[మంగళంపల్లి బాలమురళీకృష్ణ రజనీకాంతరావుగారితో తనకున్న పరిచయాన్ని, అనుభవాలని ఈ క్రింది ఇంటర్‌వ్యూలో పంచుకున్నారు. ఇది 2000 జనవరి 23వ తేదీన వార్త పత్రిక ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమయింది. (ఇదే సంచికలో రజని 80వ జన్మదిన సందర్భంలో మరికొన్ని వ్యాసాలూ, సంభాషణలు కూడా ఉన్నాయి.) ఈ ఇంటర్‌వ్యూ కోసం పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు కొన్ని ప్రశ్నలను తయారు చేసి మద్రాసులోని వార్తా విలేఖరికి అందిస్తే ఆవిడ అక్కడ వాటిని అడగటం జరిగింది.
ఇక్కడ నేను వ్యక్తిగతంగా చెప్పగలిగిందేమిటంటే రజని, బాలమురళి ఇరువురికీ ఒకరి పైన మరొకరికి విపరీతమైన గౌరవభావం ఉండేది. 1999-2000 ప్రాంతంలో శతపత్ర సుందరి రెండవ ప్రచురణకి తయారవుతున్న రోజుల్లో రెండవ భాగానికి (1953 తరువాతి రచనలు) రజనిగారు వేరుగా ఒక ముందుమాట రాయించుకోవాలనుకున్నారు. మొదటి ముద్రణకు రజని గురువైన పింగళి లక్ష్మీకాంతం గారి ముందుమాట ఉంటుంది. సరే, ఎవరు రాస్తే బాగుంటుందో మీరే చెప్పండి అంటే బాలమురళి పేరుని సూచిస్తూ బాలమురళి ప్రతిభని గురించి చెప్పిన మాటలు ఇంకా బలంగా జ్ఞాపకం ఉన్నాయి. అలాగే అడగగానే బాలమురళి ముందుమాట రాసి పంపారు. రజనితో ఉన్నంత మంచి పరిచయం, చనువు లేకపోయినా మద్రాసులో బాలమురళిగారిని కలిసినప్పుడల్లా (చివరిగా 2013, 2015లో) ఆయన నన్నడిగే ప్రశ్న ‘రజని గారు బాగున్నారా!’ అని, వెళ్ళేముందు ‘రజనీగారికి నా నమస్కారాలు చెప్పండి’ అని. సంగీతంలో ఈ ఇద్దరు సృజనకారులతో సంభాషణ జరపడం ఎప్పుడూ చాలా విజ్ఞానదాయకంగా ఉండేది. – పరుచూరి శ్రీనివాస్.]
త్రివేణీ సంగమం లాంటి శాస్త్రీయ, లలిత, జానపద సంగీతాలలో తనకు తానే సాటి అనిపించుకుంటున్న వాగ్గేయకారుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. రేడియో సంగీతానికే తన సంగీత ప్రతిభను అంకితం చేసిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గురించి ఆయనతో బాలమురళికి వున్న స్నేహాన్ని గురించి ఆయనతో పంచుకొన్న అనుభవాలను గురించి, అనుభూతుల గురించి వివరాలు చెప్పమని అడిగిన వార్తకు ఆయన మనస్సు విప్పి తమ సుమధుర సంగీత స్నేహానుబంధాన్ని గురించి తెలియజెప్పిన వివరాలు మీ ముందున్నాయి.
రజనీకాంతరావు రేడియో లలిత సంగీతానికి చేసిన సేవల గురించి, ఆయన ప్రత్యేకతను గురించి చెబుతారా?
బాలాంత్రపు రజనీకాంతరావుతో నాకు చాలా దగ్గర సంబంధం వుంది. ఆయన అంటే నాకు మొదటి నుండి వ్యక్తిగా, పండితుడిగా, కవిగా, గాయకుడిగా, వాగ్గేయకారుడిగా ఆయన్ను ఎప్పుడూ తలచుకొంటూ వుంటాను. వీలైనప్పుడల్లా ఆయన్ను తలచుకోవడం ఆల్ ఇండియా రేడియోలో మేము కలిసి పనిచేయడం నాకు ఎంతో అనుభవాన్నిచ్చింది. ఆ జ్ఞాపకాలన్నీ నాకు మరువలేనివిగా నా మనస్సులో నిలిచిపోయాయి. ఆయన్ను గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు.
ఆయన దగ్గర నేర్చుకోదగిన అంశాలు ఏమిటో వివరిస్తారా?
లలిత సంగీతం అనేదానికి ఓ కొత్త శైలిని, సరికొత్త రూపాన్ని సృష్టించినవారిలో రజనీకాంతరావు చాలా ముఖ్యులని చెప్పాలి. లలిత సంగీతమైనా మరే సంగీతమైనా శాస్త్రీయ సంగీతం అనబడే సంగీతంలో ఓ భాగమే. శాస్త్రీయ సంగీతంలోని కొన్ని లోపాలను సరిదిద్దితే అది లలిత సంగీతం అవుతుంది. ఆ సంగీతాన్నే ఒక సిట్యువేషన్‌కు ఉపయోగిస్తే అది సినిమా సంగీతమవుతుంది. అదే ఎక్కువ సురజ్ఞానం అదీ లేకుండా మన మనస్సుకు ఆహ్లాదకరంగా వుండే రీతిగా మన ఇష్టం వచ్చినట్లు పాడుకుంటే అది జానపద సంగీతమవుతుంది. లలిత సంగీతం అనేదానికి మాటలు లలితంగా వుండాలి. కవిత్వం ఉండాలి. కేవలం తేలిగ్గా వుండే మాటలుంటే చాలదు. కవిత్వం ఉండాలి. అందులో భావం వుండాలి. దానికి ఎంత వరకు సంగీతం కావాలో అంతవరకు ఉండాలి. ఇది గుర్తించినవారు రజనీకాంతరావు. ఆయన స్వయంగా గొప్ప గాయకుడు, గొప్ప పండితుడు అవడం మూలాన ఆయనకు ఈ విధంగా కొత్త సంగీతాన్ని సమకూర్చే భాగ్యం కలిగింది. దానివల్ల ఓ లలిత సంగీతం అనేది ఏర్పడింది. అది ఇప్పుడు బహుళ ప్రచారంలో వుంది.
సాహిత్యానికి సంగీతం, సంగీతానికి సాహిత్యం ఎలా ఉపయోగపడతాయంటారు?
సంగీతం… సంగీతమపి సాహిత్యమన్నారు కదా. ఈ సంగీతం, సాహిత్యం నా దృష్టిలో రెండూ సమపాళ్ళలో వుంటేనే ఏ పాటైనా గొప్పగా వస్తుంది. మన రెండు కళ్ళకు దృష్టి సరిగ్గా వుంటే మనం ఎలా చూడగలుగుతామో, ఓ కంటిలో లోపముంటే ఎలా బాధపడతామో అలాగే సంగీతం వల్ల సాహిత్యం పాడైనా, సాహిత్యం వల్ల సంగీతం పాడైనా అది మంచి సంగీతమనిపించుకోదు. ఆ మోతాదు తెలుసుకొని ఉపయోగించాలి. అందులో శాస్త్రీయ సంగీతంలో మొదటి నుండి ఎన్నో విషయాల్లోలాగే సంగీతంలో కూడా కొన్నికొన్ని అనవసర సంప్రదాయాలు అతుక్కుపోయాయి. ఈ సంప్రదాయమేమిటో అది వారికీ తెలీదు. అందుకని ఆ సంప్రదాయాలు మార్చవలసివచ్చింది. కాలానుగుణంగా సంప్రదాయాలు ఎలా మారుతాయో సంగీతంలో కూడా అలాగే మారుతాయి. ఇదివరకు సంగీతం ఎలా ఉండేదంటే కేవలం ఏ రాముడినో కృష్ణుడినో వేంకటాచలపతినో వారి గుణగణ విశేషాల గురించి మనం సంస్కృతంలోనో, తెలుగులోనో వారి వారి భాషల్లో రాసుకుంటూ పాడుకుంటూ వుంటూ వచ్చాము. శాస్త్రీయ సంప్రదాయంలో వుండవలసిన ముఖ్యమైన విషయాన్ని మరచిపోయి ఒక సంగీతంగా రూపొందిన తరుణంలో అవి కూడా సరిచేసి శాస్త్రీయ సంగీతాన్ని సరిచేస్తే అది లలిత సంగీతమవుతుందని గుర్తించిన రజనీకాంతరావు లలిత సంగీతానికి ఎంతో సేవ చేశారు.
మద్రాసులో లైట్ మ్యూజిక్ విభాగానికి ప్రొడ్యూసర్‌గా మీరు, రజనీగారు కలసి పని చేశారు. ఆనాటి ముచ్చట్లు, ఆనాటి విశేషాలు చెప్పండి?
ఆకాశవాణిలో లలిత సంగీతం విభాగం అని ఒకటి పెట్టినప్పుడు భారతదేశంలో ప్రప్రథమంగా లైట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా నన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. అప్పుడు రజనీకాంతరావు ఆఫీసర్‌గా వున్నారు. ఆఫీసర్‌గా వుంటూ తరువాత లలిత సంగీతం ప్రొడ్యూసర్‌గా కూడా వున్నారు. ఆయన రేడియో డైరెక్టర్‌గా వున్నప్పుడు ఆయన డైరెక్టర్‌గాను, నేను లలిత సంగీతం ప్రొడ్యూసర్‌గానూ విడివిడిగా, కలిసి కూడా చేశాం. మద్రాసు, హైదరాబాదులో కూడా ఆయన ప్రొడక్షన్‌లో చాలా వాటిలో నేను పని చేశాను. ఆయన ఏం చేసినా ఆయన మనస్సులో ఏముందో ఆ అభిప్రాయాన్ని సరిగ్గా గ్రహించి నేను పాడతానని ఆయనకు నాపై నమ్మకం. అందుకే మా సంగీతానుబంధం అంత దృఢకరమైంది.
రజనీకాంతరావుగారి ప్రభావం మీపై ఎంతవరకు ఉంది?
ఆయన ఇన్‌ఫ్లూయన్స్ నాపై చాలా ఉంది. లలిత సంగీతం విషయంలోనే కాక వాగ్గేయకారత్వంలోనూ ఆయన పద్ధతులు నాకు చాలా బాగా నచ్చడం వల్ల నాకు తెలీకుండానే నాపై ఆయన ప్రభావం చాలా వరకు పడిందని నా అభిప్రాయం.
చండీదాస్ నాటకంలోని ‘మన ప్రేమ’ పాటను ఆయన స్వరపరచగా మీరు రికార్డ్ చేశారు. దాని గురించిన వివరాలు చెప్పండి?
మన ప్రేమ పాట నేను, శ్రీరంగం గోపాలరత్నం కలిసి పాడాం. అందుకే మేము ‘మన ప్రేమ’ అన్నప్పుడు ఎంత అందంగా పాడాలి, అది దూదిపింజెలా గాలికి ఎగిరిపోయేలా వుండకూడదు, అలా పాడకూడదు అనే విషయం ఆ పాట పాడినప్పుడు మేము మా మనస్సులో నిలుపుకొన్నాం.
(ఆ పాట కొద్దిగా పాడి వినిపిస్తారా? బాలమురళి చిన్నగా నవ్వి, నాకు జ్ఞాపకం లేదమ్మా అంటూనే ‘మన ప్రేమ… ఋష్యశృంగ…’ అంటూ మాటలు లేకుండానే అద్భుతంగా రాగాన్ని ఆలపించారు.)
రజనీకాంతరావు చండీదాస్ అనే ఓ బెంగాలీ నాటకాన్ని తెలుగులో రాశారు. అది తెలుగులో అనువదించినప్పుడు బెంగాలీవారి ట్యూన్స్ ఎలా ఉంటాయి, వాటిని తెలుగులో పాడితే ఎలా ఉంటాయి, అనేది ఆయన చక్కగా రాయగా అందులో హీరోగా నేను పాడటం అనేది నాకు జీవితంలో ముఖ్యమైన మరచిపోలేని అనుభవం. అది మళ్ళీ ఓసారి వేస్తే నేను యాక్ట్ చేయాలని వుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు బాగా అనుభవం వచ్చింది. చాలా పాడాను రవీంద్ర సంగీతం. చాలా రికార్డ్ చేశాను.
ఇప్పుడు కూడా హీరోగా చేస్తారా?
హీరోగానే చేస్తాను హీరోయిన్‌కు ఎవరైనా సిద్ధంగా వుంటే (చిన్న నవ్వు).
విజయవాడలో హోనాడీబాలా అనే నాటకంలో రజనీగారితో కలిసి మీరు నటించారు కదా, ఆ అనుభూతుల్ని వివరించండి?
నిజానికి అవన్నీ ఇప్పుడు నాకు పూర్తిగా గుర్తులేవు. అయితే ఆ రోజుల్లో ఇప్పుడున్న అవకాశాలు లేవు. డబ్బింగ్ ప్రక్రియలాంటిదేమీ లేదు. ఓ నాటకం ఉందంటే దాని కోసం నెలరోజులపాటు రిహార్సల్స్ చేసి, ప్రాక్టీస్ చేసి రికార్డ్ చేయాల్సి వచ్చేది. ఓసారి రికార్డ్ చేస్తే తప్పు వచ్చిందంటే మళ్ళీ అంతా రికార్డ్ చేయాల్సి వచ్చేది. టేపంతా వేస్ట్ అయిపోయేది. అసలు నేను చాలా భాగం ముందుగా రికార్డ్ చేయకుండా లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తుండేవాళ్ళం.
రజనీగారు స్వరపరచిన శశిరేఖ కూచిపూడి యక్షగానంలో మీరు అభిమన్యుడుగాను, భామాకలాపంలో కృష్ణుడుగాను నటించారు. ఆ ముచ్చట్లు చెప్పండి?
ఆ రోజుల్లో చేసిన నాటకం పేరైతే సరిగ్గా గుర్తులేదుకానీ, అందులో నేను హీరోగా నటించాను. హీరోని ఎవరో బాకుతో పొడిచేస్తారు. హీరోయిన్‌ను తలుచుకొంటూ ప్రాణం పోయేముందు ఓ పాటను పాడతాడు. ఆ పాట ఆమెకు వినిపిన్స్తుంది. ఆ పాట విని ఆమె పరిగెత్తుకొస్తుంది. ఆమెను ఓసారి చూసి కనుమూస్తాడు హీరో. అప్పుడు ఆ బాధతో పాడే పాటను నేను పాడటం విని, అప్పుడు రేడియో సినీ డైరెక్టర్‌గా వుండే వీరభద్రరావుగారని జ్ఞాపకం, పరిగెత్తుకుంటూ వచ్చేవారు. బాల మురళీ ఎలా వున్నాడు? బాలమురళీ ఎలా వున్నాడు? మా ఇంట్లో అంతా ఏడుపులు, పెడబొబ్బలు. అలా ఉండేది లైఫ్. మేమంతా ఓ సంగీత ఆలయంలో పనిచేస్తున్నట్లు చేశాం. కానీ మా జీతాలెంత? మా ముఖం. ఇప్పుడు ప్యూన్స్‌కు కూడా మాకిచ్చిన జీతాలకంటే ఎక్కువే వస్తున్నాయి. కానీ పని మాత్రం ఎవ్వరూ చేయడంలేదు.
1956, 60లో బెజవాడలో రజనీగారు సమకూర్చిన మేఘసందేశం తెలుగులో చేశారు. 77వ సంవత్సరంలో అదే మేఘసందేశాన్ని సంస్కృతంలో చేశారు. ఈ రెంటికీ మధ్య వున్న తేడా ఏమిటి?
అవన్నీ క్యాసెట్స్ అక్కడ వున్నాయేమో వుంటే ఒక్కసారి పంపించమని రాశాను. మళ్ళీ అవన్నీ ఓసారి పాడాలని వుంది నాకు. అవి వుంటే ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. ఆ రోజుల్లో ఎంత శ్రద్ధగ మేము పని చేశామో, పాట క్వాలిటీ ఎలా వుండేది అనే దానికి నిదర్శనం ఆ నాటకాలు.
బెజవాడ మ్యూజికల్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించిన కామదహనం అనే సంగీతాత్మక రూపకానికి (రజనీగారు సమకూర్చింది) మీరు వాద్య సంగీతం అందించారు. అందులోని విశేషాల గురించి చెప్పండి?
ఎన్నో చేశాము. అప్పట్లో రజనీగారి దర్శకత్వంలో ప్రతీ నాటకంలోనూ నేను చేశాను. ఆ రోజుల్లో ఎవరుండేవారు? హేమాహేమీలు రజనీకాంతరావుగారు, పింగళి లక్ష్మీకాంతం, పాటూరి, బందా కనకలింగేశ్వరరావు లాంటి హేమాహేమీలతో మేము పనిచేయగలగడం మా అదృష్టమనుకొంటున్నాను. ఇప్పుడంతా విమర్శన శకమే జ్ఞానం లేకుండా. అప్పట్లో విమర్శలున్నా జ్ఞానంతో ఉండేవి.
మీరు సంగీతంలో ఎంతగానో సాధించారు. ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు అందించారు. ఇంకా మీరు సాధించాలనుకునేవి ఏమైనా వున్నాయా?
సాధించేవి, సాధించాల్సినవి జీవితంలో ప్రతి ఒక్కరికీ ఉంటూనే వుంటాయి. ఏదో ఘనంగా సాధించేశానని నేననుకోవడంలేదు. సాధించాల్సిన కొద్ది సాధించాల్సిన లిస్ట్ పెరుగుతూనే వుంటుంది. దీనికి అంతేముంది? ముందుముందేం జరుగుతుందో వేచి చూద్దాం. మీరు అలనాటి కబుర్లన్నీ జ్ఞాపకం చేస్తుంటే ఎంతో సంతోషంగా వుంది. నిజానికి రజనీకాంతరావే ఆ విషయాలన్నీ బాగా చెప్పగలరు. నామీద వారికి చాలా అభిమానం. ఆయనకు, నాకు కూడా వయస్సు అయిపోతోంది. కానీ మేము వయస్సు మాత్రం జ్ఞాపకం ఉంచుకోం. మేమిద్దరం ఉండగానే కొన్ని మంచి పనులు ప్రజలు, ప్రభుత్వం మా చేత చేయించుకొంటే బాగుంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా ఈరోజు ఆయన గురించి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కలిగిననందుకు నాకు, ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆయురారోగ్య భాగ్యాలతో ఇంకా చిరకాలం జీవించాలని, రజనీకాంతరావు సేవలను ప్రజలు, ప్రభుత్వం పొందాలని ఆశిస్తున్నాను.
20 సంవత్సరాలకే సినీ సంగీతం
‘ఈ కొత్త స్టూడియోస్‌లో నువ్వు పని చేస్తున్నావు’ అని రజనిగారితో బి.యన్.రెడ్డిగారు ఒకసారి ఉత్సాహంతో మాట్లాడారు. తరువాత రెడ్డిగారు ఒకటి, రెండు పాటలు రాయించుకున్నా రజనిగారికి పూర్తి అవకాశం ఇవ్వలేదు. గోపీచంద్, వై.వి.రావులు అంతకుముందే రజనిగారి సినీసంగీత దర్శక పటిమ తెలిసున్నవారు. రజనిగారు సినిమాలలోనే ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. యక్షగాన సంగీతం, లలిత, విషయాత్మక సంగీత ప్రయోగాలమీద మక్కువ పెంచుకుంటున్న కాలం అది. ఆయన పనిచేసిన సినీమాలకు ఉద్యోగరీత్యా ఆయన పేరివ్వటం కుదరక ఇతరుల పేరుమీద ప్రచారమయ్యాయి. రజనిగారికి 21 సంవత్సరాల వయసులోనే సినిమాలకు పనిచేయడం విశేషం.
- 1941లో తారుమారు చిత్రంలో ‘జో అచ్యుతానంద… జోజో ముకుందా’ రజని భార్య సుభద్ర, గాడేపల్లి సుందరీశంకరం కలిసి పాడారు. సంగీతం పెట్టినది రజని.
- 1941లో భలే పెళ్ళి చిత్రంలో మేనక విశ్వామిత్ర గేయ నాటికలోని అంశం చిత్రితమయింది. సుభద్ర, పసుమర్తి విశ్వేశ్వరమ్మ, రజని పాడారు. నాటిక రచన, సంగీత రచన రజని.
- 1945లో స్వర్గసీమ చిత్రంలో ‘ఓహో పావురమా’ భానుమతి పాడినది. రచన, సంగీతం రజని. హాయి సఖీ – నాగయ్య పాడినది. రచన, సంగీతం రజని. ఎవరి రాకకై ఎదురుచూచెదో ఏకాకివై బేలా – రచన, సంగీతం, పాడినది రజని.
- 1946లో గృహప్రవేశం: ఎల్.వి. ప్రసాద్ చిత్రం. పాటలూ సంగీతం నళిని పేరిట ఉన్నాయిగాని రజనివి. పెండ్యాల ఈ చిత్రంలో ఆయన దగ్గిర అసోసియేట్ సంగీత దర్శకుడు.
- 1947లో రత్నమాల: ‘ఏమే ఓ చిలుకా’ రచన, సంగీతం రజని.
- 1950లో లక్ష్మమ్మ కథ: శోభనాచల చిత్రం. పాటలు, సంగీతం రజని. ఆరోగ్యం బాగుండక, ప్రభుత్వం అనుమతి సకాలంలో లభించక ఘంటసాల సంగీత దర్శకుడిగా క్రెడిట్స్‌లో పేరు వేశారు. పాటలకు మాత్రం ‘తారానాథ్’ అని వుంటుంది. అంటే రజనీయే.
- 1951లో సౌదామిని చిత్రంలో రెండు పాటలు. రచన, సంగీతం రజని.
- 1952లో మానవతి: అందుకోండి, తన పంతమే, ఓ మలయ పవనమా–ఈ పాటలు, సంగీతం రజనివి.
- 1954లో బంగారుపాప చిత్రంలో తోలుబొమ్మలాట పాట సంగీతం రజని.
- 1960లో రాజమకుటం చిత్రంలో ‘ఊరేది పేరేది’, ‘ఠింగనా ఠింగణా డిల్ల’ సంగీత సాహిత్యాలు రజనివి. వేణు పేరిట సంగీతం, నాగరాజు పేరిట పాటలు వచ్చాయి.