పది వోడ్కా షాట్లు

“యూ ఆర్ ఎ బ్లడీ మోరాన్ సత్యా!”

“కమాన్ విన్నీ, ఎందుకిలా సడెన్‌గా…”

“సడెన్‌గానా? ఐదేళ్ళుగా చేస్తుందేగా నువ్విది నాతో.”

“నేనేం చేశాను? బాస్‌తో ఫైట్ చేసి నీకా ఎల్&టి ప్రాజెక్ట్ ఇప్పించాగా, ఇంకేం చెయ్యాలి?”

“నిన్న నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు మధ్యలో దూరి ఎందుకు టేకోవర్ చేశావ్?”

“నీకు హెల్ప్ చేద్దామని. శ్రీనీతో ఆర్గ్యూ చేసి గెలవలేవనే.”

“సో, నేన్నీ చేతిలో జస్ట్ పపెట్ అని ప్రూవ్ చేస్తున్నావైతే అందరికీ?”

“విన్నీ, నువ్వు నన్ను ట్రస్ట్ చెయ్యాలి కొన్నిసార్లు…”

“నో, నో, ఫస్ట్ యూ నీడ్ టు స్టార్ట్ ట్రస్టింగ్ మీ!”

మౌనం. ఏడుస్తోందా? లేదు, కోపంగా ఉంది. కోపాన్ని హ్యాండిల్ చెయ్యచ్చు, ఏడుపుని కష్టం!

“నీ ప్రమోషన్ గురించి శ్రీనీతో మాట్లాడాను. ఆల్ సెట్. ఇంకో వన్ ఇయర్లో…”

“స్టాప్ ఇట్! ఫైవ్ ఇయర్స్‌గా నాకీ ప్రమోషన్ క్యారెట్ ఇస్తూనే ఉన్నావ్, నేనో డైరెక్టర్ని సత్యా ఈ కంపెనీలో. డోంట్ గివ్ మి దిస్ బుల్‍షిట్!”

“బిలీవ్ మీ, ఆ సంగతి నేను చూస్కుంటాను. నువ్వు ఎల్&టి ప్రోజెక్ట్ మీద ఫోకస్ చెయ్యి చాలు ప్లీజ్!”

“చేస్తా. ఫోకస్ చేస్తా. డెలివర్ కూడా చేస్తా. నువ్వు మాత్రం బాస్‌లకి మందుపోసి ప్రమోషన్లు కొట్టెయ్.”

“ఐ అండర్‌స్టాండ్. నా కింద వర్క్ చెయ్యడం నీకు ఇబ్బందిగానే ఉండచ్చు…”

“డోంట్ గో దేర్! వర్క్‌లో నీకు ఏబీసీలు కూడా రావని అందరికీ తెలుసు… యూ ఆర్ జస్ట్ ఎ లక్కీ పారాసైట్!”

“హేయ్, నీకిష్టం లేకపోతే, క్విట్ ద జాబ్, ఎవరూ ఆపట్లేదు!”

“వాహ్, ఇన్నేళ్ళ హార్డ్‌వర్క్ తర్వాత, నా ప్రమోషన్‌కి ఇంత దగ్గరిగా వచ్చాక, ఇప్పుడు… ఇప్పుడు యూ వాంట్ టు కిక్ మీ ఔట్?”

“నేనలా అనలేదు, ఇంత బాధపడుతూ నా దగ్గర చెయ్యాల్సిన అవసరం లేదంటున్నా.”

“అవసరం ఉంది సత్యా, బైటికెళ్ళి మళ్ళీ జీరోనుంచి మొదలుపెట్టలేను.”

“హుఁ”

“లుక్ ఎట్ యూ, వావ్! ఈ రిసార్ట్, ఈ మ్యారేజ్ సిల్వర్ జూబిలీ పార్టీ! నువ్వెప్పుడూ పెద్ద షో ఆఫ్ కదా! యూ డంబ్ షో ఆఫ్స్ ఆర్ కిల్లింగ్ ది సొసైటీ.”

“సో, నా పార్టీకొచ్చి, నా డ్రింక్ తాగుతూ నన్నే తిట్టడం! ఇవేనా నీ మేనర్స్?”

“అయ్యో, సారీ సర్, ప్లీజ్ గో, ఆ శ్రీనీ కాళ్ళమీద పడి కంప్లైంట్ చేస్కో, నన్ను ఫైర్ చేస్కో!”

“ప్లీజ్, నీకు తెలుసు నేనలా చెయ్యనని.”

“చెయ్యవు. చెయ్యలేవు. నేన్నీ గోల్డెన్ డక్‌ని, నువ్వు నా గ్లాస్ సీలింగ్‌వి.”

“నువ్వన్నీ పర్సనల్‌గా తీస్కుంటున్నావ్, నాకు టాలెంటే ముఖ్యం.”

“టాలెంట్! అవును, ఎవడికే బ్రాండిష్టమో, ఏ ఫామ్‌హౌస్‌లో ఎలాంటి పార్టీ ఎప్పుడివ్వాలో నాకు తెలీదు. స్కిల్ లెస్ స్టుపిడ్‌ని.”

“నీకు డ్రింక్ ఎక్కువైనట్టుంది, యూ నీడ్ టు స్టాప్ అండ్ గో హోమ్…”

“అవును అందర్నీ ఇలాగే తరిమెయ్, తోసెయ్, తొక్కెయ్! టెల్ మీ దిస్, కీర్తికి తెలుసా నీ అసలు రంగు? ఎలా ఉందో ఇన్నేళ్ళు కలిసి! డర్టీ బా…”

సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశా. ఏడుస్తోంది. ఏళ్ళుగా నాకోసమే దాచిపెట్టిన కన్నీళ్ళు. వదిలేస్తే వాటి ధారల్లో ముంచి, ఊపిరాడనివ్వని కన్నీళ్ళు. ఆపాలి.

“నువ్వు బాగా వీక్ విన్నీ. నీకు నా హెల్ప్ కావాలి. ప్లీజ్, కళ్ళు తుడుచుకో”

వెనక్కి తిరిగి నడుస్తున్నా. నవ్వుతున్నా. ఎస్, యు ఆర్ మై గోల్డెన్ డక్.


“బావా, మమ్మల్నీ కొంచెం పట్టించుకోరా, ఎప్పుడూ లేడీస్ తోనేనా?”

ఎదవలు! “ఓ ఫైవ్ మినిట్స్‌లో వస్తారా, మిగతా గెస్ట్‌లనీ పలకరించి.”

“తర్వాతెళ్ళచ్చు రారా బాబూ, వాళ్ళెక్కడికీ పారిపోరు. రెండు రౌండ్లే. ఈ వినయ్‌గాడు తినేస్తున్నాడిక్కడ.”

వినయ్. వినయ్. అందుకేగా రానన్నాను. తప్పదు. “ఏరా మన బ్యాచ్ అంతా వచ్చేసిందా… హాయ్ వినయ్, ఎలా వున్నావ్?”

“ఫుల్లు ఫార్మల్‌రా వీడు. పెద్దోడైపొయ్యాడు. హ్యాప్పీ యానివర్సరీ సత్యా! అయినా ఈ టైమ్‌లో కీర్తి పక్కనుండకుండా, ఆ అమ్మాయెవర్రా? ఏడిపిస్తున్నట్టున్నావ్ బాగా?”

అందుకే చిరాకు వీడంటే. “కొలీగ్‌రా, కొంచెం ఎమోషనల్. ఏంటీ, ఎన్నో రౌండు?”

“మూడోదేరా. బాబూ బేరర్, మా సత్యాగాడికో డ్రింక్ తేమ్మా…”

“లేదు వినయ్, నేను కీటో డైట్ చేస్తున్నా. డ్రింకింగ్ మానేశా.”

“వామ్మో, ఫుల్లు రిచ్చోళ్ళు చేసే డైటు! వీడింక మన చెయ్యి దాటిపొయ్యాడ్రా!”

“సత్యా, వినయ్‌గాడలాగే వాగుతాడు గానీ, నన్నూ జేర్చుకోరా నీ డైటింగ్ క్లబ్బులో.”

“ష్యూర్ మామా, కీటో ఈజ్ గ్రేట్. ఫుల్ మిల్క్, ఘీ, లస్సీ అన్నీ తినచ్చు. కొన్ని స్మాల్ స్మాల్ రెస్ట్రిక్షన్స్ అంతే.”

“ఇన్ని చేసినా నువ్వేం తగ్గినట్టు కనపడట్లేదే. పైగా పెరిగినట్టున్నావ్!”

నవ్వులు చుట్టూ. కొన్ని పళ్ళతో, కొన్ని కళ్ళతో. లక్షలు ఖర్చు పెట్టి తిట్టించుకుంటున్నాను. థూ!

“రేయ్, మూడునెలల్లో ఏం తెలుస్తది. ఇట్ విల్ వర్క్ స్లోలీ…”

“ఇట్ వోంట్ వర్క్! కీటో మీద రీసెర్చ్ చదివావా? ఎక్కువ కాలం చేస్తే, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయంట. మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయంట!”

“వామ్మో వద్దులేరా సత్యా ఐతే, మన వినయ్‌గాడి రీసెర్చ్‌లో అప్రూవ్ అవ్వకపోతే, లైట్ ఇంక.”

“వీడి బోడి అప్రూవల్స్‌తో పెట్టుకుంటే, ఎవడూ పెళ్ళిళ్ళు కూడా చేస్కోకూడదురా ఐతే.”

“కరెక్ట్ సత్యా, నాలా ఒంటరి ఎదవల్లా ఎవడూ ఉండిపోకూడదు. నీలా పక్కోడి గర్ల్ ఫ్రెండ్స్‌ని…”

చేతులు. వాడి భుజాల్ని పట్టుకొని ఆపుతున్న చేతులు, నోళ్ళమీదకి అప్రయత్నంగా వెళ్తున్న చేతులు.

“నేనెళ్ళాల్రా, ఎమ్మెల్యే వచ్చే టైమైంది. వర్కింగ్ ఆన్ ఎ హండ్రెడ్ క్రోర్ డీల్ నౌ. విష్ మీ లక్!”

చావుదెబ్బ! లూజర్స్! దిగ్గున లేచాను. కోట్ సర్దుకున్నాను. నెక్స్ట్ టార్గెట్ వైపు కదిలాను.

“వాడు రాడ్రా బావా! చీర్స్ టు అవర్ ఫిల్తీ రిచ్ ఫ్రెండ్ అసత్యమూర్తికీ…” మైకంగా అంటున్నాడు వినయ్.


దార్లో కీర్తి అడ్డుపడింది. తనెప్పుడూ ఎదుర్రాదు, అడ్డుగా వస్తుంది. అన్నీ తెలిసిన ఎనిమీ!

“ఏంటీ, హడావిడిగా లేచొచ్చేస్తున్నావ్ మీ బ్యాచ్ నుంచి?”

“ఎదవలు! అవే పాత మాటలు, అవే చెత్త బుర్రలు! మారరు.”

“వినయ్ ఏమన్నా అన్నాడా స్మార్ట్‌గా మళ్ళీ? టాలెంటెడ్ కదా మీ ఫ్రెండు.”

“కీర్తీ, ప్లీజ్! నాట్ టుడే. నీకు తెలుసు వాడి గురించి‌ నేనెలా ఫీలౌతానో.”

“సారీ.”

నోటితో అంది, ముఖంలో లేదు. పక్కకి చూస్తున్నాను. పారిపోవాలి దీన్నుంచి, ఈ పార్టీ నుంచి, ఈ జీవితం నుంచి…

“బావుంది కదా, లైవ్ మ్యూజిక్! డాన్స్ ఫ్లోర్ మీద కెళ్దామా? చాలామంది చేస్తున్నారు, మనం వెళ్ళకపోతే బావుండదు” కళ్ళెగరేసింది.

“ఇవన్నీ నాకు పడవు కీర్తీ. నేను మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను, యూ క్యారీ ఆన్ విత్ యువర్ ఫ్రెండ్స్.”

తనో క్షణం నిలబడింది. రమ్మని మళ్ళీ అడగలేదు. మెల్లగా వెనక్కి తిరిగి డాన్స్ ఫ్లోర్ వైపు నడుస్తోంది.

డామిట్! తనే గెలిచింది ఈ రౌండ్లో!

టుడేస్ స్కోర్ సో ఫార్: కీర్తి-2, సత్య-0.


“హలో మిస్టర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్!”

శరీరాలు. దగ్గరగా, గుంపుగా, అందమైన శరీరాలు. మనసుని తన్ని లాక్కెళ్ళే మాగ్నెట్స్…

“హలో రుచీజీ, హౌ ఆర్ యూ? లాంగ్ టైమ్!”

“ఆల్ వెల్ సత్యా, మీట్ నీలూ, సీమా, కృతీ…”

“హలో. హలో. నైస్ టు మీట్ యూ!”

“గ్రాండ్ పార్టీ సత్యా! లైవ్ మ్యూజిక్ ఐడియా నీదా, కీర్తిదా? తనదే అయ్యుంటుంది, నీకింత టైముండదు కదా?”

“ఇద్దరం కలిసే…”

“కమాన్, చెప్పకు. నాకు సిక్స్టీ ప్లస్ ఇప్పుడు!”

“వావ్! ఈ ఏజ్‌లో కూడా, ఇంత యాక్టివ్‌గా వాలంటరీ వర్క్ చేస్తున్నారంటే, హ్యాట్సాఫ్ మీకు!”

“హాఁ. లాస్ట్ మంత్ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న రెఫ్యూజీ పిల్లలకి ఎడ్యుకేషన్ క్యాంప్స్ స్టార్ట్ చేశాను.”

“మీ విజన్, ఆలోచనలూ… ఎవరూ చెయ్యలేరిలా మీరు తప్ప!”

“వెల్, నీ అంతలా ఎవరూ ఎదుటివాళ్ళని‌ ఎత్తెయ్యలేర్లే. ఇట్స్ ఎ స్కిల్ టూ.”

అవసరం కోసం నవ్వు వెనక తొక్కిపెట్టిన వెటకారం కదూ ఆ గొంతులో?

“యూ నో సత్యా, రుచీజీ ప్రెసిడెంట్ అవార్డ్‌కి నామినేట్ అయ్యింది ఈ ఇయర్. హోప్ షి విన్స్.”

“ఛుప్ సీమా! మనం మెడల్స్ కోసం చెయ్యట్లేదిదంతా. లీవ్ ఆల్ దట్ సత్యా… ఈ వీడియో క్లిప్ చూడు. మా క్యాంప్‌లో కొంతమంది కిడ్స్‌కి సీరియస్ మెడికల్ హెల్ప్ కావాలి.”

పిల్లలు! నాకు దొరకని పిల్లలు, దొరికినవాళ్ళు పట్టించుకోని పిల్లలు.

“మీ లాంటి డోనర్స్ హెల్ప్ కావాలి సత్యా, ప్లీజ్!”

అప్రయత్నంగా కోటులోకి వెళ్ళిన చేతులు. చెక్ మీద చకచకా కదిలిన వేళ్ళు.

రుచీకి ఇవ్వబోతూ చూశాను. తన వెనకే ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్న ఓ ఆడ ముఖం… నా బాస్ వైఫ్! చెక్ చటుక్కున వెనక్కి లాగాను. ఇంకో జీరో కలిపాను చివర్లో.

“వావ్! టెన్ లాక్స్! ఐ నో యు ఆర్ ఎ డార్లింగ్!”

చప్పట్లు, కౌగిలింతలు – ఫేమ్!

ముఖ్యంగా ఆమె ముఖంలో నవ్వు – ఇన్వెస్ట్‌మెంట్!


నా టార్గెట్‌ని చేరుకున్నాను.

“ఈ క్రాప్ తాగుతున్నారేంటి శ్రీనీ?! బాయ్, స్కాచ్ ఉంచమన్నా కదా ఈ టేబుల్ మీద?”

“ఇట్స్ ఓకే సత్యా, ఇది బానే ఉంది.”

“కమాన్, ఇట్స్ మై పార్టీ! స్పెషల్ బాటిల్ తెప్పిచ్చా. ఓన్లీ ఫర్ యూ.”

“థాంక్స్, నువ్వో స్పెషలిస్ట్‌వి, ఫ్లాటరింగ్‌లో.”

“హియర్ ఇట్ కమ్స్! బాయ్, ఆ గ్లాస్‌లో పొయ్యి.”

“వెయిట్, నువ్వు తీస్కోవట్లేదా?!”

“లేదు. డైటింగ్. కాన్ట్ డ్రింక్.”

“హారిబుల్! ఎలా చేస్తున్నావా డైట్లన్నీ? నాకు ఇరిటేషనొస్తుంది. అది తినద్దు, ఇది తాగద్దు అంటూ…”

“కీర్తి ఫోర్స్ వల్ల. ఎవడికో తన సర్కిల్లో వెయిట్ తగ్గిందని నన్నూ చెయ్యమని కూర్చుంది. యూ నో హౌ షి ఈజ్!”

“హుఁ, ఐ నో.”

“ఓ రెండు వారాల్లో వదిలేస్తా ఎలాగోలా. లీవ్ ఇట్. అవును ఆ హైవే కాంట్రాక్ట్ గురించి…”

“నో, నో సత్యా, ఇవాళ కాదు. ఎంజాయ్ యువర్ పార్టీ, ఎప్పుడూ వర్కేనా!”

“డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తా, ఆ కాంట్రాక్ట్ మనకొస్తే!”

“నువ్వు మారవ్. అవునూ, విన్నీ ప్రెజెంటేషన్ వజ్ ప్రామిసింగ్, కదా నిన్న?”

“యా, తను చాలా స్ట్రాంగ్. ఈ సారి తనకి బోనస్ పెంచే ప్రపోజల్ పెడ్తున్నా మీకు.”

“బోనస్ కాదు తనకి ప్రమోషన్ కావాలనుకుంటా. మొన్న అంది నాతో. ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంది.”

“హుఁ. తనకింకా టైం కావాలి శ్రీనీ. అన్నీ డీల్ చెయ్యడం రావట్లేదు. ఆ ప్రెజెంటేషన్ కూడా నేను బ్యాగ్రౌండ్‌లో చాలా మారిస్తే…”

“ఐ నో, ఐ నో! యూ సపోర్ట్ హర్ ఆల్వేస్, కానీ తన ప్రొమోషన్…” ఇక వెళ్ళిపోవాలి ఇక్కణ్ణుంచి.

ఎంట్రన్స్ దగ్గర ఏదో గందరగోళం మొదలైంది. గ్రేట్ టైమింగ్!

“ఐ నీడ్ టు గో శ్రీనీ, ఎమ్మెల్యే వస్తున్నాడు. పలకరించి వస్తా.”


“రండి సార్, మొత్తానికొచ్చారు ఈ పేదోడి పార్టీకి!”

“నువ్వే పేదోడంటే మనదేశం ఇప్పటికే ప్రపంచంలో నంబర్ వన్ పొసిష‌న్లో ఉన్నట్టేబ్బా!”

“బావున్నారాండీ?”

“ఆ కీర్తీ, బావుండామ్మా, మీ మ్యారేజ్ సిల్వర్ జూబిలీ అని మీ ఆయన ఓ పట్టుబడితే, కలిసి పోదామని వచ్చా.”

“థాంక్సండీ! ఈసారి ఖచ్చితంగా మేడమ్‌ని కూడా మా ఇంటికి తీసుకురావాలి మీరు.”

“తప్పకుండా!”

“సార్, రండి కూర్చుందాం. కీర్తీ, కొంచెం లోపల గెస్ట్‌లని చూస్కోవా?”

“ఓకే, ఉంటానండీ.”

“ఆఁ, మంచిదమ్మా! ఏందబ్బా, చానా కర్చు పెట్టినట్టుండావ్. నీ రేంజ్ వేరేలే!”

“ఏం లేదు సార్, కీర్తి గొడవ చేస్తుంటే కొంచెం హడావిడి, అంతే. బాయ్, స్కాచ్ పట్రామ్మా!”

“ఏదైనా చెప్పు, మీ కార్పొరేటోళ్ళ పార్టీలన్నీ చప్పగా ఉంటయ్యబ్బా.”

“ఏం చేస్తాం సార్, ఈ జనాల టేస్ట్‌ మరి. ఖర్చు పెట్టకపోతే చీప్‌గా చూస్తారు, పెడితే బలిసినోడంటారు.”

“అంతేగా! జనాల సంగతి నాకు తెలీదా, ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండా.”

“సార్ అదీ, ఆ హైవే కాంట్రాక్టు…”

“ఆఁ ఏవైంది? ఏవంటన్నాడు కొత్త కమీషనర్?”

“అస్సలు ముందుకి కదలట్లేదు పని. మీకు తెలుసుగా ఇప్పటికే ఇరవై కోట్లు…”

“సరే సరే. నీకు పోయినేడు మన ఫామ్‌హౌస్ పార్టీ గుర్తుందా?”

“మర్చిపొయ్యే పార్టీనా సార్, మన నాయకులంతా ఓ ఊపు ఊపేశారుగా!”

“అన్నిటికంటే హైలైట్ నీ పాము డ్యాన్సబ్బా. ఫుల్లు టైట్‌లో కింద దొర్లి దొర్లి చేస్తివా రోజు.”

“నవ్వొస్తుంది తల్చుకుంటే అదంతా. ఆ కాంట్రాక్టు…”

“ఆఁ ఆఁ చూస్తాలే. ఆ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌కో మాట చెప్తా. వచ్చేవారం కలుస్తుండా.”

“చాలా హెల్పవ్వుద్ది సార్, థాంక్స్!”

“డబ్బులూ, థాంక్సులూ రెండూ తీస్కోనబ్బా, అరగవు.”

“అన్నా, సీ.ఎం. మీటింగ్‌కి టైమైతంది.”

“ఓర్నీ! పద పద! సర్లే పోతా సత్యా మరి. మీ ఇద్దరూ మా ఇంటికి రండోసారి, ఏంది?”

“ష్యూర్ సార్.”

మెల్లగా నడుస్తున్నాడు. వెళ్ళి పోతున్నాడు. లేదు, వెనక్కి తిరిగాడెందుకో.

“సత్యా, ఈ ఏడు మళ్ళా మన ఫామ్‌హౌస్ పార్టీ పెట్టించబ్బా. కార్యకర్తలు అడుగుతుండారు.”

ఇప్పుడెళ్ళిపోయాడు ఆగకుండా.

వాడుకోవడం ఈజ్ నాట్ ఆల్వేస్ ఈక్వల్ టూ వాడుకోబడటం.


కీర్తి బెడ్రూమ్ బైట నిలబడ్డాను. తను అద్దంలో చూస్తూ జువెలరీ తీస్తోంది.

“బాగా జరిగింది కదా పార్టీ?”

“యాఁ, గ్రాండ్ సక్సెస్ సత్యా. మా ఫ్రెండ్సందరూ పైకెత్తేశారు మనిద్దర్నీ. ఫూడ్, బార్, మ్యూజిక్…”

“ఐ యామ్ హ్యాపీ దట్ యు ఆర్ హ్యాపీ.”

“అఫ్‌కోర్స్ యూ ఆర్! అంతా పర్ఫెక్ట్‌గా జరిగింది. నో ఇన్సిడెంట్స్.”

“ట్రూ. సర్ప్రైజింగ్‌గా అందరూ బానే బిహేవ్ చేశారు. యూ లుక్డ్ గార్జియస్!”

వంకరగా నవ్వింది. అందం, మోహం, ఆకలి.

ధైర్యం చేశాను. బెడ్రూమ్‌లో కాలు పెట్టబోయాను.

“వెయిట్ సత్యా!”

చటుక్కున కాలు వెనక్కి తీసుకున్నాను. ఛ!

తెల్లటి బాటిల్ తెచ్చింది తను. గ్రే గూస్ వోడ్కా. “ఓ పది షాట్లు కొట్టి రా!”

“తప్పదా, ఈ ఒక్కరోజుకీ?” దీనంగా మారింది నా గొంతు.

“తప్పదు. నీక్కావలసింది నేనివ్వాలంటే నువ్వు నాక్కావలసిన సత్యవై రావాలి.”

తెలుసు. నా అవసరాలతో బలహీనతలతో ఆడుకునే రాక్షసి.

మారేజ్ స్కోర్ ఫరెవర్: సత్య-0, కీర్తి-1.