పరిచయము
సంస్కృతములో పాదమునకు 26 అక్షరములకన్న ఎక్కువగా ఉండే వృత్తమును దండకము అంటారు. పేరులో తప్ప మిగిలిన విషయములలో దీనికి వృత్తములకు భేదము లేదు. ఈ దండకములు కూడ చతుష్పదులే. ఇట్టివాటిని తెలుగులో ఉద్ధురమాలావృత్తములు అంటారు. త్రిభంగి, లయగ్రాహి మున్నగునవి ఈ కోవకు చెందినవే. దండకములు రెండు విధములు: పద్య దండకములు, గద్య దండకములు. తెలుగులో నన్నయ కాలమునుండి ఎక్కువగా ఏకపాద గద్య దండకములే ఉన్నాయి. సంస్కృతములోవలె ఈ నాలుగు పాదముల దండకములు అరుదు. ఈ లఘు పత్రములో పద్యదండకమును గుఱించిన వివరాలను తెలిపి, తఱువాత సుప్రసిద్ధమైన శ్యామలాదండకములోని ఛందస్సును గుఱించి చర్చించడమే నా ముఖ్యోద్దేశము. పంచపాదియైన శ్యామలాదండకమును మహాకావ్యములైన రఘువంశ, కుమారసంభవముల రచయితయైన కవికులతిలకుడు కాలిదాసు వ్రాయలేదని నా అభిప్రాయము. దానికి తగిన ఆధారములను ఛందస్సు పరముగా చూపించినాను.
పద్యదండకములు
చండవృష్టిప్రయాతము: పింగళ ఛందస్సులోని సూత్రము దండకో నౌ రః తఱువాత ప్రథమశ్చండవృష్టిప్రయాతః అని ఉన్నది. ఈ చండవృష్టిప్రయాతమునకు రెండు న-గణములు, ఏడు ర-గణములు, మొత్తము 27 అక్షరములు. లగ, గల, య-గణ, త-గణ, స-గణ, భ-గణములతో దండకములు గలవు. నాగవర్మ అజ-గణములతో (జ-గణము కానివి, కొందఱు దీనిని తప్పుగా బ్రహ్మ గణములు అని చెప్పారు) నిర్మించవచ్చును అన్నాడు. నేను ప్రస్తుతానికి ర-గణ దండకములను మాత్రమే ఇక్కడ చర్చిస్తాను. ఆదిలో రెండు న-గణములు, తఱువాత 7 నుండి 33 ర-గణముల వఱకు ఉండే దండకములకు పేరులు తర్కవాచస్పతిలో తెలుపబడినవి[1]. అవి వరుసగా: చండవృష్టి, అర్ణ, అర్ణవ, వ్యాళ, జీమూత, లీలాకర, ఉద్దామ, శంఖ, ఆరామ, సంగ్రామ, సురామ, వైకుంఠ, సార, కాసార, విసార, సంహార, నీహార, మందార, కేదార, ఆసార, సత్కార, సంస్కార, మాకంద, గోవింద, సానంద, సందోహ, ఆనంద.
సందోహదండకము: సామాన్యముగా సంస్కృతములోని దండకములకు భవభూతి మాలతీమాధవ నాటకమునుండి ఉదాహరణమును చూపుతారు. భవభూతి ఎనిమిదవ శతాబ్దమునకు చెందినవాడని ఊహ. అంతకు ముందే ఆఱవ శతాబ్దములో వరాహమిహిరుడు బృహత్సంహితలోని 104వ అధ్యాయమైన గ్రహగోచరాధ్యాయములో ఎన్నియో వృత్తములతోబాటు దండకములకు కూడ ఉదాహరణములను ఇచ్చినాడు[2]. ఈ అధ్యాయమును అందఱు చదివి తీరాలి. ఇందులో గ్రహముల ఉనికిని గుఱించిన విషయాలను, అందువల్ల ఏర్పడే ఫలితాలను గుఱించి మాత్రమే చర్చ. అన్యాపదేశముగా ఛందస్సుల పేరులు ఆయా ఛందములలో ముద్రాలంకారముగా వస్తాయి. ఇలా సుమారు 60 ఛందములు ఇందులో వివరింపబడినవి. ఇందులోని 61వ పద్యములో న/న/(ర)32 గణములతో ఒక పద్యము గలదు. ఇది ఒక సందోహదండకము. బహుశా ఇదియే సంస్కృతములో లిఖించబడిన మొదటి దండకమేమో?
సంగ్రామదండకము: భవభూతి వ్రాసిన మాలతీమాధవములోని దండకమును (5.23) క్రింద ఇస్తున్నాను. దీని ఆంగ్లానువాదమును చిత్రములో చూడవచ్చును. దీనికి సంగ్రామదండకము అని పేరు.
సంగ్రామదండకము – న/న/(ర)16
ప్రచలితకరికృత్తిపర్యంతచంచన్నఖాఘాత భిన్నేందు నిఃస్యందమానామృతశ్చ్యోత జీవత్కపాలావలీముక్త చండాట్టహాసత్రసద్భూరి భూతప్రవృత్తస్తుతీ
శ్వసదసిత భుజంగభోగాంగదగ్నంథి నిష్పీడనస్ఫార ఫుల్లత్ఫణాపీఠ నిర్యద్విషజ్యోతిరూజ్జృంభణోద్దామ రవ్యస్తవిస్తారిదోఃఖండ పర్యాసితక్ష్మాధరమ్
జ్వలదనలపిశంగనేత్రచ్ఛటాచ్ఛన్న భీమోత్తమాంగభ్రమిప్రస్తుతాలాత చక్రక్రియాస్యూత దిగ్భాగముత్తుంగఖట్వాంగ కోటిధ్వజోద్ధూతి విక్షిప్తతారాగణం
ప్రముదితకటపూతనోత్తాల వేతాలతాలస్ఫుటత్కర్ణసంభ్రాంత గౌరీఘనాశ్లేష హృష్యన్మనస్త్ర్యంబకానంది వస్తాండవం దేవి భూయాదభీష్ట్యైచ హృష్ట్యైచ నః
సరస్వతీదండకము: తెలుగులో కూడ సంస్కృత దండకములు ఉన్నాయి. నన్నయభట్టు మొదటి తెలుగు దండకమును వ్రాసినా, కవిసార్వభౌముడు శ్రీనాథుడు శృంగారనైషధములో దమయంతి తండ్రియైన భీమనృపతి ద్వారా సంస్కృతములో ఒక సరస్వతీ దండకమును (4.138) చెప్పించినాడు. శ్యామలాదండకమును ఎందఱో గాయకులు పాడియున్నారు. చాలమంది మొత్తము దండకమును పాడక, కొన్ని పంక్తులను మాత్రమే పాడినారు. కాని అతి సుందరమైన ఈ శ్రీనాథుని దండకమును ఇంతవఱకు ప్రసిద్ధ గాయకులు (తెలుగువారు కూడ) పాడకుండడము నిజముగా శోచనీయమే! గోలి ఆంజనేయులుగారొక్కరి ధ్వని ముద్రిక మాత్రమే ఉన్నది దీనికి.
జయజయ జనయిత్రి, కల్యాణసంధాత్రి, గాంధర్వవిద్యాకళా కంఠనాళాం,
త్రివేదీవళీం సారసాహిత్య నిర్వర్తిత ప్రోల్లసద్దృక్తరంగాం,
అనేకాభిచారక్రియా హోమధూమావళీ మేచకాథర్వణామ్నాయ రోమావళిం,
కల్పశిక్షాక్షరాఽకల్పసాక్షాచ్చరిత్రాం నిరుక్తప్రియోక్తిం,
భుజద్వంద్వతాం అశ్నువానేన సంక్షోభితాం
ఛందసా జాతివృత్తప్రభేదప్రభిన్నేన, విద్యామయీం త్వాం భజేభగవతి, గుణ దీర్ఘభావోద్భవాం సంతతిం సందధానం
మహాశబ్ద నిష్పాదకవ్యాక్రియా శాస్త్ర కాంచీకలాపం కటీమండలే బిభ్రతీం,
జ్యోతిషా హారదండేన తారోదయస్ఫూర్తి విద్యోతమానేన విభ్రాజితాం,
ఆత్మపక్షానురాగాన్వితాభ్యాం మహాదర్శనాభ్యాం ప్రతిష్ఠాపితోష్ఠప్రవాళాం
పరబ్రహ్మకర్మార్థభేదాద్విధాయద్విధా స్వం శరీరం ప్రతిష్ఠాం పరాం ప్రాప్తయా
చారు మీమాంసయా మాంసలే నోరుయుగ్మేన సమ్యక్పరాచ్ఛాదనం లాలయంతీం,
ముహుః పత్త్రదానే గుణాన్వీత పూగాసకృత్ఖండనప్రౌఢిమాఢౌకమానేన దంతాత్మనా
తర్కతంత్రేణ కామప్యభిఖ్యాం ముఖేఖ్యాపయంతీం, ధ్రువం దేవి వందేతమా త్వామహంద్రుహిణ గృహిణి, మత్స్యపద్మాదిసంలక్షితం పాణిపద్మం త్వదీయం పురాణం,
శిరస్తావకం నిర్మలం ధర్మశాస్త్రం, దలాభ్యాం భ్రువావోంక్రియా మంత్రరాజస్య,
తద్బిందునా చిత్రకం ఫాలభాగే తదర్ధేందునా తే
విరించిర్విపంచీ కలక్వాణనాకోణచాపం ప్రణిన్యే స్వయంభవతు మమ సదా శుభం భారతి, త్వత్ప్రసాదాదసాధారణాత్సత్కృపాధారభూతం ప్రభూతం
నమస్సోమసిద్ధాంతకాంతాననాయై, నమశ్శూన్యవాదాత్మమధ్యాన్వితాయై,
సువిజ్ఞాన సామస్త్య హృత్కంజజాయై, నమస్తేఽస్తు కైవల్యకల్యాణసీమ్నే,
నమస్సర్వగీర్వాణచూడామణి శ్రేణి శోణప్రభాజాల బాలాతపస్మేర పాదాంభుజాయై,
నమస్తే శరణ్యే, నమస్తే వరేణ్యే, నమశ్శర్మదాయై, నమో నర్మాదాయై,
నమశ్శాశ్వతాయై, నమో విశ్రుతాయై, నమశ్శారదాయై, నమస్తే నమస్తే నమః
ఇందులోని విశేషమేమంటే ఇతర సంస్కృత దండకములవలె నాలుగు పాదములు ఉన్నా, అవి అన్నియు ఒకే విధముగా లేవు. అన్నింటిలో మొదటి రెండు గణములు న-గణములే. కాని ర-గణముల సంఖ్య ఒక్కటి కాదు. అది నాలుగు పాదములలో వరుసగా 40, 65, 27, 55. వృత్తములలో సమ వృత్తములు, అర్ధసమ వృత్తములు, విషమ వృత్తములు ఉన్నట్లు, దండకములను సమ దండకము, విషమ దండకము అని వర్గీకరణము చేయాలేమో!
గణపవరపు వేంకటకవి ఒక ‘సమ’దండకమును తన శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో (143) తొమ్మిది ర-గణములతో ముద్రాలంకారముతో అర్ణవదండకమని వ్రాసినాడు.
కలితభువనయోగ జీమూత గోత్రావళీ శాత్ర వాశ్మద్యుతిచ్ఛేదనోద్దామ ధామాభిరామాకృతీ
విలసితమునిభావ షట్కోణపంకేరుహాంతస్థ సత్కర్ణికాపార సంచారి భృంగానుకారీ స్థితీ
ఘనవిపిన సరోంబుపాన ప్రభిన్నాగ్రపాదస్ఫురద్గ్రాహకగ్రాహ మస్తాగ్ర భిద్భీమచక్రాయుధా
వినుతజనదురంత సంసార ఘోరార్ణవోత్తారణా కారణా భూతనౌకా ప్రతీకాశ నైకాభిదా
దండకమును వ్రాయు సులభ పద్ధతి
ఇట్టి దండకములను వ్రాయుటకు ఒక సులభ పద్ధతిని నేను కనుగొన్నాను. వృత్తములలో స్రగ్విణీ వృత్తము ర-గణమయము. ఇందులో పాదములో నాలుగు ర-గణములు, పద్యములో 16 ర-గణములు గలవు. కనీసము ఏడు ర-గణములను ఉంచి స్రగ్విణి వృత్తమును వ్రాసి ముందు రెండు న-గణములను కలిపితే మనకు ర-గణ దండకములు సాధ్యమవుతాయి. ఆ వృత్తములోవలె యతి ప్రాసలను ఉంచితే అందము ద్విగుణీకృతమవుతుంది. అట్టి ఒక ఉదాహరణము:
సంగ్రామదండకము – (న)2/(ర)16
వెలుఁగు సుడిగ మానసమ్మందు నో మాధవా నీవె నా ప్రాణమీ ధారుణిన్ బాలు పోయంగ రా
వానలో నెండలో వంతలో విందులో ధ్యాన మా నామమే దానవారీ సఖా
కలల కలిమి చిత్తమం దెప్డు నా చింత నీవేగదా పొత్తమం దెప్డు నీ మూర్తి నేఁ జూతురా
ముత్తెముల్ నీవెగా మోహనానంద నా విత్తముల్ నీదెగా ప్రేమ చింతామణీ
మలగ నిలుచు నల్లనౌ దేహమే నాకు నెల్లప్పుడున్ దెల్లఁగాఁ దోఁచురా తేలి నేఁ బోదురా
యుల్ల మూయాలగా నూఁగురా తూఁగుచున్ మెల్లఁగా నవ్వుచున్ మేలమాడంగ రా
లలిత హృదయ పూవులోఁ జూతు నిన్ బ్రొద్దులో జూతు నిన్ గ్రోవిలో విందు నిన్ ద్రోవలో విందు నిన్
నీవు నేనందురా నిన్ను నాకందురా జీవమున్ గావఁరా జీవితేశా హరీ
శ్యామలాదండకము
పై నేపథ్యములో శ్యామలాదండకమును పరిశీలిద్దామా? చిన్న చిన్న మార్పులతో ఎన్నో ప్రతులు ఉన్నాయి. నేను సంస్కృతప్రతుల వెబ్‌సైట్ (Sanskrit Documents.org) లోని ప్రతిని గ్రహించినాను. శ్యామలా దండకపు తాత్పర్యము ఎన్నియో చోటులలో ఉన్నాయి. దండకము క్రింద ఇవ్వబడినది. సౌలభ్యముకోసము మొదటి రెండు న-గణములను ప్రత్యేకముగా ఒక పంక్తిలో, తఱువాతి ర-గణములను వాటి క్రింద వ్రాసినాను.
జయ జనని సు-
ధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢబిల్వాటవీమధ్య
కల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే
సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోల నీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే
శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధ సుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే
కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే
చారుగోరోచనాపంకకేలీలలామాభిరామే సురామే రమే
ప్రోల్లసద్ధ్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసిలావణ్యగండస్థలన్యస్త
కస్తూరికాపత్రరేఖాసముద్భూతసౌరభ్య సంభ్రాంతభృంగాంగనాగీత
సాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే
వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే
దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైక- నీలోత్పలే శ్యామలే
పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే
స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే
సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే
ముగ్ద్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే
జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే
కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే
చారువీణాధరే పక్వబింబాధరేసులలిత నవ
యౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవ త్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే
దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగ శోభే శుభే
రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోర్లతారాజితే యోగిభిః పూజితే
విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః సత్కృతే
వాసరారంభవేలాసముజ్జృంభ మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే
దివ్యరత్నోర్మికాదీధితిస్తోమసంధ్యాయమానాంగులీపల్లవోద్య న్నఖేందుప్రభామండలే
సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే
తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్య వల్లీవలిచ్ఛేద
వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే
హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీ
సరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే
చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీ లాధనుశ్శింజినీడంబరే దివ్యరత్నాంబరే
పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలేవికసితనవ
కింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూత
సిందూరశోణాయమానేంద్రమాతంగ హస్మార్గలే వైభవానర్గలే శ్యామలే
కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే
నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక
సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే
ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్ని
కోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ
లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహీతాంఘ్రిపద్మే సుపద్మే ఉమేసురుచిరనవ
రత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే
తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే
మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంజులామేనకాద్యంగనామానితే
దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే
యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే భైరవీ సంవృతే
పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే
భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే
గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే
విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసేశ్రవణహరణ
దక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే
సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభిస్సురాణాం సమారాధ్యసే
సర్వవిద్యావిశేషాత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం
కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే
పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం
పుస్తకంచాంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్
యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్త్రియః పూరుషాః
యేన వా శాతకుంభద్యుతిర్భావ్యసే సో౽పి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే
కిం న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః
తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం
తస్య గీర్దేవతా కింకరీ తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం
సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే
సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే
సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే
సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే
సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే జగన్మాతృకే
పాహి మాం పాహి మాం పాహి మాం
దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో
దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః
ఈ శ్యామలాదండకము కూడ ఒక విషమదండకమే, అనగా అన్ని పాదములలో గణసంఖ్య ఒక్కటి కాదు. శ్రీనాథుని సరస్వతీ దండకము కూడ అట్టిదే. కాని శ్యామలాదండకములో నాలుగు పాదములు కాదు, ఐదు పాదములు ఉన్నాయి! ఇందులోని ర-గణముల సంఖ్య వరుసగా – 150, 131, 64, 78, 146. తెలుగు వాఙ్మయములో పంచపాదులు ఉన్నాయి (ఉదా. భండన భీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ…, ఇత్యాదులు). కాని సంస్కృతములో వృత్తములు నాలుగు పాదములకే పరిమితము. దీనికి ప్రత్యేకతలు కనబడలేదు.
ఈ చతుష్పాద నియమమును ఈ ఉదాహరణముతో విశదీకరించవచ్చును. సంస్కృతములో వైదిక ఛందస్సులో గాయత్రికి అనుష్టుప్పులా పాదమునకు ఎనిమిది అక్షరములు, ఇది ఒక త్రిపది (ఉదా. అగ్నిమీళే పురోహితం, ఇత్యాదులు). మొత్తము 24 అక్షరములు. నాలుగు పాదముల నియమము పద్యములకు వచ్చిన తఱువాత, గాయత్రిని ప్రతి పాదమునకు ఆఱు అక్షరములుగల ఛందస్సుగా పింగళాదులు పరిగణించారు (8 x 3 = 6 x 4). అందువలన ఈ చతుష్పాద నియమము ఉల్లంఘనీయము కాదు. పద్యములో మొత్తము అక్షరముల సంఖ్య 104 (= 4 x 26) కన్న ఎక్కువగా నున్నప్పుడు అది దండకము అవుతుంది. కాబట్టి వృత్తమును పంచపదులుగా వ్రాయడము సరికాదు.
సంస్కృతములో కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయములో కూడ ఒక విషమదండకము[3] ఉన్నది. కాని అది కూడ ఒక చతుష్పాదియే. శ్యామలాదండకము సంస్కృతములోని మొదటి పంచపాదియా? లేకపోతే ఎవరైనా ఒక పాదమును అదనముగా తఱువాత కలిపినారా? కాలిదాసు పేరుతో తన కవిత్వమును ప్రచారములో తెచ్చుకొనడములో అర్థమున్నది. కాని కాలిదాసునిదిగా చెలామణి అయ్యే ఒక కవితలో ఒక పాదాన్ని చేర్చుటకు ప్రత్యేక కారణములుండునా? అలా ఒక వేళ ఎవరైనా చేర్చి ఉంటే మనము శతాబ్దాలుగా ఒక ప్రక్షిప్త దండకమును పాడుకొంటున్నామా?
ఈ శ్యామలా దండకమును మహాకవి కవికులతిలకుడు కాలిదాసు వ్రాసినాడని ప్రతీతి. ఈ చాటుకథ జగద్విదితమే. మూర్ఖుడైన కాలిదాసు సౌందర్యవతి, విద్యావతియైన రాజుగారి కుమార్తెను వివాహమాడి ఆమెచే కనుగొనబడి కాళికాదేవివద్ద పంపబడి ఆ దేవిని ధ్యానించి ఆ దేవిచే నాలుకపైన బీజాక్షరములను వ్రాయించుకొని ఆ దేవిని ఈ దండకము ద్వారా స్తుతించినట్లు కథ. ఇక్కడ రెండు సందేహాలు ఉదయిస్తాయి. కాలిదాసు ఈ స్తుతిని చేసినప్పుడు అక్కడ ఎవ్వరు లేరు అతడు, ఆ జగన్మాత తప్ప. మఱి ఇది ఎలా ప్రచారములోనికి వచ్చినది? బహుశా కాలిదాసు దీనిని జ్ఞప్తికి తెచ్చుకొని తఱువాత వ్రాసినాడేమో? కాలిదాసు వ్రాసినవాటిపై తఱువాతి కవులు, పండితులు వ్యాఖ్యానము చేసియున్నారు. ఈ దండకమునకు అట్టి వ్యాఖ్యానమున్నదా? ఇక పోతే కాలిదాసు వ్రాసిన ఒక ఛందోగ్రంథము గలదు, దాని పేరు శ్రుతబోధ. కొందఱు ఇది కాలిదాసుది కాదని కూడ చెప్పుతారు. శ్రుతబోధలో దండకముల ప్రస్తావన లేదు. ఈ కథ దైవభక్తి, నమ్మకము వీటిపైన ఆధారపడినది. కాబట్టి దీనిని ప్రశ్నించరాదు అని అనుకొంటే, సర్వవిద్యాత్మిక, సర్వశబ్దాత్మికయైన ఆదేవి ఇలా అసంపూర్ణమైన, విలక్షణమైన దండకమును కాలిదాసు నోటినుండి బయలుపఱచి ఉండి ఉండునా అన్నది సందేహమే. అంతేకాక కొన్ని పదాలు పునరుక్తమై ఉన్నాయి ఈ దండకములో. ఈ కారణములవలన ఈ దండకము కవికులతిలకునిది కాదని నా స్వంత అభిప్రాయము. అదే పేరితో మఱొక కాలిదాస కవి వ్రాసి ఉండవచ్చును. ఈ దండకమును మరెవ్వరైనా ఉదాహరించి ఉంటే ఇది వారికి ముందటి కాలమునాటిదని అనుకొనవచ్చును. ఇతరుల నమ్మకములకు అడ్డు రావడము నాకిష్టము లేదు.
గ్రంథసూచి
- తెలుఁగుభాషలో ఛందోరీతులు – రావూరి దొరసామిశర్మ, వెల్డన్ ప్రెస్, మద్రాసు, 1962.
- బృహత్సంహితా – వరాహమిహిరుడు, టీకాకారుడు పండిత అచ్యుతానంద ఝా, చౌఖంబా విద్యాభవన్, వారాణసి, 1959.
- ప్రబోధచంద్రోదయ నాటకం – శ్రీకృష్ణమిశ్రయతి, అనువాదము తేజస్విని.