యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో

ఈమాటలో మొదటినుండీ శబ్దతరంగాలనే శీర్షిక కింద ఎన్నో అపురూపమైన ఆడియోలు ప్రచురించాం. ఇవి పాఠకులను ఎంతగానో అలరించాయి కూడా. అయితే, కాలం గడిచేకొద్దీ పాతసంచికల రచనలు మరుగున పడడం సహజం. అలా మరుగున పడినవాటిని వెలికితీసి అందరికీ అందుబాటులో ఉంచాలనేది మా కోరిక. మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగులో ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. ఇది ఇప్పుడు అందరూ వాడుతున్నదీ, అందరూ తేలిగ్గా కావలసినవి వెదుక్కుని ఆనందించగలిగినదీ కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. ఎందరో ఔత్సాహికులు ఈమాట లోని కథలను కవితలను ఆడియోరూపం లోకి తెస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. వాటిని ఈ ఛానల్ ద్వారా ప్రచురించబోతున్నాం. కథలతో పాటు అలనాటి పాటలు, రూపకాలు, అరుదైన సాహితీవేత్తల గొంతులు, సంభాషణలు, ప్రాచుర్యంలో ఉన్న ప్రైవేట్ గీతాలు ఇలా అన్నింటినీ ఇక్కడ పొందుపరచబోతున్నాం. ఇలా ఈమాటలోని ఆడియోలు అన్నీ సమయానుకూలంగా అక్కడ అందరికీ సులభంగా అందుబాటులో ఉంచబోతున్నాం. అంతే కాక, సరికొత్త ఆడియో వీడియో రచనలకు కూడా చోటు కల్పించబోతున్నాం. ఈ మహాప్రయత్నంలో మాకు సహకరించి, ముందుండి నడిపిస్తున్న ప్రశాంతి చోప్రాగారికి, సహాయ సహకారాలందిస్తున్న పరుచూరి శ్రీనివాస్, తదితరులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా, పాఠకుల నుంచి కూడా కంటెంట్ ఆహ్వానిస్తున్నాం. ఈమాట నియమావళికి అనుగుణమైన శబ్ద-దృశ్య-రచనలను ఈ ఛానల్ ద్వారా ప్రచురించగలం. ఈ ఛానల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసి మా ప్రయత్నాన్ని విజయవంతం చేయమని ఈమాట పాఠకులకు మనవి.


గతనెలలో కొత్తగా:

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా రెండు ప్రముఖ సంగీత సంప్రదాయాల్లోని అష్టదిగ్గజాల గురించి ఐదు భాగాల ఆడియో-వ్యాసం.

ఈమాట వ్యాసం: రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు
రచన: నాగరాజు పప్పు

Part-1: Introduction
Part-2: అన్నమయ్య – బాఖ్
Part-3: త్యాగయ్య – మోజార్ట్
Part-4: దీక్షితార్ – బీతోవెన్
Part-5 (ముగింపు): శ్యామశాస్త్రి-వాగ్నెర్

ఈ వ్యాసం పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికీ, కర్ణాట శాస్త్రీయ సంగీతానికీ ఉన్న సారూప్యాలూ, ఈ రెండు సంగీత సంప్రదాయాలని మహోన్నత స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుల జీవితాలలోను, ఆ సంగీత సంప్రదాయాన్ని వారు తిప్పిన మలుపుల్లో ఉన్న సారూప్యాలను పరిచయం చెయ్యడానికి చేసిన చిరు ప్రయత్నం.