నన్ను నేను మార్చుకోవాలి
ఋతువులు మారినట్టు
సూర్యుడు అటు ఇటు తొంగిచూసినట్టు
నాలో రేఖాంతరమైన మార్పు జరగాలి.
కొన్నిసార్లు గతంలా
మరికొన్నిసార్లు వర్తమానంలా మారి
ఒక సజీవమైన వంతెన కుప్పకూలిపోకముందే
ఎవరి చుట్టో గిరికీలు కొట్టి అలసిపోకముందే
నా చుట్టూ నేనే గుండ్రంగా తిరగాలి
లేకుంటే నా దేహంలోకి కఠినమైనవో
మృదువైనవో సర్పాలు చేరి విషాన్ని పోగు చేస్తాయి.
ప్రయాణం ఒంటరిదని
సంగీతం ఎప్పుడో ఒకసారి ఆగిపోతుందని
కొవ్వొత్తి రాల్చిన నీడల్లో నా రెక్కలు కాలిపోతాయనీ తెలుసు.
ఏదైనా రాలిపోవాల్సిందే
అయితే మగ్గిన పండుగానో
లేదా కుళ్ళిపోయిన దేహంగానో
లేదా ఎవరో విసిరేసినట్లున్న నక్షత్రంగానో…
రాలిపోకముందే
నా అవయవాలను ఒక్కొక్కటిగా దూరం చేసుకోవాలి.
వాటి బదులు పద్యాలను కలగనాలి.
గాలి, నీరు, నిప్పు, భూమ్యాకాశాల్లా
చూపులకు పద్యాలే కనపడాలి.
మనుషులంతా పద్యాలుగా మారిపోయి
పద్యాలుగానే సంభాషించుకోవాలి.
చెడిపోయిన రక్తాన్ని
మందగించిన బుద్ధిని
పద్యంలో మరగబెట్టుకోవాలి.
ఇప్పుడు నేను మహోన్నతమైన పద్యంగా మారిపోయి
ఉద్వేగాలను పద్యాల విత్తులుగా మార్చి నాటాలి.
మార్పు జరగడానికి ఎవరికైనా ఏం కావాలి?
మనిషి పద్యంగా మారితే చాలదా!
గాయానికి మందు పద్యమే.