నన్ను కాదు

“తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ” అన్న సూక్తికి అక్షరాలా రూపం ఇచ్చే జీవితం రావుది.

ఏశుభ ముహూర్తాన వాళ్ళ నాన్న నోటి నుంచి ఈ సత్యం మొట్టమొదట సారివిన్నాడో రావుకి ఇంకా బాగా గుర్తు. తను మూడో క్లాసులో ఉండగా ఒకరోజు స్కూల్లో ఒక కొత్త అబ్బాయి వచ్చి చేరాడు. అప్పటికి ఇంకా కాన్‌ వెన్ట్‌ల క్రేజు పెరగక పోవడం మూలాన ఎవరు పడితే వాళ్ళే వచ్చి స్కూల్లో చేరే అవకాశం ఉండేది. ఎలా జరిగిందో గానీ, రావుకీ ఆ కొత్త అబ్బాయికీ ఇట్టే స్నేహం కలిసిపోయింది. రెండు రోజుల్లోనే ప్రాణస్నేహితులైపోయారు. కొంచెం బెరుగ్గా, “మంచి బాలుడు రాము” అనిపించుకునేలాగా ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకుని బట్టీ పెట్టే రావుని మిగతా కుర్రాళ్ళు అంతగాపట్టించుకునే వారూ కాదు, తమ ఆటల్లో చేర్చుకునేవారూ కాదు. అపురూపంగా దొరికిన ఈ నేస్తాన్ని అవ్వాళ తన ఇంటికి తీసుకెళ్ళి, తన బొమ్మలన్నీ చూపించి ఆడుకోవాలని ఉవ్విళ్ళూరాడు రావు. స్కూలు అవగానే చేతులు కలుపుకుని బయల్దేరిన వాళ్ళు ఎదురుగా మూగిన అబ్బాయిల గుంపు చూసి ఆగారు.

“ఏరా, ఎక్కడికి ప్రయాణం?” అని రావు నుద్దేశించి అధికారపూరితమైన స్వరంతో అడిగాడు అందరిలోకీ పెద్దవాడైన రాజు.

రావు కొంచెం బెదిరి తన స్నేహితుడి చెయ్యిని ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడు. ఆ వెచ్చని స్పర్శ ఇచ్చిన ధైర్యంతో, “ఇంటికి,” అన్నాడు.

“ఎవరింటికి?” అడిగాడు రాజు అదే వెటకార ధ్వనితో.

“మా ఇంటికే,” అన్నాడు రాజు అమాయకంగా.

“అక్కడ వీడేం చేస్తాడూ?” హేళనగా అడిగాడు రాజు.

“దొడ్లూడుస్తాడు.” ఆ మూకలోంచి వచ్చిన సమాధానానికి వాళ్ళందరూ ఫెళ్ళున నవ్వారు.

“ఛీ! అదేం కాదు. నాతో ఆడుకుంటాడు,” అన్నాడు రావు కోపంగా.

మళ్ళీ వాళ్ళందరూ పగలబడి నవ్వారు. “వీడెవడో తెలుసా?” అనడిగాడు రాజు నవ్వాపుకుంటూ.

“జోసెఫ్‌” అనుమానంగా చూస్తూ జవాబిచ్చాడు రావు.

“అంటే?”

అర్థం కాలేదు రావుకి.

“అంటే తెలియదా? వీడు మాలవాడన్నమాట. వాడితో ఎలా ఆడతావు?”

“అసలు వీణ్ణి మీ ఇంట్లోకి రానిస్తారా?”

రావు సంకోచంగా జోసెఫ్‌ మొహంలోకి చూశాడు. అక్కడ ఆదుర్దా, భయం, బెదురూ కలిసి ఒక వింత భావాన్ని పలికిస్తున్నాయి. అప్రయత్నంగానే జోసెఫ్‌ చెయ్యి వదిలేశాడు రావు. ఈ అవకాశం చూసుకుని మిగిలినవాళ్ళందరూ ముందుకు వచ్చారు. “పదండిరా, వాణ్ణి పట్టుకు కొట్టండి!” అన్న రాజు కేకతో మిగతా పిల్లలందరూ ఒక్కుమ్మడిగా జోసెఫ్‌ మీద పడ్డారు. రావుకీ, జోసెఫ్‌ కీ మధ్య దూరం ఎక్కువయ్యింది. ఆ కంగారులో తనను కూడా కొట్టేస్తారేమోనన్న భయంతో రావు దూరంగా తొలగిపోయాడు. కొన్ని గజాలు పరిగెత్తిన తరువాత తన స్నేహితుడి సంగతి గుర్తొచ్చి తిరిగి చూశాడు. అక్కడ ఒక అబ్బాయిల గుంపు కనిపించింది గానీ, జోసెఫ్‌ మాత్రం కనిపించలేదు.

“తన్నండిరా, వెధవని!” “చావగొట్టండి!” అన్న కేకలూ, వాటి మధ్యలో ఏవో ఏడుపులూ,

“వద్దు, కొట్టకండి,” అన్న వేడుకోవడాలూ అస్పష్టంగా వినిపిస్తున్నాయి.

ఆ అల్లరి మూకను చూస్తూంటే, తన తోటి పిల్లల్లా అనిపించలేదు రావుకి. వాళ్ళేం చేసేందుకైనా సిధ్ధంగా ఉన్నట్టు కనిపించారు. స్నేహితుడి ఆక్రందనలను నిర్లక్ష్యం చేసి అక్కడినుంచి వెళ్ళడం కష్టమే అయినా, తనను కూడా పట్టుకు కొడతారేమోనన్న భయంతో ఆత్మరక్షణావేశం అతని పాదాల్ని కదిలించి ఇంటివైపు దౌడు తీయించింది.

ఇంటికి వెళ్ళాక చాలాసేపటివరకూ రావు ఎవరితోనూ మాట్లాడలేదు. కొంచెం స్థిమిత పడ్డాక, అవ్వాళ రాత్రి నెమ్మదిగా స్కూల్లో జరిగిన సంగతి ఇంట్లో చెప్పాడు.

“అయ్యో, పాపం! ఆ అబ్బాయికేమైందో!” అని తల్లి జోసెఫ్‌ మీద సానుభూతి చూపించినా,

“ఇంకా నయం! ఆ మాల వెధవని ఇంట్లోకి రానిస్తే ఇంకేమైనా ఉందా?” అని బామ్మ అడ్డొచ్చి విసుక్కుంది.

రావు వాళ్ళ నాన్న మాత్రం మెచ్చుకోలుగా రావు వైపు చూశాడు. “మంచి పని చేశావురా. అసలు అలాంటి రౌడీ మూకతో నీకెందుకు పని? అనవసరమైన విషయాలలో తలదూర్చితే మన తలెగిరిపోతుంది, జాగ్రత్త!”

రావు భయంగా తన మెడని తడుముకున్నాడు.

వాళ్ళ నాన్న ఫకాల్న నవ్వి, “పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు వినాలా, లేదా?” అనడిగాడు.

“వినాలి,” అంటూ రావు బుధ్ధిగా తలూపాడు.

“మన పెద్దవాళ్ళేమని చెప్పారంటే …” అని, అదిగో, అప్పుడు చెప్పాడు రావు వాళ్ళ నాన్న,

సుమతీ శతకంలోని ఆ పద్యాన్ని.

రావు మళ్ళీ తన ఎప్పటి దినచర్యలో పడ్డాడు. స్కూల్లో ఎప్పుడైనా జోసెఫ్‌ కనిపిస్తాడేమోనని కొంచెం మొహం చాటుచేసుకునేవాడు. కానీ, కొన్నాళ్ళ తర్వాత జోసెఫ్‌ మళ్ళీ స్కూల్లో కనిపించలేదు. ఆనాటి సంగతులు పాతబడిపోయాయి. కానీ తండ్రి చెప్పిన ఆ సూక్తి మాత్రం రావు మనసు మూలల్లో ఎక్కడో దాగి ఉన్నది.


కాలేజీలో చేరేవేళకి రావువాళ్ళ కుటుంబం హైదరాబాదుకి మారిపోయింది. అక్కడ రావు ఎంత శ్రధ్ధగా చదవాలని ప్రయత్నించినా, ఎప్పుడూ ఏవో స్ట్రైకులూ, గొడవలతో కాలేజీ చదువు కొంచెం ఒడుదుడుకులతోనే నడిచింది.

హైదరాబాదులోని ముస్లిమ్‌ సంస్కృతి రావుకి కొత్తగా, వింతగా అనిపించింది. కాలేజీలో తన సహాధ్యాయుడైన హుస్సేనుతో పరిచయం కలిగితే, ఆ సంస్కృతి మీద ఉన్న కుతూహలం కొద్దీ ఆ పరిచయాన్ని పెంచుకున్నాడు. హుస్సేన్ని ఇంటికి తీసుకువస్తే అభ్యంతరం పెట్టేందుకు ఇప్పుడు వాళ్ళ బామ్మ లేదు కానీ, అయినా ఎటొచ్చి ఏమొస్తుందో అని చెప్పి ఆ ధైర్యం మాత్రం ఎప్పుడూ చేయలేదు రావు. కాలేజీలోనే కలుసుకుంటూండేవాళ్ళు. అప్పుడప్పుడు ఊళ్ళో జరిగే మతకలహాలకి అర్ధం పర్ధం తెలిసేవు కావు రావుకి. అవి ఎందుకు పుడతాయో, ఎటు వ్యాపిస్తాయో, ఎన్నాళ్ళు రగులుతాయో, అంతా అయోమయంగా ఉండేది.

ఓ రోజు హుస్సేనుతో కలిసి బజార్లలో తిరుగుతున్నాడు రావు. మామూలుకంటే కొంచెం రద్దీగా అనిపించినా, రావు ఏమీ పట్టించుకోలేదు. హుస్సేను మాత్రం ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు కబుర్లలో మామూలుగా పాల్గొనలేకపోయాడు. ఆ పరధ్యానానికి రావుకి కొంచెం చిరాకువేసింది కూడా.

“ఏమయింది నీకివ్వాళ? ఏమడిగినా సరిగ్గా జవాబు చెప్పవు,” అని విసుక్కున్నాడు.

హుస్సేను రావు చిరాకుని పట్టించుకోలేదు. దూరంగా వినిపిస్తున్న కోలాహలం మీద దృష్టినిలిపి, “అక్కడేం జరుగుతోందంటావు?” అనడిగాడు.

“ఏమో, ఎవడికి తెలుసు? నీకంత తెలుసుకోవాలని ఉంటే అక్కడికి వెళ్దాం, పద,” అన్నాడు రావు కొంచెం వెటకారంగా.

“అబ్బే, వద్దు,” అంటూ రెండోవేపు అడుగులు వేశాడు హుస్సేను. కానీ, రెండు నిముషాలు కూడా కాకుండానే, “రావు, ఇంటికి వెళ్దాం,” అన్నాడు.

రావు విస్తుబోయాడు. “ఇంటికా? అప్పుడే? ఎందుకు?”

“ఎందుకైనా మంచిదని,” చుట్టూ చూస్తూ గొణిగాడు హుస్సేను.

అయిష్టంగానే హుస్సేనుననుసరించాడు రావు. కాస్త రద్దీ తగ్గిన చోటికి వచ్చాక ఆగి, “ఇప్పుడు చెప్పు,” అన్నాడు.

“ఏం చెప్పను?”

“ఎందుకిలా తొందరగా తిరిగివెళ్దామంటున్నావో.”

వింతగా చూశాడు హుస్సేను. “నువ్వు పొద్దున్న రేడియో వినలేదా?”

“లేదు.”

“పేపరు చూడలేదా?”

“అబ్బా, ఏమిటీ యక్ష ప్రశ్నలు? ఆ విశేషమేమిటో చెప్పరాదూ?”

“ఊళ్ళో గొడవలు జరిగేటట్టున్నాయని …”

“ఎందుకు?”

హుస్సేను నోరువిప్పేలోగా, “ఇదుగో, నీలాటి వాళ్ళ మూలంగానే,” అని పక్క నుంచి ఎవరో చీత్కరిస్తూ వెళ్ళారు.

రావు తెల్లబోయాడు. “నాలాంటి వాళ్ళా?”

హుస్సేను మాటలు విరమించి గబా గబా అడుగువేయసాగాడు. కోలాహలం కొంచెం దగ్గరవుతున్నట్టు తోచింది. చేసేదిలేక స్నేహితుడి వెనకాలే నడుస్తూ, “హుస్సేన్‌ ఆగు!” అని పిలిచాడు రావు.

“ఇష్‌” అని గట్టిగా కసిరాడు హుస్సేను.

వీధి చివర ఏదో గుంపు మలుపు తిరిగి వీరివేపు రాసాగింది.

హుస్సేను రావు దగ్గరికి వచ్చి, రహస్యంగా, “నన్నలా పిలవకు,” అన్నాడు.

“అదేమిటి? అది నీ పేరేగా హుస్సేన్‌” ఆశ్చర్యపోయాడు రావు.

“చెప్తూంటే వినిపించుకోవేం?” గదిమాడు హుస్సేను. నిముష నిముషానికీ దగ్గరవుతున్న గుంపు వేపొకసారి చూసి, “ఏం మాట్లాడకుండా బయల్దేరు. ఏదో ఇద్దరు ఫ్రెండ్సు బయటకి వచ్చినట్టు ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నా పేరు మాత్రం మళ్ళీ అనకు,” అని హెచ్చరించాడు.

ఒక్క నిముషం స్నేహితుడికి పిచ్చి పట్టిందనుకున్నాడు రావు. అంతలో ఏదో బోధపడ్డట్టనిపించింది.

దగరవుతున్న గుంపులోంచి ఏవో కేకలూ … అప్పటికే తమిద్దరివేపూ అనుమానంగా చూస్తున్న దారేపోయే మనుషులూ … తానేదో ఆపదలో చిక్కుకోబోతున్నట్టు గ్రహించాడు రావు. ఇక్కడ నుంచి ఎలా బయటపడడం? ఈ ప్రమాదాన్నెలా తప్పించుకోవడం?

“తప్పించుకు తిరుగువాడు ధన్యుడు…” అని తండ్రి స్వరం లీలగా వినిపించి రావుకి జ్ఞానోదయమయింది. హుస్సేను తనతో బాటే ఎందుకువస్తానన్నట్టు? తన పేరు పలక వద్దనడమెందుకు?

గబుక్కున హుస్సేను నుంచి దూరంగా జరిగి, “హుస్సేన్‌ నీ దారిన నువ్వెళ్ళిపో. మనం కలిసి వెళ్ళడం మంచిది కాదు,” అని త్వరత్వరగా, స్నేహితుడు పిలుస్తున్నా వినిపించుకోకుండా, ఇంటికి వచ్చేశాడు రావు. సమయానికి తండ్రి సలహా గుర్తొచ్చి ఆపద్బాంధవుడులా రక్షించినందుకు సంతోషించాడు కూడా.

ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో అతనికి తెలియదు. కర్ఫ్యూతో మూడు రోజులపాటు ఇంట్లోంచి కదిలేందుకు వీల్లేకపోయింది. ఆ మూడు రోజులూ రావు వాళ్ళ నాన్న అందరినీ (ఈ గొడవలకి కారణమైన వాళ్ళందరినీ) తిడుతూనే ఉన్నాడు. “అసలీ తురకాళ్ళందరూ దేశంలోంచి పోతేగానీ మనకీ పీడా వదలదు,” అని తన ఉపన్యాసాన్ని ముగించాడు. కర్ఫ్యూ తీసేసిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళినా అక్కడ హుస్సేను మాత్రం రావుకెప్పుడూ కనిపించలేదు.

కానీ, మరో అయిదారేళ్ళ వరకూ, రావుకి తన తండ్రి ఆ సూత్రాన్ని ఎందుకంతగా నమ్ముకున్నాడో, ఏ అనుభవాలలోంచి అది పుట్టిందో తెలుసుకోలేదు.


రావు చదువై ఉద్యోగం కోసం ఢిల్లీలో ఉన్నాడు. సాఫీగా సాగిపోతున్న జీవితంలో తండ్రి ఆదేశం గుర్తుతెచ్చే సంఘటనలేవీ జరగలేదు. కానీ, అవ్వాళ మాత్రం ఎవ్వరూ అనుకోని, ఎదురుచూడని, ఘోరమైన సంఘటన జరిగిపోయింది. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె సిక్కు రక్షకులు హత్య చేశారు. మొట్ట మొదట ఈ వార్త విన్నప్పుడు రావుకి ఆశ్చర్యాన్ని మించి మరేం సంభ్రమం కలగలేదు. రాజకీయాలతో మనకేం సంబంధం అని మామూలుగానే తన పని తాను చూసుకోబోయాడు. ఇందిరమ్మని గురించి పొగడతూ, తమ ఆత్మీయులనెవరినో కోల్పోయినట్టు విలపిస్తున్న ప్రజలని వింతగా చూశాడు. ఇంతలో ఆ దుర్మరణానికి కారణమైన సిక్కుల మీద ప్రతీకార వాంఛ చిన్న నిప్పు రవ్వలా మొదలై, పెద్ద జ్వాలలా తయారైంది.

ఎందుకైనా మంచిదని రావు తలుపు గడియ వేసుకుని ఇంట్లోనే ఉండిపోయాడు. అప్పుడప్పుడు రేడియోలో వార్తలు వింటూ, బయట జరిగే భీభత్సాన్ని ఊహించేందుకు ప్రయత్నించాడు. ఇంతలో తలుపులెవరో దడదడా బాదడంతో ఉలిక్కిపడి లేచాడు. తలుపులు తీయాలా వద్దా అనే సందిగ్ధంతో గుమ్మం ముందు రెండు నిముషాలలా ఆగిపోయాడు. తలుపు బాదుడు మాత్రం ఆగలేదు. “రావు సాబ్‌ రావు సాబ్‌” అని ఎవరో పిలవడం వినిపించింది. అయినా తననేం చేస్తారు? తనేం సిక్కు కాదు కదా అని ధైర్యం తెచ్చుకుని చివరికి తలుపు తెరిచాడు రావు. అక్కడ తన సహోద్యోగి సింగు రొప్పుతూ, చెమటలు కారుతూ, ఆయాసంతో మాట్లాడ్డానికి కష్టపడుతూ, రావు తలుపుతీయగానే, లోపలికి దూసుకు రాబోయాడు.

ఏమూలోనో దాగున్న ప్రాణరక్షణా instinct రావునతనికి అడ్డుపడేలా చేసింది. “ఏమిటి సింగ్‌ ఏమయింది?” అని మామూలుగా అడిగాడు రావు.

“రావ్‌ ప్లీజ్‌ నన్ను తొందరగా ఇంట్లో దాచు! నన్ను తరుముకొస్తున్నారు!” ఎలాగో ముద్ద

ముద్దగా మాటలు వచ్చాయి సింగు నోట్లోంచి.

“ఎవరు? ఎవరు తరుముకొస్తున్నారు?” రావు అడిగాడు.

“ఎవరో గుంపు. అందరు సిక్కులనీ తరుముతున్నారు. అందరు సిక్కులనీ చంపుతారట.” సింగు

ఇంకా రొప్పుతున్నాడు.

“అసలు ఇలాంటి సమయంలో నువ్వు బయటకెందుకొచ్చావు?” రావతన్ని నిలదీశాడు.

“తప్పలేదు. మా అమ్మకి మందు కొనాల్సొచ్చింది. మాటలు తర్వాత. ముందు నన్ను లోపలకి రానీ,” అన్నాడు సింగు.

“ఇక్కడికెందుకొచ్చావు?” అనుమానంగా అడిగాడు రావు.

“రావ్‌ ఏమిటీ ప్రశ్నలు? ఎలాగ వాళ్ళని తప్పించుకోవాలని చూస్తూంటే నువ్వీ ప్రాంతంలో ఉంటావని నాకు గుర్తుకొచ్చింది. సరైన ఇల్లు అవునో కాదో నని సందేహం వచ్చినా ఎలాగో తలుపు కొట్టాను. అదృష్టవశాత్తూ నువ్విక్కడే ఉన్నావు. నన్ను లోపలికి రానీ,” అని సింగు తోసుకుపోబోయాడు.

దూరంగా లీలగా వినిపిస్తున్న కేకలు దగ్గరౌతున్నాయి. తన కర్తవ్యమేమిటో రావుకి వెంటనే స్పష్టమైయింది. “సారీ, సింగ్‌ నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు.”

“రావ్‌ నువ్వేమిటంటున్నావు?” సింగు నిశ్చేష్టుడై చూశాడు.

“సింగ్‌ నువ్విక్కడనించి వెళ్ళిపో. ఇంట్లో మా అమ్మా, నాన్నగారూ ఉన్నారు. పెద్దవాళ్ళు.

వాళ్ళని రక్షించడం నా ధర్మంగదా? నువ్వెళ్ళిపో, తొందరగా,” అని చేష్టలుడిగిన సింగుని బయటకి నెట్టుతూ, రావు గబగబా తలుపు వేసి, గడియ పెట్టేశాడు.

లోపలికి వెళ్ళి కూర్చున్నాడే గానీ, అతని మనసు స్థిమితంగా లేదు. సింగుకేమౌతుంది? అతన్ని తరుముతున్న వాళ్ళ చేతులకి అతను చిక్కుతాడా? చిక్కితే ప్రాణాలతో తప్పించుకోగలడా?

వాళ్ళతన్నేం చేస్తారు? రేడియోలో వార్తలు వింటూంటే, మనుషులు ఎంత రాక్షసులుగా ప్రవర్తించగలరో తెలుస్తోంది. సజీవదహనం చేస్తారా? గడ్డం పట్టుకు పీకుతారా? ఒళ్ళు జలదరించింది రావుకి. కానీ, అతన్ని ఇంట్లోకి రానిస్తే …? వాళ్ళందరూ వచ్చి ఇంట్లో పడితే?

అప్పుడు తమందరి మాటేమిటి? తమను రక్షించేదెవరు?

ఆలోచనలో మునిగిపోయిన రావు, “ఎవర్రా అదీ?” అన్న తండ్రి ప్రశ్నతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు.

“ఆఁ, నాకు తెలిసినతను నాన్నా. ఎవరో, సింగని ” అని రావు మొదలుపెట్టగానే, అతని తండ్రి అడ్డొచ్చి,

“వాడి దోవన వాణ్ణి పంపించావా, లేదా?” అని కంగారుగా ప్రశ్నించాడు.

“పంపించేశాను,” నెమ్మదిగా గొణిగాడు రావు. “అతనికేమవుతుందో ఏమిటో?” అనకుండా ఉండలేకపోయాడు.

“ఏమవుతుందా? వాళ్ళకి తగిన శాస్తే జరుగుతుంది. మంచి పనైంది. అసలు ఈ సిక్కుల మూలానే, మన కుటుంబం సర్వ నాశనమైపోయింది తెలుసా?”

ఆశ్చర్యంగా చూశాడు రావు. “అదేమిటి?”

“అవున్రా! మీ తాతగారు, అంటే మా నాన్న గారు, ఎలా పోయారో నీకెప్పుడూ చెప్పలేదు కదూ?”

నిజమే. అసలా విషయమెప్పుడూ తమిద్దరిమధ్యా చర్చలోకి రాలేదు. ఇప్పుడాలోచిస్తే ఆశ్చర్యంగానే అనిపించింది.

“అయితే విను,” అంటూ తండ్రి సావధానంగా మొదలుపెట్టాడు. “నా చిన్నప్పుడే అంటే, ఏమిటి? నాకు రెండు మూడేళ్ళ వయసులోనే, మా నాన్న గాంధీగారి పిలుపందుకొన్నానంటూ వెళ్ళి కాంగ్రెసులో చేరిపోయాడు. ఉన్న ఉద్యోగం వదులుకున్నాడు. ఓ ఉద్యోగంలేదు, సద్యోగంలేదు, భార్యా బిడ్డలని పోషించాలన్న దృష్టిలేదు. ఎంత సేపూ దేశ సేవ, దేశ సేవ, అంటూ తిరిగేవాడు ”

“నీకప్పుడు రెండేళ్ళే అయితే ఇవన్నీ ఎలా తెలుసూ?” ఆశ్చర్యంగా అడిగాడు రావు.

కొంచెం కోపంగా చూశాడు అతని తండ్రి. “మా అమ్మ ఎప్పుడూ చెప్తూండేది. తర్వాత నాక్కూడా తెలిసొచ్చిందనుకో. మా పోషణకి వేరే దిక్కులేక మా అమ్మ నన్ను తీసుకుని మా తాతగారింటికి చేరాల్సొచ్చింది. అక్కడే పెరిగాను నేను. ఇలా ఉండగా, చివరికి ఎల్లాగో స్వాతంత్య్రం వచ్చిందన్నారు. వచ్చింది కదా, మళ్ళీ మా నాన్న తిరిగొచ్చాడు కదా అని మా అమ్మ కొంచెం సంతోషిస్తున్నప్పుడే హఠాత్తుగా, దేశవిభజనంటూ గొడవలు మొదలయ్యాయి. ఎంతసేపూ, పంజాబులో రక్తపాతం, బెంగాలులో హింసాకాండా అని చదివి, ఇంక నాన్న ఊరుకోలేకపోయేవాడు. ఎక్కడో దూరదేశంలో జరుగుతున్నవాటితో మనకేంపనండీ అని మా అమ్మా, తాతయ్యా ఎంత చెప్పినా వినిపించుకోకుండా, పంజాబు సోదరులకు సహాయం చెయ్యాలంటూ పరిగెత్తుకు వచ్చాడు. ఏం జరిగింది? అదిగో, ఆ రక్తపాతంలో తను గూడా ఒకడయ్యాడు. ఆ గొడవల్లోనే పోయాడు.” కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు రావు తండ్రి.

వింటున్న రావుక్కూడా బాధనిపించింది, తన తాతగారినెప్పుడూ ఎరగక పోయినా. అంత చిన్న వయసులోనే, తండ్రి ప్రేమను కోల్పోయిన తన తండ్రి మీద జాలి కూడా వేసింది. “పాపం, నీ చిన్నప్పుడే తాతగారు పోయారన్నమాట. ఎంత కష్టం!” అన్నాడు సానుభూతిగా.

మళ్ళీ కోరగా చూశాడు అతని తండ్రి. “ఒరేయ్‌ ఈ కంటతడి పెట్టింది మా నాన్న కోసం కాదు. మా అమ్మ కోసం. మా అమ్మనన్ని కష్టాలు పెట్టిన మా నాన్నంటే నాకెంత అసహ్యమో నీకు చెప్పలేను. కానీ, మా అమ్మ మాత్రం ఎంతగా ఎదురుచూసిందో, చివరికి తన బ్రతుకు మళ్ళీ మామూలుగా, అందరిలాగానే మొగుడిదగ్గిర కాపురంచేసుకుంటూ ఉండొచ్చని ఎంత ఆశ పెట్టుకుందో, నాకు తెలుసు. ఆ ఆశలన్నీ మట్టిగొట్టుకు పోయాయి. ఎందుకు? తన వాళ్ళకంటే ఊళ్ళోవాళ్ళూ, దేశంలో వాళ్ళూ, ఎక్కడో వందల మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళు ఎక్కువయ్యారు మా నాన్నకి. అందుకనే అలాంటి పిచ్చి నువ్వు పట్టించుకోవద్దని చెప్పేది. తనకు మాలిన ధర్మమేదీ లేదని మన వేదపురాణాలన్నీ ఘోషిస్తున్నాయి. అది మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో,” అని మళ్ళీ హితోపదేశం చేశాడాయన.

“అలాగే, నాన్నా,” అంటూ బుర్రూపాడు రావు.

తనకు మాలిన ధర్మం పట్టించుకోకుండా, పురుషార్థాలన్నీ చక్కగా నిర్వహిస్తూ, ఉద్యోగంలో పైకి వచ్చాడు. వివాహం చేసుకొన్నాడు. తర్వాత విదేశావకాశం కూడా వినియోగించుకుని,

అమెరికాకి ప్రయాణం కట్టి లాస్‌ ఏన్జిలెస్‌ కి వచ్చి చేరాడు.

లాస్‌ ఏన్జిలెస్‌ వచ్చిన మొదటి రోజుల్లో, కొత్త దేశం వచ్చిన సంబరంలో, తన కలలు పండాయన్న సంతోషంతో, అన్ని వింతలూ, విశేషలూ చూద్దామన్న ఉత్సాహంతో, కొత్తగా పరిచయమైన ఇంకొక తెలుగు దంపతులతో కలిసి, శాన్‌ డియెగో కి బయల్దేరారు. హోటలుకి వెళ్ళి, రిజర్వేషన్‌ చూడ మంటే, పేరడిగాడు రిసెప్షనిస్టు.

“రావ్‌” అన్నాడు రావు స్టైలుగా.

“ర ఊల్‌” అని కాగితాలు వెతుకుతున్న రిసెప్షనిస్టుతో చిరాగ్గా, “ర ఊల్‌ కాదు. రావ్‌ రాజ! ఆర్‌. ఏ. ఓ.” అని అక్షరాలు విడదీసి సరిదిద్దాడు రావు.

గదిలోకి చేరాక, “అదేమిటండీ మీ పేరు రా ఊల్‌ అంటాడూ? అదేం పేరు?” అని అతని భార్య అమాయకంగా ప్రశ్నించింది.

“అదా? అది మెక్సికన్‌ పేరులే.”

“మనం మెక్సికనులం కాము కదా?”

“అదంతేలే. మన పేర్లు వీళ్ళకి నోళ్ళు తిరగవుగా,” అని అప్పటికి అ చర్చ ముగించాడు రావు. తిరగాల్సిన ప్రదేశాలన్నీ తిరిగేసి, చూడాల్సిన విశేషాలన్నిటినీ చూసాక, రావు భార్యకి ఒక కొత్త కోరిక పుట్టుకొచ్చింది. “చూడండి. ఆ బ్రిడ్జి దాటితే మెక్సికోలో ఉంటాముట. ఒక సారి వెళ్ళి ఆ దేశం కూడా చూసొస్తే బావుంటుంది కదా? వెళ్ళి చూసొద్దాం రండీ,” అని సంబరపడింది.

“ఇంకా నయం! అక్కడికి వెళ్తే ఇంకేమైనా ఉందా? మళ్ళీ తిరిగి రానీయరు,” అన్నాడు రావు.

“అదేమిటి? ఎందుకు రానీయరు?” అని అడిగింది అతని భార్య.

“ఎందుకా? మన ఖర్మ కొద్దీ ఈ తెల్లవాళ్ళ కళ్ళకి మనం ఆ మెక్సికో వాళ్ళలాగానే అఘోరిస్తాం. చదువూ సంధ్యల్లేని లోఫర్లకీ, ఇంజనీర్లకీ తేడా తెలియదు దద్దమ్మలకి,” అన్నాడు రావు కసిగా.

“అవునవును. ఇప్పటికే మీ పేరు రవూల్‌ చేసేశారు. అదింకా ఏ హొసే గొన్‌ఆలెస్‌ గానో మారకముందే ఇక్కడినుంచి చెక్కేయడం మంచిది,” అని చమత్కరించాడు అతని స్నేహితుడు.

నెమ్మదిగా అమెరికా జీవనం అలవాటవుతోంది ఇద్దరికీ. ఒకరోజు మంచి ఇండియన్‌ ప్రోగ్రాముందంటే బయల్దేరారు. ముందు అది నల్ల వాళ్ళ ఏరియా అని సందేహించినా, తర్వాత పెద్ద హాలేకదా, చాలామంది వస్తారుకదా అనే ధైర్యంతో బయల్దేరాడు రావు. కారు పార్కు చేసి హాలు దగ్గరకి నడుస్తుంటే, హఠాత్తుగా ఆగిపోయింది రావు భార్య.

“ఏమిటి?” అనడిగాడు రావు. నోట మాట పెగలని అతని భార్య కళ్ళతో సంజ్ఞ చేసింది. అక్కడ,

పేవ్‌ మెంట్‌ మీద, సుమారు పది పన్నెండేళ్ళ నల్ల కుర్రవాడొకడు మోకరిల్లి ఉన్నాడు. అతని చేతులు రెండూ వెనక్కి విరిచి కట్టబడి ఉన్నాయి. కదలకుండా అదే భంగిమలో ఉండమని హెచ్చరించేందుకు కాబోలు, ఒక పోలీసు ఆ పిల్లవాడి ముందు అతని తలకు తన పిస్టలు గురిచేసి నుంచున్నాడు.

పోలీసు ముఖంలో భీకరమైన కఠినత్వం, పిల్లవాడి మొహంలో అంతులేని భయం తాండవిస్తున్నాయి. రావు భార్యని నిలిపివేసిన ఈ దృశ్యాన్ని ఇంకెవరూ పట్టించుకున్నట్టు లేదు. ప్రోగ్రాము గురించి కబుర్లు చెప్పుకుంటూ, పట్టు చీరల రెపరెపలతో, బిజినెస్‌ సూట్ల హుందాలతో వాళ్ళిద్దరి పక్కనుంచే నడిచి వెళ్తున్నారు అందరూ. రావు కూడా భార్య చేయి పట్టుకుని నెమ్మదిగా హాలు వైపు నడిపించాడు.

కొంత దూరం వెళ్ళాక అతని భార్య లోగొంతుకతో అంది, “అంత చిన్న పిల్లవాణ్ణి అంత అమానుషంగా ”

రావు అడ్డొచ్చాడు, “అంత చిన్న వయసులోనే పోలీసుల చేతిలో పడ్డాడంటేనే తెలుస్తోంది, వాడెంత రాటుదేలిన రౌడీయో.”

“అది కాదండీ,” అతని భార్య కి ఒళ్ళు జలదరించీంది. “నేను టీవీలో ఒక షో చూశాను నాజీలు యూదులను అచ్చు ఈ విధంగానే చంపేవారట.”

రావుకి చిరాకు వేసింది. “నీకు తీరిక ఎక్కువైనట్టుంది.”

“ఆ పోలీసతనికి మనం కొంచెం నచ్చచెప్పితే బావుండేదేమో?”

“ఇంకా నయం! మనల్ని కూడా కాల్చిపారేసేవాడు. అయినా మనకెందుకీ గోల?”

“చిన్న పిల్లల్ని నెమ్మదిగా మందలించాలిగానీ ”

“వాడి తరఫున వకాల్తా బాగానే పుచ్చుకున్నావే? అసలు వాడేం చేశాడో కూడా తెలియకుండా? అయినా ఈ నల్ల వాళ్ళని నమ్మలేం. వాళ్ళని ఎప్పుడూ అదుపులో ఉంచాలి. మొన్న పేపర్లో లీరాయ్‌ బ్రౌన్‌ కేసు గురించి చదవలేదా?”

దాంతో అతని భార్య ఊరుకుంది.

కాలక్రమేణా తమ కొత్త జీవితానికి పూర్తిగా అలవాటు పడ్డారు రావు దంపతులు. అమెరికా వచ్చి ఇంచు మించు పదిహేనేళ్ళవుతోంది. ఉద్యోగంలో రావు బాగా పైకి వచ్చాడు. వృత్తి రీత్యా రకరకాల ఊళ్ళు తిరగాల్సి రావడంతో దేశమంతా కొట్టిన పిండి అయినట్టుందతనికి.


మామూలులాగానే ఆ సారి కూడా పని మీద టెక్సస్‌ వెళ్ళాడు రావు. రెండు రోజుల్లో తిరిగి వద్దామనే ఉద్దేశంతో వెళ్ళిన రావుకి అనుకోని అవాంతరం వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా, అందరూ దిగ్భ్రమ చెందేలా, టెర్రరిస్టులు అమెరికామీద దాడి జరిపారు. దేశంలో అందరితోబాటూ రావు కూడా ఆ వార్త విని స్తంభించిపోయాడు. ఆ అఘాతం నుంచి తేరుకున్నాక, దాడులు జరిగింది ఎక్కడో న్యూయర్కు, వాషింగ్టన్‌ లలో, తాను ఉన్నది టెక్సస్‌ లో, కాబట్టి తన క్షేమానికేమీ ప్రమాదం లేదని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు, భార్యకు కూడా చెప్పాడు. విమానాలన్నీ బందైపోవడంవల్ల ఇంటికి ఎప్పుడు తిరిగివెళ్ళచ్చో తెలియదు. అయినా రెండు మూడు రోజుల్లో అన్నీ సవ్యమైపోతాయని మనసు సమాధానపరచుకుని కార్లో గాసు పోసేందుకు గాస్‌ స్టేషన్‌ కి వెళ్ళాడు రావు.

అన్యమనస్కంగా కార్లో గాసు నింపి డబ్బులు కట్టడానికి లోపలకి వెళ్ళాడు. అక్కడ కొట్టు తాలూకు మనిషే కాకుండా ఇంకా కొంత మంది గుమిగూడి ఉన్నారు. వాళ్ళంతా అక్కడేంచేస్తున్నారో రావుకర్ధం కాలేదు. డబ్బులిస్తూంటే వాళ్ళు తననే చూ సూండడం గమనించి ఇబ్బంది పడ్డాడు. ఎంత తొందరగా అక్కడినుంచి బయటపడితే అంత మంచిదనిపించింది.

బయటకు వచ్చి నిబ్బరంగా ఊపిరి పీల్చుకున్నాడో లేదో ఒక బలమైన గుద్దు అతని తలకు ఢీకొని కళ్ళు బైర్లు కమ్మాయి. తూలి పడబోయిన రావుని ఎవరో పట్టుకుని ఆపారు. తన రక్షకుడెవరో చూసేలోగా అతను రావుని నిటారుగా నిలబెట్టి పట్టుకున్నాడు. మళ్ళీ ఇంకో గుద్దు అతని పొట్టలో తగిలి లుంగ చుట్టుకు పోయాడు. ఏమవుతోందో రావుకి అర్ధం కావడంలేదు. పడబోతున్న అతన్ని మళ్ళీ జుట్టు పట్టుకు నుంచోబెట్టారు. ఉక్కు పిడికిళ్ళు అతని ముఖాన్ని కర్కశంగా ముద్దాడుతున్నాయి. “చావరా, అరబ్బు కొడకా! నీలాంటి దుర్మార్గులనందరినీ …” అంటూ రొప్పుతున్నాడతను.

రావుకి ఆధారం దొరికింది. దెబ్బలను తప్పించుకునేందుకు వ్యర్ధ ప్రయత్నం చేస్తూనే, “నేను అరబ్బును కాను. నేను ముస్లిమును కాను,” అని అరవసాగాడు. అతని అరుపులు ఎవరైనా విన్నారో లేదో గానీ, దెబ్బల వర్షం ఆగలేదు.

రావుకి ప్రాణభయం పట్టుకుంది. “రక్షించండి, రక్షించండి,” అని ఎలుగెత్తి అరవబోయాడు. తడారిపోయిన గొంతులోంచి ఆ శబ్దాలు బయటకి వచ్చాయోలేదో? మళ్ళీ శక్తి కొద్దీ అరచాడు రావు.

కాడలా వేళ్ళాడుతున్న రావుని నిలబెట్టే ప్రయత్నం మానేశారు వాళ్ళు. నేలమీద పొర్లాడుతున్న రావుకి దూరంగా మనుషులు తిరుగుతూ కనిపించారు. అతనిలో మళ్ళీ ఆశ పొటమరించించి.

“రక్షించండి” అనబోయాడు. నీరసంగా, పీలగా వచ్చిన ఆ స్వరాన్ని ఎవరైనా గుర్తించగలరా?

తనని తన్నుతున్న కాళ్ళని తప్పించుకునేందుకు కూడా కదలలేకపోయాడు రావు. ఏదో కర్ర లాంటి వేవో తెచ్చి వాటితో బాదుతున్నారు. రావుకి స్పృహ తప్పసాగింది. ఎవరూ రారేం? తనకు సహాయం చేయరేం? రోడ్డు మీద వాళ్ళంతా ఏమయ్యారు?

“తప్పించుకు …” అని తండ్రి గొంతు లీలగా వినిపించింది. అవును. వాళ్ళకు మాత్రం ధన్యులమవ్వాలని ఉండదూ? తను తప్పించుకు తిరుగుతూండగా, ఇలాగే రక్షించమంటున్న జోసెఫ్‌లూ, హుస్సేనులూ, సింగులూ, హొసేలూ, లీరాయ్‌ లూ, ఎందరో మటుమాయమయ్యారు.

ఇక తన గోడు వినేందుకు ఎవరు మిగిలారు?


రచయిత మాచిరాజు సావిత్రి గురించి: జననం ఏలూరులో. తొమ్మిదేళ్ళ వయసు నుంచి అమెరికా, కెనడాలలోనే ఉన్నారు. నివాసం కేలిఫోర్నియాలో. వాతావరణకాలుష్య రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు, నాటకాలు, ఓ నవల రాసారు. ...