పులికన్ను రక్తం

బిగదీసి కళ్ళెం

ఉరికించు గుర్రం

పులికన్ను రక్తం

ఒలికించునేమో..

ముదురు చీకటి

క్షణకాల మాత్రం

పొదరింట నేత్రం

పసిగట్టునేమో..

వదులు కురులు

సవరించు హస్తం

అపరాత్రి నేస్తం

నిదురించునేమో..

చెదిరి సరసు

పరికించు పత్రం

అరవిచ్చి పద్మం

ససివాడునేమో..

పొగమంచు దట్టం

పొగరెక్కి వర్షం

చినుకు చినుకు

పెనవేయునేమో..

ఎగిరెగిరి వక్షం

దిగజారి వస్త్రం

కలలోన శబ్దం

విలపించునేమో..

ఇసుక ఇసుక

ఉసిలేని సంద్రం

అలరాని గర్భం

తలతిప్పునేమో..

కొనదేలి ఖడ్గం

కడతేరి ప్రాణం

అరచేతి ఘాతం

మరణించునేమో..

బిగదీసి కళ్ళెం

ఉరికించు గుర్రం

పులికన్ను రక్తం

ఒలికించునేమో..

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...