సుమధుర సందర్భోచిత స్వర రచన

” సమ్యక్ గీయతే ఇతి సంగీతం” అని నిర్వచించారు స్వర భాషావేత్తలైన సంగీతజ్ఞులు.

Music starts with M, means Melody ఆ మెలడీని తీసి వేస్తే మిగిలేది usic అంటే, Music without melody make you say, usic అనగా you sick . ఈ మాటని ఎప్పుడు ప్రస్తావించినా, నా సహ గాయక మిత్రులు, శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అది నేను ( PBS ) చెప్పిన విషయంగా చెప్పి మరీ చెబుతారు. అది ఆయన సంస్కారానికి నిదర్శనం. చలన చిత్రాలలో నేపథ్యగానం ప్రారంభమయినప్పటినుండీ చిత్ర సంగీతం బహు బృహత్పరిణామాలకి గురి అవుతూనే వస్తూ ఉంది. తెలుగు చలన చిత్రాలలోని సంగీతంపై హిందుస్తానీ సంగీత ప్రభావం ఎక్కువగానే ఉండేది. తమిళ, కన్నడ చిత్రాలలో శాస్త్రీయ సంగీత ప్రభావమూ, ఒకింత హిందుస్తానీ సంగీత శైలి ప్రభావము కూడా తగు పాళ్ళలో ఉండేది. గొప్ప గొప్ప గాయక గాయకీమణులు అతి మధురంగా గీతాలను సన్నివేశానుసారంగా, భావయుక్తంగా పాడుతూ రసజ్ఞ ప్రేక్షకులను రంజింప చేస్తూ కళాసేవ చేస్తూ వస్తున్నారు. 1970, 1980 వరకీ సంగీతంలో సాహిత్యానికీ, మాధుర్యానికీ అత్యధిక ప్రాధాన్యత ఉండేది. తరువాత లేదని కాదు. కాస్త మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్న విషయం ఎందరెందరో రసిక ప్రియులు ఫీలవుతున్న మాట ముమ్మాటికీ నిజం! కాలగమనాన్ని అనుసరిస్తూ సంగీత దర్శకులు తమ స్వర విధానాలను మార్చుకుంటూ విజయాలు సాధిస్తున్నారు.

చిన్నప్పుడు స్కూలు కాలేజీ రోజుల్లో నేను చలన చిత్రాలలో ఉపయోగింపబడే లలిత, శాస్త్రీయ సంగీతాలననుసరించి కూర్చబడే ట్యూన్ లు బాగా అధ్యయనం చేసి, కాకినాడ పి ఆర్ కాలేజీలో పదిమంది మెప్పులతో పాటు, కప్పులు సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కర్ణాటక శాస్త్రీయ సంగీతం పై శ్రద్ధ వహించకపోవడానికి కారణం, ఒకసారి ఓ సంగీత పండితుడు మా పక్కింటి అమ్మాయికి దర్బారు రాగంలో ఒక వర్ణం ” పలుకూ వూ వూ వూ వూము నా ఆ ఆ ఆ ఆ తో” అని పదాలు, ఆ పదాల అర్థం తెలియని రీతిగా విసంధులు చేస్తూ పాడడం వల్ల ” ఈ పద్ధతి మనకి పనికి రాదు ” అనే నిర్ణయానికి రావడం జరిగింది. తదనంతరం గొప్ప గొప్ప విద్వాంసులు సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తూ పాడడం విన్నాక గానీ, శాస్త్రీయ సంగీతం వైపు దృష్టి మళ్ళలేదు. సంగీతంలో సాహిత్యం అంత ముఖ్యం కాదని వాదించే వారి అభిప్రాయంతో ఇప్పటికీ ఎప్పటికీ నేను ఏకీభవించను. సాహిత్యం లేకున్నా సంగీతం విని ఆనందించగలగడం సంభవమే అయినా, ఆ రెండిటికీ సమ పాళ్ళలో ప్రాధాన్యత ఇస్తూ వరుసలు కూర్చి పాడితే లభించే మధురానుభూతి నిస్సందేహంగా అపరిమితమని నా వినీతాభిప్రాయమూ, మధురానుభవమూనూ. పాటలు పాడే టప్పుడు పదాలని చక్కగా స్పష్టంగా పలుకుతూ సన్నివేశానుసారంగా, భావ యుక్తంగా పాడగలిగితే పారవశ్య పరాకాష్టని చేరుకొనే సముచితానుభూతి కలుగుతుందనడం ఎంతైనా సమంజసం!

సన్నివేశానికి తగిన logic తో పాటు Time matching కుదిరితే ఆ ఆనందమే వేరు. అలాగే, ట్యూను ముందు కుదిర్చినా, దానికనుగుణంగా lyric కూర్చగలిగినప్పుడు ఆ పాటలు ఎంతో మధురంగా ఉంటాయి. ఇందుకు సముచిత తార్కాణంగా నా చిన్నప్పుడు అట్టి అనుభూతి కలిగించిన రెండు పాటలు (హిందీవి), నౌషదూ, సి రామచంద్ర గార్లు ట్యూను చేసిన అర్థ భావ యుక్త గీతాలు పేర్కొనడం సమంజసం!

నౌషద్ స్వర పరచిన “దీదార్” సినిమాలో పాట ఆ రోజుల్లో నా ఆడిషన్ సాంగ్! ఎక్కడ ఎవరు పాడమన్నా మహమ్మద్ రఫీ అమోఘంగా ఆలాపించిన ఆ రోజుల్లో పాపులర్ సాంగ్ ” హుయే హం జిన్ కే లియే బర్బాద్ ” పాటని పాడేవాణ్ణి. ఆ పాటలూ, సాహిత్యం తలచుకున్నా, అలాగే సి రామచంద్ర స్వరకల్పనలో లతా మంగేష్కర్ పాడిన “తుం క్యా జానో, తుమ్‌హారీ యాద్ మే” పాటని విన్నా మనసు అనందానుభూతుల్లో తేలియాడుతుంది. అది అనిర్వచనీయమైన అనుభూతి. ఇలాంటి స్వరగీత రచనలు అప్పుడప్పుడు మాత్రమే లభిస్తూ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల హిందీ చిత్రంలో పాటలే ప్రస్తావించడం జరిగింది. మన దక్షిణాది సంగీత దర్శకులు ఎంతో మధురంగా స్వర పరచిన ఎన్నెన్నో గీతాలు హృద్యంగాను, మనసుని కుదిపినవీ ఉన్నాయి. మల్లీశ్వరి, అనార్కలి, దేవదాసు, చిరంజీవులు, సువర్ణ సుందరి, ఆడబ్రతుకు, మూగమనసులు ఇలా ఎన్నో చిత్రాలు ఉన్నాయి. పెండ్యాల గారి సంగీతంలో ఎస్ జానకి పాడిన “నీలి మేఘాలలో”, బంగారు పాప సినిమాలో సుశీల పాడిన “కనులకొక సారీ…” పాటలూ గొప్ప పాటలే! కొన్ని కొన్ని గీతాల గురించి పేజీలు పేజీలు రాసినా సరిపడదు. ఆడ బ్రతుకు లో నే పాడిన “తనువునకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా, మనసునకొక గాయమైతే మాసిపోదు చితిలో నయినా ” వంటి ప్రత్యేక స్వర రచనలు నిరుపమానాలు. ఇందులో ఎందరెందరో మహానుభావులు స్వర పరచిన అన్ని పాటలూ ప్రస్తావించేందుకు అవకాశం లేనందుకు క్షమించాలి.

ఉత్తమ సాహిత్య సంగీతోపేత మనోహర గీతాలు మున్ముందు కూడా మీకు లభ్యం కావాలని ఆశిస్తున్నాను.