వంతెన

పిట్టలు గూళ్ళు కట్టుకున్నట్టు
మనం వంతెనలు కట్టుకుంటాం
నడిచే రంగుల చెట్లల్లే
నవ్వులు విసురుకుంటూ
అటూ ఇటూ రాకపోకలు సాగిస్తాం

మాటా మాటా పేర్చుకుని
ఒక వంతెన కట్టుకోవడం కష్టం కానీ
ఏదో అనుమానమో
అసంతృప్తో
గాలి బుడగలా పగిలిపోవడం
ఏమంత కష్టం కాదు
అప్పుడప్పుడూ తూలిన మాటలన్నీ
అగాధ నిర్మాణానికి తహతలాడతాయి

రాకపోకలు పలచబడిన
ఒంటరి వంతెనల్ని
అటు కొందరూ ఇటు కొందరూ చేరి
తలో సమ్మెటా విసిరి కూల్చేస్తారు
వాళ్ళకేం తెలుసు
ఒక వంతెన కూలిపోవడం
మన మధ్యకు రాబోతున్న నలుసును
పురిట్లోనే తుంచేయడం ఒక్కటేనని


సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...