బూడిదలో బంగారం

ఊర్లో పెద్ద వడ్డీవ్యాపారి పోయాడన్న వార్త వినగానే భీమా ఆనందానికి అంతులేకుండా పోయింది. మనసు ఆనందంతో నాట్యం చేసింది. ఊరి వైపుగా చూసి, ఓ సారి తల తిప్పి ఆకాశంలో సూర్యుడిని కూడా చూశాడు.

సూర్యాస్తమయం కాబోతోంది. వాన మబ్బులు కమ్ముకుంటున్నాయి. అప్పుడే దున్నిన పొలంలోని మట్టి పెళ్ళల్లా మబ్బులు పరుచుకుని ఉన్నాయి.

చల్లని గాలి వీచింది. ఊరి శివారు అడవిలో ఉన్న యాభై గుడిసెలూ చలిగాలికి వణికాయి. ఆ గుడిసెలన్నీ ప్లాస్టిక్ షీట్లూ, పట్టాలతో వేసినవే. రోజంతా బతుకు వేటలో డస్సిపోయిన శరీరాలు ఆ గుడిసెల్లో విశ్రమిస్తున్నాయి. కట్టెల పొయ్యి లోంచి తెల్లని పొగ పచ్చని చెట్ల మీద నుంచి లేస్తోంది. పిల్లలు ఆటల్లో పడ్డారు.

విశాలంగా విస్తరించిన చింతచెట్టు కింద భీమా ఎక్కడో ఆలోచిస్తూ కూచున్నాడు. కొంత ఆందోళనగా ఉన్నాడు. మనసు స్మశానానికీ చింతచెట్టుకీ మధ్య పచార్లు చేసి వస్తోంది. సూర్యుడి కేసి, వూరు కేసీ మార్చి మార్చి చూపులు పరిగెడుతున్నాయి. అతనికి చీకటి కావాలిప్పుడు.

అతని పక్కనే కూతురు నర్బద ఆడుకుంటోంది. భార్య పొయ్యి ముందు కూచుని రొట్టెలు చేస్తోంది. భీమాకి ఉత్సాహం వచ్చేస్తోంది. ఎర్రటి తలపాగా చుట్టుకున్నాడు. పసుప్పచ్చ ధోవతి కట్టుకుని, మందపాటి నూలు చొక్కా తొడుకుని, సతారా జిల్లా వేషం కట్టాడు. ఆ బట్టల్లో అతను చూడ్డానికి కుస్తీ యోధుడిలా ఉన్నాడు. కొట్టొచ్చినట్టు కనపడే నుదురు, బలమైన మెడ, దట్టమైన కనుబొమలు, గుబురు మీసం, వీటన్నిటితో భీమా రూపం క్రూరంగా ఉంది.


వర్ణా నది ఒడ్డున పట్నానికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది భీమా ఊరు. ఒంట్లో ఎంత బలమున్నా, అది ఆ చిన్న వూర్లో అతని కడుపు నింపలేకపోయింది. ముంబయికి వచ్చాడు. ఊరంతా గాలించినా తగిన పని దొరకలేదు. ముంబయిలో పని దొరికి, బాగా సంపాదించాలనీ, భార్యకు కాసుల పేరు చేయించాలనీ కన్న కలలు చెదిరిపోయాయి. పని మీద ఆశ వదులుకుని శివారులో ఉన్న అడవి దగ్గర ఒక చిన్న ఊరికి చేరాడు. అక్కడికి చేరాక దగ్గర్లో ఒక క్వారీలో రాయి కొట్టే పని దొరికింది.

సంతోషపడ్డాడు. ఒళ్ళు దాచుకోకుండా పనిచేశాడు. కొండల్ని సవాలు చేసి వాటిని పిండి కొట్టాడు. గునపం ఎత్తి కొడుతుంటే ఆ కొండ అతని ముందు తలవంచేది. సర్వశక్తులూ ఒడ్డి రాళ్ళు కొట్టేవాడు భీమా.

కానీ అనుకోకుండా, ఆరు నెలల్లో ఆ క్వారీ మూతపడింది. ఉద్యోగం పోయిందన్న వార్తతో భీమా హతాశుడై పోయాడు. ఆకలి కళ్ళముందు నాట్యమాడింది. ఏం చేయాలో పాలుపోలేదు. సంచీ పట్టుకుని క్వారీ నుంచి తిరుగుముఖం పట్టాడు. దార్లో ఒక కాలవ దగ్గర ఆగి స్నానం చేసి, నిరాశతో కుంగిపోతూ, ఏమీ పాలుపోక అక్కడే కూచున్నాడు.

అతని కళ్ళు సమీపంలో ఉన్న ఒక బూడిద కుప్ప మీద పడ్డాయి. కాలిన మృతదేహం తాలూకు బూడిద అది. నల్లగా మాడిపోయిన ఎముకలు చూసి భీమాకి భయం వేసింది. పాపం ఎవరో, తనలాటి వాడే బతుకే బరువై ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఒక నాటికి తన గతీ ఇంతే. మరో రెండు రోజుల్లో ఆకలి మంటలు మొదలవుతాయి తన ఇంట్లో కూడా. పిల్ల గుక్కపెట్టి ఏడుస్తుంది. పెళ్ళాం దిగులుపడి కూచుంటుంది. అయినా తను మాత్రం చేయగలిగిందేమీ లేదు.

అకస్మాత్తుగా ఆ బూడిద మధ్య ఏదో తళతళ మెరుస్తూ కనపడింది. భీమా అదిరే గుండెలతో పరిశీలనగా చూశాడు. తులం బంగారపు ఉంగరం మెరుస్తోంది బూడిద మధ్యలో. కాలిన శవం తాలూకు బూడిదలో భీమాకి జీవకాంక్ష గోచరమైంది. ఆ బంగారం అతని కుటుంబం కడుపు నింపింది.


ఆ మర్నాటి నుంచీ భీమా దినచర్య మారిపోయింది. శ్మశానాలు, నది ఒడ్డున కాలవొడ్డున శవదహనాలు జరిగే చోట్లు దర్శించడమే భీమా పని. బూడిదను జల్లెడ పెడితే ప్రతి రోజూ ఒక ఉంగరమో, కాలి పట్టీనో, ముక్కు పుడకో, చెవి రింగో దొరికేది. దాంతో ఆ రోజు నిశ్చింతగా గడిచిపోయేది.

ఒక్కోసారి బంగారు ఆభరణం కరిగి ఎముకల్లోకి చొరబడేది. భీమా ఆ ఎముకలన్నిటినీ విరగ్గొట్టి అందులోంచి బంగారం బయటికి లాగేవాడు. సాయంత్రానికి కుర్లా వెళ్ళి బంగారాన్ని అమ్మి, ఆ డబ్బుతో సరుకులు తెచ్చేవాడు. కూతురికిష్టమైన ఖర్జూరాలు కూడా.

బూడిద జల్లెడ పట్టడం, పాతిపెట్టిన శవాలని వెలికి తీయడం, బంగారం సేకరించడం భీమా జీవితంగా మారిపోయింది. చావుకీ బతుక్కీ తేడాని భీమా మర్చిపోయాడు. అతనికి అర్థమైందల్లా, ధనవంతులు చచ్చిపోతే బంగారం దొరుకుతుంది. వాళ్ళ శవాల మీద, పేదవాళ్ళ శవాల మీద పిసరంతైనా దొరకదు. అందుకే పేదవాళ్ళకు చచ్చే హక్కు లేదు. డబ్బులున్న వాళ్ళు చస్తే మంచిది. అసలీ పేదవాళ్ళు చచ్చినా బతికినా ఒకటే, పెద్ద తేడా ఏమీ లేదు. ఒంటి మీద బంగారంతో చచ్చిపోయినవాడు మాత్రం ధన్యజీవి. ఇలా సాగేవి భీమా ఆలోచనలు.

కఠినమైన వాస్తవ జీవన చిత్రం భీమాను మరింత కఠినంగా, కర్కశంగా మార్చేసింది. రాత్రింబవళ్ళు స్మశానాలు, శవదహనాలు జరిగే స్థలాలు తిరగడమే భీమా జీవితం. శవాలు అతని ఉనికికి ఆధారంగా మారాయి.

కొన్నాళ్ళకి స్మశానాల్లో భీతి గొలిపే సంఘటనలు జరుగుతున్నట్టు ఊరి జనం పసిగట్టారు. పూడ్చిన శవాలు సమాధుల్లోంచి లేపి బయట పడేసి ఉంటున్నాయి. ఆ మధ్య స్మశానంలో పూడ్చిన కామందుగారి కోడలి శవం కూడా కాలవొడ్డున పడి ఉండి కనపడింది. ఎవరో ఇలా శవాల్ని తవ్వేస్తున్నారని గ్రహించారు. వరస సంఘటలనతో పోలీసులు కూడా వూరి మీద ఒక కన్నేసి ఉంచారు.

కానీ శవాల మీద కన్నేసి ఉంచడం అంత సులభమా?


సూర్యుడు దిగిపోయాడు. చిమ్మ చీకటి ఆవరించింది.

భీమా నిశ్శబ్దంగా కూచున్నాడు. అతను బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడని గ్రహించి భార్య నెమ్మదిగా అంది “ఎక్కడికో బయల్దేరావు కాబోలు. నువ్వు చేస్తున్న పని మంచిది కాదయ్యా. శవాలు, బూడిద, బంగారం, ఇంతేనా ఎప్పుడూ? ఇంకేదైనా పని వెతుక్కో. జనానికి తెలిస్తే మనకు మర్యాద ఉంటుందా?”

కోపం వచ్చింది భీమాకి. “నోర్మూసుకో” అని కసిరాడు.

“నేనేం చేస్తే జనానికెందుకు? నా ఇంట్లో పొయ్యి ఆరిపోయినపుడు ఎవడన్నా వచ్చి దాన్ని వెలిగించాడా?”

“అది కాదయ్యా…” కోపంతో ఎర్రబడ్డ అతని మొహాన్ని చూసి ధైర్యం కూడదీసుకుని అంది “దెయ్యాలు భూతాల వెనక తిరగడం అంత మంచిది కాదు. భయంగా ఉండి చెప్తున్నాను, అర్థం చేసుకో.”

“స్మశానాల్లో దెయ్యాలుంటాయని నీకెవరు చెప్పారు? చూడూ, ఈ ముంబయ్యే ఒక పెద్ద దెయ్యాల సంత. నిజమైన దెయ్యాలన్నీ కొంపల్లోనే ఉన్నాయి. చచ్చిన శవాలు స్మశానాల్లో కుళ్ళుతున్నాయి. దెయ్యాలు వూళ్ళలోనే ఉంటాయి. అడవుల్లో స్మశానాల్లో కాదు.” అరిచాడు.

అతని కోపం చూసి ఆమె నోరు మూతపడింది. బయటికెళ్ళబోతూ మళ్ళీ గుర్రుమన్నాడు.

“ముంబయి మొత్తం తిరిగినా నాకు పని దొరకలేదు. స్మశానంలో బూడిద తిరగదోడితే నాకు బంగారం దొరికింది. కొండల్ని పగలగొడితే రెండు రూపాయలు రావడం కష్టమయ్యేది. ఇప్పుడు చూడు, ఈ బూడిదే నాకు పది రూపాయలు సంపాదించి పెడుతోంది.” గబగబా బయటికి నడిచాడు.

అప్పటికే అతనికి ఆలస్యమైంది. బయట అంతా ప్రశాంతంగా ఉంది. తల చుట్టూ మఫ్లర్ చుట్టుకున్నాడు. దాని మీద గోనె పట్టాతో కుట్టిన సంచీ లాంటిది కట్టుకుని, మరో వైపు దాన్ని నడుం దగ్గర బిగించాడు.

సన్నని తవ్వుకోల చేతబట్టి పెద్ద పెద్ద అంగలు వేస్తూ పోతున్నాడు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో నడుస్తున్నా, అతనికి భయంగా లేదు. ఒక చీర, రవిక, ఖర్జూరాలు… అతని కళ్ళ ముందు ఇవే కనిపిస్తున్నాయి. రేపు అవన్నీ తనింట్లో ఉండాలి.

గాలిలో ఒకరకమైన ఉత్కంఠ ఆవరించి ఉంది. ఒక నక్కల గుంపు అతని ముందుగా పరిగెత్తింది. ఒక పాము అతని పక్కనుంచే పాకుతూ పొదల్లోకి పోయింది. దూరంగా ఒక గుడ్లగూబ గుటుగుటుమంటూ కూసి వాతావరణంలో భయాన్ని ఎగదోసింది. ఆకు కదిలితే వినపడేంత నిశ్శబ్దం.

వడ్డీ వ్యాపారి చనిపోయిన గ్రామం దగ్గరికొచ్చాడు. ఒక పక్కన కూచుని చుట్టూ పరిశీలించాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉండి ఉండి ఎవరో దగ్గుతున్నారు. ఎవరింట్లోనో ఒక లాంతరు మినుకు మినుకుమంటోంది. భయపడాల్సింది ఏమీ కనపడలేదు. నెమ్మదిగా స్మశానంలోకి జారుకుని వడ్డీవ్యాపారి సమాధి కోసం వెదకటం మొదలుపెట్టాడు.

పగిలి పోయిన కుండలూ, విరిగిపోయిన పాడెలూ పక్కకి నెట్టుకుంటూ ప్రతి సమాధినీ పరిశీలిస్తున్నాడు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటూ చీకటిని మరింత చిక్కబరుస్తున్నాయి. అకస్మాత్తుగా మెరుపులు మెరుస్తూ మబ్బుల మీద నాట్యమాడుతున్నాయి. వానొచ్చేలా ఉందని భీమాకు భయం వేసింది. వానొస్తే కొత్త సమాధిని కనుక్కోవడం కష్టమైపోతుంది మరి.

అర్ధరాత్రి ముగిసే సమయానికి దాదాపు మొత్తం స్మశానం గాలించాడు గానీ వడ్డీవ్యాపారి సమాధి దొరకలేదు. దిగచెమట్లు పట్టాయి. మతి పోయేలా ఉంది. విరిగిపోయిన పాడె బొంగుల్లోంచి గాలి పరిగెత్తి ఎవరో పళ్ళు కటకటలాడిస్తున్నట్టు కీచుమంటూ వికృతంగా ధ్వనించింది. ఒక భయ వీచిక స్మశానం అంతా ప్రవహించింది. ఎవరో మొరుగుతున్నట్టు, ఏడుస్తున్నట్టు, మట్టి మీద గీకుతున్నట్టు చప్పుడైంది. అంతలోనే ఎవరో అతని కాళ్ళూ చేతులూ పట్టుకుని దులుపుతున్నట్టు శబ్దం.

భయం కరెంట్ షాక్‌లా భీమా వెన్నులో పాకింది. అతను భయపడటం మొదటిసారి.

కొద్దిసేపటికి జరుగున్నదేమిటో అతనికి అర్థమైంది. అతను వెదుకుతున్న కొత్త సమాధి పదడుగుల దూరంలోనే ఉంది. నక్కల గుంపు ఆ సమాధిని తవ్వుతోంది. ఆ శబ్దాలే తనని భయపెట్టాయి.

“ఛ, అలా భయపడ్డానేంటి!” సిగ్గువేసింది.

ఒక్క గంతుతో సమాధి మీదకి ఎగిరి నిల్చున్నాడు. చేతికందిన రాళ్ళతో నక్కల్ని తరమడానికి ప్రయత్నించాడు. నక్కల కంటే ముందే తనే శవాన్ని దక్కించుకోవాలన్న తొందరతో తవ్వుకోలతో సమాధిని తవ్వసాగాడు.

రాళ్ళ దెబ్బలకు వెనక్కి తగ్గిన నక్కలు ఒక్కసారిగా గుంపుగా అతని మీద దాడికి దిగాయి. ఒక నక్క అతన్ని వెనక్కి తోసి చేతిని కరిచింది. చేతిలోని గోనె సంచిని చేతి చుట్టూ చుట్టాడు భీమా. అతన్ని కరిచిన నక్క మళ్ళీ అతని మీదకు రాగానే తవ్వుకోలని దాని గొంతులో దించాడు. అది క్షణంలో ప్రాణాలొదిలింది.

మళ్ళీ తవ్వకం సాగింది. ఈ సారి నక్కలన్నీ గుంపుగా వచ్చిపడ్డాయి. అతనికీ వాటికీ మధ్య పోరాటం జరిగింది. చుట్టుముట్టిన నక్కలు అందిన చోటల్లా కరిచాయి. భీమా మాత్రం తక్కువ తినలేదు. తవ్వుకోలతో వీలైనన్ని నక్కల్ని చంపి, మరి కొన్నిటిని గాయపరిచాడు. అన్ని వైపుల నుంచి వచ్చిపడ్డ నక్కలు ఎక్కడబడితే అక్కడ కరిచాయి.

సర్వశక్తులు ఒడ్డి పోట్లాడాడు వాటితో. రేపు ముద్ద నోట్లోకి వెళ్ళాలంటే ఇవాళ ఈ శవాన్ని దక్కించుకోవాలి. తనే గెలవాలి ఇవాళ.

ప్రకృతి ప్రశాంతంగా ఉంది. ముంబాయి మంచి నిద్దర్లో ఉంది. నక్కలతో భీమా పోరాటం చివరి దశకు చేరింది. భీమా కొట్టినపుడల్లా నక్కలు అరుస్తున్నాయి. ఒకటి గాయపడుతుంటే మరొకటి అతడి మీద దాడి చేసి రక్తాన్ని కళ్ళ జూస్తోంది.

చాలాసేపటి తర్వాత నక్కలు తోక ముడిచి చీకట్లోకి పారిపోయాయి. ఇదే అదనుగా భీమా సమాధి మీద మిగిలిన మట్టిని తొలగించి మొహం మీద చెమట్లు తుడుచుకుంటూ సమాధిలోకి దూకాడు.

నక్కలు మళ్ళీ గుంపుగా వచ్చి పడ్డాయి గానీ భీమా వాటిని విజయవంతంగా తరిమేశాడు. శవం చంకల కింద చేతులు వేసి దాన్ని బయటికి లాగాడు. వడ్డీ వ్యాపారి చనిపోయి చాలాసేపు కావడం వల్ల శవం నీలుక్కుపోయింది. సమాధికి ఆనించి దాన్ని కూచోబెట్టి, బంగారం కోసం వెదికాడు. వేలికి ఉన్న ఉంగరాన్ని కనిపెట్టి, దాన్ని లాగి తీసుకున్నాడు. ఒక చెవికి ఉన్న బంగారు చెవిపోగుని కూడా లాక్కున్నాడు.

నోట్లో బంగారం పెట్టి పూడ్చి ఉంటారు, తప్పక నోట్లో ఏదో ఒకటి ఉండే ఉంటుందని ఆలోచించి, శవం నోట్లోకి వేళ్ళు పోనిచ్చి నోరు బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడు. శవం దవడలు బిగుసుకుపోయి ఉండటంతో సాధ్యపడలేదు. సమయం వృధా చెయ్యకుండా, తవ్వుకోల సహాయంతో శవం నోరు తెరిచి నోట్లో వేళ్ళు పెట్టి బంగారాన్ని వెదికాడు. అదే సమయానికి నక్కలు అకస్మాత్తుగా గుంపుగా ఊళలు వెయ్యడం మొదలెట్టాయి. భీమా వేళ్ళు శవం నోట్లో ఇరుక్కుపోయాయి. శవం నోరు మూత పడింది. నక్కల ఊళలతో వీధి కుక్కలన్నీ మేల్కొని గట్టిగా మొరగడం ప్రారంభించాయి.

ఊరంతా మేల్కొంది.”శవాన్ని నక్కలు పీక్కు తింటున్నట్టున్నాయి. పదండి చూద్దాం!”

ఊళ్ళో జనం వచ్చేస్తారనే భయంతో భీమా దొరికిన ఉంగరాన్ని జేబులో పడేసి, వేళ్ళను శవం పళ్ళ మధ్య నుంచి లాగడానికి ప్రయత్నించాడు. శవం మరింతగా పట్టు బిగించినట్టు, కత్తెరలో పోక చెక్కలాగ మరింతగా అతని వేళ్ళు ఇరుక్కు పోయాయి. నొప్పితో విలవిలలాడాడు.

లాంతరు దీపాలతో జనం అటువైపు పరిగెత్తుకు రావడం గమనించి వేళ్ళను శవం నోట్లోంచి పెకలించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఇది నిజంగా దెయ్యమేమో, తనని జనానికి పట్టిస్తుందేమో అని కంగారుపుట్టింది. కోపంతో స్వాధీనం తప్పి “ఒరే, లంజకొడకా వదలరా నన్ను” అని అరవబోయి తన గొంతు తనని పట్టిస్తుందేమో అని తలచి ఆగిపోయాడు.

గ్రామస్తులు సమీపిస్తుండటంతో తవ్వుకోలతో శవం నోరు బలవతంగా తెరిచి వేళ్ళు వెనక్కి లాక్కున్నాడు. అప్పటికే వేళ్ళు బాగా నలిగి రక్తం కారుతోంది. ఒక్క గంతుతో సమాధి నుంచి బయట పడి చీకట్లో కల్సిపోయాడు భీమా.

ఇంటికి చేరేసరికి తీవ్రమైన జ్వరం వచ్చేసింది. అతని పరిస్థితి చూసి భార్యా కూతురూ భోరుమన్నారు. డాక్టర్ వచ్చి చూసి, పెదవి విరిచాడు. రెండు వేళ్ళు తీసివేయాల్సి వచ్చింది. అదే రోజు, క్వారీ తిరిగి తెరుస్తున్నారనే వార్త తెల్సింది. ఏనుగు లాంటి భీమా కుప్పకూలిపోయి పసిపిల్లాడిలా ఏడ్చాడు.

కొండల్ని పిండిచేసిన చేతిలోంచి రెండు వేళ్ళను, పిసరంత బంగారం కోసం పోగొట్టుకుని నిస్సహాయుడైపోయాడు భీమా.

(ఆంగ్లానువాదం: Vernon Gonsalves)