త్రిపదలు

పరిచయము

భారతీయ సాహిత్యములో పద్యములన్నియు సామాన్యముగా చతుష్పదలు; ద్విపదలను కూడ కొన్ని సమయములలో నుపయోగిస్తారు. కాని త్రిపదలు చాల అరుదుగా మన కళ్ళకు కనబడుతాయి. ఇటీవలి కాలములో జపాను సాహిత్యమునందలి హైకూల ప్రభావమువలన త్రిపదలను హైకూల రూపములో మనము అప్పుడప్పుడు చదువుతుంటాము. కాని ఈ హైకూలను కూడ అలా జపాను సంప్రదాయరీత్యా కాని లేకపోతే మరేవైనా నియమములతో గాని అందఱు వ్రాయడము లేదు, ఎవరికి తోచినట్లు వారు వ్రాస్తున్నారు. వాటిలో భావసాంద్రత ఉన్నా, శిల్పములో లోపములు ఉన్నవేమోనని అనిపిస్తుంది. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము ఛందశ్శాస్త్రములోని త్రిపదలనుగుఱించి సంక్షిప్తముగా చర్చించుటయే.

వేదములలో త్రిపదలు

ఋగ్వేదమును ప్రపంచములో అతి ప్రాచీనమైనదో లేక అతి ప్రాచీనమైన గ్రంథములలో నొకటిగానో పరిగణిస్తారు. ఋగ్వేదములో మొట్టమొదటి పద్యము గాయత్రీఛందములోని త్రిపదయే. అది –

అగ్నిమీళే పురోహితం
యజ్ఞస్త్వ దేవ మృత్విజం
హోతారం రత్నధాతమం – ఋగ్వేదము 1.001.01

(అగ్ని నుచ్ఛుఁ బురోహితున్
యజ్ఞదేవుని ఋత్విజున్
ప్రార్థింతు సర్వభాగ్యదున్
)

అదే విధముగా సంధ్యావందనము చేసేటప్పుడు ఉచ్చరించే గాయత్రీమంత్రము కూడ ఒక త్రిపదయే-

ఓం భూర్భువః స్వః
తత్సవితుర్వరేణ్యం (వరేణియం)
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

(సవితృని మహత్వమున్
భువిపై మనమందగన్
కవించ బ్రస్తుతింతమా
)

వేదములలో గాయత్రీఛందము (పాదమునకు ఆఱు అక్షరములు ఉండే వృత్తముల ఛందము కూడ గాయత్రియే, కాని అవి త్రిపద గాయత్రికి చేరినవి కావు) ప్రసిద్ధి కెక్కినది. ఈ త్రిపదగాయత్రిలో పాదమునకు ఎనిమిది అక్షరములు ఉంటాయి (గాయత్ర్యా వసవః), సామాన్యముగా చివరి నాలుగు అక్షరాలు IUIU రూపములో నుంటాయి (I – లఘువు, U – గురువు).

గాయత్రీఛందము మాత్రమే కాదు, ఇంకను ఇతర విధములైన త్రిపదలు కూడ వైదిక ఛందస్సులో నున్నాయి [1]. అవి ఉష్ణి, కకుప్(భ్), పురాఉష్ణి.

  1. ఉష్ణికి సూత్రము – ఉష్ణిగ్గాయత్రౌ జాగతశ్చ – (పింగళ ఛందస్సు 3.18). ఈ త్రిపదలో మొదటి రెండు పాదములకు గాయత్రివలె ఎనిమిది అక్షరాలు, మూడవ పాదమునకు జగతివలె పండ్రెండు అక్షరాలు, అనగా పాదములలోని అక్షరముల అమరిక 8-8-12. ఉదాహరణకు ఋగ్వేదములోని క్రింది పద్యము –

    తా వాం విశ్వస్య గోపా
    దేవా దేవేషు యజ్ఞీయా
    ఋతావానా యజసే పూతదక్షసా – ఋగ్వేదము, 8.025.01

    (అన్నిటిని కాపాడే మిమ్ములను నేను పూజిస్తున్నాను. మీరు దేవతలు, దేవతలలో నుత్తములు, ధర్మమును నియతితో పాటిస్తారు, మీ యీ శక్తి పవిత్రమైనది)

  2. మధ్య పాదములో 12 అక్షరముల జగతి, మొదటి మూడవ పాదములలో 8 అక్షరముల గాయత్రి అమరికతో (8-12-8) నున్న దానిని కకుప్ లేక కకుభ్ అంటారు. దీని సూత్రము కకుమ్మధ్యే చేదంత్యాః – (పింగళ ఛందస్సు 3.19). ఋగ్వేదమునుండి దీనికి ఉదాహరణ –

    ఆ గంతా మా ఋషణ్యత
    ప్రస్థావానో మాప స్థాతా సమన్యవః
    స్థిరా చిన్ నమయిష్ణవః – ఋగ్వేదము 8.020.01

    (వేగముగా పయనించే మిమ్ములను ఎవ్వరు ఆపలేరు. స్ఫూర్తిమంతులైన మీరు ఇక్కడికి రండి, దూరముగా నుండకండి, ఎంత కఠినమైన వస్తువునైనను మీరు వంచగలరు)

  3. 12-8-8 అక్షరముల అమరికతో నుండే పద్యమును పురాఉష్ణి అంటారు. (పురాఉష్ణిక్పురః – పింగళ ఛందస్సు 3.20). దీనికి ఉదాహరణ –

    యాథా వాసంతి దేవాస్ తథేద్ అసత్
    తాదేశాం నకిర్ ఆ మినత్
    అరావా చన మర్తియః – ఋగ్వేదము 8.028.04

    (దేవతలు ఏమి కోరుకొంటారో, అదే విధముగా జరుగుతుంది. అసురులు గాని, మనుజులు గాని ఈ దైవశక్తిని తగ్గించలేరు)

కకుభ్ ఛందపు అమరికలో ఒక తెలుగు పద్యమును క్రింద ఇస్తున్నాను. పాదాలను మార్చితే ఇదే పద్యమును ఉష్ణిగా, పురాఉష్ణిగా కూడ మార్చవచ్చును. –

హరీ నా హృదయమ్ములో
చిరమ్ముగా స్థిరమ్ముగా మనంగ రా
స్మరింతు ననయమ్ము నిన్

ఉష్ణి, కకుభ్, పురాఉష్ణిలవలె నున్న అక్షరాల అమరికతో మాత్రాగణములతో ఎలా పద్యములను సృష్టించవచ్చునో అనే విషయమును తఱువాత వివరిస్తాను.

తమిళములో త్రిపదలు

వెణ్బా అనే తమిళ ఛందోప్రక్రియను రెండు పాదములనుండి 1000 పాదములవఱకు వ్రాయవచ్చును. ఈ వెణ్బాకు ప్రతి పాదములో నాలుగు శీరులు (గణములు) ఉంటాయి, చివరి పాదములో మాత్రము మూడే ఉంటాయి. రెండు పాదముల వెణ్బాను కురల్ వెణ్బా అంటారు. అలాగే మూడు పాదముల వెణ్బా కూడ ఉన్నది. వీటిని చిందియల్ వెణ్బా అంటారు [2]. కొన్ని వెణ్బాలలో మొదటి రెండు పాదములకు మాత్రమే ప్రాస ఉంటుంది. ఇవిగాక వెణ్‌తాళిశై అని కూడ త్రిపదలు ఉన్నాయి. పాదములలో నాలుగు గణములకన్న ఎక్కువగా ఉండే వెణ్బాలు కూడ ఉన్నాయి. క్రింద ఒక రెండు ఉదాహరణలు –

ఇళమళై యాడు మిళమళై యాడు
మిళమళై వైగలు మాడుమెన్ మున్‌గై
వళై నెగి వారాదోన్ కున్ఱు – కలిత్తొగై 25

(నా ముంజేతులనుండి గాజులు జారేటట్లు చేసినవాడు పెద్ద కొండైనా కూడ వానజల్లులా మాత్రమే ఉంటాడు; అది కొంతసేపు కురిసే జల్లుకాదు, రోజంతా కురిసే వానజల్లు)

ఆర్వుట్రార్ నెంజమళియ విడువానో
వోర్వుట్రెరుదిఱ మొల్గాద నోగో
లఱంబురి నెంజత్తవన్ – కలిత్తొగై 42

(ఏ ఒకవైపు మొగ్గకుండా ఉండే త్రాసుముల్లులా ధర్మమును అనుసరించేవాడు తన్ను ప్రేమించినదాని మన్సును నాశనము చేస్తాడేమో? [చేయడనుకొంటాను])

వళైందదు విల్లు – విళైందదు పూశల్
ఉళైందన ముప్పురం ఉందీపఱ
ఒరుంగుడన్ వెందవా రుందీపఱ – తిరువాశగం, శివపురాణం, 14.1

(విల్లు వంగింది, యుద్ధము ఆరంభమైనది. త్రిపురములు నశించి బూడిదగా మారింది. ఆ మంచి వార్తను తలచుకొంటే అత్యద్భుతమైనదిగా తోచుతుంది. ఇదొక ఆనంద ఘడియ.)

చివరి ఉదాహరణను కొందఱు 4-6 శీరులతోడి ద్విపదగా భావిస్తారు.