సువర్ణభూమిలో …

ముఖాముఖి
సుఖాసీనులై
బుద్ధులు

వాడని కలువలు
అలముకునే ధూపం

ఎదురెండలో
ఎర్రచారల పిల్లి
చెలగాటమాడుతుంది
తలను పాదాలమీదుంచి

ఎన్నో మెట్లెక్కి
గర్భ గృహంలో
గబ్బిలాలను
అదిలిస్తున్నాడు
విహారభిక్షువు


నీటితొట్టెలోని
కలువమీద
తేనెటీగ

బంగారు బుద్ధుని ముందు
ముంగాళ్ళమీద కూచుని
కలువలు సమర్పించాము.


పరాయి భాషలో
పరిశీలకులకు
వివరిస్తున్నాడు
ఎవరి దాడిలో
ఏది నశించిందో

ఊడల్లో చిక్కిన
బుద్ధుని శిరసు
ఎడతెగని
ధ్యానంలో
మొండెం

చూడవచ్చిన కుక్కపిల్లను
ఒడిలోకి తీసుకుంది ఆవిడ


సముద్రం అడుగున

తల ఎత్తక,దించక
నిలిచి గమనించు-
నీ చుట్టూ పెరిగిన
నాచు మొక్కలను
గాజు అద్దాలను
మోజుగా తాకే
వరుసచేపలను

బరువుగా ఊపిరి
నీరు తేల్చివేస్తుంది.

పైకి కిందికి చూశావా
ప్రాణవాయువు అందక
గజ ఈతగాళ్ళకు తక్షణం
నిజంగా,పని పెడతావు.


థాయ్ భాషను
ఆరుగంటల్లో నేర్చి-
పేర్లు చదవసాగాను.

ప్రియురాలు మనసును
ఛాయామాత్రంగానైనా
ఆనవాలు పట్టలేను.

(ధర్మపత్ని అరుంధతికి)

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...