రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, పరుచూరి శ్రీనివాస్
మే 2009

సుమారుగా 1940 నుండి 1960ల పూర్వార్ధపు మధ్యకాలం చిత్రసంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో అన్ని భాషలలోనూ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. సంగీత దర్శకులు, రచయితలు, గాయక గాయనీమణులు శ్రద్ధతో సృష్టించిన అలనాటి ఆ పాటలు మరువరానివి, మరువలేనివి.

హిందీలో అనిల్ బిశ్వాస్, నౌషాద్, సలిల్ చౌదరీ, శంకర్-జైకిషన్, రోషన్, S.D బర్మన్, తెలుగులో రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల, గాలిపెంచల, చలపతిరావు, తమిళములో G. రామనాథన్, విశ్వనాథన్-రామమూర్తి, మహాదేవన్, S.V. వెంకటరామన్, కన్నడములో లింగప్ప, విజయభాస్కర్, రాజన్-నాగేంద్ర, రంగారావు, మలయాళములో దేవరాజన్, బాబురాజ్, V.దక్షిణామూర్తి వంటి ప్రసిద్ధ సంగీత దర్శకులతో చిత్రసంగీతం విలసిల్లిన కాలమది. వారిలో కొందరు గొప్ప గాయకులు కూడా.


ఏ. ఎం. రాజా
(1929 – 1989)

అట్టివారిలో ప్రముఖులు ఘంటసాల, పంకజ్ మల్లిక్, హేమంతకుమార్, S.D బర్మన్, సాలూరి, నాగయ్య, ఏ. ఎం. రాజా. ఇంక ముఖ్యంగా తెలుగు నేపథ్య గాయకుల విషయానికి వస్తే తక్కిన భాషల్లో వారికి లేనంతటి వైవిధ్యం ఇక్కడుంది. ఎం.ఎస్. రామారావు, వి.జె.వర్మ, ఘంటసాల, పిఠాపురం, మాధవపెద్ది, ఏ.ఎం. రాజా, పి.బి. శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి ల కంఠాలలో ఒకరి దానితో మరొకరికి పోలిక లేదు. వీరిలో ఏ.ఎం. రాజా గొంతులోని తీపిని, అతని సంగీతరచనలోని సౌలభ్యాన్ని, గొప్పదనాన్ని మాకు తోచిన విధంగా చెప్పడమే ఈ వ్యాసపు ముఖ్యోద్దేశం.

ఏ. ఎం. రాజాగా సుప్రసిద్ధులైన ఏమల మన్మథరాజు రాజా (తన ఇంటిపేరు రాజా ఇంగ్లీషులో Aemala అని రాసేవారు) 1929 సంవత్సరం జులై ఒకటో తేదీన చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో మన్మథరాజు-లక్ష్మమ్మ దంపతులకు పుట్టారు. పచ్చయప్ప కళాశాల నుండి 1951లో బీ. ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కళాశాలలో చదివేటప్పుడే ఎన్నో పాటల పోటీలలో పాల్గొని బహుమతులను పొందారు. ఖచ్చితంగా ఎప్పుడో తెలియదు గానీ, ఈ వయస్సులో మాస్టర్ నటరాజన్ వద్ద సంగీతాభ్యాసం పొందారని మలయాళ సంగీత దర్శకుడు శ్యాం రాశారు. రాజా స్వంతగా రాసి స్వరపరచిన రెండు పాటలను హెచ్.ఎం.వీ vAru రికార్డు చేశారు. ఈ పాటలు ఆకాశవాణి 1951లో తరచూ ప్రసారం చేసేది. ఆయన పాడిన మొదటి రికార్డు ‘ఎంత దూర మీ పయనం’. ఈ పాటలను విన్న జెమినీ స్టూడియో అధినేత వాసన్ తాను తమిళంలో నిర్మిస్తున్న సంసారం చిత్రంలో రాజాను పాడమన్నారు.

//eemaata.com/Audio/may2009/enta-dooramee-payanam_AMRaja_1950-51.MP3ఎంత దూరమీ పయనం
//eemaata.com/Audio/may2009/saMsAaraM_saMsAraM-1951-rAjA-dakshiNAmUrti.mp3సంసారం సంసారం – సంసారం//eemaata.com/Audio/may2009/aakali_1951_A.M.raja-P.Leela-Revamma_idigO-svargadvaaraM-terichaaru_P.S.Divakar_Devulapalli_Part1.mp3స్వర్గ ద్వారం తెరిచారు. 1 – ఆకలి//eemaata.com/Audio/may2009/aakali_1951_A.M.raja-P.Leela-Revamma_idigO-svargadvaaraM-terichaaru_P.S.Divakar_Devulapalli_Part2.mp3స్వర్గ ద్వారం తెరిచారు. 2 – ఆకలి//eemaata.com/Audio/may2009/sankraanti_1952_A.M.raja_aahaa-bhalE-chirugaaali_balijEpalli_aSwatthaama.mp3ఆహా భలే చిరుగాలి – సంక్రాంతి

తమిళంలో సుసర్ల దక్షిణామూర్తి దర్శకత్వంలో సంసారం, సంసారం అనే పాట (తెలుగులో దీనిని ఘంటసాల పాడారు) రాజా పాడిన మొట్టమొదటి సినిమా పాట. తెలుగులో వీరు పాడిన మొదటి పాటలు ‘ఆకలి’ ‘ఆదర్శం’, ‘సంక్రాంతి’ (1952) చిత్రాలలోనివి. కానీ గాయకుడిగా గుర్తింపు పొందింది పక్కింటి అమ్మాయి (1953) సినిమాలో పాడిన పాటలతో.

రాజా గళంలో ఒక వినూత్నమయిన సౌకుమార్యం, మార్దవం, మాధుర్యం ఉంది. తలత్, రఫీల జాడలు అక్కడక్కడ కనబడినా రాజా కంఠస్వరం ప్రత్యేకమైనది. ఎక్కడ వినబడినా గుర్తించడం కష్టం కాదు. కాని అనుకరించడం మాత్రం సులభం కాదు. ఆ ప్రత్యేకత వల్లనే సినిమారంగంలో రాజా మెల్లమెల్లగా పైకెదిగారు. ఆ కాలపు సంగీత దర్శకులందరు శ్రుతి చేసిన పాటలను అన్ని దక్షిణ భారత భాషలలో, హిందీలో పాడసాగారు. లింగప్ప దర్శకత్వంలో కన్నడ చిత్రం ‘స్కూల్‌మాస్టర్'(1958, తరువాత తెలుగులో ‘బడిపంతులు’గా డబ్ చేయబడింది.) లో జమునారాణితో కలసిపాడిన ‘అతిమధుర అనురాగ’ అనే పాట, దేవరాజన్ దర్శకత్వంలోని ‘ఆకాశగంగయుడె కరయిల్’ చెప్పుకోదగ్గవి. సింహళ భాషలో కూడా రాజా పాడారు. హిందీలో బహుత్ దిన్ హుయే (తెలుగులో బాలనాగమ్మ కథ ఆధారంగా; సంగీత దర్శకుడు ఈమని శంకర శాస్త్రి) అనే సినిమాలో కూడా పాడారు.

//eemaata.com/Audio/may2009/atimadhura_School_Master_1958_rAjA_jamunArANi_liMgappa.mp3అతిమధుర అనురాగ-స్కూల్‌మాస్టర్//eemaata.com/Audio/may2009/aakASagaMgayuDe_OmanakuTTan_1964_rAjA_dEvarAjan_ravi.mp3ఆకాశగంగయుడె – ఓమనకుట్టన్//eemaata.com/Audio/may2009/bahut-din-huye_1954_Emani-Sankarasastry_A.M.Raja_vah-chalaa.mp3వో చలా – బహుత్ దిన్ హుయే

అన్ని భాషలలో పాడుతున్నా, తెలుగు తమిళ సినిమాలలోనే రాజా ఎక్కువగా పాడేవారు. ఆ సమయంలోనే ఎం. జీ. రామచంద్రన్ నటించిన ‘జెనోవా’ చిత్ర నిర్మాణ సమయంలో పీ. జీ. కృష్ణవేణిని (జిక్కీ గా మనకు చిరపరిచితం ఈమె గాత్రం) చూడడం తటస్థించింది. ఇద్దరూ కలిసి సినిమాలలో యుగళ గీతాలు పాడేవారు. అలా ఆ పరిచయం ప్రేమగా మారింది. కొందరు ఇది ‘ప్రేమలేఖలు’ చిత్రీకరణ సమయంలో జరిగిందంటారు. ఆ ప్రేమ అలా పెరిగి పాటలలోనే కాకుండా జీవితంలో కూడా భాగస్వాములయ్యారు. వారికి నలుగురు ఆడ పిల్లలు, ఇద్దరు కొడుకులు. అందులో ఒకరికి రాజాలా కంఠస్వరం ఉందట. ఇద్దరు కూతుళ్ళు కూడా బాగా పాడేవారేనట.

రాజా సంగీత జీవితపు ఆరంభ దశలో అతనికి ఎక్కువ ఖ్యాతిని తెచ్చినవి మూడు చిత్రాలు – ప్రేమలేఖలు(1953; హిందీలో ‘ఆహ్’, తమిళములో ‘అవన్’), అమరసందేశం(హిందీలోని ‘బైజూ బావరా’ ఆధారంగా తీసినది), విప్రనారాయణ(1954). హిందీలో ముఖేశ్ పాడిన పాటలను రాజా తెలుగు, తమిళ భాషల్లో పాడారు. శంకర్ జైకిషన్‌ల దర్శకత్వంలో రికార్డు చేయబడినవి ఈ పాటలు. లతా మంగేష్కర్ పాటలను జిక్కి పాడారు. ‘పాడు జీవితము యౌవనము’, ‘విధి రాకాసి కత్తులు దూసి’, ‘రారాదా మది నిన్నే పిలిచెగాదా’ (జిక్కీతో), ‘నీవెవ్వరవో చిరునవ్వులతో’ (జిక్కీతో) రాజా ఇందులో పాడిన పాటలు. ఈ చిత్రం హిందీలోకంటే తెలుగులో ఎక్కువగా ఆదరణ పొందడానికి కారణం రాజా-జిక్కీ పాటలే. ఆ కాలంలో రేడియో సిలోన్‌లో జనరంజకమైన ఈ పాటలు తరచుగా వస్తుండేవి.

సంగీత ప్రధానమైన ‘అమర సందేశం’లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి ఆయన పాడిన రెండు సోలోలు: ‘మధురం మధురం మనోహరం’, ‘ఆనతి కావలెనా గానానికి సమయము రావలెనా’ (దర్బారీ కానడ రాగంలో తెలుగులో వచ్చిన ఒక గొప్ప పాట), రఘునాథ పాణిగ్రాహితో కలిసి పాడిన సంగీత సంవాద గీతం ‘మానస లాలస సంగీతం’.

//eemaata.com/Audio/may2009/prEmaLEkhalu_1953-A.M.Raja-Vidhiraakaasi-Arudra_Sankar-Jaikishan.mp3విధి రాకాసి కత్తులు దూసి – ప్రేమలేఖలు
//eemaata.com/Audio/may2009/amarasandESam_1954_SadasatkaLaa-_SriSri-aarudra_Prasadarao-Kelkar_A.M.Raaja.mp3సద సత్కళా – అమర సందేశం

ఇదే చిత్రంలో శ్రీశ్రీ, ఆరుద్రలిరువురూ తమ రచనగా గొప్పగా చెప్పుకున్న ‘సదసత్కళా’ అనే సీసపద్యం చాలా చక్కనిది. రాజా పాడిన ఈ పద్యం ఒక చిత్రకవిత్వమే. ఇందులో మొదటి పాదం ‘స’తో మొదలయి, ‘స’తో ముగుస్తుంది, రెండవ పాదం ‘రి’తో, మూడవది ‘గ’తో, అలాగే మిగిలినవి.

ఇక రాజ రాజేశ్వరుల అపూర్వ సృష్టే ‘విప్రనారాయణ’. రాజా ఈ చిత్రంలో భానుమతితో పాడారు. ‘విప్రనారాయణ’ లోని పాటలు ఇప్పటికీ ఏమాత్రం వసివాడని కుసుమాలే. రాసలీలను చిత్రించే ‘చూడుమదే చెలియా’ పాటలో ‘…నారి నారి నడుమ మురారి’ అని మంద్రస్వరంలో రాజా పాడుతుంటే కలిగే అనుభూతి నిజంగా అపూర్వమైనదే. ఈ రాజరాజేశ్వరుల సహకారం అంతటితో ఆగిపోలేదు. సుశీలతో పాడిన మిస్సమ్మ(1955) చిత్రంలోని ‘బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే’ ఒక మరపు రాని పాట. ఈ పాట ఎంత బాగుంటే కదా హిందీ ‘మిస్ మేరీ’ లో ఈ పాట వరుసను మాత్రమే హేమంతకుమార్ అలాగే ఏ మార్పు చేయకుండా ఉంచుకొన్నారు. బంగారు పాప(1954), భాగ్యరేఖ(1957) చిత్రాలలో రాజా పాడిన పాటలు కూడా తీపి గుర్తులే!

ఈ కాలంలో వచ్చిన పాటల్లో తప్పకుండా ఉదహరింపవలసినవి: ‘నేనూ ఒక మనిషినా’ (మేలుకొలుపు, 1956, పెండ్యాల, శ్రీశ్రీ-తాపీ), ‘అందాల రాణీ’ (ఆర్. బాలసరస్వతితో; వీరకంకణం, 1957, సుసర్ల, ఆరుద్ర), ‘తానేమి తలంచేనో’ (ఆర్. బాలసరస్వతితో; దాంపత్యం, 1957, రమేశ్ నాయుడు, ఆరుద్ర), ‘ప్రభూ తొలిసంజ’ (సిపాయి కూతురు, 1959, ఎం. సుబ్రహ్మణ్యరాజు, మల్లాది). ఇలా 1953-57 మధ్య కాలంలో రాజా నక్షత్రంలా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా ఒక రెండు సంవత్సరాల పాటు (1953-55) ఘంటసాల కంటే రాజా గాత్రానికే నిర్మాతలు, సంగీత దర్శకులు ప్రాధాన్యతనిచ్చారు.

నేపథ్యగానం పుంజుకోవడం, రామారావు, నాగేశ్వరరావులు ప్రముఖ నాయక పాత్రధారులుగా నిలదొక్కుకొనడం దాదాపు ఒకేసారి (1950-51 ప్రాంతం) జరిగాయి. ఘంటసాల కంఠంతో వారిద్దరి పాత్రలు పెనవేసుకుపోవడం అదే కాలంలో జరిగింది. 1953-57 మధ్యకాలంలో వారిద్దరికీ రాజా పాడిన పాటలు కొన్ని బహు ప్రశంసలు పొందినా ఆ తరువాత ఆ నాయకులకు పాడే అవకాశం ఆయనకు దొరకలేదు. మన చిత్ర నాయకులు ఎన్నడూ ధీరోదాత్తులు కాబట్టి దానికి తగ్గట్లు కంఠదారుఢ్యం లేక రాజా గొంతు పేలవంగా వుండేదని ఒక విమర్శ లేకపోలేదు. ఇలా రాజా కొంతవరకు నష్టపోయారు.

తొలినుండి రాజాకు స్వంతంగా స్వరకల్పన చేయాలనే ఆశ ఉండేది. చివరకు ఆ ఆశ తెలుగు చిత్రం శోభ (1958) తో ఫలించింది. ఇది హిందీ చిత్రం ‘దులారి’కి (నౌషాద్ సంగీతం) అనుకరణ. అందులో జిక్కీతో పాడిన యుగళగీతం ‘అందాల చిందు తారా’ ((హిందీలో లత, రఫీ పాడిన మిల్‌మిల్‌కే గాయేంగే దో దిల్ యహా అన్న పాటకు అనుసరణ) బాగా ప్రజాదరణ పొందింది. ఆ సినిమా బాగా ఆడకపోవడంతో పాటలూ మరుగున పడ్డాయి. కానీ రాజాను ఒక గొప్ప దర్శకునిగా రూపొందించినది తమిళ చిత్రం ‘కల్యాణ పరిశు’ (తెలుగులో పెళ్ళి కానుక, 1960). దీని వెనుక ఒక చిన్న కథ కూడ ఉంది.

//eemaata.com/Audio/may2009/SObha_1958_AMRaja_Jikki_andaalu_chindu_taaara_VasantKumarReddy_A.M.Raja.mp3అందాల చిందు తారా – శోభ
//eemaata.com/Audio/may2009/Sirpi_SedukkAda_edir_pArAdadu_1954_rAjA.mp3శిర్పి చెదుక్కాద – ఎదిర్ పారాదదు

1950వ దశకంలో తమిrళ చిత్రరంగంలో శ్రీధర్ చిత్రకథ, సంభాషణల రచనలో గొప్ప పేరు సంపాదించారు. అన్నపూర్ణావారి తెలుగు చిత్రాల తమిళ ప్రతులకు వీరు మాటలను రాశారు. శ్రీధర్ చిత్రకథ, సంభాషణలు రాసిన మొదటి చిత్రం ‘ఎదిర్ పారాదదు’ (ఎదురు చూడనిది; ఈ చిత్రానికి తెలుగు ఇలవేలుపు చిత్రానికి పోలికలు ఉన్నాయి.). రాజా ఇందులో పాడిన ‘శిర్పి చెదుక్కాద పొర్చిలైయే’ (శిల్పి చెక్కని స్వర్ణ ప్రతిమా) చాలా ప్రసిద్ధమైన పాట. శ్రీధర్‌కు తాను స్వతంత్రంగా దర్శకుడు కావాలనే కోరిక ఉండేది. ఒకసారి కలిసి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీధర్ తన మొదటి సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకుంటానని రాజాకి మాటిచ్చాడు. ఆ అవకాశం ‘కల్యాణపరిశు’తో కలిసి వచ్చింది.

కొత్తవిధమైన కథ, వ్యావహారిక భాషలో మాటలు, కొత్త నటి (సరోజా దేవి), రాజా స్వరపరిచిన మధుర గీతాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఈ సినిమా ఇప్పటికీ తమిళ ప్రజల మనసుల్లో ముద్రవేసికొని ఉంది. దీపావళి పండుగ సమయంలో ఇందులోని ‘ఆడే పాడే పసివాడా’ అనే పాట ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. ఈ చిత్రంలో రాజాకు అసిస్టెంటుగా పని చేసిన సెబాస్టియన్ డిసూజా (2006లో ఈయనకు శతజయంతి జరిగింది. పాశ్చాత్య సంగీతంలో ప్రసిద్ధికెక్కిన కౌంటర్ మెలోడీని(Counter-melody) చిత్రగీతాలలో ప్రవేశపెట్టిన ఒక గొప్ప అరేంజర్ వీరు) శంకర్-జైకిషన్ వంటి ప్రసిద్ధ సంగీత దర్శకులకు కూడా సహదర్శకుడే. అన్నీ ఒకటై కూడి ‘కల్యాణపరిశు’, దాని తెలుగు అనుకరణ ‘పెళ్ళికానుక’ పాటలు ఒక కొత్త దారిని చూపించాయి.

1 2అంతా ఒకే పేజీలో

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ ఛందఃశిల్పము
  • గీతులు – అనుబంధం 5
  • కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి
  • శ్యామలాదండకపు ఛందస్సు
  • పదకవితా సార్వభౌముడు: క్షేత్రయ్య

ఇటువంటివే…

  1. మరో ప్రపంచం పిలిచింది
  2. మరో గుప్పెడు మొర్మొరాలు
  3. యజ్ఞం కథ: మరో పరిశీలన
  4. కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం – మరో కోణం: విమర్శలు – పరామర్శ
  5. పేరు గలవాడేను మనిషోయ్

మే 2009 సంచికలో ...

  • ఇంట్లో ఎవరూ లేరు
  • ఈమాట పాఠకులకు…
  • ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II
  • ఒక తెలుగు పుస్తకం కావాలి
  • ఒక్కతే… మృత్యువు
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ
  • గాలిపటం
  • గృహకల్ప
  • నాకు నచ్చిన పద్యం: ఉత్తర రామాయణంలో సీత
  • పునరపి
  • ప్రచురణకి వచ్చే రచనల గురించి
  • మనకు తెలియని మన త్యాగరాజు – 5
  • మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా
  • మే 2009 సంచిక విడుదల
  • రామన్న
  • వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గాలిపటం
గృహకల్ప

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.