కూడ ఆఫ్రికా ఖండము, పారసీక, తుర్కీ దేశములకు వ్యాపించినది. దండయాత్రలతోబాటు గౙల్ కూడ భారతదేశములో స్థిరపడినది. నేడు ఉర్దూ, హిందీ, గుజరాతీ, సింధీ, మరాఠీ భాషలలో గౙలులకు ప్రాముఖ్యము వచ్చినది. హిందీ చిత్రాలలో గౙల్ కూడ సంగీత రీత్యా ఒక ఉన్నత స్థానమును సంపాదించుకొన్నది. ఈ భాషలలో గౙలులను ఛందస్సు తప్పకుండా కవులు వ్రాసినారు. దురదృష్ట వశాత్తు తెలుగులో గౙలులు ప్రాసానుప్రాసల ఆభరణమును మాత్రమే తొడుగుకొన్నవి. గౙల్ ఛందస్సు స్వరూపము తెలుగులో పూర్తిగా లేదు. దాశరథి తన గౙలులను వల్లరి లేక మంజరి అని పిలిచినారు. కాని నారాయణరెడ్డి వంటి కవులు మాత్రాఛందస్సును గేయ రూపముగా గౙల్‌గా అంగీకరించి అలాగే వ్రాసినారు. నేడు తెలుగులో వందకుపైన గౙల్ రచయితలు ఉన్నారని అంచనా. కాని ఆ గౙలులలో గౙల్ ఛందస్సు మాత్రము మృగతృష్ణగా మిగిలినది.

ఈ పరిస్థితి ఎందుకు తెలుగు గౙలులకు ఏర్పడినది అనే ప్రశ్న ఉదయిస్తుంది. గౙల్ ఛందస్సు విదేశీయము, మన తెలుగు భాషకు సరిపోదు అన్నది ఒక ముఖ్య వాదము. ఇందులో ఇసుమంత కూడ సత్యము లేదు. అసలు ఈవాదమును లేవనెత్తినవారు గౙల్ ఛందములను చదివినారా అనే సందేహము నాకు కలుగుతుంది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా పెన్నా రామకృష్ణ రచించిన తెలుగు గజళ్ళు-రుబాయీలు అనే పుస్తకములో ఈ వాక్యమును గమనించండి: ‘తెలుగులో లాగ ఉర్దూలో అక్షర ఛందస్సులు లేవు. అన్ని రకాల ప్రక్రియలలోనూ మాత్రా ఛందస్సునే వాడుతారు’. గురులఘువులపైన ఆధారపడిన ఛందస్సులు సుమారు మూడు నుండి నాలుగు వందలు ఉన్నాయి పారసీక భాషలో. వాటిలో ఎన్నో ఛందములను ఉర్దూలో కూడ వాడుతారు. అంతే కాక మీర్ వంటి కవులు హిందీనుండి కొన్ని వృత్త ఛందములను ఉర్దూకు దిగుమతి చేసికొన్నారు. ఇందువలన తెలియునది ఏమనగా తెలుగు కవులు పారసీక, ఉర్దూ ఛందస్సులను అధ్యయనము చేయలేదు, చేయుటకు ప్రయత్నించలేదు కూడ. హైదరాబాదువంటి నగరములో ఉర్దూ గౙలులకు కొఱత గలదా? విశ్వవిద్యాలయములలో పారసీక/ఉర్దూ భాషల విభాగములు ఉన్నాయి. అక్కడ ఏ ఆచార్యుని అడిగినను గౙల్, రుబాయీల ఛందస్సులను గుఱించి తెలుపుతారు. సినారె వంటి ఆచార్యులు ఆ అవకాశమును వినియోగించుకొనలేదా? దాశరథి గౙలుకు రుబాయీకి మొట్టమొదట వేఱు పేరులను ఉంచెను. బహుశా వారికి ఈ భేదము విదితము అనుకొంటాను. కాని మిగిలిన కవులు మాత్రా ఛందస్సుతో కల్పించిన గేయములను గౙలుగా పేర్కొనడము ఈ ప్రక్రియను తప్పు మార్గములో పెట్టడమే. వారు వ్రాసిన కవితలలో కవిత్వము లేదని నేను చెప్పలేదు. అవి గౙలులు కావని మాత్రమే నా ఉద్దేశము.

గౙల్ ఛందములలో ఎన్నియో సంస్కృతములోని కొన్ని వృత్తములకు సరిపోతాయి. సంస్కృత ఛందస్సును విదేశీయ ఛందస్సు అని పిలువము కదా? సంస్కృతములో కూడ గౙల్ ఛందములను అనుసరించిన గౙలులు ఉన్నాయి. మంజునాథ గ్రంథావళి శీర్షికలో మొదటి భాగములో ద్వితీయ ఖండములో సంస్కృతములో ఛందోబద్ధమైన గౙలులు ఎన్నియో గలవు. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము సామాన్యముగా గౙలులలో ఉపయోగించబడే ఛందములను సులభముగా వివరించి ఆ ఛందములలో గౙలులను వ్రాసి చూపడమే. వాటికి ఉదాహరణములను కూడ ఇస్తాను. గౙల్ ఛందములలో గౙలులు తెలుగులో వ్రాయుట ఎంతమాత్రమును కష్టము కాదు. ఉత్పలమాల, శార్దూలవిక్రీడితమువంటి ఛందములే ఇవి కూడ.

గౙల్ నియమములు

గౙలును ద్విపదల రూపములో వ్రాస్తారు. ఈ ద్విపదను శేర్ అంటారు, కాని షేర్ అని పలుకుతారు. దీనిని బైత్ అని కూడ అంటారు. రుబాయీ ఎలా చతుష్పదియో, బైత్ అలాగే ఒక ద్విపద. ఒక గౙలులో కనీసము ఇట్టి ఐదు ద్విపదల షేర్‌లు ఉండాలి. మొదటి ద్విపదను మత్లా అంటారు, చివరి ద్విపదను మక్తా అంటారు. చివరి ద్విపదలో కవి నామము సామాన్యముగా ఉంటుంది. దీనిని తఖల్లుస్ అంటారు. ఇది మన పాటలలోని శ్రీజయదేవ, త్యాగరాజనుత వంటిది, అనగా ఇది నామముద్ర. ద్విపదలోని పాదమునకు మిస్రా అని పేరు. మొదటి ద్విపద, అనగా మత్లాలో చివర రెండు పాదములలో అంత్యప్రాస ఉంటుంది. దీనికి రదీఫ్ అని పేరు. దానికి ముందున్న పదమునకు కూడ అంత్యప్రాస ఉంటుంది. ఆ పూర్వాంత్యప్రాస పదమును కాఫియా అంటారు. క్రింద ఒక ఉదాహరణము:

హమ్ ఆప్‌కీ ఆంఖోం మేఁ ఇస్ దిల్ కో బసా దేఁ తో
హమ్ మూంద్ కే పల్‌కోం కో ఇస్ దిల్ కో సౙా దేఁ తో

అనే పాటలో మత్లా ఇది. ఇక్కడ దేఁ తో అనే పదము రదీఫ్. బసా, సౙా శబ్దములలోని ఆ-కారము కాఫియా. మిగిలిన ద్విపదలలో మొదటి పంక్తి చివర ఏ పదములనైనను ఉపయోగించవచ్చును, కాని రెండవ మిస్రాలో ఈ కాఫియా, రదీఫులు ఉండాలి. అట్టి ద్విపద క్రింద:

హమ్ ఆప్‌కే కద్‌మోం పర్ గిర్ జాఏంగే గశ్ ఖాకర్
ఇస్ పర్ భీ న హమ్ అప్‌నే ఆంచల్ కీ హవా దేఁ తో

ఇక్కడ రెండవ మిస్రాలో (పంక్తిలో) హవా లోని ఆ-కారము కాఫియా, దేఁ తో రదీఫ్.

కాబట్టి ద్విపదలలో అంత్య ప్రాసలు aa, ba, ca, da… గా ఉంటాయి. కొన్ని గౙలులలో ఒకే అంత్యప్రాస ఉంటుంది, అప్పుడు దానిని కాఫియా అని పిలుస్తారు, ఆ గౙలుకు రదీఫ్ ఉండదు, కాఫియా మాత్రమే.

ఇశ్‌క్ పర్ ౙోర్ నహీఁ హై యే వో ఆతిశ్ ‘గాలిబ్’
కి లగాయే న లగే ఔర్ బుఝాయే న బనే

అనే గాలిబ్ గౙలు లోని మత్లాలో (చివరి ద్విపదలో) గాలిబ్ అని తఖల్లుస్ (నామముద్ర) ఉన్నది.

అన్నిటికంటే ముఖ్యమైన నియమము ఏమనగా అన్ని ద్విపదలలో ఛందస్సు మారకూడదు. అది ఒక నిర్దిష్టమైన ఛందస్సులో ఉండాలి, అది మాత్రాఛందస్సు కాదు. ఈ ఛందస్సును బహర్ (బెహర్) అంటారు. గౙలులో ప్రతి పాదములో పాదాంత విరామయతి ఉంటుంది. అనగా పదము పాదముతో అంతము కావాలి. రెండవ పాదమునకు వెళ్ళరాదు. కొన్ని ఛందములలో పాద మధ్యములో కూడ విరామ యతి (caesura) ఉంటుంది.

గణములు

గణమును అర్‌కాన్ అంటారు. కొన్ని ముఖ్యమైన గణములను క్రింద తెలుపుతున్నాను.

హౙజ్ మ – ఫా – ఈ – లున్ IUUU
రజౙ్ ముస్ – తఫ్ – ఇ – లున్ UUIU
రమల్ ఫా – ఇ – లా – తున్ UIUU
ముతకారిబ్ ఫ – ఊ – లున్ IUU
కామిల్ ఫా – ఈ – లా – తున్ UUIU
వాఫిర్ మ – ఫా – ఇ – ల – తున్ IUIIU
ముతదారిక్ ఫా – ఇ – లున్ UIU

ఛందములో ఒకే విధమైన గణములు ఉన్నప్పుడు దానిని సాలిమ్ (pure) అంటారు. మొత్తము ద్విపదలో సామాన్యముగా ఎనిమిది గణములు ఉంటాయి. అప్పుడు దానిని ముసమ్మన్ (ఎనిమిది) అంటారు, ఆఱు గణములు ఉంటే ముసద్దస్ అంటారు. ఉదాహరణముగా ద్విపదలో ముతకారిబ్ గణములు ఎనిమిది లేక పాదమునకు నాలుగు ఉన్నప్పుడు ఆ ఛందము పేరు ముతకారిబ్ ముసమ్మన్ సాలిమ్ అవుతుంది. ఈ ముతకారిబ్ ముసమ్మన్ సాలిమ్ సంస్కృతము, తెలుగులోని భుజంగప్రయాత వృత్తము, ద్విపద రూపములో. చూడండి, గౙల్ విదేశీయము అంటారా? భుజంగప్రయాతము విదేశీయమా? పాదములో నాలుగు IUU కు బదులు మూడు IUU లు, ఒక IU ఉన్నప్పుడు దానిని సంస్కృతములో భుజంగీవృత్తము అంటారు. పారసీక / ఉర్దూలో అది ముతకారిబ్ ముసమ్మన్ మహ్‌ౙూఫ్ అవుతుంది. ఈ మహ్‌ౙూఫ్ అన్న పదము చివరి IIU గణము IU గా మార్చబడినది అని తెలుపుతుంది. అనగా ఇది సాలిమ్ కాదు.

పారసీక / ఉర్దూ / హిందీ వంటి భాషలు ఉచ్చరణకు తగినట్లు అమర్చుటకు వీలైన భాష. వీటిలో సులువు (flexibility) ఉన్నది. గణవిభజన (scansion) ఉచ్చరణకు తగినట్లు ఉంటుంది. అనగా వ్రాసినది ఒకటైనప్పుడు, చదువదగినది / పాడదగినది వేఱొకటిగా ఉంటుంది. ఉదాహరణముగా:

యహ్ మహలోం యహ్ తఖ్‌తోం యహ్ తాజోం కీ దునియా – అన్న పంక్తిని

యె మెహ్‌లోం యె తఖ్‌తోం యె తాజోం కి దున్యా – అని పలుకుతారు. యే యె-కారముగా, కీ కి-కారముగా పలుకబడుతుంది ఇక్కడ. దునియా అన్న పదమును ఇక్కడ దున్యా; మఱొక పాటలో దీనిని దునియా అని పలుకుతారు. ఇట్టివి తెలుగువంటి ద్రావిడ భాషలో సాధ్యము కాదు.

ఇంకొక అతి ముఖ్యమైన విషయము: పారసీక/ఉర్దూ ఛందములలో రెండు కన్న లఘువులు పక్కపక్కన ఉండవు. ఈ కారణము వలన కొన్ని గణములు పక్కపక్కన ఉండవు. దీనిని పట్టికలో గమనించండి. అనగా మూడు లఘువుల III న-గణము ఈ భాషలలో రాదు. గగన అని వ్రాసినను, ఉచ్చరణలో అది గగన్, అనగా ఒక లగము. హ్రస్వాక్షరముపైన పొల్లు గురువు అవుతుంది, ఉదా. గన్. కాని దీర్ఘాక్షరముపైన పొల్లు గలము అవుతుంది, ఉదా. యాద్ అన్న పదము UI గా పరిగణించబడుతుంది. దీనికి మినహాయింపు పాదాంతములోని గురువుపైన పొల్లును లఘువుగా పరిగణించరు. ఈ విషయములను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, కొన్ని చిత్ర గీతములను విన్నప్పుడు దానిని ఏ విధముగా విభజన చేయాలి అని కుతూహలము కలిగినప్పుడు ఇవి ఉపయోగ పడుతాయి. కొన్ని పుస్తకములలో గురు లఘువులను = – గుర్తులతో చూపుతారు, మఱి కొన్ని పుస్తకములలో పాశ్చాత్య పద్ధతి ప్రకారము గురువును – గుర్తుతో, లఘువును U గుర్తుతో చూపుతారు. గుజరాతీ పుస్తకాలలో గురువుకు గా-అని లఘువుకు ల-అని ఉపయోగిస్తారు. ఫా – ఇ – లున్ అన్నది ర-గణము. దానిని UIU, లేక SIS, లేక = – =, లేక – U –, లేక గాలగా అని వ్రాయ వచ్చును.

ఒక కవితను గౙల్ అని పిలువవలయునంటే దానికి గౙల్ లక్షణములు అన్నియును ఉండాలి. అవి ద్విపదల సంఖ్య, రదీఫ్ కాఫియాలు లేక కాఫియాలు, మత్లా మక్తాలు స్పష్టముగా నుండాలి. అన్ని పాదములలో ఒకే ఛందస్సు ఉండాలి. ఇందులో ఏది లోపించినను అది గౙల్ కానేరదు. మనకు ఇష్టమైన అంత్యప్రాసలతో వ్రాస్తే అది నౙ్‌మ్ అవుతుంది.

ఈ నేపథ్యముతో కొన్ని గౙలులను తెలుగులో మీకు పరిచయము చేస్తాను. తెలుగులో వ్రాసినది నేను. తెలిసినప్పుడు గౙలుకు చిత్రగీతములను ఉదాహరణముగా ఇచ్చినాను. పాట పేరు మాత్రమే తెలిపినాను. దాని లంకెను యూట్యూబులో వెతికికొని విని ఆనందించండి. ప్రతి గౙల్ పక్కన దాని (PK) సంఖ్యను ఇచ్చినాను. ఈ పి.కె. సంఖ్య ప్రిచెట్, ఖలీల్ (Pritchett and Khalil) పుస్తకములోని వృత్తముల సంఖ్య. నేను వ్రాసిన ప్రతి గౙలులో మూడు చతుష్పదుల వృత్తములు గలవు. నేను చదివిన కొన్ని గౙల్ పుస్తకములను చివర గ్రంథసూచిలో ఇచ్చియున్నాను. విరామయతి వద్ద తప్ప మిగిలిన చోటులలో గణములకు తగ్గట్లు పదములు విఱుగ నవసరము లేదు. పాదము మధ్యలో విఱుపు ఉంటే దానిని // గుర్తుతో చూపియున్నాను. గణముల విఱుపును పి.కె. పుస్తకములో నున్న విధముగా =, – గుర్తులతో తెలిపినాను. ఉదాహరణములలో ఇలాగే గణ విభజనను చూపియున్నాను. అక్కడ ఉచ్చరణను తెలిపి, కుండలీకరణములలో అసలు పదములను వ్రాసినాను. వృత్తములుగా వ్రాసినప్పుడు తెలుగులోవలె ద్వితీయాక్షర ప్రాసను అవలంబించినాను. చాల వృత్తములకు అక్షరసామ్య యతిని కూడ ఉంచినాను. అలా పాటించని చోటులలో ఆ విషయమును స్పష్టముగా వ్రాసినాను.


కల్పిత వృత్తము దేవేంద్రవజ్ర = ముతకారిబ్ ముసమ్మన్ అస్రం [PK–2]

ముతకారిబ్ అనగా IUU. మొదటి మూడవ గణములలో IUU కు బదులు UU. దీనిని దేవేంద్రవజ్ర అని పిలుచుటకు కారణము ఇందులోని ఆఱవ అక్షరమైన గురువుకు బదులు రెండు లఘువులుంచిన ఇది ఇంద్రవజ్ర వృత్తము అవుతుంది. ఇందులో సగమైన UUIUU అమరికతో లోల అనే వృత్తము గలదు. లోల + లోల = దేవేంద్రవజ్ర.

– దేవేంద్రవజ్ర – త/మ/ర/గ UUIUU – UUIUU 10 పంక్తి 133
– గౙలులో పాదము మధ్యలో విరామయతి నియతము. కాఫియా అ-కారముతో కూడిన హల్లు, రదీఫ్ ఏనా శబ్దము.
– గణ విభజన = = / – = = // = = / – = =

ఈరాత్రిలో నేనిట్లింట నేనా
ఈరాత్రిలో నాకేకాంతమేనా

ఈరాత్రిలో నీవెందుండినావో
ఈరాణలో నాకేకాంతమేనా

తారాగణమ్మా దారిం గనంగా
నీరాత్రి కాదే యేకాంతమేనా

దూరమ్ములో నాతోడుండెనేమో
యీరాత్రి ఖేదం బేకాంతమేనా

సారాయి వద్దే చాలాతలంపే
యీరాత్రి కంతం బేకాంతమేనా

చేరంగనౌనా చిన్మోహనమ్మై
యీరాత్రికూడా యేకాంతమేనా


కల్పిత వృత్తము మందాకినీ = రజౙ్ ముసమ్మన్ సాలిమ్ [PK–3]

రజౙ్ అనగా UUIU. అన్ని గణములు ఒక్కటే కావున ఇది సాలిమ్. త/గ గణములతో తారా అను వృత్తము గలదు. నాలుగు తారా వృత్తములు చేరినప్పుడు మనకు ఈ కల్పిత వృత్తము మందాకిని లభిస్తుంది.

– మందాకినీ (సౌగంధికా) – త/మ/య/ర/త/గ UUIU UUIU – UUIU UUIU 16 అష్టి 17477
– గౙల్ రూపములో (ఇందులో కాఫియా రావు , రదీఫ్ ఏలకో)
– గణవిభజన = = – = / = = – = / = = – = / = = – =

మందాకినీ తీరమ్ములో మారాణివై రావేలకో
అందాలతో నింపారఁగా నానందమై రావేలకో

సౌందర్య జ్యోత్స్నాభమ్ముగా సందీప్తమై నీవుంటివే
నందమ్ముగా గంధమ్ముగా నాయింటిలో రావేలకో

హారమ్ములై తారాచయం బానింగిలో వెల్గెంగదా
ఈరాత్రిలో నీధాత్రిపై నేకాంతమై రావేలకో

నీరాకకై నేనుంటినే నెయ్యమ్ముతో నోయూర్వశీ
చేరంగఁ బ్రేమార్ద్రమ్ముగాఁ జెల్వమ్ములై రావేలకో

సౌగంధికా పుష్పమ్ముగా స్వర్ణాంబువుల్ శోభించఁగా
రాగమ్ముతో నింపారఁగా భ్రాజిల్లఁగా రావేలకో

నాగమ్య మానీవే గదా నాయాత్రలోఁ దోడుందువా
రాగాబ్ధిలో మోహాననా రంజిల్లఁగా రావేలకో

ఉదాహరణములు:

రచన: మజ్రూ సుల్తాన్‌పురి, గాయకుడు: తలత్ మహ్‌మూద్
ఏ దిల్ ముఝే । ఐసీ జగహ్ । లే చల్ జహాఁ । కోయీ న హో ।

రచన: ఇబ్న్-ఏ-ఇన్షా, గాయకుడు: జగ్‌జీత్ సింఘ్
కల్ చౌదవీఁ | కీ రాత్ థీ | శబ్‌భర్ రహా | చర్చా తెరా । (వ్రాసినప్పుడు తేరా)


కల్పిత వృత్తము తరంగమాల = ముౙారి ముసమ్మన్ అఖ్రబ్ [PK–4]

ఇందులోని సగమైన UUIU IUU అమరికతో భీమార్జనము అను వృత్తము వాగ్వల్లభలో గలదు. భీమార్జనము + భీమార్జనము = తరంగమాల.

– తరంగమాల – త/ర/మ/జ/గగ UUIU IUU – UUIU IUU 14 శక్వరి 2581
– గౙలుకు మధ్య విరామయతి అవస్యము. రదీఫ్ నీకై, ముందు పదములోని ఉ-కారాంత హల్లు కాఫియా.
– గణవిభజన = = – / = – = = // = = – / = – = =

నీవెవ్వరిందు నాకై నేనెవ్వరిందు నీకై
రావేల యిందు నాకై ప్రాణమ్ము నిత్తు నీకై

భావాలలో మనస్సే భవ్యమ్ముగా నుషస్సే
రావాలలో రసమ్మే రాగమ్ము దెత్తు నీకై

ఈరాత్రిలోన నాయీ హృత్సీమలోన నీవే
సారంగరాగమం దీ సౌరిచ్చు మత్తు నీకై

తారాగణాన జంటై తళ్కీనెఁ జూడు తారల్
రారమ్ము వేగిరమ్మై రాజిల్లు మత్తు నీకై

ప్రేమాబ్ధిలోన మున్గం బ్రేమమ్ము నిండునేమో
నామానసమ్ము పూవై నర్తించ నిత్తు నీకై

రామోహనాంబకమ్మై రమ్యమ్ము జీవితమ్మే
సామోదనమ్ము గాదా సంపత్తు దెత్తు నీకై

ఉదాహరణములు:

రచన: రాజేంద్ర కృషన్, గాయకి: గీతా దత్
ఏ దిల్ ము।ఝే బతా దే । తూ కిస్ పె । ఆ గయా హై । (కిస్ పే)

రచన: కమర్ జలాలాబాదీ, గాయకి: సురైయా
ఓ దూర్ । జానెవాలే । వాదా న । భూల్ జానా । (జానేవాలే)

రచన: శకీల్ బదాయూనీ, గాయకులు: సురైయా, శ్యామ్ కుమార్
జాలిం జ।మాన ముఝ్ కో । తుమ్ సే ఛు।డా రహా హై । (జమానా)


కల్పిత వృత్తము స్వర్ణమాలికా = ముౙారీ ముసమ్మన్ అఖ్రబ్ మక్‌ఫూఫ్ మహ్‌జూఫ్ [PK–5]

– స్వర్ణమాలికా – త/ర/స/ర/లగ UUI UIUII – UUI UIU 14 శక్వరి 5333
– గౙలులో కాఫియా ము-కారాంత పదము, రదీఫ్ మండెనే.
– గణవిభజన = = – / = – = – / – = = – / = – =

ఆనందసీమలో దిన మాయమ్ము నిండెనే
కానంగలేక ప్రేమను గాయమ్ము మండెనే

నీనవ్వు ముత్తియమ్ముల నేనేరజాలనే
పానంపు పాత్ర శూన్యము ప్రాణమ్ము మండెనే

ఈరాత్రిలోని చీఁకటి హృత్సీమ నింపెనే
సారమ్ములేని జీవము శాపమ్ము మండెనే

వారించలేని కాఁకయు భారమ్ము పెంచెనే
చేరంగలేను నిన్నిఁక చిత్తమ్ము మండెనే

మోహమ్ము పెంచఁగా మది మోసమ్ము పోయెనే
దేహీ యనంగ స్పర్శకు దేహమ్ము మండెనే

ఆహంస మాటలాడక యానమ్ము సేసెనే
బేహారి మోహనా కను ప్రేమమ్ము మండెనే

చిత్రగీతపు ఉదాహరణములు:

రచన: సాహిర్ లూధియాన్వీ, గాయకుడు: ముహమ్మద్ రఫీ
మైఁ ౙింద|గీ క సాథ్ | నిభాతా చ|లా గయా | (కా సాథ్)

రచన: మజ్రూ సుల్తాన్‌పురి, గాయకుడు: ముహమ్మద్ రఫీ
అబ్ క్యా మి।సాల్ దూఁ మె । తుమారీ శ।బాబ్ కీ । (మైఁ తుంహారీ)


రేవెలుఁగు – ముతదారిక్ ముసమ్మన్ ముజాఫ్ మఖ్బూన్ [PK–6]

ఇది నిజముగా మధురగతి రగడకు రెట్టింపైన హరిగతి రగడ యొక్క ప్రత్యేకత! రగడకు కూడ గౙలు లోని మత్లావలె అంత్య ప్రాస ఉంటుంది. చూడండి తెలుగు దేశి ఛందస్సుకు గౙలుకు గల సామ్యమును.

– రేవెలుఁగు – త/య/మ/త/యమ UUIIU UUUU – UUIIU UUUU 18 ధృతి 6157
– గౙలులో ఐ-కారముతోడి పదము కాఫియా, రమ్మా పదము రదీఫ్.
– గణవిభజన = = / – – = / = = / = = / = = / – – = / = = / = =

నీయాననమే నాస్వప్నమ్మా నీయందము నాకై శాపమ్మా
నాయాశల దీపమ్మై రమ్మా నాడెందపు రేవెల్గై రమ్మా

కాయమ్మునకో నాయాసమ్మే గాయమ్ములతో నాకన్నీళ్ళే
యీయాశలు భస్మమ్మౌనేమో హృత్సీమకు సౌఖ్యమ్మై రమ్మా

నానౌకయు నీసంద్రమ్మందే నాజీవము నీపాదమ్మందే
నీనవ్వులు పూలై పూయంగా నీగీతుల రావమ్మై రమ్మా

ఈనక్తములో నిశ్శబ్దమ్మే యేకాకిని నేనైతింగాదా
గానమ్మనఁగా నీమౌనమ్మే కానంగను వేగమ్మై రమ్మా

నామానసమో నీవాసమ్మే నామాటలు నీకై స్తోత్రమ్మే
ప్రేమాంబుధిలో నేమున్గంగాఁ బీయూషపు చందమ్మై రమ్మా

నామోదములో నీహాసమ్మే నాఖేదములో నీస్నేహమ్మే
నామోహన రూపమ్మీవేగా నాకంటికిఁ బర్వమ్మై రమ్మా

ఉదాహరణములు:

రచన: ప్రేమ్ ధావన్, గాయకులు: తలత్, లతా
సీనే। మె సులగ్।తే హైఁ । అర్‌మా।నాంఖోం । మె ఉదా।సీ ఛా।ఈ హై । (మేఁ, మేఁ)

రచన: సాహిర్ లూఢియాన్వీ, గాయకి: లతా
సన్‌సా।ర్ సె భా।గే ఫిర్ । తే హో । భగ్‌వా।న్ కొ తుమ్ । క్యా పా।ఓగే । (సే, కో)


కల్పిత వృత్తము విభాత = హౙజ్ ముసమ్మన్ అఖ్రబ్ [PK–7]

ఇందులోని సగమైన వేధా వృత్తము వాగ్వల్లభలో పేర్కొనబడినది. వేధా + వేధా = విభాత

– విభాత – త/య/మ/స/గగ UUII UUU – UUII UUU 14 శక్వరి 1549
– గౙలుకు మధ్యలో విరామయతి అవసరము. ఇందులో రదీఫ్ లేదు, కాఫియా చేరంగా అను పదము.
– గణవిభజన = = – / – = = = // = = – / – = = =

రావేలకొ చూడంగా రాగాలను బాడంగా
నీవే నను గోరంగా నేనే నిను జేరంగా

భావాలకు సంద్రమ్మా పాపాలకు క్షారమ్మా
జీవించుట నేరమ్మా జీవేశుని జేరంగా

ఈమాయలలో నేనా యీఛాయలలో నీవా
ఈమార్గము మూయంగా నేతీరునఁ జేరంగా

నామానసమందెన్నో నాదమ్ముల గీతమ్మై
వేమాఱిట నీచింతే ప్రేమమ్మున జేరంగా

కాలమ్మొక చక్రమ్మే కంజాతుఁడు వక్రమ్మే
ఫాలమ్మున నాగీతుల్ వద్దంచనెఁ జేరంగా

ఈలాహిరిలో నాకై యీమోహన స్వప్నమ్మే
చాలీ స్థితి నిక్కమ్మై చావే నిను జేరంగా

ఉదాహరణము:

రచన: శైలేంద్ర, గాయకుడు: రఫీ
టూటే హు।ఎ ఖ్వాబోం నే । హమ్ కో యె । సిఖాయా హై । (హుఏ, యే)


శారదచంద్ర లేక కలహంసీ = హజజ్ ముసమ్మన్ అఖ్రబ్ మక్‌ఫూఫ్ మహ్‌జూఫ్ [PK–8]

ఆధారము: వాగ్వల్లభ.

– శారదచంద్ర లేక కలహంసీ – త/య/స/భ/గగ UUII UUII – UUII UU 14 శక్వరి 3277
– గౙలులో లు-కారాంత పదము కాఫియా; నీకే పదము రదీఫ్.
– గణ విభజన = = – / – = = – / – = = – / – = =

సొంపీనెడు సౌందర్యపు సూనమ్ములు నీకే
కంపించెడు నాడెందపు గానమ్ములు నీకే

కెంపైన నభమ్మందున గీరమ్ములు గుంపై
యింపొంద సడిన్ సల్పెడు నృత్యమ్ములు నీకే

ఈరాతిరిలో వెన్నెల హేమమ్ములు నిక్కే
యీరాతిరీలోఁ దారల హీరమ్ములు నీకే

రేరాణుల గంధమ్ముల ప్రేయస్సులు సొక్కే
శ్రీరాగపు టాలాపన శృంగమ్ములు నీకే

రానున్నవి కానున్నవి రాసమ్ములు గాదా
మేనెల్లను గన్నుల్ చిఱు మీనమ్ములు నీకే

ఈనాహృదిలో నిండిన యిష్టమ్ములు తీపే
ప్రాణమ్మున సమ్మోహన రాగమ్ములు నీకే

ఉదాహరణములు:

రచన: శకీల్ బదాయూనీ, గాయకి: లతా
బేకస్ పె । కరమ్ కీజి । ఎ సర్‌కారె । మదీనా । (పే, కీజిఏ, సర్‌కార్-ఏ-మదీనా)

రచన: హసన్ కమాల్, గాయకుడు: మహేంద్ర కపూర్
బీతే హు।ఎ లంహోం కి । కసక్ సాథ్ । తొ హోగీ । (హుఏ, కీ, తో)


ఇరా (నమేరు) = హౙజ్ ముసద్దస్ అఖ్రబ్ మఖ్బూౙ్ మహ్ౙూఫ్ [PK–9]

ఇరా – మాధవ్ పట్వర్ధన్, నమేరు – వాగ్వల్లభ

– ఇరా (నమేరు) – త/జ/ర/గ UU IIU – IUI UU 10 పంక్తి 173
– గౙల్ రూపములో (బిందు పూర్వక చ-కారము కాఫియా, వా అక్షరముతో అంతమయ్యే పదము రదీఫ్)
– గణవిభజన = = – / – = – = / – = =

రా కామిని గారవించ నీవా
నాకన్నులలో నటించ రావా

ఏకాకికి నీ యెడంద చాలే
రాకాశశితో రమించ రావా

చింతించక నీశిరోజ ఛాయన్
సుంతైనను నన్ సుఖించ నీవా

ముంతాజుకు నీముఖమ్ము పోటీ
అంతెక్కడ యాహరించ రావా

బాధించకు మీభవమ్ము నీకే
వేధించక సద్విభావ మీవా

మోదమ్మున మోహనా యనంగా
నాదేవత నన్వరించ రావా


దేవప్రియా = రమల్ ముసమ్మన్ మహ్‌జూఫ్ [PK–10]

దేవప్రియా (పట్వర్ధన్) వృత్తమునకు మత్తకోకిల లయ గలదు. ఇది అతి సుప్రసిద్ధమైన గౙల్ ఛందము. రమల్ అంటే UIUU, అట్టివి మూడు, చివర ఒక గురువు తగ్గించిన రమల్ (మహ్‌ౙూఫ్). రమల్ ముసమ్మన్ సాలిమ్ అయితే అప్పుడు అది వృషభగతి రగడ ప్రత్యేకత అవుతుంది.

– దేవప్రియా – ర/త/మ/య/ర UIUU UIUU – UIUU UIU 15 అతిశక్వరి 8739
– గౙలులో వా-కారాంత పదము కాఫియా, రేయిలో రదీఫ్.
– గణ విభజన = – = = / = – = = / = – = = / = – =

ప్రేమలో నానందమై కవ్వించ రావా హాయిలో
ప్రేమలో నింపొందఁగా నవ్వించ రావా రేయిలో

శ్యామలమ్మౌ నింగిలో నాచంద్రకాంతుల్ నిండెఁగా
భూమిపై రేయెండలో సమ్మోద మీవా రేయిలో

ఆవిషాదం బింక లేదే యాశలే పుష్పమ్ములే
భావగీతానాదలోకంబందు రావా రేయిలో

ఈవసంతమ్మందు నీవే యిందు రేఖా లాస్యమే
జీవితమ్మందు నాకా జీవ మీవా రేయిలో

నేను నీవే నీవు నేనే నేఁడు పర్వంబయ్యెనే
గానమేదో పొంగె నాలోఁ గాన రావా రేయిలో

వేణు వీవా వీణ నేనా ప్రేమరూపా మోహనా
ప్రాణమీవే ప్రాణపాత్రన్ బాన మీవా రేయిలో

ఉదాహరణములు:

రచన: భరత్ వ్యాస్, గాయకులు: మన్నా డే, లతా
తుమ్ గ।గన్ కే । చంద్ర।మాహో । మైఁ ధ।రాకీ । ధూల్ హూఁ।

రచన: న్యాయ శర్మ, గాయకుడు: తలత్ మహ్‌మూద్
దేఖ్ । లీ తే।రీ ఖు।దాయీ । బస్ మె।రా దిల్ । భర్ గయా। (మేరా దిల్)


మేనకా = రమల్ ముసద్దస్ మహ్‌ౙూఫ్ [PK–11]

ఇందులో ఒక ద్విపదలో ఆఱు గణములు మాత్రమే. పైన వివరించిన ఛందమునుండి ఒక UIUU తొలగించినప్పుడు ఈ ఛందము లభిస్తుంది. ఈ మేనకా వృత్తము పట్వర్ధన్ ఛందోరచనాలో గలదు. గౙలులో ఏ-కారంత హల్లు కాఫియా, అంటిరా అను పదము రదీఫ్. ఇందులో అక్షరసామ్య యతిని ఉంచలేదు.

– గణ విభజన = – = = / = – = = / = – =
– మేనకా – ర/త/మ/లగ UIUU UIUU UIU 11 త్రిష్టుప్పు 547

ఆశయే యీజీవితమ్మే యంటిరా
ఆశతో నేనిందు నీకే యంటిరా

కాసులే యీజీవితమ్మా, వద్దురా
రాశిగాఁ బూలిందు నీకే యంటిరా

మానసమ్మే ప్రేమ నాట్యం బాడురా
గాన రాగమ్మిందు నీకే యంటిరా

నేను కన్నీళ్ళిందు నీకై రాల్చఁగా
నైన నాయీ కైత నీకే యంటిరా

గాయమేగా ప్రేమతో నాకాన్కరా
రేయిలోఁ జంద్రుండు నీవే యంటిరా

వేయి రాత్రుల్ మోహనా నీతోడరా
మాయలో నీమేను నీకే యంటిరా

ఉదాహరణములు:

రచన: రాజా మెహ్‌దీ అలీ ఖాన్, గాయకుడు: ముహమ్మద్ రఫీ
ఆప్ కే ప|హ్లూ మె ఆకర్ । రో దియే । (మేఁ)

రచన: హసన్ కమాల్, గాయకి: సల్మా ఆఘా
దిల్ కె అర్మాన్ । ఆంసుఓం మేఁ । బెహ్ గయే । (దిల్ కే)


స్రగ్విణీ = ముతదారిక్ ముసమ్మన్ సాలిమ్ [PK–12]

ముతదారిక్ ర-గణమునకు సమానము. పాదమునకు నాలుగు ర-గణములు ఇందులో ఉంటాయి. కొన్ని గజళ్ళలో పాదమునకు ఎనిమిది కూడ ఉండును. అప్పుడు ముౙాఫ్ అను పదమును సాలిమ్ ముందు ఉంచుతారు.

– స్రగ్విణీ – పాదమునకు నాలుగు ర-గణములు; UIU UIU – UIU UIU 12 జగతి 1171
– కాఫియా వే అక్షరముతో అంతమయ్యే పదాలు; రదీఫ్ గదా వంటి పదాలు.
– గణ విభజన = – = / = – = / = – = / = – =

జీవమందుండు నా జీవ మీవే సదా
నీవు రావేలకో నాకు నీవే గదా

భావ వారాశిలో భవ్య రత్నమ్ముగా
నావ దిక్సూచిగా నాకు నీవే గదా

ఇంద్ర చాపమ్ములో నేడు వర్ణాలుగా
చంద్ర బింబమ్ములో ఛాయ నీవే గదా

మంద్ర గానమ్ములో మాధురీ రూపమై
సంద్రమందుండు నా సౌరు నీవే గదా

నాదరూపా జగన్నాథ రా ప్రీతితో
హ్లాద మీయంగ రా యంత నీవే గదా

మోద మీజన్మలో మోహనా నీదెరా
బాధ నాకేలరా భార మీవే గదా

ఉదాహరణములు:

రచన: మజ్రూ సుల్తాన్‌పురి, గాయకుడు: తలత్ మహ్‌మూద్
శామె-గమ్ | కీ కసమ్ | ఆజ్ గమ్ | గీ హె హమ్ | (శామ్-ఏ-గమ్, హై హమ్)

రచన: నక్‌ష్ లయాల్‌పురి, గాయకుడు: జగ్ జీత్ సింఘ్
ౙిందగీ|మేఁ సదా | ముస్కురా|తే రహో |


కల్పిత వృత్తము హేమహాస = ముతదారిక్ ముసమ్మన్ మక్తూ మహ్ౙూఫ్ [PK-13]

స్రగ్విణిలో చివరి UIU కు బదులు U మాత్రమే ఇందులో.

– హేమహాస – ర/ర/ర/గ UIU UI – UUI UU 10 పంక్తి 147
– గౙలులో ఉకారంత పదము కాఫియా, ఏనా తో ఉన్న పదము రదీఫ్.
– గణ విభజన = – = / = – = / = – = / =

నీవు రాకుండ నేనుండుటేనా
నీవు లేకుండ నేనిందు నేనా

పూవు లేకుండ పుష్పాగమమ్మా
నీవు లేకుండ నెయ్యంబులేనా

నాకు నీవుండ నాకమ్ము వద్దే
నీకు చేకాన్క నేనిందుఁ దేనా

కేకిగా నాడి క్రీడించ రావా
చీఁకు లింకేల చెల్వంపు మేనా

సాఁగు జీవమ్ము సందేహ మేలా
ఆఁగునా సృష్టి యందంబులేనా

రాగముం బాడ రా మోహనమ్మై
మ్రోఁగు మోదంబు పూర్ణంబు నేనా

ఉదాహరణములు:

రచన: మజ్రూ సుల్తాన్‌పురి, గాయకి: గీతా దత్
కైస జా|దూ బలమ్ | తూనె డా|రా (కైసా, తూనే)

రచన: సాహిర్ లూధియాన్వీ, ముహమ్మద్ రఫీ
రాత్ భర్ | కా హె మెహ్‌|మాఁ అఁధే|రా (హై, అంధేరా)


కల్పిత వృత్తము కామవర్ధన = ఖఫీఫ్ ముసద్దస్ మఖ్‌బూన్ మహ్‌ౙూఫ్ [PK–15]

– కామవర్ధన – ర/ర/జ/లగ UIU UI UI UIIU 11 త్రిష్టుప్పు 851
– గౙలులో రదీఫ్ లేదు, కాఫియా ఒంటరిగా అను పదము. అక్షరసామ్య యతిని ఉంచలేదు.
– గణ విభజన =* – = = / – = – = / – – = (*గుర్తు దానికి ముందున్న గురువును లఘువు కూడ కావచ్చునని తెలుపుతుంది.)

ఆకసమ్మందుఁ జందుఁ డొంటరిగా
ఏకమైయుంటి నిందు నొంటరిగా

నాకుఁ దోడెవ్వ రిందు నుండరుగా
నాకులే లేని చెట్టు లొంటరిగా

నాగళమ్మందు నాద మెండెనుగా
సాగరమ్మందు నావ యొంటరిగా

రాగమే లేని మన్కి యయ్యెనుగా
భోగమే లేని యాశ యొంటరిగా

ఇమ్ములే లేక జీవితమ్మగునా
తుమ్మెదల్ లేని పూవు లొంటరిగా

వమ్ము జీవమ్ము మోహనమ్మగునా
చిమ్ము చీఁకట్ల వెల్గు లొంటరిగా

ఉదాహరణములు: ఈపాటలలో చివర IIU కు బదులు రెండు గురువులు గలవు.

రచన: మీర్జా గాలిబ్, గాయకులు: తలత్ మహ్‌మూద్, సురైయా
దిల్ ఎ నాదాన్ । తుఝే హుఆ । క్యా హై (దిల్‌-ఏ-నాదాన్)

రచన: ఫిరాక్ గోరఖ్‌పురి, గాయకి: చిత్రా సింఘ్
రాత్ భీ నీం।ద్ భీ కహా।నీ థీ


కల్పిత వృత్తము సుధాజలము = లఘ్వారంభమైన గౙల్ ఛందము ఖఫీఫ్ ముసద్దస్ మఖ్‌బూన్ మహ్‌జూఫ్ [PK–15a]

సామాన్యముగా దీని అమరిక UIUU IUIU IIU. కాని మొదటి గురువుకు బదులు లఘువును కూడ ఇందులో వాడుతారు. ఆ అమరిక IIU UIUIU IIU. దానితో కల్పించినది ఈ గౙల్ ఉదాహరణము. ఇట్టి వృత్తము గ్రంథములలో కనబడలేదు. దీనికి నేను సుధాజలము అని పేరు నుంచినాను.

– సుధాజలము – స/ర/జ/లగ IIU UIUIU IIU 11 త్రిష్టుప్పు 852
– గౙలులో కాఫియా ఆ-కారముతో అంతమైన పదము. రదీఫ్ తలఁపే అను పదము. అక్షరసామ్య యతిని ఉంచలేదు.
– గణ విభజన – – = = / – = – = / – – =

చెలియా నిన్ను జూడఁగా వలపే
కలికీ నిన్ను జేరఁగాఁ దలఁపే

కళతో రాత్రిలో సదా కలయే
వలితో నిద్ర లేవఁగాఁ దలపే

కనులం దశ్రు వాసుధా జలమే
మనసే మారిపోదుగా తలఁపే

దినమే రాత్రియౌనుగా నదియే
మదిలోఁ జిచ్చు లేపఁగాఁ దలఁపే

వరమీలాగు మన్కిలో విధియే
స్వరమీలాగు మ్రోఁగఁగాఁ దలఁపే

నిరతమ్మిట్లు మోహనా జగమే
మఱువంగాని వాంఛగాఁ దలఁపే


కల్పిత వృత్తము చింతామణి = రమల్ ముసద్దస్ మఖ్బూన్ మహ్‌ౙూఫ్ [PK–17]

– చింతామణి – ర/భ/త/లగ UI UUII – UU IIU 11 త్రిష్టుప్పు 819
– గౙలుకు ఇయా-తో అంతమగు పదము కాఫియా. మొదటి గురువును లఘువుగా నుంచవచ్చును.
– గణ విభజన =* – = = / – – = = / – – =

భావ సౌందర్యపు వర్ణావళియా
నీవు సాయంత్రపు నిత్యాకృతియా

నీవు నాయింటను నృత్యమ్ములతో
జీవనమ్మిచ్చెడు చింతామణియా

రాత్రిలో వెన్నెల భ్రాజాధువుతో
గాత్రమందుండెడు గంగానదియా

నేత్రమందుండెడు నీలాంజనమా
పాత్రమందుండెడు వారాన్నిధియా

లాలిగీతమ్మున లాలిత్యమువా
పాలసంద్రమ్మున భామాగ్రణియా

కాలచక్రమ్మునఁ గాష్ఠమ్మొ చెలీ
బాల సమ్మోహన బాణాకృతియా

ఉదాహరణము: ఇందులో చివర IIUకు బదులు UU ఉన్నది.
రచన: నక్‌ష్ లయాల్‌పురి, గాయకి: లతా
దర్ద్ సీనే । మె ఛుపా లే।తే హై । (మేఁ)

రచన: చందన్ దాస్, అమీర్ కౙల్‌బష్, గాయకుడు: చందన్ దాస్
ౙిందగీ తుఝ్। కొ మనానే । నిక్‌లే (కో)


కల్పిత వృత్తము జ్వాలా = రమల్ ముసమ్మన్ మఖ్‌బూన్ మహ్‌జూఫ్ మక్తూ [PK–19]

– జ్వాలా – ర/భ/త/య/స UIU UIIU – UIIU UIIU 15 అతిశక్వరి 13107
– గౙలులో రదీఫ్ లేదు’ కాఫియా చితివో తో కూడిన పదములు.
– గణ విభజన =* – = = / – – = = / – – = = / – – = (*గుర్తు దానికి ముందున్న గురువును లఘువు కూడ కావచ్చునని తెలుపుతుంది. చివర IIU కు బదులు UU కూడ వాడ వచ్చును.)

తారకా చెప్పుము నా దార నిలం జూచితివో
దూరమం దెక్కడనో తొయ్యలినిం జూచితివో

నేర మీజీవితమా స్నేహమయీ కానవుగా
చేరఁగా నాకగునో చెల్వములం దాఁచితివో

ఆశలే చీఁకటిలో నంతముగా నైనవిగా
రాశియే లేదని యా రక్కసియై దోఁచితివో

వేసమే యీబ్రతుకో వెఱ్ఱిగ నావేశములో
దోసమే నాబ్రతుకో త్రోవలనే మార్చితివో

కాలమో యాఁగదుగా కన్నులలో నశ్రువులే
పూలలో గంధముతో ముండ్లను బల్ చేర్చితివో

జ్వాలలే మోహనమా భావములే యింధనమా
యేలకో యీకథలో నేమలుపుం జూచితివో

ఉదాహరణములు: ఈపాటలలో చివర IIU కు బదులు రెండు గురువులు.

రచన: రాజా మెహ్‌దీ అలీ ఖాన్, గాయకులు: ముహమ్మద్ రఫీ, ఆశా
ఆప్‌కో ప్యా।ర్ ఛుపానే । కి బురీ ఆ।దత్ హై । (కీ బురీ)

రచన: సాహిర్ లూధియాన్వీ, గాయకుడు: ముహమ్మద్ రఫీ
మైఁ నె చాందౌ।ర్ సితారోం । కి తమన్నా । కీ థీ । (మైఁ నే, సితారో కీ)


కల్పిత వృత్తము రాగరంగ = హౙజ్ ముసమ్మన్ అష్తర్ [PK–20]

రాగరంగ వృత్తములో సగమైన UIUIUUU అమరికకు అహింసా అని పేరు (వాగ్వల్లభ). అహింసా + అహింసా = రాగరంగ

– రాగరంగ – ర/య/త/ర/గగ UIU IUUU – UIU IUUU 14 శక్వరి 1291
– గౙలుకు పాదము మధ్యలో విరామయతి నియతము. ఇందులో కాఫియా ఆ-కారాంతమైన హల్లు, రదీఫ్ నీవే అను పదము.
– గణ విభజన = – = / – = = = // = – = / – = = =

జీవనమ్ములో నీవే చింతనమ్ముగా నీవే
భావనమ్ములో నీవే భావిలో సదా నీవే

నావికుండుగా రావా నన్ను దేల్చఁగా రావా
త్రోవ దీపమై నాకై రోచియే గదా నీవే

నిన్న నాకు ఖేదమ్మే నేఁడు నాకు మోదమ్మే
నిన్న తోఁచె నాయాశా నేత్రమై గదా నీవే

వన్నెతోడ ముచ్చట్లే వాంఛ నిండ చప్పట్లే
విన్నపాలు నీకేగా ప్రేమ నింపుమా నీవే

దేహియంటి నిన్నే యీ దేహమంత నీదేగా
వాహినీ తరంగాలే ప్రాణదాత యా నీవే

మోహవార్ధిలో వెల్గై మోహనార్ద్రమై రావా
దాహమే సదా నాలో దప్పి దీర్చఁగా నీవే


సుధాధరా = హౙజ్ ముసమ్మన్ అష్తర్ మఖ్బూౙ్ [PK–21]

ఇందులోని సగము భాగము కామిని అని నాట్యశాస్త్రములో పేర్కొనబడినది. కామినీ + కామినీ = సుధాధరా

– సుధాధరా – ర/జ/త/ర/లగ UIUI UIU – UIUI UIU 14 శక్వరి 5419
– గౙలుకు పాదము మధ్యలో విరామయతి (//) అవస్యము. క్రింది ఉదాహరణములో రదీఫ్ లేదు, కాఫియా మాత్రమే, అది ఉంటిరా అన్న పదము.
– గణ విభజన = – = / – = – = // = – = / – = – =

పిచ్చి గాలి వీచఁగాఁ బిచ్చితోడ నుంటిరా
మచ్చతో సుధాధరా మత్తుతోడ నుంటిరా

వెచ్చఁగాఁ గవుంగిలుల్ ప్రేమతో నొసంగునా
వచ్చి పల్కరించునో వాంఛతోడ నుంటిరా

ప్రేమ యాశ రూపమో ప్రేమ వెల్గు దీపమో
నామనస్సు కాంక్షయో నక్తమందు నుంటిరా

ప్రేమ గుర్వు లెవ్వరో ప్రేమ కావ్య మేమిటో
ప్రేమ పాన మున్నదా ప్రేమకోస ముంటిరా

పూలు లేని తోటలో మోద మెట్టు లుండునో
వేళ కాని వేళలో వేదనాగ్ని నుంటిరా

మాల వాడి పోవఁగా మాడుచుంటిఁ జూడరా
నీలవర్ణ మోహనా నిప్పు కీల నుంటిరా

ఉదాహరణములు:

రచన: శైలేంద్ర, గాయకుడు: ముకేశ్
ఝూమ్ తీ | చలీ హవా | యాద్ ఆ|గయీ కొయీ | (కోయీ)

గాయకులు: జగ్‌జిత్, చిత్రా సింఘ్
ఫాసిలా | తొ హై మగర్ | కోయి ఫా|సిలా నహీఁ | (తో, కోయీ)


కల్పిత వృత్తము శుభాకరా = రజౙ్ ముసమ్మన్ మత్వీ మఖ్బూన్ [PK–25]

సుమారు పది సంవత్సరాలకు ముందు శుభాకర అను వృత్తమును సృజించినాను. ఈ వృత్తములో రెండు సమ భాగములు. రెండు భాగములు చంపకోత్పలమాలలలోని చివరి ఎనిమిది అక్షరములు UII UIUIU. అనగా ఒక చతుర్మాత్ర, ఒక అష్టమాత్ర, మఱల ఒక చతుర్మాత్ర, ఒక అష్టమాత్ర.

– గౙలులో పాదము మధ్య విరామయతి (//) నియతము. ఇందులో రదీఫ్ ఎఱుంగవే, కాఫియా నీవు.
– గణ విభజన = – – = / – = – = // = – – = / – = – =

నామదిలోన మంటలే నాకత నీవెఱుంగవే
నామది నాశ భస్మమే నావెత నీవెఱుంగవే

ఈమలయానిలమ్ములో నీహృదయానలమ్ములో
బ్రేమము భస్మ రూపమా వేదన నీవెఱుంగవే

కోయిల మూగ వోయెనా కొంచెము పాట పాడదే
పాయని యంధకారమే బాధను నీవెఱుంగవే

సాయము లేని యాత్రలో సాఁగెద నొంటిగా సదా
పూయని పూలతీగలో ముండ్లను నీవెఱుంగవే

జీవనవార్ధి దాఁటఁగాఁ జిన్నది నావ చాలునా
భావన లెండమావులా భారము నీవెఱుంగవే

దైవమ నీవు నేనుగా ధాత్రిని బుట్ట వెందుకో
కావఁగ రమ్ము మోహనా గాయము నీవెఱుంగవే

ఉదాహరణము:

రచన: ఖుమర్ బారాబన్‌క్వీ, గాయకి: సురైయా
జబ్ సె చలే | గయే హె తో | జిందగి జిం|దగీ నహీఁ | (సే, హై, జిందగీ)


వియద్గంగా = హౙజ్ ముసమ్మన్ సాలిమ్ [PK–26]

వియద్గంగా వృత్తము మాధవ్ పట్వర్ధన్ వ్రాసిన మరాఠీ ఛందోరచనాలో గలదు. నేను మహాభుజంగప్రయాతము అని పేరును ఉంచినాను, ఎందుకంటే ఇందులో భుజంగప్రయాతములోని IUU కు బదులు IUUU ఉన్నది.

– వియద్గంగా లేక మహాభుజంగప్రయాతము – య/ర/త/మ/య/గ IUUU IUUU – IUUU IUUU 16 అష్టి 4370
– గౙలులో చివరి గురువునకు పొల్లు ఉండరాదు. వా అక్షరముతో అంతమయ్యే పదము కాఫియా, విలాసమ్మై అనే పదము రదీఫ్.
– గణ విభజన – = = = / – = = = / – = = = / – = = =

సదా నిన్నే దలంతున్గా సఖీ రావా వినోదమ్మై
ముదమ్మెందో యెఱుంగన్గా ముదమ్మీవా విలాసమ్మై

వ్యధాగ్రస్తుండ నేనేగా వరమ్మీవా సరోజాక్షీ
సుధామూర్తీ శమించంగా సుగంబీవా విలాసమ్మై

ఇదే జీవం బిదే భావం బిదే స్వర్గం బిదేనేమో
ఇదే నాట్యం బిదే గానం బిదే నీవా విలాసమ్మై

నదీతీరంబులో నీకై నటించెన్గా తరంగాలే
పదాలన్ రాగమందున్ సుస్వరాలీవా విలాసమ్మై

విలంబమ్మై నభమ్మందున్ విహంగమ్మై విహారమ్మా
కలాపమ్మై నటించంగా గళమ్మీవా విలాసమ్మై

చెలీ రా మోహనుం గానన్ జిరమ్మీ జీవితమ్మౌనా
బలమ్మీవే భువిన్ నాకై వరమ్మీవా విలాసమ్మై

ఉదాహరణములు:

రచన: సాహిర్ లూధియాన్వీ, గాయకుడు: హేమంత్ కుమార్
తెరీ దున్యా | మె జీనే సే | తొ బెహ్‌తర్ హై | కి మర్ జాఏఁ | (తేరీ, దునియా మేఁ తో)

రచన: ఆనంద్ బక్‌షీ, గాయకుడు: ముకేశ్
సుహానీ చాం|ద్‌నీ రాతేఁ | హమేఁ సోనే | నహీఁ దేతీ |


కల్పిత వృత్తము ప్రసన్న = హౙజ్ ముసద్దస్ మహ్‌ౙూఫ్ [PK-27]

– ప్రసన్న – య/ర/త/గగ IUUU IUUU IUU 11 త్రిష్టుప్పు 274
– యతి నుంచలేదు. గజలులో కాఫియా బిందు పూర్వక దు-కారాంత పదము, రదీఫ్ వా-కారాంత పదము.
– గణ విభజన: – = = = / – = = = / – = =

వసంతమ్మే కనంగా నిందు రావా
ప్రసన్నమ్మై సకా నాముందు రావా

విశాలమ్మీ జగమ్మే చెల్వమేగా
సుశాంతమ్మే సుగమ్మౌ చిందు నీవా

విలాసాలే వినోదాలౌను నేఁడే
కళాలోకమ్ములోఁ గన్విందు నీవా

చలాకీలే హుషారై తోచుఁ గాదా
ఇలా నాకై పసందై యిందు రావా

వరమ్మా సుస్వరమ్మే నాకుఁ గాదా
స్థిరమ్మీ ప్రేమ నీకై పొందు నీవా

కరమ్ముల్ నాకరమ్మందే ప్రియమ్మై
తరింతున్ మోహనా నాముందు రావా

ఉదాహరణములు:

రచన: ఆనంద్ బక్‌షీ, గాయకుడు: పంకజ్ ఉధాస్
సబక్ జిస్‌కో । వఫాకా యా।ద్ హోగా

రచన: రాజేందర్ కృషన్, గాయకులు: రఫీ, లతా
ఉధర్ సే తుమ్ । చలే ఔర్ హమ్ । ఇధర్ సే


భుజంగప్రయాతము = ముతకారిబ్ ముసమ్మన్ సాలిమ్ [PK–28]

– గౙలులో రదీఫ్ ఉంచలేదు, కాఫియా వెల్గై అను పదము.
– గణ విభజన – = = / – = = / – = = / – = =

విలాసమ్ముతో రా ప్రియా చెంత పుల్గై
చెలీ రాత్రిలో నా చిరమ్మైన వెల్గై

కలాపమ్ముతో రా కవిత్వంపు రంగై
కళాదీపమై రా కలల్ నింపు వెల్గై

నభమ్మొక్క తారార్ణవమ్మయ్యె నిండై
శుభోదయమ్ము రేపే సుచిత్రాల వెల్గై

ప్రభాతమ్ము నీవే ప్రకాశాల విల్లై
విభాతమ్ము లందంబె సర్వమ్ము వెల్గై

సరోజంపు సౌరై సరాగాల యిల్లై
విరాజిల్ల రా జీవితమ్మందు వెల్గై

కరమ్మందు నీ యా కరమ్ముంచు పొత్తై
విరుల్ మోహనమ్మే వికాసాల వెల్గై

ఉదాహరణములు:

రచన: బిహారీ, గాయకుడు: హేమంత్ కుమార్
న యే చాం।ద్ హోగా । న తారే । రహేంగే ।

రచన: శకీల్ బదాయూనీ, గాయకి: లతా
హమేఁ కా।శ్ తుమ్ సే । ముహబ్బత్ । న హోతీ ।


భుజంగీ = ముతకారిబ్ ముసమ్మన్ మహ్‌జూఫ్ [PK–29]

– భుజంగప్రయాతములో చివరి గురువు ఇందులో లేదు. దానిని తెలుపుటకై మహ్‌జూఫ్ పదమును వాడుతారు. గౙలులో ఇదే అను పదము కాఫియా, ప్రేమమా అను పదము రదీఫ్.
– గణ విభజన – = = / – = = / – = = / – =

ఇదేనా ప్రపంచం బిదే నేమమా
ఇదేనా జీవితం బిదే ప్రేమమా

ఇదేనా విలాసం బిదే మోసమా
ఇదేనా వికాసం బిదే ప్రేమమా

పథమ్మిందు లేదా పద మ్మాఁగదా
వృథా యాత్రలేనా యిదే ప్రేమమా

కథాసాగరమ్మా కవీ యీదఁగా
వృథా యాశలేనా యిదే ప్రేమమా

సుధా పాత్రలో నాసురా పానమా
మృదాకార రూపం బిదే ప్రేమమా

చిదానంద మౌనో చితిన్ మోహనా
హృదిన్ మంటలేనా యిదే ప్రేమమా

ఉదాహరణములు:

రచన: మీర్ తాకీ మీర్, గాయకి: జగ్‌జిత్ కౌర్
దిఖాయీ | దియే యూఁ | కి బేఖుద్ | కియా |

రచన: గుల్‌ౙార్, గాయకుడు: జగ్‌జిత్ సింఘ్
హె లూ ౙిం|దగీ ౙిం|దగీ నూ|ర్ హై | (హై)


కల్పిత వృత్తము అసీమ = ముతఖారిబ్ ముసమ్మన్ ముజాఫ్ మఖ్బూజ్ అస్లమ్ [PK–30]

– అసీమ – జ/త/ర/ర/య/జ/గగ IUIUU IUIUU – IUIUU IUIUU 20 కృతి 169126
– గౙలులో ఉకారాంత పదము కాఫియా (వసింతు), ఏమో అన్న పదము రదీఫ్.
– గణ విభజన – = – / = = / – = – / = = / – = – / = = / – = – / = =

మనస్సు నీకై తపించె రావా మనోరథమ్మే నశించు నేమో
కనంగఁ గాదే నినిందు నేనే కలేవరమ్మై వసింతు నేమో

దినమ్ములో నావెలుంగు లేదే దిగంతమందా తమస్సులేనా
వ్రణంబు డెందంబులోన నిప్పై జ్వలించఁగా నే హసింతునేమో

సమాజ మాయాంక్ష లిచ్చెఁ గాదా సహించనెట్లో యెఱుంగలేనే
విమోచనమ్మే విధించలేదే ప్రియమ్ముకై నేఁదపింతునేమో

సుమాలు లేవే వనమ్ములో నా సుగమ్ము లేదే శుభమ్ము లేదే
భ్రమమ్ముతో నీ భవమ్ము నీదే భరించ నిన్నే స్మరింతు నేమో

విలాసమేనా ప్రపంచమం దా వికాసమెందో యెఱుంగనౌనా
కళంకమే జీవితమ్ములో నా కవిత్వమం దాగ్రహింతు నేమో

ప్రలాపమేనా మదీయ వాక్కుల్ పవిత్రమెందోయి మోహనుండా
విలాపమే నా వినోదమేమో విధించు వాఁడే యనంతుఁడేమో

ఉదాహరణములు:

రచన: శకీల్ బదాయూనీ, గాయకుడు: రఫీ
నసీబ్ । మేఁ జిస్‌ । కె జో లి।ఖా థా । (జిస్‌కే)

రచన: మజ్రూ సుల్తాన్‌పురి, గాయకులు: హేమంత్ కుమార్, లతా
ఛుపాలొ । యూఁ దిల్‌। మె ప్యార్ । మేరా । (ఛుపాలో, మేఁ)


పంచచామరము = హజజ్ ముసమ్మన్ మఖ్బూజ్ [PK–32]

– పంచచామరము – జ/ర/జ/ర/జ/గ IUIU IUIU – IUIU IUIU 16 అష్టి 21846
– గౙలులో ఉ-కారాంత పదము కాఫియా, త్రాగరా అన్న పదము రదీఫ్.
– గణ విభజన – = – = / – = – = / – = – = / – = – =

మనస్సు బాధ పెట్ట విస్మరించు, గోము మూఁగరా
వ్రణమ్ము మాయఁగా సకా రమించి కల్లు త్రాగరా

దినమ్ము రాత్రి చింతలే తృషన్ దపించు టేలకో
వనమ్ములోని పూవులే వధించు నంచుఁ ద్రాగరా

సకీ యనంగ రాదుగా జ్వలించుటేల బాధతో
సుకమ్ము చిన్న పాత్రలో సురాయె మందు త్రాగరా

మకాము పానశాలలో మఱో ప్రపంచమందులో
పుకారు నమ్మవద్దురా ముదాన నీవు త్రాగరా

నిజాన నెందఱో భువిన్ నిషాను బొందఁ దల్తురే
మజా నురుంగు చూడఁగా మఱేల జంకు త్రాగరా

భజించు దేవదేవునిన్ భయమ్ము వీడి రక్తితో
నజేయుఁడౌదు మోహనా యశాంతి పోవుఁ ద్రాగరా

ఉదాహరణము:

రచన: మదన్ పాల్, గాయకుడు: జగ్‌జిత్ సింఘ్
జవాఁ హె రా।త్ సాకియా । శరాబ్ లా । శరాబ్ లా । (హై)


కల్పిత వృత్తము నిరంతరద్యుతి = ముజ్తస్ ముసమ్మన్ మఖ్బూన్ మహ్ౙూఫ్ [PK–34]

– నిరంతరద్యుతి – జ/భ/త/ర/స IUIU IIUU – IUIU IIU 15 అతిశక్వరి 13622
– గౙలులో రదీఫ్ లేదు, కాఫియా వేదనతో అన్న పదము.
– గణ విభజన – = – = / – – = = / – = – = / – – =

తమస్సులో వెలుఁగా ఖేదమొక్క శోధనతో
సుమమ్ము వాడఁగ నాకా సుగమ్ము వేదనతో

గమించుటే జతనమ్మా గళమ్ము నీరవమా
భ్రమమ్మె యీబ్రతుకా భారమైన వేదనతో

విలాసమే కరువా జీవితమ్ములో వెఱపా
కళాప్రపంచములో నాకనంత వేదనతో

శిలాంతరాళములో దాచె నెవ్వరో యెడఁదన్
చలించ దాశిల కానీ సహించు వేదనతో

నిశీథ మంతము కాదా నిరంతర ద్యుతితో
ప్రశాంత వేళయు రాదా ప్రముక్త వేదనతో

విశాల మీజగమేగా విముక్త మీబ్రతుకే
అసీమ మోహనమేగా నముక్త వేదనతో

ఉదాహరణములు: చివరి IIU కు బదులు UU ను కూడ వాడుతారు పాటలలో.

రచన: రాజేంద్ర కృషన్, గాయకుడు: రఫీ
కిసీ కి యా|ద్ మె దున్యా | కొ హై భులా|యె హుఏ | (కీ, దునియాకో భులాయే)

రచన: జాన్ నిసార్ అఖ్‌తర్, గాయకుడు: రఫీ
గరీబ్ జా|న్ కె హం కో | న తుమ్ మిఠా | దేనా | (కే)


కల్పిత వృత్తము అనురాగ = రమల్ ముసమ్మన్ మష్కూల్ [PK–36]

ఈవృత్తములో సగము భాగము దిగీశ అని ఛందోరచనాలో పేర్కొనబడినది. కావున దిగీశ + దిగీశ = అనురాగ.

– అనురాగ లేక చిత్రవేణి – స/జ/త/జ/ర/గ IIUI UIUU – IIUI UIUU 16 అష్టి 11052
– గౙలుకు పాదము మధ్యలో విరామయతి గలదు. సుందరమ్మే అను పదము కాఫియా ఇందులో.
– గణ విభజన – – = – / = – = = // – – = – / = – = =

మధురమ్ము బంధనమ్మే మది యొక్క సందరమ్మే
హృదయమ్ము మందిరమ్మే యిఁక రాత్రి సుందరమ్మే

మృదువైన చందనమ్మే మితి లేని జ్ఞప్తులెన్నో
పద మొండు లాలనమ్మే భవ మింక సుందరమ్మే

మరణమ్ము రేపు రాదా మఱి చింత మానరాదా
సరసాలతోడ నేఁ డా శశి వెల్గు సుందరమ్మే

చెఱసాల నీకు నీవే చెలువాల స్వేచ్ఛ నీకే
వరవీణ మీటలేవా స్వర మెల్ల సుందరమ్మే

తళుకీను తారలెన్నో దరి వచ్చు స్వప్నమందే
కలలన్ని యాశలేగా కవనమ్ము సుందరమ్మే

తులలేని కావ్యమై యా తొలి ప్రేమ ముగ్ధమేగా
తలపోయ మోహనమ్మే తరుణమ్ము సుందరమ్మే

ఉదాహరణములు:

రచన: శకీల్ బదాయూనీ, గాయకుడు: రఫీ
ముఝె ఇశ్క్ । హై తుఝీ సే | మెరి జాన్ । ౙిందగానీ | (ముఝే, మేరీ)

రచన: సాహిర్ లూధియాన్వీ, గాయకుడు: కిశోర్ కుమార్
మెరె దిల్ మె । ఆజ్ క్యా హై | తు కహే తో । మైఁ బతా దూఁ | (మేరే, మేఁ, తూ)


గీతికా = కామిల్ ముసమ్మన్ సాలిం [PK–37]

– గీతికా – స/జ/జ/భ/ర/స/లగ IIUIU IIUIU – IIUIU IIUIU 20 కృతి 372076
– గౙలులో ఏ-కారముతో అంతమైన పదము కాఫియా; మధురమ్ముగా అనే పదము రదీఫ్.
– గణవిభజన – – = – = / – – = – = / – – = – = / – – = – =

హరి గీతియే మధురమ్ముగా హరి ప్రీతియే మధురమ్ముగా
హరి నామమే మధురమ్ముగా హరి ప్రేమమే మధురమ్ముగా

హరి చూపులే లలితమ్ముగా హరి యూఁపులే లలితమ్ముగా
హరి యాటలే మధురమ్ముగా హరి పాటలే మధురమ్ముగా

వరవేణు రాగము లందమే ప్రణయంపు లాలస మందమే
ఉరమందు కౌస్తుభ మందమే ఉరుగానమే మధురమ్ముగా

సరసాలలో సురభోగమే స్మరణమ్ములో శుభ యోగమే
చిఱునవ్వులో మరుమల్లెలే చెలువమ్ములే మధురమ్ముగా

హరి యందునా తరి యందునా హరుసమ్ములో సిరి యందునా
నెఱతావితోఁ జిఱుగాలియో నెఱ నెయ్యమే మధురమ్ముగా

తిరునామమే మురిపెమ్ముగా తిమిరమ్మునే వెలిఁగించుఁగా
హరి మోహనా ఖగ వాహనా యనురాగమే మధురమ్ముగా

ఉదాహరణములు:

రచన: మజ్రూ సుల్తాన్‌పురి, గాయకుడు: రఫీ
ముఝె దర్దెదిల్ | క పతా న థా | ముఝె ఆప్ కిస్ | లియె మిల్ గయే | (ముఝే, కా, ముఝే, లియే)

రచన: బషీర్ బద్ర్, గాయకుడు: జగ్‌జిత్ సింఘ్
వొ నహీఁ మిలా | తొ మలాల్ క్యా | జొ గుౙర్ గయా | తొ గుౙర్ గయా | (వో, తో, జో)



మత్తకోకిల లయతో శిష్ట వ్యావహారిక భాషలో గౙల్ [PK-10]

– ద్దే అక్షరముతో అంతమయ్యే పదము కాఫియా; చెలీ రదీఫ్.

చిత్త మేమో నీకె ఇచ్చా శ్రీలు వద్దే నాచెలీ
సత్తెమై నే నిన్నె మెచ్చా చంపవద్దే నెచ్చెలీ

నీవు నాతో ఎప్పుడుండే స్నేహదీపం వెల్గువే
జీవనమ్మే హాయి గాదా చింత కద్దే నెచ్చెలీ

తొంగి చూచే చందమామా దోవ చూపంగా సకీ
రంగులే స్వప్నమ్ములో చేరంగ హద్దే నెచ్చెలీ

నింగిలో నాపాలపుంతే నిర్మలమ్మై తోచెనే
శృంగమో శోభించె ప్రేమై చీకు వద్దే నెచ్చెలీ

మోహనుండే నేను నీకై మోద మిస్తా హాయిగా
రా హసించంగాను వేగం రాత్రి ముద్దే నెచ్చెలీ


భుజంగప్రయాతపు లయతో శిష్ట వ్యావహారిక భాషలో గౙల్ [PK-28]

ఉ-కారాంత పదము కాఫియా; వే తో అంతమయ్యే పదము రదీఫ్.

తలంపందు నీవే తపమ్మందు నీవే
శిలారూపమేలా చెలీ ముందు రావే

మరోలోకమం దీమనం పోదమిప్డే
వరించంగ రావే వరమ్మొండు తేవే

అమావాస్యలో నీవహా చంద్రబింబం
సుమాలందు జారే సుధాబిందు వీవే

చరించంగ నీతో సదా స్వర్గమేగా
సరోజమ్ము మోమే సరాలందుకోవే

యదార్థమ్ముగా ప్రేయసీ ప్రేమ నీకే
సదా మోహనమ్మే సకీ చందు డీవే

ముగింపు

సుందరమైన, సూక్ష్మమైన, సునిశితమైన, సుమధురమైన, సుకుమారమైన, సులక్షణమైన భావములను వ్యక్తీకరించుటకు గౙల్ ఒక గొప్ప సాధనము. ప్రేమ, విరహము, సంతోషము, బాధ, ఆరాధన, తపన – వీటిని ఈ గౙలులలో చక్కగా ప్రతిబింబించ వీలగును. తరతరాలనుండి గౙల్ అంటే ఒక గొప్ప అనుభవము, అనుభూతి. ఈ చింతనలను నిర్దిష్టమైన గౙల్ ఛందములలో తెలియబఱచుటకు వీలగును. కవులందఱు ఇలాగే వ్రాసినారు వివిధ భాషలలో. కాని తెలుగులో మాత్రము ఛందస్సును గాలిలో వదలినారు. మాత్రా ఛందస్సును గౙలుకు ఉపయోగించుట సబబు కాదు. కాని అరవై సంవత్సరాలుగా ఇదే అమలులో నున్నది, ప్రచారములో నున్నది. పేరుండిన కవుల ప్రోత్సాహము దీనికి ఒక పెద్ద కారణము. రుబాయీలలో గాని, గౙలులలో గాని సరియైన ఛందములను వాడమని చెప్పుట ఒక విధముగా అరణ్య రోదనమేమో? ఈవిషయములో ఈ ప్రక్రియలపైన నావ్యాసములు ఒక దిక్సూచిగా ఉంటే అది ఆనందదాయకము. భవిష్యత్తు పుటలు ఇంకా వ్రాయబడలేదు కదా!


గ్రంథసూచి

  1. A Manual of Classical Persian Prosody – Finn Thiesen – Otto Harrassowitz – Wiesbaden – 1982.
  2. A Practical Handbook – Urdu Meter – F. W. Pritchett and Kh. A. Khaliq
  3. గౙల్ ధారా – గౙల్ కా ఛంద శాస్త్ర – ఉదయ్ శాహ్ (షా), నవసారీ, గుజరాత్, 2016.
  4. గౙల్ రచనా తంత్ర – అజీజ్ బాబూలాల్ నవాఫ్ – PhD thesis – శ్రీశివాజీ విద్యాలయ – సోలాపుర్ – 1994.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...