సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు.

(సేకరణ: పరుచూరి శ్రీనివాస్)

సిరిమువ్వలు

ఆకాశవాణి పత్రిక ‘వాణి’లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల ప్రకటన చూసి 1969లో ఒకనాడు రేడియోస్టేషనుకు వెళ్ళి శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారిని కలిశాను. “ఈ ఉద్యోగాలు నీకెందుకయ్యా! మంచి సంగీతనాటిక రాసి ఇవ్వు ప్రచారం చేద్దాం” అన్నారాయన.


సిరికాకొలను చిన్నది
వేటూరి సాహితీ సమితి ప్రచురణ
2004, రూ.60.00

ఎన్నాళ్ళనుంచో ఈ ‘సిరికాకొలను చిన్నది’ అంతరంగ స్థలం మీద అప్పటికే గజ్జె కట్టి ఆడుతూ వుండేది. కూనిరాగాలు తీస్తూ ఉండేది. శ్రావణిగా, సుధాలాపసుందరిగా వినిపించేది. నర్తనబాలగా, ముకుందమాలగా కదిలేదీ కదిలించేది. మురిపిస్తూనే ముముక్షువును చేసేది. రజనీకాంతరావుగారి మాటతో, మా తండ్రిగారి (డాక్టర్ వేటూరి చంద్రశేఖరశాస్త్రి గారు) ఆజ్ఞతో వెంటనే మద్రాసు వెళ్ళి రాత్రింబవళ్ళు రాసి ఈ అందాలరాశిని నేను తొలిసారిగా అక్షరాలా చూసుకున్నాను. పద్యాలు, పదాలు, పాటలు, గద్యాలు, పలు విన్యాసాలు! రేడియో నాటిక గదా అని చాలా కుదించాను.

అంతకుముందు రూపక రచనలో చేయి తిరిగినవాడను కాను. రాగతాళాలకు, స్వరకల్పనకు సరి తూగుతుందో లేదో అని సందేహం వచ్చింది. వెంటనే నాకు ఆప్తులు, బంధువులు అయిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారికి ఈ కాగితాలన్నీ యిచ్చి నా సందేహం చెప్పాను.

దాదాపు రెండుగంటలపాటు వంచిన తల ఎత్తకుండా ఆయన నాటిక అంతా చదివి, “దీనికి సంగీతం నేనే చేస్తాను” అంటూ రజనీకాంతరావు గారికి ఫోను చేశారు. “మీరు చేస్తే అంతకన్నా కావలసిందేముంది. అయితే ఆ స్క్రిప్టు నేను ఇంతవరకూ నేను చూడలేదు. అది వెంటనే పంపమనండి” అన్నారు రజనీగారు.

అటు తరువాత రజనీకాంతరావు గారి సూచనల మేరకు దానిని మరింత తగ్గిస్తే ఒకటిన్నర గంటల నాటిక అయింది. అప్పటికి గంటకు మించి ఆకాశవాణి రూపకాలు లేవు. కానీ సాహితీ సంగీత పక్షపాతులు, స్వయంగా కవీ, సాహితీవ్రతులూ అయిన రజనీకాంతరావు గారు సిరికాకొలను చిన్నది నాటికను గంటన్నర కార్యక్రమంగా ప్రత్యేక అనుమతి పైనుంచి తెప్పించి మరీ ప్రసారం చేశారు. పునః పునః అనేకసార్లు ఈ నాటిక ప్రసారం అయింది. తెలుగు సాహితీపరుల ఆదరాభిమానాలకు నోచుకుంది. శ్రీ పెండ్యాలగారు విజయవాడలో 20 రోజులు వుండి దీనిని ఒక యజ్ఞంగా నిర్వహించి స్వరబద్ధం చేశారు.


వేటూరి సుందరరామమూర్తి
1936-2010

ఇది కథో కల్పనో నాకు తెలియదు. కానీ ఇది సజీవశిల్పం. ఈ శిల్పం చెక్కడానికి ఉలి, ఊపిరి, శిలా, వైఖరి మాత్రం నా మాతామహుల వారసత్వం. అందుకే ఇది వారికే అంకితం.

తన వాణితో తెలుగు నేలను పులకింపజేసి ఆకాశవాణిగా, అశరీరవాణిగా, అందని లోకాలలో అమరగాయనిగా మిగిలిపోయిన కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారు కథానాయిక ‘అలివేణి’గా అందరి హృదయాలలో నిలిచిపోయారు.

శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు. శ్రీ శ్రీగోపాల్, శ్రీ మల్లిక్, శ్రీ ఎన్.సి.వి. జగన్నాధాచార్యులు, మరెందరో ఈ చిన్నదానికి సింగారాలు దిద్దిన మహనీయులు. అందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేయడం తప్ప నేనేమి చేయగలను! వారి పుణ్య సంస్మరణకే ఈ నాలుగు మాటలూ….

– వేటూరి సుందరరామమూర్తి
హైదరాబాద్, 6-7-2004.