[ఫిక్‍ర్ తౌన్‌స్వీ (Fikr Taunsvi) [1918-1987] ప్రసిద్ధ ఉర్దూ కవి, హాస్య వ్యంగ్య రచయిత. అసలు పేరు రామ్‌లాల్ భాటియా. ఆనాటి భారతంలో భాగమైన పంజాబులో తౌన్‌సా షరీఫ్ అన్న ఊరిలో పుట్టారు. విభజనకు ముందు లాహోర్ నగరంలో నివాసం. తర్వాత ఢిల్లీకి వలస వచ్చారు. ఆయన వ్యంగ్యానికి పెట్టింది పేరు. ప్యాజ్ కె చిల్కే (ఉల్లి పొరలు) అనే కాలమ్‌ను ఉర్దూ మిలాప్ పత్రికకు దాదాపు 27ఏళ్ళు కొనసాగించారు. విభజన నేపథ్యంలో జరిగిన హింసను గురించి చట్టా దరియా (ఆరో నది, The Sixth River) అనే పేరుతో రాశారు.
ఢిల్లీ నగరం గురించి విశేషంగా రాసి, తిరుగులేని వ్యంగ్య రచయితగా పేరు తెచ్చుకున్నా ఆయనకి సాహిత్య అవార్డులు ఏవీ రాలేదు. ఇప్పటికీ తక్కిన హిందుస్తానీ రచయితలంత విరివిగా ఆయన పేరు వినిపించదు. కానీ ఒక్కసారి అలవాటైతే మాత్రం మర్చిపోలేని చమత్కార వచనం ఆయనది. తప్పక చదవాల్సిన రచయిత. ప్రతినిత్యం వాడుకలో ఉన్న పదాలకి తనదైన శైలిలో అర్థాలు, నిర్వచనాలు ఇచ్చారు లుఘాత్-ఎ-ఫిక్రీ అనే రచనలో. దానికి అనువాదమే కింద ఇస్తున్నాను.
అరుదుగా లభించే ఆయన రచనలని యూనికోడీకరించి అందరికీ అందుబాటులో ఉంచుతున్న రేఖ్‌తా.ఆర్గ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.]
ఎలక్షన్: ఓటర్లకు లీడర్లకు మధ్య జరిగే మల్లయుద్ధం, దానిలో లీడర్ గెలిచి ఓటరు ఓడిపోతాడు.
ఎలక్షన్ పిటీషన్: ఒక స్తంభం, దానిపైన ఓడిన పిల్లి నాట్యమాడుతుంది.
ఓటు: చీమకుండే రెక్కలు, అవి వానాకాలంలో పొడుచుకొస్తాయి.
ఓటరు: కంటినుంచి జారి మట్టిలో కలిసిన కన్నీరు, దాన్ని ఎలక్షన్ సమయంలో ముత్యమనుకుని ఏరుకుని, ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మట్టిలో కలిపేస్తారు.
ఓటర్ల లిస్ట్: కంసాలి దుకాణం దగ్గర వేళ్ళాడదీసిన ముత్యాల దండ.
ప్రతియోగి: చాలా చాలా తెలివైనవాళ్ళని వెధవలని చేసే తెలివైనవాడు.
డిపాజిట్: బావిలో పడేసిన డబ్బు, అది నీళ్ళల్లో మునిగిపోతుంది.
ఎన్నికల ప్రచారం: ఒక తంబురా, దానిపై శృతితప్పిన పాటలు పాడుతుంటారు.
ఎన్నికల మానిఫెస్టో: గట్టు మీద పెట్టడానికి వీలుగా ఉండే ఒట్ల చిట్టా.
ఎన్నికల ఉపన్యాసం: ఎన్నికల అడవిలో నక్కలు వినిపించే కవిత: మా నాన్న బాద్‌షాహ్.
ఎన్నికల జండాలు: రంగురంగుల పతంగుల దుకాణం.
ఎన్నికల పోస్టర్: పోటీదారుని వంశవృక్షం. అతని కుటుంబ చరిత్ర సమస్తం.
డోర్-టు-డోర్ కాన్వాసింగ్: గడపగడపకీ ఉన్న మట్టిని వడబోయాలనే ఉబలాటం.
పోలింగ్ ఏజెంట్: పోటీదారుని చెంచా.
బోగస్ ఓటు: ఒక అబద్ధం, దాన్ని నిజాయితీపరుడు ఎన్నికల రోజుల్లో చెప్తాడు.
ఎలక్షన్ ఖర్చు: జూదం ఆటలో పెట్టిన నగదు.
ఎన్నికల ఫలితాలు: పోటీ అయిపోయాక యుద్ధ మైదానంలో లెక్కల చిట్టా: 1) ఎంతమంది మట్టికరిచారు 2) ఎంతమంది గాయపడ్డారు 3) ఎంతమంది బతికిపోయారు.
ప్రభుత్వం: డబ్బులున్నోళ్ళ భోగం, లేనివాళ్ళ మెడకు మద్దెల.
ప్రజాతంత్రం: ఒక గుడి, అక్కడ భక్తులు దక్షిణ వేస్తుంటే పూజారి తినేస్తుంటాడు.
ప్రజానీకం: చౌరస్తాలో పెట్టిన ఒక హుక్కా, దాన్ని దారినపోయేవారు పీల్చి పోతుంటారు.
బూర్జువా: ఇతరుల బట్టలనుంచి తన కోసం పాంట్ కుట్టుకునే ఒక చేయితిరిగిన మాస్టర్ టైలర్.
లీడర్: పక్కనోళ్ళ పొలంలో తన విత్తనాలు వేసి పంటలు పండించి, అమ్ముకునేవాడు.
కరప్షన్: ఒక విషంలాంటి తేనె, దాన్ని లొట్టలేసుకుంటూ నాకుతుంటారు.
పైసలు: ఒక బల్లి, మనిషి నోట్లోకి దూరింది. ఇప్పుడు దాన్ని తింటే కుష్టు, తినకపోతే కళంకం.
వార్తా పత్రిక: ఒక పండు, ఊరట కోసం తింటారు గానీ తిన్నాక కలవరమే కలుగుతుంది.
అధికారం: ముళ్ళకిరీటం, ప్రతీ బోడిగుండువాడూ పెట్టుకోవాలని ఆశపడతాడు.
కుర్చీ: దానిపై కూర్చుని తెలివిగలవాడు తెలివితక్కువవాడైపోతాడు.
శాంతి: అరాచకులు నిద్రించే కాలం.
ప్రేయసి: ఓ రకంగా చట్టవ్యతిరేక పెళ్ళాం.
పెళ్ళాం: ప్రేయసి చేరుకునే గమ్యం.
ప్రేమ: ఒక గౌరవనీయులైన ఖైదీగారు, వారికి జైలులో ఎప్పుడూ ఏ-క్లాస్ వస్తుంటుంది.
పెళ్ళాం: ఒక ఎకసెక్కం, మళ్ళీ మళ్ళీ ఆడితే పాచిపోతుంది.
ప్రేమ: ఆత్మహత్య చేసుకోబోయే ముందరి అవస్థ.
ఇల్లాలు: ఇంటివాడైన మగాడి బండికి పెట్రోల్ పంపు.
ఎద్దు: ఆవు పెళ్ళి చేసుకోని మొగుడు.
పెళ్ళాం: మొహం మాడ్చుకున్న ప్రేయసి.
వేశ్య: వాడిపారేసే వస్తువు, దాన్ని వేలం వేసి మరీ అణాకీ కానీకి కొనేసి, మళ్ళీ బజారులో ఎక్కువ రేటుకి అమ్ముతారు.
అందంగాలేని ఆడమనిషి: అందగత్తెలను పరికించే ఉపకరణం.
వంటిల్లు: ఇల్లాళ్ళైన ఆడవాళ్ళ రాజధాని.
క్లర్క్: సింహంలా బట్టలు వేసుకుని కుర్చీలో కూర్చునే నక్క.
బైసికిల్: క్లర్కుబాబు రెండో పెళ్ళాం.
ఇల్లు: పిట్టలు, ఈగలూ, మనుషులకి రాత్రి పూట ఉండడానికి ఒకటే ఆవాసం.
మహలు: గుడిసె ఎదురుగా గీసిన చాలా పెద్ద గీత.
పేదరికం: ఒక బొచ్చె, అందులో ధనవంతులు డబ్బులు విసిరి తమ పాపాల చిట్టాని తగ్గించుకుంటారు.
పేదరికం: ఇది లేకపోతే ప్రపంచంలోని సంపదంతా ఆత్మహత్య చేసుకుంటుంది.
ఆత్మహత్య: ఇది లేకపోతే డిక్షనరీలోంచి ఒక పదం తగ్గిపోతుంది.
రేషన్: ఆకలితో ఉన్న కడుపులకి అజీర్తి చేయకుండా ఇచ్చే చూర్ణం.
ఆశ: ఒక పువ్వు, బంజరు నేలను సారవంతం చేస్తుంది, సారవంతమైన భూమిని బంజరునేలగా మారుస్తుంది.
ముఖస్తుతి: బలహీనుని బలం, బలవంతుడి బలహీనత.
సాహసం: శరీరమే శరీరం, ఆత్మ మాయం.
మర్యాద: కళ్ళద్దాలు, గుడ్డివాళ్ళు పెట్టుకునేవి.
విద్య: చదువురానివాళ్ళని మూర్ఖులను చేసే ఆయుధం.
విద్యార్థి: సముద్రంలోకి తోయబడ్డాక జీవితాంతం మునకలేస్తూనే ఉండే, దాహం గల ఒకడు.
నిరుద్యోగం: గౌరవం పొందడానికి ముందు అగౌరవాన్ని తెలియజేసే అనుభవం.
శ్మశానం: చనిపోయినోళ్ళ ప్రస్తుతం, బతికున్నోళ్ళ భవిష్యత్తు.
స్వర్గం: ఒక కల.
నరకం: ఆ కలకి ఇచ్చుకునే వివరణ.
తెలివి: ప్రేమ, మైత్రీల శ్మశానం.
తెలివితక్కువతనం: ఒక ఖజానా, ఎప్పుడూ ఖాళీ అవ్వదు.
పెళ్ళి: ప్రేమకి అంతం, పిల్లలకి ఆరంభం.
పిల్లలు: అమ్మానాన్నలు జన్మనిచ్చిన అమ్మానాన్నలు.
అమ్మానాన్నలు: కాసేపు పిల్లలపై హుకం చెలాయించేవాళ్ళు, కాసేపు పిల్లలకు గులాములు.
మనసు: ఒక సమాధి, దాని కింద మామూలుగా జీవచ్ఛవాలను పాతిపెడుతుంటారు.
మెదడు: సైతానూ, ఖుదా ఇద్దరూ కలిసి ఉండే నివాసం.
కళ్ళు: వాటిని బయటనుంచి మూసేస్తే లోపలవైపు తెరిచినవి తెరిచినట్టే ఉండిపోతాయి.
చేయి: బిచ్చమేస్తుంది, బిచ్చమెత్తుతుంది.
కాలు: ఇతరులని తంతుంది, తన్నించుకుంటుంది.
మేక: దీనికి తెలివి ఎక్కువ, పాలు తక్కువ.
రోడ్డు: ఒక దారి, స్వర్గానికి వెళ్తుంది, నరకానికీ వెళ్తుంది.
నది: దాని ఒడ్డున ఇల్లు కట్టుకుంటే ఉత్సాహం పెరిగి ఇంటిని కూడా ప్రవాహంలో కలుపుకుని తీసుకెళ్ళిపోతుంది, కానీ మునగడానికని వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడూ ఎండిపోయుంటుంది.
ఢిల్లీ: అక్కడ ఇళ్ళు పెద్దగా, మనుషులు చిన్నగా ఉంటారు.
బొంబాయి: ఒక మందిరం, అక్కడనుంచి దేవుడు వెళ్ళిపోయాడు.
కలకత్తా: అక్కడ రోజంతా ఒక్కళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటుంటారు, రాత్రి అయ్యేసరికి అందరూ కలిసి ఆడుతూ పాడుతుంటారు.
ఫారెన్ ఎక్స్చేంజ్: ఒక జల్లెడ, సముద్రాన్నే ఖాళీ చేసే ప్రయత్నంలో మునిగిపోతుంది.
విదేశీ అప్పు: ఒక దెయ్యం, పిల్లల్ని కంటుంది, పెంచి పోషిస్తుంది, ఆ తర్వాత వారినే తినేస్తుంది.
కవి: ఒక పిట్ట, కనిపించని తన గూటిని వెతుక్కుంటూ ఉంటుంది.
కాగితం: ఖాళీగా ఉంటేనే సరి, రాస్తే మాత్రం హాని కలిగిస్తుంది.
కవి: చీకట్లో తిరుగాడుతున్న ఒక దివ్వె.
పదం: దీన్ని నోట పలికితే బయట యుద్ధం మొదలవుతుంది, పలకకపోతే లోపల యుద్ధం మొదలవుతుంది.
వీరుడు: నిప్పుని నీళ్ళనుకుని తాగేసే తెలివితక్కువవాడు.
తాగుబోతు: రాత్రికి మహారాజు, తెల్లారేక బికారి.
స్నేహితుడు: శత్రువు కావడానికి ముందు గమ్యం.
శత్రువు: స్నేహానికి ఆఖరి మెట్టు.
అతిథి: వారి రాకతో సంతోషం, వారు వెళ్ళిపోయాక మరీ సంతోషం.
బంధువు: ఒక తాడు, తెగి కూడా నెత్తి మీద వేలాడుతూనే ఉంటుంది.
డాక్టరు: రోగులతో నవ్వుతూ మాట్లాడుతూ, ఆరోగ్యవంతులతో దీనంగా మొహం తిప్పేసుకుంటాడు.
ఔషధం: పశువుని మనిషిగా, మనిషిని పశువుగా మార్చేది.
రోగి: వీణ్ణి నమ్ముకునే ప్రపంచంలోని అన్ని మెడికల్ కంపెనీలు నడుస్తుంటాయి.
జడ్జ్: న్యాయం చెప్పడంలో మహారాజు, చట్టానికి బానిస.
సాక్షి: నిజానికీ అబద్ధానికీ మధ్య ఊగిసలాడే పెండ్యులం.
జేబుదొంగ: ఒక అల్లరి కుర్రాడు, వేరేవాళ్ళ సైకిలుకి పిన్ను గుచ్చి గాలి తీసేసి పారిపోతుంటాడు.
దొంగ: ఒక జేబులోని సొమ్ముని మరో జేబులోకి రవాణా చేసే ఆర్టిస్ట్.
ఉస్తాద్: మూర్ఖులను తెలివైనవారిగా మార్చి తన శత్రువుగా మార్చుకునే మూర్ఖుడు.
కుంటివాడు: రెండు కాళ్ళున్న వాళ్ళకన్నా ప్రమాదం.
బతికున్నవాడు: శవాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఆజ్ఞలు జారీ చేసేవాడు.
తెలివితక్కువవాళ్ళు: ప్రపంచంలోని గొప్ప గొప్ప రాజ్యాలను స్థాపించినవాళ్ళు. తెలివైనవాళ్ళు వాటిని నాశనం చేశారు.
నగ్నంగా ఉన్నవాడు: టెక్స్‌టైల్ మిల్లులను వెటకారం చేసేవాడు.
అప్పున్నవాడు: ఒక మహారాజు, ఇతరుల సంపాదనతో భోగం వెళ్ళబోసేవాడు.
అప్పిచ్చినవాడు: అప్పు ఇచ్చేటప్పుడు మిత్రుడిగానూ, తిరిగి ఇచ్చేప్పుడు శత్రువుగానూ అనిపించేవాడు.
వడ్డీ: అవతలివారికి మంచి చేసే ఒక పాడుపని.
విశ్వాసంలేని మనిషి: ఒక చిలుక, దానికి పిస్తా తినిపిస్తే పొగుడుతూనే ఉంటుంది. తినిపించకపోతే మొహం చాటేస్తుంది.
టిట్టీ-బాయ్: చీరకట్టుకుని ప్రేయసిల మనసులు దోచుకునేవాడు.
ముసలివాళ్ళు: దివాలా తీసిన దుకాణం బయట ఉండిపోయిన పాత సైన్ బోర్డ్.
అజ్ఞాత: దుఃఖాన్ని కలిగించేవాటిని గురించి తెలుసుకోనివాడు.
చీకటి: కరెంటు కంపెనీకి తలనొప్పి.
కరెంటు: దొంగలకు తలనొప్పి.
మంచితనం: ఒకప్పటి కాలంలో మనుషులు దాన్ని నదిలోకి విసిరేసేవారు. ఇప్పుడు దాన్నే మండీకి తీసుకొచ్చి అమ్ముతున్నారు.
చెత్తా చెదారం: వాడేసిన వస్తువుల పాడె.
బలహీనత: ఒక శవం, దానిపై జనాలు దాడి చేసి మహా సంబరపడిపోతారు.
ప్రయత్నం: చీకట్లో బాణమేయడం. తగిలితే ’వాహ్ వాహ్’, తప్పితే ’ఆహ్ ఆహ్’
అదృష్టం: ఒక లాఠీ, ఎవరి చేతిలోకి వెళ్తే వారికే సొంతమైపోతుంది.
నిజం: ఒక దొంగ, భయపడి బయటకే రాదు.
అబద్ధం: ఒక పండు, చూడ్డానికి అందంగా ఉంటుంది, తినడానికి రుచిగా ఉంటుంది, కానీ అరాయించుకోవడమే కష్టం.
జ్ఞాపకం: పూర్వీకులు వదిలేసిన పాత ఖాతా పుస్తకం.
ఖుదా: మనిషికి బలాన్నిచ్చే బలహీనత.
చీకటి: సైతాన్ ఇల్లు, ఖుదా స్వయంగా నిర్మించి ఇచ్చినది.
ఖుదా: భ్రమకీ వాస్తవానికీ మధ్య ఊగిసలాడే పెండ్యులమ్.
ఆత్మ: ఉందో లేదో తెలీని, కనిపించని నా వీపు లాంటిది. దీని గురించి ఒక కవి అన్నాడు: ఎక్కడుంది? ఎటువైపున ఉంది, ఎక్కడుంది?
ఆత్మహత్య: సరైన వస్తువుని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం.
పాడె: వాపసు పోడానికి టికెట్
హత్య: కళ్ళున్నవాళ్ళ గుడ్డి చేష్ట.
శ్మశానం: శవాల సోషలిస్ట్ స్టేట్.
ఆదమ్: ఖుదా చేసిన పొరపాటు, దాన్ని ఇప్పటి వరకూ సరిదిద్దుకోలేకపోయాడు.
పొరపాటు: క్షమించేవారికి ఒక గొప్ప అవకాశం.
అవకాశం: దీన్ని తెలివైనవాళ్ళు ఎప్పుడూ ఉపయోగించుకుంటారు, తెలివితక్కువవాళ్ళు తమకి తగని పని అని దాటవేస్తుంటారు.