మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు

తెలుగు సాహిత్యం లోకి మహిళల కవితా ప్రవేశం 14-15 శతాబ్దాలలో ప్రారంభమైనట్లు సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. ఇప్పటివరకు లభ్యమవుతున్న సమాచారం మేరకు తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొట్టమొదటి సారిగా సుభద్రాకళ్యాణం అనే ద్విపద కావ్యం రాసింది. ఆ వెంటనే కనిపించే మరో గొప్ప కవయిత్రి మొల్ల. అందులోనూ మొల్ల బ్రాహ్మణేతర స్త్రీగా మొదటి కవి. ఆమె కాలం జీవితం గురించి ఆమె పెద్దగా చెప్పుకోలేదు. అంతర్గత సమాచారం ప్రకారం అంటే కావ్యంలో ఆమె చెప్పిన ఆధారాలతో ఆమె శ్రీనాథ, రంగనాథ కవుల తర్వాత అని చెప్పుకోవచ్చు, వారిని పేర్కొంది కాబట్టి. అలాగే తనకు అన్ని విధాలా గురువు తన తండ్రి కేసన/కేసనసెట్టి అని, గోపవరం అనే వూళ్ళోని శ్రీకంఠ మల్లేశ్వరస్వామి వరంతో కవిత్వం చెప్ప నేర్చుకున్నాననీ అంటుంది. ఎన్నో రామాయణ కావ్యాలు వున్నా మళ్ళీ తాను రాయడం ‘భుక్తిముక్తి’ దాయకం అనీ చెప్తుంది.

ఈ కావ్యంలో ప్రతీ ఒక్క పద్యమూ మనం ఎంతో విపులంగా చర్చించడానికి, ఆస్వాదించడానికి ఉత్తేజపరుస్తాయి. కావ్యరచనకు ఏం కావాలో కావ్యాలలో ఏమేం ఉంటాయో మొల్లకు తెలుసు.

సీ.
దేశీయ పదములు దెనుఁగులు సాంస్కృతుల్‌
సంధులు ప్రాజ్ఞుల శబ్ద వితతి
శయ్యలు రీతులుఁ జాటు ప్రబంధంబు
లాయా సమాసంబు లర్థ దృష్టి
భావార్థములుఁ గావ్య పరిపాకములు రస
భావ చమత్కృతుల్‌ పలుకు సరవి
బహు వర్ణములును విభక్తులు ధాతుల
లంకృతి చ్ఛందో విలక్షణములుఁ
తే.
గావ్య సంపద క్రియలు నిఘంటువులును
గ్రమము లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప
వరపు శ్రీకంఠమల్లేశు వరముచేత
నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి.

పై సీసపద్యంలో పేర్కొన్న భాష, కవితా పాండిత్యం తనకు లేదని చెప్పుకున్నా అవన్నీ కవిత చెప్పటానికి అవసరమైన లక్షణాలని ఆమెకు తెలుసునని, తన కావ్యంలో అవన్నీ ఉన్నాయనీ ఉంటాయనీ మనం గుర్తించాలి. మొల్ల తాను రాస్తున్నది రామాయణం కాబట్టి ఇష్టదేవతా ప్రార్థన రాముడితోనే ప్రారంభించింది.

ఉ.
శ్రీ మహిమాభిరాముఁడు వసిష్ఠమహామునిపూజితుండు సు-
త్రామ వధూకళాభరణరక్షకుఁ డాశ్రిత పోషకుండు దూ-
ర్యామలసన్నిభాంగుఁడు మహాగుణశాలి దయాపరుండు శ్రీ
రాముఁడు ప్రోచు భక్తతతి రంజిలునట్లుగ నెల్ల కాలమున్.

ఆ రాముడు ఆమె దృష్టిలో ఎలాంటివాడు? శ్రీ మహిమాభిరాముడు, మహాముని పూజితుండు, సుత్రామవధూ కళాభరణ రక్షకుడు, ఆశ్రిత పోషకుండు, దూర్వామల సన్నిభాంగుడు, మహా గుణశాలి, దయాపరుండు. ఇలాంటి ఆదర్శవంతుడైన రాముడి గురించి రాయకుండా ఉండటం ఎట్లా? అందువల్లనే ఎందరు తనకు పూర్వం రాసినా తాను కొత్తగా మళ్ళీ రాయడానికి పూనుకుంది. తర్వాత తనకూ, తన తండ్రికీ కూడా ఇష్టదైవం తమ నివాసస్థలం గోపవరంలో వెలసిన దేవుడూ, శ్రీశైలవాసీ అయిన మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తుంది. తర్వాత పుండరీకతేజాన్ని మెచ్చని కన్నుదోయి గలిగి, నీలమణులను వెక్కిరించే దేహకాంతితో, పిల్లనగ్రోవి సంజ్ఞలతో గొల్లతలకు విరాళి గొల్పెడు కృష్ణుణ్ణి వేడుకొంటుంది. అటు పిమ్మట ఆయువునూ, ఈప్సిత అర్థములనూ ఇచ్చే బ్రహ్మనూ, గొప్ప విద్యాపటిమ కోసం విఘ్నరాజుని, అతనికీ, కుమారస్వామికీ తల్లి అయి వారి బాల్య చేష్టలను ఆనందించే జగాల తల్లి పార్వతిని, సంపదల నిచ్చే కాముని తల్లి లక్ష్మీ దేవినీ కీర్తించి, చివరగా విద్యాలయ వాణి ఆయిన సరస్వతిని ‘శబ్ద, అర్థాల‘ కోసం ప్రార్థిస్తుంది.

ఉ.
తెల్లనిపుండరీకముల తేజము మెచ్చని కన్నుదోయితో
నల్లని శక్రనీలరుచి నవ్వెడు చక్కని దేహకాంతితో-
నల్లనఁ బిల్లఁగ్రోవి కరమందలి సంజ్ఞల నింపు నింపఁగా
గొల్లతలన్ విరాళి తగఁ గొల్పెడు కృష్ణుఁడు ప్రోచు గావుతన్! (3)
ఉ.
మేలిమి మంచుకొండ నుపమింపఁగఁ జాలిన యంచ నెక్కి వా-
హ్యాళి నటించి వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వు దేరఁగా
వాలిక సోగకన్నుల నివాళి యొనర్చి ముదంబుఁ గూర్చు వి-
ద్యాలయ వాణి శబ్దములనర్థములన్ సతతంబు మాకిడున్! (8)

ఈ ఇష్ట దేవతా ప్రార్థనల లోనే ఆమె కవితా విలక్షణత, వర్ణనా శైలి మొదలైనవన్నీ ముందు ముందు రాబోయే కావ్యంలో ఎలా ఉండబోతున్నాయో రుచి చూపిస్తూ మనల్ని కుతూహల సన్నద్దులను చేస్తుంది మొల్ల.

తర్వాత తొల్లిటి ఇప్పటి సంస్కృత తెలుగు కవులను కొందరిని భక్తితో తలుచుకుంటుంది. రాముడే చెప్పమని అడిగాడు, అతని చరిత ఇహపర సాధనం. పుణ్య చరితం. అందువల్ల తప్పులు ఎంచవద్దని కవులను కోరుతుంది.

క.
చెప్పుమని రామచంద్రుఁడు
సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద నే నె
ల్లప్పుడు నిహ పర సాధన
మిప్పుణ్య చరిత్ర తప్పు లెంచకుఁడు కవుల్‌! (13)
చ.
వలిపపు సన్న పయ్యెదను వాసిగ గందపుఁ బూఁతతోడుతన్‌
గొలదిగఁ గానవచ్చు వలి గుబ్బ చనుంగవ ఠీవి నొప్పఁగాఁ
దెలుఁ గని చెప్పుచోటఁ గడుఁ దేటలఁ మాటలఁ గ్రొత్త రీతులం
బొలుపు వహింపకున్న, మఱి పొందగునే పటహాదిశబ్దముల్‌? (15)

అలాగే కవిత్వం కవి పాండిత్య ప్రదర్శన (తన విద్య మెరియగ) కోసం ‘ఘనమగు సంస్కృతము’ చెప్తే మాత్రం రుచిగా ఉంటుందా? అని ప్రశ్నించి, ‘తేనె సోక నోరు తీయన యగు రీతి’ అర్థాలు అన్ని వెంటనే తోచే విధంగా ఉండకపోతే అది ‘మూగ చెవిటి వారి ముచ్చట’ అవుతుందని చెప్తుంది.

క.
మును సంస్కృతములఁ దేటగఁ
దెనిఁగించెడిచోట నేమి దెలియక యుండన్‌
దన విద్య మెఱయఁ గ్రమ్మఱ
ఘన మగు సంస్కృతముఁ జెప్పఁగా రుచి యగునే? (16)

ఆ.
తేనె సోఁక నోరు తీయన యగు రీతిఁ
దోడ నర్థ మెల్లఁ దోఁచకుండ
గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూఁగ చెవిటివారి ముచ్చ టగును
క.
కందువ మాటలు, సామెత
లందముగాఁ గూర్చి చెప్ప నది తెనుఁగునకున్‌
బొందై, రుచియై, వీనుల
విందై, మఱి కానుపించు విబుధుల మదికిన్‌.

అటు పిమ్మట గురువూ, తండ్రి అయిన ఆతుకూరి కేసన/ కీసనసెట్టి కుమార్తెననీ తన పేరు మొల్ల అనీ చెప్తుంది.

క.
గురు లింగ జంగ మార్చన
పరుఁడును, శివభక్తి రతుఁడు, బాంధవ హితుఁడున్‌
గురుఁ, డాతుకూరి కేసయ
వర పుత్రిని మొల్ల యనఁగ వఱలినదానన్‌.

అయితే ఈమె కుమ్మరి కులానికి చెందినదని ఏకామ్రనాథుడు రాసిన సిద్ధేశ్వర చరిత్రలో 160 పుటలో కవి ఇలా రాశాడు అని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ మొల్ల రామాయణం పీఠికలో ఉదాహరించిన పేరా ద్వారా తెలుస్తోంది. (2008: పుట: 4-5).

మొల్ల రామాయణం కావ్యంలోని అనేక విశేషాలను కొన్ని అంశాల అవగాహన ద్వారా తెలుసుకోగలుగుతాం. అన్ని విశేషాలను కాకపోయినా కొన్ని ముఖ్యమైన విశేషాలను మచ్చుకు కొన్ని ఉపశీర్షికల కింద వివరించే ప్రయత్నం చేస్తాను. అవి:

  1. అలంకారాలు
  2. వర్ణనలు
  3. చమత్కారాలు
  4. సంభాషణా శైలి
  5. భాషా విశేషాలు

I. అలంకారాలు

ఏ కావ్యానికైనా అందాన్ని ఇచ్చేవి అలంకారాలు. వీటిలో కొన్ని క్లుప్తంగా పరిశీలిద్దాం.

మొల్ల మొదట చెప్పిన కవిత్వ ఉపమానమే మనల్ని ఆకట్టుకుంటుంది. ‘తేనె సోక నోరు తీయన యగు రీతి, తోడ అర్థ మెల్ల’ తోచాలట. ఎంత అందమైన ఉపమానం! ఇలాంటివే మరికొన్ని. ప్రతీ అలంకారం కూడా నూత్నకల్పనతో కాని, పాతవాటిని కొత్తగా మలిచి కానీ అందించటం మొల్ల ప్రత్యేకత.

రామ పట్టాభిషేకం అందరికీ ప్రకటించి దశరథుడు కైకేయి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ప్రారంభమవుతుంది ప్రకృతి వర్ణన. వీటిలోని ఉపమానాలు అందమైనవీ కొత్తవీ కూడా.

1. సూర్యుడు పడమర సముద్రంలో అస్తమిస్తున్నాడు. ఇది సహజంగా మనకు కనిపించేదే. కానీ మొల్ల పగలంతా శ్రమ చేసి చెమటపట్టడం వల్ల సముద్ర స్నానానికి వెళ్తున్నట్లు సూర్యుడు పశ్చిమ సముద్రంలో మునిగినాడట. సంధ్యాకాలపు ఎరుపు అప్పుడే వాలుతున్న చీకటి కలిపి ఆకాశం నీలాన్నీ కెంపునూ కలిపినట్లు ఉందని కూడా ఉపమించింది.

తే.
పగలు ప్రాగ్భాగమున నుండి గగన వీథిఁ
జరమ దిక్కున కేఁగఁగా శ్రమము దోఁచి
చెమట పట్టిన స్నానంబుఁ జేయ నరుగు
కరణి, నపరాబ్ధిలో దివాకరుఁడు గ్రుంకె. (అయోధ్య – 6)
క.
మేలిమి సంధ్యా రాగము
వ్రాలిన చీఁకటియుఁ గలిసి వరుణుని వంకన్‌
నీలముఁ గెంపును నతికిన
పోలికఁ జూపట్టె నట నభోమణి తలఁగన్‌. (అయోధ్య – 7)

2. అలాగే చీకటిని ఉపమించడానికి ఆమెకు ఒక్క పోలిక సంతృప్తిని ఇవ్వలేదు. చిన్న చిన్న తేలిక ఉపమలు ఎన్ని వాడిందో చూడండి: కారు మొగులు రీతి, కాటుక చందాన, నీటి భాటి, ఇంద్ర నీల మహిమ మాష రాశి పోల్కి… ఇన్నింటి పోలికల ‘తోడ అర్థం తోచేలా’ చేసింది.

ఆ.
కారు మొగులు రీతిఁ, గాటుక చందాన,
నీటి భాతి, నింద్ర నీల మహిమ,
మాష రాశి పోల్కిఁ, మఱి మఱి యపు డంధ
కార మవని యెల్లఁ గలయఁ బర్వె. (అయోధ్య – 9)

3. సూర్యుడి ఎండ వేడికి ఉడికి పోయిన పాల సముద్రం మీద పుడమికి పాలవెల్లి కట్టినట్లు కట్టిన మీగడ వలె, నురగ వలె చంద్రుడు ఉన్నాడని వర్ణించింది. ఆ చంద్రునిలో మచ్చ పయోనిధిలో (క్షీరసాగరంలో) పద్మనాభుని (విష్ణువు) వలె ఉన్నాడట. కింది పద్యం చూడండి.

ఉ.
భాను సహస్ర సత్కిరణ పంక్తుల నుద్భవ మైన యా బృహ
ద్భానుని వెట్టఁ బెల్లుడుకఁ బడ్డ సుధాంబుధి మీఁది మీఁగడల్‌
పూని సమీరుచేఁ దెరలఁ బూర్వ దిశం గనుపట్ట దానిపై
ఫేన మనంగ నొప్పె శశి బింబము తూరుపుఁ గొండపైఁ దగన్‌. 13

4. ఇంద్రుడు చామంతి పూల చెండును (బంతి) స్వర్గానికి ఎగుర వేసినట్లు, తెలుపు పసుపు మిశ్రమ వర్ణంలో తూర్పున వేగుజుక్క పొడిచిందట.

తే.
పాకశాసని సేవంతి బంతి దివికి
నెగుర వైచిన కైవడి నేమి చెప్పఁ
బాండు వర్ణంబుతోఁ బూర్వ భాగ సీమ
సొంపు మీఱఁగ వేగురుఁజుక్క వొడిచె. (అయోధ్య-20)

5. ఎర్ర కలువల వానలతో కప్పిన పర్వతం వలె నిప్పుల బాణాలు హనుమపై రాక్షసులు కురిపించారు.

క.
అప్పుడు దానవ వీరులు
నిప్పులు వర్షించునట్టి నిశితాస్త్రములన్‌
గప్పిరి కెందొగ వానలఁ
గప్పిన శైలంబుఁ బోలఁ గపివరు మీఁదన్‌. (సుందర-172)

6. హనుమ పర్వతం మీద తన పాదాలను తొక్కిపెట్టి అద్భుతమైన శక్తితో వడిసెలలో బంగారు ఉండ పెట్టి వదిలిన విధంగా సముద్రాన్ని దాటాడు:

క.
పుడమీ ధర శృంగంబున
నడుగులు వడి నూఁది త్రొక్కి, యద్భుత శక్తిన్‌
జలరాశి దాఁటఁ బావని
మిడివింటం బసిఁడి యుండ మీఁటిన రీతిన్‌. 225

7. రామ రావణ లిద్దరూ సమ ఉజ్జీలుగా యుద్ధం చేస్తున్నప్పుడు చేసిన పోలిక:

క.
గిరిగిరి నభము నభంబున
ధర ధరయును జలధి జలధి దార్కొనురీతిన్‌
సురరిపుఁడు నసురరిపుఁడును
దురమున నెదురించి రధికదోర్బలయుక్తిన్‌. 53

8. రావణుని చేతులు తలలు రాముడు తుంచిన వెంటనే పూసిన తామరల వలె మొలుస్తున్నాయంట:

క.
ఒకకోలఁ దలలుఁ జేతులుఁ
బ్రకటంబుగఁ ద్రుంచినంతబాహులుఁదలలున్‌
వికచాంబుజములరీతిని
సకలేశుఁడు వెఱగుపడఁగఁ జయ్యన మొలిచెన్‌. 86

9. రామ రావణ యుధ్దంలో ఇద్దరి శరీరాలకూ గాయాలై రక్తాలు కారి, ఆ ఎర్రటి నెత్తురుతో తడిసిన వాళ్ళ శరీరాలు పూలతో నిండుగా పూచిన మోదుగ చెట్ల వలె, తూర్పు కొండపై ఉదయిస్తున్న సూర్యుడి వలె, జేవురు కొండ కాల్వల సిందూరము వలె ఉన్నాయట.

ఉ.
రావణుఁడేయు బాణములు రాముని బాణము లొక్కపెటునన్‌
రావణు మేన నాటియును రామునినాటియు రక్తపూరముల్‌
పూవులతోడిమోదుగను బూర్వగిరీంద్రము మీఁది భానునిన్‌
జేవురుకొండ కాలువలసిందురమున్‌ దలపించు నెంతయున్‌. 93

ఇలా ఉదాహరిస్తూ పోతే మొల్ల వాడిన అనేక అలంకారాలు ఉపమతో పాటు, ఉత్ప్రేక్ష, స్వభావోక్తి, అనుప్రాస వంటి కొన్ని అలంకారాలే అయినా ఆమె వాడిన వన్నీ చాలా వరకూ కొత్తదనంతో ఉన్నాయి. సీతకు వాడినవి మాత్రం పూర్వకవులు సాంప్రదాయికంగా స్త్రీలకు వాడిన ప్రయోగాలే.

II. వర్ణనలు

మొల్ల వర్ణనలు ఆస్వాదించాలని అనుకుంటే ఒకటి రెండు ఉదాహరణలు చాలవు. కావ్యమంతా చదివితేనే ఆనందించగలం. ఆ కోరిక పుట్టడం కోసమే కొన్ని మచ్చు ఉదాహరణలు:

1. ఇవాళ మనం తెలుగు ఇళ్ళలో చూసే లక్ష్మీదేవి క్యాలెండర్ నమూనా బహుశా మొదట చిత్రించింది మొల్ల నేమో! అచ్చం అలాగే ఉంది ఆమె వర్ణన. తామర పువ్వు గద్దె మీద కూర్చున్న ఆమెను రెండు ఏనుగులు రెండు వైపులా నీటితో అభిషేకిస్తున్నట్టుగా వర్ణించింది.

ఉ.
సామజయుగ్మ మింపలరఁ జల్లని నీరు పసిండికుండలన్‌
వేమఱు వంచి వంచి కడు వేడుకతో నభిషిక్తఁ జేయఁగాఁ
దామరపువ్వు గద్దియ ముదంబున నుండెడి లోకమాత మా
కాముని తల్లి సంపద లఖండముగా నిడు మాకు నెప్పుడున్‌. 7

2. సరస్వతి వర్ణన మరీ కొత్తది. అందమైనదీ. హంసపై విహరించి వచ్చిన బ్రహ్మకు ఎదురెళ్ళి చిరు నవ్వు తోనూ, సోగ (వాలు) కళ్ళతో నమస్కరించి సంతోష పెట్టే వాణి శబ్దార్థాలను ఇచ్చు గాక అని కోరుకుంటుంది.

3. అన్ని ప్రబంధ కావ్యాలూ పురవర్ణనతోనే మొదలవుతాయి. సరయూ నది ఒడ్డున వెలసిన అయోధ్యను/సాకేత పురాన్ని నాలుగు పద్యాలలో వర్ణిస్తుంది. అందులో ఒకటి: ఆ పట్టణం కోట ఎంత ఎత్తయినదీ అంటే అక్కడి స్త్రీలు కోట ఎక్కి సూర్యుడి పాదాలు పూజిస్తారట! అలా అందేంత ఎత్తులో కోట ఉంది.

క.
ఇమ్ముల నప్పురి వప్రము
కొమ్ములపై నుండి పురము కొమ్మలు వేడ్కన్‌
దమ్ముల చుట్టము పద జల
జమ్ములు పూజింతు రొగి నజస్రముఁ బ్రీతిన్‌. 5

4. స్త్రీల వక్షస్సును బంగారు కలశాల్లా ఉన్నాయని, పైట చెంగు జెండా వలె ఉన్నదని చెప్పటంలో కొత్తదనం లేదు. మొల్ల ఆ పురం మేడల బంగారు కలశాలు స్త్రీల వక్షాలవలె, జెండాలు పైటల వలె కిటికీల కాంతి మెరిసే కళ్ళ వలె ఉండి, భోగులు మెచ్చే వేశ్యల వలె ఉన్నాయని పురాన్ని స్త్రీగా విలోమంలో వర్ణించింది.

చ.
కనక విలాస కుంభములు గబ్బి కుచంబుల లీలఁ, జిత్ర కే-
తనములు పైఁట కొంగుల విధంబునఁ గ్రాల, గవాక్షముల్‌ రహిన్‌
గనుఁ గవ యట్ల పొల్పెసఁగఁగా భువి భోగులు మెచ్చ భోగినీ
జనముల రీతిఁ జెల్వమరు సౌధ నికాయము పాయ కప్పురిన్‌. 16

5. ఇక ఆమె సూర్యాస్తమయం, చీకటి పడటం, చంద్రోదయం, చకోరాలు వెన్నెల తాగటం (అయోధ్య కాండలో) వర్ష వర్ణన (కిష్కింధ కాండలో) అన్నీ ఎంతో కొత్తగా ఉంటాయి.

6. వైశ్యుల వర్ణన తర్వాత సాంప్రదాయికంగా చేసే శూద్రుల వర్ణనకు మారుగా ‘కాపు ప్రజల’ వర్ణన ఉంది.

7. అరణ్య వాసానికి బయల్దేరిన రాముడు సీతాలక్ష్మణ సమేతంగా గంగానది దాటాలని ఓడ నడిపే గుహున్ని కోరుతాడు. దానికి గుహుడు రాముని పాదధూళి సోకి రాయి కాంతగా మారింది, తన ఓడ కూడా ఏమౌతుందోనన్న భయంతో రాముని పాదాలు కడిగినాడట. వాల్మీకి రామాయణంలో లేని ఈ మొల్ల వర్ణన తరువాత ఎందరో తెలుగు కవుల భావనల్లో, తెలుగు సినిమా పాటల్లో కూడా ప్రతిధ్వనించింది.

చ.
సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో” యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్‌. (అయోధ్య-32)

8. చెంచు స్త్రీలు అడవిలో నడుచుకుంటూ వెళ్ళే రామ లక్ష్మణులనూ, సీతనూ చూసి తమలో తాము వాళ్ళు రాకుమారులవలె ఉన్నారని, సీత ఎంతో సుకుమారంగా కనిపిస్తున్నదనీ వీళ్ళను బ్రహ్మ ఇలాంటి దురవస్థలో ఎందుకు పడవేశాడో అని అనుకున్నారట. అడవిలో చెంచులు ఉన్నారని పరోక్షంగా చెప్పింది.

చ.
ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనో? పట్టభద్రుఁ డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి దుర్దశల్‌
ప్రతివసియించు టెట్లో? రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁద్రోచె బ్రహ్మ?” యని కాంతురు చెంచెత లమ్మహాత్ములన్‌. (అరణ్య-3)

9. సీత అందాన్ని శూర్పణఖ రావణునితో వర్ణించిన విధం ఉపమానాలు పాతవే అయినా దానివలే ఉందా లేక దీనిలాగా ఉందా (కన్నులు కలువలో కాము బాణంబులో) అన్నట్లు సీసంలో వర్ణించటం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే సీత ‘లావణ్య విభ్రమాలు‘ అలాంటివి. అలా చెప్పి అతణ్ని పురికొల్పడమే ఆమె కోరిక కదా! ఇది ఒక్కటి కాదు. సీత అందాన్ని రెండు సీస పద్యాలలో ఒక కందంలో వర్ణిస్తుంది శూర్పణఖ.

క.
ఆ రాము భార్య విభ్రమ
మే రాజకుమార్తెలందు నెఱుఁగము విని మున్‌
ధారుణిలోపలఁ గామిను
లా రమణికి సాటి పోల రభినుతి సేయన్‌. 21

సీ.
కన్నులు కలువలో? కాము బాణంబులో?
తెలివిగా నింతికిఁ దెలియరాదు
పలుకులు కిన్నెర పలుకులో? చిలుకల
పలుకులో? నాతి కేర్పఱుపరాదు
అమృతాంశు బింబమో? యద్దమో? నెమ్మోము
తెంపులో సతికి భావింపరాదు
కుచములు బంగారు కుండలో? చక్రవా-
కమ్ములో? చెలి కెఱుఁగంగరాదు
తే.
కురులు నీలంబులో? తేఁటి గుంపు లొక్కో
పిఱుఁదు పులినంబో? మన్మథు పెండ్లి యరుఁగొ?
యనుచుఁ గొందఱు సంశయం బందుచుండ
వెలఁది యొప్పారు లావణ్య విభ్రమముల. 22
క.
కలదో! లేదో! యనుచును
బలుమఱు నెన్నడుముఁ జూచి పలుకుదు రితరుల్‌,
బలిమో! కలిమో! యనుచును
బలుమఱు జఘనంబుఁ జూచి పలుకుదు రితరుల్‌. 23
సీ.
షట్పదంబుల పైకి సంపెంగ పువ్వుల,
జలజాతముల పైకిఁ జందమామఁ,
గిసలయంబుల పైకి వెసఁ గలకంఠముల్‌,
సింధురమ్ములపైకి సింహములను,
దొండపండుల పైకి దొడ్డ రాచిలకల,
నలరుఁ దూఁడుల పైకి హంసవితతిఁ,
బండు వెన్నెల నిగ్గు పైకిఁ జకోరముల్‌,
పవనంబు మీఁదికి బాపఱేని,
తే.
మరుఁడు వైరంబు చేసిన మాడ్కి, నలక
నాసికా కరానన చరణ స్వనములు
వర పయోధర మధ్యోష్ఠ వచన బాహు
గమన హాసాక్షు లూర్పారు రమణి కమరె. 24

ఇందులో ఉన్నది క్రమాలంకారం. వరుస క్రమంలో ఒకదానిపై మరొకటివైరంతో ఉన్నట్లుగా వర్ణన. అంటే, తుమ్మెదలు సంపంగి పూలపై వాలవు, కానీ సీత అలకలు అంటే ముంగురుల కిందనే సంపంగి వంటి ముక్కు ఉంది. అందువల్ల తుమ్మెదల పై సంపెంగలదాడి వలె ఉంది. అట్లాగే తామర పూలకు చంద్రునికి వైరం. కానీ ఇక్కడ ఆమె చేతులు పద్మాల వలె ఉంటే వాటితో ముఖమనే చంద్రుణ్ణి మన్మథుడు వైరిగా ఏర్పరచాడు. అదే విధంగా చిగుళ్ళ వంటి పాదాలకు శత్రువుగా కలకూలజితం అంటే కంఠస్వరానికి సంబంధించినది (స్వనములు). అలాగే సిందురాలను పయోధరాలతో వాటితో పోటీ పడుతూ సింహం వంటి మధ్య అంటే నడుము (సన్నగా ఉండటం); దొండపండు వలె పెదవులు వాటికి వైరి రాచిలుక అంటే వచనం (మాటలు); అలరు తూడుల వంటి చేతులు; వాటి పైకి హంసల సమూహం అంటే వాటి వంటి నడక (హంస గమనం); పండు వెన్నెల నిగ్గు వంటి నవ్వు (హాసం); చకోరాల వంటి కళ్ళు; పవనం అంటే గాలి వంటి ఊర్పు అంటే శ్వాస; ఇక చివరగా పాము వంటి నూగారు అని వరుసగా పేర్కొంటూ కొత్తగా చమత్కార వర్ణన చేయడం మొల్ల ప్రత్యేకతగా మనకు బోధ పడుతుంది.

10. సీతకు నమ్మకం కలిగించటానికి రాముణ్ణి వర్ణించమని అడిగిన సీతతో హనుమ రామ లక్ష్మణులను సీసపద్యంలో ఇలా వర్ణించాడు:

సీ.
నీలమేఘ చ్ఛాయఁ బోలు దేహమువాఁడు
ధవళాబ్జ పత్ర నేత్రములవాఁడు
కంబు సన్నిభమైన కంఠంబు గలఁవాడు
చక్కని పీన వక్షంబువాఁడు
తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాఁడు
ఘనమైన దుందుభి స్వనమువాఁడు
పద్మ రేఖలు గల్గు పద యుగంబులవాఁడు
బాగైన యట్టి గుల్ఫములవాఁడు
తే.
కపట మెఱుఁగని సత్య వాక్యములవాఁడు
రమణి! రాముండు శుభ లక్షణములవాఁడు
ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు
వరుస సౌమిత్రి బంగారు వన్నె వాఁడు. 102

అంటే ఇద్దరిదీ ఒకే రూపు రేఖలు, కానీ రాముడు నీల మేఘచ్ఛాయ వర్ణము వాడు; లక్ష్మణుడు బంగారు వన్నె వాడు. ఇలా ఒక్క వాక్య భేదంతో రంగులో తేడా తప్ప ఇద్దరూ ఒకేలా ఉంటారని ఇద్దరినీ కలిపి ఒకే పద్యంలో వర్ణిస్తుంది.

11. యుద్ధ వర్ణనలు మాత్రం వర్ణనాతీతం. యుద్ధకాండములోని మూడు ఆశ్వాసాలలో ఉన్న యుద్ధ వర్ణనలు మాత్రమే కాదు, హనుమ సుందరకాండలో చేసిన యుద్ధ వర్ణనలు అన్నీ మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తాయి.

12. చివరగా యుద్ధం ముగిసి సీతతో పుష్పక విమానంలో తిరుగు ప్రయాణంలో అయోధ్యకు వస్తూ రాముడు సీతకు ఆమె అపహరింపబడ్డ ప్రాంతం వరకు ఇది యుద్ధ భూమి; ఇది వారధి; ఇది కిష్కింధ; హనుమంతుడు కలిసిన చోటు ఇదే; అంటూ చూపిస్తూ ప్రయాణిస్తారు.

III. చమత్కారాలు

మొల్ల కవిత్వం ఎలా ఉండాలో చెప్తూ, తేటల మాటల క్రొత్త రీతుల సొంపుగానూ ఉండాలని, ఘనమైన సంస్కృతంలో చెపితే రుచి యగునా? అనీ అంటుంది. అంతేకాకుండా కందువ (చమత్కార) మాటలు, సామెతలు అందంగా కూర్చి చెపితే అది తెలుగుకు సరియైనది గాను, రుచిగాను, వీనుల విందుగానూ విభుదుల మనస్సుకు కనిపిస్తుందట. నిజానికి వర్ణన, అలంకారం, చమత్కారం అంటూ విడివిడిగా వీరు చేయడం కష్టం. ఇవన్నీ కలిపితీనే చమత్కార స్ఫూర్తి కలుగుతుంది.

అందువల్ల మనం ఈ కావ్యం జాగ్రత్తగా చదివితే ఇవన్నీ కనిపిస్తూనే ఆమె సంస్కృత పాండిత్యం కూడా కనిపిస్తుంది. అయితే ఆ క్లిష్టత కొన్ని కొన్ని వర్ణనలకే పరిమితం.

1. రాముణ్ణి పొగిడే నోటికి ‘చిల్లర రాజ లోకాన్ని’ పొగడటానికి ఇష్టం కలుగుతుందా? అని ఊరుకోకుండా ‘అల్లము బెల్లమున్ దినుచు నప్పటికప్పటి కాస చేయునే?’ అంటుంది.

ఉ.
సల్లలిత ప్రతాప గుణ సాగరుఁడై విలసిల్లి, ధాత్రిపై
బల్లిదుఁ డైన రామ నరపాలకునిన్‌ స్తుతి సేయు జిహ్వకున్‌
జిల్లర రాజ లోకమును జేకొని మెచ్చఁగ నిచ్చ పుట్టునే?
యల్లము బెల్లముం దినుచు నప్పటి కప్పటి కాస సేయునే? 24

2. చమత్కార మంటేనే వర్ణనలో భాగం అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. సంస్కృత భాషా పదాల శ్లేష బాలకాండలో చక్కగా వాడి చమత్కారాన్ని ఆవిష్కరించింది. (బాల – 3-12). అక్కడ ఏమేం ఉన్నాయో ఏమి లేవో వర్ణిస్తూ; బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం, ఇంద్ర, కుబేర లోకాలలో ఉన్న వాటితో అయోధ్యలో ఉన్న, రథ గజ తురగ పదాతి దళాలను, మేడలను శ్లేష ద్వారా చమత్కారం ఆవిష్కరిస్తుంది. అలాగే చాతుర్ వర్ణ్యాల వారిని వారి వారి లక్షణాలతో, పోలికలతో దేవ లోకాలైన స్వర్గ, అమర, వైకుంఠ, కైలాస లోకాలలో ఉన్న అన్ని వస్తు జంతు, దేవతలతో పోలికలను, భేదాలను సకారాత్మక, నకారాత్మక పోలికలతో “కాదు కాదని కొనియాడ గలిగినట్టి” – వర్ణనలతో చమత్కరిస్తుంది. వీటికోసం పదాల శ్లేషను చక్కగా వాడుకుంటుంది.

ఉదా: దానగుణం: (a). సుర లోకంలో ‘కోరింది ఇచ్చే గుణం’; (b). అదే దాన గుణం అంటే అయోధ్యలో ఏనుగుల మద జల ధార. అంటే మంచి శ్రేష్ఠమైన ఏనుగులు ఉన్నాయని అర్థం.

కవి గురు బుధ మిత్రాదులు: సురలోకంలో వీటికి వరుసగా (a) శుక్రుడు, గురుడు, బుధుడు, సూర్యుడు అని అర్థాలు. (b) అయితే అయోధ్యలో కవులు, గురువులు, పండితులు, స్నేహితులు ఉన్నారని అర్థం.

అలాగే బ్రాహ్మణుల వర్ణనలో ఒక సీస పద్యంలో సంపన్నులే కానీ స్వర్ణకారులు కాదనీ; పవిత్రోజ్వల సూత్ర ధారులు (సూత్ర=జంధ్యం; ధారులు=ధరించిన వారు) కానీ టక్కరి హాస్య నాటకులు (నాటకంలో సూత్రధారులు) కారు అని; రెండు సంధ్యల లోనూ విధి యుక్తమైన కర్మలు చేస్తారు తప్ప నిశాచరులు కారనీ; ద్విజులే కానీ పక్షిజాతములు కారనీ మాటలకున్న అర్థ భేదాలతో చమత్కారం స్ఫురింప జేయగలిగింది మొల్ల.

సీ.
ప్రకటాగ్నిహోత్ర సంపన్ను లౌదురు గాని
రమణీయ రుక్మకారకులు గారు,
శుభ పవిత్రోజ్జ్వల సూత్రధారులు గాని
టక్కరి హాస్యనాటకులు గారు,
ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని
చర్చింపఁగా నిశాచరులు గారు,
తిలకించి చూడ సద్ద్విజు లౌదురే కాని
తలఁపంగఁ బక్షిజాతములు కారు,
తే.
బాడబులు గాని యగ్ని రూపములు గారు
పండితులు గాని విజ్ఞుల పగిదిఁ గారు
ధీవరులు గాని జాతి నిందితులు గారు
పరమ పావను లా పురి ధరణిసురులు. 10

3. వర్ణనల విభాగంలో ప్రస్తావించిన పద్యంలో గంగానది ఒడ్డున గుహుడిని చూసి గంగ దాటించమంటే అతను రాముని పాదాలు తాకి నా ఓడ ఏమవుతుందో అని భయపడ్డాడనటం మరో చమత్కారం.

4. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను చూసి ఉంగరం ఇచ్చి ఆమె శిరోరత్నం తీసుకుని తిరిగి అంగదాదులను కలిసి ‘వెళ్ళిన పని అయిందా?‘ అని అడగగానే వారికి మొత్తం వివరిస్తాడు. వెంటనే ఆనంద ఉత్సాహాలతో ‘నేనే చాలుదు, నేనే చాలుదు…’ అంటూ ప్రతి వానరుడూ తుళ్ళుతూ, కేరింతలు కొడతారు. అంతకు పూర్వం ఈ వానరులే సముద్రాన్ని చూసి భయపడి నువ్వే వెళ్ళగల సమర్థుడివి అని ‘ఉబ్బించి‘ హనుమను పంపించారు. ఇప్పుడేమో పని విజయవంతం అవడంతో అట్లా కోతుల సహజలక్షణంతో తామే రావణున్ని చంపగల సమర్థులమని గంతులు వేయడం ఒక చమత్కారం.

శా.
నేనే చాలుదు రావణాసురు తలల్‌ నేలం బడంగొట్టఁగా,
నేనే చాలుదు వాని పట్టణము మున్నీటం బడం ద్రోయఁగా,
నేనే చాలుదు దుష్ట దానవ తతిన్‌ నిర్భీతి దండింపఁగా,
నేనే చాలుదు నంచుఁ బంతంబులు పూన్కిం బల్కుచున్‌ ద్రుళ్ళుచున్‌. (సుందర-230)

ఇంకా మనల్ని నవ్వించే సంఘటనలు సుగ్రీవుని దధివనంలో వాళ్ళంతా ఆకలితో తోటంతా వీరవిహారం చేసే వర్ణనలో కనిపిస్తాయి. ఒకడు కొమ్మ ఊపితే మరొకడు తేరగా ఆ పండ్లు తింటాడు. ఒక్కడు ఆకలితో గోళ్ళతో ఒలిచిన చివుళ్ళను ఇంకొకడు పుక్కిళ్ళ కొలది బొక్కుతాడు అని హాస్యభరితంగా రెండు పద్యాల్లో వర్ణిస్తుంది. అప్పటి వరకూ ఉన్న ఉత్కంఠ, ఉద్వేగం పోవడంతో వాళ్ళు స్వేచ్ఛావిహారం చేయడం కావ్యం చదివే (వినే) వారికి కూడా ఊరట కలిగిస్తుంది.

సీ.
ఒక్కఁ డాఁకొని కొమ్మ నూఁచినఁ బండ్లెల్లఁ
జేకొని తేర భక్షించు నొకఁడు,
ఒక్కఁ డాఁకొని రేఁపు చున్నట్టి తేనియల్‌
తడయక కొల్లాడి త్రాగు నొకఁడు,
ఒక్కఁ డాఁకొని కోయుచున్నట్టి కాయలు
మిన్నక యూటాడి మ్రింగు నొకఁడు,
ఒక్కఁ డాఁకొని గోళ్ళ నొలిచినట్టి చివుళ్ళఁ
బుక్కిళ్ళ కొలఁదిగా బొక్కు నొకఁడు,

తే.
తరువుపై నుండి తరువునకు దాఁటు నొకఁడు
పండ్ల కెటువంటి మ్రాఁకైన బ్రాకు నొకఁడు,
దిగువఁ గూర్చుండి తరువున కెగురు నొకఁడు
పెద్ద పొడవున నుండి కుప్పించు నొకఁడు. (సుందర-233)

234 లో కోతుల ప్రవర్తన లోని సహజత్వం కనిపిస్తుంది. గంతు లేస్తూ; ఉయ్యాల లూగుతూ; వెక్కిరిస్తూ; తోకలెత్తుతూ; దూకుతూ వానరులంతా విహరిస్తారు వనంలో.

ఉ.
కాయల వ్రేటు లాడుచును, గంతులు వైచుచుఁ, బూవు దీవలం
దూయల లూగుచున్‌, దరువు లూఁపుచుఁ, బండ్లను బొట్టనిండఁగా
మేయుచు, వెక్కిరింపుచును, మిన్నక దాఁటుచు, దోఁక లెత్తుచుం
గూయుచు, నేల దూఁకుచును, గుంపులు గూడి కపీంద్రులెంతయున్‌. (సుందర-234)

శ్రీరాముడికి అంతా చెప్పి చూడామణి ఇవ్వగానే వెంటనే యుద్ధ ప్రయాణం ప్రారంభ మవుతుంది. ఇక దోవ పొడుగునా వానరులు మళ్ళీ మళ్ళీ అడుగుతూండడంతో ఎవ్వరెవ్వరు ఏదేది అడిగితే హనుమ అవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తాడు; మిగిలిన కోతులు ‘తమ జాతి చేష్టలు’ చూపుతూ వింటూంటారు. ఇది చాలా సహజమైన మానవ స్వభావం. దాన్ని చక్కగా పట్టుకుంది మొల్ల.

యుద్ధ కాండలో రావణుడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిర, మహోదర, మహాపార్శ్వ మొదలైన వాళ్ళను రామ లక్ష్మణుల చంపి వారి తలలు తెమ్మని చెప్తే వాళ్ళు ‘తమ శిరంబులే రామ లక్ష్మణుల బాణంబులకు’ అర్పిస్తారు అనే వర్ణన అంతటి యుద్ధఘట్టం లోనూ చక్కటి చమత్కారమే కదా!

ఇలా ఆమె తన కథాకథనంలో ఎంతో చమత్కారం, హాస్యం కలిగే విధంగా సందర్భాలకు అణుగుణంగా చేసిన కల్పనలు, వర్ణనలు మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి.

IV. సంభాషణా శైలి

సాధారణంగా ప్రతీ కావ్యం లోనూ సంభాషణలు అంతో ఇంతో ఉంటాయి. కానీ తిక్కనను మాత్రమే నాటకీయ సంభాషణాచాతుర్యంగా సాహితీవేత్తలు చెప్పటం పరిపాటి. ఈ అంశంలో మొల్ల కూడా తనదైన సంభాషణా శైలిని ప్రదర్శిస్తుంది. ఏదైనా భయం గొలిపే దాన్ని చూసి అదిగో! అన్నట్లే విశ్వామిత్రుడు రాముడితో ‘తాటక వచ్చిన దదిగో!’ అంటాడు. అతనితో సూటిగా అనలేక రాముడు తనలో తాను ‘ఈ యాడుదాని జంపగ నాయమ్మున కేమి గొప్ప’ అనుకుంటాడు.

తను చెప్పిన మాట విననప్పుడు అందులోనూ ఆందోళనతో ఉన్నప్పుడు కోపం రావడం పెద్దవారికి సహజం. అందుకే రాముడు తమ్మునితో ‘నీవిటు నా కడకు ఏల వచ్చితి?’ అని కోపంతో అంటాడు.

రావణ సీతల సంభాషణ ఇద్దరిలో ఒకరు సుముఖంగా మరొకరు విముఖంగా ఉంటే ఎట్లా ఉంటుందో తెలియ జేస్తుంది. ‘నేనెంత గొప్పవాణ్ణి, నువ్వు మొత్తం అన్ని లోకాల లోనే అందగత్తెవి‘ అని రావణుడు అంటే, ‘నన్ను దొంగిలించి తెచ్చావు, నీ గొప్పలు నువ్వే చెప్పుకునే హీనుడివి. రాముడికి ఇదెంత? లంక ఎంత? నీవనగ నెంత? నీ లావు చేవ ఎంత? చెప్పేది ఏమిటి, నువ్వే చూస్తావు కదా‘ అంటూ గడ్డిపోచ పట్టుకుని మాట్లాడుతుంది. భాషాశాస్త్రంలో discourse analysisలో ఇద్దరి మధ్య సుముఖంగా సంభాషణ ఉంటే దానికి Cooperative principle వర్తిస్తుంది. కానీ వైముఖ్యం ఉన్నప్పుడు సంభాషణ కొనసాగదు అని చెప్తారు. ఇక హనుమ రావణ సంభాషణ దీనికి భిన్నంగా ఉంటుంది. అక్కడ కూడా సుముఖత లేక పోయినా సమాచార వినిమయం ప్రధానంగా సంభాషణ జరుగుతుంది. అలాగే విభీషణ రావణుల మధ్య సుముఖత లేకుండానే సుందర, యుద్ధ కాండలలో జరిగే సంభాషణలు కుటుంబంలో వ్యక్తుల/అన్నదమ్ముల మధ్య విభేదాల కారణంగా తలెత్తే వాగ్వాదం కోపతాపాలను వివరిస్తాయి.

V. భాషా విశేషాలు

తాళ్ళపాక తిమ్మక్క ద్విపదలో రాసింది. కానీ మొల్ల ప్రబంధ కవుల స్థాయిలో తన కావ్యానికి అర్హత సంపాదించి పెట్టింది. అన్ని ప్రబంధాల వలెనే ఈ కావ్యంలో కూడా పురవర్ణనతో మొదలు పెట్టి, ఇతర ప్రకృతి వర్ణనలు, కథాకథన వర్ణనలతో మొల్ల రామాయణం కావ్యానికి వాటి సరసన స్థానం కలిగించింది. అయితే కొన్ని భాషా విశేషాలను కూడా తెలుసుకోవడం అవసరమే. మొల్ల శైలి ఆమెనే చెప్పుకున్నట్లు తేట తెలుగులో ఉన్నప్పటికీ, కొంత ప్రౌఢత్వం కూడా ఉంది.

1. ప్రాచీన పద రూపాలు

ప్రాచీన భాషలో ఔప విభక్తి ప్రత్యాయాలు అయిన ఇ, టి, తి లలో ఒకటి ఇతర ప్రత్యాయాల ముందునామాలకు చేరుతాయి. ఇప్పటి భాషలోనూ ఉన్నాయి. కానీ, ఆధునిక భాషలో టి ప్రత్యయం చేరే రూపాలు కావ్య భాషలో 15-16 శతాబ్దాల లో కనిపిస్తుంది. అట్లా నోరు- నోటిగా మారకుండా ఊరు- ఊరివలె -రి రూపాలే ఉండటం కనిపిస్తుంది. అలాగే పదాదిలో ‘ద’ కాకుండా ‘డ’ కార రూపాలే కనిపిస్తాయి.

నోరి (నోటి కి పూర్వ రూపం)
డగ్గర (> దగ్గర)
అడాడ – ఆడ+ ఆడ= అక్కడక్కడ

ఈ పై ప్రయోగాలు ధ్వని మార్పుకు ముందున్న రూపాలను చూపిస్తాయి. అంటే నోటి-కి బదులు నోరి అనీ, దగ్గరకు బదులు డగ్గర అనీ కోతికి మారుగా క్రోతి అనీ నన్నయ నుండీ ఉన్న ప్రాచీన ప్రయోగాలే మొల్ల లోనూ ఉన్నాయి.

కొన్ని కను మెరుగైన మాటలు చూడండి:
కరణి = వలె
ఇంగలం =నిప్పు
మాడ్కి= వలె
కతము= వల్ల
పెడ్డయుం ప్రొద్దు= చాలా సేపు
ఒండే = కానీ/అయినా (ఇప్పుడు ప్రయోగం లో లేదు).

2. బహువచన రూపాలు

-లు ప్రత్యయం చేరే సామాన్య రూపాల తోబాటు ‘గూళ్ళు’ / గూండ్లు, కోళ్ళు, గొఱియలు, అంగళుల్, వంటి ప్రాచీన ఆధునిక ప్రయోగాలు రెండూ కనిపిస్తాయి.

3. విభక్తులు

11-16 శతాబ్దాల మధ్య కావ్యాలలో విభక్తి ప్రయోగాల వలెనే మొల్ల ప్రయోగాలూ ఉన్నాయి.

ద్వితీయ: ను, (ను)న్ గురించి, ప్రత్యయ రహితంగానూ (అందరు కవులకూ ప్రత్యయం వాడలేదు) కేవలం చివర్లో ఒక్క తిక్క కవిరాజును అని తిక్కనకు మాత్రమే ద్వితీయా విభక్తి ప్రతయం వాడింది.
తృతీయ: హరుల తోడ, కీతనంవుల తోడ, ఛత్రముల తోడ; చేత – కర్పూర తతి చేత; చే – నీతి మహిమచే;
చతుర్థి: కై – సంతాన లబ్దికై; కి – గీష్పతికి, సన్నిధికి; కు – రాజీవ తనూజు డున్నెడకు; న్ – ఆరగింపన్ (= తినటానికి)
పంచమి: వలన- ఈ వార్ధి దాట… మా వలనం జాలదింక… (సుందర–15).
షష్ఠి: రాముని శ్రీ పద రజము సోకి…(రాముని యొక్క).
సప్తమి: న్ – అయోధ్యన్, అందు – జగములందు; న – నగరమ్మున; లోపల – బంగారు పాత్రమ్ము లోపల;

కొన్ని విభక్తి ప్రయోగాలు భిన్న నామాలతో రావడం కావ్య భాషలోనే కనిపిస్తుంది. వాటివల్ల వాక్య నిర్మాణాలు అధినిక వాక్యాల కంటే భిన్నంగా కనిపిస్తాయి.

4. క్రియా ప్రయోగాలు

మొల్ల రచనలో క్రియా ప్రయోగాలలో ప్రాచీన, ఆధునిక రూపాలు రెండూ కనిపిస్తాయి.

‘నరుల వానరుల జెప్ప మరచినాడు‘ అని శకటరేఫ తో కూడిన క్రియలో ఆధునిక ఇనా ప్రత్యయం ‘ఉన్నాడు లెస్స రాఘవుడు..‘, ‘తాటక వచ్చినది‘ అని క్రియారూపాలతో బాటూ ‘జన్నంబు కావించు చున్నవాడు‘ అని ‘పుట్టి పెరుగుడు’ అనీ, ‘అనియె‘, కానుపించె, వ్రచ్చెద అనీ, తెచ్చెద అనీ కావ్యరూపాలు మాత్రమే కనిపిస్తాయి.

కురిపించారు/కురిపించిరి అనే ప్రయోగానికి మారుగా ‘కురిసిరి‘ అనే శాసనకాలాల ప్రయోగం కనిపిస్తుంది.

ఖండించెద, తుండించెద, చెండించెద, వండించెద వంటి ప్రేరణార్థక భవిష్య దర్థక ప్రయోగాలు కనిపిస్తాయి.

విధ్యర్థక: వెడలంగ ద్రోయుడు, వెడలుండు, సేనల కూర్చుము, తెప్పింపుము, అవదరింపుము, ఆలకించుము/ ఆలకించు, వినుము మొదలైనవి. తలచు అనే క్రియను తల్చుకో అనే ఆత్మార్తక కొను ప్రత్యయం లేకుండానే వాడింది.

శత్రర్థక: పొగడుచున్, వర్ణింపుచున్, అచరింపుచు, భూషించుచున్, మ్రొక్కుచున్, పాడుచు, ఆడుచు, దాటుచున్; పల్కుచున్, త్రుళ్ళుచున్ (సుందర – 229, 230).

5. జంట పదాలు

దుంపదూడులు (కిష్కింధ–24); కూర గాయలు (సుందర-50).

6. కొన్ని వాక్య విశేషాలు

ప్రాచీన కావ్యాలలో కొన్ని వాక్యాలు కొన్ని విభక్తి కారకాలు ఈనాటి ప్రయోగాలకు భిన్నంగా కనపడతాయి.

1. నీ/ మీ పేరేంటి అనే ప్రశ్న మూడు వేర్వేరు చోట్ల మూడు రకాలుగా వాడింది మొల్ల.

a. నీకు పేరేమి? (నీ పేరేంటి); మీ నామ మెవ్వరనిన.
b. మీరెవ్వరయ్య? యిటకు నేమి కతమున వచ్చితిరి?
c. ఎది నామము?(నీకు పేరేమి? – హనుమంతుని తో లక్ష్మణుడు)

2. ఇంత చాలదె? ఆశకు నెంత కెంత? (ఆశకు అంతు ఏదీ)
3. రాముడు – గీముడు; హరి – గిరి ఇలా గి – గీ రూపాలు చాలా చోట్ల వాడింది. ముఖ్యంగా నిందార్థక వాక్యాలలో గిగీ లు వస్తాయి. రాముడు గీముడు (పరశు రాముడు; రావణుడు వేర్వేరుగా అంటారు).
4. అర్కజు చేత గానీ మీదు కార్యంబు నెగ్గదు. (సుగ్రీవుడి వల్లనే మీ పని అవుతుంది అని అర్థం).
5. రాముడు ఒండే రావణుడు ఒండే ఈ వాక్యం ఇద్దరూ వేరు వేరు సందర్భాలలో అంటారు. పేర్ల వరుస తారుమారు అంతే. (అతడు కానీ ఇతడు కానీ)
6. వారల తలలు గొంచు వేగమ రమ్మీ. కొంచు రమ్మీ = తీసుకు రా. ఈ ప్రయోగం కావ్యాలలో ఉంది. ఇప్పటి తెలంగాణా లో కొంచబో అనేది వాడుకలో ఉంది.
7. ఇంద్రజిత్తు అప్పుడు ఇనకుల ఉద్భవునిచే మూర్ఛ నొంది … (చే= వల్ల)
8. తనకెదిరించిన రాముని గని = తనను ఎదిరించిన (ద్వితీయ కు బదులు చతుర్థి)/ నాకు నెదిరింప నొక పేద నరుని నొడ్డి= నన్ను ఎదిరించ..
9. ఆ శరమున= ఆ బాణం నుండి.
10. నీ వచ్చిన దాని భావమును.. = నువ్వు ఎందుకు వచ్చావో; నీ రాక లోని అర్థం
11. లంకా పట్టణం మీ చేత సాధింప బడ గలదు (కర్మణి ప్రయోగం)
12. నీవును నేనును..
13. భావార్థక ‘ట’ ప్రత్యయం: బ్రతుకుట, పుట్టుట, జీవించి వచ్చుట, కలుగుట – ఇవన్నీ ఒకే సీసపద్యంలో రావణుడి మథనంలో వచ్చే ప్రయోగాలు.
14. అడిగి యడిగి… అనే పదబంధం సీస పద్యంలోని ప్రతీ పాదం చివరా చేర్చటం ద్వారా — అంటే పునరుక్తి వల్ల — రాముని బాధనూ, ఆరాటాన్ని మనం గుర్తించేలా చేస్తుంది మొల్ల.

సీ.
ఏ మృగంబును గన్న నేణాక్షిఁ గానవే?
యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే పక్షిఁ గనుఁగొన్న నెలనాఁగఁ గానవే?
యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే మ్రానుఁ బొడగన్న వామాక్షిఁ గానవే?
యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే గట్టుఁ బొడగన్న నిభయానఁ గానవే
యని పెక్కు భంగుల నడిగి యడిగి,

ఆ.
కలఁగు, భీతి నొందుఁ, దలఁకుఁ జిత్తములోన,
సొలయు, మూర్ఛఁ బోవు, వలయు, నలఁగు,
సీతఁ గానఁబడమి శ్రీరామచంద్రుండు
విరహ తాప వహ్ని వేఁగి వేఁగి. 56

అలాగే సీత వేదనను కూడా వేగి వేగి, క్రాగి, క్రాగి అంటూ చక్కటి సీసపద్యంలో మనకు వివరిస్తుంది:

సీ.
పతిఁ బాసినట్టి యాపదలకంటెఁ బలుమాఱు
వివిధ మాయలచేత వేఁగి వేఁగి,
వీర దానవ కోటి వికృత వేషంబులు
కనుగొని చిత్తంబు క్రాఁగి క్రాఁగి,
తన దిక్కు లేమికైఁ దల్లడిల్లుచు నాత్మ
లోపల మిక్కిలి లోఁగి లోఁగి,
కర్ణ కఠోరంబుగా నాడు మాటలఁ
దొరఁగెడి కన్నీటఁ దోఁగి తోఁగి,

ఆ.
రాముఁ దలఁచుకొంచు, రామునిఁ బేర్కొంచు
రామ! రామ! యనుచు రమణి పలుకఁ
గపివరుండు సూచి కామినీ రత్నంబు
సీత యనుచుఁ బొంగెఁ జిత్తమందు. 41

15. ఒక్కొక్క సీస పద్యం ఒక సంశ్లిష్ట వాక్యం గా మలిచింది. వాటిలో కొన్ని విశేషణాలతో కూడిన అసమాపక వాక్య సముదాయ సంశ్లిష్ఠ వాక్యం కాగా, ఈ అసమాపక క్రియలు క్త్వార్థక, శత్రర్థక వంటివాటిలో ఏవిధమైన వైనా కావచ్చు (కిష్కింధ–20).
16. మరికొన్ని యత్తదర్థక సుదీర్ఘ వాక్యాలు. సామాన్యంగా అయితే యత్తదర్థక వాక్యాల్లో చివర అతడు లేదా వాడు అని అన్యవ్యక్తుల గురించి ప్రథమ పురషలో(3rd person) చెప్పడం కద్దు (ఉదా: తిక్కన ‘ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు … అతడు భూరిప్రతాప…). కానీ మొల్ల తన పద్యంలో “అట్టి వాడు” అని కాకుండా రావణుడు అతిశయంతో “అట్టి నేను” అని తత్ అనే ప్రథమకు బదులు ఉత్తమ పురుషలో చెప్పుకోవడం విశేషం.

సీ.
ఎవ్వాని వీటికి నేడు వారాసులు
పట్టని కోటలై పెచ్చు పెరుంగు,
నెవ్వాని సేవింతు రింద్రాది దేవత
లనుచర బలు లయి యనుదినంబు,
నెవ్వాని చెఱసాల నే ప్రొద్దు నుందురు
గంధర్వ సుర యక్ష గరుడ కాంత,
లెవ్వాని భండార మిరవొంద విలసిల్లు
నవ నిధానంబుల వివిధ భంగి,
తే.
సకల లోకంబులును మహోత్సాహ వృత్తి
నెవ్వానికిఁ జెల్లుఁ బుష్పక మ్మెక్కి తిరుగ,
నాకె తక్కంగఁ గలదె యే నాట నైన?
మద్భుజాశక్తి ప్రతిపోల్ప నద్భుతంబు. 47

17. సందేహార్థకవాక్యాలు: అటుగాకీతడె యన్య దేశమున నా యబ్జాక్షి బెట్టించేనో… అని హనుమ సందేహపడుతాడు. (సుందర – 33).
18. సుందర కాండ 42వ వచనంలో రావణాసురుడు చనుదెంచి వచ్చినప్పుడు పెద్ద వచనంలో అతని అలంకార వర్ణన ఒకవైపు రావణుని అహంకార స్థితిని తెలిపితే; తరువాతి భాగంలో సీత పరిస్థితిని వివరిస్తూ మొల్ల చేసిన భేదక వర్ణనా వాక్యం మొత్తంగా రావణ సీతల శారీరక మానసిక స్థితగతులను ఒక్క సుదీర్ఘ వచనంలో చూపిస్తుంది.

వ.

అట్టి సమయంబున రావణాసురుండు సీతాపహృత హృదయుండై పన్నీట మజ్జనం బాడి, దివ్యాంబరంబులు గట్టుకొని, కర్పూర సమ్మిళితంబైన శ్రీగంధంబు నెఱ పూఁత పూసి, పారిజాత పుష్పంబులు ముడిచి, మువ్వంపుఁ దావి నివ్వటిల్లెడు జవ్వాది మెత్తి, దశ శిరంబులయందును రత్న మకుటంబులు ధరించి, మణి మండితంబులగు కుండలములు పూని, భాను ప్రభా విలసితంబులగు పతకంబులును, ముక్తాహారంబులును, భుజకీర్తులును, బాహుపురులును, నంగుళీయంబులును, నవరత్న స్థగితంబగు నొడ్డాణంబును నమరించి, చంద్రహాస హస్తుండై, కందర్ప విలాస సుందరుండగుచుఁ గిన్నరకింపురుష గంధర్వామరోరగ సిద్ధవిద్యాధరాంగన లుభయ పార్శ్వంబుల నాలవట్టంబులు పట్టి, మౌక్తిక ఛత్రంబులును, దాళవృంతంబులును, వింజామరంబులును ధరించి రాఁ గొందఱు కర దీపికా సహస్రంబులు గైకొని ముందఱఁ బిఱుంద నేతేర, నశోకారామంబునకుఁ జనుదెంచె;

నప్పుడు గంధవాతూలంబునం దూలు పుష్పలతయునుం బోలె వడవడ వడంకుచుఁ, దన సుందరాంగంబులు, హస్తోరు వస్త్ర కేశంబుల, మాటియుఁ, గప్పియు, నడంచియు, నివురు గప్పిన నిప్పు చందంబున, ధూళి ధూసరంబగు రత్నంబు కైవడి, మేఘచ్ఛన్నంబగు చంద్ర బింబంబు డంబున, నిత్తడి పొదిగిన కుందనంపు శలాక లాగున, మాఱుపడియున్న జానకి. (సుందర-42)

కావ్యం చివర ఫలశ్రుతి చెప్పి ఇది విన్న వారు, రాసినవారు, చదివిన వారు అందరూ శ్రీరాముని కరుణ, మేలు పొందుతారని ముగించింది.

మొల్ల రామాయణం ఏ ఇతర ప్రబంధ కావ్యాని కన్నా తక్కువేమీ కాదు అని కావ్యం అంతా చదివితే తెలుస్తుంది. ప్రతీ పద్యమూ కొత్తదనంతో నిండి విసుగు అనేదే కలిగించకుండా చదివిస్తుంది; మహా ఆనందాన్ని, గొప్ప అనుభూతిని మిగుల్చుతుంది. ఈ కావ్యం/ఇతిహాసం చదివితే తెలుగు సాహిత్యంపై మక్కువ, అభిరుచి ఉన్నవాళ్ళు ఇందులోని ప్రతీ పద్యాన్నీ వదలక ఆస్వాదిస్తూ ఆనందిస్తారు అని మాత్రం తప్పకుండా చెప్పవచ్చు.


అయినవోలు ఉషాదేవి

రచయిత అయినవోలు ఉషాదేవి గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి "ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు. ...