రోత పుట్టుచున్నది, బాధ కోత పెట్టు
చున్నది, పెను కోపము నన్ను చుట్టుముట్టి
కాల్చి వేయుచున్నది. బ్రతుకా?! బ్రతుకును
కోలుపోయె లోవెలుపల కుళ్ళిపోయె.
చేతకాదేమి చేయగ; చేతులు ముడుచు
కొననిండు; నా తల వాలుచు కొననిండు;
ఏడ్చుకొననిండు నన్నొకయింత సేపు
కనలనిం డొంటరితనాన మనుషులార!
మాటలాడ వలయు దైవమా! కనపడు!
ఏమి లోకమిది యని నిందించబోను!
జరుగుతున్న ఘోరాల నేకరువు పెట్ట
బోను! మార్చమని యడగబోను! నమ్ము!
సర్వసాక్షికి వార్తలు చదువుటేల?
జ్ఞానపూర్ణుడ వీవు సూచనల నీయ
నేల? నా యరకొర నమ్మకాల తోడ
కోరనేల? మాట్లాడుదు కొంతసేపు.
నాకు తెలుసు నా దృష్టిలోన నొక దోషమే
కనపడు నీ సృష్టిగా! నాకు తెలుసు.
నేను మారిన మారును నిఖిలజగము;
నేను నీవను మాటనూ నేనెరుగుదు.
ఐన నంతటి యనుభూతి లేని కతన
దాని సాధించు కాలమ్ము రాని కతన
పుట్టి బుద్ధెరిగిన మాయ పోని కతన
ఉన్న దున్నట్లు గానెంచి యూరకుందు
చేతులెత్తి కృతజ్ఞత చెప్పుకొందు
నీకు; నాచేత నటువంటి నీచమైన
పనులు ‘నేరుగా’ చేయించక నొక కొంత
మేలు చేసితివి యదృష్టమే నిజంబు!
మనసు నందార్ద్రతను కొంత చొనిపినావు
క్షణమె యైన నిలచె సాత్వికమ్ము లోన
వచ్చినది చాలు పదివేలు చచ్చుబడిన
వాన్కి. వ్యక్తిత్వమేలేని వాన్కి. నాకు!
ఇంక విరమింతు ప్రొద్దును గ్రుంకు చుండె
ఒక యనూహ్యమైనది మాత్ర మూదిపోదు
నమ్మలేనట్టిదీ విషయమ్ము వినుము
నిద్ర పట్టుచున్నది నాకు నిజముగాను.
ఈక్షణమ్మున నొక హత్య; యీ క్షణమున
మానభంగము; వికృతసమాజమందు
నీక్షణమున దారుణము లెన్నిజరు గేను
హాయిగా నున్న యీ క్షణమందు నిపుడు.
తెలియుచున్నను మనసున తిరుగుచున్న
నిద్ర పట్టుచున్నది నాకు నిజముగాను
బలము వల్ల గా దొక కొంత భయమువలన
అనగ రాని యొకానొక యాశ వలన
కార్యకారణ బంధము కానరాని
దయ్యె, జగతి యాదృచ్ఛికమయ్యె; నెప్పు
డేను గూడ నా చేతుల హీనమైన
పనులు చేతునేమో యన్న భయము మిగిలె.
ఒకటి కాకున్న నేదొ యింకొకటియైన
తెలియక యొకింత లోలోన తెలిసి కొంత
చిన్నదైన పెద్దదియైన చేయకుండ
ఉండుటెట్టుల యజ్ఞానమున్న నేను.
గాలివాటున వచ్చు భావాలు గనుక
నెప్పుడే కుత్సితము దాకు నేమొ యనెడి
భయము; నన్నునే నమ్మలేని యసహాయత
నను కదులనీయ దెపుడు కనులు మూయు.
సత్వగుణమై వెలిగె నలసత్వ మిపుడు
భయము నీడన దొరికె నభయము నాకు
అదుపులేదను చింత నన్నదుపు జేసె
నిద్ర జాగ్రత నిచ్చెను నిలిపె నన్ను.
లోని చెడు పైకి మంచిగా కానుపించె
ఊరకుండుటయే పెద్ద యూరటయ్యె
నాదు బలహీనతలు గావె నాకు బలము
సంశయాత్ముడే గుణి! లేదు సంశయమ్ము.
అంత మదిలోన మరియొక వింతయాశ
మరల లేవబోనేమొ యీ మాటు నిదుర
బోయి, తప్పునేమో క్షోభ, పోవునేమొ
గాలి, యనెడి యూహలొసగు గాఢనిద్ర!
నిద్ర పట్టుచున్నది నాకు నిజముగాను!