ఓసారి నది
పారుతూ పారుతూ
పంట కాలువను అడిగింది
ఎంత సేపూ
నా మోచేతి నీళ్ళు తాగడమేనా?
నీకంటూ అస్తిత్వం లేదా అని.
కాలువ నవ్వింది
వరి వెన్నులా
అర్ధరాత్రి రెక్కవిప్పుకుంటున్న
రేపటి వేకువలా
ఓ సారి నది
పంటకాలువ ఇంటికొచ్చింది
పొలం గట్లమీద
కాలువ చిరునవ్వుతో సాగిపోతుంటే
నది మౌనంగా అనుసరిస్తోంది
వెళ్తూ వెళ్తూ కాలువ
వేల పాయలుగా చీలిపోయింది
మడి మడినీ తడుపుతూ
మలుపు మలుపులో పరవళ్ళు తొక్కుతూ
ప్రక్షాళన చేస్తూ
అన్నదాత రక్తంలో ఇంకిపోతూ
ఆ రాత్రి
నదిలో అంతర్మథనం!
గుండెనా? రక్తనాళాలా?
ఏది ముఖ్యం?
లేక రెండింటిలోనూ ప్రవహించే రక్తమా?
కాలం నవ్వుకుంది
ఓ శిశువులా.