పరిచయము
చంపకమాలను ధృతశ్రీ అనే పేరుతో మాఘకవి శిశుపాలవధలో మొట్టమొదట వాడెను. తఱువాత కాశ్మీరకవి రత్నాకరుడు హరవిజయములో నీ వృత్తమును ఉపయోగించెను. నా ఉద్దేశములో నర్కుటక వృత్తమునకు శ్లోకములో, త్రిపద గాయత్రిలో సరి పాదములలో చివరి నాలుగు అక్షరములైన రెండు లగములను, అనగా IUIU చేర్చగా నీవృత్తము లభిస్తుంది. బహుశా మాఘకవి కల్పన ఈ విధముగా నుండియుంటుంది. శైలశిఖ అనబడు వృత్తమునకు IUIU చేర్చినప్పుడు ఉత్పలమాల లభిస్తుంది. చంపకమాలలోని మొదటి రెండు లఘువులకు బదులు ఒక గురువును ఉపయోగించినప్పుడు కూడ మనకు ఉత్పలమాల జనిస్తుంది. ఇట్టి ఉత్పలమాలా వృత్తమును మనము శాసనములలో చూడ వీలగును. ఈ నర్కుటక, శైలశిఖా వృత్తములు పింగళ ఛందస్సులో “అత్రానుక్తం గాథా” అని చెప్పబడినవి. పిదప కన్నడ, తెలుగు కవులు చంపకోత్పలమాలలను తమ చంపూ కావ్యములలో విరివిగా వాడినారు. ఈ రెండు భాషలలో నివి ఖ్యాత వృత్తములే. కందము పిదప ఎక్కువగా వాడబడిన ఛందము ఈ మాలికావృత్తములే. నేను వ్రాసిన చంపకోత్పలమాలల కథ అనే వ్యాసములో ఈ విషయములను సుదీర్ఘముగా చర్చించియున్నాను. ఏది ఏమైనా ఈ మాలికా వృత్తములు సంస్కృతములో అరుదు.
కాకవిన్
క్రీస్తు శకము ఆఱు నుండి ఎనిమిదవ శతాబ్దముల మధ్యకాలములో దక్షిణభారతదేశము, బహుశా వంగదేశము, ఆగ్నేయా ఆసియా ప్రాంతముల మధ్య రాజకీయ, సాంస్కృతిక, వర్తక రీత్యా సంపర్కములు జరిగినవి. అట్టి కాలములో సంస్కృత ఛందస్సు కూడ ఆ వలస రాజ్యములకు వెళ్ళినది. ఇప్పటి జావా, కంబోడియా, వియెట్నాం, బలిద్వీపము మున్నగు ప్రాంతములలో నేడు కూడ విష్ణువు, శివుడు, మున్నగు దైవముల ఆలయములు శిథిలావస్థలో నున్నాయి. అక్కడ సంస్కృత పద్య శాసనములు కూడ ఉన్నవి. కొన్ని మందాక్రాంతా శాసనములను ఇంతకుముందే నేను తెలిపియున్నాను. జావాలో సంస్కృత పదములతో కూడుకొన్న ప్రాచీన జావాభాషలో కావ్యములను వ్రాసినారు అక్కడి కవులు. వీటిని కాకవిన్ అంటారు. కాకవిన్ రామాయణము మొట్టమొదట వెలువడినది. అది సంస్కృత ఛందములలో వ్రాయబడినది. అంతే కాదు, అక్కడి కవులు, లాక్షణికులు క్రొత్త ఛందములను కూడ కల్పించినారు. ఈ కాకవిన్ రామాయణము సుమారు 6 నుండి 8 శతాబ్దముల కాలములో వ్రాయబడి యుండవచ్చును. దానికి పిదప సుమారు క్రీ.శ. 1030 ప్రాంతములో (మన నన్నయకంటె ముందు) అర్జునవివాహము అనబడు 36 సర్గముల ఒక ప్రబంధ కావ్యమును ఎంపు కణ్వ (Mpu Kanwa) అను కవి వ్రాసెను [Arjunawiwaha, Mpu Kanwa, Ed. and trans. Stuart Robson, KITLV Press, Leiden, 2008]. సంస్కృత కావ్యములలోవలె ప్రతి సర్గ ఒకే ఛందములో వ్రాయబడినది. అందులో పదునైదవ సర్గ కుసుమవిలసిత అను ఛందములో, పదునాఱవ సర్గ తురిదగతి అను ఛందములో వ్రాయబడినది. ఈ కుసుమవిలసిత వృత్తపు లయ ఉత్పలమాల లయయే. అదే విధముగా తురిదగతి లయ చంపకమాల లయ. ఈ రెండు వృత్తములకు చంపకోత్పలమాలలకు ఉన్న భేదమల్లా మాలికా వృత్తములలోని ఒక గురువు వీటిలో రెండు లఘువులు అయ్యాయి. కాని ఇవి మాలికా వృత్తముల ద్వారా సృజింపబడలేదు. వీటికి మూలము నర్కుటకము, శైలశిఖ కావు. ఇవి వంశపత్రపతిత ద్వారా ఉద్భవించినవని నా నమ్మకము. ఈ వ్యాసములో చర్చింపబడిన వృత్తములను మొదటి చిత్రములో చూడ వీలగును. అన్ని వృత్తములలో మార్పు మొదటి, ఐదవ భాగములలో మాత్రమే, మిగిలిన వాటిలో నెట్టి మార్పు లేదు.
వంశపత్రపతిత, సువంశపత్రపతిత
వంశపత్రపతిత ఒక పురాతన వృత్తము. ఇది వంశదళము అను పేరుతో నాట్యశాస్త్రమునందు పేర్కొనబడినది. ఈ వృత్తపు గణముల అమరిక భ/ర/న/భ/న/లగ, అనగా UII UIU III UII IIIIU. నర్కుటకమునందలి గురువైన 14వ అక్షరము వంశపత్రపతితలో రెండు లఘువులు. అనగా దీని లయ నర్కుటపు లయ ఒక్కటే. నర్కుటకమునకు చివర IUIU చేర్చినప్పుడు మనకు ఉత్పలమాల లభిస్తుంది. అదే విధముగా వంశపత్రపతితకు IUIU చేర్చినప్పుడు మనకు కాకవిన్ కవులు వాడిన కుసుమవిలసిత వృత్తము లభ్యమవుతుంది. కాకవిన్ లాక్షణికులు చేసిన మఱొక గొప్ప విషయము: వంశపత్రపతితలోని మొదటి గురువుకు బదులు రెండు లఘువులను ఉంచి చేసిన మఱొక వృత్తపు కల్పన. ఇది వంశపత్రపతితనుండి పుట్టినదని తెలుపుటకో యేమో దీనికి సువంశ లేక సువంశపత్ర అని పేరు పెట్టారు. సువంశ అనే వృత్తపు గణముల అమరిక న/జ/భ/జ/న/స, అనగా IIII UIU III UII IIIIU. సువంశ వృత్తమును రత్నాకరుడు తన హరవిజయములో పదునాలుగవ సర్గాంతమున రచించెను. కాని ఈవృత్తపు పేరు తెలియదు. సంస్కృత సాహిత్యములో ఈవృత్తపు ప్రయోగము ఇదొక్కటే అనిపిస్తుంది. ఈ సువంశ వృత్తమునకు చివర IUIU చేర్చినప్పుడు లభించిన వృత్తమును కాకవిన్ లాక్షణికులు తురిదగతి (త్వరితగతి) అని పిలిచినారు. లఘువుల సంఖ్య ఎక్కువగా నుండుటవలన ఈ పేరును ఉంచినట్లున్నది.
హరవిజయములోని ‘సువంశ’ వృత్తము:
ఉడుపథమండలం భవతు మా శుచి రవి నిపత-
ద్దినకర ఖండ చండ చండులీ నిబిడతర తడిత్
దిశి దిశి మా క్షుమజ్వలధయః పిశునితసమరాః
ప్రచుర వికీర్ణ రత్న పటలీశ బలతటభువః – రత్నాకరుని హరవిజయము, 14.60.
కుసుమవిలసిత
క్రింద కుసుమవిలసితకు అర్జునవివాహము నుండి ఒక ఉదాహరణము (చిత్రము 2). దీనికి తెలుగులో నా అనువాదమును మూలముతో సహా యిచ్చియున్నాను. తెలుగులో పద్యమును చదివినప్పుడు అర్థము కాకపోయినను, ఉత్పలమాల లయ ప్రస్ఫుటమవుతుంది. కాకవిన్ కవులు విరామయతిని పాటిస్తారు. ఇందులో పద్యము 10/11 అక్షరములకు విఱిగినట్లున్నది. కాని నేను తెలుగులోని ఉత్పలమాలవలె అక్షరసామ్య యతిని, ద్వితీయాక్షర ప్రాసను ఉంచినాను.
అంబరమార్గ లాలన తుహున్ హతి నిర పడ కబ్వతన్ లులుత్
మోఘ మహిర్యహిర్యననహాఁ గ్రుముహున సకరెంగ్ పరెంగ్
సంగ్ నృపపుత్ర మోజరిబు తోహ్ రునుహున కిత హయ్వ తాకెముల్
దక్ పహవస్ లరిస్ నిపనెపింత రినచనని పింగిరింగ్ తపిల్ – అర్జునవివాహ, 15.4.
అంబర మార్గమందుఁ జనిరప్పుడు హృదు లతి భారమొంద నా
సంబరమందు ముందెవరు సాఁగుట, కలిసె క్షణమ్ము గన్ను లే-
కంబుగ, “మీరు పోవుడిఁక కప్పు వల” దనెను రాకుమారుఁ “డా
యంబరమంటు నెన్నడుము నప్పుడు కనెదను సంతసమ్ముతో”
నేను కాకవిన్ లాక్షణికులు కల్పించిన ఈ కుసుమవిలసిత వృత్తపుటునికి తెలియకముందు జులై 2013లో సితోత్పల అని పేరునుంచి కల్పించినాను. క్రింద తెలుగులో కుసుమవిలసిత వృత్తమునకు నా ఉదాహరణములు:
కుసుమవిలసితము (సితోత్పల): భ/ర/న/భ/న/జ/ర 21 ప్రకృతి 720343
ఉత్పలమాలవలె అక్షరసామ్య యతితో:
రేతిరిలో సితోత్పలము – లెల్లెడఁ గొలనులనిండఁ బూయఁగాఁ
జేతమునందుఁ గ్రొత్తగను – జిందెను సరసపుటాశ తుంపరల్
వాతము దెచ్చె మన్మథు సు-వాసన లలరెడు పూలతూపులన్
శీతలవేళ దుప్పటిని – జేరుద మతిసుఖ మొంద నిప్పుడే
సంపఁగివలె (4,5,5 – 4,5,5 మాత్రల విఱుపుతో):
ప్రేమము నిక్కమై మనసులో – విలసిత సుమమేమొ చక్కఁగా
శ్యామల వేళలోఁ శశి రుచుల్ – యవనికి దిగజారెఁ జిక్కఁగా
కోమల భావముల్ పెదవులన్ – గులుకుల రవమయ్యె గీతిగా
సీమల దాటునో తురితమై – చెలువపు నది నేఁడు ప్రీతిగా
భావము గల్గె నాకుఁ జెలి యా – వనమున విరియో విలాసినీ
కావున నీవు నాకెదురుగాఁ – గనుగవ సిరియో కలాపినీ
దేవుని దల్చుచుంటిని సకీ – దినమున ద్యుతియో విలోలినీ
మైవిరిసెన్ గదా మధురమై – మనమున స్మృతియో కలామయీ
చివరి పద్యములో గర్భితమై కొన్ని వృత్తములు గలవు. అవి:
1. వంశపత్రపతిత: భ/ర/న/భ/న/లగ 17 అత్యష్టి 64983.
భావము గల్గె నాకుఁ జెలి యా – వనమున విరియో
కావున నీవు నాకెదురుగాఁ – గనుగవ సిరియో
దేవుని దల్చుచుంటిని సకీ – దినమున ద్యుతియో
మైవిరిసెన్ గదా మధురమై – మనమున స్మృతియో
2. కలువ లేక హైమన: భ/ర/న/గ 10 పంక్తి 471 (ఈ ఉదాహరణములో యతి లేదు).
భావము గల్గె నాకుఁ జెలియా
కావున నీవు నాకెదురుగాఁ
దేవుని దల్చుచుంటిని సకీ
మైవిరిసెన్ గదా మధురమై
3. మధుమతి: న/న/గ 7 ఉష్ణిక్కు 64.
వనమున విరియో విలాసినీ
కనుగవ సిరియో కలాపినీ
దినమున ద్యుతియో విలోలినీ
మనమున స్మృతియో కలామయీ
4. విలాసినీ: జ/గ 4 ప్రతిష్ఠ 6.
విలాసినీ
కలాపినీ
విలోలినీ
కలామయీ
తురిదగతి
ఈ తురిదగతి వృత్తములో అర్జునవివాహములోని పదునాఱవ సర్గలోని పద్యములు వ్రాయబడినవి. అందులోనుండి ఒక ఉదాహరణము (చిత్రము 3):
పతన నరేంద్రపుత్ర సుమహుర్ సఁగహయు తుహు లింగ్ నృపాత్మజా
నియత మమండిమండి తుమెకాన విబుధపతి కప్వ సంగ్రహ
అమయహు సంజతాశ్రమ రికంగ్ లెబుహలపలపన్ మభైరవ
తుహు మత యన్ పితుంగ్ వెఁగి హినెర్మ్య లుమురుగ మరెంగ్ కదేవతన్ – అర్జునవివాహ, 16.8
అడుగ నరేంద్రపుత్రుఁ డపు డబ్జవదన యనె “నిక్కమౌను నీ
నుడులు, సురేంద్రుఁ దాఁకగను నూతన చమువుల సిద్ధమైరి, ము-
న్నడుగుల వేయుచుండిరి, మహాయుధములఁ బలు సేకరించి వి-
న్నొడయని నేడు రోజులకు నొప్పుగ సమరమునందుఁ బోరిడన్”
నేను తురదగతికి (త్వరితగతికి) తెలుగులో వ్రాసిన ఉదాహరణములు:
త్వరితగతి – న/జ/భ/జ/న/స/జ/గ 22 ఆకృతి 1440688.
చంపకమాల విఱుపుతో: IIII UIU III – UII IIII UIUIU
వికసితమయ్యెఁ బుష్పముగ – వేణువు స్వరముల విన్న వెంటనే
రకరకమై మనమ్మిదియు – రంగుల మయికములోనఁ బాడె, నా
సుకమన నిద్దియే నిజము – సుందరమగు కలలోఁ జరించుటే
మొకమును జూప రమ్ము నవ – మోహన నగవుల వేల్పువిల్లుతో
దినముల రాత్రులందుఁ బెను – దీపపు వెలుఁగులుగా ముదమ్ముతో
మనమున నుందు వెప్పు డతి – మార్దవమగు విధమై సుధామయీ
విను భువనైకసుందరి నిను – వీడఁగ నగదు కదా మదాలసా
ప్రణయములోన నేను బ్రణ-వమ్మును గనెద సకీ సదాశివా
పై పద్యములోని సువంశ వృత్తము (సువంశపత్త్ర ) వృత్తము: న/జ/భ/జ/న/స 18 ధృతి 129968 IIIIUIUIII – UIIIIIIU
దినముల రాత్రులందుఁ బెను – దీపపు వెలుఁగులుగా
మనమున నుందు వెప్పు డతి – మార్దవమగు విధమై
విను భువనైకసుందరి నిను – వీడఁగ నగదు కదా
ప్రణయములోన నేను బ్రణ-వమ్మును గనెద సకీ
సంపఁగి విఱుపుతో – IIII UIU IIIU – IIII IIUI UIU
ప్రియతమ రేయిలోఁ దమములో – విడకుము నను నిట్టు లొంటిగా
భయమయె బేలకున్ మనసులో – వదలఁగఁ గవుఁగిలిన్ వెచ్చఁగాఁ
బయనము వేకువన్ వెలుఁగులోఁ – బవనపు సడులలో సాఁగని
మ్మయుగము రాత్రిలోఁ దగదురా – హరుసము వ్యధలుగా మారురా
విలసితమైన యీ వనములో – విరిసెను ముదమెల్ల రంగులై
కలవరపాటుతో భ్రమరముల్ – గలరవములఁ జేసెఁ బొంగులై
లలితుని జూడఁగా మనసులో – రసమయముగఁ బ్రేమ గంగగా
మెలమెలఁ బార నా యనుభవ – మ్మిట హృదయములో నభంగమే
(నాకు కాకవిన్ ఛందస్సుపై ఆసక్తి కలిగించిన ఆచార్య వేటూరి ఆనందమూర్తిగారికి నా కృతజ్ఞతాపూర్వక వందనములు.)